ఇప్పటికి ఇంతే..!

ఫై స్టార్ చాక్లెట్ కావాలని మారాం చేసిన పిల్లాడికి బెల్లం ముక్క చేతిలో పెట్టి సముదాయించిన తల్లిలా వుంది కేంద్ర ప్రభుత్వం వైఖరి! ప్రత్యేక హోదా అంటూ మొన్న పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర నిరసనలు తెలిపారు మన నేతలు. అందువల్లో లేక జనంలో క్రమంగా బీజేపిపై వ్యతిరేకత వస్తోందన్న ఆలోచనతోనో మోదీ ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కి! దాదాపు రెండు వేల కోట్ల భారీ ప్యాకేజీనే ప్రకటించినప్పటికీ ప్రత్యేక హోదాతో పోలిస్తే ఇది నథింగ్ అంటూ పెదవి విరుస్తున్నారు క్రిటిక్స్....       కేంద్రం మొత్తం 1,976 కోట్ల ఆర్దిక సాయం ప్రకటిస్తే అందులో 1176 కోట్లు ఆర్దిక లోటు భర్తీకి కేటాయించారు. అలాగే, మరో 350 కోట్లు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి , 450 కోట్లు రాజధాని నిర్మాణానికి సర్దారు. ఒక రకంగా చూస్తే ఇది విభజనకి గురైన నవ్యాంధ్రకి పెద్దగా నష్టాన్ని తీర్చేదేం కాదు. కాని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి ఢిల్లీ నుంచి రాబట్టుకోగలిగింది కూడా లేదనే చెప్పాలి.        ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోతోందని నిత్యం కార్నర్ చేస్తోన్న ప్రతిపక్షాల వద్ద మాత్రం ఏపీ గవర్నమెంట్ కి కొంచెం ఊరట లభిస్తుంది ఈ ప్యాకేజీతో. అసలు దేశాన్ని ఏలుతోన్న బీజేపితో పొత్తే లేకుంటే ఎన్నో ఆర్దిక కష్టాల్లో వున్న రాష్ట్రానికి ఇలాంటి ప్యాకేజీ కూడా వచ్చేది కాదని వాదించవచ్చు. అది నిజం కూడా.        ఇక ప్రత్యేక హోదా డిమాండ్లు, నిరసనలు ఇప్పుడప్పుడే ఆగకపోయినా ప్యాకేజీ ద్వారా కేంద్రం తన మనసు విప్పి చెప్పిందనే భావించాలి. ఈ రెండు వేల కోట్ల సాయంతో స్పెషల్ స్టేటస్... సమీప భవిష్యత్ లో సాధ్యం కాదన్నది ఢిల్లీ ఇస్తోన్న సిగ్నల్. అంతే కాదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి బీజేపి అనేక ఇతర రాష్ట్ట్రాల్లో కొత్త కుంపట్లు రాజేసుకునే ఛాన్స్ కూడా లేదు! సో... ఇప్పటికి ఇంతే చిత్తగించగలరు... అన్నది బాటమ్ లైన్!

తిరుపతికి 'కొత్త' రెక్కలు...

తిరుపతి వెళ్లిన వాళ్లు వేంకటేశ్వరునే కాదు విమాన వేంకటేశ్వరుని కూడా దర్శించుకుంటారు. అయితే విమాన వేంకటేశ్వరుడంటే విమానంలోవుంటాడని అర్థం కాదు! విమాన గోపురంపైన వెలిసిన వేంకటేశ్వరుడని ఉద్దేశ్యం! ఇక మీద వెంకన్న భక్తులు విమాన వేంకటేశ్వరుని విమానంలోనే వెళ్లి దర్శించుకోవచ్చు! అదీ ఆనందకర పరిణామం...  తిరుపతి విమానాశ్రయం త్వరలో అంతర్జాతీయ విమానాలకు ఆహ్వానం పలుకనుంది. నవ్యాంధ్ర ప్రజల బలమైన కోరికల్లో ఒకటైన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వేంకటేశ్వరుని పాదాల వద్దకి వచ్చేయనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదీ లేదనే చెప్పాలి. త్వరలో తిరుపతికి అంతర్జాతీయ హోదా వస్తే అది రాష్ట్రానికి సరికొత్త సొబుగే అవుతుంది! అంతర్జాతీయ విమానాల చక్కర్లు మొదలైతే అమెరికాతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలకు నేరుగా ఏడుకొండల వాని చరణాల వద్ద నుంచి ఎగిరి వెళ్లిపోవచ్చు.  తిరుపతి ఎయిర్ పోర్ట్ ని ఇంటర్నేషనల్ డెస్టినేషన్ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టింది మోదీ ప్రభుత్వం. త్వరలో దుబాయ్, కువైట్, అమెరికా లాంటి దేశాలకు రాకపోకలు మొదలవుతాయి. దీని ద్వారా మరింత మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకోవటమే కాకుండా తిరుపతి నగరం ఆర్దికంగా, వ్యాపారపరంగా కొత్త అభివృద్ధిని చవి చూసే అవకాశం వుంది. వేంకటేశ్వరుని పరమ భక్తుడైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి ఈ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి...   

పుష్కరాల్నీ వదిలిపెట్టని... ముష్కరులు!

కృష్ణ పుష్కరాలు జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో జనం సాధ్యమైనంత ఎక్కువగా తమ పాపాల్ని కడిగేసుకుంటున్నారు పవిత్ర జలాల్లో. అందుకోసం మూడేసి సార్లు మునకలు వేస్తూ దోసిళ్లతో నీళ్లు వదులుతున్నారు! కాని...ఫేస్బుక్ లాంటి సోషల్ నెటవర్క్ ప్రపంచంలో మాత్రం జనం దుష్ప్రచార  స్రవంతిలో మునిగితేలుతున్నారు. చంద్రబాబు పుష్కర స్నానంపై జరుగుతున్న యాగీ చూస్తే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది!    చంద్రబాబు పుష్కర స్నానం షర్టు విప్పకుండానే చేశాడనీ, కనీసం తల తడిసేలా పూర్తిగా మునగనైనా మునగలేదని కొందరు కథనాలు రాసుకుంటున్నారు. ఆయనంటే గిట్టని యాంటీ టీడీపీ బ్యాచ్ మరో అడుగు ముందుకేసి వైఎస్, జగన్ అయితే శాస్త్ర ప్రకారం పుష్కర స్నానం చేశారని ఫోటోలు పెడుతూ ఋజువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి పుష్కరాల ప్రారంభోత్సవం కోసం పుణ్య స్నానం చేస్తే ఆయన సరిగ్గా చేయలేదని విమర్శలు చేయటం అతి తెలివో, మూర్ఖత్వమో అవుతుంది. అంతే తప్ప తెలివి అనిపించుకోదు.   చంద్రబాబు ఏ కారణం చేత షర్టు విప్పకుండా , పూర్తిగా మునగకుండా స్నానం చేసినా అది ఆయన వ్యక్తిగత సమస్య. అంతే కాని, దాని వల్ల నవ్యాంధ్రకో, అమరావతికో ఎలాంటి గండమూ లేదు. మరి అటువంటప్పుడు ఆయన ఘోర నేరమో, పాపమో చేసినట్టు పనికట్టుకుని ప్రచారం చేయటం ఎందుకు? అంతకన్నా బెటర్ కోడి గుడ్డుపై ఈకలు పీకటం... ఏమంటారు?

