విశాఖలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు సంపూర్ణం

  విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా సాగరతీరాన్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపి రాముడు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పోలీసు దళాలు, భద్రతా దళాలు, హోం గార్డులు, ఎన్.సి.సి. బృందాలు, సైనిక స్కూల్ విద్యార్ధులు తదితర బృందాలు ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి. విశాఖలోనే మొట్టమొదటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. విశాఖనగరంలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం విశాఖలో మూడు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించినట్లవుతుంది.

సానియాకు ఖేల్ రత్నఅవార్డు

  క్రీడా రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతీఏటా ఇచ్చే ఖేల్ రత్న, అర్జున అవార్డుల పేర్లను కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించింది. దేశంలో మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించబడే రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఖరారు చేసింది. ప్రముఖ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మకు అర్జున అవార్డు ఖరారయింది. అర్జునా అవార్డులు అందుకోబోతున్న వారిలో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్ క్రీడాకారుడు అనూవ్ కుమార్ అర్జునా అవార్డులకు ఎంపిక అయ్యారు.

ఆధార్‌తో ఓటర్ అనుసంధానం ఆపండి.. సుప్రీం

  ఆధార్ కార్డుతో ఓటరు అనుసంధానం అంటూ పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ అనుసంధాన ప్రక్రియను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని.. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు తీసుకొవద్దని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాదు అధార్ కార్టు తప్పనిసరి కాదని ఈ విషయాన్ని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌లో పొందడానికి ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని, యఐడీఏఐ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్ రాయితీలకు తప్ప మరే పథకానికి ఆధార్ డేటాను ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మంత్రుల స్టార్ హోటళ్ల బస కట్

  ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్టార్ హోటళ్లలో మంత్రుల బస పైన నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులు స్టార్ హోటళ్ల నుండి బయటకు రావాలని సూచించారు. ప్రభుత్వ అతిథి గృహాల్లో మంత్రులు నివాసం ఉండాలని సూచించారు. దీనిలో భాగంగానే మంత్రులు అతిథి గృహాల్లో ఉండాలంటే వాటి మరమ్మతు పనులు చేయాలని రోడ్స్ అండ్ బిల్డింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది విజయవాడ రానున్నారని.. వారి కార్యాలయాలు.. వసతి ఏర్పాట్ల గురించి జవహర్ కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. హడ్కో ద్వారా రాజధాని ప్రాంతంలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. త్వరలో పదివేల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.

