ఇంట్లో తింటేనే ఆరోగ్యం, పొదుపు

  ఇప్పుడు జీవితమంతా పరుగులమయం. ఈ పరుగుల మధ్య కావల్సినంత డబ్బయితే సమకూరుతోంది కానీ ఇంటిపని చేసుకునేంత తీరిక కానీ ఓపిక కానీ మిగలడం లేదు. దాంతో ఆ డబ్బుతోనే కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాం. రోజంతా ఎలాగూ కష్టపడ్డాం కదా అని బయటే తినేస్తున్నాం. దీని వల్ల డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం వృధా అయిపోతున్నాయని నిపుణులు నొచ్చుకొంటున్నారు.   దాదాపు మూడేళ్ల క్రితమే ఇంటి వంట గురించి ఓ పరిశోధన జరిగింది. ఓ తొమ్మిదివేల మంది మీద జరిగిన ఈ పరిశోధనలో ఇంట్లో వండుకునే వంటలో చక్కెర, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. అంటే ఇంటి వంట ఎక్కువ పోషకాలను అందిస్తూ, తక్కువ కెలోరీలని ఇస్తుందన్నమాట. దీని వల్ల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు కదా! ఇంటి వంట అనగానే కాస్త పరిశుభ్రమైన రీతిలో వండుకుంటాం. అందులో ఎంత ఉప్పు పడుతోంది, ఎంత నూనె వేస్తున్నాం, మసాలా వేయాలా వద్దా... లాంటి విషయాలన్నీ మన విచక్షణకు అనుగుణంగానే ఉంటాయి. బయట వండేవారు కేవలం రుచిని, లాభాన్నీ మాత్రమే పట్టించుకుంటారు కదా!   ఇంటి వంట భేషైనది అని చెప్పేందుకు తాజాగా మరో పరిశోధన కూడా జరిగింది. University of Washington Health Sciences చేసిన ఈ పరిశోధన కోసం 437 మందిని ఎన్నుకొన్నారు. వీరు ఒక వారంలో ఇంటి వంట ఎన్నిసార్లు తిన్నారో, అందులో ఎలాంటి ఆహారం ఉంది అని వాకబు చేశారు. ఈ ఆహారాన్ని healthy eating index అనే ఓ జాబితాతో పోల్చి చూశారు.   మన ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలపదార్థాలు, తృణ ధాన్యాలు, ఉప్పు, పప్పులు... ఇలా ఏ పదార్థం ఏ మోతాదులో ఉంటే బాగుంటుందో సూచించే జాబితానే ఈ healthy eating index. దీని ద్వారానే అమెరికా ప్రభుత్వం తమ పౌరుల ఆరోగ్యానికీ- ఆహారానికీ మధ్య సంబంధాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది. వారానికి మూడు రోజులే ఇంట్లో వండుకునేవారితో పోలిస్తే, వారంలో ఆరు రోజులపాటు ఇంటి వంటను తినేవారు healthy eating indexలో ఎక్కువ మార్కులను సాధించినట్లు తేలింది. పోషకాల తక్కువైతే మాత్రమేం! బయట తినడం వల్ల ఖర్చు మాత్రం విపరీతంగా అవుతోందని పరిశోధకులు గ్రహించారు.   బయట తిండికి సంబంధించి పరిశోధకులు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తేల్చారు. - చవకబారు ఫాస్ట్‌ఫుడ్స్ తినడంలో పేదవారే ముందుంటారని అందరూ అనుకుంటారు. నిజానికి పేదాగొప్పా అన్న తారతమ్యం లేకుండా అంతా ఒకేలా ఈ చిరుతిళ్లని తింటున్నారని బయటపడింది. - 1970లతో పోలిస్తే బయట ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు చేరుతున్నాయని గమనించారు. - ఎక్కువమంది పిల్లలు ఉన్న ఇళ్లలో.... ఇంటి వంటకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది.   - నిర్జర.

కొంతమందికి స్వీట్స్ అంటే ఎందుకంత ఇష్టం?

  ‘వీడు అన్నంకంటే చాక్లెట్లే ఎక్కువ తింటాడు?’, ‘వాడు రోజుకి పావుకిలో స్వీట్స్ తింటుంటాడు’... లాంటి మాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. జిలేబీ బండినో, స్వీట్ షాపునో చూడగానే ఆగిపోయే మనుషులూ మనకి తెలుసు. ఇంతకీ మనలో కొందరికి తీపి అంటే ఎందుకంత ప్రాణం. మరికొందరు స్వీట్స్‌ అంటే ఎందుకంత నిస్తేజంగా ఉంటారు. దీని వెనుక కేవలం మన అభిరుచులే కారణమా?   తీపి పట్ల కొందరికి ఎక్కువ ఇష్టం ఉండటానికి జన్యుపరమైన కారణం ఏమన్నా ఉందేమో కనుక్కొనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ఎలుకలలోనూ, కోతుల్లోనూ చేసిన పరిశోధనల్లో FGF21 అనే జన్యువు ఈ విషయంలో చాలా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఈ జన్యువుకి తీపి పదార్థాలని దూరంగా ఉంచే సామర్థ్యం ఉందట. అంటే ఈ జన్యువు సవ్యంగా ఉన్నవారు తక్కువ తీపిని తింటారన్నమాట.   తీపి గురించి జంతువుల మీద చేసిన ప్రయోగం మనుషుల విషయంలో రుజువవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నారు డెన్మార్కు దేశపు శాస్త్రవేత్తలు. దీనికోసం వారు Inter 99 study పేరుతో 6,500 మందిని ఎన్నుకొన్నారు. వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు... లాంట వివరాలన్నీ సేకరించారు. వారిలో FGF21 జన్యువు ఏ తీరున ఉందో గమనించారు.   తీపంటే బాగా ఇష్టపడేవారిలో FGF21లో మార్పులు ఉన్నట్లు తేలింది. ఇలాంటివారు 20 శాతం ఎక్కువగా తీపిని ఇష్టపడుతున్నారట. FGF21 జన్యవు సవ్యంగా ఉన్న వ్యక్తులలోనేమో, తీపిపదార్థాలు తినకుండా ఆ జన్యవు ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. ఈ జన్యువులో మార్పు ఉన్న వ్యక్తులు కేవలం తీపిని ఇష్టపడటమే కాదు... మద్యపానం, పొగతాగడం ఎక్కువగా చేయడాన్ని కూడా గమనించారు.   స్వీట్స్ పట్ల వ్యసనానికి మనలోని ఒక జన్యులోపమే కారణం అని తేలిపోయింది. భవిష్యత్తులో ఈ లోపాన్ని మందులతో సరిదిద్దే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అప్పటివరకు ఎలాగొలా తీపి పట్ల వ్యామోహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమని సూచిస్తున్నారు. ఊబకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్... లాంటి నానారకాల సమస్యలకూ తీపి కారణం అవుతోందని హెచ్చరిస్తున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ... తీపికి అలవాటు పడ్డ నాలుకని అదుపుచేయడం అంత సాధ్యం కాదని శాస్త్రవేత్తలే సెలవిస్తున్నారు కదా!   - నిర్జర.

ఉపాధ్యాయుల ఆరోగ్యం... అంతంతమాత్రమే!

  తనకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందితోనూ పంచుకోవాలనుకునేవాడు గురువు. ఆ తపనలోనే తన జీవితాన్ని కరిగించి వేస్తుంటాడు. మన కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమిస్తుంటాడు. తరగతిగదిలో ఉపాధ్యాయుడి తీరుని కనుక గమనిస్తే, రకరకాల రోగాలు ఆయనను చుట్టుముట్టేందుకు ఎలా సిద్ధంగా ఉన్నాయో అవగతం అవుతుంది.   నిలబడే ఉండటం వల్ల: ఒక్క అరగంటపాటు నిల్చొని ఉండమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలాంటిది దాదాపు ఆరేడు గంటల పాటు నిర్విరామంగా నిలబడి ఉండటం అంటే మాటలా! నిరంతరం ఇలా నిలబడి ఉంటడంతో మోకాలి నొప్పులు, వెరికోస్‌ వెయిన్స్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అరగంటికి ఒకసారన్నా కాస్త అటూఇటూ తిరగడం, కాలికి సంబంధించిన వ్యాయామాలు చేయడం, వదులైన దుస్తులు వేసుకోవడం, శరీర బరువుని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు.    అందరిలో తిరగడం వల్ల: బడి/ కళాశాలలో అన్ని రకాల మనుషులూ, అన్ని రకాల క్రిములనూ మోసుకువస్తుంటారు. దీనివల్ల సాధారణ జలుబు మొదలుకొని, హెపిటైటిస్‌ వంటి వ్యాధుల వరకూ ఉపాధ్యాయులకు సోకే అవకాశాలు ఎక్కువ. అందుకని తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఏ రోజు దుస్తులు ఆ రోజు వేసుకోవడం వంటి వ్యక్తిగత శుభ్రతకి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. వ్యాయామం చేయడం, పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధకశక్తి అదుపులో ఉంటుంది.   దుమ్మూ ధూళి వల్ల: పాతకాలం బ్లాక్‌బోర్డులు, చాక్‌పీసుల వల్ల ఊపిరితిత్తులలోకి దుమ్ము చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇక బడిలోని ఆటస్థలం, తరగతి గదులు, ల్యాబొరేటరీ అపరిశుభ్రంగా ఉన్నా కూడా వాటి ప్రభావం ఉపాధ్యాయుల ఆరోగ్యం మీద పడి తీరుతుంది. కాబట్టి తమ అనారోగ్యానికి కారణంగా ఉన్న పరిస్థితులను ఓసారి పాఠశాల అధికారుల దృష్టికి తీసుకురావడంలో తప్పులేదు.   నిరంతరం అరవడం వల్ల: పాఠం అన్న మాట వినిపించగానే ఖంగుమంటూ వినిపించే స్వరాలే గుర్తుకువస్తాయి. విషయం పిల్లలందరికీ సూటిగా, స్పష్టంగా వినిపించాలనే తపనతో ఉపాధ్యాయులు గొంతు చించుకుని పాఠాలు చెబుతూ ఉంటారు. దీని వల్ల 58% ఉపాధ్యాయులలో స్వరసంబంధమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో తేలింది. గొంతు పొడిబారిపోకుండా తరచూ నీరు తాగుతూ ఉండటం, గొంతులో ఎలాంటి మార్పులు వచ్చినా వైద్యుని సంప్రదించడం, మైక్రోఫోన్‌ వంటి పరికరాలు వాడటం, అవసరం అనుకున్నప్పుడు తప్ప హెచ్చుస్థాయిలో మాట్లాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే, గురువుగారి గొంతు ఖంగుమంటూనే ఉంటుందని సూచిస్తున్నారు.   ఒత్తిడికి లోనవ్వడం వల్ల: వందల మంది పిల్లలకి చదువు చెప్పాలి, వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, పాఠాలను సకాలంలో పూర్తిచేయాలి, వారి మార్కులకి బాధ్యత వహించాలి, వారి ప్రవర్తనను కూడా గమనించుకోవాలి.... ఇలా పిల్లలకు సంబంధించిన ఒత్తిడి ఉపాధ్యాయుల మీద చాలా తీవ్రంగానే ఉంటుంది. అందుకనే ప్రతి పది మందిలో ఎనిమిదిమంది ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనవుత్తున్నారంటూ పరిశోధనలు పేర్కొంటున్నాయి. ధ్యానంతో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, చేస్తున్న పనిని ఆస్వాదించడం, విద్యార్థులతో కలివిడిగా ఉండటం, తరగతి గదిలో హాస్యాన్ని పండించడం వంటి మార్పులతో ఈ ఒత్తిడి నుంచి వీలైనంత దూరంగా ఉండవచ్చు. ఇవీ ఉపాధ్యాయుల ఎదుర్కొనే కొన్ని సమస్యలు, వాటికి ఉపాయాలు. ఏవో వారి మీద అభిమానం కొద్దీ మనం ఈ సూచనలు చేస్తున్నాం కానీ వారికి చెప్పేంతటి వారమా!    - నిర్జర.