ములాయం కుటుంబం చీలడానికి రె"ఢీ"

  ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న ములాయం సింగ్ యాదవ్ ఒకరు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం..దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఆయన తిరుగులేని నేత. అలాంటి నేతకు కుటుంబసభ్యులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాజకీయపరమైన విభేదాలు ములాయం కుటుంబంలో చిచ్చు రగిల్చాయి. ఒకవైపు తొడబుట్టిన తమ్ముళ్లు, మరో వైపు కొడుకు వీరిలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక ములాయం కుమిలిపోతున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం మంత్రి, ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు దానిని సవాల్‌గా తీసుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని పావులు కదుపుతున్నాయి. అయితే ప్రస్తుత అధికార పార్టీ ఎస్పీకి ఈ ఎన్నికలు కత్తి మీద సాములా తయారయ్యాయి. అవినీతి, ప్రజల్లో వ్యతిరేకతతో అఖిలేష్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రిగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టుబిగించిన అఖిలేష్ తండ్రి ములాయం సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా..తనకు తోచినట్లుగా ముందుకు వెళ్తున్నారు. అవి పార్టీకి చేటు తెచ్చేలా కనిపిస్తుండటంతో తండ్రి, కొడుకుల మధ్య కాస్త దూరం పెరిగింది.   తాజాగా వచ్చే ఎన్నికల్లో ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్ అఖిలేష్‌కు సూచించారు. దీంతో అఖిలేష్‌, శివపాల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకే తాను మొగ్గు చూపుతున్నట్లు సీఎం తేల్చిచెప్పారు. ఇందుకు ములాయం మరో సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్ సైతం అఖిలేష్‌కే మద్ధతు తెలపడంతో నొచ్చుకున్న శివపాల్ ..తనకు, తన మాటకు విలువలేని చోట ఉండనని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయం అటుతిరిగి ఇటుతిరిగి ములాయం వద్దకు చేరింది. ఆయన తమ్ముడి ప్రతిపాదనకు మద్దతు తెలిపి..కొడుకుపై మండిపడ్డారు. రాజధాని లక్నోలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ములాయం, అఖిలేష్ యాదవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడటానికి మైక్ అందుకున్న ములాయం.."నేను కానీ రంగంలోకి దిగితే..ప్రభుత్వానికి అసలు విషయం అర్థమవుతుంది" అన్నారు..అంతేకాకుండా శివపాల్ యాదవ్ పార్టీని వీడితే సమాజ్‌వాదీ పార్టీ రెండు ముక్కులవుతుందంటూ కొడుక్కి చురకలంటించారు. దీంతో పార్టీ గొడవ..అన్నదమ్ముల గొడవగా ..చవరికి తండ్రీ కొడుకుల గొడవగా మారి మొత్తం ములాయం కుటుంబంలోనే చిచ్చు పెట్టింది. మరి దీనిని ములాయం ఎలా పరిష్కరిస్తారో..?

చంద్రశేఖరుడు ముద్దు..చంద్రబాబు వద్దు..!

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. వీరందరితో పాటు అక్కడికి వచ్చిన వారందరి చూపు ఒక్కడి మీదే. ఆ ఒక్కరు వేరేవరో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు కానీ..రాష్ట్ర విభజన తర్వాత కానీ ఇంతవరకు ఆయన ఎట్‌హోం కార్యక్రమానికి హాజరుకాలేదు. అలాంటిది మొట్టమొదటిసారి జగన్ రాజ్‌భవన్‌కి వచ్చేసరికి రాజకీయ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నా సెంటార్ ఆఫ్ ఎట్రాక్షన్ మాత్రం జగనే. ఇదంతా బాగానే ఉంది కానీ..ఇక్కడే నలుగురిలో ఉన్నపుడు ఎలా ఉండాలో తనకు తెలియదనే విషయాన్ని జగన్ చూపించుకున్నారు.   ఎట్‌హోం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే సమయంలో హాజరవ్వటమే కాకుండా జగన్ కూడా అదే సమయంలో హాజరవ్వటం విశేషం. చంద్రబాబు, జగన్ వ్యవహారం ఉప్పు-నిప్పులా ఉంటున్న కారణంగా సాధారణంగా ఇద్దరూ పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో ఒకరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే ఇంకోరు వస్తున్నారు. అయితే, ఎట్‌హోంకు మాత్రం ఇటు చంద్రబాబు అటు జగన్ ఒకేసారి హాజరయ్యారు. దాంతో ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. దానికితోడు జగన్ నవ్వు మొహంతో గవర్నర్ సతీమణి విమలానరసింహన్‌తో ఎంతో కలివిడిగా మాట్లాడారు. అదేవిధంగా గవర్నర్‌తో కూడా ముచ్చట్లు చెప్పారు.   అదేసమయంలో చంద్రబాబు కూడా వారున్న హాలులోకి వచ్చారు. దాంతో జగన్‌తో మాట్లాడుతున్న గవర్నర్ వెంటనే చంద్రబాబును ఆహ్వానించటమే కాకుండా చంద్రబాబుకు జగన్‌ను చూపించారు. దాంతో ఒకరికి మరొకరు నమస్కారాలు చేసుకున్నారు. అనంతరం జగన్ ముందు నుండి వెళ్ళిపోతున్న చంద్రబాబును అక్కడే ఉన్న శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ఆపి మళ్ళీ జగన్ వద్దకు తీసుకుని వచ్చారు. దాంతో ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే అదే సమయంలో కేసీఆర్‌‌తో మాత్రం జగన్ ఆత్మీయంగా మెలిగారు. కేసీఆర్ కనపించగానే ఆయనతో కరచాలనం చేసి..నవ్వుతూ మాట్లాడుకున్నారు. అదే స్పూర్తి చంద్రబాబుతో మాత్రం చూపించలేకపోయారు జగన్.   అక్కడున్న వారంతా ఇదే విషయంపై చెవులు కొరుక్కోవడంతో చక్రపాణి అలర్టై జగన్‌ను వెనక్కిలాగి చంద్రబాబుతో కరచాలనం చేయించకుండా ఉండి ఉంటే సీన్ ఇంకోలాగా ఉండేది. ఎన్ని విభేదాలున్నా..ఎంత ఆగర్భ శత్రువులైనా..ఎదుట పడితే వారికి చేతులు జోడించి నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అయితే జగన్ మాత్రం కోరి వైరం తెచ్చుకున్నట్లు ఇలా వ్యవహరించడం చేయడం సరికాదంటున్నారు. ఆయన్ను చూసిన ప్రతిఒక్కరు జగన్ ఇంకా ఎదగలేదబ్బా అనుకుంటున్నారు.

ముఖ్యమంత్రికి రక్తలేఖ..!

