ముగ్గురు సెలబ్రిటీల అనారోగ్యం... ముచ్చెమటల్లో తమిళనాడు!

తమిళనాడులో ఇప్పుడు అందరి దృష్టీ ఆసుపత్రుల మీదే వుంది! యెస్... తమిళ సీఎం జయలలిత సీరియస్ గా వుండటంతో రాష్ట్రమంతా ఇప్పుడు చెన్నై అపోలో హాస్పిటల్ వైపే చూస్తోంది! ఇన్ ఫ్యాక్ట్, దేశమంతా కూడా అపోలో ఆసుపత్రి నుంచీ ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అని బిక్కుబిక్కుమంటోంది. అయితే, అరవోళ్ల ఆసుపత్రి టెన్షన్స్ ఒక్క అపోలోకే పరిమితం కాలేదు. అన్నాడీఎంకే అభిమానుల్లాగే డీఎంకే అభిమానులు కూడా హాస్పిటల్ వైపు చూస్తున్నారు...  తొంభై ఏళ్లు పైబడ్డ కరుణానిధి కొన్ని రోజులుగా హాస్పిటల్ లోనే వుంటున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేని విషయం తెలిసిందే. అయితే, జయలలిత మాదిరిగా భయపడాల్సిన అవసరం ఏం లేదని చెబుతున్నారు డాక్టర్స్. ఏజ్ వల్ల వచ్చిన వీక్ నెస్, డీహైడ్రేషన్ లాంటి కారణాలే కరుణానిధి హాస్పిటల్ పాలవటానికి కారణమట! కాకపోతే, ఆయన వయసు దృష్ట్యా ఏ కొంచెం అనారోగ్యం అయినా తమిళ జనానికి టెన్షనే! తమిళనాడులో జయలలిత , కరుణానిధి ఇద్దరూ హాస్పిటల్ లో వుంటే కూడా పెద్దగా ఫీలవ్వని జనం కూడా ఇప్పడు ఆందోళనలోనే వున్నారు! ఎందుకంటే, శనివారం నాడు తలైవా ఆసుపత్రి మెట్టెక్కి వచ్చాడు! డీఎంకే, అన్నాడీఎంకే అన్న భేదాలేం లేకుండా తమిళ తంబీలందరూ రజినీకాంత్ ఫ్యాన్సే. ఆయన రోబో 2.0 షూటింగ్ సందర్భంగా గాయపడి వైద్యం తీసుకున్నారని తెలిసి కాస్త టెన్షన్ అయ్యారు. కాకపోతే, వెంటనే డిశ్చార్జ్ కూడా అయిపోయిన రజినీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. మెట్లెక్కే సీన్ షూట్ చేస్తూ ఆయన గాయపడ్డాడట. కాకపోతే, ఫ్రాక్చర్ లాంటివి ఏం జరగలేదు... పురుచిరతలైవీ జయలలిత, కలైంగర్ కరుణానిధి, తలైవా రజినీకాంత్... ఇలా ముగ్గురు తమిళ సూపర్ క్రేజీ సెలబ్రిటీస్ ఒకేసారి అనారోగ్యాలతో బాధపడటం నిజంగా బాధకారమే! కాకపోతే, త్వరలోనే అందరూ ఆరోగ్యంగా జనం ముందుకి రావాలనీ కోరుకుందాం. ముఖ్యంగా, ప్రమాదకర స్థితిలో వన్న జయ...     

వైజాగ్ తీరంలో... యుద్ధ నౌకపై పార్టీలు చేసుకోవచ్చట! 

  మీరు ఇప్పటి వరకూ చాలా స్టార్ హోటల్స్ చూసి వుంటారు. లేదంటే రకరకాల కథనాలు విని వుంటారు. కాని, త్వరలో మన వైజాగ్ లో ఏర్పాటు కానున్న ఒక స్టార్ హోటల్ మీరు లైఫ్ లో ఎప్పుడూ ఊహించనిది! అంతలా స్పెషల్ ఏంటి అంటే... అంతా స్పెషలే! అన్నిటికంటే ముఖ్యంగా, అసలు అది సిమెంట్, ఇటుకలు పెట్టి కట్టిన మామూలు బిల్డింగ్ కాకపోవటమే ... అతి పెద్ద ప్రత్యేకత! ఐఎన్ఎస్ విరాట్... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మీకు యుద్ధ నౌకలు, నేవీ అంటే ఆసక్తి వుంటే తప్ప దీని గురించి తెలిసే ఛాన్స్ లేదు.కాకపోతే, ఐఎన్ఎస్ విరాట్ 55ఏళ్లుగా ఎంతో కీలకమైన సేవలందిస్తోన్న ఒక భారీ జల నౌక. ఇది మొదట బ్రిటీష్ వాళ్ల వద్ద వుండేది. కాని, తరువాత బ్రిటన్ రాయల్ నేవీ నుంచి ఇండియన్ నేవీ వద్దకొచ్చింది. 1987 నుంచీ మన జలాల్లో ధీర గంభీరంగా తిరగాడుతోంది. విరాట్ పై నుంచి యుద్ధ సమాయాల్లో విమానాల్ని కూడా టేకాఫ్ చేసే ఛాన్స్ వుంటుంది. అంతటి విశాలమైన చిన్న సైజు దీవి లాంటిది విరాట్! ఎన్నో ఏళ్లుగా సేవలందించిన విరాట్ ను ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా పక్కకు తప్పించాలని భావిస్తోంది నేవీ. మరి దాని తరువాత ఐఎన్ఎస్ విరాట్ జల నౌక భవిష్యత్ ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది! టూరిజం డెవలప్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న నవ్యాంధ్ర ప్రభుత్వం విరాట్ ను వైజాగ్ తీరంలో సేద తీర్చనుందట! అంతే కాదు, 500గదుల భారీ స్టార్ హోటల్ అండ్ మ్యూజియంగా మార్చే ఆలోచన కూడా వుందట! అంటే సముద్రంలో ఓలలాడిన మన సగర్వ నౌక జనాల ఆనందాలకి, కేరింతలకి కేరాఫ్ కానుందన్నమాట! ఐఎన్ఎస్ విరాట్ హోటల్ గా మార్చే విషయమై నేవీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది. అయితే ఫైనల్ అగ్రిమెంట్లు , పర్మిషన్లు జరిగిపోతే ఒక సరికొత్త పాట్రియాట్రిక్ లగ్జరీ హోటల్ అందుబాటులోకి వచ్చేస్తుంది....    

ట్రంప్ విదేశీ కాల్స్... షాకవుతోన్న స్వదేశీ మీడియా!

కొన్ని సార్లు రుచి మరీ కొత్తగా వున్నా తినేవాడికి అది మింగుడు పడదు! కొన్నాళ్లు పోతే తినగా తినగా వేము తియ్యగా వుంటుంది! ట్రంప్ గురించి ఇప్పుడు అలాగే చెప్పుకోవాల్సి వచ్చేలా వుంది! ఎందుకంటే, అమెరికన్ మీడియాకి తమ కొత్త అధ్యక్షుడు ఏ రోజు ఏం చేస్తాడో అర్థం కాకుండా వుంది. ఒకవేళ ఏదైనా చేసినా అది అస్సలు నచ్చటం లేదు! ఇది నిజంగా తప్పు పని చేస్తుండటం వల్లనా? లేక ఇంత కాలం అధ్యక్షులు పాటిస్తూ వచ్చిన ఆచారాలు, సంప్రదాయాలు ట్రంప్ పాటించకపోవటం వల్లనా? ఎవరికీ అర్థం కావటం లేదు...  ఇంతకీ ట్రంప్ అనూహ్యంగా చేస్తున్న పనులేంటి? మొదట్నుంచీ షాకింగ్ కామెంట్స్ చేసే ట్రంప్ ఇప్పుడూ అదే పని చేస్తున్నాడు. జస్ట్ మాట్లాడుతున్నాడు. అంతే! కాని, ఆయన చేస్తోన్న ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ అమెరికన్ మీడియాకి, పొలిటికల్ క్రిటిక్స్ అస్సలు మింగుపడటం లేదు! తాజాగా న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక పెద్ద వ్యాసమే రాసింది డొనాల్డ్ వరుస తప్పుల గురించి. వాటిల్లో మొదటిది మన శత్రు దేశం పాకిస్తాన్ గురించే...  ట్రంప్ ఇంకా అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు చేపట్టక ముందే దేశాధినేతలకు ఫోన్ లు చేస్తున్నాడు. ఇది తప్పేం కాదు కాని ఆయన వారితో మాట్లాడుతున్న తీరే షాకింగ్ గా వుంటోందట. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఆ దేశం చాలా ఫెంటాస్టిటిక్ అని, షరీఫ్ కూడా టెరిఫిక్ లీడరని అన్నాడట ట్రంప్. దీన్ని పాక్ చక్కగా ప్రచారం చేసుకుంది. కాని, ఇప్పుడు అక్కడి మీడియా ఇలా పాకిస్తాన్ ని పొగిడి ఇండియాకి చిర్రెత్తుకొచ్చేలా చేయటం దేనికని వాపోతోంది! ట్రంప్ ట్రింగ్ ట్రింగ్ గొడవ పాక్ తో ఆగలేదు. తైవాన్ అంటే చైనాకు పడదు. దాన్ని తమ భూభాగం నుంచి విడిపోయిన ఒక రెబెల్ దేశంగా చూస్తుంది డ్రాగన్. అలాంటి తైవాన్ తో జాగ్రత్తగా డీల్ చేస్తూ వుంటుంది అమెరికా. తైవాన్ ని స్వతంత్ర దేశంగా గుర్తించను కూడా గుర్తించ లేదు వాషింగ్ టన్. కాని, ఇంత వరకూ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయని విధంగా ట్రంప్ తైవాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి కబుర్లు చెప్పాడు. దీనితో చైనా అగ్గి మీద గుగ్గిలం అయిపోతోందట! ట్రంప్ చేసిన మరో ఫోన్ కాల్ అయితే ఇంకా దారుణం అంటోంది అమెరికన్ మీడియా. ఈ మధ్యే ఒబామాను పచ్చి బూతులు తిట్టిన ఫిలీప్పీన్స్ అధ్యక్షుడికి కూడా ఆయన ఫోన్ చేశాడు. తమ దేశంలో పర్యటించమని కూడా కోరాడట! ఒక ప్రెసిడెంట్ ని తిట్టిన అమెరికా వ్యతిరేకిని మరో ప్రెసిడెంట్ ఆహ్వానించటమేంటని తల పట్టుకుంటున్నారు కొందరు అమెరికన్స్! ఇక ట్రంప్ ఆదరణ అందుకున్న మరో ఇద్దరు... కజక్ స్తాన్ అధ్యక్షుడు, బ్రిటన్ లోని ఒక అతివాద పార్టీ మాజీ నేత! వీరిద్దర్నీ గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఎంటర్టైన్ చేయలేదు. కాని, ట్రంప్ పనిగట్టుకుని వాళ్లతో మాట మంతీ కలుపుతున్నాడు! అదే సమయంలో బ్రిటన్ ప్రధాని థెరెసా మేను మాత్రం క్యాజువల్ గా అమెరికాకు రమ్మంటూ నిర్లక్ష్యంగా ఆహ్వానించాడట! ఇక ఫైనల్ గా అమెరికన్స్ కు సరికొత్త రాజకీయం చూపించాడు ట్రంప్, ఈ మధ్య జపాన్ ప్రధాని వచ్చినప్పుడు. ఆయనతో మీటింగ్ లో డొనాల్డ్ తన కూతుర్ని కూడా వుండనిచ్చాడట! ఎంత ప్రెసిడెంట్ గారి అమ్మాయి అయితే మాత్రం మరో దేశ ప్రధానితో చర్చలు జరిగే టైంలో ఆమె వుండటం ఏంటని షాకవుతున్నారు చాలా మంది! ఇలాంటివి ఇప్పటి వరకూ అమెరికాలో ఏనాడూ జరగలేదు. మన దగ్గరంటే రాజకీయ నేతల కుటుంబ సభ్యులు ఏ మీటింగ్ కి వచ్చినా మనం లైట్ గా తీసుకుంటాం. కాని, అమెరికన్స్ కి ట్రంప్ చేస్తున్న పనులు విడ్డూరంగా, విభ్రాంతికరంగా కనిపిస్తున్నాయి! ఇంకా వైట్ హౌజ్ లో అపీషియల్ గా కాలుమోపక ముందే ఇంత కలకలం రేపుతున్న ట్రంప్ నాలుగేళ్లలో ఏమేం చేస్తాడో?        

