ఓటుకు నోటు కేసులో... నిజంగా దమ్మెంతా?
posted on Aug 31, 2016 @ 1:55PM
ఓటుకు నోటు కేసు... ఈ వార్త కొన్నాళ్ల కింద తెలుగు రాష్ట్రాల్ని ఒక కుదుపు కుదిపింది. కారణం... తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి ఆంధ్రా ప్రభుత్వ సీఎంపై ఆరోపణలు చేయటం! సమైక్యాంధ్ర విభజన తరువాత అతి పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ ఇదే అనవచ్చు. ఒకవైపు కేసీఆర్ , మరో వైపు చంద్రబాబు అన్నట్టుగా సాగటమే ఈ కేసులోని విశేషం. అయితే, తరువాత కొన్నాళ్లకి సదరు కేసు కాస్తా టీ కప్పులో తుఫాన్ గా మారిపోయింది. అంతా చల్లబడిపోయింది!
ఇక ఓటుకు నోటు , ఫోన్ ట్యాపింగ్ పదాల్ని అంతా మరిచిపోతుండగా ఈ మధ్య మరోసారి వేడి రాజుకుంది. ఏసీబీ కోర్టు మరోసారి చంద్రబాబు వాయిస్ వున్న టేపులకు సంబంధించి విచారణకు అనుమతించింది. దీంతో మళ్లీ వార్తల పరంపర మొదలైంది. మరీ ముఖ్యంగా, మీడియాలో వున్న యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు వర్గం కలకలం రేపుతోంది! ఇక అంతా అయిపోయినట్టే అన్నట్లు కథనాలు జనం మీదకి వచ్చిపడుతున్నాయి! కాని, నిజం మరోలా వుందంటున్నారు కొందరు న్యాయ నిపుణులు...
ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టులో వుండగానే హై కోర్టు గతంలో ఓ తీర్పునిచ్చింది. అసలు ఎన్నికల వేళ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయటం అవినీతి కిందకి రాదని తేల్చింది. అది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా చూడాలని చెప్పింది. కాబట్టి ఏసీబీ కోర్టు ఓటుకు నోటు విషయంలో పెద్దగా చేయగలిగింది ఏం లేదంటున్నారు కొందరు సీనియర్ న్యాయకోవిదులు. కేసు విషయంలో ఏం జరగాలన్నా హైకోర్ట్ పరిధిలో జరగాల్సిందేనని వారంటున్నారు. అలాంటప్పుడు ఏసీబీ కోర్ట్ మరోసారి కొత్త ఆదేశం ఇవ్వటం వల్ల జరిగేదేం లేదని తేల్చేస్తున్నారు.
ఒక వైసీపీ ఎమ్మెల్యే టేపులకి సంబంధించి ప్రైవేట్ గా చేయించుకన్న పరీక్షలో ఎలాంటి నిజాలున్నా అవ్వి చెల్లవని అంటున్నారు సీనియర్ అడ్వకేట్స్. టేపుల్లో వున్నది చంద్రబాబు వాయిసే అని పిటీషనర్ వాదిస్తున్నప్పటికీ అది ప్రైవేట్ సంస్థ చేసిన పరీక్ష మాత్రమే. అలాంటి సాక్ష్యాలు కోర్టులో నిలిచేవి కావు. మరో వైపు , చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్, టేపుల్లో ఆయన వాయిస్ కి లింక్ పెట్టడం కూడా సరైంది కాదంటున్నారు. ఎందుకంటే, సీఎం చెప్పింది తన ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని మాత్రమేనని. ఓటుకు నోటు కేసులో బాబు వాయిస్ గా చెబుతోన్న ఫోన్ ఆయనది కాదని వారు పాయింట్ అవుట్ చేస్తున్నారు. చివరగా, అసలు టేపుల్లో వున్నది బాబు వాయిసే అయినా ఆయన మాట్లాడింది తప్పేం కాదని కూడా కొందరంటున్నారు. ఓటు వేయాల్సిన ఎమ్మెల్సీని స్వేచ్ఛగా ఓటు వేయమనే ఆయన చెప్పారని. అందులో ఎంత మాత్రం చట్ట వ్యతిరేక అంశం లేదని చెబుతున్నారు!
మొత్తం మీద ఓ వర్గం మీడియా చేసినంత హడావిడి నిజంగా ఓటుకు నోటు కేసులో ఏం లేదని అర్థం చేసుకోవాల్సిన సారాంశం!