వెన్నలాంటి ఆరోగ్యం!

  ఒకప్పుడు ప్రతి ఇంటా వెన్న చిలికే అలవాటు ఉండేది. పిల్లలు గోరుముద్దలకంటే ఇష్టంగా వెన్నముద్దలనే తినేవారు. వంట చేయడం దగ్గర్నుంచీ ఒంటికి పట్టించడం వరకూ వెన్నని అన్ని రకాలుగానూ వాడుకునేవారు. కానీ రానురానూ ఒపికలు తగ్గిపోయాయి. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. జీవనశైలి తలకిందులైపోయింది. ఇప్పుడు వంటింట్లోంచి వెన్న మాయమైపోయింది. కానీ వెన్న వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుస్తున్న తరువాత మళ్లీ వెన్నని వాడేందుకు జనం ఉత్సాహపడుతున్నారు. ఆ ఆరోగ్య రహస్యాలు ఏమిటంటారా!   గుండెకు మంచిది! వెన్నలో విటమిన్‌ ఏ చాలా అధికమొత్తంలో ఉండటమే కాదు, చాలా త్వరగా శరీరంలో కలిసిపోతుంది కూడా! గుండె, కండరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ విటమిన్‌ ఏ చాలా అవసరం. పైగా వెన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా గుండెను దృఢంగా ఉంచుతాయి. విటమిన్‌ ఏ వలన కేవలం గుండెకు మాత్రమే కాదు... థైరాయిడ్‌, అడ్రినల్‌ గ్రంథులు సరిగా పనిచేసేందుకు కూడా చాలా అవసరం.   కొవ్వు పెరగదు వెన్న అన్న మాట వినగానే, అది కొవ్వుని పెంచుతుందేమో అన్న అపోహ సహజం! నిజానికి వెన్నలో ఉండే కొవ్వు పదార్థాల నిర్మాణం, త్వరగా కరిగిపోయేలా రూపొందించబడ్డాయి. దీంతో వెన్నని తినడం వల్ల ఆకలి తీరినట్లు అనిపిస్తుందే కానీ, కొవ్వు మాత్రం పేరుకోదు. అంతేకాదు! మంచి కొలెస్ట్రాల్‌ ఉన్న ఈ వెన్నని తినడం వల్ల పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ దృఢంగా రూపొందడానికి దోహదపడుతుంది.   పెరుగుదలకు అవసరం వెన్నలో ఉన్న విటమిన్‌ A,D,E,K2 లు పిల్లల సమగ్రమైన ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లల్లో పళ్లు, ఎముకలు బలంగా ఉండేందుకు ఇవి సాయపడతాయి. గర్భిణీ స్త్రీలలో కనుక విటమిన్‌ ఏ తగినంత లేకపోతే, వారికి పుట్టే పిల్లల్లో అంధత్వం, ఎదుగుదల సరిగా లేకపోవడం.... వంటి అనేక సమస్యలు కలిగే ప్రమాదం ఉంది. వారు కనుక తరచూ వెన్నని తీసుకుంటే, పుట్టే పిల్లల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడవంటున్నారు పోషకాహార నిపుణులు.   కీళ్ల సమస్యలు రాకుండా! ఇప్పుడు ఆడామగా, చిన్నపెద్దా అన్న తేడా లేకుండా అందరికీ ఏవో ఒక కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి విరుగుడుగా పనిచేసే ఒక దివ్యౌషధం వెన్నలో ఉందని తేలింది. వెన్నలో ఉండే ‘Wulzen Factor’ అనే ఒక పోషకం కీళ్ల దగ్గరా, రక్తనాళాలలోనూ కాల్షియం పేరుకుపోకుండా కాపాడుతుందట. పైగా ఇందులో ఉండే డి విటమిన్‌, మన శరీరానికి తగిన కాల్షియం అందేలా సాయపడుతుంది.   క్యాన్సర్‌ను సైతం! వెన్నలో రకరకాల విటమిన్లు, ఖనిజాలు ఎలాగూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటికి తోడు ఇందులో ఉండే సెలేనియం అనే అరుదైన యాంటీఆక్సడెంట్‌ మనల్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుందని తేలింది. ఇక వెన్నలో కనిపించే conjugated linoleic acids అనే పదార్థాలు మనల్ని క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయని నిపుణులు సాధికారంగా చెబుతున్నారు. ఇదీ విషయం! ఇలా చిలుకుతూ పోతే వెన్నతో మరెన్నో లాభాలు ఉన్నాయన్న విషయాలు బయటపడుతూనే ఉంటాయి. కాబట్టి... ఈ కృష్ణాష్టమి నుంచైనా మన నిత్యజీవితంలో ఎంతో కొంత వెన్న ఉండేలా జాగ్రత్త పడదాము.   - నిర్జర.

లైటెనింగ్ రాడ్ - విటమిన్ ఈ

      మన శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే కాని అందులో విటమిన్ 'ఈ' కి పెద్ద పీట వెయ్యాలి. ఇది మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. అందుకే దీనిని లైటెనింగ్ రాడ్ అంటారు. అంతేకాదు యాంటి ఆక్సిడెంట్ లా ఉపయోగపడుతుంది. రక్తకణాలని వృద్ది చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే విటమిన్ ఈ వల్ల వచ్చే లాభాలు ఎన్నెన్నో. విటమిన్ ఈ ముఖ్యంగా కొవ్వులో కరిగిపోయే విటమిన్. స్థూలకాయుల రక్తంలోనూ  విటమిన్ ‘ఈ’ ఉంటుంది, కానీ కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీరాల్లో మాత్రం విటమిన్ ‘ఈ’ లోపించి ఉంటుందని పరిశోధకులు చెప్తునారు. ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే విటమిన్ ఈ వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దామా.     ఊబకాయానికి: కొవ్వు అధికంగా ఉన్నవారికి విటమిన్ ‘ఈ’ అందిస్తే అధిక బరువు సమస్యను నియంత్రించవచ్చునని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే దీనికి కొవ్వుని కరిగించే శక్తి ఉంది. ఇలాంటివారు పొద్దుతిరుగుడు ఉత్పత్తులు, తృణ ధాన్యాలు ఎక్కువ శాతం తీసుకుంటే మంచిది.   చర్మ సంరక్షణకి: సాధారణంగా అన్ని సౌందర్య ఉత్పత్తుల తయారిలోనూ విటమిన్ ఈ ని వాడతారు. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి దీనిలో ఎక్కువగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు విటమిన్ ఈ ని తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. విటమిన్ ఈ కాప్సుల్ ని మొహానికి రాసుకుని పావుగంట తర్వాత మొహం కడుకుంటున్నా మోహంలో నిగారింపు వస్తుందిట.   యాంటి ఆక్సిడెంట్: దీనిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కేన్సర్ కారకాలను దూరం చేస్తాయి. రోగానిరోధకశక్తిని  పెంచుతాయి. మతిమరపు సమస్య కూడా దూరం అవుతుంది. కంటి చూపు స్వస్థతకి కూడా ఉపయోగపడుతుంది.     రక్తకణాల వృద్ధి కోసం: విటమిన్ ఈ తీసుకోవటం వల్ల ఒంట్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్త నాళాలలో రక్తం ముద్దగా  కాకుండా చూసుకుంటుంది. అంతేకాదు మెనోపాజ్ స్టేజ్ లో మహిళలకు వచ్చే సమస్యలని కూడా తగ్గిస్తుందిట.   కీళ్ళ నొప్పులకు: ఈ రోజుల్లో ఈ కీళ్ళ నొప్పులు అందరిలోనూ కామన్ అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ ఈ లోపించటమే. విటమిన్ ఈ ఈ నొప్పులను తగ్గించటమే కాదు కండరాలని  కూడా ద్రుఢ పరుస్తుంది. వయసు పైబడుతున్నవారు విటమిన్ ఈ ని ఎక్కువగా తీసుకోవాలాట. అది ఎదిగే పిల్లలకు కూడా ఎంతో అవసర పడుతుందని చెప్తున్నారు నిపుణులు.   ఆలివ్ నూనెలో, ఆకుకూరల్లో, పోద్దుతిరుగుడులో, నట్స్ లో, గుమ్మడికాయలో, చిలకడదుంప లో, రాక్ ఫిష్ లో, బొప్పాయి వంటి వాటిలో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. చక్కగా ఇవన్ని తిని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ హాపీగా జీవిద్దాం. - కళ్యాణి  

అమ్మో! అమీబియాసిస్‌

  వర్షాకాలం వచ్చిందంటే చాలు నానారకాల క్రిములూ మన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. తినే తిండిలోనూ, పీల్చేగాలిలోనూ తిరుగుతూ మనకి ఎప్పుడు హాని తలపెడదామా అని ఎదురుచూస్తుంటాయి. అలాంటి వ్యాధులలో ఒకటి అమీబియాసిస్‌. అమీబియాసిస్‌ను చాలామంది తేలికగా కొట్టిపారేస్తుంటారు కానీ, దీనిని అశ్రద్ధ చేస్తే కలిగే ఉపద్రవం అంతా ఇంతా కాదు.   ఇదీ కారకం! ఏక కణ జీవి అయిన Entamoeba histolytica ద్వారా అమీబియాసిస్‌ సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల మలంలో సదరు జీవి తాలూకు అవశేషాలు నెలల తరబడి సజీవంగా ఉంటాయి. అలాంటి మలం నీటిలో కలిసినప్పుడు కానీ, కూరగాయల వంటి ఆహారపదార్థాలను తాకినప్పుడు కానీ.. వాటితో పాటుగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాడి ఇలా సాగుతుంది...   శరీరంలోకి ప్రవేశించిన అమీబా ముందు జీర్ణాశయంలో తన స్థావరాన్ని ఏర్పరుచుకుంటుంది. నిదానంగా పెద్ద పేగులలోకి చేరుకుంటుంది. అక్కడి వరకూ ఫర్వాలేదు కానీ ఒకవేళ పెద్దపేగులను కూడా దాటుకుని రక్తంలోకి కలిస్తే మాత్రం ఉపద్రవమే! ఎందుకంటే రక్తంలోకి కలిసిని అమీబా, ఆ ప్రవాహంతో పాటుగా ప్రయాణిస్తూ, శరీరంలోని అవయవాలలో వేటి మీదైనా దాడి చేసే అవకాశం ఉంది. కాలేయం మొదలుకొని మెదడు వరకూ అమీబియాసిస్‌ ఏ అవయవాన్నైనా పాడు చేసేయవచ్చు.   పసిగట్టేదెలా? సాధారణంగా అమీబియాసిస్‌ సోకినవారిలో ఓ 10 శాతం మందిలోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వారం నుంచి నెలరోజుల లోపే ఈ లక్షణాలు బయటపడతాయి. కడుపులో నొప్పి, విరేచనాలు ఈ వ్యాధిలో బయటపడే ఇబ్బందులు. ఒకోసారి అమీబా పెద్దపేగులను గాయపరిచినప్పుడు, రక్తంతో కూడిన విరేచనాలు కూడా ఏర్పడవచ్చు.   పరీక్ష- చికిత్స అనుభవజ్ఞులైన వైద్యులు, మనం చెప్పే లక్షణాలను బట్టి అమీబియాసిస్‌ సోకినట్లుగా పసిగట్టేస్తారు. మరికొన్ని సందర్భాలలో మల పరీక్ష అవసరం కావచ్చు. ఒకోసారి వ్యాధిని నిర్ధారించేందుకు రక్తపరీక్ష కూడా అవసరం అవుతుంది. మన శరీరంలో అమీబా ఉనికిని బట్టీ, అది వ్యాపించిన తీరుని బట్టి, కలిగిస్తున్న లక్షణాలను బట్టి... చికిత్స ఉంటుంది. మెట్రోనిడజోల్‌ వంటి చవకైన మందులకి అమీబియాసిస్‌ లొంగిపోతుంది. అయితే అమీబా కనుక కాలేయం వంటి అవయవాలని పాడుచేసి ఉంటే ఒకోసారి చికిత్స కూడా అవసరం కావచ్చు.   నివారణే మార్గం! మనం ఎంతో తేలికగా కొట్టిపారేసే అమీబియాసిస్‌ ఒకోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. ఏటా దాదాపు లక్షమంది అమీబియాసిస్‌ కారణంగా చనిపోతున్నారని తెలిస్తే, ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదని తేలిపోతుంది. అసలే అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోనే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పైగా అమీబియాసిస్‌ సోకిన తరువాత ఒకోసారి సంవత్సరాల తరబడి దాని తాలూకు ప్రభావం కనిపించవచ్చు. అందుకని అమీబియాసిస్‌ వచ్చాక బాధపడేకంటే పారిశుద్ధ్యం సరిగా లేని సందర్భాలలో, ముఖ్యంగా నీరూ ఆహారమూ కలుషతం అయ్యే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచింది.   - నీటిని ఎడాపెడా ఎక్కడపడితే అక్కడ తాగేయకూడదు. కాచి చల్లార్చిన తరువాతనో, ఫిల్టర్‌ చేసుకున్న తరువాతనో తాగాలి. ఇలాంటి అవకాశం లేని ప్రయాణాల వంటి సందర్భాలలో మినరల్‌ వాటర్‌ మీద ఆధారపడక తప్పదు.   - పండ్లు, కాయగూరల వంటి పదార్థాలని శుభ్రంగా కడిగి లేదా చెక్కు తీసి వాడుకోవాలి.   - వర్షాకాలంలో పాలు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... డెయిరీ నుంచి కొనుక్కునే పాశ్చురైస్డ్‌ పేకెట్‌ పాలని వాడాలి. లేదంటే కనీసం పాలని బాగా మరిగించి ఉపయోగించాలి.   - బయట ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పానీపూరీతో పాటుగా ఇచ్చే నీళ్లు, చట్నీలలో కలిపే నీళ్లు, జ్యూసులలో కలిపే ఐస్‌.... ఇలాంటివన్నీ కూడా అమీబాని మనకు అంటించగలిగే సాధనాలే అని గుర్తించాలి.   అన్నింటినీ మించి... వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు ఒకటి రెండు రోజులకి మించి విడవకుండా ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి.  - నిర్జర.

పేరంటంలో శ‌న‌గ‌లే ఎందుకు! (శ్రావణ శుక్రవారం స్పెషల్)

  శ్రావ‌ణ మాసం వ‌చ్చిందంటే చాలు నోములు, వ్రతాల‌తో ప్రతి ఇల్లూ క‌ళ‌క‌ళ‌లాడిపోతుంటుంది. వీటిని ఆచ‌రించ‌డం కుద‌ర‌నివారూ, ఆస‌క్తిలేనివారు కూడా ఎవ‌ర‌న్నా పేరంటానికి పిల‌స్తే వెళ్లి తాంబూలాన్ని అందుకుంటారు. ఆ పేరంటాల‌లో నాయ‌క‌త్వమంతా శ‌న‌గ‌ల‌దే! ఇక వ‌ర‌ల‌క్ష్మివ్రతంలో అమ్మవారికి శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే పిండివంట‌ల‌ను నివేదిస్తారు. ఇన్ని ర‌కాల ధాన్యాలు ఉండ‌గా శ‌న‌గ‌ల‌కే ఎందుకంత ప్రాముఖ్యత అని త‌ర‌చి చూస్తే ఎన్నో విష‌యాలు స్ఫురిస్తాయి. శ‌న‌గ‌ల‌ని పండించ‌డంలో వేల సంవ‌త్సరాలుగా మ‌న దేశానిదే తొలి స్థానం. సింధునాగ‌రిక‌త‌కు సంబంధించిన త‌వ్వకాల‌లో కూడా శ‌న‌గ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. వేల సంవ‌త్సరాల‌కు పూర్వమే ఇత‌ర‌దేశాల‌కు శ‌న‌గ‌ల‌ను ఎగుమ‌తి చేసిన ఘ‌న‌త మ‌నది. కానీ వాటిని జీర్ణం చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. శ‌న‌గ‌ల‌ను అధికంగా తీసుకుంటే క‌డుపు ఉబ్బరంగా ఉండ‌టం అంద‌రికీ అనుభ‌వ‌మే. ఇక జీర్ణశక్తి స‌రిగా లేనివారు శ‌న‌గ‌పిండికి కూడా దూరంగా ఉంటారు. కందిప‌ప్పు, పెస‌ర‌పప్పులాగా శ‌న‌గ‌ప‌ప్పుతో కూడా ప‌ప్పుని వండుకోవ‌చ్చు కానీ, అజీర్ణానికి భ‌య‌ప‌డి మ‌నం సాహ‌సించం. నిజానికి శ‌న‌గ‌ల‌లో ఉన్నన్ని పోష‌కాలు మ‌రే ఇత‌ర ధాన్యంలోనూ ఉండ‌వేమో! ఇందులో ఉండే విట‌మిన్లు, ఖ‌నిజాల చిట్టా చాలా పెద్దది. మెద‌డుని చురుగ్గా ఉంచే మాంస‌కృత్తులు, శ‌రీరానికి శ‌క్తినిచ్చే పిండిప‌దార్థాలు కూడా శ‌న‌గ‌ల‌లో పుష్కలంగా ఉంటాయి. అందుకే న‌వ‌గ్రహాల‌లో ఒకటైన బృహ‌స్పతిని శాంతింప‌చేసేందుకు, శ‌న‌గ‌ల‌ను దానం చేయాల‌ని చెబుతారు. జ్యోతిష‌రీత్యా మేథ‌స్సుకీ, విద్యకీ కార‌కుడైన బృహ‌స్పతికి త‌గిన పోష‌కాలు అందిచ‌గ‌లిగేది శ‌న‌గ‌లే క‌దా!     ప్రాచీన వైద్య విధానంలో కూడా శ‌న‌గ‌ల‌ది గొప్ప పాత్ర. చ‌క్కెర వ్యాధికీ, కిడ్నీలో రాళ్లకీ శ‌న‌గ‌లు మేలు చేస్తాయ‌ని ఇప్పటి ప‌రిశోధ‌న‌ల్లో కూడా తేలింది. శ‌న‌గ‌ల‌లో ఉండే పోష‌కాలు ప‌శువుల‌కి కూడా ఉప‌యోగ‌మే! శ‌న‌గ‌ల‌ని ఆహారంగా అందించిన‌ప్పుడు గేదెల‌లో పాల‌దిగుబ‌డి ఎక్కువ‌య్యింద‌ట‌. ఇన్ని ఉప‌యోగాలు ఉన్నా కూడా ఇత‌ర ప‌ప్పుధాన్యాల‌తో పోలిస్తే శ‌న‌గ‌లు చాలా చ‌వ‌క‌గానే దొరుకుతాయి. అందుక‌నే కొన్నాళ్ల క్రితం కందిప‌ప్పు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయిన‌ప్పుడు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే, కందిప‌ప్పు బ‌దులు శ‌న‌గ‌ప‌ప్పుని వంట‌లో వినియోగించుకోమ‌ని ప్రక‌ట‌న‌లు రూపొందించింది. అతి త‌క్కువ ధ‌ర‌లో అత్యధిక పోష‌కాల‌ను అందించే శ‌న‌గ‌ల‌ను మ‌నం ఎలా ఉపేక్షించ‌గ‌లం. వంట‌ల్లోకి ఎలాగూ అంత‌గా వాడుకోం. కాబ‌ట్టి వాటిని నాన‌బెట్టి కానీ, నాన‌బెట్టిన‌వాటిని సాతాళించుకుని కానీ తింటే బోలెడు ఉప‌యోగం. విడిగా ఎలాగూ మ‌నం ఆ ప‌ని చేయం కాబ‌ట్టి శ్రావ‌ణ‌మాసంలోని పేరంటాల స‌మ‌యంలోనైనా శ‌న‌గ‌ల‌ని వినియోగిస్తుంటాం. శ్రావ‌ణ మాసంలో చ‌లి, వేడి స‌మంగా ఉంటాయి. అలాంటి వాతావ‌ర‌ణం కూడా శ‌న‌గ‌ప‌ప్పుని జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. అందుక‌నే శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే పూర్ణంబూరెలు, కుడుములు వంటి ప‌దార్థాల‌ను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు. ఇలాంటి సూక్ష్మమైన ఆరోగ్యసూత్రాల‌ను వంద‌ల సంవ‌త్సరాలకు పూర్వమే సంప్రదాయాల‌తో మిళితం చేసిన మ‌న పూర్వీకుల మేథ అమోఘం క‌దా!!! - నిర్జర‌.

కళకళలాడే యాలకులు...

  యాలకుల టీ ఘుమఘుమలాడుతూ ఎంత రుచిగా ఉంటుందో కదా! అసలు ఇలాయిచికి ఉండే రుచే వేరబ్బా. స్వీట్ ఏదైనా సరే దానితో ఇలాయిచి పౌడర్ కలిస్తే చాలు దాని రుచి రెండింతలవుతుంది. పాయసంలో, టీలో, కిళ్ళీ లో, లడ్డూలో ఇలా చెప్పుకుంటూ పోతే దాని రుచి మాత్రం కంపల్సరిగా అన్నిటిలో ఉండాల్సిందే కదా. కేవలం రుచి కోసం మాత్రమే ఈ యాలకులు వాడతారు అనుకుంటే మాత్రం ముమ్మాటికి పొరపాటు పడ్డట్టే. ఇందులో విశేష ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా మన డైజేస్టివ్ సిస్టంకి ఇది ఎంతో మేలు చేస్తుంది. నోటి దుర్వాసన, ఇండైజిషన్, వోమిటింగ్స్ ఇలాంటి వాటిని కూడా దూరం చెయ్యగలదు.   యాలకుల నుంచి వచ్చే నూనే కూడా  అద్భుతాలు చెయ్యగలదు. అరోమా థెరఫీలో దీనికో ప్రత్యెక స్థానం ఉందిట. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ నూనే రాస్తే సెప్టిక్ కాకుండా కాపాడే గుణాలు ఉన్నాయని చెప్తున్నారు పరిశోధకులు. ఈ నూనే వాసన పీలిస్తే చాలు అలసట తగ్గటమే కాకుండా మంచి రిలీఫ్ వస్తుందిట. ఇది త్రోట్ ఇన్ఫెక్షన్ కి కూడా మంచి మందుగా పనిచేస్తుంది. ఇంకా ఇంకా ఈ యాలకులని దేనికి వాడచ్చో చూద్దామా. *  పిల్లలలో వచ్చే కడుపునొప్పి,ఇండైజిషన్ కి వాముతో పాటు యాలకులు వాడచ్చు. *  యాలకులు కషాయంలా చేసి నోట్లో పుక్కలిస్తే దంతాలు,చిగుళ్ళ బాధలు తగ్గుతాయట. *  తినే ఆహార పదార్థాల పైన యాలకుల నూనే చల్లితే పిల్లలకు మంచిదని చైనీయులు విశ్వసిస్తారు. *  యాలకుల ద్వారా కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుందిట. *  వీటిని పొడి చేసి ఆ పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళ మీదున్న ఎలాంటి మరకలనైనా పోగొట్టి తళతళ మెరిసేలా చేస్తుందిట. చూసేందుకు చిన్నగా తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పువ్వుల్లా కనిపించే యాలకులు అందించే లాభాలు ఎన్నో, అందుకే అనాలి వాహ్ ఇలాయిచి వాహ్! -కళ్యాణి

గాంధీగారి మేకపాలు కథ

మహాత్మాగాంధి సిద్ధాంతాలతో కొందరు అంగీకరించవచ్చు, లేదా విభేదించనూవచ్చు. కానీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పాత్రని ఎవరూ కొట్టిపారేయలేరు. అహింసని సైతం ఒక ఆయుధంగా మార్చిన తీరుని మర్చిపోనూలేరు. తను ఏర్పరుచుకున్న నియమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే గాంధీగారిని మిగతావారికంటే భిన్నంగా నిలిపిందన్నది వాస్తవం. అది సత్యాగ్రహం కావచ్చు, అహింసా సిద్ధాంతం కావచ్చు. ఆయన జీవనశైలిని గమనిస్తే ఇలాంటి నియమాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో ఒకటి మేకపాలు తాగడం! ఎవరు ఎగతాళి చేసినా కూడా గాంధీగారు మేకపాలు మానేవారు కాదు. ఇంతకీ గాంధీగారు మేకపాలు తాగడం వెనుకనున్న కథ ఏమిటో, అసలు మేకపాలంటే కొందరికి ఎందుకంత అభిమానమో చూద్దాం...   మాటకు కట్టుబడి! గాంధీ ఒకప్పుడు పూర్తిగా శాకాహారానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మాంసమే కాకుండా ఇతర జంతువుల నుంచి వచ్చే పాలని కూడా ఆయన ముట్టుకోవడం మానేశారు. ఇలా ఒక ఆరేళ్లపాటు పాలకి దూరంగా ఉన్నారు కూడా! అయితే 1917లో ఆయనకు తీవ్రమైన అతిసార వ్యాధి పట్టుకుంది. మనిషి నీరసంతో కృశించిపోయాడు. అలాంటి స్థితిలో పాలు చాలా మేలు చేస్తాయని అందరూ సూచించినా, తన పాత నిర్ణయానికి కట్టుబడి ఆయన పాలని ముట్టుకోలేదు.   ఒక ఐడియా! గాంధీగారి పరిస్థితి చూసిన ఒక వైద్యుడు ఓ ఉపాయాన్ని సూచించాడు. ‘మీరు పాలని ముట్టుకోను అని నిర్ణయించుకున్నప్పుడు మీ మనసులో ఆవు లేదా గేదె పాలే మెదిలి ఉంటాయి కదా! అలంటప్పుడు మీ మాటని కాస్త సడలించి మేక పాలుని తీసుకోవచ్చు కదా!’ అన్నాడు. దీన్ని గాంధీగారి భార్య కస్తూరిబాయి కూడా సమర్థించడంతో, అప్పటి నుంచీ ఆయన మేకపాలని తీసుకోవడం మొదలుపెట్టారు.   నిజానికి గాంధీగారి దృష్టిలో పాలు అంత ఆరోగ్యకరం కాదు. వాటిద్వారా సదరు జంతువులలో ఉండే రోగకారకాలన్నీ మనకు అంటుకుంటాయని ఆయన అభిప్రాయం. అయితే శాకాహారులకు పూర్తిస్థాయి పోషకాలు అందాలంటే పాలు తప్ప మరో గత్యంతరం లేదని ఆయన తరువాత రోజుల్లో ఒప్పుకొనేవారు.   మేకపాలు ప్రత్యేకమేనా! గాంధీగారు మేకపాలు తాగడం మాట అటుంచి, చాలామంది నిపుణులు గేదెపాలకంటే మేకపాలు శ్రేష్టమని వాదిస్తున్నారు. వారి వాదనల ప్రకారం మేకపాలలో చాలా సుగుణాలే ఉన్నాయి.   - ఆవు/గేదెపాలకంటే మేకపాలలోని కొవ్వుకణాలు చిన్నగా ఉంటాయట. అందుకని ఇవి మిగతా పాలకంటే సులభంగా జీర్ణమవుతాయి.   - కొందరికి పాలు సరిపడవు. కారణం! వాటిలో ఉండే లాక్టోజ్‌ అనే పదార్థం. మేకపాలలో లాక్టోజ్‌ చాలా తక్కువ స్థాయిలో ఉండి పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కేవలం లాక్టోజే కాదు. పాలల్లో ఉండే ‘A1 కేసిన్‌’ అనే మాంసకృత్తుల వల్ల చాలామందికి జీర్ణసంబంధమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. అయితే మేకపాలలో ‘A1 కేసిన్‌’ బదులు ‘A2 కేసిన్‌’ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో జీర్ణసంబంధమైన ఇబ్బందులు దరిచేరవు.   - గేదెపాలకంటే మేకపాలలోనే ఎక్కువశాతం ఖనిజాలు లభిస్తాయి. ఇక విటమిన్లు, కొవ్వు సంగతి చెప్పనే అక్కర్లేదు. మేకపాలు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతాయంటున్నారు నిపుణులు.   - మేకపాలలో ఎక్కువ పోషకాలు ఉండటమే కాదు. ఇతర పాలతో పోలిస్తే ఈ పోషకాలని మన శరీరం మరింత సులువుగా గ్రహించగలదట.   - మేకపాలలో విటమిన్‌ A ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి కాంతినీ, మృదుత్వాన్నీ తీసుకువస్తుందట. పైగా చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియాను కూడా నివారించే శక్తి దీనికి ఉంది. అందుకనే కొంతమంది మేకపాలని చర్మానికి నేరుగా రాసుకుంటారు. మేకపాలతో చేసిన సబ్బులకు కూడా మంచి ఆదరణ ఉంది.   - శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సెలేనియం అనే ఖనిజం మేకపాలలో ఎక్కువగా ఉంటుంది. జుట్టు మొదలుకొని థైరాయిడ్ వరకూ ఈ సెలేనియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా మేకపాల ప్రత్యేకతలు చాలానే కనిపిస్తాయి. గాంధీగారు చెప్పారని కాదు కానీ ఇప్పటికీ చాలామంది మేకపాలను మిగతా పాలతో సమానమైన విలువ కలిగనివా భావిస్తారు. ఇంత చదివిన తరువాత మేకపాల గురించి ఎలా ఎగతాళి చేయగలం!   - నిర్జర.

చెప్పులు శుభ్రంగా ఉంటే ఒబెసిటీ రాదు..

  వినడానికి వింతగా ఉంది కాదూ! కానీ ఇదెవ్వరో దారిన పోయే దాన్నయ్య చెప్పిన మాట కాదు... పోర్చుగల్‌లో కొంతమంది పరిశోధకులు తేల్చిన విషయం. మనలో చాలామందిలో ఒళ్లు పెరిగిపోవడానికి కారణం- శారీరక శ్రమ తక్కువగా చేస్తూ, ఎక్కువ కెలోరీలు ఉన్న ఆరాహాన్ని తీసుకోవడం అని తెలుసు. కానీ ఈమధ్యకాలంలో ఒబెసిటీకి మరో కారణం కూడా కనుగొన్నారు. అదే obesogens! ఇవి మన శరీరంలో కొవ్వుని ప్రభావితం చేసే ఒక రకమైన కెమికల్స్‌.   మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఈ obesogens పనితీరుని మార్చేస్తాయట. ఆహారపదార్థాలలో కనిపించే పెస్టిసైడ్స్, బ్యాటరీలలో ఉండే కాడ్మియం, బాత్రూం క్లీనర్లు, డియోడరెంట్లు... లాంటి నానారకాల కెమికల్స్ ఈ obesogens మీద పనిచేస్తుంటాయి. అలాగని వీటన్నింటికీ దూరంగా ఉండటం కష్టమే కదా! ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కెమికల్స్ మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ obesogensని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక వస్తువుని మాత్రం మనం కంట్రోల్‌ చేయగలం. అదే చెప్పులు!   చెప్పులతో మనం ఊరంతా తిరిగి వస్తాం. దాంతో వాటికి నానారకాల కెమికల్స్ అంటుకుని ఉంటాయి. చెప్పుల మీద పేరుకునే దుమ్ములో ఆ కెమికల్స్‌ భద్రంగా ఉంటాయి. అవి రకరకాల అనారోగ్యాలు ఎలాగూ కలిగిస్తాయి. ఇక obesogens మీద కూడా తమ ఎఫెక్ట్‌ చూపుతాయి. అందుకే చెప్పులని ఇంటి బయటే విడిచిపెట్టేయాలనీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలనీ పోర్చుగల్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంట్లో దుమ్ముని కూడా ఎప్పటికప్పుడు దులిపేయడం, కార్పెట్లులాంటివి వాడకపోవడం వల్ల కూడా కెమికల్స్ పేరుకోకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. https://www.youtube.com/watch?v=clFCJAz2o_0 - Nirjara    

ఆరోగ్యం బాగుండాలా! కాసేపు చెప్పులు తీసి నడవండి...

ఇంట్లో ఏ కరెంటు వస్తువు ఉన్నా... అది votage fluctuationsని తట్టుకోవాలంటే ఒక ఎర్త్‌ వైర్ పెడతారు. మరి మన body పరిస్థితి ఏమిటి? మన శరీరం కూడా ఒక బ్యాటరీలాంటిదే కదా! అందులో ప్రతి అవయవం పనిచేయడానికి ఎంతో కొంత విద్యుత్తు అవసరమేగా. అందుకే నేలతో శరీరానికి నేరుగా సంబంధం ఉంటే... ఒంట్లో వైబ్రేషన్స్‌ కూడా perfectగా ఉంటాయని చెబుతున్నారు.     Earth నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికైనా, మన ఒంట్లో అధికంగా ఉన్న నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ను వదిలించుకోవడానికైనా... చెప్పులు లేకుండా కాసేపు నేల మీద నడవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకప్పుడు నేల మీద చెప్పులు లేకుండానే నడిచేవారు. రాత్రిపూట కూడా నేల మీదే పడుకునేవారు. దాని వల్ల భూమితో శరీరానికి నేరుగా సంబంధం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరిగేస్తున్నారు. బయటకి వెళ్లినా ప్లాస్టిక్‌ లేదా రబ్బర్‌ చెప్పులు వేసకుంటున్నారు. ఇవి నేల నుంచి శరీరంలోకి ఎలాంటి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి. కాళ్లకి ఎలాంటి అడ్డూ లేకుండా నేల మీద నడవడాన్ని Grounding అని పిలుస్తారు. కేవలం Groundingతోనే రోగులను నయం చేసే Earthing Therapy అనే ట్రీట్‌మెంట్‌ కూడా ఇప్పుడు పాపులర్‌ అవుతోంది. ఈ ధెరపీతో చాలా రకాల సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.     - Grounding వల్ల ఒంట్లో వాపు, నొప్పిలాంటి సమస్యలన్నీ తీరిపోతాయట. ఒక నాలుగువారాల పాటు ఇలా నడిస్తే... వెన్నునొప్పి, మోకాలి నొప్పులు, పొద్దున పూట కీళ్లు పట్టేయడం లాంటి సమస్యలలో మంచి రిలీఫ్‌ కనిపించినట్లు రీసెర్చ్‌లో తేలింది. - Grounding వల్ల stress కూడా చాలావరకు తగ్గిపోతుందని తెలిసింది. మన శరీరంలో cortisol అనే హార్మోన్‌ ఉంటుంది. ఈ హార్మోనుని గమనిస్తే, ఒంట్లో ఎంత stress ఉందో తెలిసిపోతుంది. నేల మీద పాదాల ఉంచి నడవటం వల్ల ఈ cortisol చాలావరకు తగ్గిపోయిందట. - Grounding వల్ల blood circulation మెరుగుపడుతుందని చెబుతున్నారు. Blood circulation బాగుంటేనే మన ఒంట్లో ప్రతి అవయవానికీ సక్రమంగా ఆక్సిజన్‌, విటమిన్స్ అందుతాయి. దాంతో చర్మం దగ్గర నుంచి గుండె దాకా అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. - భూమిలో లెక్కలేనన్ని electrons, antioxidants ఉంటాయి. చెప్పులు లేకుండా నడవటం వల్ల ఇవి మన శరీరానికి నేరుగా అందుతాయి. చూశారుగా! Grounding వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే రోజుకి ఒక అరగంటసేపన్నా... గడ్డి, నేల, ఇసుక ఉన్న ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడిచి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. - Nirjara