సినిమా క్రియేటివ్ గా తీస్తాడు! పబ్లిసిటీ కన్నింగ్ గా కొట్టేస్తాడు!

  రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఓ స్పెషల్ ఇమేజ్! ఆయన రాక ముందు మన సినిమాలు ఒకలా వుంటే ఆయన వచ్చాక మరోలా మారాయి. అసలు ఇప్పుడు వారానికో హారర్ సినిమా జనం ముందుకి వస్తోందంటే అందుకు రాము తీసిన ఎన్నో దెయ్యం సినిమాలే కారణం! ఆర్జీవీకి ముందు టాలీవుడ్లో వయోలెంట్ మూవీస్, హారర్ మూవీస్ లేనే లేవా అంటే ... అదేం కాదు. కాని, వర్మ వచ్చాక ఆ జానర్ మూవీస్ కి భీభత్సంగా క్రేజ్ వచ్చింది! రాము తన పాతికేళ్ల కెరీర్ లో సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువగా వివాదాలతో పేరు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా, సోషల్ మీడియా వచ్చాక ఆయన వివాదాన్ని కూడా తన పబ్లిసిటీ క్యాంపైన్ లో భాగం చేసేసుకున్నాడు! ఎలాంటి సినిమా తీసినా దానికి సంబంధించి ఏదో ఒక గొడవ రాజేయటం వర్మ స్టైల్. అది హిందీలో తీసిన సత్య అయినా, సర్కార్ అయినా, తెలుగులో తీసిన రక్త చరిత్ర అయినా, కొంత కాలం కింద జనంపైకి వదిలిన బెజవాడ అయినా... వివాదమే ఆయనే కలెక్షన్స్ సీక్రెట్! సాధారణంగా తెలుగు సినిమా జనాలు గొడవలు అంటే భయపడిపోతారు. ఏ చిన్న కాంట్రవర్సీ అయినా తమ సినిమాకు నష్టం అని భావిస్తారు. కాని, రామ్ గోపాల్ వర్మ రివర్స్. కాంట్రవర్సీనే కాసులుగా మార్చేసుకునే టాలెంట్ ఆయనది. తాజాగా వంగవీటి సినిమా హడావిడి అలాంటిదే! ఆడియో రిలీజ్ దాకా వచ్చేసిన రౌడీయిజం బ్యాక్ డ్రాప్ మూవీ ఇప్పుడు వివాదంగా మారింది. స్వయంగా వెళ్లి వంగవీటి రంగా కూమారుడు వంగవీటి రాధను కలిసిన వర్మ... ట్విట్టర్ లో మాత్రం బేటి అంత గొప్పగా జరగలేదని పెదవి విరిచాడు. అంతే కాదు, తనను నవ్వుతూ బెదిరించే ప్రయత్నం చేశారని అన్నాడు! కాని, తాను ఇలాంటి స్మైలింగ్ వారెంట్ లకు జడవనని చెప్పుకొచ్చాడు! అసలు వంగవీటి సినిమా విషయంలో ఎవరికి అభ్యంతరాలున్నా ఇంత కాలం సినిమా షూటింగ్ హ్యాపీగా జరిగేదే కాదు. ఎందుకంటే, ఆర్జీవీ ముహూర్తం షాట్ నుంచీ అన్నీ చెప్పే చేస్తున్నాడు. కాని, మొత్తం అంతా అయిపోయాక ఆడియో టైంలో వంగవీటి ఫ్యామిలీని కలవటం, దేనికి సంకేతం? దాని వల్ల ఉపయోగం ఏంటి? వాళ్లు వారెంట్ ఇవ్వటం, వర్మ భయపడకపోవటం... ఇవన్నీ మీడియాలో సినిమా పేరును మార్మోగేలా చేసేవే తప్ప మరేం కాదు! గతంలో రక్త చరిత్ర సమయంలో కూడా అనేక మంది సినిమా గురించి అనేక కామెంట్లు చేశారు. రామూ కూడా ఇరు వైపుల వున్న కుటుంబాల్ని కలిసి మీడియా కెమెరాలకి బోలెడు ఫీడ్ ఇచ్చాడు! తనకు కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ రాబట్టుకున్నాడు! రాంగోపాల్ వర్మ తన ప్రతీ సినిమా ముందు ఏదోలా వార్తల్లో వుంటూ పబ్లిసిటీ సంపాదించుకోవటం తప్పా? అస్సలు కాదు. ఆ మధ్య వచ్చిన లో బడ్జెట్ మూవీ ఐస్ క్రీం విషయంలో కూడా వర్మ పెద్ద గొడవే చేశాడు. అప్పుడు అతి చేసే రివ్యూవర్లని ఏకీపారేశాడు. ఆ దెబ్బకి ఐస్ క్రీం సినిమా వచ్చిందని  కూడా తెలియని వారికి సైతం మ్యాటర్ తెలిసి పోయింది. బెజవాడ రౌడీలు అంటూ కూడా అలాగే చేశాడు. చివర్లో రౌడీలు అనే పదం తీసేసి థియేటర్స్ లో వదిలాడు. మొత్తం మీద ఇది మంచి తెలివైన పద్ధతనే చెప్పుకోవాలి! ఒక్క వివాదం ఇచ్చే ఫ్రీ పబ్లిసిటీ బోలెడు ట్రైలర్స్, వాల్ పోస్టర్స్, ఇంటర్వ్యూస్ ... ఏవీ తెచ్చి పెట్టవు! ఆ విషయం రామూకి బాగా తెలుసు...   

అతను దొంగ నోట్లు ప్రింట్ చేశాడు! మరి మోదీకి ఎందుకు నచ్చాడు?

తెలివి వేరు... వ్యక్తిత్వం వేరు! ఈ సత్యానికి సరిగ్గా సరిపోయే నిదర్శనం అభినవ్ వర్మ! ఇంతకీ అభినవ్ వర్మ ఎవరు అంటారా? మనోడు చాలా తెలివైన వాడు. అదే సమయంలో పెద్ద కంత్రీగాడు కూడా! అందుకే, తెలివి వుండీ వ్యక్తిత్వం లేని దేశద్రోహులకి నిలువెత్తు నిరద్శనంలా మిగిలిపోయాడు! అభినవ్ వర్మ వయస్సు 21ఏళ్లు. చదివింది ఇంజనీరింగ్. అంతే కాదు, పోయిన సంవత్సరం ప్రధాని మోదీ ఈ శాల్తీని ప్రత్యేకంగా ప్రస్తావించి మెచ్చుకున్నాడు. అంతలా గొప్ప పని మనోడు ఏం చేశాడో తెలుసా? గుడ్డి వారి కోసం ఒక పరికరాన్ని కనుగొన్నాడు. దాని వల్ల అంధులు చేతిలో కర్ర పట్టుకునే అవసరం లేకుండా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. జస్ట్ 21ఏళ్ల వయస్సుకే ఒక చక్కటి ఉపయోగకరమైన ఆవిష్కరణ చేయటమే కాక అభినవ్ మేక్ ఇన్ ఇండియా అవార్డ్ కూడా అందుకున్నాడు. అందుకే, మోదీ ప్రత్యేకంగా అభినందించారు! పోయిన సంవత్సరం ఎందరో గుడ్డివాళ్లకు మేలు చేసే ఆవిష్కరణ చేసిన అభినవ్ ఈ సంవత్సరం మాత్రం తానే గుడ్డివాడైపోయాడు. స్వార్థంతో కళ్లు మూసుకుపోయి ఏకంగా దొంగ నోట్లు అచ్చేసే స్థాయికి దిగజారాడు! అవును... మేకిన్ ఇన్ ఇండియా అవార్డ్ పొందిన అభినవ్ వర్మ ప్రస్తుతం వున్న కరెన్సీ కటకటను ఆసరా చేసుకుని రెండు వేల రూపాయల నోట్లు అచ్చేశాడు. అది కూడా మేకిన్ ఇండియా అనుకున్నాడో ఏమోగాని... ఈ ఘనుడు 42లక్షల దొంగ నోట్లతో ఖరీదైన ఆడి కార్లో తిరుగుతూ పంజాబ్ పోలీసులకి చిక్కాడు. అంతే కాదు, అతి తెలివిగా తమ కార్ కు పైన వీఐపీలకు వుండే ఎర్ర బుగ్గ కూడా పెట్టుకున్నారట అభినవ్ గ్యాంగ్!  అభినవ్ వర్మ అతి తెలివి దొంగ నోట్లు అచ్చేయటంతో పూర్తి కాలేదు! పాత 500, 1000 నోట్లను తీసుకుని తమ దొంగ నోట్లు చేతిలో పెట్టడమే కాక 30శాతం కమీషన్ కూడా మాట్లాడుకున్నారట నల్ల డబ్బున్న పార్టీల వద్ద! అంటే... మొత్తం నూటా ముప్పూ శాతం లాభమన్నమాట! ఇంత తెలివి దేశం బాగు కోసం వాడితే మోదీ మళ్లీ మళ్లీ అభినవ్ ని అభినందించే వారే!కాని, ఇప్పుడు అదే అభినవ్ అతడి టీమ్ చేసిన దిక్కుమాలిన పని వల్ల... వాళ్లందరి జీవితాలూ చెల్లని రెండు వేల నోట్లే అయ్యి కూర్చున్నాయి!   

సీఎం ఇల్లు సరే... పేదల డబుల్ బెడ్ రూమ్స్ మాటేంటి? 

  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయాక రెండిట్లోనూ భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో ప్రతిపక్షం ఎంతో కొంత బలంగా వుంది. కాని, తెలంగాణలో ప్రతిపక్షం ఆంధ్రాలో అంత ధీటుగా కనిపించటం లేదు. అందుకు మంచి ఉదాహరణ అసెంబ్లీ సమావేశాలే. నవ్యాంధ్రలో అసెంబ్లీ ఒక్కనాడూ గందరగోళం లేకుండా నడవటం లేదు. కాని, తెలంగాణ అసెంబ్లీ చాలా సార్లు కూల్ గా సాగిపోతోంది. ఇది మంచి విషయమే అయినా కేసీఆర్ ముందు ప్రతిపక్ష నేతలు తేలిపోతున్నారని కూడా అర్థం చేసుకోవాలి...  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు ఎదురు లేదు. ఇది ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఆయనకున్న రాజకీయ చాతుర్యంతో పాటూ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర కూడా జనంలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. కాని, అదే ఇప్పుడు కొంత మేర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ తనకు వీలైనంత మేర కేసీఆర్ మీద విరుచుపడుతున్నా జనంలోకి పెద్దగా వెళ్లటం లేదు. కాంగ్రెస్ విమర్శల్ని టీఆర్ఎస్ నేతలు, జనం ఇద్దరూ లైట్ గా తీసుకుంటున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి ఏం చేసినా, ఏం చేయకపోయినా గట్టిగా అడిగేవారు లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇటు అసెంబ్లీ లోపల, బయట రెండు చోట్లా అలాగే వుంది! కేసీఆర్ కు వ్యతిరేకంగా గళాలు లేవని కాదు. కాని, వాటికి పెద్దగా బలం వుండటం లేదన్నది సమస్య. తాజాగా సీఎం కోట్లు విలువ చేసే అధికార నివాసంలోకి మారారు. దీన్ని ఘాటుగా ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు ఎవ్వరూ లేరనే చెప్పాలి. ప్రెస్ మీట్లో నాలుగు డైలాగ్ లే తప్ప తీవ్రంగా స్పందించిన వారు మనకు కనిపించరు. పోనీ, సీఎం క్యాంప్ ఆఫీస్ సర్వాంగ సుందరంగా వుండటం తప్పు కాదని సరిపెట్టుకున్నా... పేదలకు ఇస్తామన్నా డబుల్ బెడ్ రూమ్ ల సంగతేంటని కూడా ఎవ్వరూ అడగలేకపోతున్నారు! ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లుకి మహా అయితే పది లక్షలు అవుతాయోమో! కాని, కేసీఆర్ కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించారు కాని పేదల ప్రగతి కోసం ఇళ్లు పూర్తి చేయలేదు. దీనికి అధికార పక్షం వద్ద ఏ సమాధానం వున్నా ముందసలు గద్దించి అడిగే ప్రతిపక్షమే కరువైంది... ఇంకా అక్కడక్కడా గుంతలతో పలకరిస్తోన్న వానకు కొట్టుకుపోయిన హైద్రాబాద్ రోడ్లు మొదలు ఆలస్యం అవుతోన్న మెట్రో వరకూ, డబుల్ బెడ్ రూం ఇళ్ల వరకూ, కూల్చేస్తామంటోన్న సచివాలయం వరకూ... దేన్ని ప్రశ్నించే వారు కనిపించటం లేదు తెలంగాణలో. ఇది అధికార పక్షానికి ఆనందం కావొచ్చేమోగాని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో కూడిన మొత్తం ప్రతిపక్షానికంత పెద్ద వైఫల్యం. ప్రజలకు తీవ్ర నష్టం. ఇక మీడియా కూడా టీఆర్ఎస్ అనుబంధ ఛానల్, పేపర్ కంటే భిన్నంగా , దైర్యంగా వ్యవహరించాల్సిన అవసరం వుంది. నూటికి నూరు శాతం అలా చేస్తున్నట్లుగా ప్రస్తుతం కనిపించటం లేదు. అయితే, సీఎంని విమర్శించటం అంటే జనం తరుఫున మాట్లాడటమే. వ్యక్తిగతంగా తిట్టిపోయటం కాదు. ఇది గమనిస్తే జనం కోసం మాట్లాడటానికి చాలా వుంటుంది...   

టీడీపీ, బీజేపిలకి... పవన్ 'రెడ్' సిగ్నల్ ?

పవన్ కళ్యాణ్ ... ఈ పేరుకి ఎంత క్రేజ్ వుందో అంతే అయోమయం కూడా తోడై వుంటూ వస్తోంది! మరీ ముఖ్యంగా, పొలిటికల్ గా పవర్ స్టార్ వ్యూహం ఏంటో ఇంత వరకూ ఎవరికీ అర్థమైనట్టు కనిపించదు! 2014లో  జనసేన అంటూ హడావిడి చేసిన ఆయన దాన్ని పక్కన పెట్టి టీడీపీ, బీజేపి సేనలో చేరిపోయారు. రాజు అవుతాడని అభిమానులు ఊహించుకుంటే మామూలు సైన్యాధిపతిలా చంద్రబాబు, మోదీలకు ఉపయోగపడ్డాడు. అయినా కూడా జనం పవన్ ప్రభావంతో ఒకింత ఎక్కువ ఓట్లే వేశారు ఎన్డీఏ కూటమికి. కాని, చంద్రబాబు సీఎం, మోదీ పీఎం అయ్యాక పవప్ క్రమంగా వారికి దూరమవుతూ వస్తున్నాడు. తాజాగా కమ్యూనిస్టులతో బేటీ అయ్యి తన భవిష్యత్ రూట్ ఏంటో సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు... తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులది వింత వ్యవహారం. వాళ్లు కలవని పార్టీ అంటూ లేదు. ఏపీ, తెలంగాణల్లో పెద్దగా బలం లేని బీజేపితో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు సీపీఎం, సీపీఐ  వాళ్లు! ఓ సారి టీడీపీతో, ఓ సారి కాంగ్రెస్ తో, ఓ సారి టీఆర్ఎస్ తో... ఇలా ప్రధాన పార్టీలన్నిటితో కలిసి పని చేశారు. వైసీపీతో కూడా వాళ్లకు బాగానే అవగాహన వున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే, ప్రతీ అయిదేళ్లకు పొత్తులు మార్చేయటంతో వాళ్లకు గత కొంత కాలంగా అసలుకే మోసం వచ్చింది. క్రమంగా తెలంగాణ, ఆంద్రప్రదేశుల్లో వాళ్ల ప్రభావం తగ్గిపోతోంది. ప్రస్తుత ఏపీ అసెంబ్లీలోనైతే  ఒక్క ఎర్ర కండువా ఎమ్మెల్యే కూడా లేడు. అదీ పరిస్థితి...  జనసేన పార్టీతో రాబోయే ఎన్నికల్లో కలకలం సృస్టిస్తాడని భావిస్తున్న పవన్... బలం తగ్గిపోయి అంపశయ్యని చేరిన కమ్యూనిస్టుల్ని ఎందుకు చేరదీస్తున్నాడు? తాజాగా ఆయన సీపీఐ నాయకులతో ఎందుకు భేటీ అయ్యారు? పైకి ప్రజా సమస్యలనీ రొటీన్ గా చెబుతోన్నా రానున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని పవన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది! అందుకు, క్యాడర్ వున్న కమ్యూనిస్టుల్ని పవర్ స్టార్ వాడుకోవాలనుకుంటాన్నారేమో! అటు ఎర్ర పార్టీల వారికి కూడా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీల కంటే సినిమా గ్లామర్ వుండే జనసేనే కాస్త బెటర్ అనిపించవచ్చు. తిరిగి కొన్నైనా సీట్లు పవన్ ఫాలోయింగ్ తో సంపాదించుకోవచ్చని వాళ్ల క్యాలికులేషన్ కావొచ్చు. అంతా అనుకున్నట్టు జరిగితే ఇద్దరికీ లాభమే...  పవన్ ఎప్పుడు సభ పెడతాడో, వేదిక మీద నుంచి ఏం మాట్లాడతాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఈ మధ్య. అటువంటి అనూహ్యమైన స్పందన కలిగిన పవన్ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు దిగుతాడా అంటే... ఇప్పుడే చెప్పటం కష్టం. ఎన్నికల టైంకి ఏదైనా కావొచ్చు. కాని, 2014లో పచ్చ, కాషాయ కండువాలు కప్పుకుని బరిలో నిల్చిన కళ్యాణ్ ఈ సారి ఎర్ర కండువా వేసుకుని నామినేషన్ వేస్తే మాత్రం వ్యవహారం రంజుగానే వుంటుంది. టీడీపీ, బీజేపి ఒక వైపు, వైసీపీ ఒక వైపు, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకున్న పవన్ ఒక వైపు వుండటంతో ఏపీలో త్రిముఖ పోటీ ఫుల్ గా రక్తి కడుతుంది!  

మోదీ బంగారు పుట్టలో వేలు పెట్టబోతున్నాడా?

నోట్ల రద్దు... 500, 1000 రూపాయల నోట్లు... కొత్త 2వేల నోటు... బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ... చిల్లర కష్టాలు! ఈ మాటలు విని విని కాస్త అలవాటు పడిపోయిన వారికి బంగారం అంటూ బాంబు లాంటి వార్త తీసుకొచ్చింది మీడియా! మోదీ బంగారంపై కన్నేశాడు. మోదీ సర్కార్ ఇకపై మీరు స్వేచ్ఛగా బంగారం కొనుక్కునే ఛాన్స్ లేకుండా చేసేస్తోంది! ఇంచుమించూ ఇలాంటి మీనింగ్ వచ్చేలా న్యూస్ వచ్చేసింది! ఇంతకీ నిజంగా మీ ఇంటిలోని, ఒంటిపైని బంగారంపై సర్జికల్ స్ట్రైక్స్ జరగనున్నాయా? కానే కాదు...    కేంద్ర ఆర్దిక శాఖ ఇచ్చిన క్లారిటీ ప్రకారం బంగారం కొనుగోలుపై ఎలాంటి అడ్డూ లేదు. కాకపోతే, మీరు ఎంత బంగారం కొన్నా ఆ బంగారం వైట్ మనీతోనే కొన్నారని ఆధారం చూపించాలి! అంటే మీరు బంగారం కొన్న డబ్బుకి ట్యాక్స్ కట్టారనుకోండి... ఇక బంగారంపై ఎలాంటి అంక్షలు వుండవు. అంతే కాదు, వివాహం అయిన స్త్రీలకు అరకిలో వరకూ బంగారం వున్నా ఎలాంటి లెక్కలూ అడగదు ప్రభుత్వం. పెళ్లి కాని మహిళలకు 250గ్రాముల దాకా నో కండీషన్స్. ఆ తరువాత ప్రతీ గ్రాముకు గవర్నమెంట్ కు లెక్క చెప్పాలి. అయితే, దీన్ని సాధారణంగా నల్ల డబ్బు లేని జనం తమ కష్టార్జితంతో చట్టబద్ధంగానే కొంటారు కాబట్టి వాళ్లకి నో టెన్షన్!   మగవారికి బంగారం వంద గ్రాముల వరకూ వుండ వచ్చు! అంటే పది తులాలన్నమాట. ప్రస్తుత ట్రెండ్ లో మగవాళ్లు అంతకంటే ఎక్కువ బంగారం సాధారణంగా వేసుకోరు. ఒకవేళ వేసుకోదలిస్తే కొన్న బంగారం ఏ ఆదాయంతో ఖరీదు చేశారో స్పష్టంగా చెప్పాలి. ఆ డబ్బు వైట్ మనీ అయితే మిమ్మల్ని అడ్డుకునే వారు ఎవ్వరూ వుండరు!    మొత్తం మీద ఆర్దిక శాఖ ఇప్పుడు కొత్తగా బంగారం మీద అంక్షలేమీ తీసుకురాలేదని చెబుతోంది. గతంలోనూ పన్ను చెల్లిచని డబ్బుతో భారీగా బంగారం కొని దాచేస్తే నేరమే. ఇప్పుడూ అలాగే పరిగణిస్తారు. అయితే, పెద్ద నోట్లు రద్దు తరువాత చాలా మంది తమ కరెన్సీని కనకంగా మార్చేశారు. వాళ్లకే ఇప్పుడు కొంప మునిగేది. ప్రభుత్వం అడిగినప్పుడు బంగారం ఎలా వచ్చిందో చెప్పగలిగే నిజాయితీ కలిగిన మధ్య తరగతి, పేద జనాలకి ఎలాంటి హానీ వుండబోదు! అదీ విషయం... 

