'గే వరుడు కావలెను'... సూపర్ రెస్పాన్స్

రెండు రోజుల క్రితం వచ్చిన 'గే వరుడు కావలెను' అను ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా 73 మంది నుండి ప్రపోజల్స్ వచ్చాయని గే హరీష్ తల్లి పద్మ అయ్యర్ తెలిపారు. ఈ ప్రకటనకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, తన వయసు 58 సంవత్సరాలు తను ఈ లోకాన్ని విడిచి వెళ్లేలోపు తన కుమారుడిని ఒక ఇంటి వాడిని చేద్దామనే ఉద్దేశంతోనే ప్రకటన ఇచ్చానని పద్మ అయ్యర్ తెలిపారు. ఒక్క భారత్ లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్‌ చెప్పారు.

జయలలిత ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు

  అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలితతో పాటు మరో 28 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రుల సామూహిక ప్రమాణ స్వీకారం తమిళనాడు చరిత్రలోనే మొదటిసారి. మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ ఆడీటోరియంలో జరిగిన జయలలిత ప్రమాణ స్వీకారానికి సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, హీరో శరత్ కుమార్, జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ, కొడుకు సుధాకర్, కుటుంబసభ్యులు హాజరయ్యారు. అంతేకాక పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జయలలిత ప్రమాణ స్వీకారానికి తరలి వచ్చారు.

చిన్నారిని చంపేసిన పులి

బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఓ పులి దాడి చేసి చంపేసింది. వివరాల ప్రకారం.. బెరిహండీ గ్రామ సమీపంలో వాల్మీకి నేషనల్ పార్క్ సమీపంలో చిన్నారి బబ్లూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పులి ఆకస్మాత్తుగా వచ్చి బబ్లూపై పడి దాడి చేసి అతని శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్థలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే వాల్మికి నేషనల్ పార్క్ లో గత మూడేళ్లలో పులల సంఖ్య ఎక్కువైందని, పార్క్ పరిసర ప్రాంత ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చనిపోయిన బబ్లూ కుటుంబానికి ప్రభుత్వ విధానం ప్రకారం రూ.2లక్షల రూపాయలు నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు.

భానుడి భగభగ... ఐఎండీ రెడ్ అలర్ట్

గత రెండురోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కవైంది. ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరించింది. ఎండ తీవ్రతకు తెలంగాణ రాష్ట్రంలో 223 మంది, ఆంధ్ర రాష్ట్రంలో 204 మంది మొత్తం రెండు రాష్ట్రాలల్లో కలిపి 427 మంది మరణించారు. హైదరాబాద్ లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా గత ఐదేళ్లలో ఇదే అత్యధికం అని అధికారులు తెలిపారు. కాగా వడదెబ్బ వల్ల చనిపోయిన కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ.50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.

నలుగురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఆ నలుగురు కృష్ణాజిల్లాకు చెందిన టీడీ జనార్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్. అయితే మొదట విజయవాడ మాజీ మేయర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధకు స్థానం ఇవ్వాలనుకున్న అధిష్ఠానం చివరి నిమిషంలో అభిప్రాయం మార్చుకొని ఆ స్థానాన్ని బీద రవిచంద్రయాదవ్ కు ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ నలుగురు ఎమ్మెల్సీలు ఆరెళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

కేసీఆర్ కుట్రలు తిప్పి కొడతాం... ఓయూ

ఉస్మానియా యూనివర్శిటిలో విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓయూలో ఉన్న భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓయూ విద్యార్ధుల సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు ఓయూలోని ఇంచి భూమిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు ఓయూ భూముల పట్ల ఉన్న బుద్ధి మారాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని సరస్వతి దేవాలయంలో ప్రత్యేకపూజలు కూడా చేశారు. ఓయూ లో భూములను విద్య కోసం ఉపయోగించాలే తప్ప ఇతర అవసరాలకు ఉపయాగిస్తే కేసీఆర్ ను ఆర్ట్స్ కాలేజీ కిందే బొంద పెడతామని విద్యార్ధిసంఘాలు హెచ్చరించాయి. ఓయూ భూముల పై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయనున్నారు. ఓయూ నిరుద్యోగ జేఏసీ చెైర్మన్ కల్యాణ్ మాట్లాడుతూ కేసీఆర్ ఓయూ భూములపై చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని వ్యాఖ్యానించారు.

రామ్‌ చరణ్‌ తేజ్ విమానం ల్యాండ్ అయింది

  ప్రముఖ తెలుగు సినిమా నటుడు రామ్‌ చరణ్‌ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌-‘ట్రూజెట్‌’ అనే పేరుతో దేశంలో విమాన సేవలు అందించేందుకు సిద్దమవుతోంది. ఆ సంస్థకు చెందిన 72 సీట్ల విమానం నిన్న మలేషియాలోని సుబాంగ్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంది. ట్రూజెట్ విమాన సేవలు జూన్ నెలాఖరులోగా లేదా జూలై మొదటి వారం నుండి మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సంస్థ మొదట కేవలం 8 ప్రధాన పట్టణాలకు విమాన సర్వీసులు నడుపుతుంది. తరువాత క్రమంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా తన సేవలను విస్తరింపజేయాలని భావిస్తోంది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా విమాన సర్వీసులను నిర్వహించనున్న ఈ సంస్థకు వంకాయలపాటి ఉమేశ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ 2014 లోనే అవసరమయిన అన్ని అనుమతులు ఇచ్చింది. రెండు ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు కూడా అనుమతులు మంజూరు చేయగా వాటిలో మొదటిది నిన్న హైదరాబాద్ చేరుకొంది. త్వరలోనే రెండవ విమానం కూడా హైదరాబాద్ చేరుకోవచ్చునని సమాచారం.   దేశంలో అనేక ప్రైవేట్ విమాన సంస్థలున్నాయి. వాటిలో విజయవాడ కేంద్రంగా విమానయాన సర్వీసులను అందిస్తున్న ఎయిర్‌కోస్టా సంస్థ తెలుగువారికి చెందిన మొట్టమొదటి విమాన సంస్థ కాగా, ఇప్పుడు రామ్‌ చరణ్‌కు చెందిన ట్రూజెట్ సంస్థ రెండవది. మెగా ఫ్యామిలీ సభ్యులు అటు రాజకీయాలలో, ఇటు సినిమాలలో కూడా ఉన్నందున, అది ట్రూజెట్ సంస్థకు అదనపు ఆకర్షణ అవుతుంది కనుక ఆ సంస్థకు ప్రజల నుండి మంచి ఆదరణే లభించవచ్చును.

జయలలిత ప్రమాణ స్వీకారానికి బాంబు బెదిరింపు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఆమె ప్రమాణ స్వీకారం తమిళనాడులోని చెపాక్ క్యాంపస్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు మద్రాసు రైల్వే పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి బాంబు పెట్టారనే బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కాల్ ఎక్కడినుండి వచ్చిందని విచారణ చేపట్టగా అది ఒక మానసిక వికలాంగుడు చేసినట్టు తెలిసింది. అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తెలిశాక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో జయలలిత ప్రమాణ స్వీకారానికి భారీ భద్రత ఏర్పట్లు చేశారు. గుర్తింపు కార్డు ఉన్నవాళ్లనే లోపనికి అనుమతిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జయలలిత తోపాటు మరో 28 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బయటపడిన 50 కేజీల బాంబు

ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి 50 కేజీల బాంబు ఇప్పుడు బ్రిటన్ లో బయటపడింది. ఇప్పటి వరకూ పేలకుండా ఉన్న ఈ బాంబును లండన్ లోని వెంబ్లె జాతీయ ఫుట్ బాల్ మైదానంలో కనుగొన్నారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సమీపంలో నివసిస్తున్న వారందరిని ఖాళీ చేయించారు. 50 కేజీల బరువు ఉన్న ఈ బాంబు పేలితే 400 మీటర్ల వరకు ఏమీ మిగలదని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు హెచ్చరించారు. ఈ బాంబును 1940 కు ముందు లండన్ పై జర్మనీ విసిరిందని, ఎటువంటి ప్రమాదం జరగకుండా దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు. గతంలో కూడా లండన్ లోని బెర్మాండ్ సేలో 250 కేజీల బాంబును గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేశారు.

కులాంతర వివాహానికి 50 వేల జరిమానా

చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటారు. కానీ వారికి ఎటువంటి జరిమానా ఉండదు. కులాంతర వివాహానికి జరిమానా కట్టడం ఏంటని అనుకుంటున్నారా? ఇలాంటి విచిత్రమైన ఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని గోగ్రా గ్రామానికి చెందిన చోటు కుమార్ యాదవ్ అనే యువకుడు తన పక్క గ్రామం రోహియాకు చెందిన సోని దేవిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే వీరి కులాంతర వివాహానికి ఆ గ్రామ పెద్దలు ఆగ్రహించి వారికి 50 వేల రూపాయలు జరిమానా విధించారు. దీంతో చోటు దంపతులు భయపడి ఊరినుండి పారిపోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చోటు దంపతులు ప్రాణ భయంతోనే పారిపోయారని, వారి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనుండి బయటకు రావట్లేదని ఊరి పంచాయితీ పెద్ద మహేందర్ రవిదాస్ తెలిపారు.

