హరికృష్ణకు టిడిపి షాక్..!

      తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ పార్టీ రాజకీయాల్లో దెబ్బ తిన్నారు. హరికృష్ణ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, అయితే అదే సమయంలో టిడిపి లోక్‌సభ సభ్యులు నలుగురు రాజీనామా చేసినట్టు ప్రకటించి హడావుడి చేసినా, స్పీకర్ వద్దకు ఒకే ఒక రాజీనామా లేఖ వెళ్లింది. ఇక రాజ్యసభ సభ్యుల్లో హరికృష్ణ ఒక్కరిదే ఆమోదం పొందింది. టిడిపి ఎంపీల్లో ఒక్కరి లేఖ మాత్రమే వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం వెల్లడించడంతో టిడిపి ఎంపిలు ఇరకాటంలో పడ్డారు. వారి రాజీనామాల వ్యవహారం డ్రామా అని ఇతర పార్టీల వాళ్లు విమర్శించారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు హరికృష్ణ మళ్లీ యాత్ర ఊసెత్తడం లేదు. రాజీనామా తరువాత ఆయన ఉనికిని పార్టీ నాయకులెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

కాంగ్రెస్ కి దత్తపుత్రుడి అండ

      కాంగ్రెస్ అధిష్టానంపై విజయవాడ ఎంపీ లగడపాటి విమర్శలు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దత్తత పుత్రుడని అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి అండ చూసుకునే సొంతపార్టీ నాయకులను అరువు పుత్రులుగానూ, బరువు పుత్రులుగానూ భావిస్తోందని తప్పుపట్టారు.   ఇంక కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతు చించుకున్నా, ఎంత గోల చేసినా, కాళ్లా వేళ్లా పడినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ దత్తపుత్రుడు ఎవరని ప్రశ్నించగా.. 'ఆ దత్తపుత్రుడు పాతపుత్రుడో.. కొత్త పుత్రుడో కానీ రాష్ట్రాన్నే పణంగా పెట్టి పదవుల్ని పొందాలని చూస్తున్న పుత్రుడు' అని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కనుక లాలూచీ పడితే కేంద్ర మంత్రి, గవర్నర్ వంటి పదవుల్ని పొందొచ్చని.. కానీ రాష్ట్రం సమై క్యత కోసం అధిష్ఠానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురిస్తూ ముందుకు సాగుతున్నాడని ప్రశంసించారు. పదవిని కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడి సమై క్యం కోసం సీఎం పోరాడుతుంటే.. దత్తపుత్రుడు మాత్రం పదవి కోసం రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడని విమర్శించారు.

సీమాంధ్ర ఎన్జీవోల చేత సమ్మె విరమించిన కిరణ్

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా సీమాంధ్ర ఎన్.జి.ఓలు సమ్మెను విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద జరిగిన చర్చల అనంతరం వారు సమ్మె విరమణకు అంగీకరించారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చేదాకా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.     'రాష్ట్ర విభజన జరగదని మీరు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశముందా?' అని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కేంద్రానికి సంబంధించి హామీ ఇవ్వలేనని, తాము మాత్రం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టంగా చెప్పారు. శాసనసభలో సమైక్య తీర్మానానికే మద్దతునిస్తానని పేర్కొన్నారు. "రాజ్యాంగంలోని 371(డి) అధికరణ మేరకు ఉద్యోగులకు రక్షణ కావాలి. ఉద్యోగుల పక్షాన కేంద్రానికి నివేదిస్తాం. 371(డి) ఉన్నంత కాలం ఉద్యోగులకు రక్షణ ఉంటుంది. దానిని తొలగించే హక్కు ఎవరికీ లేదు. దీనిపై అధిష్ఠానానికి లేఖ రాస్తాను. ఉద్యోగులకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. విభజన తీర్మానాన్ని వ్యతిరేకించడం, 371(డి)పై నా మాటలకు కట్టుబడి ఉంటాను. సమ్మె విరమించండి'' అని సీఎం కోరారు.

సమైక్యాంధ్ర అనగా...కొత్త నిర్వచనం

  కాంగ్రెస్ పార్టీ కొద్ది నెలల క్రితం కేసీఆర్ చేతిలోంచి తెలంగాణా తన్నుకుపోయినట్లుగా, ఇప్పుడు జగన్ చేతిలోంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, చివరికి అతని తల్లి విజయమ్మ కూడా కడుపు మాడ్చుకొని, ఎండనక వాననక తిరుగుతూ, అపసోపాలుపడి మరీ సాగిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యామాన్నికిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగుల సమ్మె విరమింపజేసేసి హైజాక్ చేసేసారు. దీనితో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు అత్యవసరంగా మరో కొత్త పాయింటు ఎత్తుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.   అందుకే తన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆయన ఈ రోజు కొత్త నిర్వచనం ఇచ్చారు. సమైక్యంద్రా అంటే కేవలం సీమాంద్ర హక్కుల కోసం పోరాటం కాదని, తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రా మూడు ప్రాంతాల హక్కుల కోసం చేస్తున్నపోరాటమని ఆయన పునర్నిర్వచించారు. తను మూడు ప్రాంతాల ప్రజలకి న్యాయం జరిగేందుకు వారి తరపున పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. (ఇది చంద్రబాబు వాదనతో సరిపోలితే ఉదార హృదయంతో అర్ధం చేసుకోవలసిందిగా మనవి. చంద్రబాబు కూడా మూడు ప్రాంతాల ప్రజలకి సమన్యాయం చేయాలనే పాపం కడుపుమాడ్చుకొని ఆసుపత్రి పాలయ్యారు కదా?) అయితే ఇపుడు సమైక్యంద్రా అంటే తెలంగాణను అడ్డుకోవడం కాదని, కేవలం మూడు ప్రాంతాలకు న్యాయం జరగాలనే చిరుకోరిక మాత్రమేనని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఈ కొత్త సిద్ధాంతం అమలు చేయాలంటే ముందుగా తెలంగాణాలో రోడ్డున పడ్డ వైకాపా నేతలకి మళ్ళీ లైన్ కలుపాలేమో? మరీ ఇన్నిట్విస్టులా?

జగన్ సభకు కిరణ్ గండి కొట్టారా

  సమైక్యాంధ్ర చాంపియన్ షిప్ రేసులో కిరణ్, జగన్ ల మధ్య తీవ్ర పోటీ సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాంపియన్ షిప్ కోసం జగన్ అష్టకష్టాలుపడుతుంటే కిరణ్ మాత్రం సింపుల్ గా వినాయకుడు పార్వతీ పరమేశ్వరులు చుట్టూ మూడు రవుండ్స్ తిరిగేసి కుమారస్వామిని ఓడించేసినట్లు, ఒంటి మీద ఖద్దరు చొక్కా మడత నలగకుండా, మీడియాను తన ఏసీ గదికే పిలిపించుకొని అమావాస్యకి పున్నానికి అధిష్టానానికి వ్యతిరేఖంగా మూడు ముక్కలు మాట్లాడేసి రేసుగుర్రంలా దూసుకెల్తున్నారు.   ఇంత కాలంగా ఉద్యోగులను సమ్మెలు, ప్రజలను ఉద్యమాలు చేసుకోనిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వారిని దువ్వడం చూసి, వెంటనే అప్రమత్తమయి ఉద్యోగులతో చర్చల ప్రక్రియ మొదలుపెట్టేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభకి కోర్టు అనుమతి కూడా ఇచ్చేయడంతో, ఉద్యోగులతో చర్చించి వారిచే సమ్మె విరమింపజేయడం ద్వారా అతని సభను చెవిటి వాడి ముందు శంఖారావంగా మార్చేసారు. ఉద్యోగులు ప్రజలు సమ్మెలు ఉద్యమాలు చేస్తున్నపుడే ఇటువంటి సమైక్య సభలకి ప్రాముఖ్యత ఉంటుంది గానీ, అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి ఉన్నపుడు చేయడం వలన వైకాపాకు శ్రమ, ఖర్చు తప్ప పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చును.   బహుశః ఇది గ్రహించినందునేనేమో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలు మన ఉద్యోగుల సమ్మెను ఆసక్తిగా చూస్తున్నపుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను బెదిరించొ బయపెట్టో వారిచేత ఆకస్మాత్తుగ్గా సమ్మె విరమింపజేసారని ఆవేదన వ్యక్తం చేసారు. పాపం అతని ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. అదేవిధంగా  కిరణ్ కుమార్ రెడ్డి చూపిన టైం సెన్స్ (టైమింగ్) ను కూడా మెచ్చుకోవలసిందే.

