ఫేస్ బుక్ లో కామెంట్స్ చేస్తే జైలుకేనా!
posted on Jun 13, 2014 @ 11:47AM
దాదాపు ఏడాదిన్నర క్రితం ముంబైలో ఒక యువతి ఫేస్ బుక్ లో ఒక రాజకీయ ప్రముఖుడి గురించి చిన్న విమర్శ చేస్తే దానిని మరొక అమ్మాయి లైక్ చేసినందుకు ఆ ఇద్దరినీ ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పుడు ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో, కోర్టు జోక్యం చేసుకొని పోలీసులకి చివాట్లు పెట్టిన తరువాత వారిరువురినీ విడిచి పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఫేస్ బుక్ లో రాజకీయ నేతలపై కామెంట్స్ చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం సబబా కాదా?అనే అంశంపై మీడియాలో చాలా చర్చ జరిగింది. కానీ మీడియాకు ఆ తరువాత మరో హాట్ టాపిక్ దొరకడంతో దానిని వదిలి కొత్త టాపిక్కి జంపైపోవడంతో ఆ ఫేస్ బుక్-కామెంట్స్, చర్చ కధ అలా ముగిసిపోయింది.
మళ్ళీ ఈ మధ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అటువంటి కేసు మరొకటి బయటపడింది. జిల్లాకు చెందిన తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పోలీసులకి పిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే స్పందించి రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.
తను గల్ఫ్ దేశానికి చెందిన ఒక బ్యాంక్ నుండి అప్పు తీసుకొని ఎగవేశానని, ఆర్మూరులో దాదాగిరీ చెలాయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నానని, రమేష్ రెడ్డి ఫేస్ బుక్ లో తనపై అసత్య ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.
సాదారణంగా సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్యకర, దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలు పెడితేనే పోలీసులు తీవ్రంగా పరిగణించి కేసులు నమోదు చేస్తుంటారు. రాజకీయ నాయకులూ నిత్యం ఒకరిపై మరొకరు మీడియా ద్వారా దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే కనుక అటువంటి వాటిని వారు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకొంటే మరే ఇతర నేరాలను చూసేందుకు వారికి సమయం కూడా మిగలదు.
రమేష్ రెడ్డి ఆరోపణల వలన తన పరువుకు భంగం కలుగుతోందని ఎమ్మెల్యేగారు గనక భావిస్తే, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లుగా ఆయన కూడా కేసు వేసుకోవచ్చును. కానీ ఆయన పోలీసులకి పిర్యాదు చేయడం, దానిపై వారు స్పందిస్తూ అతనిపై కేసు నమోదు చేయడంతో కధ మళ్ళీ పునరావృతమయి, ఇదివరకు మధ్యలో నిలిపివేసిన ఫేస్ బుక్ చర్చ తిరిగి మొదలయ్యేలా ఉంది.