వణికిన ఈశాన్యం.. ఆరుగురు మృతి

ఈశాన్య భారతదేశం భూకంపంతో వణికిపోయింది. బంగ్లాదేశ్, ఇంపాల్, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ లో ఉదయం 4.30 గంటలకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పెద్ద పెద్ద భవనాలు, మల్టీ కాంప్లెక్స్ లు కూలిపోయాయి.  ఈ ఘటనకు ఆరుగురు మృతి చెందగా 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు సహాయక చర్యలకు గాను ఎన్టీఆర్ ఎఫ్ బృందాలుఇంపాల్ బయలుదేరాయి. ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భూకంపం గురించి ఆరా తీశారు. అసోం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇంపాల్ లోని భూకంప పరిస్థితి పై సమీక్షిస్తున్నారు.

ఆఫ్ఘానిస్తాన్ లో భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదుల దాడి

  ఈ కొత్త సంవత్సరంలో భారత్ లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మళ్ళీ నిన్న రెండవసారి దాడికి పాల్పడ్డారు. మొన్న జనవరి 1వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘానిస్తాన్ లో మజారీ షరీఫ్ నగరంలో ఉన్న భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. భద్రతాదళాలు వారి దాడిని తిప్పికొట్టాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.   సాధారణంగా ఉగ్రవాదులు మిలటరీ దుస్తులు ధరించి, కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటారు. లేదా బాంబులతో నింపిన వాహనంలో దూసుకువచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడుతుంటారు. కానీ ఈసారి మాత్రం పక్కనే ఉన్న మరో భవనంలోకి చొరబడి, దానిలో నుంచి కాల్పులు జరుపుతూ భారత కౌన్సిలేట్ భవనంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరినీ భద్రతాదళాలు వెంటనే కాల్చి చంపాయి. మిగిలిన ఇద్దరూ ఇంకా కాల్పులు జరుపుతున్నారు.   ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలియగానే కౌన్సిలేట్ భవనం లోపల ఉన్న దౌత్యాధికారులు, ఉద్యోగులు అందరినీ అదే భవనంలో ఒక సురక్షితమయిన ప్రాంతానికి తరలించారు. “భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదులు దాడులు చేసారు. అందరూ క్షేమంగా ఉన్నాము,” అని ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ జనరల్ బ్రజబాషి సర్కార్ ప్రకటించారు. ఉగ్రవాదుల దాడి సంగతి తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు అక్కడికి చేరుకొని ఉగ్రవాదులు దాకొన్న భవనాన్ని చుట్టు ముట్టాయి. ఆ భవనంలో దాకొన్న ఇద్దరు ఉగ్రవాదులకి భద్రతాదళాలకు మధ్య ఇంకా కాల్పులు జరుతున్నాయి. ఈ దాడికి పాల్పడినవారెవరో ఇంకా ప్రకటించుకోలేదు.   ప్రధాని నరేంద్ర మోడి కాబూల్, లాహోర్ పర్యటనల తరువాత మొదట పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై, మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడులు చేయడం గమనిస్తే, మోడీ ప్రారంభించిన శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించడానికే ఈ దాడులు జరుగుతున్నాయేమొన్నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేటీఆర్ చప్రాసి ఉద్యోగానికీ కూడా పనికిరాడు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కాకపోతే తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికీ కూడా అర్హుడు కాదని అన్నారు. ఈ సందర్బంగా ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావిస్తూ గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున కెటిఆర్ ప్రచారం చేస్తే టిడిపి నుంచి నేను వస్తానని.. టిఆర్ఎస్ నుంచి కెసిఆర్ వస్తే టిడిపి నుంచి చంద్రబాబు వస్తారన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపింది ఎన్టీఆరేనని.. ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో కాకుండా గతంలో కేసీఆర్ ఆంధ్రా బిర్యానిని పేడ బిర్యాని అని విమర్శించగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిని గుర్తు చేస్తూ.. కేసీఆర్ ఆంధ్రా బిర్యాని పేడ బిర్యాని అన్నారు.. ఇప్పుడు అమరావతి వెళ్లి అదే పేడ బిర్యాని తిని వచ్చారు అని ఎద్దేవ చేశారు. మరి ఇద్దరు సీఎంలు సన్నిహితంగా మెలుగుతున్న వేళ.. రేవంత్ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రేవంత్ వ్యాఖ్యలకు కేసీఆర్.. కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కేజ్రీవాల్ రూల్ తో 4 లక్షల ఆదాయం..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యం నివారణకి సరి-బేసి విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ విధానం వల్ల అటు కాలుష్య నివారణతో పాటు.. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చేలా కనిపిస్తుంది. అదెలాగంటే.. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై రూ. 2వేల రూపాయలు జరిమానా విధించమని కేజ్రీవాల్ తెలిపిన సంగతి విదితమే. నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా సరి-బేసి విధానాన్ని అమలు చేసిన తొలి రోజునే దాదాపు 200 పైన మంది ఈ నిబంధనను ఉల్లంఘించి పోలీసులకు బుక్కాయ్యారు. దీంతో వారి దగ్గర నుండి పోలీసులు 4 లక్షలకు పైగా జరిమానా వసూలు చేశారు. ఇదిలా ఉండగా ఈ నిబంధనల వల్ల ఆటో డ్రైవర్లు మీటర్లు కూడా వేయకుండా ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు చాలా వచ్చాయి. దీంతో పోలీసు రవాణా శాఖ అధికారులు 76 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి జరిమానా వసూలు చేశారు.

