ఛత్తీస్‌గఢ్ లో రెండో విడత పోలింగ్ ప్రారంభం
posted on Nov 19, 2013 @ 10:34AM
ఛత్తీస్‌గఢ్ లో రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. 73 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. 843 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.40 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 18 స్థానాలకు ఈ నెల 11న తొలిదశ ముగిసిన నేపథ్యంలో చివరివిడతకు లక్షమందికిపైగా భద్రత సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలవారు 72 మంది చొప్పున పోటీలో ఉండగా, మొత్తంమీద 75 మంది మహిళలు కూడా రంగంలో ఉన్నారు.
తొలిదశలో కొన్ని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, తుది విడత 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు సాగుతుంది. ఇక రాజధాని రాయ్‌పూర్ (దక్షిణ) నియోజకవర్గంలో అత్యధికంగా 38 మంది, సరాయ్‌పలి స్థానంలో అతి తక్కువగా ఐదుగురు బరిలో ఉన్నారు.