ఇస్తావా? చస్తావా? కేబీఆర్ పార్క్ లో మరో దాడి
posted on Sep 16, 2015 @ 6:58PM
నిత్యం వేలాదిమంది సంచరించే కేబీఆర్ పార్క్ లో మరోసారి వాకర్స్ పై దాడి జరిగింది. వీఐపీలు, వీవీఐపీలు నివాసముండే ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. మొన్నామధ్య ఓ బడా పారిశ్రామికవేత్తపై ఏకే 47తోనే కాల్పులు తెగబడగా, ఈసారి ఓ మహిళా వాకర్ పై దాడి జరిగింది. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఓ మహిళపై హఠాత్తుగా దాడి చేసిన దుండగుడు... గోల్డ్ చైన్ ఇస్తావా? చస్తావా అంటూ బెదిరింపులకు దిగాడు. మొదట సెల్ ఫోన్ ను లాక్కున్న దొంగ, మెడలోని చైన్ ను బలవంతంగా గుంజుకునేందుకు ప్రయత్నించాడు, దాంతో బాధితురాలు ధైర్యంచేసి ఎదురుతిరిగింది. ఇద్దరి మధ్యా పెనుగులాటను గమనించిన మిగతా వాకర్స్, దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసి, కొద్దిరోజులు సెక్యూరిటీ పెట్టి, ఆ తర్వాత కనీసం అటువైపు కూడా తిరిగిచూడటం లేదని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాకర్స్ ఆరోపిస్తున్నారు. నిత్యం వేలాది మంది సంచరించే కేబీఆర్ పార్క్ లో ఎప్పుడూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు