జేఎన్‌యూలో సైనికుల ఫొటోలు ఉంచాలి!

  జేఎన్‌యూలో భారతేవ్యతిరేక నినాదాలు చెలరేగడానికి కారణం అక్కడి విద్యార్థులలో తగినంత దేశభక్తి లేకపోవడమే అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జేఎన్‌యూలోని పరిస్థితుల గురించి మాజీసైనికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు జేఎన్‌యూ ఉపకులపతిని కలిసి విద్యార్థులలో దేశభక్తి పెంపొందేందుకు తమకు తోచిన సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సూచనల్లో భాగంగా సైనిక అమరవీరుల చిత్రాలతో కూడిన ఒక స్తూపం ఉండాలని కొందరు అంటే, సైన్యానికి సంబంధించిన గుర్తులు ఏవన్నా క్యాంపస్‌ ఆవరణలో ఉంచితే మంచిదని మరి కొందరు భావించారు. మరోపక్క ప్రభుత్వం నడుపుతున్న విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ జాతీయ జెండాను ఎగురవేయాలన్న విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే!

జాట ఆందోళనల నేపథ్యంలో అత్యాచారాలు!

  హర్యానాని చిగురుటాకులా వణికించిన జాట్ వర్గం ఆందోళనల్లో అవాంఛిత సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయా అంటే ఔననే అంటున్నారు స్థానికులు. హర్యానాలోని ముర్తాల్‌ అనే జాతీయ రహదారిని నిర్బంధించిన ఉద్యమకారులు, దారిన పోతున్న కార్లని ఆపి అందులోని స్త్రీల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కనీసం పదిమంది ఆడవారి మీదన్నా అత్యాచారాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ‘ఈ విషయం బయటకి చెబితే మీకే ఇబ్బంది’ అంటూ బాధితురాళ్లని పోలీసులే శాంతింపచేసినట్లు సమాచారం.   దీంతో హైవేకి సమీపంలో ఉన్న కురద్‌, హసన్‌పూర్ గ్రామస్థులే బాధితులని వారికి తాత్కాలికంగా నీడనిచ్చి పంపివేశారట. హర్యానా రాష్ట్ర డిజీపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తాము ఈ వార్తలలో నిజానిజాలు తేల్చేందుకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశామనీ, వార్తల్లో వచ్చినట్లుగా అలాంటి సంఘటనలు ఏవీ జరగలేదంటూ ఆ సంఘం అభిప్రాయపడిందనీ డీజీపీ పేర్కొంటున్నారు. మరోపక్క ఈ వార్త హర్యానా హైకోర్టుని కూడా కలచివేసింది. తక్షణమే ఈ వార్తలకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు ఒక దర్యాప్తుని చేపట్టవలసిందిగా న్యాయమూర్తి ఎన్‌.కె.సంఘి ఆదేశించారు. మరి ఆ నివేదికలో అయినా వాస్తవాలు తేలతాయో లేదో!

సౌండు తగ్గించమన్నాడని చంపేశాడు!

  దక్షిణ దిల్లీలో జరిగిన ఈ సంఘటన దేశరాజధానిలో కూడా ఎలాంటి పరిస్థితులు రాజ్యమేలుతున్నాయో చెబుతోంది. వివరాల్లోకి వెళ్లతే హర్‌దీప్‌ అనే ఒక జర్నలిస్టు తన మిత్రుడితో కలిసి విశ్రాంతి తీసుకుంటుండగా, దిగువ అంతస్తులో ఉన్న జిమ్‌ నుంచి పెద్దగా సంగీతం వినిపించడం మొదలుపెట్టింది. కిందకి వెళ్లి చూస్తే జిమ్‌ యజమాని అయిన రింకూ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి తాగి తందనాలాడుతూ కనిపించాడు. రింకూని సౌండ్‌ తగ్గించమంటూ హర్‌దీప్‌ ఎంతగా అడిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు హర్‌దీప్‌.   అక్కడితో ఈ విషయం సద్దుమణగలేదు. మా ఇంటికే వచ్చి సౌండ్‌ తగ్గించమంటావా అంటూ రింకూ పైకి వచ్చి మరీ హర్‌దీప్‌ను కాల్చిపారేశాడు. కాల్పులు జరిగిన వెంటనే హర్‌దీప్‌తో ఉన్న స్నేహితుడు పోలీసులకి, ఆంబులెన్స్‌కి ఎంతగా ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఇక చేసేది లేక కొనప్రాణంతో ఉన్న మిత్రుడిని ఆటోలో తీసుకువెళ్లాడు. హర్‌దీప్ ఆసుపత్రికి చేరుకునేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. నిందితులు పరారీలో ఉన్నారు!

ఇవాళ చెన్నైలో పుట్టే ఆడపిల్లలకు 10,000/-

తమిళనాట జయలలితకు ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమ అధినాయకురాలిగా కొలుచుకునే జయలలిత పుట్టినరోజు వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. ఈ సందర్భంగా వందలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మ రూపాన్ని తమ చేతుల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొత్తకొత్త పథకాలకు ఇవాల్టి నుంచే శ్రీకారం చుట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటుతున్నారు. ఇక పార్టీ తరఫున రక్తదాన శిబిరాలు, అన్నదానాలు సరేసరి! ఇదంతా అలా ఉంచితే... చెన్నై నగరపాలక సంస్థ నడిపే ఆసుపత్రులలో ఇవాళ జన్మించే పాపలకు 10,000 రూపాయలను అందచేయబోతోంది ప్రభుత్వం. జయకుమార్‌ అనే న్యాయవాదైతే మరో అడుగు ముందుకు వేసి ఉత్తరచెన్నైలో ఇవాళ పుట్టే పాపలకు తాను బంగారు ఉంగరాలను బహుకరించనున్నట్లు చెప్పారు.

దిల్లీలో జంగిల్‌ రాజ్ నడుస్తోంది- నితీశ్

  బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్‌ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్‌ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని భూతద్దంలో చూపించి, జంగిల్ రాజ్ అంటూ ఉంటారు. కానీ నిజానికి జంగిల్‌ రాజ్‌ అంతా దిల్లీలోనే నడుస్తోంది’ అంటూ విరుచుకుపడిపోయారు. ‘దిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేస్తూ ఉంటారు. కోర్టులో ఉన్న కన్నయా కుమార్‌ మీద దాడి జరిగినప్పుడు వాళ్లంతా కిమ్మనకుండా ఉండిపోయారంటే తప్పు ఎవరిది’ అంటూ చెలరేగిపోయారు నితీశ్‌. నితీశ్‌గారు అక్కడితో ఆగలేదు ‘దేశంలో ఆర్ధిక సంస్కరణలు విజయవంతం కాలేదు. మేక్‌ ఇన్‌ ఇండియా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భారీ పెట్టుబడులు ఏవీ రావడం లేదు. కొత్తగా ఉద్యోగాలనీ కల్పించలేదు. వీటన్నింటి నుంచీ దృష్టి మళ్లించేందుకు RSS, BJPలు ఇలాంటి వివాదాలని పెంచి పెద్దవి చేస్తున్నాయి’ అంటున్నారు. మరి కన్నయా కుమార్‌ చేసిన పనిని మీరు సమర్థిస్తారా అని అడిగితే... ‘దేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా నినాదాలు చేస్తే వారిని తప్పకుండా శిక్షించాల్సిందే! కానీ కన్నయా కుమార్‌ అలాంటి నినాదాలు చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు’ అని బదులు చెప్పారు. నితీశ్‌ మాటలకు భాజపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!

గడియారాల చుట్టూ- కర్ణాటక రాజకీయాలు!

  ఎక్కడైనా గడియారం తిరిగితే చూడ్డానికి బాగుంటుంది. కానీ మనుషులే గడియారాల చుట్టూ తిరిగితే విచిత్రంగా కనిపిస్తుంది. కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతోంది. అక్కడి కాంగ్రెస్‌, జనతాదళ్ నేతలు వాచీల గురించి కొట్టుకుంటున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యగారు 70 లక్షలు విలువ చేసే వాచీని పెట్టుకున్నారహో! అంటూ కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దానికి సిద్దరామయ్యగారు అలాంటిది ఏమీ లేదనీ.... కావాలంటే లక్షలు పోసి తన వాచీని మీరే తీసుకోండని పేర్కొన్నారు.   ఈ మాటల యుద్ధం అలా సాగుతుంటే, ఇప్పడు కాంగ్రెస్‌ నేతలు దీని గురించి ప్రత్యారోపణలు కూడా మొదలుపెట్టారు. మా ముఖ్యమంత్రి సంగతేమో కానీ జనతాదళ్‌ నేత కుమారస్వామి వద్ద కోట్లు విలువ చేసే వాచీలు కార్లూ ఉన్నాయంటూ ఓ చిట్టాని బయటపెట్టారు. ఈ చిట్టా ప్రకారం కుమారస్వామి వద్ద వజ్రాలు పొదిగిన ఓ 50 లక్షల రూపాయల వాచీతో సహా ఆరు ఖరీదైన గడియారాలు ఉన్నాయట. ఇందులో ఓ గడియారం విలువైతే ఏకంగా 1.3 కోట్లు! కుమారస్వామి మాత్రం ఈ ఆరోపణలు చాలా తేలికగా తీసుకుంటున్నారు. ‘నా దగ్గర ఉన్న వస్తువులన్నీ నా కష్టార్జితంతో సంపాదించాను. వాటి గురించి భయపడను’ అంటున్నారు. ఎలా కష్టపడితే అన్ని వస్తువులు వచ్చాయో కూడా జనాలకి చెబితే బాగుండు!

వెంటపడవద్దంది... కాల్చి చంపేశారు!

  ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు. వాళ్ల ఆగడాలు తట్టుకోలేక ప్రింకీ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. సోమవారం రాత్రి ఎప్పటిలాగే పని ముగించుకుని వస్తున్న ప్రింకీని వారు వేధించడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన వారి మాటలు విని తట్టుకోలేకపోయిన ప్రింకీ, ఇక మీదట తన జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ వారిని తీవ్రంగా మందలించింది. దాంతో వారిలోని కుల్‌దీప్‌ అనే యువకుడు, అక్కడికక్కడే ఆమెను కాల్చి చంపేశాడు. ఈ సమయంలో ప్రింకీ పక్కనే ఉన్న ఆమె అక్కయ్యకు కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. 2012లో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత ప్రభుత్వాలన్నీ, తాము ఆకతాయిల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ పేర్కొంటున్నాయి. కానీ అది అబద్ధమని తెలియచేసేలా ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.  

పిల్లలకు పాఠంగా సత్య నాదెళ్ల జీవితం!

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల గురించి మన పిల్లలు ఇక పాఠాలు చదువుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో ‘స్ఫూర్తి ప్రదాతలు’ పేరిట సత్యనాదెళ్ల, పర్వతారోహకుడు మస్తాన్‌బాబు, చిత్రకారుడు సంజీవ్‌దేవ్‌ల జీవిత చరిత్రలను పొందుపరచనున్నారు. ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన సిలబస్‌ ప్రకారం ఇలాంటి మార్పులు ఎన్నో చోటు చేసుకోనున్నట్లు సమాచారం.   ఇందులో భాగంగా అలనాటి నుంచి ఈనాటి దాకా ఉన్న తెలుగు ప్రముఖులకు తగినన్ని పుటలను కల్పించాలనుకుందట. ఒకప్పటి యుద్ధవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నేటి కేన్సర్‌ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు... వంటి తెలుగు ప్రముఖులందరి గురించీ ఈ సందర్భంగా పిల్లలు తమ పుస్తకాలలో చదువుకోనున్నారు. అంతేకాదు! మన పండుగల గురించీ, జానపద కళల గురించీ కూడా వీలైనంత సమాచారాన్ని పిల్లలకు అందచేసే ప్రయత్నంలో ఉందంట ప్రభుత్వం.

ట్రంప్‌ విషం ఈసారి భారత్‌ మీద!

  వివాదాస్పద వ్యాఖ్యలకు, విపరీతమైన మాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ట్రంప్‌ ఈసారి భారత్ మీదకి తన వాగ్బాణాలకు ఎక్కుపెట్టారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ పౌరుల ఓట్లను గెల్చుకునే ప్రయత్నంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలను చేశారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అమెరికా పౌరులైన ఆఫ్రికన్లలో కనీసం 58శాతం నిరుద్యోగంలో మునిగిపోయి ఉన్నారనీ, వారందరికీ తాను తగిన ఉద్యోగాలను కల్పిస్తాననీ ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పేర్కొన్నారు.   అందుకోసం ఇండియా, చైనా, జపాన్‌, వియత్నాం.... వంటి దేశాల నుంచీ ఉద్యోగాలను వెనక్కి తీసుకుంటామనీ చెప్పారు. ఔట్‌సోర్సింగ్‌ ద్వారా కానీ నేరుగా కానీ అమెరికాకు సంబంధించిన సాఫ్టవేర్‌ ఉద్యోగాలలో అధికశాతం ఇండియా, చైనా వంటి దేశ ప్రజలు దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ఉద్యోగాలకు గడ్డుకాలం రానుందా అన్న భయం కలుగక మానదు. తరచూ చైనా, జపాన్‌ల మీద విరుచుకుపడే ట్రంప్‌ భారతదేశం విషయంలో కాస్త సానుకూలంగానే ఉండేవాడని చాలామందికి ఆశగా ఉండేది. కానీ ఈ వ్యాఖ్యలతో అలాంటి భ్రమలన్నీ తేలిపోయాయి.

ఆ విద్యాలయం సెక్స్‌, డ్రగ్స్‌కి నిలయం- బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

  ఒకపక్క జేఎన్‌యూలో జరిగిన వివాదాన్ని ఎలా చల్లార్చాలా అని కేంద్ర ప్రభుత్వం తలలు పట్టుకుంటుంటే, వారి మీద మరో మొట్టికాయ వేశాడు ఓ సొంత పార్టీ ఎమ్మెల్యే. జేఎన్‌యూలో రోజూ తాగి తందనాలాడుతూ ఉంటారనీ, రాత్రి ఎనిమిది గంటలు దాటితే మాదకద్రవ్యాల మత్తులో మునిగిపోయి ఉంటారనీ బాంబు పేల్చాడు. జేఎన్‌యూలో రోజూ దొరికే చెత్తని చూస్తే తన మాటలు ఎంతవరకు నిజమో మీకే అర్థమవుతుందంటూ కొన్ని గణాంకాలను కూడా ఇచ్చారు. రాజస్తాన్‌లోని రామఘర్‌ నియోజకవర్గానికి చెందిన జ్ఞాన్‌దేవ్‌ అహూజా అనే సదరు ఎమ్మెల్యే ప్రకారం ఆ గణాంకాల ఏమిటంటే...   - జేఎన్‌యూలో రోజూ కాల్పిపారేసిన సిగిరెట్లు 10,000, కాల్చిపారేసిన బీడీ ముక్కలు 4,000 దొరుకుతాయి.   - 2000 ఖాళీ చిప్స్‌ ప్యాకెట్లు రోజూ గాలికి దొర్లుతుంటాయి.   - 3,000 వాడిపారేసిన కండోమ్స్‌, 500 విసిరిపారేసిన గర్భనిరోధక ఇంజక్షన్లు రోజూ ఇక్కడ చెత్తలోకి చేరుకుంటాయి.   - ఇక్కడ చదివేది పిల్లలు కాదు కదా, ఇద్దరేసి పిలల్లు ఉన్న తండ్రులు కూడా ఉన్నారు.   - ఇక్కడ 50,000 ఎముక ముక్కలు దొరికాయి!   ఇంతకీ సదరు జ్ఞాన్‌దేవ్‌గారికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు కానీ, టీవీల ముందరే ఆయన ఈ చిట్టాని నిర్భయంగా చదివిపారేశాడు. గణాంకాలు చూస్తేనేమో మరీ నమ్మబుద్ధి కావడం లేదు. మరీ 50,000 ఎముక ముక్కలా!

