నిర్భయ కేసులో బాల నేరస్థుడిపై నిఘా ఉంచమని కోరిన తల్లి తండ్రులు
posted on Nov 25, 2015 @ 12:29PM
డిల్లీలో జరిగిన నిర్భయ కేసులో అరెస్ట్ అయిన మైనర్ జువైనల్ హోమ్ లో మూడేళ్ళ నిర్బంధం తరువాత వచ్చే నెల 15వ తేదీన విడుదల కాబోతున్నాడు. అతనిని అరెస్ట్ చేసినప్పుడు అతను మైనర్ కనుక అంత హేయమయిన నేరానికి పాల్పడినప్పటికీ, ఇంత తక్కువ శిక్షతో తప్పించుకోగలుగుతున్నాడు.
అతనిని బయటకు విడిచిపెట్టిన తరువాత అతను మళ్ళీ అటువంటి నేరాలకి పాల్పడకుండా అతనిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్భయ తల్లి తండ్రులు జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక పిటిషన్ వేశారు. అతను జువైనల్ హోమ్ నుండి విడుదల చేసిన తరువాత అతని వలన దేశ ప్రజలు ఎవరికీ ప్రమాదం జరగకుండా చూడవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉందని కనుక అటువంటి ఏర్పాట్లు చేయమని కేంద్రాన్ని ఆదేశించవలసిందిగా వారు తమ పిటిషన్ లో కోరారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇటువంటి హేయమయిన నేరాలకు పాల్పడినవారి ఫోటోలను, వారి పూర్తి వివరాలను అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపించి వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారిపై నిరంత నిఘా ఏర్పాటు చేస్తుంటారని, ఈ నిర్బయ కేసులో దోషిగా శిక్ష అనుభవించిన వ్యక్తి కోసం భారత్ లో కూడా అటువంటి ఏర్పాటే చేయాలని వారు తమ పిటిషన్ లో కోరారు. వారు ఆ పిటిషన్ కాపీని, దానితో బాటు ఒక వినతి పత్రాన్ని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాద్ సింగ్ కి సమర్పించి తగు చర్యలు చేపట్టవలసిందిగా అభ్యర్ధించారు.
జాతీయ మానవ హక్కుల కమీషన్ కూడా కేంద్రప్రభుత్వానికి, డిల్లీ ప్రభుత్వానికి ఇదే విషయమై నోటీసులు పంపించింది. మూడేళ్ళ నిర్బంధంలో ఆ బాల నేరస్తుడు మానసిక స్థితిలో ఏమయినా మార్పులు వచ్చేయా లేదా? అతని ప్రవర్తనలో సానుకూలమయిన మార్పు వచ్చిందా? లేక ఇంకా అతనిలో నేర ప్రవృతి పెరిగిందా?అతనిని విడుదల చేస్తే అతని వలన ప్రజలకు మళ్ళీ ఎటువంటి హానీ జరుగకుండా ప్రభుత్వం ఏమయినా జాగ్రత్తలు తీసుకొందా? తెలియజేయవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమీషన్ కేంద్రాన్ని కోరింది.
జువైనల్ చట్టంలోని సెక్షన్ 17(3) ప్రకారం ఆ నేరస్తుడిని విడుదలకు ముందు, ఆ తరువాత ఏమయినా చర్యలు తీసుకొందా లేదా? తీసుకొంటే ఎటువంటి చర్యలు తీసుకొంది? అనే విషయాలను తమకు తెలియజేయవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమీషన్ డిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.
కొన్ని నెలల క్రితం మీడియాలో ఆ బాల నేరస్థుడి గురించి కొన్ని ఆసక్తి కరమయిన వ్యాఖ్యలు వచ్చేయి. అతను, డిల్లీలో ఉగ్రవాద చర్యలకు సహకరించిన మరొక బాలనేరస్తుడితో స్నేహం చేస్తూ, అతని వద్ద నుండి ఉగ్రవాదం గురించి తెలుసుకొంటున్నట్లు నిఘావర్గాలు కనుగొనడంతో, వారి సలహా మేరకు జువైనల్ హోమ్ అధికారులు అతనిని వేరే సెల్ లోకి మార్చినట్లు వార్తలు వచ్చేయి. అంటే అతను ఒక హేయమయిన నేరం చేసిన తరువాత జువైనల్ హోమ్ లో మూడేళ్ళ నిర్బంధంలో సంస్కరించబడలేదు పైగా ఉగ్రవాదం పట్ల ఆసక్తి పెంచుకొన్నట్లు అర్ధం అవుతోంది. అటువంటి నేర ప్రవృతి ఉన్న వ్యక్తిని స్వేచ్చగా విడిచిపెట్టినట్లయితే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చును. కనుక నిర్భయ తల్లితండ్రుల అభ్యర్ధనను, వారు సూచిస్తున్న సలహాను పాటించడమే మంచిది.