బాబు ర్యాంకుల వెనుక క్యా మతలబ్ హై..!
posted on Apr 20, 2016 @ 6:16PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్క్ ఆఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీనైనా..ప్రభుత్వాన్నైనా కార్పోరేట్ స్టైల్లో నడుపుతారు. ఉద్యోగుల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు చేసి వారికి ర్యాంక్స్ ఇవ్వడం కార్పోరేట్ కంపెనీల స్టైల్. అలా ర్యాంకింగ్‌లు ఇవ్వడం ద్వారా ఉద్యోగులు వారి పనితీరును మెరుగుపరచుకుంటారు. అలాగే పూర్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి త్వరలోనే ఊస్టింగ్ రెడీ అవుతుందని సంకేతాలు పంపడం సర్వే మెయిన్ కాన్సెప్ట్. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో ఐటీకి కేరాఫ్ ఆడ్రస్‌గా నిలిచిన ఆయన తనను తాను రాష్ట్రానికి సీఈవోగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్న బాబు తన కేబినెట్ మంత్రుల పనితీరుపై పర్ఫామెన్స్ రిపోర్టులు తయారు చేయించి ర్యాంకింగ్స్ ఇచ్చారు.
ఎప్పుడూ ఇచ్చే ర్యాంకింగ్సే అనుకున్నారు అంతా కాని ముఖ్యమంత్రి ఊహించని స్ట్రోక్ ఇచ్చారు. ఈ సారి ఓడలు బళ్లయ్యాయి..బళ్లు ఓడలయ్యాయి. అధినేతకు క్లోజ్ అనుకున్నవారు-ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనుకున్నవారు వెనుకబడిపోయారు..సరిగా పనిచేయడం లేదని..వేటు తప్పదని భావించిన వారంతా ముందుకొచ్చారు. ఇదేంటో అర్థంకాక మంత్రులు జుట్టుపీక్కుంటున్నారు. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిస్థితి చెప్పనక్కర్లేదు. సీఎంకు రైట్ హ్యాండ్‌గా..ల్యాండ్‌పూలింగ్‌లో..ప్రభుత్వంలో దాదాపు అన్నీ తానై చక్రం తిప్పుతున్న నారాయణకు చిట్టచివరి ర్యాంక్ వచ్చింది. ప్రభుత్వంలో నెంబర్ 2, ఆర్ధిక మంత్రి యనమలకు 15, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి 17వ ర్యాంక్ వచ్చింది.
అదే సమయంలో అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కు, వడ్డాణం, డబ్బుల సంచి తదితర వివాదాలతో ఎప్పుడు మంత్రి పదవి పోతుందోనని ఆందోళనలో ఉన్న పీతల సుజాత అనూహ్యంగా మొదటి ర్యాంక్ కొట్టేశారు. అలాగే మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించి పార్టీ పరువు తీసిన మంత్రి రావెల కిశోర్ బాబుకు 6వ స్థానం. ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా ర్యాంకులు వచ్చాయి. చంద్రబాబు మైండ్ గేమ్‌ని అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఏ పని చేసినా దాని వెనుక లోతైన మర్మం దాగుంటుంది.
అలాగే ఇప్పడు ఇచ్చిన ర్యాంకులను అర్థం చేసుకుంటే చాలా మంది మంత్రులు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం వల్ల పార్టీ ఇమేజ్ పడిపోతోంది. కొత్తగా వచ్చిన అధికారంతో అంతా తాము చెప్పినట్టే జరగాలని పలువురు మంత్రులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చింది. వీళ్ల జోరు తగ్గించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ, రిజర్వేషన్లు తదితర అంశాలు భవిష్యత్తులో తనను టార్గెట్ చేయకుండా ఉండటానికి ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను చూసిచూడనట్లుగా వదిలివేయాలని టీడీపీ అధినేత భావించారు.
దళిత నేత అయిన రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణలో కేసీఆర్ పట్ల పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యాపించాయి.ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బాబు తన కేబినెట్‌లోని దళిత మంత్రులను అందలం ఎక్కించి తద్వారా ఆ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా చూసుకున్నారు. దానితో పాటు విశాఖకు చెందిన కీలక నేత గంటా వ్యవహరశైలిపై ముఖ్యమంత్రి ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటీకే చాలాసార్లు సీరియస్ అవుతున్నప్పటికీ ఈ మంత్రి గారి తీరు మారకపోవడంతో బాబు గుర్రుగా ఉన్నారు. అందుకే గంటాకి లెక్కలతో షాక్ ఇచ్చారు .
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో తన మార్క్ పడలేదని భావిస్తున్నారు చంద్రన్న. రాబోయేది కీలక సమయం..ఎన్నికలపై ప్రభావం చూపించే కాలం కావడంతో సమర్థులైన వారిని కేబినెట్‌లో తీసుకోవాలనుకుంటున్నారు. మంత్రులకు ఈ ర్యాంక్‌లు ఒక హెచ్చరిక కావచ్చు లేక ఎవరి పదవి పోతుందో ముందుగానే బాబు తెలియజేసి ఉండవచ్చు. మొత్తానికి బాబు ర్యాంకుల వెనుక రహస్యాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఏదైనా పనిచేసేముందు దానికి సంబంధించిన సంకేతాలివ్వడం బాబు స్టైల్. ఆ ట్విస్ట్ ఎంటో అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది.