30వ రాష్ట్రంగా ‘దక్షిణ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి
posted on Jul 26, 2014 @ 4:38PM
మరో కొత్త రాష్ట్రం ఏర్పాటు అవ్వాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఈ అంకురార్పణ చేసిన వారు తెలంగాణ టీడీపీ నాయకుడు, కోడంగల్ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్‌లో కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే అవకాశం ఇచ్చి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దక్షిణ తెలంగాణ అంటే చిన్న చూపు అని, అందుకే దక్షిణ తెలంగాణకు చెందిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూడటం భావ్యం కాదని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సూచించారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణ విషయంలో తన నిర్లక్ష్య ధోరణిని ఇలాగే కొనసాగిస్తే, దక్షిణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ఉద్యమం మొదలై, భవిష్యత్తులో దేశంలో 30వ రాష్ట్రంగా ‘దక్షిణ తెలంగాణ’ ఏర్పడుతుందేమోనని రేవంత్‌రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.