జీఎస్టీ..2000 To 2016

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంతో దేశ ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించినట్లైంది. ప్రస్తుత పన్నుల వ్యవస్థలో అనేకానేక సంక్లిష్టతలకు, సమస్యలకు పరిష్కారం చూపగల విశిష్ట సంస్కరణలకు ప్రతి రూపమే జీఎస్టీ. కానీ దీనికి ఏకాభిప్రాయం కుదరడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం అనేక షరతులు, సవరణలు ప్రతిపాదించి బిల్లు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి..ఎలాగైనా జీఎస్టీని పట్టాలపైకి ఎక్కించాలనుకున్న ఎన్‌డీఏ సవరణలకు తలొగ్గి పట్టుదలతో బిల్లును నెగ్గించుకొంది. ఈ క్రమంలో జీఎస్టీ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం.   మనం ఏదైనా వస్తువు కొన్నపుడు బిల్లు గమనిస్తే ఎమ్మార్పీ ధరతో పాటు వ్యాట్, ఇతర పన్నుల కింద భారీగా పన్నులు కనిపిస్తాయి. ఎమ్మార్పీలోనే ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. పరోక్ష పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వసూలు చేయడంతో చిక్కులతో పాటు కొన్నిసార్లు ఒకే పన్ను రెండు సార్లు కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం వినియోగదారుడు వస్తువు ధరలో 25 నుంచి 30 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. ఈ భారాన్ని ముందుగానే గ్రహించిన కేంద్రం 1994లో వస్తు సేవల పన్నుపై ఆలోచన చేసింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి ప్రభుత్వం సాధికారిక కమిటిని నియమించటం ద్వారా జీఎస్‌‌టీపై చర్చను ఆరంభించింది. ఈ కమిటీకి అప్పటి పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అసీమ్ దాస్‌గుప్తా నాయకత్వం వహించారు. అనంతరం 2003లో పరోక్ష పన్నుల అమలుపై కేల్కర్ కమిటీని నియమించారు..తన నివేదికలో వస్తు సేవల పన్ను ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించింది ఈ కమిటీ.   2006లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో జీఎస్‌‌టీ ప్రతిపాదన చేశారు, 2007లో జీఎస్‌టీ అమలుకు కార్యాచరణను రూపొందించే బాధ్యత రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి అప్పగించారు. జీఎస్‌టీని 2011 ఏప్రిల్‌లో ప్రవేశపెడతామని 2010 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలిపారు. చెప్పిన విధంగానే జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లును 2011 లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీన్ని పార్లమెంట్ స్థాయి సంఘం పరిశీలనకు పంపారు. అయితే 15వ లోక్‌సభ మార్చిలో రద్దుకావటంతో బిల్లుకు కాలం చెల్లింది. 2012లో సాధికార కమిటీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జీఎస్‌టీ రూపకల్పన కమిటీ ఏర్పాటు చేశారు.   2013లో జీఎస్‌టీ రూపకల్పన కమిటీ తన నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా బిల్లులో కొన్ని సవరణలకు సాధికార కమిటీ సిపారసు చేసింది. 2014 డిసెంబర్ 19న రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, 2015 మే 6న సభ ఆమోదం పొందింది. అనంతరం రాజ్యసభ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. ఆ కమిటీ అదే ఏడాది జూలై 22న నివేదికను సమర్పించింది. 2016 ఆగస్టు 3న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా..అదే రోజు సభ ఆమోదం పొందింది. 

ప్రశాంత్ కిశోర్‌తో "ప్రశాంతంగా" కాంగ్రెస్

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. అది కూడా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి వేదికగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఆమె వెంట పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో బైకుల మీద పార్టీ జెండాలు ఊపుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ప్రచారపర్వానికి వారణాసి నుంచి తెరలేపడం ద్వారా మోడీపైనే కాంగ్రెస్ గురిపెట్టినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత వ్యూహత్మకంగా..పకడ్భంధీగా మోడీ కోటపై కాంగ్రెస్ ఫోకస్ చేయడం వెనుక ఉన్నది ఒక్కడు.. ఆ ఒక్కడే ప్రశాంత్ కిశోర్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపు వెనుక, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిశ్ కుమార్ వెనుక..నిలిచి వారి విజయంలో ప్రశాంత్ కీలక పాత్ర పోషించాడు.   గుజరాత్‌లో మోడీ అభివృద్ధి చరిష్మాకు తోడు..ఎన్నికల సమయంలో పదునైన వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ రచించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేదా విపక్షాల విమర్శలకు ప్రశాంత్ ధీటైన వ్యూహాలు పన్నారు. మోడీని ఛాయ్ వాలా అనటంతో..బీజేపీ ఛాయ్ పే చర్చాతో కౌంటర్ ఇచ్చింది. అలాగే నితీశ్ విజయంలో ప్రధాన సూత్రదారి ప్రశాంత్ కిశోర్. ప్రశాంత్ ఎటు వైపు పనిచేస్తే..అటు వైపే విజయం ఉండటం..ఒక పెద్ద యుద్దం ముందుండటంతో వరుస పరాజయాలతో చిక్కి..శల్యమైన కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం..పోల్ మేనేజ్‌మెంట్‌లో మొనగాడిగా పేరున్న ప్రశాంత్ కిశోర్‌ను అద్దెకు తెచ్చుకుంది. వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రశాంత్ తన పని మొదలుపెట్టాడు. యూపీలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే బ్రాహ్మణ వర్గాన్ని మెప్పించటం కోసం ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన షీలాదీక్షిత్‌ను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పట్టుబట్టి నిలబెట్టారు ప్రశాంత్.   వయసు మళ్లిన ఆమెను చూసి జనం ఓట్లు వేస్తారా..? అందుకే తనలోని మేధావిని బయటకు తీశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా స్లోగన్‌ను తయారుచేశారు. ఆ స్లోగన్ ఏంటంటే "మేరీ జీవన్ కా ఏక్ హీ సప్నా..ఉత్తరప్రదేశ్‌ కో ఢిల్లీ జైసా బనానా" దీనిని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తే "ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీలా మార్చాలన్నదే నా జీవితంలోని ఆఖరి కోరిక " దీన్ని బట్టి చూస్తే మనోడు ఎంత జాదూగాడో అర్థమవుతుంది. వయసు మళ్లిన వ్యక్తికి ఆఖరి కోరికగా అభివృద్ధిని చేర్చి దానితో సెంటిమెంట్‌ను రగల్చాలన్నదే ఆయన వ్యూహం. ఇక ఓబీసీగా ఉన్న రాజ్‌బబ్బర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించడంతో ఆ వర్గం బలాన్ని కూడగట్టారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో బీజేపీ వ్యూహకర్తగా వారణాసిలో అమలు చేసిన రోడ్‌షో వ్యూహన్ని సోనియా గాంధీ చేత వర్కవుట్ చేయించారు. విమానం దిగిన దగ్గరి నుంచి స్ట్రాటజీతో వెళ్లారు ప్రశాంత్...విమానం దిగి దిగగానే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం ద్వారా సోనియా దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . జ్వరంతో ఉన్నా అలాగే ఓపిక పట్టి రోడ్‌షోలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు సోనియా.   ఈ పరిణామాలతో కమలనాథులు ఆత్మరక్షణలో పడ్డారు. మొన్నటికి మొన్న మాయవతిపై నోరుజారడం, అటు గుజరాత్‌లో దళితులపై దాడులను నియంత్రించలేక అప్రతిష్ట మూటగట్టుకుని దాదాపు దళితులకు దూరమయ్యే పరిస్థితిని కమలం కోరి తెచ్చుకుంది. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే అద్భుతమే జరగాలన్నారు. గతంలో ఇలాంటి అద్భుతాలు జరిగాయని, ఈసారి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో తమ ప్రత్యర్థులకు అలాంటి అద్భుతాలు జరిగాయని, ఈసారి తమ వంతు వస్తుందన్న ఆశ ఉందని అన్నారు. మరి ఆయన మాటల్లోని అంతర్యాం ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగకతప్పదు.

జీఎస్టీ బిల్లు కోసమే బాబుపై మెత్తబడ్డారా..?

జీఎస్టీ బిల్లు..ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి పార్లమెంట్ సమావేశంలో బిల్లు ఆమోదింప చేసుకోవాలని బీజేపీ భావించడం..ప్రతి పక్షాలు దీనికి సవరణలు ప్రతిపాదించి బిల్లును అడ్డుకోవడం ఆనవాయితీగా మారింది. జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున..దానిని ఆమోదించాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్ధతు అవసరం. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు గణనీయంగా 68 మంది సభ్యుల బలం ఉండగా..అధికార బీజేపీకి 48 మంది సభ్యులు మాత్రేమే ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు అన్ని కలుపుకుని 120 మంది సభ్యుల మద్ధతు ప్రభుత్వానికి ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 165 మంది సభ్యుల మద్ధతు అవసరం. అంటే ఇంకా 45 మంది సభ్యుల మద్ధతును కూడగట్టాల్సి ఉంటుంది.   గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నిలుచోగానే..అప్పటి వరకూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా వెల్‌లోకి దూసుకెళ్లారు. అంతే జైట్లీ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు..2014 ఎన్నికల్లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేని కాంగ్రెస్ దేశ ప్రగతిని అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారని అరుణ్‌జైట్లీ ధ్వజమెత్తారు. అలా గొడవ పడుతుండగానే ఆ ఏడాది సమావేశాలు ముగిశాయి. ఇక అప్పటి నుంచి పరువు నెగ్గించుకోవటానికి బీజేపీ నానా తంటాలు పడుతూ వస్తోంది. రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో జైట్లీ వరుస భేటీలు నిర్వహించారు. అటు ప్రధాని నరేంద్రమోడీ కూడా బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు విపక్ష నాయకులతో మాట్లాడారు. అలా తన మద్ధతును బీజేపీ 131 మందికి పెంచుకుంది,   నాడు లోక్‌సభలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకించిన అన్నాడీఎంకే ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది..ఎన్సీపీ, డీఎంకేలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి. సీపీఎం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. కానీ కాంగ్రెస్ మద్ధతిస్తే ఇక బిల్లుకు అడ్డే ఉండదు. హస్తం ప్రతిపాదించిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందున ఆ పార్టీ కూడా కాస్త తగ్గినట్లు కనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాపై కేవీపీ ప్రైవేట్ బిల్లు పెట్టడం..దానిపై జైట్లీ చేసిన ప్రకటన పరిస్థితిని మార్చేసింది. అంతే ఎన్డీఏ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి ఆ ప్రకటన ఆగ్రహాన్ని కలిగించింది. ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఘాటుగా స్పందించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అదే దారిలో వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నడవడంతో జీఎస్టీ బిల్లు ప్లేసులో ప్రత్యేకహోదా వచ్చి చేరింది. పార్లమెంట్ లోపలా, వెలుపలా హోదాపై ఎంపీలు నిరసన గళం వినిపించడంతో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి.   అసలే చచ్చి చెడి జీఎస్టీ బిల్లు కోసం అందరి మద్దతు కూడగట్టిన బీజేపీకి ఈ పరిణామం మింగుడు పడలేదు. హోదాపై ఏదో ఒకటి తేల్చకపోతే..జీఎస్టీ బిల్లు మళ్లీ అటకెక్కే ప్రమాదం ఉండటంతో జైట్లీ వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించి, ప్రధాని మోడీతో చర్చించారు. తేరుకున్న ప్రధాని మొన్న సాయంత్రం ప్రత్యేకహోదాపై కసరత్తు ప్రారంభించాలని జైట్లీకి సూచించినట్లు సమాచారం. ఒకవేళ హోదా సాధ్యంకాని పక్షంలో భారీ ప్యాకేజీ అయినా ఇవ్వాలని ప్రధాని యోచిస్తున్నట్లు సమాచారం. అంటే చంద్రబాబు అలిగారనో..ఎంపీలు నిరసన తెలిపారనో బీజేపీ మెత్తబడలేదన్న మాట. కేవలం తన పంతం నెగ్గించుకోవడానికి, ఏపీ ఎంపీలు జీఎస్టీ బిల్లుకు అడ్డం రాకుండా చేసుకోవడానికే కమలనాథులు ఈ ఎత్తు వేశారన్నమాట.  

విగ్రహాల గురించి ఇంత రచ్చ అవసరమా..?

  ఒక పక్క ఏపీలో ప్రత్యేక హోదా గురించి రాష్ట్రమంతటా నిరసనలతో అట్టుడుకుతుంటే మరోపక్క విగ్రహాల తొలగింపుపై మరో రచ్చ జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపుపై రేగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. త్వరలో కృష్ణ పుష్కరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో రోడ్డు వెడల్పు చేసే పనిలో భాగంగా కావాలనే రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించింది ప్రభుత్వం. అంతే ఏపీ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలిగించిందని వైసీపీ పార్టీ నేతలు గగ్గొలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతగా.. ఏపీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి అనేక సేవలు చేశారని.. అలాంటిది ఆయన విగ్రహం తొలగిస్తారా అంటూ  విగ్రహాన్ని అక్కడే మళ్లీ ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేశారు.   ఇదిలా ఉండగా ఇప్పుడు వారి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నట్టు చేసింది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతి-విజయవాడ రహదారిపై పాత అమరావతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. దీంకో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రోడ్లు వెడల్పు కోసం మా నేత విగ్రహం తొలగించారు.. ఇప్పుడు రోడ్డును తవ్వేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. ఆరోపించారు. దీనికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది.. తెలుగుదేశం నేతలు వారి ప్రాబల్యాన్ని చాటుకోవడానికే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఏపీలో ఇన్ని సమస్యలు ఉంటే విగ్రహాల కోసం ఇంత దుమారం అవసరమా అంటున్నారు కొంతమంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇప్పుడు విజయవాడ రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు విజయవాడ ఒకటి.. ఇప్పుడు విజయవాడ పరిస్థితి వేరు. అసలే ఇరుకు రోడ్లు.. ట్రాఫిక్ కష్టాలు ఉంటే.. ఆ రోడ్ల మధ్యనే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు విగ్రహాలు పెట్టేస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకునేది ఏంటిలే అన్నట్టు వ్వవహరిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వారి పని వారు చేస్తుంటే మాత్రం అదో వివాదం చేస్తున్నారు. విగ్రహం తీసినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు.. విగ్రహం ఇంకోచోట పెట్టుకోవచ్చు.. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడైన నేతలు విగ్రహల గురించి కొట్టుకోవడం మానేసి.. ఆ సమయాన్ని ఏపీ అభివృద్ధికి కేటాయించటం మంచిది. 

మాతృభూమిని మరిచారా..?

హరితహారం. ఇప్పుడు తెలంగాణ అంతా మారుమోగుతున్న నినాదం. వర్షాకాలం మొదలు కావడంతో సర్కార్ భారీ ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో..ఆ మాటకొస్తే కోట్లాది మొక్కల్ని నాటి, వాటిని చెట్లుగా, మహా వృక్షాలుగా మలిచెయ్యాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ఆలోచన..దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేశారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నపుడు అందరూ తలో చెయ్యి వేయడం అలవాటే. అలాగే సినీ ప్రపంచం కూడా రంగంలోకి దూకింది. సీఎం గారు అలా పిలుపునిచ్చారో లేదో ఆ తెల్లారేసరికి హీరోలు, హీరోయిన్లు తోటమాలి అవతారం ఎత్తారు నవ్వులు విరజిమ్ముతూ ఒక చేతిలో మొక్క, మరో చేతిలో వాటర్ క్యాన్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు.   ఇక్కడ వరకు బాగానే ఉంది కాని ..మొక్కలు నాటి రాష్ట్రం మొత్తాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయించారు, ఈ ఉద్ధేశ్యంతో "వనం-మనం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యంలో ప్రజలంతా భాగస్తులై విజయవంతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపు మేరకు ప్రజలంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటుతూ బాగానే సహకరిస్తున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు.. ఒక్క సినిమా ప్రముఖుడు కూడా ఆంధ్రలో అడుగుపెట్టలేదు..ఒక్క మొక్క నాటలేదు. హైదరాబాద్‌లోనే ఆస్తులన్ని ఉన్నాయి కాబట్టి..ఆ సర్కార్‌ అవసరం ఉంది కాబట్టి..ఆ భయంతో పిలవకపోయినా వెళ్లి మొక్కలు నాటొచ్చారు. ఆంధ్రతో..అక్కడి ప్రజలతో అవసరం ఏముందిలే అనుకుని రావడం లేదా..?   నిజానికి తెలుగు సినిమాకు పోషకులు, మహారాజా పోషకులు ఆంధ్రులే. కోస్తా అయినా, సీమ అయినా సినిమా మీద కాస్త ఎక్కువ అభిమానం చూపేది ఆంధ్రా వారే. గత కొన్నేళ్లుగా నైజాంలో కలెక్షన్స్ పెరిగినా అవి ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చేవే. ఆ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం ఉన్నది ఆంధ్రా వారే. ఆంధ్రా, సీడెడ్‌లు కలిసి 60 శాతం కలెక్షన్స్‌ను అందిస్తే, నైజాం 40 శాతం కలెక్షన్స్‌ ఇస్తుంది. ఆ 40 శాతంలో 15 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అలాంటి ఆంధ్రులపై ఇంతటి చిన్నచూపా. సినిమా వాళ్లు లైమ్ లైట్‌తో ఉన్నవారితో సాంగత్యం చేయడానికి ఇష్టపడతారు. తెలుగు ప్రజల ఆరాధ్యధైవం స్వర్గీయ ఎన్టీఆర్ హయాంను పక్కన బెడితే..చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యావత్ తెలుగుచిత్ర పరిశ్రమ ఆయన ముందు సాగిలపడింది. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు "జై జన్మభూమి".. "జై తెలుగుదేశం".."జై చంద్రబాబు" అన్నారు.   2004లో టీడీపీ ఓటమిపాలవ్వడంతో వైఎస్ ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయన కళ్లలో పడటానికి పాకులాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పడి తెలంగాణకు కేసీఆర్, నవ్యాంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే చిత్రపరిశ్రమ హైదరాబాద్‌లో నెలకొని ఉండటంతో సినీ పెద్దలు ఇక్కడి ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. ఇక్కడ ఇళ్లు, ఆస్తులు, స్టూడియోలున్నాయి కాదనం..కానీ మీరు పుట్టింది...పెరిగింది..ఓనమాలు దిద్దింది..ఆంధ్రాలో..అంటే అది మీకు మాతృభూమి. "జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరియసీ" అన్న సూక్తి ప్రకారం కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్ప. మాతృభూమిని మరిచిపోయారంటే కన్నతల్లిని మరచినట్లే.

కష్టాల్లో.. చిరంజీవి చూపిన దారిలో స్మృతి..!

ఎవరి వద్దనుంచయినా సాయం పొందితే మీరు ప్రతిఫలం ఆశించకుండా మరో ముగ్గురికి సాయం చేయండి. వారిని కూడా అలాగే సాయం చేయమని చెప్పండి, వారు ముగ్గురికి సాయం చేస్తారు. అలా ప్రపంచం మొత్తం సాయం చేసేవారితో నిండిపోయి..ప్రజలు సమస్యలు లేకుండా జీవిస్తారు. ఈ డైలాగ్ ఎప్పుడో ఎక్కడో విన్నట్లుగా ఉంది కదూ..? అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలోనిది ఆ డైలాగ్. ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో ఫేమస్..చాలా మంది నోట ఈ మాట వినిపించి, ఎందరి మనసులనో మార్చి సాయం చేసే దిశగా నడిపించిన డైలాగ్ అది. ఇప్పుడు ఆ డైలాగ్‌ను స్పూర్తిగా తీసుకున్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. ఫ్యాషన్ పేరు చెప్పో..మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనో నేటి తరం దేశీయ చేనేత రంగం నుంచి వచ్చిన దుస్తులను కాకుండా కార్పోరేట్ కంపెనీలు తయారు చేసిన రంగు రంగుల దుస్తుల వెంట పడుతోంది. దీంతో దేశవాళీ చేనేత రంగం కుదేలై..నేతన్న తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.   అయితే కొత్తగా కేంద్ర జౌళీ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్మృతీ ఇరానీ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించి వినూత్నంగా ముందడుగు వేశారు. దానిలో భాగంగా బీహార్ నుంచి తెప్పించిన చేనేత సిల్క్ చీరను ధరించిన ఆమె ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా "ఐవేర్ హ్యాండ్లూమ్" యాష్‌ట్యాగ్‌తో సరికొత్త ఆన్‌లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. "ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించి..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని, ఐవేర్ హ్యాండ్లూమ్ యాష్‌ట్యాగ్‌తో ఆ పోస్టుకు మరో ఐదుగురిని ట్యాగ్ చేయాలని, ఆ ఐదుగురు కూడా" ఇలా చేయడం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలవాలని కోరారు. 

మీరు ప్రజాప్రతినిధులని గుర్తుంచుకోండి..?

ప్రజాస్వామ్యంలో చట్టసభలు పవిత్రమైనవని, అత్యున్నతమైనవని అంటారు. కొందరు చట్టసభలు దేవాలయాల వంటివని కూడా చెబుతారు. అలాంటి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలు దేశ అత్యున్నత వ్యవస్థను అపహస్యం చేసేలా ప్రవర్తించారు. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం..ప్రయాణికులు బోర్డింగ్ పాస్ తీసుకుని..సెక్యూరిటి చెక్‌కు వెళుతున్న వేళ ఒక నడివయసు మహిళ మరో నడి వయసు వ్యక్తి చెంప చెళ్లుమనిపించింది..పిడిగుద్దులు కురిపించింది, కాళ్లతో తన్నింది..అక్కడున్న వారికి అసలెం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్న వాళ్లు ఎవరా..? అని ఆరా తీస్తే వారిలో ఒకరు అన్నాడీఎంకే ఎంపీ శశికళపుష్ప, మరోకరు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఘనత వహించిన భారత పార్లమెంట్ సభ్యులు.   తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను, అన్నాడీఎంకేను హేళన చేయడంతో తనలో సహనం నటించి శివను కొట్టినట్లు ఆవిడ చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, పార్లమెంటు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. పార్లమెంట్ ఏనాడైనా సజావుగా జరుగుతోందా..? ప్రజాసమస్యలు చర్చకు వస్తున్నాయా..? యూపీఏ హయంలో, ఇప్పుడు ఎన్‌డీఏ జమానాలో పార్లమెంటు రణరంగ వేదికగా మారిందే తప్ప ప్రజా సమస్యలను చర్చించే వేదికగా లేదు. రాజకీయ పార్టీలు పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి రోజూ గొడవలు, అరుపులు, కేకలతో సభలు దద్దరిల్లుతున్నాయి. ప్రజా సమస్యలు చర్చించే అత్యున్నత వేదిక..బజారు రాజకీయాలతో కొట్టుకునే అడ్డాగా మారిపోయింది. సభ్యులు ఒకరినొకరు అసభ్యపదజాలంతో దూషించుకోవడం, మిగతా సభ్యులు వారికి వంత పడటం ఇదొక ప్రహసనంలా తయారైంది.   ఇక తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగి చొక్కాలు చింపుకున్నారు. సొంత రాష్ట్రం..బయట తెలిసినా ఇలాంటివి అక్కడ మామూలే అనుకుంటారు. కాని సాక్షాత్తూ ఢిల్లీ నడివీధుల్లో ఇద్దరు తమిళ నేతలు ముష్టి యుద్ధానికి దిగి ఆ రాష్ట్రం పరువును యమునా నదిలో కలిపేశారు. ఇక్కడొక సంగతి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు..ఎప్పుడైతే ఖద్దరు చొక్కా వేసుకున్నారో అప్పటి నుంచి రాగద్వేషాలకు, కోపతాపాలకు అతీతంగా మెలగాలి. వారు ఒక నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తే ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా పరిగెత్తుకు వచ్చేది ఆ ప్రజాప్రతినిధి వద్దకే..అందువల్ల అతను అత్యున్నత గౌరవ మర్యాదలు పొందబడతాడు. అలాంటి వ్యక్తులు ఇలాంటి చిల్లర పనుల వల్ల ఆ గౌరవానికి చేటు తెచ్చుకోవడమే కాకుండా మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పొగొడుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు తాము ఎవరమో..ఎలాంటి హోదాలో ఉన్నామో గుర్తేరిగి హుందాగా మెలిగితే మంచిది.