ఏదైనా సమస్య వచ్చినా..కష్టమొచ్చినా కిందిస్థాయిలో అధికారుల వద్దకే వెళతారు జనం. అయితే అక్కడ ఎలాంటి న్యాయం జరగని పక్షంలో ఏకంగా ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రికే తమ గోడు వెళ్లబోసుకుని సమస్యల నుంచి బయటపడుతుంటారు. అలా న్యాయం జరగని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక 15 ఏళ్ల బాలిక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు ఉత్తరం రాసింది. అది కూడా రక్తంతో. బులంద్ షహర్ పట్టణానికి చెందిన ఓ వివాహితకు ఇద్దరు కుమార్తెలు. మగ సంతానానికి జన్మనివ్వలేదనే కారణంతో తమ కళ్లెదుటే తన తల్లిని సజీవదహనం చేశారని పెద్ద కుమార్తె లేఖలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆ లేఖ సారాంశం ఇదే.. బేటీ బచావో..బేటీ పడావో అని చెబుతారు..మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఓ మహిళ మరో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కారణంతో ఆమెకు నిప్పంటించారు. మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. కష్టంలో సాయం చేయాల్సిన పోలీసులు పట్టించుకోలేదు, పైగా అమ్మను చంపిన దుర్మార్గులను రక్షిస్తున్నారు. నన్ను, నా చెల్లెని గదిలో బంధించి మా నాన్న, ఇతర కుటుంబసభ్యులు కలిసి అమ్మకు నిప్పంటించారు అని లేఖలో పేర్కొంది. అయితే ఇదే అమ్మాయి, ఇదే విషయంపై గత నెలలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాసినా ఆయన నుంచి స్పందన రాలేదు. దీంతో రక్తంతో రాస్తేనైనా తన పరిస్థితిని సీఎం అర్థం చేసుకుని న్యాయం చేస్తారనే ఉద్దేశ్యంతో మరోసారి లేఖ రాసినట్లు సదరు బాలిక మీడియాకు తెలిపింది. మొదట ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ ఉత్తరాన్ని అనంతరం ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది.

షెల్టర్ కోసం "అన్న"లు కూలీలయ్యారు..

సమసమాజ స్థాపన కోసం, బడుగుల అభ్యున్నతి కోసం ఆయుధం పట్టిన అన్నలు దశాబ్దాలుగా దేశంలో రక్తపుటేరులు పారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. 1967లో పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరి ప్రాంతంలో భూమి కోసం పుట్టిన ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. కోర్టులో గెలుచుకున్న భూమిని దున్నుకోవడానికి గిరిజనులు ప్రయత్నిస్తుండగా నక్సల్బరీ గ్రామ భూస్వాములు అడ్డుతగిలారు. గిరిజనులపై దాడులు చేయించడంతో..అమాయక గిరిజనులు వారికి ఎదురుతిరిగారు. ఈ పోరాటంలో తొమ్మిది మంది గిరిజనులు చనిపోయారు. ఈ తిరుగుబాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇలాగే భూస్వాములు కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న వారిలో స్పూర్తి నింపి క్రమంగా నక్సలిజంగా మారిపోయింది.   ఈ ఉద్యమంలో 22 వేల మంది సాయుధ నక్సలైట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2009లో దేశంలోని నక్సల్ గ్రూపులన్నీ కలిసి "మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా"గా అవతరించింది. అయితే క్రమేణా వీరి ఉద్యమం పక్కదారిపట్టి హింసాత్మకంగా మారింది. ప్రజాప్రతినిధులను హతమార్చడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో సర్కార్ నక్సలైట్లపై కన్నెర్ర చేసింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట మావోలపై యుద్దం ప్రకటించింది. ముఖ్యంగా మావోల కంచుకోట దండకారణ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలపై కేంద్ర బలగాలు ఆధిపత్యం సాధించాయి. ఈ క్రమంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎన్‌కౌంటర్‌లు జరగడం, వేట ముమ్మరం కావడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు మావోలు పక్కరాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. పోలీసులు కనిపెట్టేస్తారేమోనన్న భయంతో కూలీల అవతారమెత్తారు.   అలా కూలీలుగా మారిన నలుగురు మావోయిస్ట్‌లను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నుంచే భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్లు ఛత్తీస్‌గడ్ పోలీసులకు తెలియడంతో వారు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ సహకారంతో పట్టుకున్నారు. ఆ నలుగురిలో మోస్ట్ వాంటెడ్ కవాసీ భీమా తలపై రూ.లక్ష రివార్డు ఉంది. 2014 ఎన్నికల ముందు దేశంలో సంచలనం స‌ృష్టించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి మహేంద్రకర్మ, శుక్లాలతో పాటు మరో 43 మందిని మందుపాతర పేల్చి చంపిన ఘటనలో భీమా ప్రధానపాత్ర పోషించాడు. ఇతని కోసం మూడు రాష్ట్రాల పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట ఆవుకు మండలం మెట్టుపల్లి గ్రామం చేరుకున్న భీమా..మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న గాలేరు-నగరి టన్నెల్ పనుల్లో కూలీగా చేరాడు. తర్వాత తన గ్రామానికే చెందిన మావోయిస్ట్‌లు పోడియం లక్మాలక్మా, హిడ్‌మాకర్ణామి, కట్టాడు ఉంగాలను తన వద్దకు తెచ్చుకున్నాడు. ఈ వ్యవహారంతో ఇంకేంతమంది ఇలాంటి మార్గాల్లో రాష్ట్రం దాటివచ్చారో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి సేఫ్ జో‌న్ అనుకున్న దండకారణ్యంలో అన్నలకు సేఫ్టి లేకుండా పోయింది.

నయీంను పామును పెంచినట్టు పెంచారా..!

  నయీం.. నయీం.. నయీం. గత మూడు నాలుగు రోజుల నుండి ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికే పులువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్ది రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గత మూడు రోజుల నుండి నయీం ఇంటిలో, వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా.. భారీగా ధనం.. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు పెద్ద మొత్తంలో దొరుకుతున్నాయి. ఇక న్యాయమూర్తుల అనుమతితో అతని బెడ్ రూంను కూడా నిన్న బద్దలు కొట్టిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. వారికి ఓ బంగారు నిధే కనిపించినంత పనైంది. వజ్రాలు పొదిగిన బంగారు వాచీలు..! మందమైనా తాళ్లలా ఉన్న బంగారు చైన్లు! బ్రేస్‌లెట్లు..! నెక్లె్‌సలు..! ఒకటా.. రెండా.. ఏకంగా రెండు గోనె సంచుల్లో బంగారు ఆభరణాలు లభించాయి. ఇంకా అత్యాధునిక సైనైడ్ గన్ తో పాటు శాటిలైట్ ఫోన్ దొరికింది. అంతేనా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి జతల దుస్తులు.. సౌందర్య పోషణకు వినియోగించే మేకప్ కిట్లు.. విగ్గులు లభించాయి. అయితే అన్నీ ఒక ఎత్తైతే ఆయన డైరీలు మరో ఎత్తు. ఈ కేసులో ఇవే కీలకం.. ఎందుకంటే పోలీసులకి దొరికిన మొత్తం పది డైరీలలో చాలా కీలకమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.   తనతో ఎవరెవరికి లింకప్స్ ఉన్నాయి.. ఎవరు ఏ పని చేయించుకున్నారు.. ఎవరి చేతి నుండి ఎంత సొమ్ము వచ్చింది.. ఎంత సొమ్ము చేతులు మారింది... తనకు ఎంత ముట్టింది.. అన్న విషయాలు డేట్స్ తో సహా అన్నీ వివరాలు రాసిపెట్టాడట. ఇంకా ఈయన గారితో ఎవరు డీల్ కుదుర్చుకున్నారో వారి వివరాలు కూడా ఉన్నాయట. అయితే ఆశ్యర్యకమైన విషయం ఏంటంటే.. ఈయన డీల్ కుదుర్చుకున్న వారిలో రాజకీయ నాయకులు, ఐ.ఏ.ఎస్, ఐ.పీఎస్ అధికారులు.. ఇంకా మనకు రోజు నీతి వాఖ్యాలు చెప్పే పాత్రికేయులు, పెద్ద పెద్ద బిల్డర్లు, వ్యాపారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. ఇంటి పేర్లతో సహా ఉన్నాయట. దీంతో ఇప్పుడు సిట్ బృందం ఆదిశగా దర్యాప్తు చేయడానికి నిర్ణయించుకుంది. నయీమ్ సామ్రాజ్యం విస్తరించిన నాటి నుంచి అతనికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై విచారణను తొలత ఆరంభించాలని.. నయీమ్ మొబైల్‌లో కాల్‌లిస్టు, డైరీలో ఉన్న పేర్లు...వారికి నయీమ్ ఏ విధంగా సహకరించాడు...వాళ్ల ద్వారా నయీమ్ ఏ విధంగా లబ్దిబొందాడనే దానిపై సిట్ దర్యాప్తు చేయనుంది.   మొత్తానికి ఎంత పాలు పోసినా పెంచినా పాము ప్రమాదకరమైనదే అన్న సామెత ప్రకారం.. ఎంతో మంది నేతలు నయీంను పామును పెంచినట్టు పెంచారు. చివరికి ఏమైంది ఇప్పుడు అతని వల్లే చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఒక సామాన్య మనిషి.. గ్యాంగ్ స్టర్ గా మారి ఇన్ని వేల కోట్ల ప్రజా ధనాన్ని అక్రమంగా సాధించగలిగాడు అంటే అది అతని ఒక్కడి వల్ల అయ్యే పనికాదు. అతనికి కొమ్ముకాసిన వారు చాలా మంది ఉన్నారు కాబట్టే గ్యాంగ్ స్టర్ గా చెలామణి అయ్యాడు. ఏకంగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నదే దీనికి నిదర్శనం. అయితే పోతే పోయాడులే కానీ.. అతని డైరీల్లో మొత్తం వివరాలు రాసిపెట్టాడు.. ఆ ఒక్క మండి చేశాడు అని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఇంత నిశ్శబ్దం. పేర్లు ఉన్నట్టు తెలుసు.. కానీ ఎవరి పేర్లు ఉన్నాయన్నది మాత్రం ఇంకా తెలీదు.. నరాలు తెగే ఉత్కంఠ, ఒక్కొక్కరికి హైబీపీలు, ఫోన్ రింగ్ అయితే ఏం వార్త వినాల్సి వస్తుందో అన్న టెన్షన్.. చూద్దాం ఏం జరుగుతుందో..

టెండూల్కర్‌ మండిపడ్డాడు

  కొంతమంది ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. మరికొందరు కేవలం సంచలనం కోసమే మాట్లాడినట్లు కనిపిస్తారు. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి, కాలమిస్టు శోభా డే ఏ కోవలోకి వస్తారో చెప్పడం కష్టం కానీ, సంచలనాలకి మాత్రం కేంద్రబిందువుగా ఉంటుంటారు. తాజాగా ఒలింపిక్స్‌లో భారతీయ ఆటగాళ్ల మీద శోభా చేసిన ట్వీట్ మీద భారతీయ క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ‘ఒలింపిక్స్‌కు వెళ్లండి. సెల్ఫీలు తీసుకోండి. ఖాళీ చేతులతో ఇంటికి రండి. ఇదే మన భారతీయ ఒలింపిక్‌ జట్టు లక్ష్యంలా ఉంది. వీరి వల్ల ఎంత డబ్బు, ప్రతిభా వృథా!’ అంటూ శోభా మొన్న సోమవారం వాక్రుచ్చారు.   అసలే రోజులు గడుస్తున్నా ఒక్క కాంస్యం కూడా దక్కక చిరాకెత్తి ఉన్న అభిమానులకు శోభా వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు అనిపించాయి. దీంతో వాళ్లూ వీళ్లూ అని లేకుండా అభిమానులంతా శోభా మీద విరుచుకుపడ్డారు. అభిషేక్‌ బచ్చన్‌, అర్జున్‌ కపూర్‌, సోనాక్షీసిన్హా వంటి బాలీవుడ్‌ ప్రముఖులంతా శోభాని తమ ట్విట్టర్‌లో దులిపేశారు. ఇక గుత్తా జ్వాల, అభినవ్‌ బింద్రా, మన్‌ప్రీత్‌ కౌర్‌ వంటి ఆటగాళ్లంతా... ఆటగాళ్ల విధేయతను శంకించవద్దంటూ తలంటారు.   ఇదంతా ఒక ఎత్తైతే ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కని టెండూల్కర్ కూడా శోభా వ్యాఖ్యలకు స్పందించడం విశేషం. ‘ఒలింపిక్స్‌ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పోటీ అనీ, ఇలాంటి పోటీలకి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం సామాన్యమైన విషయం కాదని’ చెప్పుకొచ్చాడు. తాను వారిని దగ్గరగా చూసి వస్తున్నాననీ, ఏళ్ల తరబడి శ్రమించినా.... తృటిలో పతకం జారిపోతే చాలా బాధగా ఉంటుందనీ పేర్కొన్నాడు. మన ఒలింపిక్స్ జట్టుకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల టెండూల్కర్‌ ఇలా స్పందించాడా లేకపోతే ఒక భారతీయుడిగా ప్రతిస్పందించాడా అన్నది పక్కన పెడితే... ఎప్పుడూ నోరు విప్పని సచిన్‌ ఇలా ఎదురుతిరగడంతో మీడియా పండగ చేసుకుంటోంది.

నయీమ్ డైరీలో ఏముంది..?

మోస్ట్ వాంటేడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టార్ నయీమ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. బతికుండగా ఎంతోమందికి నిద్రలేకుండా చేసిన నయీమ్..చనిపోయాక బతికున్నవాళ్లను చంపుతున్నాడు. గ్యాంగ్‌స్టార్‌గా పోలీసుల చేతిలో ఆయుధంగా మాఅతని కథ ముగిసిన వెంటనే నయీమ్ నేరసామ్రాజ్యాన్ని పేకలించి వేయాలని పోలీసులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే నయీమ్ ఇంట్లో జరిపిన సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్స్‌‌తో పాటు దొరికిన డైరీలో చాలా మంది ప్రముఖుల భండారాలున్నట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని డజన్ మంది ఐపీఎస్ అధికారులు, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని మరో 15 మంది ఐపీఎస్‌ల పేర్లు ఆ డైరీలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   వీటితో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు, కరీంనగర్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన అదనపు ఎస్సీ, డీఎస్సీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని 65 మంది మీడియా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. ఐపీఎస్‌లు, పోలీస్ అధికారులతో జరిపిన సంప్రదింపులు, వారు చెప్పిన పనులు, చేసిన వివరాలు స్పష్టంగా రాసున్నాయి. అనధికారిక ప్రచారం నయీమ్‌‌ను చాలా సార్లు పోలీసులు , పొలీటీషన్స్ కూడా వాడుకున్నారట. తాము నేరుగా హ్యాండిల్ చేయటం కుదరని సెటిల్మెంట్లు వంటివి నయీమ్ చేత చేయించి తిలా పాపం తల పిడికెడు పిడికెడు పిడికెడు... అన్నట్టు అందరూ పంచుకునే వారట! రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో వున్న ఈ లింక్ వల్లే నయీమ్ ఇంత కాలం మహారాజాలా లైఫ్ గడిపాడు. లేకపోతే వందల కోట్ల సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద తలనొప్పిగా మారిన ఒక క్రిమినల్ ఇంత కాలం ఎన్‌కౌంటర్ అవ్వకపోవటం, అది అతను దావూద్‌లా ఏ విదేశానికీ పారిపోకుండా ఇక్కడే వున్నా కూడా అంటే... వ్యవస్థలోనే నయీమ్ అభివృద్ధి, చావు రెండూ వున్నాయని అర్థం!.   నయీమ్ స్వస్థలానికి చెందిన పోలీసు సిబ్బంది సహా పలువురు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వారికి తాను చేసిన సాయం తదితర విషయాలను నయీమ్ డైరీలో రాసుకున్నాడు. ఈ విషయం బయటపడితే పరువు పోవడంతో పాటు ఉద్యోగాలకే ఎసరొచ్చే పరిస్థితులు కలిగే అవకాశం ఉండటంతో ఖాకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఒకట్రెండు రోజుల్లో నయీమ్ గ్యాంగ్‌తో మిలాఖత్ అయిన వారి వివరాలు వెలుగుచూసే అవకాశముంది.