లగడపాటిపై జగన్ హాట్ కామెంట్

      విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ పై వైకాపా అద్యక్షుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్ గురించి తాను మాట్లాడటం మొదలు పెడితే 'పెంట మీద రాయి వేసినట్లే' అని అన్నారు. సమైక్యానికి వైయస్సార్ కాంగ్రెసుతో పాటు మజ్లిస్, సిపిఎంలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు. రేపు తమ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని చెప్పారు. జైల్లో ఉన్నా నిజాయితీగా రాజకీయం చేశా ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో అందరికీ తెలుసునని జగన్ అభిప్రాయపడ్డారు. తాను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ నిజాయితీగా రాజకీయం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిలబెట్టిన చంద్రబాబు కుమ్మక్కయ్యారా లేక మేమా అన్నది మీరే గుండె మీద చెయి పెట్టి ఆలోచించుకోవాలని జగన్ అన్నారు.

26న సమైక్య శంఖారావ౦

      ఈ నెల 26న హైదరాబాదులో సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి ఇచ్చారని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సమైక్యమంటే... తెలంగాణ..కోస్తాంధ్ర.. రాయలసీమ' అని చెప్పారు. తనకు మూడు ప్రాంతాలు సమానమేనని..ఆ మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా మైక్య శంఖారావ౦ ఉంటుందని తెలిపారు.   సమైక్యాంధ్ర కోసం తనతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారని చెప్పారు. కోర్టు అడ్డంకుల వల్ల తనకు ఢిల్లీ వెళ్లే అవకాశం లేకుంటే తమ పార్టీ ఎంపీల ద్వారా తన రాజీనామా లేఖను పంపిస్తానని, రాజీనామా ఆమోదించాలని తాను స్పీకర్ మీరా కుమార్‌ను విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.  

సీఎం కిరణ్ తో ఏపీ ఎన్జీవో నేతలు భేటి

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏపీ ఎన్జీవో ఉద్యోగ నేతలు సమావేశంమయ్యారు. చర్చల అనంతరం ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించేది, లేనిది మీడియా సమావేశంలో ప్రకటక చేయనున్నారు. గురువారం ఉదయం ఏపీఎన్జీవో భవన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతలు సమావేశయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడాల్సిన అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.   ఆర్టికల్ 371 డిని ఏ విధంగా పరిష్కరిస్తారో సీఎం నుంచి హామీ తీసుకుంటామని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చే హామీలపై నిర్ణయం తీసుకునేందుకు 15 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు అశోక్‌బాబు తెలిపారు. ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయంఅందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సీమాంధ్ర జిల్లాలలో సోనియా సమాధులు

      సోనియాగాంధీకి సమాధులు కడితే మా మీద కేసులు పెట్టాలని చిరంజీవి అంటున్నారు. ఇక ముందు ఆయనకు సమాధులు కట్టే రోజు ముందుంది. తెలంగాణ రాష్ట్ర విభజనతో సీమాంధ్ర విద్యార్థుల జీవితాలకు సమాధులు కడితే నోరు మెదపలేని వారు సోనియాగాంధీ చిత్రపటానికి సమాధి కడితే గగ్గోలు పెడుతున్నారు” అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో సోనియా చిత్రపటాలకు సమాధులు కడతామని, ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు.     టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిర్యాని కోసం ఆరాట పడుతున్నాడని, సీమాంధ్రులది రాగి ముద్దల కోసం సాగుతున్న పోరాటం అని అన్నారు. కేంద్రమంత్రులు, కాంగ్రెసు నేతలు విభజన జరుగుతుంటే, సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు ? వీరంతా సీమాంధ్ర ప్రయోజనాలకు సమాధి కట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ? సమాధులు కట్టినందుకు మా మీద కేసులు పెడతారా ? అప్పుడు సీమాంధ్ర సమాజం మా త్యాగాన్ని గుర్తిస్తుంది అని పయ్యావుల అన్నారు.  

పురంధేశ్వరి సీఎం కలలు

      రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర కు ముఖ్యమంత్రి కావాలని పురంధేశ్వరి కలలు కంటున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. విభజనపై దగ్గుబాటి దంపతులు శకుని పాత్ర పోషిస్తున్నారన్నారు. సీఎం పదవి కోసం పురంధేశ్వరి కొత్త స్వరం వినిపిస్తున్నారని, దగ్గుబాటి దంపతుల మాటలు నమ్మేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరని ఉమా అన్నారు. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తెచ్చి సమ్మె విరమింపజేయాలని సీఎం కిరణ్ కుట్ర పన్నారని, సోనియా డైరెక్షన్‌లోనే సీఎం పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాల విషయంలో ఎంపీ లగడపాటి డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. ప్రధానికిచ్చిన బ్లూప్రింట్‌ను పురంధేశ్వరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలని, రాష్ట్రాన్ని నాశనం చేశారని ఉమా వ్యాఖ్యానించారు.

సమైక్యంపై ప్రజలను మోసం చేయను

      రాష్ట్ర విభజన వ్యవహారం కీలకదశకు చేరుకున్న పరిస్థితులలో ప్రజలను మభ్యపెట్టలేనని, ఎవరయినా సీడబ్లూసీ తీర్మానానికి లోబడే వ్యవహరించాలని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. విభజన ఆగదని తెలిసి కూడా సీమాంధ్ర ప్రజలకు రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది అని చెప్పి మోసం చేయలేను చెప్పారు. ఈ రోజు ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భేటి తరువాత మాట్లాడుతూ.. ఈ నెల 18, 19 తేదీల్లో విభజన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని కలుస్తామని, సీమాంధ్ర ప్రయోజనాల గురించి పట్టుబడతామని కృపారాణి తెలిపారు. పైలిన్ తుపాను బాధితుల గురించి, ఇతర నష్టాల గురించి సోనియాగాంధీకి వివరించానని, తుపాను బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరానని తెలిపారు.

ఆర్టికల్.3 లోని నిజా నిజాలు

      రాష్ట్ర విభజన అంటూ జరిగితే - 7వ షెడ్యూలులో 1వ రాష్ట్రంగా ఉన్న 'ఆంధ్రప్రదేశ్', ఆర్టికల్ 3(e) ప్రకారం 'తెలంగాణా రాష్ట్రం' గా పేరు మార్చుకొంటుంది. 29వ రాష్ట్రమొకటి కొత్తగా ఏర్పడుతుంది. అయితే, దానికి పేరు లేదు; రాజధాని లేదు; రాజ్యాంగ అస్తిత్వం లేదు! ఉన్నదల్లా రాజకీయ నాయకుల చేతుల్లో మోసగించబడిన దిక్కు తోచని ప్రజలు, గత 56 సంవత్సరాలుగా అనేక రకాలుగా వెనుకబడిన కొంత భూభాగము మాత్రమే! ఇట్లాంటి ఒక రాష్ట్రం తమకు ఏర్పాటు చెయ్యమని ఆ ప్రాంత ప్రజలు ఎన్నడూ కోరలేదు. అందుచేత దానికి ఏమి పేరు పెట్టాలనే ఆలోచనే లేదు! రాజధాని ఎక్కడ ఉండాలనే తీర్మానమే లేదు!   ఆ ప్రాంత ప్రజల కోరిక లేకుండా, అందుకు సంబంధించిన విజ్ఞాపన లేకుండా, వాళ్లకి ఇష్టం లేకుండా - కనీసం వాళ్ళతో చర్చించకుండా, కొత్త రాష్ట్రం మాకొద్దు, మమ్మల్ని విడదీయ వద్దు అని మొత్తుకుంటున్నా, కొనసాగుతున్న హైదరాబాద్ స్టేట్ ఉరఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బలవంతంగా తన్ని తరిమేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా ఇంత నికృష్టంగా, ఇంత నిరంకుశంగా, ఒక రాష్ట్రం ఏర్పరిచిన సందర్భాలు ప్రజాస్వామ్య ప్రపంచంలో ఉన్నాయా? నిపుణులే తేల్చి చెప్పాలి!

రాష్ట్రపతి పాలనతో తెలంగాణ సాధ్యం

      రాష్ట్రపతి పాలన పెడితే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాని స్పష్టం చేశారు. "ఒక ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. కానీ, ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. లేదంటే తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న వారి ప్రకటనను అమలు చేయడం సాధ్యం కాదు'' అని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రాంతంలో ఎందరో చనిపోయారు. ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు . మా హయాంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయగలిగాం అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బీజేపీ మద్దతుపై తెలంగాణవాదుల నుంచే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అద్వాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషంగా ఉంది.

సమైక్య శంఖారావ౦ వాయిదా!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావ సభను వాయిదా వేసే ఆలోచనలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 19న హైదరాబాద్ సమైక్య శంఖారావ సభ నిర్వహించేందుకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు మంజూరు చేసింది. అయితే సమయం తక్కువగా ఉన్నందున అదికారులను ఈ విషయమై సంప్రదించి అదేరోజు నిర్వహించడమా? లేక మరోరోజు కు వాయిదా వేయడంపై వైకాపా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.   సభ ఏర్పాటుకు కాస్త సమయం పడుతుందని, గడువు తక్కువ ఉండటంతో సభను మరో తేదీలో నిర్వహిస్తామని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పారు. సంబంధిత అధికారుల అనుమతితో తాము తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలోనే సభను నిర్వహిస్తామన్నారు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే

  తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు సమైక్యాంధ్ర ఉద్యామాలు ఉద్యమాలే, వ్యాపారాలు వ్యాపారాలే అన్నట్లుంది మన రాజకీయవ్యాపారవేత్తల తీరు.   గత రెండు నెలలుగా ఏపీ ఎన్జీవోల సమ్మెతో, ఆ తరువాత మొదలయిన విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మూలానపడగా, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లాభాలు ఆర్జించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ సంస్థల ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో ఇతర రాష్ట్రాలలో సైతం విద్యుత్ కొరత ఏర్పడింది.   ఒకవైపు సీమాంద్రా జిల్లాలు విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొని విలవిలాడుతుంటే, సమైక్యవాద చాంపియన్స్ లో ప్రదముడిగా పేరొందిన లగడపాటి రాజగోపాల్ కు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ల్యాంకో పవర్ మరి కొన్ని సంస్థలు, ఇదే అదునుగా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకొని మంచి లాభాలు ఒడిసి పట్టాయి. ల్యాంకో పవర్, రిలయన్స్ ఎనర్జీ, స్పెక్ట్రం పవర్, విజ్జేశ్వరం గ్యాస్ మరియు జీవీకే జేగురుపాడు గ్యాస్ ప్లాంట్ సంస్థలు ఈ రెండు నెలల సమ్మె కాలంలో దాదాపు రూ.50నుండి 120 కోట్లు వరకు లాభాలు ఆర్జించాయి.   వీటిలో అందరి కంటే ఎక్కువగా లగడపాటికి చెందిన ల్యాంకో పవర్ సంస్థ-3 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి లాభాలలో ప్రధమ స్థానం ఆక్రమించగా, స్పెక్ట్రం పవర్-2, విజ్జేశ్వరం గ్యాస్-2, జీవీకే జేగురుపాడు గ్యాస్ ప్లాంట్-2, మరియు రిలయన్స్ ఎనర్జీ-1 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకొని లాభాలను కళ్ళజూసాయి.

పరేఖ్ వ్యాఖ్యలపై దిగ్విజయ్‌ ఆగ్రహం

      బొగ్గు కుంభకోణంపై పీసీ పరేఖ్ బహిరంగ ప్రకటనలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేఖ్ ఏదైనా చెప్పాలనుకుంటే పరేఖ్ సీబీఐకి చెప్పాలని సూచించారు. పరేఖ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. హిండాల్కోకు బొగ్గు గని కేటాయింపు సక్రమమే అని, హిండాల్కో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి కంపెనీ అని దిగ్విజయ్ తెలిపారు. మరోవైపు నిజాయితీపరుడుగా పేరొందిన పి.సి.ఫరేఖ్ పేరును సిబిఐ బొగ్గు కుంభకోణం కేసులో చేర్చడం చర్చనీయాంశం అవుతోంది.బొగ్గు శాఖలో పారదర్శక తేవడానికి కృషి చేసిన తనపై కేసు పెట్టడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నిజంగానే సిబిఐ ఇలాంటి వ్యక్తులపై కేసులు పెట్టడం ద్వారా కొంత అప్రతిష్టపాలయ్యే అవకాశం ఉంది.

కొంపముంచిన అత్యుత్సాహం

  కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనేకానేక గొప్ప సిద్ధాంతాలలో సోనియా, రాహుల్ గాంధీల భజన కార్యక్రమం కూడా ప్రముఖమయినది. కేంద్రమంత్రి నుండి కార్పొరేటర్ వరకు అందరూ తమ పదవులు సురక్షితంగా కాపాడుకోవాలంటే, గొప్పగా పనిచేయకపోయినా ఈ భజన కార్యక్రమం సర్వకాల సర్వావస్తలందూ కూడా నిష్టగా చేస్తూ ఉండాలి. అదే వారి పదవులకి శ్రీరామ రక్ష.అయితే ఒక్కోసారి వారు అత్యుత్సాహంతో చేసే ఈ భజన వల్లనే అమ్మ ఆగ్రహానికి గురవుతుంటారు. అందుకు ఉదాహరణగా ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ లో ఒక ప్రధాన కూడలిలో కొందరు ‘వీరభక్తులు’ పెట్టిన బ్యానర్ వ్యవవహారం గురించి చెప్పుకోక తప్పదు.   అలహాబాద్ లోని ఫూల్ పూర్ పార్లమెంటు నియోజక వర్గానికి గెలుపు గుర్రం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేస్తోంది. అయితే ఇక్కడ నుండి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా వాద్ర పోటీ చేస్తే బాగుటుందని పార్టీలో అభిప్రాయం ఉంది. కానీ రీటా బహుగుణ వంటి వేరే పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే, భజన సంస్కృతి నరనరాన్న జీర్ణించుకొన్న కొందరు కాంగ్రెస్ నేతలకు మాత్రం ఈ వ్యవహారమంతా నచ్చలేదు. నేరుగా ప్రియాంకా గాంధీకి ఆ సీటు అప్పగించకుండా ఇంకెవరి పేర్లో పరిశీలించడం ఏమిటని బాధపడుతూ, తమ ఆవేదనని ఒక బ్యానర్ రూపంలో బయటపడితే పార్టీ తమ కోరికను మన్నిస్తుందనే ఆలోచన రాగానే, అలహాబాద్ లో ఒక ప్రధాన కూడాలిలో ఒక పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసారు.   అందులో సోనియా, ప్రియాంకా గాంధీల ఫోటోలు వేసి క్రింద ఈ విధంగా వ్రాసారు. “అమ్మ ఇప్పుడు తరచు జబ్బు పడుతోంది. తమ్ముడు పని ఒత్తిడితో సతమవుతున్నాడు. అందువల్ల ప్రియాంక గాంధీ పూల్ పూర్ నుండి పోటీకి నిలబడి పార్టీని మళ్ళీ మూడో సారి అధికారంలోకి తీసుకు రావాలి.”   ప్రియాంకా గాంధీ పోటీ చేయాలనో, లేకపోతే పోటీ చేస్తే బాగుంటుందనో వ్రాస్తే సరిపోయే దానికి ప్రాస కోసం సోనియాగాంధీ తరచు జబ్బు పడుతోందని వ్రాసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు పాపం ఆ వీర భక్తులు. సోనియాగాంధీ గురించి ఆవిధంగా వ్రాసినందుకు సదరు నేతలందరికీ పార్టీ సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది కూడా.