రవీంధ్రభారతిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్రమంతటా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి, హైదరాబాద్ రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్‌, సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు, ఈ వేడుకలకు పెద్దఎత్తున హాజరైన మహిళలు... బతుకమ్మలను ఎత్తుకుని ఆడిపాడారు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలతో, రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మ పరిమళాలతో రవీంద్రభారతి ప్రాంగణం పులకరించింది, రవీంధ్రభారతిలో 8రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను చాటుతూ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తున్నారు.

శంఖుస్థాపనకి నన్ను పిలవద్దు...పిలిచినా నేను రాను: జగన్

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఒక బహిరంగ లేఖ వ్రాసారు. రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానిస్తూ తనకు ఎటువంటి లేఖ పంపవద్దని కోరారు. ఒకవేళ ఆహ్వానించినా తను హాజరుకానని తెలిపారు. ఆహ్వానం పంపించి ఆ తరువాత తను రానందుకు నిందించవద్దని అన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కొని దానిపై రాజధాని నిర్మించడాన్ని తను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నానని కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా అక్కడే రాజధాని నిర్మిస్తున్నందున నిరసనగా తను ఈ కార్యక్రమానికి హాజరుకాదలచుకోలేదని వ్రాసారు. రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ ఎందుకు విధించారని ముఖ్యమంత్రిని జగన్ తన లేఖలో ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకొని రాజధానిని నిర్మించడాన్ని తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అందుకే నిరసనగా తను శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాదలచుకాలేదని తెలిపారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు, గతంలో ఒకసారి దళిత్, ముస్లిం, బ్రాహ్మణ కాంబినేషన్ తో  ఘనవిజయం సాధించిన మాయావతి...ఈసారి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు, వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్ర కులాలను ఆకట్టుకోవడానికి కొత్త ఎత్తువేసిన మాయావతి...  బీఎస్పీ అధికారంలోకి వస్తే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అగ్రవర్ణాల్లోని పేదలు చాలా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్సించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు, తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు.

కేసీఆర్ ఫెయిల్ అయ్యారంటున్న తమ్మినేని

  ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిప్పులు చెరిగారు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సక్సెస్ అయ్యారేమో కానీ, ముఖ్యమంత్రిగా పరిపాలనలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారంటూ తమ్మినేని ఆరోపించారు. రైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులు ఇలా అన్ని వర్గాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని తమ్మినేని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న తమ్మినేని... రైతుల బ్యాంకు రుణాలపై మంత్రి పోచారం పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ విమర్శించారు

అమెరికా అధ్యక్షుడి కంటే బాబు ఖర్చే ఎక్కువట

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు, టీడీపీ ప్రభుత్వం హంగూ ఆర్భాటాలతో పాలన సాగిస్తోందన్న ఆయన.... చంద్రబాబు విమాన ప్రయాణాల ఖర్చే వంద కోట్లు ఉంటుందని ఆరోపించారు, అమెరికా అధ్యక్షుడు కంటే ఎక్కువగా చంద్రబాబు తన పర్యటనల కోసం ఖర్చు పెడుతున్నారని లోక్ సత్తా జేపీ విమర్శించారు. ఎప్పుడూ అమరావతి జపం మాత్రమే చేస్తూ మిగతా ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నారని, చంద్రబాబు విధానాలతో మరోసారి ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చే అవకాశముందని జేపీ వ్యాఖ్యానించారు, రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఏపీని నిధుల దుబారాతో చంద్రబాబు మరింత కష్టాలు పాలు చేస్తున్నారని జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు.

అమరావతిపై ప్రధానికి ఫిర్యాదులు

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధాని నరేంద్రమోడీకి పర్యావరణవేత్తలు ఫిర్యాదు చేశారు, ఏపీ రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చుంటే, దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కి అందజేసి, వారి అనుమతితో పనులు చేపట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు, ఇవేమీ చేయకుండా ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పనులు చేపడుతోందని ప్రధాని మోడీకి పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు కంప్లైంట్ చేశారు, పర్యావరణం, ఇతర సమస్యలను పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేపట్టడం మంచిది కాదని, అమరావతి శంకుస్థాపనకు వచ్చే మోడీ దీనిపై ఆలోచించాలని పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

రాజీనామాలపై వైసీపీ ఎమ్మెల్యేల్లో విభేదాలు?

