ఏపీ రాజధానికి సహకరించండి.. టాటా ఛైర్మన్ తో వెంకయ్య

  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య ఏపీ రాజధాని నిర్మాణానికి.. అభివృద్ధికి సహకరించాలని.. అంతేకాదు ఒక్క రాజధాని నిర్మాణంలోనే కాక హైదరాబాద్ విశాఖ నగరాల్లో కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించాలని సైరస్ మిస్త్రీని కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడే కాదు దేశంలో ఇతర ప్రాంతాల అభివృద్ధికోసం.. వెంకయ్య చేపట్టిన స్మార్ట్ సిటీ పథకం.. స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు పథకాలపై కూడా సహకారం అందించాలని కోరారు. దీనికి సైరస్ మిస్త్రీ కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. కాగా మోదీ స్వచ్ఛ భారత్ లో భాగంగా పిలుపు నిచ్చిన మేరకు టాటా సంస్ధ ముందుకొచ్చి విజయవాడలోని 264 గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

చైనా టూర్లో కేసీఆర్ బిజీబిజీ.. 3గంటలు 30 మీటింగులు

  తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా టూర్ లో భాగంగా నిన్న ఆయన ఫుల్ బిజీగా గడిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి అనేక పారిశ్రామిక వేత్తలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ చర్చలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి పరిశ్రమల స్థాపనకు తాము చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు. అంతేకాదు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి వసతులు ఉంటాయి వాటితో పాటు పరిశ్రమల అనుమతుల విషయంలోనూ తాము చేపడుతున్న చర్యల గురించి ముచ్చటించారు. ఎలాంటి అవినీత లేకుండా పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 3గంటల్లో 30 మంది పారిశ్రామికవేత్తల్ని కలిసిన కేసీఆర్.. వారికి తెలంగాణలో పరిశ్రమలలు పెట్టేందుకు అవకాశాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ లియో గ్రూపు కంపెనీ రూ.వెయ్యి కోట్లతో తెలంగాణలో హెవీడ్యూటీ పైపుల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి కేసీఆర్ తెలంగాణలో పరిశ్రమలు స్థాపనకు బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.

సుజనా తిట్టారా?... పొగిడారా?

  రాజకీయ నేతలు ఎమన్నా దానికి వేరే అర్ధం వచ్చేలా మాట్లాడుకోవడం పరిపాటైపోయింది ఈమధ్య. ఇప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి విషయంలో కూడా అలాగే జరిగింది. అదేంటంటే కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు పాలకులుగా ఉన్నందువలన.. అభివృద్ధి పథంలో మనం దూసుకెళ్లిపోతామని అన్నరు. దాంతో పాటు మోడీ ప్రధాని అయిన తరువాత విదేశాలలో భారత ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నారు. అంతే దీంతో సుజనా వ్యాఖ్యాలపై ఒకటే కామెంట్లు పడుతున్నాయి. విదేశంలో ప్రతిష్ట పెరిగిందంటే స్వదేశంలో పలచబడిపోయిందనేనా అని వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటున్నారు. మరోవైపు మోడీ కూడా విదేశీ పర్యటనలతో బిజీగానే ఉన్నారు. ఇప్పటికే మోడీ పర్యటనలపై ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజనా చేసిన వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగానే తీసుకుంటున్నారు. అయితే సుజనా చౌదరి అంటే చాలా విధేయుడైన మంత్రి అనే పేరు ఉంది. మోదీపై ఆయన వెటకారంగా అని మాత్రం అని ఉండరు అని. మనస్ఫూర్తిగానే మోడీని కీర్తించి ఉంటారని పనిలేని వాళ్లు దాని కూడా వెటకారంలాగే అనుకుంటారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు.

