అమితాబ్ బచ్చన్ కుటుంబానికి పెన్షన్..హవ్వ!
posted on Oct 21, 2015 @ 10:45AM
ప్రభుత్వాలు ప్రజాధనానికి ధర్మకర్తలుగా వ్యవహరించాలి కానీ మన దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనం తమకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ "అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్లుగా" ప్రజల కష్టార్జితాన్ని తమకు నచ్చినవారికి ఉదారంగా పంచిపెడుతుంటాయి. అదేదో నిరుపేదల సంక్షేమానికి ఖర్చు చేసినా లేదా నిరుపేద విద్యార్ధులు, పేద క్రీడాకారులు, కళాకారులకు ఆర్ధిక సహాయం చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడమే కాకుండా ఏదో రూపంగా కోటీశ్వరులకే కోట్లాదిరూపాయలు ముట్టజెప్పుతుంటే సామాన్య ప్రజలు కడుపు మండిపోతుంది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాని తెలంగాణా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని అందుకోసం ఆమెకు అప్పనంగా రెండు కోట్ల రూపాయలు ముట్టజెప్పారు. అందుకు ప్రజల్లు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా ఆయన వాటిని ఖాతరు చేయలేదు. రెండు కోట్లు పుచ్చుకొన్న సానియా మీర్జా తెలంగాణా రాష్ట్రం కోసం ఏమి చేసారో తెలియదు. ఆమె నోట కనీసం 'తెలంగాణా' అనే పదం కూడా ఎవరు ఏనాడూ వినలేదు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు రెండు కోట్లు ఎందుకు సమర్పించుకొన్నారో...ఆమె ఎందుకు పుచ్చుకొన్నారో వారికే తెలియాలి.
కోటీశ్వరురాలయిన సానియా మీర్జా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి రెండు కోట్లు అప్పనంగా పుచ్చుకొనేబదులు తనే ప్రభుత్వానికి రెండు కోట్లు విరాళం ఇచ్చి రాష్ట్రంలో నిరుపేద క్రీడాకారుల సంక్షేమం కోసం ఖర్చుచేయమని అడిగి ఉండాల్సింది. తనే స్వచ్చందంగా ముందుకు వచ్చి ఉచితంగా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తానని, రాష్ట్రాభివృద్ధికి తను కూడా కృషి చేస్తానని చెప్పి ఉండి ఉంటే ప్రజల దృష్టిలో ఆమె 'రియల్ లైఫ్ హీరోయిన్' అయ్యుండేవారు కానీ ఆమె ఆవిధంగా చేయలేదు. అందుకు ఆమెను ఎవరూ తప్పు పట్టలేరు కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రెండు కోట్లు ముట్టజెప్పడాన్ని చాలా మంది తప్పు పట్టారు.
మళ్ళీ ఇటువంటి ఉదంతమే మరొకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోందిపుడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం క్రీడా, కళా రంగాలలో విశేషకృషి చేసిన వారిని గౌరవించేందుకు "యష్ భారతి సమ్మాన్" అనే పెన్షన్ పధకం ప్రారంభించింది. ముందే చెప్పుకొన్నట్లుగా ఆ పధకం ద్వారా రాష్ట్రంలో నిరుపేద కళాకారులకు, క్రీడాకారులకు సహాయం అందించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పెన్షన్ పధకానికి ఎవరిని ఎంపిక చేసిందంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయ బచ్చన్, వారి కుమారుడు అభిషేక్ బచ్చన్ లని! ఇక నుండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి ముగ్గురుకీ ఒక్కొకరికీ నెలకి రూ.50, 000 పెన్షన్ జీవితాంతం చెల్లిస్తుందని ప్రకటించింది. అటువంటి గొప్ప నటులు రాష్ట్రానికి చెందిన వారయి ఉండటం ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని, అందుకే వారి ముగ్గురికి ఈ పెన్షన్ పధకానికి ఎంపిక చేసినట్లుగా రాష్ట్ర సాంస్క్రతిక శాఖ ప్రకటించింది.
అమితాబచ్చన్ కుటుంబ సభ్యులను గౌరవించడాన్ని ఎవరూ తప్పు కూడా పట్టలేరు. కానీ మళ్ళీ అవే ప్రశ్నలు వేసుకోవలసి వస్తుంది. వారి కుటుంబ సభ్యులందరూ సినిమాల ద్వారా, వివిధ కమర్షియల్ ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వారే రాష్ట్రంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని పోషించగల ఆర్ధిక స్తోమత ఉన్నవారు. అటువంటివారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెలకి రూ. 50, 000 పెన్షన్ ఇవ్వడానికి సిద్దం పడుతోంది. వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయి ఉండవచ్చును కానీ వారు తమ రాష్ట్రం కోసం ఏమి చేశారు? అని ప్రశ్నించుకొంటే ఏమీ లేదనే చెప్పవచ్చును. మరి వారికి అంత డబ్బు ఎందుకు ముట్టజెపుతున్నట్లు? అంటే మళ్ళీ ముందు చెప్పుకొన్న మాటలే- 'అత్తసొమ్ము అల్లుడు దానం చేయడం' గుర్తు చేసుకోక తప్పదు.
నిజానికి దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ రాష్ర్టం ఆర్ధికంగా, పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉంది. అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు తలుచుకొంటే తమ పలుకుబడిని, పరపతిని ఉపయోగించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి చాలా సహాయపడవచ్చును. కానీ వారు అటువంటి ఆలోచనలు ఎన్నడూ చేయలేదు. అందుకు వారిని కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. కానీ వారు అడగకపోయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి నెలకి రూ. 50,000 చొప్పున పెన్షన్ మంజూరు చేయడమే చాలా విడ్డూరం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు ఒకతను ఒలింపిక్స్ లో బాక్సింగులో మెడల్ సాధించాడు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం, వేరే పని ఏదీ చేతకాక పోవడంతో ప్రస్తుతం అతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రోడ్ల మీద చెత్తకుండీలలో పారేసిన వ్యర్ధాలను ఏరుకొంటున్నాడు. వారి కుటుంబం ఒక్క పూట తిండికి కూడా నోచుకోని తీవ్ర దారిద్యం అనుభవిస్తోంది. అయినప్పటికీ అతనికి బాక్సింగ్ పై ఉన్న మమకారంతో తన ఇద్దరు పిల్లలకీ బాక్సింగ్ నేర్పిస్తున్నారు. మన దేశంలో అటువంటి నిరుపేద క్రీడాకారులు, కళాకారులు, నిస్సహాయులు, వృద్ధులు, అనాధలు కోట్లాది మంది ఉన్నారు. ప్రభుత్వాలు అటువంటివారికి ఆర్ధిక సహాయం చేస్తే అందరూ హర్షించేవారు. డబ్బు అవసరం లేనివారికి ప్రభుత్వాలు ఈవిధంగా ఉదారంగా డబ్బు మూటలు ముట్టజెప్పుతూ, నిజంగా అవసరం ఉన్నవారిని పట్టించుకోకపోవడం చాలా శోచనీయం.