ట్రంప్ అతి చేస్తే బ్యాన్ తప్పదంటున్న ట్విట్టర్!

ట్రంప్ ని అమెరికా ఓటర్లు ప్రెసిడెంట్ ని చేసేశారు. కాని, ఇప్పటికీ చాలా మందికి ట్రంప్ అంటే పడటం లేదు. అసలు ఆయన అమెరికా అధ్యక్షుడని అంగీకరించలేకపోతున్నారు. ఇండియాలో మోదీ లాంటి పొజీషనే ట్రంప్ కూడా ఫేస్ చేస్తున్నాడు. మీడియా, మేధావులు, ఇంకా చాలా వర్గాలు రకరకాల అనుమానాలతో ట్రంప్ ను చూస్తున్నాయి. మరీ విడ్డూరం ఏంటంటే... ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ సైట్ కూడా ట్రంప్ పై దురభిప్రాయంతోనే వున్నట్టు కనిపిస్తోంది! డొనాల్డ్ ట్రంప్ ఒక సాధారణ బిజినెస్ మ్యాన్ స్థాయి నుంచీ హిల్లరీ క్లింటన్ ను ఓడించి అమెరికా ప్రెసిడెంట్ అయ్యే స్థాయి దాకా ఎలా ఎదిగాడు? వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా! ఆయన బలమే కాంట్రవర్సీ. దాన్నే ఇప్పుడు ట్విట్టర్ సీరియస్ గా తీసుకుంటోంది. ఆయన అధ్యక్షుడు అయినా సరే ట్విట్టర్ లో అందరికీ వర్తించే రూల్సే ట్రంప్ కి వర్తిస్తాయని చెబుతోంది. ఆయన వివాదాస్పద ట్వీట్స్ చేస్తే అకౌంట్ బ్యాన్ చేయటానికి కూడా వెనుకాడమంటోంది. ట్విట్టర్ ప్రతినిధుల ఈ మాటలు మరీ అతిగానే వున్నాయనుకోవాలి. ఎందుకంటే, ట్రంప్ తాను ఏమి మాట్లాడాలనుకున్నా ఇప్పుడు ప్రపంచ మీడియా పనిగట్టుకుని వింటుంది. అలాంటప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి ట్విట్టర్ ఎందుకు ఎంచుకుంటాడు? ఒకవేళ ఎంచుకున్నా ఆయన అకౌంట్ ని కూడా సామాన్యుల అకౌంట్ లా భావించి బ్లాక్ చేస్తామనటం ... కొంచెం ఓవరే! అమెరికా ప్రెసిడెంట్ అకౌంట్ అంత ఆషామాషిగా రద్దు చేసేస్తారా? ఒకవైపు ట్విట్టర్ అమెరికా అధ్యక్షుడు అయినా మాకు స్పెషలేం కాదని బిల్డప్ ఇస్తుంటే... ఫేస్బుక్ మాత్రం కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ ఖాతాని స్పెషల్ గా చూస్తామని చెబుతోంది! ఆయన మాటకు, పోస్టుకు వుండే వాల్యూ దృష్ట్యా ప్రత్యేకంగా పరిగణిస్తామని అంటోంది. అంటే... ట్రంప్ ఏం రాసినా ఆయన ఖాతాపై చర్య తీసుకోమని చెప్పకనే చెబుతోందన్నమాట! భారతదేశంలో మోదీని, అమెరికాలో ట్రంప్ ని అత్యధిక శాతం మీడియా మొదట్నుంచీ వ్యతిరేకిస్తూనే వుంది. తాజాగా ట్విట్టర్ కూడా ట్రంప్ ను టార్గెట్ చేయటం కాస్త ఆశ్చర్యకరమే. సొషల్ మీడియా అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అటువంటిది ట్విట్టర్ ఏకంగా ట్రంప్ పోస్ట్ చేసే ట్వీట్సే ఇష్టానుసారం వుండకూడదని చెప్పటం... ఖచ్చితంగా భావ ప్రకటనకు భంగమే!   

జనగణమన అనగానే... రణగొణ ధ్వని మొదలెట్టారు!

ఒకప్పుడు థియేటర్స్ లో జాతీయ గీతం వినిపించే వారు తెలుసా? ఈ మాట అప్పుడప్పుడూ పెద్ద వాళ్లు చెబుతుంటే చాలా మందే విని వుంటారు. కాని, ఇప్పుడు మళ్లీ పాత రోజులు వచ్చేశాయి! థియేటర్స్ కి జనగణమన తిరిగొచ్చింది! సినిమాకి వెళ్లింది సరదాగానే అయినా ఎంటర్టైన్మెంట్ మొదలయ్యే ముందు మీరు సీరియస్ గా లేచి నిల్చోవాలి. జాతీయ గీతం వస్తున్నంత సేపూ బుద్దిగా వుండాలి. ఎదురుగా తెర మీద కనిపిస్తోన్న జాతీయ జెండాని గౌరవించాలి. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో తీసుకున్న నిర్ణయం కూడా కాదు. సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశం జారీ చేసింది....  సుప్రీమ్ కోర్టు ఇచ్చిన జాతీయ గీతం తీర్పు చాలా మందిని సంతోషపరిచింది. నిజంగా కూడా అందులో వ్యతిరేకించటానికి ఏముంది? మన దేశ జాతీయ గీతానికి మనం లేచి గౌరవం ఇవ్వకపోతే మరెవడు ఇస్తాడు? కాని, జాతీయ భావం బలపరిచేలా సుప్రీమ్ ఇచ్చిన జనగణమన తీర్పుపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు! అదేదో కోడిగుడ్డు మీద ఏవో పీకటం అంటారే... అలా వింత వింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు! సినిమా థియేటర్స్ లో జాతీయ గీతం కాన్సెప్ట్ నచ్చని వారు చెబుతోన్న అభ్యంతరాల్ని ఓ సారి చూద్దామా...  1. సినిమా హాల్స్ లో జాతీయ గీతం ప్లే చేస్తారు సరే. మరి అది వస్తున్నప్పుడు అందరూ లేచి నిల్చున్నారా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? పోలీసులు వుంటారా? పోలీసులు లేకపోతే సాటి జనంలో కొందరు ఆవేశపడి లేచి నిల్చోని వారిపై దాడి చేస్తే? అంతే కాదు, జనగణమన ఎవరన్నా గొంతుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వుండి పాడలేకపోతే... అప్పుడెలా? వాళ్లు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ వెంట తీసుకు రావాలా? .... ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు సో కాల్డ్ మేధావులు! 2. కొన్ని సినిమాలకి పెద్దలు ప్రత్యేకంగా పిల్లల్ని తీసుకు వస్తారు. అటువంటి చిన్న పిల్లల సినిమాల సమయంలో చిన్నారుల్ని సీట్స్ లో కూర్చోబెట్టడమే చాలా కష్టం. మరిక జాతీయ గీతం టైంలో వాళ్లు సైలెంట్ గా లేచి నిల్చొమ్మంటే నిల్చుంటారా? వాళ్లు వినకపోతే పెద్దలు వాళ్లని ఎలా కంట్రోల్ చేయాలి?.... ఇలాంటి 'చిన్న చిన్న' డౌట్సు బోలెడు వస్తున్నాయి! 3. ప్రస్తుతం సినిమా ప్రారంభానికి ముందు యాడ్స్ వస్తే జనం ఏం చేస్తారు? గబగబా వెళ్లి పాప్ కార్న్ తెచ్చుకోవటమో, ఫోన్ లో ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యి వాచింగ్ మూవీ అని స్టేటస్ పెట్టడమో చేస్తుంటారు. అలాంటి బీజీ పాట్రియాటిక్ ఇండియన్స్ జాతీయ గీతం వస్తే పట్టించుకుంటారా? .... ఇది కూడా కొందరు మేధావులు ఫేస్బుక్ లోనే వ్యక్తం చేస్తున్న వాల్యుబుల్ డౌట్! 4. ఇక కొందరైతే బీ గ్రేడ్ సినిమాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు! శృంగారం, బూతు కలగలిసి సాగే అలాంటి సినిమాల ప్రారంభంలో జాతీయ గీతం ఎలా వినిపిస్తారు అంటున్నారు?... ఇది జాతీయ గీతం పై వస్తోన్న అన్ని అనుమానాల్లో అత్యంత దిక్కుమాలిన అనుమానమనే చెప్పాలి! 5. ఇక సోషల్ మీడియా ఎలాగూ ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి చాలా మంది సినిమా హాల్స్ లో జనగణమనపై అప్పుడే కామెడీలు స్టార్ట్  చేసేశారట! ముందు ముందు పెళ్లిల్లు, బ్యాంక్ క్యూలు, స్విమ్మింగ్ పూల్స్ లాంటి వాటి వద్ద కూడా జాతీయ గీతం వినిపిస్తారా అంటూ వెటకారంగా ప్రశ్నిస్తున్నారట! ఇంతకీ, సినిమా హాల్స్ లో భారతదేశాన్ని కీర్తిస్తూ సాగే ఒక నేషనల్ యాంతమ్ కోసం మనం రెండు నిమిషాలు భరించలేమా? దాన్ని తప్పించుకోవటానికి ఇన్ని రకాల డౌట్స్ వ్యక్తం చేస్తూ మన మేధావితనం చూపించుకోవాలా? అస్సలు అవసరం లేదు! రెండున్నర గంటల సినిమాకి ముందు రెండున్నర నిమిషాల జాతీయ గీతం బరువేం కాదు. ఆనందకరమైన బాధ్యత. దాన్ని ఎవరైనా పట్టించుకోకుండా కాళ్లు చాపుకుని నిర్లక్ష్యంగా కూర్చుంటే ... పోలీసులు వచ్చి పట్టుకోకపోవచ్చు! కాని, ఖచ్చితంగా చుట్టూ వున్న బోలెడు మంది దేశభక్తుల్లో ఎవరో ఒకరు కాలర్ పట్టుకుని నిలదీస్తారు! ఇప్పుడు భారతీయుల్లో కావాల్సింది అలాంటి ఓ 'మోస్తరు' ఆవేశమే!        

పేరెంట్స్ ఇంట్లో పిల్లలుండాలంటే... 'పర్మిషన్' వుండాల్సిందేనట!

  రెంట్ కట్టకున్నా తమ ఇంట్లో వుండనిచ్చే ఉదార హృదయులు ఎవరు? పే'రెంట్స్'! ఇదేదో రైమింగ్ కోసమో, శ్లేష కోసమో చెబుతోన్న మాట కాదు! నిజంగానే పేరెంట్స్ రెంట్ తీసుకోరు కదా పిల్లల దగ్గర! అయినా అసలు ఇదేం చర్చ అని ముక్కున వేలేసుకుంటున్నారా? అయితే ఆగండి... ఈ విచిత్రమైన కేస్ సంగతి తెలుసుకుంటే మీకు అంతా అర్థమవుతుంది...  దేశ రాజధాని ఢిల్లీలో ఒక వృద్ధ దంపతుల జంట కోర్టు నాశ్రయించింది. వాళ్లు తమని హింసిస్తున్నారంటూ స్వంత పిల్లలపైనే కేసు వేశారు. అందుకే, తమ కొడుకులిద్దర్నీ తాము కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్ల లోంచి ఖాళీ చేయించాలని మొరపెట్టుకున్నారు. ఇది వినటానికే బాధగా వున్నా... నిజం! ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో శరణాలయాల్లో వదిలేస్తున్నారు. అటువంటి కాలంలో ఈ తల్లిదండ్రుల పిల్లలు మరింత ముదుర్లు. తాము కన్నవాళ్లని చూసుకోవటం కాకుండా... వారు కట్టుకున్న ఇళ్లలో తిష్టవేసి వార్నీ హింసించసాగారట! గత్యంతరం లేక కోర్టునాశ్రయించిన వృద్ధులు కొడుకుల్ని, కొడళ్లని బయటకు పంపాలని వేడుకున్నారట! వరుసగా కింది కోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా తల్లిదండ్రులకి అనుకూలంగా తీర్పునిచ్చాయి! వాళ్లు తమ కష్టంతో కట్టుకున్న ఇళ్లలో పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వుండరాదని తేల్చి చెప్పాయి. తల్లిదండ్రులు దయతలచి వుండనిస్తేనే మెజారిటీ నిండిన సంతానం వాళ్లతో పాటూ వుండాలి. అంతే కాని, పేరెంట్స్ ఇంట్లో రెంట్ పే చేయనక్కర్లేదన్నట్టు... ఫ్రీగా తిష్టవేసే హక్కు లేదని తేల్చి చెప్పింది హై కోర్టు! నిజానికి భారతదేశంలో ఇప్పటికీ పేరెంట్స్ పిల్లల్ని బయటకి వెళ్లగొట్టే దారుణమైన స్థితి రాలేదు. కాని, చాలా సార్లు పిల్లలు తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి పంపించేసి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. అలాంటి అమానుషత్వం నిండిన సంతానం పెరిగిపోతున్న సమయంలో ఈ తీర్పు నిజంగా అభినందనీయమే! వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తమ వారి నుంచి ప్రేమా, ఆప్యాయత పొందక పోయినా... కనీసం స్వంత ఇంట్లో ప్రశాంతంగానైనా కాలం వెళ్లదీస్తారు! అయితే, అసలు... తండ్రి మాట కోసం అడవులకు పోయిన రాముడు తిరిగిన మన భూమిలో... తల్లిదండ్రులు, పిల్లలకి మధ్య కోర్టులు రావటమే పెద్ద విషాదం!  

బీజేపి... ఎస్పీల్ని 'వర్గీకరించి' పాలించాలనుకుంటోందా? 

  దేశ వ్యాప్తంగా బలంగా తయారవుతోన్న బీజేపి తెలుగు రాష్ట్రాల్లో స్వంత బలం పుంజుకోవాలనుకుంటోందా? అందు కోసం కులం కార్డు చూపించబోతోందా? ఆంధ్రాలో టీడీపీతో వుంటూనే దాని ఓటు బ్యాంకు తనవైపు తిప్పుకునే ఆలోచనలో వుందా? జగన్ కు కూడా చెక్ పెట్టే వ్యూహాలు కమలనాథులు పన్నుతున్నారా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు తాజాగా జరిగిన ఒక్క పరిణామంతో వస్తున్నాయి! అదే... మంద కృష్ణ మాదిగ నిర్వహించిన ధర్మ యుద్ధం! ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు, ఇతర ఉప కులాలు చేస్తోన్న పోరాటం కొత్తది కాదు. రెండు దశాబ్దాలుగా నడుస్తూనే వుంది. అయితే, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అవసరం అయిన ఈ అంశం ఎప్పటికప్పుడు ఎన్నికల ఎజెండాలో భాగమైపోతోంది. అయినా రాష్ట్ర స్థాయిలో దాదాపూ అన్ని పార్టీలు దీన్ని వాడేసుకున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక వర్గీకరణ అటకెక్కించేస్తున్నాయి. అసెంబ్లీ స్థాయిలో కూడా ఎలాంటి ముందుడగూ వేయలేకపోతున్నాయి. ఇందుకు మూల కారణం మాలల్లో ఎదురయ్యే వ్యతిరేకత భయమే. వాళ్ల ఓట్లు కూడా పోకుండా చూసుకునే ప్రయత్నంలోనే వర్గీకరణ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగా మిగిలిపోతోంది.... ఎస్సీ వర్గీకరణను ఇప్పటి దాకా టచ్ చేయని బీజేపి కూడా ఈసారి రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారంలో వున్నారు కాబట్టి బీజేపి నేతలు మంద కృష్ణ మాదిగకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఎమ్మార్పీఎస్ నిర్వహించిన బహిరంగ సభకి వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా రావటం. అంతే కాదు, మంద కృష్ణ వెంకయ్యే మా ఆశ అని గట్టి భరోసా కూడా వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టే వెంకయ్య నాయుడు కూడా వర్గీకరణ తప్పక జరుగుతుందన్నట్టు ఫీలింగ్ కలిగించారు. ఇదంతా తెరపైన కనిపిస్తున్న వ్యవహారం. కాని, తెర వెనుక బీజేపి పెద్ద స్కెచ్చే వేసిందంటున్నారు విశ్లేషకులు...  2019 కల్లా ఇటు తెలంగాణ , అటు ఆంధ్రాల్లో బలమైన శక్తిగా ఎదగాలని అమిత్ షా ఆలోచన. తెలంగాణలో అయితే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. బలమైన ప్రతిపక్షం అంటూ ఒక్క పార్టీ కూడా లేదిక్కడ. వున్న కాంగ్రెస్ ధీటుగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవటం లేదు. అందుకే, బీజేపి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారే ఆలోచనలో వుంది. టీడీపీ వదిలిన ఖాళీని పూడ్చాలనుకుంటోంది. అందుకు మాదిగల్ని ఆకర్షించటమే చక్కగా వర్కవుట్ అవుతుందని కూడా భావిస్తోంది. తెలంగాణ ఎస్పీల్లో అత్యధికులు మాదిగలు కాబట్టి వారిని వర్గీకరణ బిల్లుతో తన ఓటర్లుగా మార్చుకుంటే బాగా బలపడవచ్చు కూడా....  ఆంధ్రాలోనూ ఎస్సీల్లో మాదిగల ఓట్లు కీలకం. అత్యధిక జనాభ వున్నది మాలలే అయినా అక్కడా అనేక మంది వర్గీకరణను కోరుకుంటున్నారు. వాళ్లందర్నీ బీజేపి తనవైపు తిప్పుకుంటే చాలా లాభం చేకూరినట్టే. పైగా ఆంధ్రాలో ఎస్పీ జనాభా పెద్ద ఎత్తున్న క్రైస్తవం ఫాలో అవుతుంటారు. వీళ్లు మామూలుగా అయితే బీజేపిని నమ్మే చాన్సెస్ అస్సలు వుండవు. కాని, ఈ వర్గీకరణ హామీ ద్వారా కమలం వాళ్లని తన ఖాతాలో వేసుకోవచ్చు. అదే జరిగితే జగన్ కు క్రిస్టియన్ ఓటర్లు భారీగా తగ్గే ప్రమాదం వుంది. అలాగే, ప్రస్తుతానికి బీజేపి మిత్రపక్షం అయిన టీడీపికి కూడా ఎంతో కొంత ఎస్సీ ఓట్ల నష్టం తప్పక పోవచ్చు. అంటే, మొత్తం మీద ఆంద్రాలోనూ ఎస్పీల ఓట్లతో బీజేపి బలమైన శక్తిగా మారుతుందన్నమాట...  వర్గీకరణ కేంద్రం పరిధిలోనిది కావటం, వర్గీకరణకు అనుకూలంగా ఏ మాత్రం చర్యలు తీసుకున్నా మాదిగలు ఓటు బ్యాంకుగా మారే అవకాశం వుండటం, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ల లాగా మాలల ఓట్లు పోతాయేమో అనే భయం లేకపోవటం బీజేపికి ఈ విషయంలో కలిసి వచ్చే అంశాలు. అందుకే, నోట్ల కటకటతో బహిరంగ సభలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా ఎమ్మార్పీఎస్ మీటింగ్ పెట్టడం, వెంకయ్య పాల్గొని హామి ఇవ్వటం జరిగాయంటున్నారు క్రిటిక్స్. ఇందులో నిజం ఎంత వుందోగాని... వర్కవుట్ అయితే బీజేపికి లాభం మాత్రం వుంటుంది...         

పది రూపాయల బిల్లుకి... తొంభై రూపాయల టిప్!

