ఇండియన్ క్రికెటరంటే పిచ్చి అభిమానమంటోన్న పాక్ ప్లేయర్!
posted on Jul 4, 2017 @ 3:48PM
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు… క్రికెట్టందు పురుషుల క్రికెట్ వేరయా! ఆడవాళ్ల క్రికెట్ కూడా వున్నా… మనం పెద్దగా పట్టించుకోం. అయితే, ఈ మధ్య మహిళా క్రికెట్ కూడా అడపాదడపా వార్తల్లోకి వస్తోంది. ప్రస్తుతం నడుస్తోన్న వుమన్ వాల్డ్ కప్ లో మిథాలీ సేన పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. 95పరుగుల తేడాతో మన బద్ధ శత్రువుని ఓటమి పాలుజేసింది. అయితే, మొన్నీ మధ్యే గొప్పగా చెప్పుకునే మన ఇండియన్ క్రికెట్ టీం పాక్ ముందు తల వంచక తప్పలేదు. కోహ్లీ సేన మరీ దారుణంగా కనీసం పోరాట పటిమ కూడా చూపకుండా ఓడిపోయింది. ఓటమి కన్నా క్రికెట్ లవ్వర్స్ కి ఇదే బాగా బాధ కలిగించింది. పాక్ బౌలర్ల ముందు గల్లీ క్రికెటర్లలా విలవిల లాడిపోయారు మన ఆటగాళ్లు. కాని, ఇండియన్ వుమన్ పాక్ దుమ్ము దులిపారు! ఇప్పటి వరకూ పాకిస్తాన్ టీమ్ మన ఇండియన్ వుమన్ క్రికెట్ టీమ్ పై ఒక్కసారి కూడా గలవలేదంటే మనోళ్ల సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు!
మామూలుగా మనం అస్సలు పట్టించుకోని మహిళా క్రికెటర్స్ పాకిస్తాన్ పై విజయంతో కాస్త దృష్టిని ఆకర్షించారు. అయితే, మన అమ్మాయిల్ని మనం ఎంకరేజ్ చేయాల్సింది మాత్రం చాలా వుంది. కోహ్లి సేనతో సమానంగా మిథాలీ సేనను కూడా ప్రొత్సాహించాలి. ఎందుకంటే తాజాగా ఓ అభిమాని మన ఇండియన్ వుమన్ టీమ్ లో ఒక ఆలౌరండర్ ని ఆకాశానికి ఎత్తేసింది! ఆమెవరో ఇండియనో క్రికెట్ లవ్వర్ అయితే ఇంతగా చెప్పుకోవాల్సింది ఏం లేదు! ఆమె ఓ పాకిస్తానీ! అంతే కాదు, పాకిస్తాన్ టీమ్ తరుఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఫాస్ట్ బౌలర్!
ఒక ఇండియన్ క్రికెటర్ నాకు ఇష్టం అని పాకిస్తానీ ప్లేయర్ చెప్పాలంటే ఎంత గట్స్ కావాలి? అలాంటి సాహసం పాకిస్తానీ మగ క్రికెటర్లు చచ్చినా చేయరు! ఎందుకంటే, పబ్లిక్ గా నాకు ఫలానా ఇండియన్ క్రికెటర్ అంటే అభిమానం అని చెబితే… చచ్చిపోతారు కాబట్టి! కాని, పాకిస్తానీ వుమన్ క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ అదే పని చేసి చూపించింది! తనకు ఇష్టమైన క్రికెటర్ జులన్ గోస్వామీ అని సోషల్ మీడియాలో చెప్పింది. అంతే కాదు, ఇండియా తరుఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే బెంగాలీ ప్లేయరైన జులన్ గోస్వామీతో కైనత్ ఫోటో కూడా దిగింది. దాన్ని కూడా ధైర్యంగా షేర్ చేసింది! జులన్ గోస్వామి ఇండియన్ వుమన్ క్రికెట్ టీమ్ లో కీ ప్లేయర్!
పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ అయిన కైనత్ తనకు ఇండియన్ ప్లేయరైన గోస్వామీ అంటే అభిమానమనే కాక ఆమె వల్లే తాను క్రికెటర్ అయ్యానని కూడా చెప్పింది. అందుకే, ఇండియా తమని ఓడించిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ తరువాత తాను వెళ్లి గోస్వామీతో ఫోటో దిగానని వివరించింది! కైనత్ అభిమానం, ధైర్యం, స్పోర్టివ్ స్పిరిట్ అన్నీ మెచ్చుకోవాల్సిందే! కాని, ఇండియా అన్నా, ఇండియన్ క్రికెటర్స్ అన్నా ఉన్మాదంతో రెచ్చిపోయే పాకిస్తానీలు కైనత్ చేసిన పని ఎలా స్వీకరిస్తారో చూడాలి! ఆమె చేసింది ప్రాణాలకు సైతం ప్రమాదం తెచ్చి పెట్టే చర్య!