ఘోర విషాదం.. పాట్నాలో 33 మంది దుర్మరణం...

  బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో దసరా రోజున ఘోర సంఘటన జరిగింది. పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో 33 మంది మృత్యువాత పడ్డారు. రావణ దహనం కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ తిరిగి వెళ్తుండగా జరిగిన తొక్కిసలాటలో 33 మంది మరణించారు. మరణించిన వారిలో ఆరుగురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. గాయపడినవారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాట్నాలో జరిగే రావణ దహన కార్యక్రమానికి లక్షల మంది జనం హాజరయ్యారు. వీరంతా కార్యక్రమం ముగిసిన తర్వాత వెనుదిరిగి వెళుతుండగా పెద్ద శబ్దంతో ఎలక్ట్రిక్ పోల్ పడిపోవడంతో బాంబు పేలిందనే భయాందోళనలకు ప్రజలు గురయ్యారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన తర్వాత ఎలక్ట్రిక్ పోల్ పడిపోవడంతో మేళాలో చీకటి అలుముకుంది.ఆ గందరగోళంలో ఈ దుర్ఘటన జరిగింది.

జీన్స్ వల్లే మహిళలకు ఇబ్బందులు: యేసుదాస్

  గాయకుడు కేజే ఏసుదాస్ మహిళల వస్త్రధారణ మీద చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. గాంధీజయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ కార్యక్రమంలో యేసుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు జీన్స్ ధరించడాన్ని ఆయన తప్పుబట్టారు. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. యేసుదాసు వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. యేసుదాసు దేశం గర్వించదగ్గ గాయకుడు అనటంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం విచారకరమని మహిళా సంఘాల వారు అంటున్నారు.

దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం

  గాంధీ జయంతి నాడు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చీపురు పట్టుకుని ఢిల్లీలో వీధులను ఊడ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయ నాయకులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అధికారులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ప్రజానీకం కూడా స్వచ్ఛ భారత్ పిలుపుకు సానుకూలంగా స్పందించారు. గాంధీ జయంతి నాడు తమతమ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు.

నన్ను వ్యభిచారం కేసులో ఇరికించారు: హీరోయిన్

  ఆమధ్య వ్యభిచారం కేసులో అరెస్టయి, ప్రస్తుతం ప్రభుత్వ జువైనల్ హోమ్‌లో వున్న టాలీవుడ్ కథానాయిక కేసు కీలక మలుపు తిరిగింది. తనకు ఏ పాపమూ తెలియదని, సంతోషం అవార్డుల నిర్వాహకులు ఒక పెద్ద హోటల్లో బుక్ చేసిన గదికి వెళ్ళానని, అంతకుమించి తనకేమీ తెలియదని అంటున్నారు. పోలీసులు కూడా ఈ హోటల్ గదిని సంతోషం అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసినట్టు గుర్తించారు. నిజనిర్ధారణ కోసం సంతోషం అవార్డ్స్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. తనను పోలీసులు అన్యాయంగా ఇరికించారని బాధితురాలు వాపోతోంది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు మాత్రమే ఆ హోటల్ గదికి వెళ్లానని పేర్కొంది. తాను విద్యార్థిని అని, గ్రాడ్యుయేషన్ చేస్తున్నానని కూడా కోర్టుకు తెలిపింది.

తొమ్మిదిమంది సెలబ్రిటీలకు మోడీ ఛాలెంజ్

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...తొమ్మిదిమంది సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యంలో పాల్గొనాలని ఆయన ఆ తొమ్మిదిమంది సెలబ్రిటీలకు ఛాలెంజ్ విసిరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆ తొమ్మిది మంది స్వచ్ఛ భారత్లో పాల్గొని...వారి మరో తొమ్మిదిమందికి ఆహ్వానం పలకాలని కోరారు. మోడీ ఆహ్వానం పలికినవారిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండుల్కర్, కమల్ హాసన్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు. కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.

స్వచ్ఛ భారత్: రోడ్డు ఊడ్చిన మోడీ

  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ స్వయంగా చీపురు పట్టారు. ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తారు. మోడీతో పాటు పలువురు మంత్రులు, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు అయిదు వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు మోడీ వాల్మీకి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

గాంధీమార్గంలో నడిచే గ్రామం.. రణవేడే!

