కేజ్రీవాల్ వారి కేడీ మంత్రులు!
posted on Sep 1, 2016 @ 3:58PM
గంగ.... ఆకాశం నుంచి శివుని శిరస్సుపైకి,అక్కడ్నుంచి హిమాలయాల మీదకి, అటు నుంచి భూమ్మీదకి, చివరకు సముద్రంలోకి పతనం అవుతూ వస్తుంది! ఢిల్లీ సీఎం కే్జ్రీవాల్ వారి ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తే అలాగే అనిపిస్తోంది! చీపురు కట్టనే పార్టీ గుర్తుగా పెట్టుకుని అవినీతి ఊడ్చేస్తానని ఆయన వచ్చాడు. కాని, ఇప్పుడు జనం చీపుర్లు తిరగేసి కొట్టేలా ఆప్ నేతలు ప్రవర్తిస్తున్నారు!
ఆమ్ ఆద్మీ పేరు చెప్పుకుని, అవినీతి అంతం చేస్తామంటూ, అన్నా హజారేను కూడా తెలివిగా వాడుకున్న కే్జ్రీవాల్ తిరుగులేని మెజార్టీతో సీఎం అయ్యాడు. అయినా కూడా తన సహజ ధోరణి విడిచిపెట్టకుండా మోదీపై విమర్శలతోనే కాలం వెల్లబుచ్చుతున్నాడని ఆరోపణలు వున్నాయి. ఢిల్లీలో రేపుల సంఖ్య ఏదీ తగ్గుముఖం పట్టటం లేదు. అన్నీ సమస్యలు పెరిగిపోతూనే వున్నాయి. కొన్నిటికి లెఫ్టెనెంట్ జనరల్ కారణం అంటాడు. కాదంటే మిగతా వాటికి మోదీ కారణమంటాడు. తాను మాత్రం ఎందుకు బాధ్యుడు కాడంటాడు కేజ్రీవాల్!. పరిపాలన సంబంధమైన విషయాల్లో, రాజకీయ చదరంగంలో కేజ్రీవాల్ ప్రవర్తన ఎలా వున్నా ఆయన అనుచరులు కొందరు చేస్తున్న పనులు మాత్రం ఆప్ ఖాతాలో ఘోరమైన పాపాలుగా చేరిపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రజలు తీవ్రమైన గుణపాఠం చెప్పే పరిస్థితులు తీసుకొస్తున్నాయి!
కొన్నాళ్ల కిందట జైన నగ్న సాధువు తరూణ్ సాగర్ హర్యాణ అసెంబ్లీలో స్పీచ్ ఇస్తే నానా రచ్చ చేశారు కొందరు ఆప్ లీడర్లు. ట్విట్టర్ లో అనధికారికంగా నోటికి వచ్చిందంతా వాగేశారు. బట్టలు వేసుకోని ఒక సాధువు గురించే అంత అల్లరి చేసిన వారంతా ఇప్పుడు అవాక్కై వుండిపోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ నేత సందీప్ కెమెరా కంటికి బట్టలు లేకుండా చిక్కాడు. ఇద్దరు మహిళలతో కాంప్రమైజింగ్ పొజీషన్లో చిక్కాడు! పైగా ఈ ఆప్ నేత, కేజ్రీవాల్ కేబినేట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు!. సీడీలో సందీప్ అనే మినిస్టర్ గారి కొన్ని ఫోటోలు కూడా వున్నాయి. అన్నీ చూసి కేజ్రీవాల్ అర్థగంటలోనే సందీప్ ని మంత్రి పదవి నుంచి తొలగిం చేశాడు. ఇది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! కాని, ఆప్ లో ఇలాంటి ముసలం పుట్టడం ఇది మొదటి సారి కాదు. అదే ఆందోళన కలిగిస్తోన్న విషయం...
తమ పార్టీ అన్నిటికంటే స్వచ్ఛమైన దుకాణం అని చెప్పుకునే కేజ్రీవాల్ ఇంతకు ముందు మరో మంత్రిని ఇలాగే తొలగించాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆప్ పార్టీ ప్రభుత్వంలోనే ఆహార మంత్రిగా పని చేస్తున్నాయాన లంచం తీసుకుంటూ దొరికాడు. ఆయన్ని కూడా సస్పెండ్ చేసి సీబీఐ విచారణకు ఆర్డర్ ఇచ్చాడు సీఎం. అరవింద్ కేబినేట్ లోని మరో మంత్రి గృహ హింస చట్టం కింద స్వంత భార్య చేతనే కేసు ఎదుర్కొంటున్నాడు. ఇంకొకాయన దొంగ సర్టిఫికెట్ల కేసులో పదవికి రాజీనామా చేశాడు. ఇలా ఎవర్ని కదిలించినా ఘాటైన కేసులు బయటపడుతున్నాయి ఢిల్లీలో.
త్వరలో రానున్న పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతోన్న ఆప్ రోజుకో మంత్రి, నేత నిర్వాకం వల్ల అడ్డంగా బుక్కైపోతోంది. ఒక వైపు అధికారంలో వున్న బీజేపి, మరోవైపు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ లను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సతమతం అవుతోంది. అయినా కూడా కేజ్రీవాల్ ఇమేజ్ తో గట్టెక్కవచ్చని ఆశిస్తోంది! చూడాలి మరి చీపురు పార్టీ భవిష్యత్ ఏంటో?