  జగన్ దీక్ష విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో కంగుతిన్న వైసీపీ ముఖ్యనేతలు... నానా హైరానాపడ్డారట, ఒకవైపు జగన్ హెల్త్ రిపోర్ట్ పై మంత్రుల విమర్శలు... మరోవైపు జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా... ప్రభుత్వం దీక్షను భగ్నం చేయకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని బెదిరించారట, ఇదే విషయాన్ని నేరుగా స్పీకర్ కు కూడా చెప్పారట, అయితే మూకుమ్మడి రాజీనామాల ప్రతిపాదనపై కొందరు అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది, దాంతో అంతర్మథనంలో పడిన వైసీపీ అధిష్టానం... ఆ నిర్ణయంపై వెనక్కితగ్గిందంటున్నారు. ఒకవేళ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించినా...అందరూ ముందుకురాకపోతే అసలుకే మోసం వస్తుందని భావించి వెనకడుగు వేసిందంటున్నారు. దాంతో జగన్ ను ఆస్పత్రికి లిఫ్ట్ చేయాలంటూ ప్రభుత్వాన్ని వైసీపీ ముఖ్యనేతలు బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణదీక్షకు దిగిన జగన్...చివరికి ప్రభుత్వాన్ని వేడుకుని లిఫ్ట్ చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

మూకుమ్మడి రాజీనామాలంటూ బెదిరించారట

  67మంది వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారనే టాక్ వినిపిస్తోంది, జగన్ దీక్ష విషయంలో చంద్రబాబు సర్కార్  తమాషా చూడటంతో వైసీపీ నేతలు కంగారుపడ్డారని, జగన్ ఆరోగ్యం విషమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం, ఆస్పత్రికి లిఫ్ట్ చేయకపోవడంతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ బెదిరించారని అంటున్నారు, దీక్ష పేరుతో బాబును జగన్ ఇరకాటంలో పెడదామనుకుంటే, ప్రభుత్వం కూడా జగన్ విషయంలో గేమ్స్ ఆడిందని అంటున్నారు. దీక్ష పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూస్తే, ఎన్నిరోజులు ఉంటాడో చూద్దామనే రీతిలో సర్కార్ వ్యవహరించిందంటున్నారు, ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్షను భగ్నంచేయకుండా జగన్ కు సర్కార్ చుక్కలు చూపించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించారని, దాంతో కొత్త తలనొప్పి ఎందుకని భావించి ఏడోరోజు జగన్ దీక్షను భగ్నం చేశారని చెప్పుకుంటున్నారు.

జగన్ దీక్ష ఫ్లాప్.. ఆ నాయకుడు వల్లేనా

ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్ష చేయడం వల్ల ఓరిగేందంటే కనీసం ఆపార్టీ నేతలు కూడా సమాధానం చెప్పలేరు. అసలు దీక్ష చేసి ఏం సాధించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా జగన్ కు దీక్షలు చేయడం అలవాటుగా మారిపోయింది. అలాగే ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసి ఆఖరికి నవ్వులపాలు అవ్వాల్సి వచ్చింది. అయితే పార్టీ శ్రేణులు మాత్రం ఇప్పుడు దీక్ష చేయోద్దని జగన్ చెప్పినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు అటు ప్రజలు కూడా రాజకీయ శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారని.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం తరువాత దీక్ష సంగతి చూద్దాం అని చెప్పినా కూడా జగన్ దీక్షకు పూనుకున్నారట. అయితే జగన్ దీక్ష చేయడం వెనుక పార్టీలో కొత్త నాయకుడు ఉన్నాడని.. అతని ప్రోత్సాహం వల్లే జగన్ దీక్షకు పూనుకున్నారని దీక్షలో విఫలం అయ్యారని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారట. అంతేకాదు ఈ దీక్ష వల్ల జగన్ కు చాలా నష్టం జరిగిందని.. ఇక భవిష్యత్ లో జగన్ ఎలాంటి దీక్షలు చేస్తానన్నా ఎవరూ పట్టించుకోరని.. దీనివల్ల జగన్ కు చాలా నష్టంజరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడే జగన్ అంత సీరియస్ గా దీక్ష చేస్తేనే ఏపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. అలాంటిది ఈ ఎఫెక్ట్ వల్ల భవిష్యత్ లో చేసే దీక్షలకు కూడా విలువ ఉండదని అనుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్ దీక్ష ప్లాప్ అయిందని జగన్ పార్టీ నేతలే అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు.

రైతు ఆత్మహత్యలపై కోదండరాం.. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఎండగడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని.. రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జేఏసీ కోదండరాం కూడా రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు షాకిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఆయన కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అయితే ఇప్పటి వరకూ రైతు ఆత్మహత్యలపై ఏం మాట్లాడటం లేదని కోదండరాంపై ఇప్పుడు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో చర్చాంశనీయమైంది. ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని.. స్వామినాథన్ కమిటీ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, దీని పైన తాను సమగ్ర సర్వే జరిపానని, ఇందుకు సంబంధించి తన వద్ద నివేదిక ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలతో ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు కోదండరాం కూడా తోడయ్యాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ శంఖనాదం