  ‘అహింస’ తిరుగులేని ఆయుధమని నిరూపించిన మహాత్ముని జయంతి ఈరోజు. అతని పాదముద్రలు పడిన నేలపైనే మనం కూడా వున్నామన్న ఆలోచనే గర్వంగా అనిపిస్తుంది. ఒకప్పుడు అటువంటి ఓ వ్యక్తి ఈ నేలమీద నడయాడాడని చెబితే భవిష్యత్తు తరాలు నిజమా అని నివ్వెరపోయే వ్యక్తిత్వం ఆయనది. గాంధీ జయంతి అనగానే ఒక్కసారిగా ఆ శాంతి స్వరపం, సహనం నిండుగా కలిగిన చిరునవ్వు మన కళ్లెదుట నిలుస్తాయి. మహనీయుల గురించి విన్నాచాలు, ఆ లక్షణాల గురించి తలచుకున్నా చాలు. వాటి నుంచి ఎంతోకొంత శక్తి మనల్ని ఆకర్షిస్తుంది. ఒకటో రెండో లక్షణాలు ఎప్పడో అప్పుడు మనలో పాదుకుంటాయి అంటారు పెద్దలు. మరి ఈరోజున ఆ మహాత్ముని తలచుకుని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను నమ్మి, ప్రేమించి, ఆచరించే ‘సౌశీల్యం’ అందరికీ రావాలని కోరుకుందాం.   మహాత్మా గాంధీగారు వ్యక్తి విషయంలో అయినా, గ్రామం విషయంలో అయినా ఓ దేశం విషయంలో అయినా ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. ‘స్వయం సమృద్ధి’ వుండాలని. స్వయం సమృద్ధి సాధించడానికి స్వయం నియంత్రణ, అందుకు తగ్గ ఆచరణ ముఖ్యం. ఆయన కలలు కన్న భారతావని నేటికీ సాధ్యపడిందో లేదోగానీ, ఆయన కలలు కన్నట్టు స్వయం సమృద్ధిని సాధించిన గ్రామం ఒకటుంది. దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. గత 25 సంవత్సరాలుగా ఆ గ్రామంలోని పౌరులెవ్వరూ కోర్టుకుగానీ, పోలీస్ స్టేషన్‌కి గానీ వెళ్ళలేదంటే నమ్మగలరా? ఒక్క గ్రామస్థుడికి  కూడా ‘అప్పు’ లేదు. సరికదా, ఏ బ్యాంకులోనూ లోను కూడా లేకుండా వున్నాడంటే నమ్మగలరా!  ఏ రాజకీయ పార్టీతో గానీ, ప్రభుత్వ పథకాలతోగానీ పనిలేదు ఆ గ్రామస్థులకి. అదే రణవేడే (Ranavede) గ్రామం. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో రాయ్‌ఘడ్ జిల్లాలో వుంది రణవేడే గ్రామం. 400 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ గ్రామమిది. ఇప్పడికీ మనం ఆ గ్రామంలోకి అడుగుపెడితే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మధ్య దూరం పది నుంచి పన్నెండు అడుగులదాకా వుంటుంది. అదీ చక్కగా, శుభ్రంగా, ఏ చెత్తాచెదారం లేకుండా. ఒక ఇంటి నుంచి మరో ఇంటి మధ్య ఖాళీ స్థలంలో మొక్కలు వుంటాయి. ఇదంతా గ్రామస్థులందరూ ఎప్పటి నుంచో ఇష్టంగా పాటిస్తూ వస్తున్న నియమమట. రణవేడే గ్రామంలో ఒకే ఒక్క పచారీ కొట్టు వుంది. గ్రామస్థులంతా ఆ కొట్టు నుంచే తమ నిత్యావసర వస్తువులు కొంటారు. అది ఒకరకంగా గ్రామస్థుల ఉమ్మడి నిర్వహణలో నడుస్తున్న కొట్టు. అలాగే గ్రామస్థులంతా కలసి ఓ బడిని, ఓ గుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం, సాయంత్రం గ్రామంలోని వారంతా ఒక్క చోట చేరి సామూహిక ప్రార్థనలు, పూజలు చేస్తారు. ఈ గ్రామస్థులలో ఎవరికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం వుండదు. అన్ని రాజకీయ పార్టీలవారిని ఆదరిస్తారు. కానీ, గ్రామస్థులంతా కలసి నిర్ణయించుకుని ఒక్కరికే ఓటు వేస్తారు. అలాగే గ్రామపెద్దల మాట ఎవరూ జవదాటరు. ఎలాంటి బలవంతం, బెదిరింపులు వుండవు. ఇప్పటితరం కూడా గ్రామ నియమాలని గౌరవిస్తుంది.. పాటిస్తుంది. గ్రామంలో అన్ని వృత్తులవారూ వుంటారు. ఒకరికొకరు సాయపడతారు. ఎవరికీ ఎవరూ పోటీ కాదు. తమకి కావలసిన ఆహార పదార్ధాలని తామే పండించుకుంటారు. ‘ఇమిటేషన్ జ్యూయలరీ’ తయారీ ఈ గ్రామస్థులలో చాలామందికి ఉపాధి మార్గం. అన్ని కులాలవారు, మతాలవారు కలసిమెలసి సహజీవనం సాగిస్తారు. ఏ అల్లర్లు, అలజడులు దరిచేరని గ్రామమది. ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రకృతితో సహజీవనం మా విజయ సూత్రాలని గర్వంగా చెబుతారు.  రణవేడే గ్రామస్థులు. గ్రామస్థాయిలో మొదలయ్యే అభివృద్ధి నిస్సందేహంగా దేశ స్థితిగతులను అభివృద్ధి దిశలో నడిపిస్తుంది. ఆదర్శ గ్రామం రణవేడే గురించి వినగానే గాంధీ మహాత్ముడి కలల గ్రామం కళ్ళెదుట నిలిచినట్టు వుంది కదూ. -రమ  