స్మృతీ ఇరానీ... మోదీ క్యాబినేట్ లో ఈమెకంటే పెద్ద కాంట్రవర్సియల్ మినిస్టర్ మరొకరు వుండరు! తన శాఖ ఏదైనా స్మృతి మీడియాలో మాత్రం వుంటారు. పాపం చాలా సార్లు అమె వద్దనుకున్నా వివాదాల్లో ఇరుక్కుంటూ వార్తల్లో కనిపిస్తూ, వినిపిస్తూనే వుంటారు. ఇప్పుడు మరోసారి అలానే జరిగింది. కాకపోతే, వివాదమేం కాదుగాని... కాస్త వెరైటీ కారణంతో వార్తల్లో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు!   స్మృతి ఇరానీ మోదీ వేసిన బాంబులా 2014 ఎన్నికల్లో పేలింది. ఆమె ఓడినా గెలిచినట్టే సంచలనం సృష్టించింది. అందుక్కారణం రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అతడికి ముచ్చెమటలు పట్టించటమే. దాదాపూ గెలిచినంత పని చేసింది స్మృతీ. అప్పట్నుంచీ కాంగ్రెస్ ఆమెను సీరియస్ గా తీసుకుని టార్గెట్ చేసింది. మీడియా కూడా స్మృతీకి వున్న యాక్టింగ్ హిస్టరీ కారణంగా పదే పదే వార్తలు రాస్తూ వచ్చింది. ఆమె హైద్రాబాద్ , ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థుల గొడవల్ని సరిగ్గా హ్యాండిల్ చేయటం లేదనటం దగ్గర నుంచీ ... ఆమె వ్యక్తిగతంగా జ్యోతిష్యుడి వద్దకి వెళ్లటం వరకూ అన్నీ వివాదాస్పదం అవుతూ వచ్చాయి. మోదీ క్యాబినేట్లో ఆమెలాగా దాడికి గురైన మరో మంత్రే లేరంటే ఆశ్చర్యం లేదు...    స్మృతీ ఇరానీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా న్యూస్ లో వుండటానికి కారణం ఆమె అనూహ్యమైన ప్రవర్తనే! ఇరానీ ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో ఎవ్వరికీ తెలియదు! పార్లమెంట్లో ఆమె భీభత్సమైన స్పీచ్ ఇస్తే మార్నాడు పేపర్లలో ఆమెని 'ఆంటీ నేషనల్' అన్నారు జర్నలిస్టులు. అలా అనటం తప్పా ఒప్పా పక్కన పెడితే ఆమెని మాత్రం ఇగ్నోర్ చేయలేని స్థితి పేపర్లు, ఛానల్స్ ది. తాజాగా స్మృతీ తమిళనాడుకి ఒక కార్యక్రమం కోసం వెళ్లింది. అయితే, ఆమె చెప్పులు అనుకోకుండా తెగిపోవటంతో రోడ్డున వున్న మోచీ వద్ద కాన్వాయ్ ఆపించిందట! తెగిన చెప్పు కుట్టించుకుని కుట్టిన వ్యక్తికి వంద నోటు ఇచ్చిందట! చిల్లర తీసుకోకుండా వుండనిమ్మని అక్కడ నుంచి బయలుదేరిందట! ఒక కేంద్ర మంత్రి ఇలా చెప్పులు కుట్టించుకోవటం... నిజంగా ఎవ్వరూ ఊహించలేని విషయమే కదా...   దేశమంతా నోట్ల కొరతతో టెన్షన్ లో వుండటం వల్ల స్మృతీ ఇరానీ చెప్పుల స్టోరీ పెద్దగా సెన్సేషన్ అవ్వటం లేదు కాని... మీడియాకి కాస్త ఖాళీ టైం ఎక్కువ వుండి వుంటే నానా రచ్చ అయ్యి వుండేదే! మంత్రిగారు రోడ్డు మీద చెప్పులు కుట్టించుకోవటం ఒట్టి డ్రామా అని స్మృతీ వ్యతిరేకులు ఏదేదో మాట్లాడేవారు. దానికి ఇరానీ తన ముక్కుసూటి సమాధానంతో మరింత ఘాటు యాడ్ చేసేది. ఇలా పేపర్లు, ఛానల్స్ లో కొన్ని రోజులు హడావిడి నడిచేది! మొత్తానికి స్మృతీ మరో అనవసర కాంట్రవర్సీ నుంచైతే బయటపడిపోయింది! 

ఢిల్లీకి 30... ముంబైకి 31!

ఢిల్లీ అనగానే మనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్, ఎంపీలు గర్తుకు వస్తారు. ఇంకా కొంచెం పొలిటికల్ యాక్టివ్ నెస్ వున్న వాళ్లకైతే అరవింద్ కేజ్రీవాల్ కూడా గుర్తుకు వస్తాడు. కాకపోతే, మనకు దేశ రాజధాని ఎప్పుడూ ఏదో ఒక నెగటివ్ రీజన్ తోనే చర్చకొస్తుంది. ఓ సారి నిర్భయ ఉదంతం గురించి నిరసనలు జరిగితే .... మరోసారి విపరీతమైన కాలుష్యం కారణంగా మీడియా ఢిల్లీని డిస్కస్ చేస్తుంది. కాని, ఇప్పుడు ఒక మంచి వార్త కూడా వచ్చింది హస్తిన గురించి! ఢిల్లీలో ఎప్పుడూ రాజకీయ రచ్చే వుంటుందని అంతా భావిస్తారు. కాని, అంతకంటే ఎక్కువ బిజినెస్ కూడా వుంటోంది ఈ మధ్య. అసలు ఒకప్పుడు దేశ ఆర్దిక రాజధాని ముంబై అనేవారు. ఇప్పుడూ అలానే అంటున్నారు. కాని, ఆల్రెడీ... ముంబైని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా దాటేసిందట. బిజినెస్ పరంగా కూడా మన రాజకీయాల నగరం బీట్ చేసేసిందట!ఈ విషయం చెబుతోన్నది ఎవరో చిన్నా చితక సర్వేలు చేసే సంస్థ కాదు. ప్రపంచ ప్రఖ్యాత ఆక్సఫర్డ్ ఎకనామిక్స్ వారు చెబుతున్నారు. ప్రపంచంలోని మొత్తం 50 అత్యుత్తమ ఆర్దిక శక్తి కలిగిన నగరాల్లో ఢిల్లీ 30వ స్థానంలో వుంది! స్వాతంత్ర్యానికి ముందు నుంచే వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ అయిన ముంబై మాత్రం 31వ స్థానంలో నిలిచింది. అంటే... ఢిల్లీ కంటే ఒక్క స్థానం వెనుకబడిపోయిందన్నమాట! ముంబై కంటే ఢిల్లీని ముందు వరసలో కూర్చోబెట్టడానికి కారణం ఆ నగర జీడీపినే! హస్తిన కోనుగోలు శక్తిలో 370బిలియన్ డాలర్ల జీడీపీతో వుండగా ముంబై 368బిలియన్ డాలర్ల జీడీపీతో వుంది. ఈ కాణంగానే ఒక్క ర్యాంక్ తక్కువగా వచ్చింది ముంబైకి! అయితే, ఎంత కాలుష్యం, ట్రాఫిక్, రోడ్డు మీద చెత్త లాంటి సమస్యలున్నా ఢిల్లీలో వ్యాపారం చేయడం ఈజీనట. అన్ని రకాల అనుమతులు ముంబై కంటే త్వరగా లభిస్తాయట! ఈ కారణంతోనే బీట్ చేయగలిగింది. కాకపోతే, ముందు ముందు మన విశ్వ నగరాలు మరింతగా అభివృద్ధి చెంది తమ వాల్డ్ ర్యాంకింగ్స్ మెరుగు పరుచుకుంటాయని భావిస్తున్నారు ఎక్స్ పర్ట్స్. 2030 నాటికి ఢిల్లీ 11వ స్థానంలో, ముంబై 14వ స్థానంలో వుంటాయని అంచనా వేస్తున్నారు!  ముంబైని బీట్ చేసినప్పటికీ మన రాజధాని నగరం ప్రపంచం అత్యుత్తమ నగరాల్లో ఒకటి వెలుగొందటం... మనందరికీ గర్వకారణం!  

సైకిల్ చక్రాలకి ... కమలం పంక్చర్లు చేస్తోందా?  

  ఒక్కసారి గెలిస్తే మళ్లీ 5ఏళ్ల వరకూ తమకు తిరుగుండదని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. స్వంత మెజార్టీతో గెలిస్తే అది నిజం కూడా! కాని, ఈ మధ్య మీడియా ఎక్కువయ్యాక ఆర్నెళ్లకి, సంవత్సరానికి ఎవరో ఒకరు సర్వేలు చేస్తూనే వున్నారు. జనం చెప్పారంటూ రకరకాల ఫలితాలు ముందుంచుతున్నారు. తాజాగా ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే అంటూ ఒక ఛానల్ సర్వే నిర్వహించింది... ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది...  ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే. ఈ ఇద్దరిలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఇదీ మెయిన్ క్వశ్చన్. దీనికి యాన్సర్ కనుక్కునే ప్రయత్నం చేసిన సదరు ఛానల్ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకే దాదాపు సగం మంది ఓటర్లు జైకొడతారని తేల్చేసింది! అటు ఇటుగా యాభై శాతానికి దగ్గరలో టీడీపీ, బీజేపి కూటమి ఓట్లు సంపాదిస్తుందని చెప్పింది. వైసీపీకి ఓట్ల శాతం గతం కంటే పడిపోతుందని కూడా సర్వే వెల్లడించింది.  ఏపీని రెండున్నరేళ్లుగా ఏలుతోన్న సైకిల్, కమలం జోడీ బాగానే వర్కవుట్ అవుతోన్నా... జనంలో మాత్రం ట్రెండ్ వేరుగా వుంది. తాజా సర్వే ప్రకారం, ఆంధ్రాలో టీడీపీ వల్ల బీజేపికి కలుగుతోన్న లాభం కంటే బీజేపి వల్ల టీడీపీకి అవుతోన్న నష్టం ఎక్కువున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, సర్వేలో జనం ఓన్లీ టీడీపికి 140సీట్లు ఇస్తామన్నారట! అదే కాషాయదళంతో కలిసి వస్తే పచ్చ పార్టీకి 120సీట్లు మాత్రమే జనం అందించే అవకాశం వుందట. ఇందుకు కారణాలు కూడా సర్వే చేసిన ఛానల్ విశ్లేషించింది. హోదా ఇవ్వనందుకు కేంద్రంలోని బీజేపిని జనం సీరియస్ గా తీసుకుంటున్నారట. అంతే కాదు, ఇచ్చిన ప్యాకేజ్ విషయంలో కూడా పెద్దగా స్పష్టత ఇవ్వనందుకు  ఆంధ్రులు బీజేపీనే టార్గెట్ చేసుకుంటున్నారట. ఇక తాజాగా జరిగిన నోట్ల రద్దు నిర్ణయం, తరువాత ఎదురవుతోన్న సమస్యలు... వీటికి కూడా జనం కమలదళాన్నే కారణంగా భావిస్తున్నారట. వీటన్నటి కారణంగా టీడీపీ బీజేపితో కలిసి వుండటం కంటే విడిపోవటమే బెటర్ అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి... టీవీల్లో వచ్చే సర్వేలు చూసి చంద్రబాబు, అమిత్ షా తమ నిర్ణయాలు తీసుకోరు కాని... మరో రెండున్నరేళ్లు టర్మ్ మిగిలి వుంది. ఇప్పటికిప్పుడు విడిపోతే కొత్తగా తెలుగు దేశం ఎమ్మెల్యేల్ని గెలిపించుకునే అవకాశం ఏం లేదు. అలాగే, స్వంత మెజార్టీతో ప్రధాని అయిన మోదీకి కూడా లాస్ లేదు. కాబట్టి ఏపీలోని టీడీపీ, బీజేపి పొత్తు క్రాష్ అయ్యే ఛాన్సెస్ కనిపించటం లేదు. అదీ కాక మొన్నటికి మొన్న చాలా సర్వేలు హిల్లరీ గెలుస్తుందంటే ట్రంప్ నెగ్గాడు. కాబట్టి సర్వేల్ని కూడా గుడ్డిగా నమ్మటానికి అస్సలు వీల్లేదు...   

మోదీ పోరాటం... బీజేపి ఎమ్మెల్యే వెటకారం!