నెలరోజుల్లో ఎంత మార్పు..!

నెల రోజుల క్రితం మందిమార్భలంతో..రాజదర్పంతో రాష్ట్రాధినేతగా ఏ బంగ్లా నుంచి బయటకు వచ్చారో..సరిగ్గా నెల తిరిగే సరికి అదే బంగ్లాలో ఆయన శవమై కనిపించారు. ఇది ఎవరి కథో ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖ్ పుల్ అసాధారణ రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న ఉదయం రాజధాని ఇటానగర్‌లోని తన అధికారిక నివాసంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని పుల్ ఆత్మహత్య చేసుకున్నారు. సినీ వినీలాకాశంలో తారలుగా వెలుగొందాలని గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, అవకాశాలు రాకపోవడంతో ఇక్కడ ఇమడలేక తనువు చాలించిన ఎంతోమంది తారలను మనం చూశాం. కానీ స్వతంత్ర భారతచరిత్రలో ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం మనదేశంలో విచిత్రమైన..విషాదం.   అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతం అంజాప్ జిల్లాలో 1969 జూలై 20న జన్మించిన పుల్ హ్యూమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వడ్రంగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో రాజకీయాల్లోకి ప్రవేశించి హయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి విజయంతోనే సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2015 డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం పుల్ జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రజాధనాన్ని నబుంటుకీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ కలిఖోపుల్ బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎం నబుంటుకీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ మద్ధతుతో డిసెంబర్ 17, 2015న అరుణాచల్‌ప్రదేశ్ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పుల్.   అనంతరం రాష్ట్రపతి పాలన విధించడం, పుల్ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ ఏడాది జూలై 13న పుల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, నబుంటుకీ ప్రభుత్వాన్ని పునరుద్దరిస్తూ తీర్పు చెప్పింది సుప్రీం. దీంతో సీఎం పదవి నుంచి పుల్ గత నెలలోనే తప్పుకున్నారు. ఆయన సొంత నివాసానికి పునరుద్దరణ పనులు జరుగుతుండటంతో ఇటానగర్‌లోని ప్రభుత్వ నివాసంలోనే ముగ్గురు భార్యలు, నలుగురు బిడ్డలతో కలిసి జీవిస్తున్నారు. త్వరలోనే ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంది. సుప్రీం తీర్పు వచ్చినప్పటి నుంచి కాస్త ముభావంగా ఉంటున్న పుల్ గత వారం రోజుల నుంచి బయటి వ్యక్తులను కలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. చివరిసారిగా కాంగ్రెస్ సభ్యుడు నినాంగ్ ఎరింగ్‌తో మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుల్ ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదు. ఒక డైరీ దొరకడంతో పోలీసులు దానిని పరిశీలిస్తున్నారు.   కలిఖోపుల్ ఆత్మహత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి పెమా ఖండూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్యకు కారణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడి అంతిమ లక్ష్యం పదవి. దాని కోసం ఎన్ని అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా తుది వరకు పోరాడుతారు లేదంటే రాజకీయాల నుంచే తప్పుకుంటారు. కానీ అవమానం జరిగిందని..కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడరు. అలా అయితే దేశంలో పదవులు కోల్పోయిన వారందరి పరిస్థితి ఏంటి..? వడ్రంగిగా జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పుల్ తన జీవితంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని ఉంటారు. అలాంటి వ్యక్తి ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తారా..?

అప్పుడు ఆయన..ఇప్పుడు ఈవిడ..?

మనదేశంలో అన్ని పనులకు, ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంది గానీ రాజకీయాలకు లేదు. అందుకే తొంభైలకి దగ్గరవుతున్నా చాలా మంది నేతలు కుర్చీలను పట్టుకుని వేలాడుతున్నారు. మరేంతో మంది కుర్చీ కోసం తహతహలాడుతున్నారు. వారి పరిస్థితి అలా ఉంటే మరి కొందరేమో అల్రెడీ కుర్చీల్లో ఉన్నా తమను తప్పించండి మహా ప్రభో అంటూ అధినేతలను వేడుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. వయోభారం కారణంగా చూపి ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. ఆనందీ..బీజేపీలో సీనియర్ నాయకురాలు..ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆమె చెప్పిన కారణం కూడా ఈ సీనియారిటీనే..75 సంవత్సరాలు నిండిన వాళ్లు కీలక బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలన్నది బీజేపీ అభిమతం.   2014లో మోడీ అధికారంలోకి వచ్చి రాగానే బీజేపీ అగ్రనేతలు..ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహార్ జోషి, శాంతకుమార్, యశ్వంత్‌సిన్హా వంటి సీనియర్ నాయకులకు పదవులు దక్కకపోవడానికి కారణం వయోపరిమితే. మోడీ వారసురాలిగా 2014 మే 22న గుజరాత్ తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆనందీబెన్ విధి నిర్వహణలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ తీవ్ర స్థాయిలో ఎగసిపడిన పటేల్ ఉద్యమం, ఉనాలో దళితులపై దాడి ఘటనతో రగిలిన దళితుల నిరసనోద్యమం ఆనందీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ ప్రభావంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిని, ప్రతిపక్ష కాంగ్రెస్ పుంజుకోవటం వెనువెంటనే జరిగిపోయింది. మోడీ ప్రధాని పీఠం అలంకరించే నాటికి బలంగా ఉన్న కమలం..తాజాగా వాడిపోయే దశకు చేరుకుంది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న బీజేపీ అధినాయకత్వం...ఇక ఉపేక్షిస్తే లాభం లేదని..సీఎంగా ఆనందీని కొనసాగిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని భావించారు. అందుకే ఆమెను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవే ఆమె రాజీనామాకు అసలు కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు ప్రస్తుత తమిళనాడు గవర్నర్, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో..అనివార్య పరిస్థితుల్లో రోశయ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిని తీసుకున్న నాటి నుంచి ఆయనకు "దినదినగండం నూరేళ్ల ఆయుష్షు" అన్నట్లుగా నడిచింది. పదవిలోకి వచ్చిరాగానే కర్నూలు, విజయవాడల్లో వరదలు, ఆపై జగన్ వేరు కుంపటి ఇవి చాలవన్నట్లు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో కేసీఆర్ దీక్షలు రోశయ్యకు కంటిమీద కనుకు లేకుండా చేశాయి. తన అనుభవంతో , శక్తిమేరకు సమస్యలను పరిష్కరించాలని చూసినప్పటికి కుదరలేదు. దీంతో రోశయ్య సీఎం పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.   వయస్సు వల్ల పని ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్టు, తన రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన మీడియాకు తెలిపారు. అయితే వాస్తవంలో రోశయ్య పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తిగా ఉంది..జగన్‌ను కట్టడి చేయలేకపోవడం, ప్రత్యేక, సమైక్య ఉద్యమాల్లో కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీపై అసహనం కలిగేలా చేశాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే సూచనలు కనిపిస్తుండటంతో అధినాయకత్వం రోశయ్యపై ఒత్తిడి పెంచింది. ఇక రోశయ్యకు రాజీనామా చేయక తప్పలేదు. దానికి కారణంగా వయోభారాన్ని చూపారు. ఆనందీ, రోశయ్య ఇద్దరూ తమ తమ పార్టీల కోసం దశాబ్దాల పాటు సేవలు చేశారు, ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతారా..? తప్పుకోవాలని అనుకుంటారా..? దాని వెనుక కారణం ఎంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎయిర్‌కోస్టా కష్టం తీరినట్లే..

