శాసనమండలికి సి రామచంద్రయ్య
posted on Jun 3, 2014 @ 7:48PM
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభాపక్షం నేతగా మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క నేత కూడా శాసనసభకు ఎన్నిక అవనందున, శాసనసభలో కాంగ్రెస్ ప్రతినిధులు ఉండబోరు. మున్ముందు ఎప్పుడయినా ఉపఎన్నికలు జరిగి, అందులో కాంగ్రెస్ సభ్యులు గెలవగలిగితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ కాలుపెట్టగలదు. లేకుంటే వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట భజన చేసుకొంటూ కాలక్షేపం చేయవలసిందే. 543మంది సభ్యులుండే లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందేందుకు కనీసం 10 శాతం (55మంది ) యంపీలు ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మంది యంపీలే ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ దయతలచి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కల్పించేందుకు అంగీకరించింది. బహుశః ఈ అవమానం భరించలేకనే సోనియా, రాహుల్ గాంధీలు పార్టీ పార్లమెంటరీ నాయకులుగా బాధ్యతలు చెప్పట్టేందుకు నిరాకరించారు. మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్ ఖార్గే ను లోక్ సభలో పార్టీ నాయకుడిగా నియమించబడ్డారు. గత పదేళ్ళు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడం స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. ఇక తెలంగాణా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా కే.జానా రెడ్డి ఎంపికయ్యారు. శానమండలికి పార్టీ తరపున డీ. శ్రీనివాస్ నాయకుడిగా, షబ్బీర్ ఆలి ఉపనాయకుడిగా ఎంపికయ్యారు.