పార్టీలు, కండువాలు, గుర్తులు, నినాదాలు వేరైనా... మన రాజకీయ నేతలందరూ ఒకే టైపు! మోదీ నల్లదనంపై యుద్ధం ఒకవైపు చేస్తోంటే ఆయన స్వంత పార్టీ ఎమ్మేల్యేనే ఇంకో వైపు నుంచి ఆపహాస్యం చే్స్తున్నాడు. బ్లాక్ మనీకి అసలు మూలం పొలిటీషన్సే అన్నది చక్కగా నిరూపించాడు! నోట్లు రద్దు చేసి నమో పెద్ద దుమారమే రేపారు. ఆయన పనికి మద్దతు, విమర్శలు రెండూ వస్తున్నాయి. కాని, అవన్నీ పక్కన పెడితే సామాన్య జనం మాత్రం ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు కాళ్లు వణికేలా క్యూలు కడుతున్నారు. అయినా కూడా చాలా మంది దేశం బాగుపడుతుందన్న నమ్మకంతో మోదీకి జైకొడుతున్నారు. కాని, అన్ని పార్టీల్లోని గాలి జనార్దన్ రెడ్డి లాంటి కోటీశ్వరులు మామూలు జనం ఇబ్బందుల్ని పుండు మీద కారం వేసి మండిస్తున్నారు. ప్రతీ వందకి వంద కష్టాలు కామన్ మ్యాన్ పడుతోంటే వీరు మాత్రం గ్రాండ్ గా పెళ్లిల్లు, పేరంటాలు కానిచ్చి ... తమకు తిరుగులేదని వెక్కిరిస్తున్నారు. త్వరలో కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కూడా ఒకరు తన కొడుకు పెళ్లి కోట్లు గుమ్మరించి చేయబోతున్నాడట! సామాన్యుడు నోరు వెళ్లబెడుతోన్నది... ఈ రాజకీయ డాన్లకి డబ్బులు ఎక్కడ్నుంచీ వస్తున్నాయనే! కర్ణాటక తరహాలోనే మహారాష్ట్రలోనూ ఒక పొలిటికల్ లీడర్ తన పైత్యం ప్రదర్శించారు. చేసిన ఘనకార్యం ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చెప్పి... మోదీ పరువు, బీజేపి ప్రతిష్ఠా రెండు మంటగలిపాడు. ఇంతకీ ముంబైలోని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రామ్ కదమ్ చేసిన పనేంటంటే... తన కొడుక్కి ఇంకా పద్దెనిమిదేళ్లు నిండక ముందే కోట్లు ఖరీదు చేసే బెంజ్ కార్ కొనిచ్చాడు. నోట్లకు కటకటలాడుతున్న ఈ సమయంలో ఆయనకు అంత డబ్బు ఎలా వచ్చిందన్నది ఒక ప్రశ్న అయితే ఇంకా మైనార్టీ తీరని అబ్బాయికి కార్ ఎందుకు? దాన్ని తీసుకుని ఆ పుత్ర రత్నం యాక్సిడెంట్లు చేస్తే ఎవరిది బాధ్యత? అధికార పక్ష ఎమ్మెల్యేని అడిగేవారెవరు?  ఎమ్మెల్యేగారు కొన్న బెంజ్ తెల్ల డబ్బుతోనే కొని వుండవచ్చు. అయినా కూడా చిన్న పిల్లోడికి కార్ ఏంటి? పైగా ఆ విషయాన్ని కొంచెమైనా ఆలోచన లేకుండా ట్విట్టర్ లో ప్రకటించటం ఏంటి? ఇవన్నీటికంటే ముందు కేంద్రంలోని తమ బీజేపి ప్రభుత్వం నిర్ణయం వల్లే జనం వంద నోటు కోసం రోడ్డున పడి వుంటే... పబ్లిగ్గా ఈ బెంజు కారు డ్రామా ఏంటి? మోదీ పెద్ద నోట్లతో పాటూ ఇలాంటి పెద్ద మనుషుల్ని కూడా పార్టీలకతీతంగా ఒక పట్టు పట్టాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది...     

మోదీ... బంగారంపై సర్జికల్ స్ట్రైక్స్ కు ప్లాన్ చేస్తున్నారా?

  నోట్ల రద్దు గురించి అక్కడక్కడా మాట్లాడుతూ మోదీ ఏమంటున్నారో జాగ్రత్తగా వింటున్నారా? ఇది అంతం కాదు ఆరంభమే అంటున్నారు! ఇంతకీ ఆయన ఉద్దేశం ఏంటి? నల్లదనం పై ఉక్కుపాదం మోపటానికి మోదీ గట్టి నిర్ణయంతో వున్నారు. అయితే, 500, 1000 నోట్ల బ్యాన్ కేవలం మొదటిది మాత్రమే. మరి తరువాత ఏం చేయనున్నారు? చాలానే వున్నాయి. స్విట్జర్లాండ్ దగ్గర నుంచి మనోళ్ల విదేశీ ఖాతాల్లోని నల్లధనం లెక్కలు తెప్పించటం, ఇన్ కమ్ ట్యాక్స్ ఎత్తేయటం ... ఇలాంటి బోలెడు ఆశ్చర్యకరమైన, సాహసోసేతమైన నిర్ణయాలు వుంటాయట! అయితే, ఇవేవీ ఇప్పుడే పక్కగా చెప్పటం లేదు. కాని, మిడిల్ క్లాస్ వాళ్లకి, ముఖ్యంగా మహిళలకి గుండెలో బాంబులా పేలే ఒక ఆలోచన మాత్రం మోదీ చేస్తున్నారట...  భారతీయ మహిళలు అనగానే ఠక్కున బంగారం కూడా గుర్తొచ్చేస్తుంది! అంతగా బంగారాన్ని ప్రేమిస్తారు మన లేడీస్. కాబట్టే దేశంలో ప్రతీ ఇంట్లో ఎంతో కొంత బంగారం భద్రంగా వుంటూనే వస్తోంది తరతరాలుగా! ఇప్పుడు ఆ గోల్డ్ మీద కన్నేసిందట కేంద్ర ప్రభుత్వం! ఎలాగైతే లెక్కా పత్రం లేకుండా డబ్బు ఇంట్లో దాచేస్తే నేరమవుతుందో... ఇక మీద అలానే బంగారం దాచినా క్రైం అవ్వొచ్చంటున్నారు ఢిల్లీ జనం. ప్రస్తుతానికి ఈ వార్తలపై పెద్దగా క్లారిటీ లేకున్నా త్వరలో ఏ క్షణంలో అయినా బంగారం బాంబు పేలవచ్చంటున్నారు! నోట్లు రద్దు చేసి నల్లధనం వెలికి తీద్దామని మోదీ ప్రయత్నిస్తే కొందరు బ్లాక్ బాబులు తెలివిగా బంగారం కొనేశారట. పాత 500, 1000 నోట్లు పెట్టి కిలోల కొద్దీ బంగారం కొన్న సదరు గోల్లెన్ రాజాలు మరోసారి సేఫ్ అయ్యారు. కాని, వాళ్లను ఎలాగైన పట్టుకోవాలని పట్టుదలతో వున్న మోదీ మొన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో బంగారంపై అంక్షల గురించి చర్చించారంటున్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ తమ వద్ద వున్న బంగారం పై స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చేలా రూల్స్ తేవాలని భావించారట. ఇది ఇప్పటికిప్పుడు జరిగే ఛాన్స్ లేకున్నా ముందు ముందు ఐటీ రిటర్న్స్ లా బంగారం గురించి కూడా ప్రభుత్వానికి చెప్పేయాలన్నమాట. అప్పుడు ఒక్కొక్కరు ఇంకా ఎంత బంగారం కొనవచ్చు అన్నది కేంద్రం నిర్ణయిస్తుంది. సో... భవిష్యత్ లో మనం బంగారం కొనాలంటే ప్రభుత్వం విధించిన లిమిట్ కి లోబడే ఖరీదు చేయాలన్నమాట. అంతకన్నా ఎక్కువ చేస్తే... బ్లాక్ మనీలాగే బ్లాక్ బంగారం అయిపోతుంది! అది చట్ట విరుద్ధం...  దేశంలోని మహిళలందరూ ఇబ్బంది పడేలా బంగారం కొనుగోళ్లపై మోదీ సర్కార్ లిమిట్ విధిస్తుందా? అలా చేసి వారి ఆగ్రహానికి గురవ్వటానికి సిద్ధపడుతుందా? ఇప్పటికైతే అలాంటి పెను సాహసం ఏం చేయబోవటం లేదని కేంద్ర ఆర్దిక శాఖ క్లియర్ గా చెప్పేసింది. కాని, భవిష్యత్ లో జరగదని గ్యారేంటి ఏం లేదు. ఎందుకంటే, బంగారం కొనుగోళ్ల నియంత్రణ వల్లే దేశ ఆర్దిక వ్యవస్థకి చాలా మేలు జరిగే అవకాశం వుంది. అందరికందరూ తులాల కొద్దీ బంగారం కొని డబ్బులు బ్లాక్ చేసి లాకర్లలో బందిస్తే.... మార్కెట్ లో తగినంత ఫండ్స్ వుండవు. అంతే కాదు బంగారం మీదే రూపాయి విలువ కూడా ఆధారపడి వుంటుంది. ఇలాంటి ఎన్నో లాభాల కారణంగా మోదీ బంగారం బాంబు కూడా పేల్చే అవకాశం లేకపోలేదు!   

నోట్ల రద్దు సీక్రెట్ ఢిల్లీలో లీకైతే... బళ్లారిలో బాజా మోగిందా?