జగన్‌ మెడపై మరో కత్తి..

తనకున్న అధికారంతో కొడుకుని కుబేరుణ్ణి చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జమానాలో సాగించిన అక్రమకాండలో మిస్సైన పేజీలను సీబీఐ వెతుకుతోంది. నాకది..నీకిది తరహాలో కొందరికి లబ్థి చేకూర్చి..ఆయా సంస్థలు పరోక్షంగా వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా వైఎస్ తెరవెనుక చక్రం తిప్పారు. అలా ఇప్పటికే ఎన్నో సంస్థలను, ఎందరో పేర్లను సీబీఐ బయట పెట్టింది. అయినప్పటికి బావిలో నీళ్లు ఊరినట్టు జగన్ అక్రమాస్తుల కేసులో ఇంకా దోషులు బయటపడుతూనే ఉన్నారు.   అలాంటి వాటిలో ఒకటి పెన్నా భూముల అంశం.  సున్నపురాయి నిక్షేపాల లీజుల కేటాయింపులో పెన్నా సిమెంట్స్‌కు అనుకూలంగా వ్యవహరించారనే అభియోగంతో సీబీఐ మరో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఇందులో పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపులో జరిగిన అక్రమాలను పేర్కొంది. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లె, కమలపాడు, కుంధనకోట, గుడిపాడు, మిట్టూరు గ్రామాల పరిధిలోని 230 ఎకరాల భూమిని 2006లో రైతుల నుంచి బలవంతంగా లాక్కొన్నారు. పెన్నా సిమెంట్స్ పరిశ్రమ ఏర్పడితే మీకు దారులు మూసుకుపోతాయనీ..తర్వాత అవి ఎందుకూ పనికి రావని భయపెట్టో, బెదిరించో ఎకరా రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు ఇచ్చి భూములు తీసుకున్నారు. రికార్డుల్లో మాత్రం రైతులంతా ఆ భూములు సాగుయోగ్యం కాదని వెనక్కి ఇచ్చినట్లు చూపించారు. తర్వాత వాటిని పెన్నా సిమెంట్స్‌కు కేటాయించారు అధికారులు.   భూములను రైతుల నుంచి సేకరించడం, వాటిని పెన్నాకు కట్టబెట్టడంలో అప్పటి యాడికి తహసీల్దార్ ఎల్లమ్మ, డీఆర్‌వ్వో సుదర్శన్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తేలింది. తమకు ఈ లబ్ధి చేకూర్చిన వైఎస్ రుణం సదరు పెన్నా యాజమాన్యం వెంటనే తీర్చేసుకుంది. జగన్ కంపెనీల్లో పెన్నా గ్రూప్ దాదాపు 68 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. నిబంధనల ప్రకారం తొలుత ఆ భూములకు ప్రభుత్వం తరపున నోటిఫికేషన్ జారీ చేసి రైతులకు పరిహారం కింద ఎంత చెల్లించాలో ధర నిర్ణయించాలి. ఈ విధంగా భూసేకరణ జరిగాక పెన్నా సిమెంట్స్‌కు కేటాయించాలి. అలాగే ఈ భూములు పెన్నా సిమెంట్స్‌కు కేటాయించే సమయంలో సంబంధిత దస్త్రాలను డీఆర్వో నుంచి సంయుక్త కలెక్టర్‌, కలెక్టర్ పరిశీలించి సీసీఎల్ఏకు పంపాలి..కానీ డీఆర్వో సుదర్శన్ రెడ్డి ఫైలును నేరుగా సీసీఎల్ఏకు పంపారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చినట్టు తేలడంతో తహసీల్దార్ ఎల్లమ్మ, డీఆర్వో సుదర్శన్ రెడ్డిలను జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా చేర్చారు. అలాగే అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను కూడా ఛార్జీషీటులో చేర్చారు.

వర్షాలతో దేశం తడిసిపోతోంది

  గత కొద్ది రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలతో దేశం తడిసి ముద్దయిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు అతివృష్టి దిశగా సాగుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ హుటాహుటిన నేడు అసోంలో ఏరియల్‌ సర్వే చేసేందుకు బయల్దేరారంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతోనూ, వరదలతోనూ అసోంలోని జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రం జలమయం కావడం వల్ల దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులైనట్లుగా చెబుతున్నారు. వరదలూ, వర్షాలతో నివాస భవనాలే కాకుండా రైల్వే, రహదారుల వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రభుత్వం ఎక్కడికక్కడ నివాస శిబిరాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పంటలన్నీ వరదపాలైపోవడంతో ఆ రాష్ట్ర రైతుల బాధకు అంతులేకుండా పోయింది. అటు బీహార్‌లోనూ వరదల వల్ల ఏకంగా 26 మంది మృత్యువాత పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యమైన త్రిపురలోనూ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. రహదారుల మీదకు వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇదే అదనుగా వ్యాపారస్తులు, నిత్యవసరల వస్తువుల ధరలను పూర్తిగా ఆకాశానికెత్తేశారు. ఉత్తరాది పరిస్థితి అలా ఉంటే దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా ముంచెత్తిన వర్షాలతో నదలు సైతం పొంగి జనజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కొద్దిరోజుల పాటు రుతుపవనాలకు విరామం ఉంటుందంటూ వాతావరణశాఖ అధికారులు చేసిన సూచనల నేపథ్యంలో ఇలా వర్షాలు ముంచెత్తడంతో, మన సాంకేతికత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది!

కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు!

  కశ్మీర్‌ ఇవాళ ఉదయం, కాల్పులతో నిద్ర లేచింది. కుప్వారా జిల్లా వద్ద ఉన్న సరిహద్దుగుండా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు తీవ్రవాదులను రక్షణదళాలు హతమార్చాయి. కానీ ఈ పోరాటంలో భాగంగా ఇద్దరు సైనికులు కూడా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే చల్లారుతున్న ఉద్రక్తతలను రెచ్చగొట్టేందుకే ఈ తీవ్రవాదులు, దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారన్నది నిఘా వర్గాల అనుమానం. ఈ నెల 8వ తేదీని సైనికులు ‘బుర్హాన్‌ వనీ’ అనే తీవ్రవాదిని కాల్చిచంపడంతో కశ్మీర్‌ అట్టుడికిపోయింది. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో దాదాపు 50 మంది చనిపోగా, 1500 మంది గాయాల పాలయ్యారు. కాగా ‘వనీ’ చావుని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్‌, స్థానికంగా ఉన్న అల్లరి మూకలను రెచ్చగొట్టిందన్నది ఒక ఆరోపణ. ఒకవైపు బయటనుంచి అల్లరల్లను రెచ్చగొడుతూనే, మరోవైపు చొరబాట్లను కూడా ప్రేరేపిందనడానికి బలమైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ మంగళవారం దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు తీవ్రవాదులను, సైన్యం మట్టుపెట్టగలిగింది. కాగా బహదూర్‌ అలీ అనే మరో తీవ్రవాదని సజీవంగా పట్టుకోగలిగింది. బహదూర్‌ అలీ, కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడటం ద్వారా, రాష్ట్రంలో రావణకాష్టాన్ని మరింతగా రగిల్చేందుకే వచ్చాడని విచారణలో తేలింది. ఇలాంటి పరిస్థితుల మధ్య కశ్మీర్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా కర్ఫ్యూలోనే మగ్గుతున్నాయి.

నవాజ్‌ పీఠానికి పీవోకే ఎసరు..?

ఇన్నాళ్లు దేని కోసమైతే ఆరాటపడుతోందో..ఎవరి సపోర్ట్‌ ఉందని భావిస్తూ మనదేశంపై విషం కక్కాలని చూస్తోందో..వాళ్లే..ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కదం తొక్కారు. దీనంతటికీ కారణం ఇటీవల జరిగిన ఎన్నికలే. అక్కడ నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్ రిగ్గింగ్ చేసి గెలిచిందని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. 42 స్థానాలకు గాను 32 స్థానాల్లో నవాజ్ పార్టీ జయకేతనం ఎగురవేయగా..ఇతర పార్టీలకు ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. తమను పోలింగ్ బూతుల వద్దకు రాకుండా అడ్డుకున్న అధికారులు యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, లేకుంటే అన్ని సీట్లు ఎలా వస్తాయని జనం నిలదీస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని..తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.   ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ పీవోకేలో ప్రజలు, విపక్షాలు చేస్తోన్న ఆందోళనలతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. పీవోకే రాజధాని నగరమైన ముజఫరాబాద్ సహా కోట్లి, చినారి, మిర్పూర్ నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కొందరు నిరసనకారులు పాక్ జాతీయ జెండాను తగులబెట్టారు. పీవోకేలో పాక్ వ్యతిరేక ఆందోళనలు జరగడం ఇదేం కొత్తకాదు..ఉద్యోగాల భర్తీపై గతంలో అక్కడి యువత పోరాటం చేసింది. అసలు ఇక్కడ ఉద్యోగాల భర్తీయే చాలా అరుదు కాగా, కాస్తో కూస్తో ఖాళీలు ఏర్పడగానే స్థానిక కశ్మీర్ యువతను కాదని పాకిస్థాన్ వారికే అవకాశాలు ఇవ్వడంపై యువత భగ్గుమంది. అయితే ఆ ఉద్యమాన్ని పాక్ ఉక్కుపాదంతో అణచివేసింది.   అయితే తాజా ఆందోళన కాస్తా పెరిగీ పెరిగీ అది పాకిస్థాన్ వ్యతిరేక ఉద్యమంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది అటు తిరిగి అటు తిరిగి తన పీఠాన్ని ఎక్కడ కదిలిస్తుందేమోనని ప్రధాని నవాజ్ షరీఫ్ భయపడిపోతున్నారు. అందుకే ఆందోళనపై ఉక్కుపాదం మోపాలని అక్కడి బలగాలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అటు పీవోకే ప్రజల ఆందోళనపై స్పందించిన భారత్..సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్‌లో అల్లర్లపై మాట్లాడటం సిగ్గు చేటని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది.

భయపడుతున్న కడియం, లక్ష్మారెడ్డి..?

తెలంగాణలో ఎంసెట్-2 లీకేజీ వ్యవహరం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై రంగంలోకి దిగిన సీఐడీ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తూ మొత్తం డొంకను కదిలిస్తోంది. దీనిపై నివేదిక తయారు చేసి దానిని ప్రభుత్వానికి అందించింది. మొత్తం 130 మందికి పేపర్లు లీకైనట్లు రిపోర్టులో వెల్లడించారు సీఐడీ అధికారులు. 80 కోట్ల రూపాయల స్కాంతో ప్రభుత్వానికి తలవంపులు రావడమే కాకుండా..మంచి ర్యాంక్ వచ్చిందన్న సంతోషం కొద్ది రోజులు కూడా నిలవకపోవడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. లీకేజీ కారణంగా మళ్లీ ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిందితుల్లో కొందరిని అరెస్ట్‌ చేయగా..కీలక నిందితుల కోసం సీఐడీ గాలిస్తోంది.   అంతా బాగానే ఉంది కాని అందరిలో ఇంతటి మనోవ్యధకు కారణమైన స్కాంకు నైతిక బాధ్యత ఏ శాఖా తీసుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరికి వారు ఈ అంశం తనది కాదంటూ తప్పించుకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహిస్తారు. ఎంసెట్ నిర్వహణకు కన్వీనర్‌ను ఎంపిక చేసి, పరీక్ష నిర్వహించి, ఫలితాలు వెల్లడించే వరకు విద్యాశాఖ బాధ్యత ఉంటుంది. ఎంసెట్ పరీక్ష ఏ యూనివర్శిటీ నిర్వహించాలనేది ఉన్నత విద్యామండలి నిర్ణయిస్తుంది. మెడిసిన్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2 నిర్వహణ బాధ్యతలను ఎంసెట్-1 కన్వీనర్ అయిన రమణారావుకే అప్పగించింది ప్రభుత్వం. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్-2తో సంబంధం లేకపోవడంతో విద్యాశాఖ పట్టించుకోలేదు. అయితే ఎంసెట్-2 నిర్వహణ బాధ్యత కూడా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించాల్సి రావడంతో సంబంధిత అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సంప్రదించి ఎంసెట్-2 తేదీలను ఖరారు చేసి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణరావుతో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి ఎంసెట్-2 ర్యాంకులను విడుదల చేశారు.   పేపర్ లీకేజీ కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని మంత్రులు లోలోపల భయపడుతున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్, నిర్వహణ బాధ్యత విద్యాశాఖదేనని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి..షెడ్యూలును ప్రకటించి, ర్యాంకులను విడుదల చేసింది వైద్యశాఖేనంటూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నిందితులే ఏ శాఖ అధికారులు తమకు సహకరించారో చెబితే కాని మంత్రుల డౌట్ క్లియర్ అయ్యేట్లు కనిపించడం లేదు.

మరోసారి గొంతెత్తిన రాహుల్‌గాంధి

నాలుగు నెలల తరువాత రాహుల్‌గాంధి మరోసారి గళం విప్పారు. గత పార్లమెంటు సమావేశాల్లో నల్లధనాన్ని వెలికితీయడంలోనూ, ఉద్యోగాలను కల్పించడంలోనూ, కరువుని నివారించడంలోనూ... ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్‌ చేసిన సుదీర్ఘ ఉపన్యాసం ప్రజల దృష్టిని ఆకర్షించింది. కానీ రాహుల్‌ ఆరోపణలకు మోదీ ఇచ్చిన ఘాటైన జవాబులు మరింత జనరంజకంగా నిలిచాయి. రాహుల్‌ మీద నేరుగా నేర్పుగా మోదీ ఎక్కుపెట్టిన బాణాల ముందు రాహుల్‌ ఉపన్యాసం వెలవెలబోయింది. అందుకేనేమో ఈసారి వర్షాకాల సమావేశాల సందర్భంగా, రాహుల్‌ ఆచితూచి ఉపన్యసించారు. పెరుగుతున్న ధరల మీదా, మేక్ ఇన్‌ ఇండియా వైఫల్యం మీదా ఎక్కువగా ప్రసంగించారు. ఒకప్పుడు విపణిలోకి చేరిన కందిపప్పుని 30 రూపాయలు లాభం వేసుకుని అమ్మేవారనీ, ఇప్పుడు ఆ తేడా 130 రూపాయలకు చేరుకుందని మండిపడ్డారు రాహుల్. తమ రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్న మోదీ ప్రభుత్వం, పెరుగుతున్న ధరల గురించి మాత్రం నోరు విప్పడం లేదంటూ దెప్పి పొడిచారు. అంతేకాదు! ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకొంటున్న మేక్ ఇన్‌ ఇండియా ద్వారా ఇంతవరకూ ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేదంటూ ఆరోపించారు. ధరల నియంత్రణకు సంబంధించి మోదీ, ఒక స్పష్టమైన కాలపరిమితితో పార్లమెంటు ముందుకు రావాలని సూచించారు. ఈసారి రాహుల్‌గాంధి ప్రసంగానికి మోదీ ఏం జవాబు ఎంత ఘాటుగా ఇస్తారో చూడాలి!

ఈ రాజగోపాల్‌ను ఏం చేయాలి!

ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజికి సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వం నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. మీడియాలో రోజుకో సాక్ష్యం బయటకు వస్తూ ఉండటంతో మొదట గుంభనంగా ఉన్న ప్రభుత్వం, సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణను చేపట్టిన రెండు మూడు రోజులకే దర్యాప్తు అధికారుల కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం బహిర్గతం అయిన మాట వాస్తవమేననీ, ఇందులో 72 మంది విద్యార్థులు లబ్ది పొందారనీ విచారణలో వెల్లడయ్యింది. ఇందుకోసం ఒకో విద్యార్థి నుంచీ 70 లక్షల వరకూ వసూలు చేసినట్లు తేలింది.   ప్రశ్నాపత్రం ముందుగానే వెల్లడయ్యిందని తేలిపోయిన నేపథ్యంలో ఎంసెట్‌-2ని ప్రభుత్వం రద్దు చేసే అవకాశం లేకపోలేదు. దీంతో వేలమంది విద్యార్థులు నెలల తరబడి చదివిన చదువులు, ప్రతిభతో సాధించిన ర్యాంకులు వృథా అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే నీట్‌ అనీ ఎంసెట్‌-1 అనీ ఎంసెట్‌-2 అనీ విద్యార్థుల మనస్తత్వాల మీద ప్రభుత్వాల రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ సమస్యలకి తోడు ఇప్పుడు లీకేజీ వ్యవహారం కూడా తోడయ్యింది.   ఇలాంటి దౌర్భాగ్యపు తతంగాలకు కారణం ఎవరు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు మాటిమాటికీ ఒకే పేరు ముందుకు వస్తోంది. అతనే రాజగోపాల్‌ రెడ్డి! 2006 బెంగళూరు మెడికల్ ఎంట్రెన్స్‌ పరీక్ష, 2014 పీజీ మెడికల్‌ ఎంట్రెన్స్‌, యాజమాన్యం కోటాలో ఉండే సీట్ల విక్రయం... ఇలా పరీక్షలు, సీట్ల కేటాయింపులకు సంబంధించి రాజగోపాల్ మీద నాలుగు క్రమినల్‌ కేసులు నడుస్తున్నాయి. పలుకుబడి, బరితెగింపు అన్న రెండే రెండు లక్షణాలతో కుట్రపూరితంగా ప్రశ్నాపత్రాలను సాధించడం రాజగోపాల్ సిద్ధహస్తుడని రుజువయ్యింది. తమ పిల్లవాడికి అర్హత ఉన్నా లేకున్నా వైద్యుడు కావాలన్న తపనతో రాజగోపాల్ వంటి వారికి సలాం కొట్టే తల్లిదండ్రులు ఎలాగూ ఉన్నారని తేలిపోయింది. మరి ఎప్పటిలాగే ఓ సాదాసీదా కేసు పెట్టి రాజగోపాల్ తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలా! లేకపోతే చివరి వరకూ వదలకుండా, మళ్లీ ఇలాంటి పాపానికి తలపెట్టకుండా అతగాణ్ని కటకటాల వెనుకే ఉంచాలా అన్నది ప్రభుత్వం చేతిలోనే ఉంది. లేదంటే కడుపు మండిన విద్యార్థుల ఆవేశం ఏదో ఒక రోజు కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంది.

కుస్తీకి "అచ్చేదిన్" తెచ్చిన సుల్తాన్

భారతదేశంలో సినిమా అనేది ఒక మతం.. తారలను తమ ఇలవేల్పులుగా పూజిస్తారు ఇక్కడి అభిమానులు. ఈ క్రమంలో వారి హావభావాలు, డ్రెస్, హెయిర్ స్టైల్ ఇలా టాప్ టూ బాటమ్ తారల్ని ఫాలో అయ్యేవారు మనలో కోకోల్లలు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే దానిలో కొత్తగా కనిపించే ఏ అంశాన్ని వదిలిపెట్టారు మన అభిమాన గణాలు. సిక్స్‌ప్యాక్, మిడిల్ క్రాఫ్, సైజ్ జీరో ఇలా తెరపై కనిపించిన ప్రతి దానిని అనుకరించేయ్యాల్సిందే. ఇప్పుడు అదే జాబితాలోకి చేరింది మల్లయుద్ధం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం సుల్తాన్. ఈ సినిమా కథాంశం మల్లయుద్థం, అందులో భాగంగానే "సుల్తాన్ అలీఖాన్" అనే మల్లయోధుడి పాత్రలో సల్మాన్ జీవించాడు.   ఇంకేముంది అభిమానులకు మల్లవిద్య అనే కొత్త కాన్సెప్ట్ దొరికింది..వెంటనే ఆలస్యం చేయకుండా మల్లవిద్య నేర్పించే అకాడమీలు ఎక్కడున్నాయో అక్కడికి పరుగులు తీశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న క్రీడల్లో మల్లయుద్థం లేదా కుస్తీ ఒకటి..దీని ప్రస్తావన రామాయణ, భారతాల్లో ఉంది..భీముడు మల్లయుద్థంలో సిద్ధహస్తుడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతోనే ఎదుటి వ్యక్తిని మట్టికరిపించడం కుస్తీ ప్రత్యేకత. ఆ రోజుల్లో మల్లయోధులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. రాజులు ప్రత్యేకంగా కుస్తీ వీరులను పెంచిపోషించేవారు. ఒక రాజ్య సంపదను, కీర్తిని అక్కడ ఉన్న మల్లయోధుల సంఖ్యను, వారు సాధించిన విజయాలను బట్టి నిర్ణయించే ఆనవాయితీ కూడా అమల్లో ఉండేది. కుస్తీకి లభిస్తోన్న ఆదరణ కారణంగా ఎంతోమంది మల్లయోధులు దీనిని ఒక వృత్తిగా స్వీకరించి, పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బును కూడా బాగానే ఆర్జించారు.   ఆధునిక పోకడల కారణంగా క్రమేపీ కుస్తీకి ఆదరణ కరువైంది. తెలుగు రాష్ట్రాల్లో కుస్తీలు అనగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ పాతబస్తీ. నిజాం నవాబుల కాలంలోనూ తరువాత కూడా అనేక వ్యాయామశాలలతో పాతనగరం కళకళలాడుతుండేది. మల్లవిద్య అంత సులువైన విషయం కాదు. ఇందులో ఆరి తేరాలంటే శరీరాన్ని ఎంతో కష్టపెట్టాల్సి ఉంటుంది. ఉదయం నాలుగు గంటల నుంచి వస్తాదుల పర్యవేక్షణలో ఎన్నో కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఆధునిక జిమ్‌లతో పోల్చి చూస్తే సాంప్రదాయ పద్థతుల్లో చేసే వ్యాయామాలకు చాలా వ్యత్యాసం ఉంది. బైఠక్, దండ్, హనుమాన్ బైఠక్, సపాట్, మట్టిలో నడవడం, బరువులు ఎత్తడం వంటివి శరీరానికి ఎంతో ప్రయోజనాన్నిస్తాయి. సుల్తాన్ సినిమా ప్రభావంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు సైతం వ్యాయామశాలలకు పరుగులు తీస్తుండటంతో మళ్లీ శంషాబాద్, పాతబస్తీల్లో ఉన్న సాంప్రదాయ వ్యాయామశాలలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.    

కేజీ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు..నవ్యాంధ్ర ఇక స్వర్ణాంధ్రే..

తమ జీవధారలతో ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన పవిత్ర కృష్ణా-గోదావరి నదీమ తల్లులు మరో వరాన్ని ఆంధ్రప్రజలకు అందజేశారు. పీకల్లోతు కష్టాలతో..కొండంత రెవెన్యూ లోటుతో ఆదుకునేవారు లేక అల్లాడుతున్న నవ్యాంధ్రకు చీకటిలో వెలుగు రేఖలా ఒక వార్త ఏపీ ప్రజల గుండెల నిండా సంతోషాన్ని తెచ్చింది. కృష్ణా-గోదావరి బేసిన్‌లో మరోసారి అపార సిరుల రాశి దొరికింది. మంచు రూపంలో నిక్షిప్తమై ఉన్న భారీ సహజవాయువు వనరులను బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ సారథ్యంలో జరిగిన అన్వేషణలో పాల్గొన్న అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.   ఈ గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు అత్యంత సుసంపన్నమైనవని, వీటిని వెలికితీయవచ్చని తెలిపింది. ఇక్కడ బయటపడ్డ 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాల మొత్తం విలువ రూ.33 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుగొని, నిర్వహిస్తున్న గ్యాస్ క్షేత్రమే ఇప్పటివరకూ మనదేశంలో అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. అందులో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అప్పట్లో అంచనా వేశారు. అంటే ఇపుడు కనుగొన్న క్షేత్రం దాని కన్నా పది రెట్లు పెద్దది. సహజవాయువు, నీరు కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా గడ్డకట్టి మంచురూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్లుగా పరిగణిస్తారు. ఇవి ప్రపంచంలో మహా సముద్రాలు..ఖండాల అంచున, ధృవ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి అరుదైన గ్యాస్ నిక్షేపాలు ఆంధ్రతీరంలో దొరకడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. అంతేకాదు..ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన అతి పెద్ద, అత్యంత సాంద్రతతో కూడిన గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాల్లో ఇది ఒకటి అని..సాక్షాత్తూ యూఎస్‌జీఎస్‌ శాస్త్రేవేత్తలే పేర్కొన్నారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.   అన్నింటి కంటే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈవార్త అమితానందాన్ని కలిగించింది. పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రంలో సంపదను సృష్టించాలని ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆయన కష్టాన్ని చూసి నదీమ తల్లులే చలించి ఆపద కాలంలో ఆశీర్వదించి తమ గర్భంలో దాచుకున్న అమూల్యమైన సంపదను బయట పడేశారు. అంతా బాగానే ఉంది కాని మన దగ్గర దొరికింది మనకే చెందాలి..గతంలో కేజీ బేసిన్‌లో రిలయన్స్ సంస్థ కనుగొన్న చమురు నిక్షేపాలను ఆ సంస్థ వెలికితీసి గుజరాత్ రాష్ట్రానికి తరలించుకుపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్‌కు చుక్క కూడా రాల్చలేదు. అఫ్‌కోర్స్‌.. దేశంలో ఎక్కడ ఏ సంపద దొరికినా అది జాతి సొత్తే..అది భారతీయులందరిది దానిని కాదనలేం. కానీ అది ఎక్కడైతే వెలుగు చూస్తుందో ఆ ప్రాంతానికి అందులో కొంత వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది.   తాజాగా వెలుగు చూసిన నిక్షేపాలపై ఈపాటికే కార్పోరేట్ సంస్థల కన్ను పడే ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంపదను తన్నుకు పోవడానికి గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పాటు కొన్ని కార్పోరేట్ సంస్థలు కూడా కాచుకుని కూర్చున్నాయి. అయితే ఈసారి అలాంటి ఆటలు ఏపీ ముందు సాగే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే ఇక్కడుంది చంద్రబాబు నాయుడు. నిక్షేపాలపై ప్రకటన వచ్చి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ మీటింగ్‌లో దీనిపై చర్చించారు. కేజీ బేసిన్ నుంచి వెలికితీసే సహజవాయువును తొలుత ఏపీ అవసరాలకు కేటాయించాలని, ఆ తర్వాతే బయటకు తీసుకువెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. తాను ఇటీవల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసినపుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు.   గ్యాస్‌పై హక్కు సాధించగలిగితే మనదగ్గర ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు, ఎరువుల కర్మాగారాలు, ఫెర్రో అల్లాయిస్‌ యూనిట్లకు చేయూతనిచ్చినట్లవుతుంది. అంతేకాకుండా మరిన్ని కొత్త సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పడానికి ఆస్కారం లభిస్తుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కనుక వస్తే 2025 నాటికి ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే నెంబర్‌వన్‌గా చూడాలన్న కల అతి త్వరగానే కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.   

సల్మాన్ రెండు సార్లు "నిర్దోషి"

ఏదైనా నేరం చేయడమో..లేదంటే నేరాన్ని అభియోగించబడటం వల్లనో ఒక వ్యక్తి లోలోపల కుమిలిపోతాడు. నేనేప్పుడు బయట పడతానురా దేవుడా..! అంటూ మనసులో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. తీరా అన్ని కలిసొచ్చి నిర్దోషిగా బయటపడ్డ ఆ వ్యక్తి ఆనందానికి అవధులుండవు. అలాంటిది ఒకసారి కాదూ ఏకంగా రెండు సార్లు నిర్దోషిగా తేలితే..అబ్బా ఆ వ్యక్తి ఎంతటి అదృష్టవంతుడో కదా..? ఆ మోస్ట్ లక్కీ పర్సన్ ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయన వేరోవరో కాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఆయన పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది మెలికలు తిరిగిన దేహం, హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు, వెరైటీ సినిమాలు, వివాదాలతో పాటు హిట్ అండ్ రన్ కేసు, కృష్ణజింకల కేసులు గుర్తొస్తాయి. అయితే ఇక నుంచి చివర పేర్కొన్న రెండు పదాలు వినిపించవు..కనిపించవు.   2002 సెప్టెంబర్ 28 అర్థరాత్రి ఒక బార్‌లో పీకల్లోతుగా మద్యం సేవించి..తన వాహనంలో మితిమీరిన వేగంతో డ్రైవ్ చేస్తూ బాంద్రా శివార్లలో ఫుట్‌పాత్ పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై దూసుకెళ్లి..ఒకరి మరణానికి, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యేందుకు కారణమయ్యారన్న ఆరోపణలపై సల్లూభాయ్‌పై కేసు నమోదైంది. దీనిపై 13 ఏళ్ల సుధీర్ఘ విచారణతో పాటు అనేక మంది సాక్షులను ప్రశ్నించిన మీదట ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్‌ఖాన్‌ను దోషిగా పరిగణించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ వార్త బాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం సల్మాన్‌కు వ్యతిరేకంగా ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని అభిప్రాయపడుతూ కేసును కొట్టివేసింది. అలా ఆయన మొదటిసారి నిర్దోషిగా బయటపడ్డాడు.   ఇక రెండో సంఘటన..హిట్ అండ్ రన్‌ కంటే పాత కథ, కృష్ణజింకల కేసు. 1998 సంవత్సరంలో "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా షూటింగ్ కోసం సల్మాన్‌ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ వెళ్లారు. ఇంకేముంది అప్పట్లో మనోడిది ఉడుకు రక్తం..పైగా హీరోయిన్లతో లవ్ ఎఫైర్లతో మునిగి ఉండటంతో షూటింగ్ కోసం వచ్చిన హీరోయిన్ల ముందు హీరోయిజం ప్రదర్శించాలనుకున్నాడు. అంతే గన్ను చేతపట్టి, కృష్ణజింకలను వేటాడి.. వాటి మాంసాన్ని ఆరగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వన్యప్ర్రాణుల్ని వేటాటడం, అక్రమ ఆయుధాల్ని ఉపయోగించడం ఇలా రెండు కేసులు ఆయనపై నమోదయ్యాయి.   ఈ రెండు కేసుల్లో సల్మాన్‌ దోషిగా తేలడంతో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది జోథ్‌పూర్ న్యాయస్థానం. సేమ్ హిట్ అండ్ రన్ కేసులో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టుకు వెళ్లినట్లే..ఇక్కడ కూడా రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లాడు సల్మాన్. మళ్లీ సల్మాన్‌ను దోషిగా తేల్చే సాక్ష్యాధారాల్ని సేకరించడంలో విఫలమయ్యారన్న కారణంతో, రాజస్థాన్ హైకోర్టు కండలవీరుడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. న్యాయ, అన్యాయాలు కాలాన్ని బట్టి మారిపోతున్న కాలంలో..సాక్ష్యాధారాలను బట్టి ఒకనాడు తప్పు అని తేలింది కూడా..మరి కొన్నాళ్లకు ఒప్పుగా నిగ్గు తేలుతున్నది. కోర్టు తీర్పుల్లో దోషిగా తేలడం, పై కోర్టులో బెయిల్ పొందడం, ఆ తర్వాత నిర్దోషిగా నిలవడం..ఇలాంటి వారిలో సల్మాన్‌ మొదటి వారూ కాదు, చివరి వారు కూడా కాదేమో.

ప్లాస్టిక్ వాడితే కూలకుండా ఉంటుందా..?

హైదరాబాద్ ఫిలింనగర్‌ కల్చరల్ సెంటర్ వద్ద ఆదివారం నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించగా..10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద కారణాలు అన్వేషించేందుకు జేఎన్‌టీయూ నిపుణుల బృందం ఘటనా స్థలిని సందర్శించింది. ఈ పరిశీలనలో చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణానికి అనుమతుల నుంచి నిర్మాణ పనుల వరకు ప్రతి దానిలో అక్రమాలు బయటపడ్డాయి. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కి 1996లో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి 6,188 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జి+2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. దానిని ఉల్లంఘిస్తూ ఏకంగా గ్రౌండ్ ప్లస్ 3 అంతస్థుల భవనం నిర్మించారు.   అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోలేదు.  2014లో మరో భవంతి నిర్మాణానికి ఎన్ఎఫ్‌సీసీ సన్నాహాలు చేస్తుండగా ఈ సారి నిద్రలేచిన అధికారులు అదే ఏడాది జూన్ 12న తొలి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయినా ఎన్ఎఫ్‌సీసీ "పెద్దలు" లైట్ తీసుకోవడంతో అక్టోబర్ 8న తుది నోటీసు ఇచ్చారు. అయినా మన పెద్దల ముందు అధికారుల నోటీసులు ఏపాటి..? వెంటనే కోర్టును ఆశ్రయించి నిర్మాణ విషయంలో జీహెచ్ఎంసీ జోక్యం చేసుకోకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని దర్జాగా తమ పని కానిచ్చారు. దీనిపై జీహెచ్ఎంసీ కౌంటర్ దాఖలు చేసినా..స్టే వెనక్కురాకపోవడంతో పనులన్నీ నిరాటంకంగా సాగాయి. ఇక కాంట్రాక్టర్ సంగతి చూస్తే "రాత్రికి రాత్రే మిద్దెలు" కట్టాలన్న దురాశ కళ్లకు కట్టినట్టు కనిపించింది. నాసిరకం సిమెంట్, నాణ్యత లేని ఇనుప సామాగ్రిని నిర్మాణంలో ఉపయోగించాడు .   ఎక్కడైనా పిల్లర్ కట్టాలంటే మధ్యలో ఐరన్ రాడ్లు పెట్టి వాటిని కాంక్రీట్‌తో కవర్ చేస్తారు. కానీ ఇక్కడ ఐరన్ రాడ్లకు బదులు ప్లాస్టిక్ పైప్‌లు వేసి దానిని సిమెంట్‌తో పూత పూశారు. కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా పొర్టికో నిర్మాణం మొదలుపెట్టడంతో శ్లాబ్ వేస్తున్న కొద్దీ భారం పెరగడంతో పోర్టికో కుప్పకూలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పనులన్ని రాత్రి పూట కొనసాగడం..ఫలితంగా అధికారుల పర్యవేక్షణ కొరవడి ఘోర ప్రమాదానికి కారణమైంది. ఒకవేళ అధికారులకు సమాచారం అందినా "పెద్దల" జోక్యం ఉండటంతో మనకెందుకులే అన్నట్లు వదిలివేయడంతో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా కొనసాగాయి. ఏదైనా జరిగితే కానీ మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం ఎప్పటిలాగే అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి శేఖర్ రెడ్డి, సెక్షన్ అధికారి మల్లేశ్వర్‌లను సస్పెండ్ చేసింది. నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మొత్తానికి ప్రముఖులు, జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కై చేసిన పని రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది.  

ఈ సారి పంద్రాగష్టు వేడుకలు గోల్కొండలో కాదట..?

ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరిలోకి కేసీఆర్ శైలి భిన్నమైంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో..ఎక్కడ వంచాలో బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్. ఏది.. ఎప్పుడు, ఎందుకు చేయాలో ఆయనకు తెలిసినంతగా మరేవ్వరికి తెలియదు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే నరమానవులు దిగివచ్చినా దానిని మార్చలేరు. తాజాగా ఆయన మదిలో ఒక ఆలోచన మెదిలింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతియేటా నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేదిక మార్చాలన్నదే ఆ ఆలోచన. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాకా తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేదికగా గోల్కొండ కోటను ఫిక్స్ చేసి అందిరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేకాకుండా స్వయంగా కోటను పరిశీలించి వేడుకలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనుకున్నట్లుగానే తెలంగాణలో తొలి స్వాతంత్ర్య వేడులకను గోల్కొండ ఖిల్లాలో నిర్వహించి వహ్వా అనిపించుకున్నారు. గత సంవత్సరం కూడా స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటలోనే నిర్వహించి ఈ సంప్రదాయం ఎప్పటికి ఇలాగే సాగుతుందని నిరూపించారు.   కానీ ఏమైందో ఏమో కానీ ఈ సారి పంద్రాగష్టు వేడుకల వేదికను గోల్కొండ కోట నుంచి వేరే చోటికి మార్చాలని సీఎం భావిస్తున్నారట. ఈ డౌట్ మాకేందుకు వచ్చిందనేగా మీ డౌట్..స్వాతంత్ర్య దినోత్సవం పట్టుమని ఇంకా 20 రోజులు కూడా లేదు. ఈ పాటికే అక్కడ ఏర్పాట్లు జోరందుకోవాలి..సెక్యూరిటీ చెకింగ్‌లు..అధికారుల హడావిడి ఇలాంటివేవి గోల్కొండ పరిసరాల్లో కనిపించడం లేదు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోనికి తీసుకున్న మీదట వెన్యూ ప్లేస్ మార్చబోతున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. అంతేకాదు పంద్రాగష్టు వేడుకలకు వేదికగా సీఎం అల్రెడి ఒక ప్లేస్ ఫిక్సయ్యారు.   అదే జూన్ 2న దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఎగరడానికి వేదికగా నిలిచిన సంజీవయ్య పార్క్ . ఆలోచన వచ్చి రాగానే కొందరు అధికారులతో కలిసి సంజీవయ్య పార్క్‌లో వేడుకలు నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సంజీవయ్య పార్క్‌లో వేడుకలు నిర్వహించడానికి అధికారులకు అనేక ఇబ్బందులు ఎదురు నిలిచాయి. ఒకటి, సంజీవయ్య పార్క్‌ ప్రస్తుతం చెట్లు, అందమైన పూల మొక్కలు, పొదలతో పచ్చగా కళకళలాడుతోంది. వేడుకల కోసం వాటన్నింటిని కూకటి వేళ్లతో సహా పెకలించాలి. రెండవది, ప్రభుత్వం 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో జెండాను తయారు చేయించి..దానిని 291 అడుగుల ఎత్తైన ధ్వజస్థంభం సాయంతో ఎగురవేయాలనుకుంటోంది. ఇది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని నిపుణుల అంచనా.   రేపు లేదా ఎల్లుండి అధికారులు తమ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆయన ఆ నివేదికను పరిశీలించి ఈ వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసలు ఉన్నపళంగా సీఎం వేదికను ఎందుకు మార్చాలనుకుంటున్నారు..? ఇది మామూలు జనం నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు మిలియన్ డాలర్ల క్వశ్చన్. కేసీఆర్ ఏది చేసినా దాని వెనుక ఎదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది మనలాంటి వారికి అర్థం కావాలంటే టైం పడుతుంది.. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి.