హోలీ రంగుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం!
హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే
రంగు – ఆకుపచ్చ
ఉపయోగించే రసాయనం – కాపర్ సల్ఫేట్.
విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు.
రంగు – ఎరుపు
ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్.
విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం.
రంగు – నీలం
ఉపయోగించే రసాయనం – ప్రష్యన్ బ్లూ.
విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు.
రంగు – సిల్వర్
ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్.
విషప్రభావం – చర్మం, ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం. కేన్సర్ కారకం.
రంగు – నలుపు
ఉపయోగించే రసాయనం – రెడ్ ఆక్సైడ్.
విషప్రభావం – మూత్ర పిండాల మీద ప్రభావం. గర్భస్రావం అయ్యే ప్రమాదం.
చాంతాడంత జాబితా!
గులాల్ పొడులలో లెడ్, క్రోమియం, కాడ్మియం, నికెల్, జింక్, సిలికా, మైకా... వంటి నానారకాల రసాయనాలూ కలుస్తాయని తేలింది. వీటిలో ఒకో రసాయనానిదీ ఒకో దుష్ఫ్రభావం! ఇక హోళీ రంగులు మెరిసిపోతూ ఉండేందుకు వాటిలో గాజుపొడి కలుపుతారన్న ఆరోపణమూ వినిపిస్తున్నాయి. పేస్టు లేదా ద్రవరూపంలో ఉండే రంగులది మరో సమస్య. వీటిలో ఇంజన్ ఆయల్ వంటి చవకబారు ద్రవాలను కలిపే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలతో ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. హోళీ రోజున అవి నీటిలోనూ, నేలమీదా పడితే పర్యావరణం కూడా దెబ్బతింటుంది.
కొత్త పోకడలూ ప్రమాదమే!
ఇప్పుడు కొత్తగా హోళీ రంగులను చల్లుకునేందుకు చైనావారి పిచికారీలు దొరుకుతున్నాయి. వీటికి తోడు రంగులతో నింపిన బెలూన్లు కూడా లభిస్తున్నాయి. అసలే రసాయనాలు... ఆపై వాటిని వేగంగా చల్లేందుకు పరికరాలు. దీంతో ఏ రంగు ఎవరి కంట్లో పడుతుందో, అది ఎవరి జీవితాన్ని చీకటి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మీదపడే బెలూన్ల వల్ల ఒకోసారి వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి రంగుకీ ఓ ప్రత్యామ్నాయం
హోళీలో ఇతరులు చల్లే కృత్రిమమైన రంగుల నుంచి జాగ్రత్తపడటం ఒక ఎత్తు. మనవరకు మనం అలాంటి రంగుల జోలికి పోకుండా సహజసిద్ధమైన రంగులు వాడటం మరో ఎత్తు. ప్రతి ఇంట్లోనూ దొరికే పసుపు, కుంకుమ, చందనం, బొగ్గు లాంటి రంగులు పదార్థాలు ఎలాగూ బోలెడు రంగలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇక ఆకుకూరలు, గోరింట పొడి, బీట్రూట్, కరక్కాయలు, మందారపూలు, నేరేడు పండ్లు లాంటివాటితో చాలా రంగులే సిద్ధమవుతాయి. కాస్త ఓపిక చేసుకుంటే తేలికగా అమరిపోయే సహజసిద్ధమైన రంగులను వదిలేసి ఏరికోరి రసాయనాలు కొనితెచ్చుకోవడం ఎందకన్నదే పెద్దల ప్రశ్న!
- నిర్జర.