సమైక్యాంధ్ర అనగా...కొత్త నిర్వచనం
posted on Oct 17, 2013 @ 10:13PM
కాంగ్రెస్ పార్టీ కొద్ది నెలల క్రితం కేసీఆర్ చేతిలోంచి తెలంగాణా తన్నుకుపోయినట్లుగా, ఇప్పుడు జగన్ చేతిలోంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, చివరికి అతని తల్లి విజయమ్మ కూడా కడుపు మాడ్చుకొని, ఎండనక వాననక తిరుగుతూ, అపసోపాలుపడి మరీ సాగిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యామాన్నికిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగుల సమ్మె విరమింపజేసేసి హైజాక్ చేసేసారు. దీనితో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు అత్యవసరంగా మరో కొత్త పాయింటు ఎత్తుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
అందుకే తన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆయన ఈ రోజు కొత్త నిర్వచనం ఇచ్చారు. సమైక్యంద్రా అంటే కేవలం సీమాంద్ర హక్కుల కోసం పోరాటం కాదని, తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రా మూడు ప్రాంతాల హక్కుల కోసం చేస్తున్నపోరాటమని ఆయన పునర్నిర్వచించారు. తను మూడు ప్రాంతాల ప్రజలకి న్యాయం జరిగేందుకు వారి తరపున పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. (ఇది చంద్రబాబు వాదనతో సరిపోలితే ఉదార హృదయంతో అర్ధం చేసుకోవలసిందిగా మనవి. చంద్రబాబు కూడా మూడు ప్రాంతాల ప్రజలకి సమన్యాయం చేయాలనే పాపం కడుపుమాడ్చుకొని ఆసుపత్రి పాలయ్యారు కదా?) అయితే ఇపుడు సమైక్యంద్రా అంటే తెలంగాణను అడ్డుకోవడం కాదని, కేవలం మూడు ప్రాంతాలకు న్యాయం జరగాలనే చిరుకోరిక మాత్రమేనని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఈ కొత్త సిద్ధాంతం అమలు చేయాలంటే ముందుగా తెలంగాణాలో రోడ్డున పడ్డ వైకాపా నేతలకి మళ్ళీ లైన్ కలుపాలేమో? మరీ ఇన్నిట్విస్టులా?