ఎయిర్‌క్రాఫ్ట్ లీజుకు సంబంధించిన సమస్యలతో సంక్షోభంలో పడిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా తిరిగి కోలుకుంది. విమానాలు అద్దెకు ఇచ్చేవారితో చర్చలు విజయవంతంగా ముగియడంతో తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా బడా కార్పోరేట్ సంస్థలు, ఏవియేషన్ దిగ్గజాల గుత్తాధిపత్యంలో ఉన్న విమానయాన రంగంలోకి తెలుగు జెండాను రెపరెపలాడించింది ఎయిర్‌కోస్టా. పట్టణాల మౌలిక సదుపాయాలు, హోటళ్లు, విద్య తదితర రంగాల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్న ఎల్‌ఈపీఎల్ సంస్థ సారథ్యంలో విజయవాడ కేంద్రంగా, దేశంలోనే తొలి ప్రాంతీయ విమాన సంస్థగా ఎయిర్‌కోస్టా ప్రారంభమైంది.   తొలుత రెండు ఈ-170, రెండు ఈ-190 ఎంబ్రేర్ జెట్ విమానాలను ప్రాంతీయ సర్వీసులుగా నడిపింది. తొలిదశలో విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు ...రెండవ దశలో పుణే, గోవా, మధురై, త్రివేండ్రం, విశాఖపట్నం నగరాలకు సర్వీసులను విస్తరించింది. అతి తక్కువ కాలంలో ప్రయాణికుల ఆదరణను చూరగొన్న ఎయిర్‌కోస్టా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది..అందుకోసం నేషనల్ క్యారియర్‌గా మార్పు చెందే ఉద్ధేశ్యంతో కేంద్ర పౌర విమానయాన శాఖకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై డీజీసీఏ అనుమతి కూడా మంజూరు చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలో గత గురువారం ఎయిర్‌కోస్టా అన్ని సర్వీసులను రద్దు చేసింది. దీంతో మొత్తం 32 సర్వీసులు రద్దు అయ్యాయి.   ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నూతన పాలసీలోని రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ప్రకారం..ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు నిరుపయోగంగా ఉన్న 350 ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌పోర్టులను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అలాంటిది ఉన్న విమానయాన సంస్థలే మూలన పడితే పాలసీకే విఘాతం కలిగే పరిస్థితి ఉండటంతో కేంద్ర పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి లీజు దారులకు, ఎయిర్‌కోస్టా యజమాన్యానికి మధ్య రాజీ కుదర్చడంతో సంక్షోభం సమసిపోయింది. అచ్చం ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్న బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ పెగాసస్‌ విషయంలోనూ ఎయిర్‌క్రాఫ్ట్ లీజు దారులు సానుకూలంగా స్పందించడంతో ఆ సంస్థ కూడా తన సర్వీసులను పునరుద్ధరించింది. 

"విజయ" ఎవరిది..?

ఏ మాత్రం "బుర్ర" లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన తెలుగుజాతి ఇప్పుడు ప్రతి చిన్న దానికి కొట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య "కృష్ణా జలాల పంపకం" రగడగా మారింది. తాజాగా ప్రైవేట్ డెయిరీలకు ఎదురొడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రభుత్వరంగ పాల ఉత్పత్తుల సంస్థ ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ సహకార సంస్థ ఉత్పత్తి చేస్తోన్న "విజయ" బ్రాండ్ పాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంది. తెలుగు నేలపై క్షీర విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ "ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ". ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ డెయిరీ "విజయ" పేరుతో పాలను విక్రయించేది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ డెయిరీని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీని విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.   అయితే తెలంగాణ ప్రభుత్వం విడిగా పాడి సమాఖ్యను ఏర్పాటు చేసుకుంది. అయితే బ్రాండ్ పేరులో మార్పు లేకుండా "విజయ" పేరు కొనసాగిస్తూ ప్యాకెట్‌కు తెలంగాణ ట్యాగ్ తగిలించి విక్రయిస్తోంది. అటు ఏపీ డెయిరీ, ఇటు తెలంగాణ డెయిరీలు ఒకే బ్రాండ్ పేరుతో పాల విక్రయాలు చేస్తున్నాయి. మరో వైపు ఏపీ డెయిరీ కూడా కోస్తా, రాయలసీమల్లో సేకరించిన పాలను తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న "సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ"లో ప్రాసెస్ చేసి ఆ పాలను విజయ పేరుతోనే అమ్ముతోంది. ఈ క్రమంలో సాంబశివ డెయిరీ నుంచి విజయ బ్రాండ్ పేరుతో కొందరు ప్రజలకు నకిలీ పాలు సరఫరా చేస్తున్నారని విజయ డెయిరీ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీసాంబశివ డెయిరీ ప్రోడక్ట్స్ సంస్థ సేకరించిన పాలను అచ్చం విజయ బ్రాండ్ డిజైన్‌లో ముద్రించి ఉన్న నకిలీప్యాకెట్లలో నింపి మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్నారనీ, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.   తెలంగాణకు కౌంటర్‌గా ఏపీ డెయిరీ రంగంలోకి దిగింది. సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సరఫరా అవుతున్న విజయపాలు నకిలీవి కావని..ఏపీ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ జి.మురళీ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ పాలలో ఎలాంటి కల్తీ జరగలేదని పేర్కొన్నారు. దీంతో ఇరు సమాఖ్యలు విజయ బ్రాండ్ తమదంటే తమదంటూ వాదులాడుకుంటున్నాయి. దీంతో వివాదం కోర్టు మెట్లెక్కేంది...ఇరు సమాఖ్యలు కోర్టులో విడివిడిగా పిటిషన్లు వేశాయి.  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ దుర్గా ప్రసాదరావులతో కూడిన బెంచ్ దీనిపై విచారణ జరిపింది.   తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని ఏ మాత్రం గౌరవించకుండా, ఏకపక్షంగా ఏపీ డెయిరీ పేరు మార్చడంతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకుంది అని ఏపీ అడ్వకేట్ జనరల్ రమేశ్ దమ్మాలపాటి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి..తెలంగాణలో విజయపాల అమ్మకాలపై ఏపీ డెయిరీ మోకాలడ్డుతోందన్నారు. అయితే కార్పోరేషన్‌ను కేంద్రప్రభుత్వం విభజించనందున విజయ బ్రాండ్‌ను వాడుకునే హక్కు తమకుందని ఏపీ ఏజీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఒకవైపు కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగానే ఈ పంచాయతీ కేంద్రం వద్దకు చేరింది. ఈ నెల 15న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయ ఎవరిదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