తండ్రిని కొట్టి అమ్మాయిపై అఘాయిత్యం

ఒంటరిగా ఉండే అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగే రోజులు పోయాయి. ఇప్పుడు తోడుగా ఉన్నా వాళ్లని కొట్టి మరీ అమ్మాయిల మీద అత్యాచారాలు చేసే రోజులొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బారువాడలో ఇలాంటి ఘటనే జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ 13 ఏళ్ల బాలిక, తన తండ్రి ఇద్దరూ కలిసి ఆటోలో కలిసి వెళుతూ మంచినీటి కోసం ఆగారు. అయితే తండ్రి మంచినీటి కోసం క్రిందకు దిగగా ఐదుగురు దుండగులు వచ్చి ఆమెను బలవంతంగా ఆటోలో ఎత్తికెళ్లారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన ఆ బాలిక తండ్రిని బండరాయితో కొట్టి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఐదుగురు నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మన్మోహన్ కు రాసిన లేఖ మోడీకి చేరింది

ఓ యువకుడు 15 నెలల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖ ప్రస్తుత ప్రధాని అయిన మోడీకి అందింది. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన మంజిత్ అనే యువకుడు తన చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని, ఉద్యోగం ఇప్పించాలంటూ కోరుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ లేఖ రాశాడు. కానీ అప్పట్లో ప్రభుత్వాలు మారడం, మోడీ ప్రధాని కావడం, ఆలేఖను మోడీ చూడటం జరిగాయి. దీంతో ఆ యువకుడికి రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందించారు. కానీ తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేయడానికి కనీసం 7 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, మోడీ అందించిన 50 వేలు ఏ మూలకీ రావని యువకుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు

అంతా మోడీ ఫలితమే.. అరుణ్ జైట్లీ

ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఢిల్లీలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో భారత్ చేరిపోయిందని, ఇతంతా మోడీ శ్రమ ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు మోడీ ఏడాదిలో 18 దేశాలు పర్యటించారని తెలిపారు. ఇంకా... ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచామని, ఆర్ధిక లోటును తగ్గించడంలో విజయం సాధించామని అరుణ్ జైట్లీ వివరించారు.

తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్దే

గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ నియామకంలో చాలా వివాదాలే జరుగుతున్నాయి. ఈ వివాదంలో ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగివచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి తాత్కాలికంగా శకుంతలా గామ్లిన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నా.. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు అధికారాలు స్పష్టం చేస్తూ కేంద్రం గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనపై తుది నిర్ణయం తీసుకునేది లెఫ్టినెంట్ గవర్నర్ దేనని, కొన్నిటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా... తుది నిర్ణయం మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ దేనని స్పష్టం చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తుందని ఆప్ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నజీబ్ లు లేఖాస్త్రాలు సంధించున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ లేఖ రాయగా... తమ అధికారాలు గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన అవసరం లేదని ప్రతిస్పందించారు. ఈ ఆధిపత్య పోరు కాస్తా ముదిరి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దాకా వెళ్లింది.

15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణ

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం భూసేకరణపై ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది ప్రభుత్వం జారీ చేసిన జీవో పై హైకోర్టును ఆశ్రయించగా దానిపై స్టే విధించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించి భూసేకరణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని దీనిని కొంతమంది వక్రీకరిస్తున్నారని అన్నారు. భూసేకరణపై విచారణ జరిగిందని మరో 15 రోజుల తర్వాత భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మే నెలఖారులోగా 20 వేల ఎకరాల భూమిని తీసకుంటామని, జూన్ లో మరో 20 నుండి 25 వేల ఎకరాల భూమిని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కొన్న భూములకు రూ. 65 వేల కోట్లు వరకూ పరిహారం చెల్లించామని మంత్రి నారాయణ తెలిపారు.

చిత్రపరిశ్రమ కొందరి చేతుల్లోనే ఉంది

తెలంగాణ జేఏసీ ప్రతినిధులు ఆ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై జేఏసీ ప్రతినిధులు.. శ్రీనివాస్ యాదవ్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న చిత్రపరిశ్రమ కొందరి వ్యక్తుల చేతుల్లో నడవడం సబబుకాదన్నారు. కేవలం పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు మాత్రమే వృద్ధి చెందితే సరిపోదు, చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు కూడా వృద్ధి చెందాలని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, ఈ విధానాన్ని సవరించాల్సిన అనసరం ఉందని మంత్రిగారిని కోరినట్టు కోదండరాం తెలిపారు.