ఆర్మీతో ఆటలాడుతున్న రాజకీయ నేతలు!
posted on Dec 19, 2016 @ 1:37PM
మన పక్కనే వున్న పాకిస్తాన్ ఎప్పుడూ సైనిక పాలనలోనే మగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం వున్నా అది ఎంత బలహీనంగా వుంటుందో అందరికీ తెలిసిందే. అసలు పాకిస్తాన్ డెమోక్రసీ ఫెయిల్ కావటానికి కారణం ఏంటి? అక్కడి మిలటరీ ప్రజా ప్రభుత్వాల పట్టులో వుండకపోవటమే! అక్కడ సైన్యాధిపతి ప్రధానిని, రాజకీయ నేతల్ని అందర్నీ శాసిస్తాడు. కాని, ఇండియాలో అందుకు విరుద్ధంగా వుంటుంది వ్యవస్థ. అదే మన 70ఏళ్ల సక్సెస్ కి కారణం. కాని, ఈ మధ్య ఆర్మీని కూడా అడుసులోకి లాగుతున్నారు మన రాజకీయ నేతలు. తమ పాలిటిక్స్ కోసం సైనిక వ్యవస్థని టార్గెట్ చేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జాతికే ద్రోహం చేస్తున్నారు.
మన దేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, జుడీషియరీ, ఈసీ, ఇస్రో.... ఇలాంటి కొన్ని వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తుంటాయి. వాటిలో కూడా లోపాలు వున్నా మొత్తం మీద చక్కటి ఫలితాలు రాబడుతుంటాయి. మరీ ముఖ్యంగా, దేశ భద్రతకు కారణమైన త్రివిధ దళాలు ఢిల్లీలో ఏ ప్రభుత్వం వున్నా తమ పని తాము చేసుకుపోతుంటాయి. అతి తక్కువ రాజకీయ జోక్యంతో కొనసాగుతుంటాయి. కాని రాను రాను మన నేతల పొలిటికల్ బ్రెయిన్స్ కి ఇవ్వి కూడా మినహాయింపు కాకుండా పోతున్నాయి. అందుకు తాజాగా జరిగిన ఆర్మీ చీఫ్ ఎన్నికే తార్కాణం!
సైన్యాన్ని నడిపించే ఆర్మీ చీఫ్ ఎన్నిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కాని, ఇప్పుడు ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ తాను అధికారంలో వుండగా ఎన్నో సార్లు ఆర్మీకి చీఫ్ కమాండర్ ని నియమించింది. తీరా జనం మద్దతు ఎన్నికైన మోదీ మాత్రం అదే పని చే్స్తే రాజకీయ విమర్శలకి దిగుతోంది. ఆర్మీ బాస్ గా బిపిన్ రావత్ నియమకం పై హస్తం పార్టీ అనవసర గోల చేస్తోంది. ఆ పార్టీ వాదన ప్రకారం బిపిన్ కంటే ఇద్దరు సీనియర్లు వరుసలో వున్నారు. వాళ్లని కాదని మోదీ బిపిన్ కి ఎలా సారథ్యం అప్పగిస్తాడని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గతంలో ఎప్పుడూ సీనియారిటీని పక్కన పెట్టి సత్తాకి పట్టం కట్టకపోతే కాంగ్రెస్ ఇలా మాట్లాడవచ్చు. కాని, ఇందిరా గాంధీ హయాంలో రెండు సార్లు ఇలాంటి పరిణామమే జరిగింది. అప్పటి సీనియర్లని కాదని ఇందిర తనకు నమ్మకం ఏర్పడ్డ వ్యక్తిని ఆర్మీ చీఫ్ గా అపాయింట్ చేశారు. 2014లో నేవీ చీఫ్ విషయంలో సోనియా కూడా అదే పని చేశారు. మన్మోహన్ ప్రభుత్వం సీనియర్ ని కాదని తరువాతి స్థాయిలో వ్యక్తినే నేవీ చీఫ్ గా అపాయింట్ చేశారు. కాని, ఇప్పుడు మోదీ అదే బాటలో నడిస్తే మాత్రం ఆరోపణలు దిగుతున్నారు కాంగ్రెస్ వారు. మరీ దారుణంగా మొదటి సారి పీఎం హరీజ్ అనే ముస్లిమ్ ను ఆర్మీ చీఫ్ గా ఎన్నిక చేసే అవకాశం వస్తే ... మోదీ దాన్ని కాలరాశారని మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజానికి పీఎం హరీజ్ నే కాదు ప్రవీణ్ భక్షీ అనే హిందువుని కూడా మోదీ గవర్నమెంట్ పక్కన పెట్టింది. పాకిస్తాన్ తో విషమ పరిస్థితులు నెలకొన్న సమయంలో ముందు ముందు జరిగే పరిణామాలకి అనుగుణంగా బిపిన్ రావత్ ను ఎంపిక చేసింది. దీంట్లోంచి రాజకీయ లబ్ది పొందాలని చూడటం ప్రతిపక్షాలకి తగదు.
నోట్ల రద్దుపై నానా యాగీ చేసిన మమత కూడా కోల్ కతా లో ఆర్మీ కదలికల్ని అడ్డుకుని విపరీతంగా ప్రవర్తించారు. మన దేశంలో మన సైనికులు తనిఖీలు చేపట్టడానికి కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఆర్మీని కూడా ఆమె తన రాజ్యంలో కాలు ఎలా పెట్టారని ప్రశ్నించారు? ఇలాంటి చర్యలు ఆర్మీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు తాత్కాలిక లాభాల్ని పక్కన పెట్టి ఆర్మీ లాంటి వ్యవస్థలని అన్న తమ విమర్శలకు అతీతంగా వుంచితే చాలా మంచిది. అది యావత్ దేశానికి మేలు చేస్తుంది...