విమర్శలు తప్ప ఒరిగేదేం లేదు

కాంగ్రస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు.  సెలవులకంటూ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ తిరిగొచ్చిన తరువాత ఏమయిందో ఏమో కానీ బాగానే ప్రతిపక్షాలకు ధీటుగా రాజకీయ వ్యూహాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి పార్లమెంట్ సమావేశాలే నిదర్శనమని చెప్పవచ్చు. భూసేకరణ బిల్లుపై.. లిలిత్ మోదీ వ్యవహారంపై పార్లమెంట్లో చేసిన గందరగోళం అంతా ఇంతా కాదు. గత నెలలో ప్రారంభమైన వర్షకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి.. కానీ ఈ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి మొత్తం సారధ్యం వహించింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తనయుడు రాహుల్ గాంధీ అని అందరికీ అర్ధమవుతోంది.   ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలం పాటు నోరు మెదపకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన దూకుడుని ప్రదర్శిస్తుంది. ఇప్పటికే పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఉనికి లేకుండా పోయింది.. ఇంకా అలానే ఉంటే భవిష్యత్ లో పార్టీ ఉంటుందో లేదో అని అనుకున్నారమే కానీ తల్లి సోనియా.. తనయుడు రాహుల్ కలిసి పార్టీని కాపాడటానికి చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. వారితో పాటు కాంగ్రెస్ నేతలను కూడా పరుగులు పెట్టిస్తూ ధర్నాలంటూ, నిరసనలంటూ చెమటలు పట్టిస్తున్నారు.   కానీ అధికారం ఉన్నప్పుడు చేయనివారు.. అధికారం లేని తరువాత ధర్నాలు నిరసనలు చేస్తే ప్రశంసించే వాళ్ల సంగతేమో కాని విమర్శించేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. దానికి కారణాలు లేకపోలేదు.. అసలు యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నన్నీ రోజులు రైతులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. కానీ అప్పట్లో అధికారంలో ఉన్నారు కదా అని పట్టించుకోలేదు. ఇప్పుడు రైతు ఆత్మహత్య భరోసా అంటూ రైతుల కుటుంబాలను పరామర్శిస్తే మాత్రం ప్రతిపక్షాలు విమర్శించకుండా ఉరుకుంటాయా. అదే విధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంపీలను సస్పెండ్ చేసి విభజన బిల్లు ఆమోదం పొందేలా చేశారు సోనియాగాంధీ.. ఇప్పుడు తమ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ప్రజాస్వామ్యం చనిపోయిందంటూ మొత్తుకుంటూ ధర్నాలు చేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు. పైగా ఈ విషయంపై సోనియాగాంధీపై చాలా మంది అప్పడు గుర్తుకు రాని  ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ చురకలు వేశారు. ఇదిలా ఉండగా తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. దీనిలో భాగంగా రాహుల్ గాంధీ ఏపీలో ధర్నా కూడా చేయాలని నిర్ణయించుకున్నారంట. రాష్ట్రాన్ని విభజించినందుకే కాంగ్రెస్ పార్టీ పై పీకల్లోతు కోపంతో ఉన్న ఏపీ జనాలు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో ప్రత్యేక హోదా కోసం ఏపీలో ధర్నా చేస్తే మాత్రం వారిని ఆదరిస్తారా.. ఇప్పటికే ఈ విషయంపై విమర్శలు వినిపిస్తున్నాయి.   ఏది ఏమైనా సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ ఏదో ఆవేశ పడిపోయి తమ పార్టీని ఉనికిని ప్రజల్లోకి తీసుకురావడానికి ఈ పనులన్నీ చేయడం తప్ప దీని వల్ల వారికి విమర్శలు తప్పితే ఒరిగేదేమీ లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్ని చేసినా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కల్ల అంటున్నారు రాజకీయపెద్దలు.

ప్రముఖ నాస్తికవాది లవణం మృతి

  ప్రముఖ నాస్తికవాది, సంఘసేవకుడు గోపరాజు లవణం ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన విజయవాడలోని రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 86 యేళ్లు.   లవణం హేతువాదం, నాస్తికవాదంపై అనేక గ్రంథాలను రచించారు. సంఘం, ది ఎథిస్ట్‌, నాస్తిక మార్గం పత్రికలు లవణం సంపాదకీయంలో వెలువడ్డాయి. చిన్నతనంలోనే స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొని.. 1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అస్పృశ్యత, కుల నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేశారు. ప్రముఖ రచయిత గుర్రం జాషువా కుమార్తె హేమలతను లవణం వివాహం చేసుకున్నారు.   కాగా లవణం మృతికి సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు లవణం మృతదేహాన్ని బెంచిసర్కిల్‌లోని నాస్తిక్‌ కేంద్రానికి తరలించి ఈ రోజు సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటా.. రేవంత్ రెడ్డి

  తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఈ రోజు నోటుకు ఓటు కేసు విచారణలో ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఈ కేసులో ఇరికించిందని.. తనను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని అన్నారు. గద్దె దిగే వరకూ కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటానని.. మరో 25 ఏళ్లైనా కొడంగల్‌ నియోజకవర్గం నుంచి గెలుస్తానని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈకేసులో నిందితులైన సెబాస్టియన్‌, ఉదయ్‌సింమాలు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారులు సప్లమెంటరీ సమన్లను కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీబీ చార్జిషీటును పరిగణలోకి తీసుకున్న తర్వాత సమన్లు పంపించనున్నట్లు కోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయిన అనంతరం మరోసారి ఏసీబీ ఎదుట రేవంత్‌ అయ్యే అవకాశం ఉంది.

ఏపీకి కేంద్రం 500 కోట్ల సహాయం

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే ఏపీ అధికారుల దగ్గర నుండి ప్రజల వరకూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రం నుండి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. ఇప్పుడు అది చాలా ఆసక్తికరంగా మారింది.   అదేంటంటే ఆంధ్రప్రదేశ్ నూతన రాజదానిలో అసెంబ్లీ, రాజ్‌భవన్ తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 500 కోట్లు ఇచ్చేందుకు సముఖత చూపినట్టు తెలుస్తోంది. భవనాల డిజైన్లు, ఇతర వివరాలతో పూర్తిస్థాయి నివేదిక పంపితే వాటిని పరిశీలించి రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో రాజ్‌భవన్‌, అసెంబ్లీతోపాటు మరో ఒకటి రెండు భవనాలు ఉండే అవకాశముంది.   ఈ నేపథ్యంలో ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల కార్యలయాలు వారి వసతి గృహాలు తదితర విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆక్రమాస్తుల కేసులో జగన్‌కు షాక్

  అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడప జగన్మోహన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. జగన్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి జఫ్తు చేసింది. అనంతపురం జిల్లాలో పెన్నా గ్రూపుకు చెందిన 231 ఎకరాల భూమిని.. హైదరాబాదులోని హోటల్‌ను కూడా తాత్కాలికంగా జఫ్తు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ ఈ కేసులో రూ.7.85 కోట్ల ఆస్తులను జఫ్తు చేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలోనే ఈడీ ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని.. జప్తుకు ఆదేశించిన 250 ఎకరాలపై చర్యలు తీసుకోవాలని ఈడి... రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు దాదాపు నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

రాహుల్‌ బుర్ర లేని మేధావి

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అందరికి స్పష్టంగా అర్ధమవుతోంది. సమావేశాలు పారంభమైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా సభను సాజావుగా సాగనివ్వకుండా పార్లమెంట్ లో రచ్చ రచ్చ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలపై వైఖరిపై మండిపడుతున్నారు. అసలు దీనంతటికి తెరవెనుక ఉండి నడిపిస్తుంది రాహుల్ గాంధీ అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఈ విషయంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి వయసు పెరుగుతున్నా బుర్ర పెరగడం లేదని.. వయసు పెరుగుతున్న కొద్దీ రాహుల్‌కు అజ్ఞానం పెరుగుతోందన్నారు. అతనికి సగం తెలిసీ సగం తెలియకుండా మాట్లాడుతున్నారని.. రాహుల్‌ బుర్ర లేని మేధావని తెలివితేటలు లేని నిపుణుడని చురకలు వేశారు. సగం తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్ల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయాయని ఆరోపించారు.

చెప్పులు మోయించిన మంత్రిగారు

  అధికారం ఉందికదా అని ఎం చేసినా సరిపోతుంది అని అనుకుంటారు కొంత మంది. అలా అధికారం అహంకారంతో చేసే పనుల వల్ల కొన్ని సార్లు విమర్శల పాలవుతారు. అలా చేసి ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటుంది మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే. ఈ మంత్రి గారు చెప్పులు ఆమె దగ్గర పనిచేసే సిబ్బంది ఒకరు మోయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మంత్రి పంకజ ముండే మహారాష్ట్రలో కరువు సంభవించిన పర్భానీ జిల్లా సొన్ పెత్ ప్రాంతంలో పర్యటించారు. అయితే అక్కడ నడవడానికి వీలులేకపోవడంతో ఆమె తను వేసుకున్న చెప్పులు విడిచి నడిచారు. ఇక్కడి వరకూ బానే ఉంది. అయితే ఆమె వేసుకున్న చెప్పులను తన పక్కన ఉన్న సిబ్బందిలో ఒకరు మోయడంతో ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు.   ఇప్పుడు ఈ విషయంపై ప్రతిపక్షాలు.. అదను దొరికింది కదా అని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రిగారు సమాధానం చెప్పాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి పంకజ్ ముండే వివరణ ఇస్తూ ‘మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని.. చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చింది' అని చెప్పారు. అక్కడ చూడాల్సింది కరువు వల్ల దెబ్బతిన్న రైతల సమస్యలు అని అంతేకాని నా చెప్పుల గురించి కాదని సమాధామిచ్చారు.

లోకేశ్ vs కేటీఆర్ పోటాపోటీ నోటీసులు

  ఓటు నోటు కోసులో ఇప్పటికే ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై అనేక కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో అంశం చర్చాంశనీయమైంది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఎంతో మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై రెండు ప్రభుత్వాలు పోటా పోటీగా నోటీసులు జారీ చేసే పనిలో పడ్డాయి. తెలంగాణ ఏసీబీ ప్రభుత్వం టిడిపీ యువనేత లోకేశ్ డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి చెంప దెబ్బ కొట్టినట్టు ఏపీ ప్రభుత్వం తెలంగాణ మంత్రి కెటిఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు ఏపీ సీఐడి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. మత్తయ్య బెదిరింపుల కేసులో కెటిఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్దమయ్యారు.   మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2013లో విశాఖ జిల్లా పెందుర్తిలో నమోదైన హత్యాయత్నం కేసు ఘటన తెరపైకి రావడం గమనార్హం. గతంలో ఈకేసుకు సంబంధించి సిఎం కెసిఆర్ వ్యక్తిగత గన్‌మెన్ మధుసూదన్ రెడ్డి, మరో వ్యక్తి సతీష్ రెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి కానీ విచారణకు రాలేదు. అయితే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నేరుగా నోటీసులు హైదరాబాదుకు తెచ్చి ఇచ్చింది. దీనిలో భాగంగా వారికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారు అందుబాటులో లేకపోవడంతో నేరుగా వారి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి నోటీసులు అందజేసింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే నోటుకు ఓటు కేసులో పోటా పోటీగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు బయట వచ్చిందా అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఓటు నోటు కేసు సంగతేమో కాని ఈ కేసు నేపథ్యంలో ఇంకెన్ని కేసులు బయటపడతాయో.. ఎంతమందికి నోటీసులు వెళతాయో చూడాలి.

మ్యాగీపై నిషేదం ఎత్తివేత

  నెస్లే ఇండియాకు చెందిన మ్యాగీ నూడిల్స్ లో హానికర పదార్ధాలున్నాయంటూ పలు రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిషేదం విధిచింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై నెస్లే ఇండియాకు ముంబై కోర్టులో ఊరట లభించింది. మ్యాగీ పై నిషేదం విధించడంపై ముంబై హోకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపైన విచారణ జరిపిన హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వ మ్యాగీపై విధించిన నిషేధాన్నిఎత్తివేసింది. మరోసారీ నూడుల్స్ నమూనాలపై పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాచులో ఐదేసి శాంపిల్స్‌ను మూడు ల్యాబ్‌లకు పంపించి పరీక్షించాలని, ఆరువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఉగ్రవాదుల పైశాచికం.. 60 మంది మృతి

  ఇకార్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ట్రంక్ బాంబ్ పెట్టి పలువురు ప్రాణాలను బలిగొన్నారు. ఇకార్ రాజధాని బాగ్దాద్ నగరంలో సరద్ ప్రాంతంలోని మార్కెట్ లో ఉదయం పూట నిత్యం రద్దిగా ఉంటుంది. ఇదే అదనుగా చూసుకొని ఉగ్రవాదులు ఒక ట్రక్ బాంబ్ తీసుకొని వచ్చి అక్కడ పార్క చేశారు. ఈ ట్రక్ ఒక్కసారిగా పేలి ఈ దాడిలో 60 మంది మరణించగా దాదాపు 200 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. కొంతమంది శరీరాల నుండి అవయవాలు తెగి గాలిలో ఎగిరిపడ్డాయి. కొంత మంది అమాయకుల కాళ్లు, చేతులు తెగిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తలించారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బాంబు దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.