లొంగుబాటుకు సిద్ధం- జేఎన్‌యూ విద్యార్థులు

  జేఎన్‌యూలో జరిగిన ఘటనలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్య తాము చట్టానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. పోలీసులు కనుక తమకు తగిన రక్షణను కల్పించగలిగితే వారికి లొంగిపోయేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదంటూ వారు పేర్కొన్నారు. ఈమేరకు వారు దిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఉమర్‌ ఖాలిద్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన దగ్గర నుంచీ అతని కుటుంబసభ్యులు ఉమర్‌ క్షేమం గురించి తరచూ ఆందోళనను వ్యక్తం చేసేవారు. అతన్ని చంపుతామంటూ తమకి బెదిరింపులు వస్తున్నాయంటూ వారు మీడియా ముందు వాపోయేవారు. ప్రస్తుతం ఉమర్‌ విశ్వవిద్యాలయంలో క్షేమంగానే ఉండగా, అతను ఎప్పుడు బయటకు వస్తాడా అని పోలీసులు కాచుకుని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఉమర్‌ తాను లొంగిపోయేందుకు సిద్ధం అంటూ ప్రకటించడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది

పోలీసులు అడుగుపెట్టడానికి వీల్లేదు

  - జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద సంఘటనకు సంబంధించి పోలీసులు ఒక అయిదుగురు విద్యార్థుల కోసం కొద్ది రోజులుగా వెతుకుతున్నారు.   - కన్నయా కుమార్‌ అనే విద్యార్థి నాయకుడిని అరెస్టు చేసిన తరువాత నుంచీ ఈ విద్యార్థులు అజ్ఞాతంలోకి జారుకున్నారు.   - అయితే ఆదివారం రాత్రి అనూహ్య పరిస్థితులలో ఈ అయిదుగురూ తిరిగి విశ్వవిద్యాలయంలో కనిపించారు.   - ఇంతకు ముందు ఒకసారి పోలీసులను క్యాంపస్‌లోకి అనుమతించినందుకు వివిధ వర్గాల కోపాన్ని చవిచూసిన విశ్వవిద్యాలయపు యాజమాన్యం ఈసారి ఆచితూచి స్పందిస్తోంది.   - ఈ విషయమై ఉప కులపతి ఎం.జగదీశ్‌ కుమార్‌ 300 మంది ఉపాధ్యాయులతో కలిసి నిన్న చర్చించారు.   - భవిష్యత్తులో నింద తమ మీద పడకుండా ఉండాలంటే పోలీసులను ఎట్టి పరిస్థితులలోనూ విద్యాలయం క్యాంపస్లోకి అనుమతించరాదని నిర్ణయించారు.   - ఇటు పోలీసులు కూడా బలవంతంగా విశ్వవిద్యాలయం లోపలకి వెళ్లే మరో వివాదంలో ఇరుక్కునేందుకు సిద్ధంగా లేరు.   - నిందితులైన విద్యార్థులు మాత్రం విశ్వవిద్యాలయంలో సురక్షితంగా ఉన్నారు. తమంతట తాము బయటకు వెళ్లి లొంగిపోయేందుకు వారు సిద్ధంగా లేరు.  

మసూద్‌ అజార్‌ను అరెస్టు చేశాం- పాకిస్తాన్‌

  పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరానికి సంబంధించి పాకిస్తాన్‌ మరోసారి పొంతనలేని మాటలను మొదలుపెట్టింది. జైష్-ఎ-మహమ్మద్‌ అనే తీవ్రవాద సంస్థకు నాయకుడైన మసూద్‌ అజారే ఈ కుట్రకు ప్రేరణ అని భారత్‌ మొదటి నుంచీ విశ్వసిస్తోంది. కానీ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న మసూద్‌ని అరెస్టు చేసేందుకు కానీ విచారించేందుకు కానీ పాకిస్తాన్‌ ఎలాంటి చర్యలూ తీసుకోనేలేదు. మన దేశం, మసూద్‌ అజారే పఠాన్‌కోట్‌ అలజడులకు కారణమని గంపెడు సాక్ష్యాలను చూపించినా ఆ దేశం పెదవి విరిచేసింది. పైగా పఠాన్‌కోటకు సంబంధించి నమోదు చేసిన F.I.Rలో ‘కొందరు గుర్తుతెలియని వ్యక్తులు’ పఠాన్‌కోట్ దాడికి కారణం అంటూ పేర్కొంది.   కానీ ఇప్పుడు ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు అజీజ్‌ ఒక టీవీ ముఖాముఖిలో పాల్గొంటూ మౌలానా అజార్‌ను అప్పుడెప్పుడో అరెస్టు చేసేశాంగా అని బాంబు పేల్చారు. జనవరి 14 నుంచే ఆయన పోలీసుల నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. అన్నాళ్లూ మౌలానా అజార్‌ను ఏం చేశారు అంటే కిమ్మనకుండా ఉన్న పాకిస్తాన్‌ ఇలా హఠాత్తుగా ప్లేటు ఫిరాయించడం వెనుక కారణం ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం కశ్మీర్లో మళ్లీ తీవ్రవాద కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. దాంతో ఎలాగూ పాకిస్తాన్‌ వైపే అందరూ వేలెత్తుతారు. అందుకనే పాకిస్తాన్‌ నేర్పుగా ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు విశ్లేషకులు. దానివల్ల మేం తీవ్రవాదులని ఏం పోషించడం లేదు, వారి మీద ఉక్కుపాదాన్ని మోపుతూనే ఉన్నాం అని ప్రపంచం దృష్టిని నమ్మించడంలో భాగంగానే ఈ ప్రకటన వచ్చి ఉండవచ్చు. ఇంతకీ మసూద్‌ అజార్‌ను అరెస్టు చేసినట్లా? చేయనట్లా?

మీరు ఏసీల్లో కూర్చుంటే మేం పనిచేసిపెట్టాలా?- సుప్రీంకోర్టు

  గత వారంరోజులుగా హర్యానాలో జాట్ వర్గానికి సంబంధించిన ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే! జాట్‌ వర్గంవారు తమ ఆందోళనలో భాగంగా యమునా నది నుంచి దిల్లీకి వెళ్లే మునక్‌ కాలువని బంధించారు. అక్కడి నీటి యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ విషయంలో దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం హర్యానాతో చర్చించాల్సింది పోయి సుప్రీం కోర్టు తలుపు తట్టింది. దాంతో ఉన్నత న్యాయస్థానానికి ఒళ్లు మండిపోయింది.... అంతే!   ‘ప్రభుత్వాలు రెండూ కూర్చుని తేల్చుకోవాల్సిన చోట, మా ఆదేశాల కోసం ఎందుకు వస్తారు. మీకు అన్నీ పళ్లెంలో అందించాలా’ అంటూ మండిపడింది. అంతేకాదు- కోర్టులో కూర్చుని ఉన్న దిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రాను చూసి ‘మీరు చక్కగా పని చేసుకోకుండా కోర్టుల్లో కాలక్షేపం చేస్తారెందుకు? మీరు ఏసీ గదుల్లో కూర్చుని ఉంటే మీ కోసం కోర్టులు ఆదేశాలు జారీ చేస్తూ ఉండాలా?’ అని చిరాకు పడిపోయింది. ఈ సందర్భంగా హర్యానా తరఫు న్యాయవాది, మునక్ కాలువ జాట్‌ వర్గం చేతుల్లో ఉందనీ, దానిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న వెంటనే నీటిని పునరుద్ధరిస్తామనీ హామీ ఇచ్చారు. ఈ మాటలేవో బయట చెప్పుకుంటే, కోర్టు చేతిలో అక్షింతలు తప్పేవి కదా!

టాక్సీ డ్రైవర్‌- చిరాకేసి ఏడుగురిని చంపేశాడు

  జేసన్‌ బ్రియాన్‌ డాల్టన్... అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఓ టాక్సీ డ్రైవర్‌. ప్రతిష్టాత్మక ఉబర్‌ టాక్సీ సంస్థ తరఫున టాక్సీని నడుపుతున్నాడు. శనివారం సాయంత్రం ఎప్పటిలాగే కలమజూ అనే పట్టణంలో టాక్సీని నడుపుతున్నాడు జేసన్‌. ఇంతలో అతనికి ఓ ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్‌లో విషయం విన్న తరువాత జేసన్‌కి పిచ్చెత్తిపోయింది. ఎర్రలైటు, పచ్చలైటు అని ట్రాఫిక్ సిగ్నెళ్లని పట్టించుకోకుండా కారుని పరుగులెత్తించాడు. తన దగ్గర ఉన్న గన్‌ తీసుకుని దారిన పోయేవారందరినీ కాల్చిపారేయడం మొదలుపెట్టాడు. మొత్తం ఎనిమిది మంది మీద జేసన్‌ కాల్పులు జరపగా వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా ఇద్దరిలో ఒకరు ఆసుపత్రిలో చనిపోయారు.   మరొకరు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు. చనిపోయినవారిలో ఒక తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. జేసన్‌ శనివారం తెల్లవార్లూ ఇలా కాల్పులు జరుపుతూనే తిరిగాడు. ఎట్టకేళకు అతణ్ని పట్టుకున్న పోలీసులకి ఇదంతా ఎందుకు జరిగిందో మాత్రం అంతుపట్టడం లేదు. ఆ ఫోన్లో జేసన్‌ ఏం విన్నాడో అంతకంటే తెలియడం లేదు. అయితే జేసన్‌కి గతంలో ఎలాంటి నేరప్రవృత్తీ లేదనీ, పోనీ ఇదో తీవ్రవాద చర్య అనుకోవడానికి కూడా ఆధారాలు లేవనీ అంటున్నారు పోలీసులు. అమెరికాలో తుపాకీ సంస్కృతిని అదుపుచేయాలంటూ, ఆ దేశ అధ్యక్షుడు ఒబామా కంటనీరు పెట్టుకున్నా కానీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

దిల్లీకి దాహం వేస్తోంది!

  సాక్షాత్తూ రాజధాని దిల్లీలోనే నీళ్లకి కరువొచ్చిపడింది. నీళ్లు లేక ఇవాళ అక్కడ స్కూళ్లని కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది. హర్యానాలో జరుగుతున్న జాట్‌ వర్గపు గొడవల వల్ల తలెత్తిన పరిణామమిది. తమకి రిజర్వేషన్లను కల్పించాలంటూ జాట్‌వర్గం వారు తలపెట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా వారు దిల్లీకి మంచినీటిని అందించే మునక్‌ అనే కాలువ వద్ద ఉన్న యంత్రాలను కూడా ధ్వంసం చేసి పారేశారు.   దీంతో యమునానది నుంచి మునక్‌ కాలువ ద్వారా దిల్లీకి చేరుకునే కోట్ల గ్యాలన్ల కొద్దీ నీటి సరఫరా కాస్తా నిలిచిపోయింది. దిల్లీలో ఉండే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి కొందరు పెద్దల నివాసాలకు తప్ప మిగతా నగరమంతటికీ కూడా నీటి సరఫరాలో కోతని విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతానికి మునక్‌ కాలువని ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో రేపు ఉదయానికల్లా దిల్లీకి తగినంత నీరు అందే అవకాశం ఉంది. మొత్తానికి జాట్‌ ఆందోళన వల్ల దిల్లీకి కూడా దాహం తప్పడం లేదు.

ఛీ న్యూస్‌ రిపోర్టరు అంటున్నారు- జర్నలిస్టు రాజినామా!

  దేశంలో వార్తాఛానళ్లలో ప్రతి ఒక్కటీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నది బహిరంగ రహస్యమే! అయితే ‘జీ న్యూస్‌’లో పనిచేసే ఓ రిపోర్టరుకి ఈ పద్ధతి నచ్చలేదు. ముఖ్యంగా జేఎన్‌యూలో జరిగిన గొడవని తన వార్తా ఛానల్‌ తనకు తోచినట్లుగా మలచుకోవడం అతనికి నచ్చలేదు. దాంతో విశ్వదీపక్ అనే సదరు జర్నలిస్టు తన సంస్థకి రాజినామా చేసేశాడు. ‘నేను అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో పనిచేసి వచ్చాను.   కానీ ఇక్కడికి వచ్చిన తరువాత నా వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోయాను. అందరూ నన్ను జీ న్యూస్ రిపోర్టరు అని కాకుండా ఛీ న్యూస్‌ రిపోర్టరు అని పిలుస్తున్నారు’ అంటూ తన రాజినామా పత్రంలో పేర్కొన్నాడు విశ్వదీపక్‌. పైగా ‘మోదీ మనకి ప్రధానమంత్రి అయితే కావచ్చు కాక. కానీ నిరంతరం ఆయన భజనే చేయడం బాగోలేదు’ అంటూ చిరాకుపడిపోయాడు. సంస్థకు మంచి మంచి వార్తలు తీసుకురావలసిన మనిషి, సంస్థనే వార్తల్లోకి నిలపడం జీన్యూస్‌కి ఎదురుదెబ్బే! ‘మా పనితీరు అంతా పారదర్శకంగా ఉంటుంది. ఒకవేళ విశ్వదీపక్‌కు మా పనితీరులో లోపం కనిపిస్తే ముందుగా మాతో వాటి గురించి చర్చించి ఉండాల్సింది’ అంటూ జీన్యూస్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.

జేఎన్‌యూ వద్ద ఉద్రిక్తత... మళ్లీ మొదలు!

  ఈ నెల 9వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన వివాదాస్పద సమావేశానికి సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదంలో పోలీసులు ఇప్పటికే కన్నయా కుమార్‌ అనే విద్యార్థి నాయకుడిని అరెస్టు చేయగా ఉమర్‌ ఖాలిద్ వంటి మరికొందరు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసులు వారికోసం లుక్‌అవుట్‌ నోటీసులను సైతం జారీ చేయడం జరిగింది. అయితే ఈ అయిదుగురూ కూడా నిన్న రాత్రి విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ప్రత్యక్షం కావడం పోలీసులను సైతం కంగుతినిపించింది.   దేశంలో ఎక్కడ దాక్కున్నా పోలీసులు తమను అరెస్టు చేసే ప్రమాదం ఉంది కాబట్టి విశ్వవిద్యాలయమే తమకు అసలైన రక్షణ అని ఆ అయిదుగురు విద్యార్థులూ భావించినట్లు కనిపిస్తోంది. తాము కనుక విశ్వవిద్యాలయంలో అడుగుపెడితే.... దానిని సదరు నిందితులు వివాదాస్పదంగా మార్చే అవకాశం ఉంది కాబట్టి, పోలీసులు క్యాంపస్‌ వెలుపలే ఉండిపోయారు. ఈ సందర్భంలో క్యాంపస్‌లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటోంది. నిన్న రాత్రి కూడా వీరు అయిదుగురూ కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం గురించి ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసినట్లు తెలుస్తోంది.

దావూద్‌ తమ్ముడి కొడుకు... అమెరికాలో అరెస్టు

  దావూద్‌ తమ్ముడి కొడుకు సొహైల్ అమెరికాలో అడ్డంగా పట్టుబడిపోయాడు. తను కూడా పెదనాన్నంత పేద్ద డాన్‌గా మారాలనుకున్న సొహైల్ ఆశలకు ఇక జైళ్లో నీళ్లు వదులుకోవలసిందే! ఎందుకంటే సొహైల్‌ కనుక అమెరికా న్యాయస్థానంలో దోషిగా తేలితే దాదాపు 25 సంవత్సరాల జైలు శిక్షను విధించే అవకాశం ఉంది. పాకిస్తాన్‌ నుంచి మత్తుపదార్థాలను విక్రయించడమే కాకుండా, తీవ్రవాదులు క్షిపణులను అందిస్తున్నాడన్న ఆరోపణల మీద సొహైల్‌ను అరెస్టు చేశారు. సొహైల్‌ దావూద్‌ చిన్న తమ్ముడైన నూరా సంతానం.   నూరా చనిపోయిన తరువాత సొహైల్‌ బాధ్యతలు దావూదే చూసుకునేవాడట. అయితే అతనకి కూడా తెలియకుండా సొహైల్‌ ఇష్టారాజ్యంగా చీకటి వ్యాపారాలతో చెలరేగిపోవడం మొదలుపెట్టాడు. సొహైల్ అలా పోయి పోయి చట్టానికి చిక్కుకోవడం ఇప్పుడు దావూద్‌కి చాలా ఇబ్బంది కలిగిస్తోందట. సొహైల్ జైళ్లో ఉంటే తమ కుటుంబ ప్రతిష్టకి మచ్చగా భావిస్తున్నాడట దావూద్‌. అందుకే సొహైల్‌ను ఎలాగైనా బయటకి రప్పించేందుకు అమెరికాలనే అతి ఖరీదైన లాయర్లను నియమించినట్లు సమాచారం. భారతదేశంలో అయితే దావూద్ పప్పులు ఉడికేవి కానీ మరీ అది అమెరికా అయిపోయిందయ్యే!