వయాగ్రా వాడితే కళ్ళు కెవ్వు..

  వయాగ్రా ఎక్కువ కాలం వాడితే కంటి చూపు దెబ్బతింటుందని పరిశోధనలలో వెల్లడయింది. వయాగ్రా వాడేవాళ్ళలో కొంతమంది లక్కు ఏంటంటే, ఈ సమస్య అందరికీ రాదట. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందట. రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ అడ్డుకుంటుంది. వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించేవాళ్లకు కంటి పరమైన సమస్యలు రావచ్చన్న విషయం ఇంతకుముందు ఔషధ ప్రయోగాలలో కూడా తేలింది. తాజాగా ఈ సరికొత్త  విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్కు చెందిన లీసా నివిజన్ స్మిత్ తెలిపారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అనే కంటి వ్యాధికి సంబంధించి మ్యుటెంట్ జన్యువు కాపీ ఒక్కటే ఉన్నవాళ్ళకే కళ్ళకు సంబంధించిన సమస్య వస్తుందని తెలుస్తోంది.

మంత్రిగారినిని సజీవ దహనం చేసేవారే...

  బీహార్‌లో ఓ మంత్రిగారిని ఆయన నియోజకవర్గం ప్రజలు సజీవ దహనం చేయబోయారు. బీహార్‌లోని ససారం జిల్లాలో రోహతాస్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నియోజకవర్గంలో తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బిహారీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లు సరిగా లేవంటూ కొందరు స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదికపైకి కుర్చీలను విసిరేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన స్థానికులు వేదికపై విరుచుకుపడ్డారు. మంత్రిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. మంత్రి అధికార వాహనంపై స్థానికులు పెట్రోల్ పోసి, నిప్పు పెట్టారు. ఆయనపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానిక పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చి మంత్రిగారిని కాపాడారు. ఈ సంఘటనలో మొత్తం ఐదు వందల మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్టీఆర్‌కి భారతరత్న: మంత్రివర్గం తీర్మానం

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మూడు కీలకమైన తీర్మానాలను ఆమోదించారు. వాటిలో ఒకటి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేయడం, రెండోది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారకాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని, మూడోది అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలపటం. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ఆంధ్రప్రాంతానికి చెందిన వారి విగ్రహాలను తొలగించాలని కేసీఆర్ భావించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఖండించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

తండ్రి విజయవాడలో... కొడుకు కుప్పంలో బిజీబిజీ

  రేపు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న జన్మభూమి, ఎన్టీఆర్ సుజల , ఎన్టీఆర్ భరోసా తదితర కొత్త పధకాలను ఆరంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ రానున్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్చ భారత్’ కూడా రేపటి నుండి రాష్ట్రంలో మొదలుపెడతారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విజయవాడలో పలు ప్రాంతాలలో పర్యటిస్తారు.   అదే సమయంలో ఆయన కుమారుడు లోకేష్ స్వగ్రామమయిన కుప్పంలో యన్టీఆర్ సుజల స్రవంతి పధకాన్ని ఆరంభిస్తారు. ఆ తరువాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత సాయంత్రం 4గంటలకు అనిమాగినిపల్లె గ్రామంలో యన్టీఆర్ సుజల స్రవంతి పధకంలో భాగంగా శుద్ధి చేయబడిన మంచి నీళ్ళు అందించే ప్లాంటును ఆరంభిస్తారు. తిరిగి రాత్రికి బెంగళూరు మీదుగా హైదరాబాదు చేరుకొంటారు.