చంద్రబాబు ఫైర్.. ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా?

ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యోగుల పనితీరుపై ఎప్పటికప్పుడు వారికి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ అధికారులు సరిగ్గా విధులు నిర్వహించకపోతే చర్యలు తీసకోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. దీనిలో భాగంగానే విశాఖపట్నంలోని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు విశాఖపట్నం పర్యటన చేశారు. సుమారు 6 గంటల పాటు నగరాన్ని పర్యటించిన ఆయన అక్కడ మనోరమ థియేటర్‌ వద్ద కల్వర్ట్‌ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంపై జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ను ‘‘ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా!?’’ అని అతనిపై మండిపడ్డారు. పారిశుద్ధ్య వ్యవస్థ, పోర్టు కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడేలా పోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయని, వీటికి తెరదించాలని స్పష్టం చేశారు. విధులు సరిగ్గా నిర్వహించకపోతే పాత చంద్రబాబుని చూస్తారు అని హెచ్చరించినట్టే చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మోడీ కి కొత్త అర్ధం చెప్పిన వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు మోడీ  మేకర్ ఆఫ్ డివలప్డ్ ఇండియా అంటూ కొత్త అర్ధాన్ని చెప్పారు. బదల్‌పూర్ - ఫరీదాబాద్ మెట్రో మార్గం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు హాజరయ్యారు. ఈసందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతు పైవిధంగా మోడీని ప్రశంసించారు. అంతేకాదు తాజాగా విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో ఫరీదాబాద్ ను చేర్చామని తెలిపారు.      అలాగే ప్రధాని మోడీ కూడా వెంకయ్య పైన ప్రశంసలు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు ప్రయోజనం కల్పించేందుకు ఆయన పలు ప్రధాన చర్యలు చేపడుతున్నారన్నారు. వెంకయ్య నాయకత్వంలో పలు మెట్రో ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. దేశంలో స్మార్ట్ సిటీల పధకానికి రూపకల్పన వెంకయ్య నాయుడేనని అన్నారు. అంతేకాదు వెంకయ్య నేతృత్వంలో వచ్చిన గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన వంటి పథకాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వెంకయ్య కృషి విజయవంతం కావాలని మోడీ ఆకాంక్షించారు.

నేను భౌతిక దాడులకు వ్యతిరేకం.. స్పందించిన పవన్

  భీమవరంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల గొడవ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య రగడగా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన వివాదం ఆఖరికి కుల వివాదంలా తయారైంది. దీంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించడంతో పాటు కొంతమంది పవన్ అభిమానులను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ సంఘటనతో దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనస్తాపం చెందినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించి భీమవరంలో తమ అభిమానులు చేసిన చర్యలను పవన్ జీర్ణించుకోలేకపోతున్నానని.. తాను భౌతిక దాడులకు వ్యతిరేకమని చెప్పారు. అంతేకాదు, ఇలాంటి ఘటనలు మళ్లీ ఎప్పుడూ జరగకూడదని అభిమానులను కోరారు. ఇరువర్గాలకు చెందిన వారు పెద్దలతో చర్చించాలని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులుతోను, నరసారావుపేట ఎంపీ గోకరాజు గంగరాజుతోను ఈ సంఘటన గురించి ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి పరిష్కరించాలని కోరారని తెలుస్తోంది.

ఓ.ఆర్.ఓ.పి. పై ప్రధాని మోడీ వివరణ

  ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారంనాడు ఫరీదాబాద్ లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానంలో స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన సైనికులకి కూడా ఈ పధకం వర్తిస్తుందని స్పష్టం చేసారు. “గత 42సం.లుగా ఈ సమస్యని పరిష్కరించలేనివారు కూడా దీనిపై ప్రజలలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేశం కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి పోరాడుతున్న మన వీరజవాన్ల పట్ల మా ప్రభుత్వానికి చాలా గౌరవం ఉంది. అందుకే మేము అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేసి, ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానం అమలు చేస్తున్నాము,” అని తెలిపారు.   గత 84 రోజులుగా దీని కోసం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు తమ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కానీ వారి ప్రతినిధి మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.   రక్షణమంత్రి మనోహర్ పార్రికర్ బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ, “మాజీ సైనికులు చిరకాల కోరిక అయిన ‘ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానం’ అమలుచేస్తున్నాము. ఏ విషయంలోనయినా నూటికి నూరు శాతం సమస్యలన్నీ ఒకేసారి తీరిపోవు. మాజీ సైనికులకు మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొన్నామనే విషయాన్ని వారికీ తెలుసు. కనుక వారు ప్రభుత్వంతో సహకరించినట్లయితే మిగిలిన అన్ని సమస్యలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చును,” అని అన్నారు.

మంత్రుల పనితీరుపై సర్వే..

  ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన వారికి అప్పుడప్పుడు చురకలు వేస్తునే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇక రాష్ట్ర మంత్రుల పనితీరుపై దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే *ప్రతినెలా మంత్రుల పనితీరుపై సర్వే *ప్రభుత్వ పథకాల తీరుపై కూడా సర్వే *సెప్టెంబర్ 9 నుంచి రైతు కోసం యాత్రలు *వ్యవసాయానికి పగటిపూట 7 గంటలపాటు నిరంతర విద్యుత్ *నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కార్యాలయాల తరలింపు వేగవంతం *భూసేకరణ పద్ధతుల్లో మచిలీపట్నం పోర్టుకు భూములు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. *1300 కోట్ల రూపాయలతో ఈ ప్రగతి ప్రాజెక్టును పీపీపీ మోడల్‌లో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

టీచర్స్ పై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

  నాక్కొంచం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్టు.. అసలు రాంగోపాల్ వర్మకి ఉన్న తిక్కకి లెక్కే లేదనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరిని ఏదో ఒకటి అనకపోతే రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. తన విమర్శల బాణాలకి అందరిని బలి చేస్తుంటాడు. తన విమర్శలతో ఆఖరికి దేవుడిని కూడా బలి చేశాడు ఇంక మనుషులెంత. మరి ఇప్పుడు ఎవరి మీద విమర్శలు చేసాడనే కదా డౌట్.. ఈరోజు టీచర్స్ సందర్భంగా వర్మగారు టీచర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఏ ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పనని.. ఎందుకంటే ఒక్క రోజు కూడా తాను గురువులతో సంతోషంగా లేనని విమర్శించారు.    సక్సెస్ ఫుల్ ఇంజినీర్స్, సక్సెస్ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు. కాని, ఎక్కడైనా సక్సెస్ ఫుల్ టీచర్చ్ ఉన్నారా? కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తీసినట్లుగా ఎవరైనా ‘టీచర్ ఆప్ ది ఇయర్’ చేస్తే, అది ‘డిజాస్టర్ ఆప్ ది ఇయర్’ అవుతుంది అని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు చేశారు.

కేంద్రం నో.. చంద్రబాబు ఎస్

  విజవాడలో మెట్రో రైల్.. అసలు ఈ విషయంపై ఒక క్లారిటీ రావడం లేదు. విజయవాడకు మెట్రో రైల్ వస్తుందా?రాదా? అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అని ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే విజవాడలో మెట్రో రైల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని..  20 లక్షల మంది ఉంటేనే ఆనగరానికి మెట్రో రైలు అవసరం ఉంటుందని.. కాని విజయవాడలో అంత జనాభా లేదు కాబట్టి విజయవాడకు మెట్రో రైలు అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు వెనక్కి తగ్గకుండా చాలా పట్టదలతో ఉన్నట్టు తెలస్తోంది. దీనిలో భాగంగానే అసెంబ్లీ సమావేశానికి కూడా దూరంగా ఉండి విజయవాడ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2018 ఆగస్టు నాటికి విజయవాడ మెట్రో రైలు తొలొదశ పూర్తి అయ్యేలా చూడాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. మెట్రో రైలుకు నిధుల కొరత లేదని  జపాన్ కు చెందిన జైకా సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుందని శ్రీధరన్ కు ఆయన వివరించారు అయితే మెట్రోల నిర్మాణ ప్రగతిని ప్రతినెల సమీక్షించేలా ప్రాసెస్‌ చార్ట్‌ను రూపొందించాలని శ్రీధరన్‌ను చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఈ ప్రాజెక్టు పై వేగంగా పురోగతి సాగించాలని సూచించారు. మొత్తానికి బాబు పట్టుదల చూస్తుంటే కేంద్రం సహాయం లేకుండానే ఈ పని పూర్తి చేసేలా ఉన్నారు.

పవన్ ఫ్యాన్స్ అరెస్ట్

  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వారు కూడా అనుమానితుల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. అయితే ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్య్ కు పవన్  కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య వివాదాలు తెలెత్తాయి. అది కాస్తా ముదిరి ఆఖరికి కుల పోరు పరిస్థితి వరకూ వచ్చింది. ఈనేపథ్యంలోనే భీమవరం పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. దీనిలో భాగంగానే పోలీసులు ఈరోజు 10మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ అభిమానులు అరెస్ట్ చేయడంతో ఈ చర్యను నిరసిస్తూ పలువురు పవన్ అభిమానులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అంతే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

దుష్టశిక్షణ..శిష్టరక్షణ.. బాలయ్య కామెంట్

  ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తన ఆధ్యాత్మిక ధోరణిలో సందేశం ఇవ్వడం గమనార్హం. బాలకృష్ణకు పురాణ కథల గురించి చెప్పమంటే గుక్కతిప్పుకోకుండా చెప్పగలరని మనందరికి తెలిసిన విషయమే. అయితే అదే తరహాలో ఆయన పాపం పెరిగితే దుష్టశిక్షణ తప్పదని.. పాపం ఎక్కువైతే భగవంతుడే వివిధ రూపాల్లో దుష్టశిక్షణ..శిష్టరక్షణ చేస్తుంటారని తనదైన శైలిలో చెప్పారు. సమాజంలో హింస పెరిగినప్పుడు పాపాలు ప్రబలినప్పుడు భగవంతుడు ఇలా చేస్తాడని పురాణాలు చెప్పాయని బాలయ్య అన్నారు. హిందూ దేశమైన భారతదేశంలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానని బాలయ్య కోరారు. కాగా హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి బాలకృష్ణ ఆ నియోజకర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. దానికి పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో హిందూపురం జిల్లాల్లోనే నెంబర్ వన్ ర్యాంకును సాధించడమే నిదర్శనం. అక్కడ కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.

ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ఉండదు

  సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ఘనంగా నిర్వహించింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అత్యుత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉపాధ్యాయ కేవలం వృత్తి కోసమే పని చేయకూడదని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులకు బోధన చేయాలని.. అదో జీవన ధర్మమని సూచించారు. ఉపాధ్యాయుడు ఎప్పటికీ రిటైరు కారని, నిత్యం కొత్త విషయాలు నేర్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారని మోడీ టీచర్లను ఉద్దేశించి చెప్పారు.

నేడు మెహబూబ్ నగర్ జిల్లా బంద్

  కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు కొట్టుకొని మెహబూబ్ నగర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మొన్న జరిగిన జెడ్పీ సమావేశం తెరాస ఎమ్మల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డిపై చెయ్యి చేసుకొన్నారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు డిపోలలో నుండి బస్సులను బయటకి రాకుండా అడ్డుపడటంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.   ఈ విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్ళినా ఆయన కానీ ఆయన తరపున మంత్రులెవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు. వారు స్పందించకపోవడం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చెయ్యి చేసుకొన్న బాలరాజును సమర్దిస్తున్నట్లే ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యే బాలరాజు తమ ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగానిస్తున్నామని టీ-కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె. జానారెడ్డి అన్నారు. టీ-కాంగ్రెస్ నేతలు గవర్నర్ ని కలిసి తెరాస ఎమ్మెల్యేపై పిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నేతను చెంపదెబ్బ కొట్టిన టీఆర్ఎస్ నేత

  జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టిఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాదులాట జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడే హక్కు తెలుగుదేశం నేతలకు లేదంటూ..తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గూశరం లేవని వ్యాఖ్యానించారు. ఇదే చర్చలో భాగంగా నెలకొన్న వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చెంపదెబ్బ కొట్టడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే బాలరాజు తనను కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారని.. ఆయనపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ జడ్పీ ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు. జడ్పీ ఛైర్మన్ అదుపుచేయాలని ఎంతగా ప్రయత్నించినా ఉద్రిక్తత తగ్గలేదు.

పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ కొట్లాట

  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్‌లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయి అనుమానిత వ్యక్తుల ఇళ్లపై దాడికి తెగబడ్డారు. వారి ఇళ్ళు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ దాడి చేసిన వారిలో ప్రభాస్ అభిమానులు కూడా ఉండటంతో వారు కూడా తిరిగి దాడులు చేపట్టారు. దీంతో ఇద్దరు హీరోల ఆభిమానులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కాస్త చివరికి రెండు కులాల మధ్య గొడవగా మారిపోయింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తూ ఎవరైనా అల్లర్లకు  పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, వారి చదువు నాశనమవుతుందని హెచ్చరించారు. అయితే ఇంత గొడవ జరుగుతున్నాఅటు పవన్ కళ్యాణ్ గానీ, ఇటు ప్రభాస్ గానీ ఇంతవరకూ స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది.

వామ్మో రాంగోపాల్ వర్మ దేవుడికి మొక్కాడా..!

రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది పెద్ద హాట్ టాపిక్ కే అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూ విమర్శల వర్మగా పేరు పొందాడు. ఆయన మనుషులనే కాదు  దేవుడిని కూడా తన విమర్శలకు బలి చేస్తుంటాడు. గత ఏడాది వినాయక చవితి సమీపిస్తుండగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న కూడా గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలోకి కూడా దేవుడిని లాగేశాడు వర్మ. మరి అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు దేవుడికి దండం పెడుతూ బయటకు వచ్చిన ఫోటో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.   ఎందుకంటే రాంగోపాల్ వర్మ నాస్తికుడని అందరికి తెలిసిందే.. అతడు దేవుడికి మొక్కింది లేదు.. కనీసం తన సినిమా పూజా కార్యక్రమాలకి కూడా అంత ఆసక్తి చూపించరు. మరి అలాంటి వర్మ దేవుడికి దండం పెట్టడం విశేషమే కదా.. మరి ఇంతకీ ఆ ఫోటో ఎవరి తీశారో తెలుసా మంచు మనోజ్.. ఎక్కడ దొరికాడో ఎలా దొరికాడో తెలియదు కానీ.. వర్మ వినాయకుడికి దండం పెడుతూ మనోజ్ కెమెరాకు చిక్కేశాడు. మనోజ్ మాత్రం ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోలేదు వెంటనే ఫోటో తీసి ‘‘చిట్టచివరికి వర్మ దేవుడికి తలవంచాడు’’ అని రాసి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇక అంతే ట్విట్టర్లో ఈ ఫొటో హాట్ టాపిక్ అయిపోయింది.  ఈ ఫోటోపై పూరి జగన్నాథ్ కూడా ‘‘ఇంత సడెన్ నువ్విక్కడికి ఎందుకొచ్చినట్లు.. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి.. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని వర్మను దేవుడు తిడుతుండొచ్చు’’ అంటూ తనదైన శైలిలో ఓ కామెంట్ విసిరారు. మొత్తానికి వర్మ దేవుడికి మొక్కడమేమో కాని దేవుడు దిగి వచ్చినంత హడావుడి చేస్తున్నారు జనాలు.