ఏపీ రాజధానిలో ట్విన్ టవర్స్
posted on Jul 23, 2015 @ 2:36PM
ఏపీ నూతన రాజధానిపై ఇప్పుడు భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాలను తలదన్నే రీతిలో ఈ రాజధాని నిర్మాణం ఉంటుందని ఇప్పటికే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి సంబధించి సింగపూర్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రణాళికను ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కృష్ణానది తీరాన ఆకాశహార్మ్యాలు నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని చేపట్టే బాధ్యత కూడా సింగపూర్ డెవలపర్స్ తీసుకోవడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణానది తీరాన సుమారు 17 చదరపు కిలోమీటర్లు వరకు.. సుమారు 70-80 అంతస్థులు ఉండేలా ఈ బహుళ అంతస్థులను నిర్మించాలని అనుకుంటున్నారు. అంతేకాక కృష్ణానది తీరాన 125 అడుగులు ఉండే ద్యాన బుధ్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అసెంబ్లీ, సచివాలయం, కోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు రాజధాని నడిబొడ్డున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2050 నాటికి అమరావతిలో కోటి మంది నివాసం ఉండే అవకాశం ఉందని.. దీనికి అనుగుణంగానే భవన నిర్మాణాలు జరపాలని ఏపీ సర్కార్ అంచనా వేస్తోంది.
మరో వైపు నూతన రాజధానికి పక్కా వాస్తు కుదిరిందని.. అన్ని నిర్మాణాలకు అనువైన స్థలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్, సింగపూర్ దేశాలు కూడా ముందుకొస్తున్నాయి. ఇంకా ఈరాజధాని నిర్మాణానికి దసరా నాడు శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నట్టు ఏపీ ప్రభుత్వ స్పష్టం చేసింది. అది జరిగిన వెంటనే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.