జేసీ బ్రదర్స్ చేరిక వార్తలతో పరిటాల వర్గంలో ఆందోళన
posted on Nov 29, 2013 @ 11:39AM
జేసీ బ్రదర్స్ గా పేరుగాంచిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులకి సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఇద్దరూ తోడు దొంగలని జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. బొత్స కూడా వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసారు. అయితే సహజంగా కొంచెం ఆవేశపరులయిన వారిరువురు వైకాపాలో చేరి జగన్మోహన్ రెడ్డితో తాము సర్దుకు పోలేమని భావించడంతో, తెదేపావైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తెదేపాలోకి ఎంట్రీ దొరకకపోయినట్లయితే వారిరువురు స్వతంత్ర అభ్యర్దులుగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తేదేపాకు అనంతపురం జిల్లాలో మొదటి నుండి పరిటాల కుటుంబము కొండంత అండగా ఉంటూ వచ్చింది. పరిటాల రవి హత్యకు గురయిన తరువాత కూడా ఆయన అర్ధాంగి పరిటాల సునీత, వారి కుమారుడు పరిటాల శ్రీరామ్ మరియు అనుచరులు అందరూ కూడా తేదేపాను జిల్లాలో బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా తెదేపా కూడా వారికి అన్నివిధాల అండదండగా నిలుస్తోంది.
అయితే ఇప్పుడు తమ రాజకీయ ప్రత్యర్దులయిన జేసీ బ్రదర్స్ తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వస్తున్న వార్తలతో సహజంగానే పరిటాల వర్గంలో ఆందోళన మొదలయింది. వారిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలోకి అనుమతించే ప్రసక్తే లేదని పరిటాల సునీత ఇటీవల మీడియాతో అన్నట్లు తెలుస్తోంది. తెదేపా అధిష్టానం మాత్రం ఇంకా ఈ వార్తలపై స్పందించలేదు.