వీలుంటే సూర్యుడిపై కేసు పెడతారు.. వెంకయ్య కామెంట్

  ప్రత్యేక హోదాపై ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వెంకయ్యనాయుడు స్పందించి వైసీపీ నేతలపై వ్యంగ్యస్త్రాలు విసిరారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని మామీద కేసులు పెట్టారు.. వీలుంటే రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదు అందుకు సూర్యుడే కారణమంటూ ఆయన మీద కేసులు పెట్టగలరు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  పార్టీ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టక పోవడంతో సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదంతా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే  చేస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు మోడీ, వెంకయ్య, చంద్రబాబులపై ఫిర్యాదు చేస్తే దానికి ప్రతిగా బిజెపి నేతలు కూడా కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలకోసం అడ్డగోలుగా విభజించారంటూ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రఘువీరా రెడ్డిలపై కడప జిల్లా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

రాజమోళిని పొగిడిన రాంగోపాల్ వర్మ..

  ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ అందరి మీద విమర్శల బాణాలు వేస్తునే ఉంటారు. మొన్న టీచర్స్ డే సందర్భంగా ఆఖరిని వారిని కూడా వదలకుండా విమర్శించేశాడు. ఇప్పుడు ఆయన కన్ను రాజమౌళి మీద పడింది. రాజమౌళిని ఉద్దేశించి ట్విట్టర్లో కొన్నిపోస్ట్ లు చేశాడు. ఏముంది ఏదో విమర్శిస్తూ కామెంట్ చేశాడనుకుంటున్నారు.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే ఇంతకీ రాంగోపాల్ వర్మ ఏమని వ్యాఖ్యానించాడనే కదా డౌట్. "I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg'' అంటే రాజమౌళిలో ప్రస్తుతం స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్నానని కామెంట్ చేశాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ హాలీవుడ్ డైరక్టర్.. ఆయన పోలికలు రాజమౌళిలో ఉన్నాయనే విధంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంపై ఫ్యాన్సందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ రూట్ మార్చినట్టున్నాడు.

డేటింగ్ కింగ్ యువరాజ్ సింగ్.. నయా గర్ల్ ఫ్రెండ్

 భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ మంచి బ్యాట్స్ మాన్ అది అందరికి తెలిసిన విషయమే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు యువరాజ్ సింగ్ అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయడంలో కూడా కింగే అది కూడా స్పెషల్ గా చెప్సాల్సిన అవసరం లేదనుకోండి. గతంలో బాలీవుడ్ బాలీవుడ్ భామలు దీపిక పదుకోన్‌, ప్రీతి జింతా, కిమ్‌ శర్మ, నేహా ధూపియాలతో అఫైర్ నడిపి వార్తల్లో నిలిచాడు. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా సింగిల్ గా ఉన్న యూవీ ఇప్పుడు మళ్లీ ఫిట్ ఉండటంతో మళ్లీ డేటింగ్ మొటలేట్టేశాడు. ప్రస్తుతానికి బ్రిటిష్‌ మోడల్‌, యాక్టర్‌ హాజెల్‌ కీచ్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి తోడు వీరిద్దరూ లండన్‌లో బాగా ఎంజాయ్‌ చేసి మళ్లీ భారత్‌కు రావడంతో ఈ వార్తలు మరీ ఊపందుకున్నాయి. యాక్టర్‌ హాజెల్‌ కీచ్‌ సల్మాన్ ఖాన్ నటించిన 'బాడీగార్డ్' లో, బిల్లా సినిమాతో పాటు నటించింది.

ఏపీకి పెద్ద బిస్కెట్

  ఏపీ రాజధానిలో అనేక పరిశ్రమలు పెట్టడానికి సింగపూర్ జపాన్ తో పాటు ఇంకా అనేక కంపెనీలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిస్కెట్ వ్యాపార రంగంలోనే అగ్రస్థానంలో ఉన్న బ్రిటానియా సంస్థ కూడా ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు, కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అయితే సదరు బ్రిటానియా కంపెనీ ఎంపీ వరుణ్ బెర్రీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అవసరాల కోసం అనువైన ప్రాంతాన్ని చూస్తుండగా ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును సంప్రదించగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పేరును చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి బ్రిటానియా ఎండీ కూడా ఓకే చెప్పేడంతో రూ.125కోట్లు పెట్టుబడతో వచ్చే ఏడాది చివరి నుంచి తమ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

కారులో రేప్.. చేయాలంటే ఇంట్లోనే చేయొచ్చు.. ఎమ్మెల్యే

  పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అస్సోం ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వివరాల ప్రకారం ఎమ్మెల్యే గోపీనాథ్ ఇంట్లో 14 ఏళ్ల మైనర్ బాలిక పనిమనిషి ఉంది. అయితే ఈ బాలిక గత నెల 29 వ తేదీన ఎమ్మెల్యే గోపీనాథ్ పై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గోపీనాథ్ కారులో తనను వేధింపులకు గురిచేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఈ కేసును బోకో పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసి అక్కడ అక్కడ ఐపీసీ 343 సెక్షన్‌తో పాటు.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేశారు.   అయితే బాలిక ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాలిక తనపై చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని కుట్రతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు కారులో ‘కారులో తనను లైంగికంగా వేధించానని బాలిక చెబుతోంది. కారులో నాతోపాటు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు అది ఎలా సాధ్యమవుతుంది అని చెబుతున్నారు. ఒకవేళ అలా ఇబ్బంది పెట్టాలనుకుంటే కారులో ఎందుకు తను మాతోనే మా ఇంట్లో ఉంటోంది కదా’ అని తిరిగి ప్రశ్నించారు. అంతేకాదు ఎమ్మెల్యే కూడా తిరిగి బాలికపై తిరిగి ఫిర్యాదు చేశారు. డబ్బులు, బట్టలతో బాలిక పారిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు బాలిక మాత్రం ఎమ్మెల్యే లైంగిక దాడులకు పాల్పడ్డారని గట్టిగా చెబుతోంది అయితే పోలీసులు మాత్రం విచారణలో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు.. హైకోర్టు

  నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇంతకుముందు కోర్టు షరతులతో కూడిన బెయిల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజక వర్గం దాటి ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తన విధించిన షరతులను సడలించాలంటూ రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెయిల్‌ ఆదేశాల్లో సడలింపునిచ్చింది. హైదరాబాద్‌తో సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని తీర్పునిచ్చింది. కాని బయట ఎక్కడ కేసుకు సంబంధించి అంశాల గురించి మాట్లడకూడదని.. కేసుకు సంబంధించి సాక్ష్యులను ప్రభావితం చేసినట్లయితే షరతులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి సోమవారం సాయంత్రం ఏసీబీ కార్యలయానికి వచ్చి హాజరుకావాలని ఆదేశించింది. దీంతో రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించే సమావేశాల్లో రేవంత్ పాల్గొనే అవకాశం ఉంది.

ప్రకాశ్ రాజ్ మరో శ్రీమంతుడు

  మహేశ్ సినిమా శ్రీమంతుడి సినిమా ప్రభావం బాగానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీమంతుడి సినిమాలో మహేశ్ తన ఊరిని దత్తత తీసుకొని దాని అభివృద్ధికి పాటుపడుతాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తను తెలంగాణలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడు అని అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఊరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ట్రస్ట్ పేరుతో తమిళనాడు, కర్ణాటకలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తనవంతు సాయం అందించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట్ మండలంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ మాట్లడుతూ కావాల్సినంత సంపాదించా. ఇక సమాజానికి ఏదైనా చేయాలి. సమాజం వల్లే వచ్చింది. తిరిగి సమాజానికే ఇచ్చేయాలి.. అదే నా సిద్ధాంతం అని చెప్పారు. అందుకే నావంతుగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని అన్నారు. పంటల్ని మెరుగైన పద్ధతుల్లో పండించడం ఎలా? అందుకు ట్రాక్టర్లు కావాలన్నా సైంటిఫి క్ మెదడ్స్ పై సలహాలు కావాలన్నా.. తనవంతుగా సాయం చేయనున్నానని ఏపీలో కూడా ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకునేందుకు పర్యటనలో ఉన్నానని చెప్పాడు ప్రకాష్ రాజ్ వివరించాడు. మొత్తానికి మన నటులు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలని నిరూపించుకుంటున్నారు. వీరిని ఆదర్శంగా ఇంకా కొంతమంది హీరోలు ముందుకువస్తే బావుంటుంది.