  పెద్ద నోట్లు రద్దు చేశారు సరే... మరి వాటి స్థానంలో కొత్త నోట్లు ఎలా వస్తాయి? వెనక్కి వెళ్లేవి 500, 1000నోట్లైతే కొత్తగా అచ్చేసినవి 2వేలు! ఇదేం లాజిక్? సరే... 2వేల నోటుతో మరింత బ్లాక్ మనీ పోగేసే ఛాన్స్ వుందన్న వాదనలు పక్కన పెడదాం... అసలు కొత్తగా వచ్చిన పింక్ నోటుకి చిల్లర ఇచ్చేదేవరు? దేశంలో ఎన్ని వంద నోట్లు వున్నాయి? అవ్వి ఎంత మందికి సరిపోతాయి? ఇలాంటి ప్రశ్నలకి కూడా సమాధానం లేదు! దేశ ఆర్దిక వ్యవస్థని మొత్తాన్నీ రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల వరకూ ప్రభావితం చేసే ఒక భారీ నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు... కనీసం కొత్త నోట్లు ఏటీఎం మిషన్లలో సరిపోతాయా లేదా అని కూడా ఆలోచించకోలేదా? 2వేల సైజు సరిగ్గా లేదు, 500ల ప్రింటింగ్ అంతకన్నా అద్వాన్నంగా వుంది... ఇంత గందరగోళ స్థితికి కారణం ఎవరు? మోదీయేనా? ఆయనే అయితే... ఆయన  తొందరపాటు నిర్ణయానికి కారణం ఎవరు? డీమానిటైజేషన్ ... వున్న నాలికకు మందేస్తే కొండనాలికకు ఏమో అయిందన్నట్టు కావటానికి.... అసలు కారణం ఎవరు?      కొన్ని వార్తలు గాసిప్పో, లేక నిజాలో అర్థం కాకుండా వుంటాయి. అలాంటిదే ఈ న్యూస్ కూడా! మోదీ మంత్రి వర్గంలో అత్యంత సమర్థవంతురాలిగా పేరు తెచ్చుకున్న ఒక సీనియర్ మంత్రిగారు నోట్ల రద్దు నిర్ణయం జరగక ముందే సంగతంతా లీక్ చేసేశారంటున్నారు కొందరు పొలిటికల్ జీవులు. ఆమెకు దేశ గతినే మార్చేసే టాప్ సీక్రెట్ ఎలా తెలిసిందో ఎవ్వరికీ తెలియదు కాని .... సదరు మేడమ్ వారు మాత్రం దక్షిణాదిలోని తన దత్త పుత్రుడికి విషయం చేరవేసేశారట! వెంటనే ఆ బళ్లారి బాబుగారూ తన పాత 500, 1000నోట్లు కూతురి పెళ్లి పేరు చెప్పి మార్కెట్లోకి ఫ్లష్ చేసేశాడట! డిజిటల్ ఆహ్వానాలు పలికి మోదీ డిజిటల్ ఇండియా కలనైతే బాగానే సాకారం చేశాడు కాని... ఆయన నల్లధనం పై చేస్తున్న పోరుకు మాత్రం మన ఇనుప రాజావారు చాలానే చిలుము పట్టించారు! ఆయన వందల కోట్ల ఘనమైన పెళ్లిని అడ్డు పెట్టుకుని విపక్షాలు పార్లమెంట్లో కూడా నానా రచ్చ చేసేశాయి. ఇంతకీ దీనికంతటికీ కారణం ఎవరు? ప్రచారం అవుతోన్న గాసిప్సే నిజమైతే... చిన్మమ్మగారే మూల కారణం! తన క్యాబినేట్లోని మంత్రికే సీక్రెట్ తెలిసిపోతే, ఆమె దాన్ని తన వారికి చేరవేస్తుంటే.... అది ప్రధాని అయిన మోదీకి తెలియదా? ఈ డౌట్ ఎవరికైనా రావటం సహజమే! కనీసం ఆర్దిక మంత్రికి కూడా చెప్పలేదని అంటోన్న నోట్ల రద్దు నిర్ణయం మరేదో శాఖ నిర్వహిస్తోన్న ఆమెకు తెలిసిందని నమోకి కూడా తెలిసింది. కాని, కాస్త లేట్ గా! అదే ఇప్పుడు జరుగుతోన్న గందరగోళానికి కారణమంటున్నారు! ఆమె తన దత్తపుత్రుడికి లీకిచ్చేసిందని గ్రహించిన నరేంద్ర మోదీ అమాంతం అలెర్ట్ అయ్యారట. దేశంలోని భారీ నల్ల మారాజులందరూ ఒక్కొక్కరుగా జాగ్రత్తపడిపోయి వేల కోట్లు వైట్ చేసుకోక ముందే నోట్లు రద్దు ప్రకటన చేయాలని ... నవంబర్ 8న మోదీ బాంబు పేల్చేశారు. దీని వల్లే ఆర్బీఐ టీమ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేసుకునే ఛాన్స్ దక్కలేదంటున్నారు కొందరు. అదే ఇప్పుడు చిల్లర కష్టాలకు, పేదలు చితికిపోయేటంతటి నష్టాలకు కారణమైందంటున్నారు.  సాధారణంగా ఆర్బీఐలో అత్యంత తెలివైన , సీనియర్ బ్యూరోక్రాట్స్ వుంటారు. వారు కనీసం కొత్త నోట్లు ఏటీఎంలలో సరిగ్గా దూరతాయా? బయటకు వస్తాయా? అని కూడా ఆలోచించుకోకుండా నోట్ల రద్దుకు సై అంటారా? ఛాన్సే లేదు. అలాగే, వంద నోట్లు మరీ తక్కువగా వున్నాయన్న సంగతి ఆర్బీఐ గవర్నర్ తో సహా అందరికీ తెలియదా? పెద్ద నోట్లు రద్దైతే జనం డబ్బులకి కటకటలాడిపోతారని వారు మోదీకి చెప్పలేదంటారా? చెప్పే వుంటారు! ఎందుకంటే, జనానికి కేవలం రెండు రోజుల్లో కొత్త నోట్లు అందించేయవచ్చు అని అబద్ధం చెప్పటం వల్ల ఆర్బీఐ ఆపీసర్స్ కి వచ్చే లాభం ఏమీ వుండదు. పైగా అది చాలా పెద్ద రిస్క్ ! కాబట్టి వాళ్లు మోదీని తప్పుదారి పట్టించి వుండకపోవచ్చు. ఇక మిగిలిందల్లా క్యాబినేట్ లోని మేడమ్ గారి నిర్వాకమే! ఆమె ఇచ్చిన లీక్ మోదీని షేక్ చేసి వుంటుంది. ఆ షేక్ లో ఆయన వీక్ డిసీషన్ చేసి వుంటారు. అదే ఇప్పుడు సామాన్యుడ్ని బ్యాంకులు, ఏటీఎంల ముందు రోడ్డున పడేసింది! రాబోయే కొన్ని నెలల పాటూ భారతదేశం టైపాయిడ్ వచ్చి తగ్గిన పేషంట్ లా డీలాగా ముందుకు సాగాల్సిందే...    

పచ్చ నోట్ల ప్రయోగంతో... పిచ్చెక్కిన దేశాలివ్వే!

  నవంబర్ 8 నుంచీ ఇవాళ్టికి... మూడు వారాలు గడిచిపోయాయి! అయినా కరెన్సీ కటకట అలానే వుంటోంది! కొందరు ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు క్యూలలో నిలబడే వారి కష్టాల గురించి చెబుతోంటే... మరి కొందరు బయటకి రాబోయే నల్లదనం గురించి , బాగుపడబోయే దేశం గురించి చెబుతున్నారు! మొత్తానికి దేశం అంతా మోదీ అనుకూలం, వ్యతిరేకం అన్నట్టు విడిపోయింది! కాని, అసలు ఇలా పెద్ద ఎత్తున పెద్ద నోట్లు రద్దు చేసిన దేశాలు ఇంకా ఏవైనా వున్నాయా? అక్కడ ఏం జరిగింది? రండి... తెలుసుకుందాం...  ఇంతకు ముందు మన దేశంలోనే రెండు సార్లు భారీ ఎత్తున నోట్ల రద్దు జరిగింది. ఒక సారి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో అయితే మరో సారి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నప్పుడు. అయితే, ఈ మధ్య కాలంలో కూడా అనేక దేశాలు డీమానిటైజేషన్ ను ప్రయోగించాయి. లాభాలు, నష్టాలు పక్కన పెడితే నోట్లు రద్దైన ప్రతీ దేశంలోనూ ఒక అలజడి మాత్రం తప్పక చోటు చేసుకుంది. అలా ఒక కుదుపుకు లోనైన ఆఫ్రికన్ కంట్రీ ... నైజీరియా! 1984లో నైజీరియా కరెన్సీనంతా రద్దు చేసేసింది. అయితే, జనం ఈ మార్పుని పాజిటివ్ గా తీసుకోలేదు. అప్పటికే తీవ్రమైన అప్పులు, ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ఆ దేశం అంతంత మాత్రంగానే బండి నెట్టుకొస్తోంది...  ఆఫ్రికాలోనే మరో దేశమైన గనా కూడా నోట్ల రద్దు ట్రై చేసింది. అయితే, కేవలం 50 సిడీస్ విలువ గల పెద్ద నోటును మాత్రమే రద్దు చేసింది. 1982లో చేసిన ఈ పనితో ట్యాక్స్ ఎగొట్టేవారు తగ్గుతారని భావించారు. కాని, గనా ప్రజలు మరింతగా బ్లాక్ మార్కెట్ ను ఎంకరేజ్ చేసి కొంపలు ముంచారు. ప్రభుత్వ ప్రయత్నం వృథా అయిపోయింది...  మన దేశంలో వందల కోట్ల దొంగ డబ్బుకి కారణం పాకిస్తాన్. కాని, అదే పాకిస్తాన్ రానున్న డిసెంబర్లో తన పాత నోట్లను మార్చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రకటన... సంవత్సరమున్నర ముందే వెలువరించింది. అందుకే, నింపాదిగా బ్యాకులకి వెళ్లి తమ నోట్లు మార్చుకుంటున్నారు పాకిస్తానీలు! కాని, ఇలా చేస్తే నోట్లపై డిజైన్ మారటం తప్ప జనం వద్ద నుంచి బ్లాక్ మనీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదు. తీసుకు రావాలన్న ఉద్దేశ్యం అక్కడి పాలకులకు వున్నట్టు కూడా లేదు! కరెన్సీ నోట్ల విషయంలో అన్ని రకాల కలగాపులగాలకీ లోనైన దేశం జింబాబ్వే. రాబర్ట్ ముగాబే అనే నియంత పాలనలో దశాబ్దాలు మగ్గిన ఆ దేశం ఒక దశలో తీవ్రమైన ద్రవ్యోల్బణం ఎదుర్కొంది! ఎంతగా అంటే జింబాబ్వే డాలర్ కి అసలు విలువే లేకుండా పోయింది! ఒక ట్రిలియన్ జింబాబ్వే డాలర్ నోటు కూడా అచ్చేశారు! ఏం చేసినా జింబాబ్వే నోట్లకి విలువ రాకపోవటంతో ఆ దేశం కొత్త నోట్లు అచ్చేయటమే మానేసింది. ఇప్పుడు అమెరికన్ డాలర్లనే ఆ దేశంలో అధికారికంగా ఉపయోగిస్తున్నారు!  నియంత చేతుల్లో వున్న మరో దేశం ఉత్తర కొరియా. ఈ దేశంలో 2010లో నోట్లు రద్దు చేశారు. బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి కిమ్ జాంగ్ II అంతకు ముందు వున్న నోట్ల విలువలో రెండు సున్నాలు తగ్గించేశాడు. అంత విలువ తగ్గిపోయే సరికి ఆ నోట్లు దేనికీ పనికి రాక సామాన్యులు రోడ్డున పడాల్సి వచ్చింది. ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఒకప్పటి సోవియట్ రష్యాలో కూడా నోట్ల రద్దు ప్రయత్నం జరిగింది. గోర్బచేవ్ తన హయాంలో బ్లాక్ మార్కెట్ ను తుడిచి పెట్టేయటానికి నోట్లు రద్దు చేశాడు. కాని, కరెన్సీ రద్దవ్వటం వల్ల జనంలో పుట్టిన కోపం మొత్తానికే కొంప ముంచింది! మెల్ల మెల్లగా వేడి రాజుకుని సోవియట్ ముక్కలైపోయింది! ఆస్ట్రేలియా నోట్ల రద్దు కాకుండా నోట్ల మార్పిడి చేసింది. అంటే అప్పటిదాకా పేపర్ నోట్స్ వుంటే ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టింది. పాలిమర్ అనే పదార్థంతో తయారు చేసిన కొత్త నోట్లు పాత వాటికి బదులు చెలామణిలోకి వచ్చాయి. దీని వల్ల ఆ దేశ ఆర్దిక వ్యవస్థకి ఎలాంటి మంచి, చెడూ రెండూ జరగలేదు... 1987లో మయన్మార్ దేశం కూడా నోట్ల విలువ తగ్గించటం ద్వారా బ్లాక్ మార్కెట్ ను అరికట్టే ప్రయత్నం చేసింది. అక్కడి మిలటరీ పాలకులు అమాంతం 80శాతం విలువ తగ్గించేశారు. జనం ఆగ్రహంతో రోడ్ల మీదకు వచ్చారు. దారుణంగా వార్ని అణిచి వేయటంతో భీకర హింస చోటు చేసుకుంది!