దసరా రోజు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఏ ముఖ్యమంత్రో.. ఇంకెవరో అనుకుంటున్నారా? కాదు. అది ఎవరంటే.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో శంఖం ఊదేందుకు శంఖేశ్వర్ ను ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన శంఖేశ్వర్ శంఖం ఊదడంలో  నిష్ణాతుడు. ఈయన గురించి ప్రముఖ సంఘ సేవకుడు రామచంద్ర డోంగ్రీజీ మహరాజ్ గోశాల ట్రస్టీ జస్ మత్ భాయ్ పటేల్ ద్వారా తెలుసుకున్న టీడీపీ వర్గాలు ఆయనతో శంఖం ఊదించాలని నిర్ణయం తీసుకొని ఆయనను ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కాగా శంఖేశ్వర్ కు రెండు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయనతో శంకునాదం చేయిస్తుంటారు. ఆయన మంచినీళ్లు కూడా తాగకుండా ఏకధాటిగా 1100 సార్లు శంఖనాదం చేయగలరు.

టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

మెడికల్ సీట్ల విషయంలో మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 127 సీట్లకు తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో A, B కేటగిరి సీట్లను అమ్ముకున్నారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది, సి.మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఆ 127 సీట్లకు ఈనెల 20లోగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి సూచించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటును కోటి రూపాయలకు అమ్ముకున్నారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి.

నేను కాదు చంపింది... గుట్టువిప్పిన ఇంద్రాణి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది, ఈ కేసులో అరెస్టయిన షీనా బోరా తల్లి ఇంద్రాణి గుట్టువిప్పింది, ఇప్పటివరకూ విచారణకు సరిగా సహకరించడం లేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి...నోరు విప్పి కొత్త విషయాలు తెలియజేసింది, షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నానే ఆమెను కడతేర్చాడని చెప్పుకొచ్చింది. ఒకసారి సంజీవ్ ఖన్నాతో విందుకు షీనాను తీసుకెళ్లానని, అయితే తన ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జీ కుమారుడితో షీనా సంబంధం పెట్టుకోవడం సంజీవ్ తట్టుకోలేకపోయాడని, అందుకే డ్రైవర్ తో కలిసి షీనాను సంజీవ్ ఖన్నా చంపేశాడని సీబీఐకి తెలిపింది.  

అమరావతికి పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న తరుణంలో.. అమరావతి నిర్మాణాన్ని ఆపాలంటూ.. పర్యావరణ అనుమతులు లేవంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు వాటన్నింటికి బ్రేక్ పడింది. అమరావతికి పర్యావరణ అనుమతుల గురించి కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. రాజధానికి అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. అసలు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోయే ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతులు రావని అనుకోవడం పొరపాటే.

హైదరాబాద్, సికింద్రాబాద్ లో కేబుల్ టీవీ పన్ను

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇక కేబుల్ టీవీ పన్ను వసూలు చేయబోతున్నారు. కేబుల్ ఆపరేటర్లు వినోదపన్ను చెల్లించాలన్న చట్టం ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటివరకూ దాన్ని అమలుచేయని జీహెచ్ఎంసీ అధికారులు... ఇకనుంచి పన్ను వసూలుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం కేబుల్ ఆపరేటర్లు 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని, దాంతో వినియోగదారులపై కేబుల్ ఆపరేటర్లు అదనపు భారం వేసే అవకాశముందని అంటున్నారు, ఈ లెక్కన 24లక్షల కేబుల్ టీవీ కనెక్షన్లు, 4లక్షల డీటీహెచ్ కనెక్షన్ల ద్వారా జీహెచ్ఎంసీకి పెద్దమొత్తంలోనే ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు

పరువు నష్టం దావా వేస్తానంటున్న మంత్రి

అగ్రిగోల్డ్ భూముల విషయంలో తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తంచేశారు, తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న పుల్లారావు... పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ లీడర్స్ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు పత్రాలు చూపిస్తూ మీడియాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు, వివాదాస్పద అగ్రిగోల్డ్ భూములను తాను తక్కువ ధరకు కొనుగోలు చేశానంటూ ఆరోపించిన మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు

అమరావతి శంకుస్థాపన.. యాంకర్ గా సాయికుమార్

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి చేయాల్సిన పనులతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా బిజీ అయిపోయారు. అంతేకాదు శంకుస్థాపన కార్యక్రమానికి ముందు కొన్ని సాంస్కృతికి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాలకు యాంకర్ గా సాయికుమార్ ను నియమించినట్టు.. దీనికి చంద్రబాబు కూడా ఓకే అన్నట్టు తెలస్తోంది. శివమణి డ్రమ్స్‌తో పాటు ఏపీకి చెందిన కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మొతం మూడు వేదికలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు వేదికలలో మొదటి ప్రధాన వేదిక.. ఆ దిగువున రెండు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు15 మంది కీలక వ్యక్తులు ఆసీనులు కానున్నారు. మిగిలిన  రెండు వేదికలపై ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులు ఆసీనులవుతారు.