కెనడా పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి?

      కెనడా పార్లమెంటుపై గుర్తు తెలియని కొందరు దుండగులు బుదవారంనాడు కాల్పులు జరిపారు. రాజధాని ఒట్టావా నగరంలో గల జాతీయ యుద్ద స్మారక స్థూపం వద్ద పహరా కాస్తున్న సైనికుడు ఒకరు ఈ కాల్పులలో మరణించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రత్తమయిన కెనడా భద్రతాదళాలు పార్లమెంటును చుట్టుముట్టి ఎదురు కాల్పులు జరుపగా దాడికి పాల్పడిన వారిలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. పార్లమెంటుపై దాడి జరిగిన సమయంలో లోపల కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పెర్ తో సహా అనేకమంది లోపల ఉన్నారు. భద్రతా దళాలు వారందరినీ క్షేమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం మూడు నుండి ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి.   సిరియా, ఇరాక్ దేశాలలో పెట్రేగిపోతున్న ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులపై యుద్దానికి దిగిన అమెరికా, ఫ్రాన్స్ మరి కొన్ని దేశాలతో కెనడా కూడా చేతులు కలిపినప్పటి నుండే ఆ దేశంలో ఇటువంటి చెదురు ముదురు ఘటనలు జరగడం మొదలయ్యాయి. కనుక ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యతా వహిస్తున్నట్లు ప్రకటించలేదు.

ఏపీ అభివృద్ధికి సహకరిస్తామన్న జపాన్ బృందం

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని జపాన్‌కి చెందిన ప్రతినిధుల బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జపాన్ ప్రతినిధి బృందం బుధవారం కలిసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను జపాన్ బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పారిశ్రామికవాడలో భాగస్వాములం అవుతామని ఆ బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులను చేపట్టడానికి కూడా జపాన్ బృందం ఆసక్తి చూపించింది. 400 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి సహకరిస్తామని జపాన్ బృందం తెలిపింది.

టీ సర్కార్‌కి ముందుచూపు లేదు... చంద్రబాబు

  తమ ప్రభుత్వం ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు చేసిందని, విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నిస్తోందని, ఇది సమంజసం కాదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన నియమ నిబంధనలను కూలంకషంగా వివరించారు. జులైలో జరిగిన సమావేశంలో ఈ నిబంధనలన్నిటికీ ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. ఇలా నీటిమట్టం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తి చేస్తే భవిష్యత్తులో తాగునీటి సమస్య వస్తుందని వివరించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి నుంచి 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇస్తామని, అయితే భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టుల నుంచి కూడా విద్యుత్ కావాలని అడగటం సమంజసం కాదని, తాము అలా ఇవ్వబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ఇబ్బందులు తెలిసే 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని చెప్పామని ఆయన తెలిపారు.

మోడీ బాంబులు.. ప్రియాంక కాకరపువ్వొత్తులు...

  ప్రస్తుతం దీపావళి టపాకాయల మార్కెట్లో రాజకీయ నాయకుల పేర్లతో రూపొందించిన బాణాసంచా అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. దేశ రాజకీయాల్లో తారాజువ్వలా ఎగిరిన భారత ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ‘మోడీ బాంబులు’ అంటూ ప్రత్యేకంగా తయారుచేసి అమ్ముతున్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక పేరుతో కాకరపువ్వొత్తులు విక్రయిస్తున్నారు. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ పేరు మీద కూడా బాణాసంచా కంపెనీలు మందుగుండు సామగ్రిని తయారు చేశాయి. ఇలా సెలబ్రిటీల పేర్లతో, ఫొటోలతో తయారు చేసిన టపాకాయలకు గిరాకీ బాగానే వుందని వ్యాపారులు చెబుతున్నారు.

18 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగి

  కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాగశేఖర్ రెడ్డి అనే క్లర్క్ తన టాలెంట్ చూపించి బ్యాంక్ ఖాతాదారులకు చెందిన 18 లక్షల రూపాయలను నొక్కేశాడు. బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బును తన ఖాతాలోకి, తనకు తెలిసినవారి ఖాతాల్లోకి మళ్ళించి సొంతం చేసుకున్నాడు. నాలుగేళ్ళ క్రితం ఈ బ్రాంచ్‌కి వచ్చిన ఈయనగారు అప్పటి నుంచి మెల్లమెల్లగా ఇంత డబ్బు స్వాహా చేశాడు. మూడు నెలల క్రితం బ్యాంకుకు చెందిన డబ్బులో తేడా కనిపించిందని, ఆ తర్వాత బ్యాంకు అధికారులు జరిపిన పరిశోధనలో నాగశేఖర్ రెడ్డి నిర్వాకం బయటపడిందని తేలింది. బ్యాంకు అధికారులు ఇతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ ఆఫీసుపై దాడి దారుణం

  నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద టీఆర్ఎస్ దాడి దారుణమని, ఈ దాడిని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నాయకుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ అన్నారు. గడచిన మూడు నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తే రైతుల ఆత్మహత్యలు జరిగేవి కాదని దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వం కరవు నివేదికలను సకాలంలో కేంద్రానికి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విషయంలో ఏపీ సీఎం ఉదారంగా వుండాలని సూచించారు. అలాగే జీహెచ్‌ఎంసీని విభజిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్నదని దత్తాత్రేయ అన్నారు.

శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి వద్దు.. బోర్డు

  శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు కనీస స్థాయికి చేరాయి. ఆ నీటిని ఉపయోగించి ఇంకా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వెళ్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మంచినీటి సమస్య వచ్చే ప్రమాదం వుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నీటితో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ వుండటంతో నిలిపేయాల్సిందిగా సూచించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సూచనను ఖాతరు చేయకుండా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించింది. విద్యుత్ కేంద్రం వద్ద మిలటరీ పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఇకపై శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని సూచించింది. శ్రీశైలం నీటిమట్టం విషయంలో గతంలో జరిగిన ఒప్పందాలకు రెండు రాష్ట్రాలూ కట్టుబడి వుండాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే వుంది.

విశాఖకు కేంద్రం అండగా వుంటుంది

  హుదుద్ తుఫాను ధాటికి కకావికలు అయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖపట్నం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. విశాఖ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా వుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. బుధవారం నాడు ఆయన విశాఖలో పర్యటించారు. విశాఖలో తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున పక్కా ఇళ్ళు మంజూరు చేయనున్నామని వెంకయ్య తెలిపారు. బుధ, గురువారాల్లో తాను విశాఖపట్నంలోనే వుంటానని, ఈ ఏడాది దీపావళిని తాను విశాఖ తుఫాను బాధితులతో కలసి జరుపుకుంటానని వెంకయ్య చెప్పారు.

తెలంగాణకు విద్యుత్ ఇస్తా.. చంద్రబాబు

  కరెంటు కష్టాల్లో కూరుకుపోయి వున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్టయితే ఆ రాష్ట్రానికి 300 మెగావాట్ల కరెంట్ సరఫరా చేయడానికి సిద్ధంగా వున్నామని ప్రకటించారు. అయితే తెలంగాణలో కరెంట్ కష్టాలకు తానే కారణమని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సమస్య వుంటుందని తెలిసి కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకుండా తనపై విమర్శలు చేయడం న్యాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా వుందని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలం డ్యామ్‌లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని, విద్యుత్ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే ఎండాకాలంలో తాగడానికి ఇరు రాష్ట్రాల ప్రజలకు నీళ్లు ఉండవని ఈ ఉద్దేశంతోనే తాను శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించానన్నారు. దీనికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మెగావాట్ల కరెంట్‌ను తెలంగాణకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

‘అభినందన’, ‘నీరాజనం’ దర్శకుడి కన్నుమూత

  ‘అభినందన’, ‘నీరాజనం’ చిత్రాల దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ (72) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం నాడు ఆయన చెన్నైలో మరణించారు. అశోక్‌కుమార్ అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అశోక్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘అభినందన’ చిత్రం మ్యూజికల్ హిట్ అయింది. అలాగే మరో చిత్రం ‘నీరాజనం’ సినిమా విజయం సాధించకపోయినప్పటికీ, ఆ సినిమా సంగీతం పెద్ద హిట్ అయింది. ఆయన దర్శకత్వం వహించిన ‘మంచుకురిసే వేళలో’ అనే మరో సినిమా నిర్మాణం పూర్తి కాకముందే ఆగిపోయింది. అశోక్ కుమార్ మ‌ృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

ఫరీదాబాద్‌లో 200 బాణాసంచా దుకాణాల దగ్ధం

  దేశ వ్యాప్తంగా బాణాసంచా ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది మరణించారు. అలాగే మచిలీపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించారు. ఇదిలా వుంటే హర్యానాలోని ఫరీదాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫరీదాబాద్‌లో బాణాసంచా అమ్మే మార్కెట్లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ మార్కెట్లో వున్న 200 బాణాసంచా దుకానాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. బాణాసంచా మార్కెట్లో ఏ దుకాణమూ మిగల్లేదు.

జూనియర్ డాక్టర్ల మీద కఠిన చర్యలు: టీ సర్కార్

  గ్రామీణ ప్రాంతాలలో ఒక సంవత్సరం డాక్టర్లు వైద్య సేవలు అందించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించకుంటే వారి మీద కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా వుందని డీఎంఇ ప్రకటించింది. జూడాలు ఇలాగే వ్యవహరిస్తే వారిమీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని, జూడాలు చర్చలకు ముందుకు రాకపోవడం సరికాదని, గ్రామీణ సర్వీసుల నిబంధన న్యాయస్థానాల్లో వుందని, దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని డీఎంఇ ప్రకటించింది. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని డీఎంఇ పేర్కొంది.