గుజరాత్‌లో మోదీకి గడ్డుకాలం

  2001లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా విధులను చేపట్టిన దగ్గర్నుంచీ ఆయనకు తిరుగులేకుండా పోయింది. 2002లో గోద్రా మారణకాండ సందర్భంగా ఆ రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల తరువాత కూడా ఆయన మరోసారి ముఖ్యమంత్రి పదవిని చూపట్టడంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అంతేకాదు! గుజరాత్‌ను 13 ఏళ్లపాటు సుదీర్ఘంగా ఆ పదవిని చేపట్టి, గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించారంటూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ఆ పేరుతోనే ఏకంగా 2014లో ప్రధానమంత్రి పీఠాన్ని సైతం చేజిక్కించుకున్నారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవేమో! గుజరాత్‌ నుంచి తాను దిల్లీకి చేరుకున్నా, స్వరాష్ట్రంలో మోదీ హవాకు ఢోకా ఉండదని అందరూ అనుకున్నారు. కానీ రానురానూ గుజరాత్‌లో మోదీకి ఎదురుగాలి వీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.   మోదీ తరువాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆనందీబెన్‌ పటేల్‌, ఏమంత సమర్థవంతంగా పాలించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల నేపథ్యంలోనే ఆమెకు పొగపెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌ రుపానీని తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. కానీ ఈ చర్యతో అటు ఆనందీబెన్‌కూ ఇటు పటేల్‌ వర్గానికీ కూడా అసంతృప్తిని కలిగించినట్లు అయ్యింది. అసలే ప్రత్యేక రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటేల్‌ వర్గం వారికి, తమ వర్గం నుంచి కాకుండా మరో కులం నుంచి ముఖ్యమంత్రిని నియమించడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. పైగా ఉనాలో ఆవు చర్మాన్ని ఒలుస్తున్నారన్న కారణంతో ఏడుగురు దళితుల మీద జరిగిన దాడితో, అటు దళితులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక అక్కడి ముస్లింల మనసులో గుజరాత్‌ అల్లర్ల గాయాలు ఎలాగూ పచ్చిగానే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో 2017లో జరగనున్న గుజరాత్ రాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి పరాభవం తప్పదన్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే మోదీ సాహెబ్‌ రచ్చ గెలిచి ఇంట ఓడినట్లు అవుతుందేమో!

భారత ప్రజాస్వామ్యానికి కొత్త ఇల్లు..!

  ప్రతి భారతీయుడు ఢిల్లీ వెళితే చూడాలనుకునే వాటిలో అగ్రస్థానంలో ఉండేవి ఒకటి పార్లమెంట్ భవనం, రెండోది తాజ్‌మహల్. భారత ప్రజాస్వామ్యానికి పెట్టని కోటలా..దేశ రాజధాని నడిబొడ్డున రాజఠీవిని తలపిస్తూ ఎనిమిది దశాబ్ధాలుగా పైబడి చట్ట సభలకు అతిథ్యమిస్తున్న అపురూప కట్టడం పార్లమెంట్ భవనం. తెల్లవాడి బానిస సంకెళ్ల నుంచి విముక్తిని పొందడం నుంచి..మనల్ని మనం స్వేచ్ఛగా పరిపాలించుకునేలా రూపొందిన రాజ్యాంగ నిర్మాణానికి సజీవ సాక్ష్యం పార్లమెంట్. అక్కడే అనేక మంది రాజకీయ నాయకులు దేశాన్ని పాలించారు. అక్కడే అనేకమంది పెద్ద రాజకీయయోధులుగా రాటుదేలారు. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు, దేశ గతిని మలుపు తిప్పిన సంస్కరణలు పురుడు పోసుకున్న స్థలం. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం పార్లమెంట్. అన్ని సంవత్సరాలు సేవలందించిన పార్లమెంట్ ప్రస్తుతం ఇరుకైందట.   అందుకే అత్యాధునిక వసతులతో కూడిన మరో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆమోదం తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనం కావాలని గతేడాది డిసెంబర్ 27న స్పీకర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. కొత్త భవనం అవసరాల గురించి చెబుతూ స్పీకర్ పలు కారణాలను లేఖలో పొందుపరిచారు. 2026 నాటికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 81లోని క్లాజ్ (3) మేరకు జనాభా ప్రతిపాదికన లోక్‌సభలోని సీట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం భవనం 1927లో నిర్మితమైందని, అప్పుడు ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మీడియా సందర్శకులు, పార్లమెంట్ కార్యకలాపాలు పరిమితంగా ఉండేవని, అయితే కాలం గడిచేకొద్దీ ఇవన్నీ పలు రెట్లు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. కమిటీలు, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని, స్థల అవసరాల డిమాండ్లు పెరిగాయని సుమిత్ర లేఖలో వివరించారు. అలాగే లోక్‌సభ ఛాంబర్‌ను రీడిజైనింగ్ చేయాలని, సిట్టింగ్ ఏర్పాట్లను పునరుద్దరించాలన్నారు. ఇప్పుడున్న భవనం హేరిటేజ్ గ్రేడ్-1 కింద ఉన్నందున మరమ్మతులు, ఆధునీకరణలకు చాలా పరిమితులున్నాయని చెప్పారు. అయితే లేఖలో స్పీకర్ రెండు ప్రత్యామ్నాయ స్థలాలను పొందుపరిచారు. ఒకటి, ప్రస్తుత పార్లమెంట్ కాంప్లెక్స్‌లో, ఇంకొక స్థలాన్ని రాజ్‌పథ్‌కు అటు వైపు.   లేఖపై స్పందించిన వెంకయ్య..దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారుల పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదనపై పట్టణాభివృద్ధి శాఖ నోట్ రూపొందిస్తుంది, తదనంతరం దీన్ని కేబినెట్ పరిశీలిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజ్‌పథ్ వద్ద ఉన్న వాయు భవన్ వెనుక కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించే అవకాశం ఉంది. కొత్త భవన సముదాయాన్ని, ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని అనుసంధానిస్తూ భూగర్భంలో మార్గం నిర్మించవచ్చని సమాచారం. అయితే నూతన భవన నిర్మాణంపై నాయకులు, నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ భవనం పనితీరును తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని..అవసరాలకు తగిన విధంగా మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరో వందేళ్లపాటు సేవలందించగలదని బల్లగుద్ది మరి చెబుతున్నారు. అంతగా అవసరమైతే పార్లమెంట్ సమీపంలోనే కొన్ని కార్యాలయాలు నిర్మించుకోవచ్చునని సూచిస్తున్నారు. మనకంటే ఎంతో ముందు పార్లమెంట్ భవనాలు నిర్మించుకున్న దేశాలు ఇప్పటికీ వాటితోనే సరిపెట్టుకుంటూ అద్భుతంగా నిర్వహంచుంటుండగా..మన పార్లమెంట్ భవనానికి తీరా వందేళ్లు కూడా నిండక ముందే కొత్త భవనం కోసం చూడటం ఏ మాత్రం హర్షనీయం కాదంటున్నారు కొందరు.

పుష్కరాలు గోదావరి నీటితో కాదు..కృష్ణా జలాలతోనే

కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12న ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు ఆగస్టు 23న ముగియనున్నాయి. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద పుష్కర ఏర్పాట్లను చేస్తోంది. పుష్కరాలు ప్రారంభానికి పట్టుమని వారం రోజులే ఉన్నాయి. కృష్ణానదివైపు చూస్తే నీటి జాడలేదు. పుష్కర స్నానాలు కష్టమే..ఇక షవర్లే దిక్కు.. ఏంట్రా దేవుడా అనుకుంటున్న పరిస్థితుల్లో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో నదిలోకి నీటి ప్రవాహం పెరిగింది. ఆ నీటిని పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు తరలించి కాస్త ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.   అయితే దీనిపై సంప్రదాయవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కృష్ణా పుష్కరాలేంటి..గోదావరి నీళ్లతో ఏంటి..ఏ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి..మీరు ఏ నది నీటితో ఈ తంతు జరిపిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విమర్శలను పట్టించుకోని ప్రభుత్వం ఆ దిశగా ముందుకే వెళ్లింది. వేగంగా పుష్కర పనుల్లో నిమగ్నమైంది. గతేడాది గోదావరి పుష్కరాల సమయంలో రుతుపవనాలు సకాలంలో కనికరించకపోవడంతో గోదావరి పుష్కరాల నిర్వహణ డైలమాలో పడింది..అలాంటి స్థితిలో ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలతో గోదారమ్మ పొంగిపొర్లి రాజమండ్రి, ధవళేశ్వరం వద్ద పుష్కలంగా నీరు ఉండటంతో పుష్కరాలు ఘనంగా ముగిశాయి. తిరిగి అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడటంతో తన బిడ్డల కష్టం చూడలేకపోయింది కృష్ణమ్మ. అందుకే మూడు రాష్ట్రాలను దాటుకుంటూ బెజవాడ వైపు కదలి వస్తోంది కృష్ణవేణి.   మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడ వాగులు, వంకలు ఏకమై కృష్ణలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ కదం తొక్కుతోంది. ఆల్మట్టి రిజర్వాయర్‌కు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో అధికారులు ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి 2.18 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్ నుంచి 2.32 లక్షలు, జూరాల నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రావడంతో జలాశయం నిండు కుండలా మారింది. రేపు సాయంత్రానికి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయనుండటంతో కృష్ణాపుష్కరాలకు నీటికొరత తీరనుంది. అటు రుతుపవనాలు బలంగా ఉండటం..ఎగువ రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో పుష్కరాల నాటికి ప్రకాశం బ్యారేజ్‌కు మరింత నీరు చేరే అవకాశం ఉంది. దీంతో అధికారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో పట్టిసీమ నీటిని నిలిపివేసి పై నుంచి వస్తున్న నీటితోనే పుష్కరాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సో కృష్ణా పుష్కరాలు కృష్ణా జలాలతోనే. 

టీడీపీ చెంతకు రాజకీయ ఉద్ధండులు..? పార్ట్-2

ఇక టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్న మరో నేత డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి. తెలుగు రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్నవారికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు..ఎంత సీనియర్ అంటే వైఎస్‌తో సరిసమానమంత. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామానికి చెందిన డీఎల్ వృత్తిరీత్యా డాక్టర్. వైద్యుడిగా ప్రజలకు సేవలందించి..మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ పరిచయాలే ఆయన రాజకీయాలవైపు వెళ్లడానికి కారణమంటారు. 1978లో మైదుకూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.   రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా..నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు రావడంతో రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం త్వరలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని మైదుకూరులో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌తో కూడా చర్చించినట్లు సమాచారం. కడప జిల్లాను కంచుకోటగా మార్చుకున్న జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని భావిస్తున్న తెలుగుదేశానికి డీఎల్ అందివచ్చిన అవకాశంగా మారారు.   ఎందుకంటే డీఎల్‌కు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది..మైదుకూరు నియోజకవర్గంపై ఆయనకు బోలెడంత పట్టుతో పాటు గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది.. గ్రామాలకు, గ్రామాలే డీఎల్ వెంట నడుస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుత, పాత ప్రజాప్రతినిధుల్లో చాలా మంది ఆయన శిష్యులే. ఇలాంటి పరిస్థితిలో డీఎల్ సైకిల్ ఎక్కితే జగన్‌ కంచుకోట బద్దలవ్వాల్సిందే. అయితే డీఎల్ రాకను మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ సుధాకర్ యాదవ్ అడ్డుకుంటున్నారట. గత ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన సుధాకర్‌కు సపోర్ట్ చేస్తానని డీఎల్ మాట ఇచ్చారట..తీరా ఎన్నికల సమయంలో హ్యాండిచ్చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి సహకరించారని సుధాకర్‌ చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. అందుకే డీఎల్ వస్తానంటే సుధాకర్ వద్దంటున్నారట. డీఎల్ వల్ల పార్టీకి లాభం జరుగుతుందని భావించిన తెలుగుదేశం అధినాయకత్వం సుధాకర్‌ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమించింది. ఇప్పుడు వాతావరణం తనకు అనుకూలంగా ఉండటంతో చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకోవాలనుకుంటున్నారట డీఎల్. 

టీడీపీ చెంతకు రాజకీయ ఉద్ధండులు..? పార్ట్-1

వారిద్దరూ కాకలు తీరిన రాజకీయ ఉద్దండులు..రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్నారు. అయినా పరిస్థితులకు తలొంచక..ఎదురీదారు. కాని ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టినట్లే..వారి రాజకీయ భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టింది. అయితే చీకట్లో వెలుగులా తెలుగుదేశం పార్టీ వారికి కనిపించింది. అతి త్వరలో వారిద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరు కృష్ణాజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ, మరోకరు కడప జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ డీఎల్. రవీంద్రారెడ్డి.   నెహ్రూ టీడీపీ వ్యవస్థపాక సభ్యుల్లో ఒకరు 1983 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో టీడీపీలో చీలిక వచ్చిన సమయంలో నెహ్రూ లక్ష్మీపార్వతి వైపు ఉండిపోయారు. తదనంతర పరిణామాలతో ఆయన అయిష్టంగానే కాంగ్రెస్‌లో చేరారు. ఎన్టీఆర్ అంటే నెహ్రూకు ఎంతో అభిమానం. ఆయనకు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయాన్ని కన్నీళ్లు పెట్టుకుని మరీ దేవినేని చెప్పారు. కాంగ్రెస్‌ రాజకీయాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌తో చనువుగా ఉండేవారు. 2009లో వైఎస్ మరణం, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్‌లో నెహ్రూ ప్రభ క్రమంగా మసకబారుతూ వచ్చింది.   తన రాజకీయ భవిష్యత్‌పై దేవినేని డైలమాలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ఆయన్ను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో నెహ్రూకి మంచి పట్టుంది. ఆయన సేవలు టీడీపీకి అందితే పార్టీకి జిల్లాలో తిరుగుండదని భావించిన తెలుగుదేశం అధినేత నెహ్రూతో చర్చలు జరపాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. అటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కూడా నెహ్రూ రాకపై సుముఖంగా ఉండటంతో ఆయనకు అడ్డులేకుండా పోయింది. అయితే సీఎం చంద్రబాబు, దేవినేని నెహ్రూ ఇప్పటి వరకు ముఖాముఖి కలిసి మాట్లాడుకున్న సందర్భం లేదు. వీరిద్దరూ కనుక ఒకే వేదికపైకి వస్తే నెహ్రూకి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నది తెలుస్తుంది. అటు తాను టీడీపీలో చేరుతానని వస్తున్న వార్తలను ఊహాగానాలుగా కొట్టిపారేశారు నెహ్రూ..అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.