ఏపీ రాజధానిలో ఫ్లాట్ల హడావుడి

ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరులో ఇప్పుడు ఫ్లాట్ల హడావుడి ఎక్కువైంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలు విజయవాడకు తరలివచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సాధ్యమైనంత వరకూ ఇక్కడే ఉండి పాలనా కార్యక్రమాలు చూసుకుంటున్నారు. దీంతో మరిన్ని శాఖలు ఇక్కడికే తరలివస్తున్నాయి. అయితే మొత్తం పాలన వ్యవస్థ ఇక్కడికే వస్తే దాదాపు పాతిక వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నగరంలో 400 అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి.. దాదాపు 12 వేల ఫ్లాట్ల వరకు అందుబాటులోకి రానున్నాయి.. వీటితో పాటు మరో 10 వేల ఫ్లాట్ల వరకు ఉంటాయని అంచనా. అంతేకాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రైవేటు ఉద్యోగులు.. సాఫ్ట్ వేర్లు తదితరులను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ అంచనాల ప్రకారం బిల్డర్లు భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు హైదరాబాద్, బెంగుళూరులో స్థిరపడిన బిల్డర్లు కూడా ఇక్కడికి వచ్చి భవన నిర్మణాలు చేపడుతున్నారు.

అధికారులకు వైకాపా నేత చెవిరెడ్డి వార్నింగ్

  సాధారణంగా అధికారులు అందరూ ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. వారి వ్యక్తిగత రాజకీయ ఇష్టాఇష్టాలను పక్కనబెట్టి అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ దాని ఆదేశాలను విధిగా అమలుచేయవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. అందుకు వారిని ఎవరూ తప్పు పట్టడానికి లేదు. కానీ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వాధికారులను తప్పు పడుతున్నారు. త్వరలోనే తెదేపా ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, త మ పార్టీ అధికారంలోకి రాగానే, తెదేపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు అందరిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అంతేకాదు వారిపై కక్ష తీర్చుకొంటామని హెచ్చరించారు.   ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను ఈవిధంగా బెదించడం చాలా తప్పు. నేరం కూడా. వైకాపా అధికారంలోకి వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. కానీ అధికారంలో లేనప్పుడే ఒకవేళ వైకాపా అధికారంలోకి వస్తే ఏవిధంగా వ్యవహరిస్తుందో చెవిరెడ్డి ముందే చాటి చెప్పుకొన్నట్లయింది.

వైసీపీకి గాలి కౌంటర్

  టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చంద్రబాబు నివాసంపై వైఎస్సార్ పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.   ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం విజయవాడలోని తన నివాసంలో కాలుపెట్ట్టిన సంగతి తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అతిథి గృహంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ చంద్రబాబు ఉంటున్న అతిధి గృహం అక్రమంగా నిర్మించారని.. దానిలో చంద్రబాబు ఏలా ఉంటారని రాద్దాంతం చేస్తున్నారు. దీనికి గాలి చంద్రబాబు నాయుడు నివాసం కోసం తీసుకున్న భవనాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టారని కౌంటర్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆక్రమం అంటూ వైసీపీ నేతలు రాద్దాంతం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవ చేశారు. ప్రతి విషయాన్నీ విమర్శించడం సరి కాదని హితవు పలికారు. ఎపికి రాజధాని నిర్మించాలా వద్దా, పట్టిసీమ కావాలా వద్దా అనే విషయాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

జయలలిత రూట్లో చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూట్లోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో జయలలిత పేరు మీదిగా అమ్మ క్యాంటీన్లు ఉన్నట్టే ఏపీలో కూడా అన్న సంజీవినీ ఫుడ్ క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. ఈరోజు గ్రామీణాభివృద్ధిశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే అన్న సంజీవని ఫుడ్ క్యాంటిన్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే డ్వాక్రా మహిళల గురించి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు నైపుణ్యాన్ని పెంచుకోవాలని.. 2019 నాటికి డ్వాక్రా మహిళలు వంద శాతం అక్షరాస్యత సాధించాలని చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో అక్షర వెలుగు లేదా అక్షర సంక్రాంతి పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.