ప్రజా సమస్యలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా బొండపల్లిలో మూడో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టామని.. ప్రజా సమస్యలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతేకాదు అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు.. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలున్నా ఈ కార్యక్రమంలో అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప కూడా పెద్దాపురం నియోజకవర్గంలోని చదలవాడ గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులను అందిస్తామని.. పేద ప్రజల సంక్షేమం కోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

బాక్సింగ్ చేసిన మంత్రులు గంటా, అయ్యన్న..

మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న విబేధాల గురించి అందరికీ తెలిసిందే. ఉండటానికి ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఒకరు ఈస్ట్ అంటే మరొకరు వెస్ట్ అనే టైపు. విశాఖ రాజకీయాల గురించి తెలిసిన వారికెవరికైనా వీరి మధ్య ఉన్న వైరం గురించి తెలిసే ఉంటది. ఈమధ్య కొణతాల చేరిక విషయంలో కూడా వీరి మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. అలాంటిది వీరిద్దరి మధ్య ఓ ఆసక్తిర సంఘటన చోటు చేసుకుంది. వీరిద్దరూ 'విశాఖ ఉత్సవ్' ఉత్సవాల్లో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి 3 వరకు విశాఖలో 'విశాఖ ఉత్సవ్' పేరిట జరిగే ఉత్సవాల్లో వీరిద్దరూ పాల్గొన్న వీరు సరదాగా బాక్సింగ్ చేశారు. చేతికి గ్లౌజులు వేసుకొని ఒకరిపై ఒకరు సరదాగా పంచ్ లు విసురుకున్నారు. . అయ్యన్న బ్లూకలర్,.. గంటా రెడ్ కలర్ గ్లౌజ్ లు ధరించి ఒకరిపై ఒకరు నవ్వులు చిందిస్తూ పంచ్ లు విసురుకోవటం అందరినీ ఆశ్య‌ర్య‌ప‌రిచింది. దీంతో అక్కడున్న వారంతా మంత్రుల బాక్సింగ్ ఫైట్‌ను ఆసక్తిగా తిలకించారు.

నిధుల కేటాయింపులో పొరపాటు చేసిన ఏపీ సర్కార్..

ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. ఎప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేద్దామా అని ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా ఎదురుచూస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు అధికార పార్టీ చేసిన ఒక పొరపాటు వల్ల విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అదేంటంటే.. ఎమ్మెల్యేలకు కేటాయించ వలసిన నిధుల విషయంలో.. ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలకు కాకుండా టీడీపీ నేతలకు మంజూరు చేయడంతో.. వైకాపా ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. తమ నియోజ‌క‌వర్గాల‌కు నిధులు విడుద‌ల చేయ‌డం లేద‌ని వైకాపా అధికారులు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు విడుదల చేసినా కానీ.. ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం పొరపాటు చేసింది. దీనికి వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. కానీ నిధులు విడుద‌ల చేసింది మాత్రం.. టీడీపీ నేత గంగుల ప్ర‌భాకర్ రెడ్డి పేరుతో.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి కాగా టీడీపీ నేత శిల్పా చక్రపాణి ఎమ్మెల్యే పేరు మీద.. కర్నూలు జిల్లాలో ఏకంగా నాలుగు వైకాపా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిధులు టీడీపీ ఇన్‌చార్జ్‌ల పేరు మీద విడుదల చేశారు.    తునిలోయనమల రామకృష్ణుడి సోదరుడి పేరు మీద నిధులు విడుదల చేశారు. దీంతో నిధుల విడుద‌ల‌లో ఈ ప‌క్ష‌పాత వైఖ‌రి ఏంట‌ని వైకాపా ఎమ్మెల్యేలు ప్ర‌శ్నిస్తున్నారు. మరి వైకాపా నేతలు చేసే విమర్శలకు అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఘోర రోడ్డు ప్రమాదం.. శవంతో 20 కి.మీ..

నల్గొండలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఆమంచి గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే కారు అతనిని గుద్దినప్పుడు కారు టాప్ పై పడి మరణించాడు.. అయితే ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు కారును వెంబడించడంతో.. కారు డ్రైవర్ శవంతోనే 20 కిమీ వరకూ వెళ్లాడు. కానీ స్థానికులు అతనిని అయిటిపాముల వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రైవర్ కారును నడిపే సమయంలో తాగి ఉన్నాడా?లేదా? అనే విషయాన్ని తేల్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. షెడ్యూలు రేపు వెలువడే అవకాశం..?

తెలంగాణలో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన షెడ్యూలు రేపు వెలువడే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు పార్టీలు ప్రచార కార్యక్రమాలకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారానికి సిద్ధమైంది. నోటిఫికేషన్ రాకపోయినా ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంది. ఆదివారం నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా నగరమంతా పెద్ద పెద్ద హోర్డింగులతో నింపేశారు. కాగా గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లలో 84 హైదరాబాద్ సిటీ పరిధిలో ఉండగా, 64 రంగారెడ్డి పరిధిలో, 2 మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. పోలింగ్ ఈ నెల 23 నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రోజా సస్పెన్షన్ పై కమిటీ..

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నఆరోపణపై స్పీకర్ ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిపక్ష పార్టీలు రోజాపై అనవసరంగా సస్పెన్షన్ వేటు వేశారంటూ అధికారపార్టీపై విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు రోజా సస్పెన్షన్ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. స్పీకర్ కోడెల బుద్దా ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులుగా ముగ్గురిని నియమించారు. శ్రవణ్ కుమార్(టీడీపీ)శ్రీకాంత్ రెడ్డి (వైసీపీ) విష్ణుకుమార్ రాజు (బీజేపీ) ఈ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా రోజా సస్పెన్షన్ గురించి.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఇరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పీకర్ కోడెల సభ్యులను ఆదేశించడం జరిగింది.

పోటీ నుండి తప్పకోవడానికి కాంగ్రెస్ నేతలే కారణం..

నిజామాబాద్ కాంగ్రెస్ నేత వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ పోటీ నుండి తాను తప్పకోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని.. టీఆర్ఎస్ నేతలు నాకు డబ్బు ఇవ్వలేదని.. అసలు వాళ్లు నాతో మాట్లాడలేదని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు షబ్బీర్ అలీ, మధుయాష్కీ, మహేశ్ గౌడ్ డబ్బుల కోసం నాపై ఒత్తిడి తీసుకొచ్చారని.. షబ్బీర్ అలీ సమక్షంలోనే పార్టీ నేతల దగ్గర రూ.2కోట్లు డిపాజిట్ చేశా కానీ.. మరో రెండు కోట్లు డిమాండ్ చేయడంతో తట్టుకోలేకే పోటీ నుండి తప్పుకున్నానని చెప్పారు. మరి వెంకట రమణారెడ్డి రాసిన లేఖకు కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

కొనసాగుతున్న తెలుగు విద్యార్ధుల కష్టాలు..

అమెరికాలో తెలుగు విద్యార్ధులకు ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది విద్యార్ధులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపేశారు. ఇప్పుడు మరో 18 మంది తెలుగు విద్యార్ధులకు కూడా చుక్కెదురైంది. ఎస్పీయూ, ఎన్పీయూలో అడ్మిషన్లు పొందిన 18 మంది విద్యార్ధులను ఇమ్మిగ్రేషన్ అధికారులు సియాటెల్ ఎయిర్ పోర్టు నుండి వెనక్కి పంపించేశారు. దీంతో వివరాలు సేకరణ పేరుతో ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇంటరాగేషన్ చేస్తున్నారని విద్యార్ధులు ఆందోళమ వ్యక్తం చేస్తున్నారు..మరోవైపు విద్యార్దుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వని టీఆర్ఎస్

తెలంగాణలో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చేలా కనిపించడంలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో అన్నిచోట్లా టీఆర్ఎస్ పార్టీ జెండాలు.. హోర్డింగులతో నింపేశారు. హైదరాబాద్ లోని మొత్తం భారీ హోర్డింగులను అధికార పార్టీ గత రెండు నెలల కిందటే గుత్తకు తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు హైదరబాద్ లోని మెజారిటీ బస్టాండ్ల హోర్డింగులనూ అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఈ హోర్డింగుల్లో పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు పొందుపరిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి అంటూ నినాదాలు చేస్తోంది. మొత్తానికి అధికార పార్టీ.. ప్రతిపక్షాల ప్రచారానికి ఎక్కడా చోటు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరి ప్రతిపక్షపార్టీలు ఏం చేస్తాయో చూడాలి.

నలుగురు ఉగ్రవాదులు హతం!

  ఈరోజు తెల్లవారుజామున పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడిన నుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు వైమానిక దళానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఉగ్రవాదులు ఈ దాడికి నిన్ననే సిద్దమయ్యారు. వాళ్ళు నిన్న ఒక పోలీస్ అధికారిని, మరో ఇద్దరిపై దాడి చేసి వారి వాహనాన్ని తస్కరించారు. ఆ వాహనంలోనే వారు ఎయిర్ బేస్ వరకు వచ్చి దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన ఈ ఉగ్రవాదులు జైషే మహ్మద్ లేదా లష్కరే తాయిబాకు చెందినవారయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడితో పంజాబ్ తో సహా దేశ వ్యాప్తంగా విమానశ్రయాలు, ఇతర కీలక ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేసారు.

పంజాబ్ లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి

  పంజాబ్ లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఈరోజు తెల్లవారుజామున సుమారు 3.00-3.30 గంటలకు నలుగురు ఉగ్రవాదులు దాడి చేసారు. సైనిక దుస్తులు ధరించి, సైనిక వాహనాలలో వచ్చిన ఆ నలుగురు బయట కాపలా ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసారు. కానీ భద్రతా బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నందున వారి దాడిని సమర్ధంగా తిప్పికొట్టాయి. భద్రతదళాల కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు ఇంకా కాల్పులు జరుపుతున్నారు. వారిని భద్రతాదళాలు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నాయి. ఈ దాడి గురించి తెలియగానే సరిహద్దు భద్రతా దళాల డి.ఐ.జి. కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ హెలికాఫ్టర్లలో అదనపు భద్రతాబలగాలను పఠాన్ కోట్ పంపించారు.   సరిహద్దు ప్రాంతంలో గల ఈ ఎయిర్ బేస్ భారత్ కి చాలా కీలకమయిన రక్షణ స్థావరం. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మధ్యలో ఉంది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసివచ్చిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ మెరుగుపడుతున్న సమయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా ఆందోళనకరంగా ఉంది. ఈనెల 15వ తేదీన ఇస్లామాబాద్ లో భారత్-పాక్ విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగబోతోంది.

నేటి నుంచి విశాఖ ఉత్సవాలు ప్రారంభం

  ప్రతీ ఏట మూడు రోజులపాటు విశాఖ ఉత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖనగరంలోని ఎం.జి.ఎం.పార్కులో పుష్ప ప్రదర్శనను ప్రారంభించారు. విశాఖలో ప్రముఖ పర్యాటక ఆకర్షణలయిన రామకృష్ణా బీచ్, భీమిలి బీచ్, కైలాసగిరి పార్క్, ఉడా పార్క్, జాతర పార్క్ లలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి జానపద, నృత్య, నాటక కళాకారులు వచ్చి ఈ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో రామకృష్ణ బీచ్ వద్ద జరిగే కార్యక్రమాలను, అక్కడి కోలాహలాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అలాగే జిల్లా నలుమూలల నుంచి వచ్చే జానపద కళాకారులు మధురవాడ సమీపంలో గల జాతర పార్కులో ఇచ్చే అత్యద్భుతమయిన ప్రదర్శనలు చూడటానికి దూర దూర ప్రాంతాల నుంచి బారీగా ప్రజలు తరలివస్తుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ఉత్సవాల ముగింపు రోజున వచ్చి పాల్గొంటారు.

మంత్రిగారు ఎమ్మెల్యేతో హైదరాబాద్ లో డిష్యూం డిష్యూం!

  ఇవ్వాళ్ళ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణా రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు గొడవ పడటంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. శేరిలింగంపల్లి నియోజక వర్గం అభివృద్ధి విషయంలో మంత్రిని ఎమ్మెల్యే గాంధీ ప్రశ్నించడంతో ఆయన చాలా పరుషంగా జవాబు ఇచ్చారు. ప్రజలందరూ చూస్తుండగానే వారిరువురు తీవ్రంగా వాదించుకొన్నారు. ఇరువురూ ఆవేశంతో ఊగిపోతూ ఒకరినొకరు తోసుకొన్నారు. వారికి వారి అనుచరులు కూడా తోడవడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. గాంధీ వైఖరిని నిరసిస్తూ మంత్రి ఆయన అనుచరులు రోడ్డు కూర్చొని నిరసన తెలపడంతో, గాంధీ ఆయన అనుచరులు కూడా రోడ్డు మీద బైటాయించి నిరసనకు తెలిపారు. చివరికి పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించేసారు.