ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం ఇష్టం లేదు.. కేటీఆర్

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య పచ్చ గడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే కాలం మారుతున్న కొద్ది ఇద్దరు సీఎంలు కూడా మారుతూ.. ప్రస్తుతం ఎలాంటి వాదనలు లేకుండా ఉంటున్నారు. అయితే చంద్రబాబు సంగతేమో కాని.. కేసీఆర్ మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎందుకంటే అసలే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అందుకే గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకున్న కేటీఆర్ కూడా ఎక్కడ విమర్సించకుండా మాట్లాడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు, కేసీఆర్ కలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ లో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడానికి సుముఖంగానే ఉన్నారని.. కానీ అది కొందరికి నచ్చట్లేదని అన్నారు. అంతేకాదు..తమకు ఎవరి పట్లా ధ్వేషం లేదని.. ఉద్యమ సమయంలో సీమాంధ్రులపై పరుషంగా మాట్లాడామని.. కానీ ఈ 18 నెలల్లో తమ పరిపాలన ఏంటో సీమాంధ్రులు కూడా చూశారని.. అందుకే తామేం చేశామో చూసి ఆత్మవిమర్శ చేసుకుని ఓటేయాలని ఆయన కోరారు. తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. మరి అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని కేటీఆర్ అంటున్నారు.. అది ఎన్నికలంత వరకేనా.. లేక ఎప్పుడూనా అనేది చూడాలి..

తెలంగాణలో ఏపీ తరహా కాల్ మనీ దందా..

గత కొద్దిరోజుల క్రితమే ఆంధ్రరాష్ట్రంలోని విజయవాడలో కాల్ మని దందా చేసిన అరాచకాలు వెలుగుచూశాయి. వడ్డీకి మనీ ఇచ్చి వాళ్లు తిరిగి చెల్లించని నేపథ్యంలో వాళ్లు ఆస్తులను అక్రమంగా లాక్కుంటూ దందా నడిపేవారు. సుమారు 250 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహాలో దందా చేస్తున్న వారి వైనం బయటపడింది. హైదరాబాద్ లోని పాతబస్తీలో కాల్ మనీ తరహా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఫైనాన్స్ సంస్థలపై దాడి చేసి 86 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో 26మందిపై కేసులు నమోదు చేసి మరో 36మందిని విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే మరో వంద మంది బాధితులు డిసిపి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.

కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్.. మీకు భోళా శంకరుడే..

తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూతురు కవిత.. కేసీఆర్ ను ఉద్దేశించి తన తండ్రి భోళా శంకరుడు అని వ్యాఖ్యానించింది.. ఇందుకు గాను రేవంత్ రెడ్డి కవితకు కౌంటర్ ఇస్తూ కవితమ్మా! కెసిఆర్ మీ కుటుంబానికే భోళా శంకరుడే అని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసీఆర్ చేసిన యాగంపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఆయుత చండీయాగం చేశారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం కెసిఆర్ చెప్పే మాటలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని.. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలు ఇచ్చేందుకు తెలంగాణలో వేలాది మంది ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మోడీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నాయి.. అలీ

పంజాబ్ పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసినందుకు గాను పలువురు ప్రధాని మోడీ విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే శివసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఇద్రిస్ అలీ ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నాయని అందుకే పఠాన్‌కోట్ పై తీవ్రవాద దాడి జరిగిందనుకుంటున్నానని, ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన తర్వాత ఈ దాడి ఎందుకు జరిగిందని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని అతను అన్నాడు. అయితే అలీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతల సంగతేమో కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. తను వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కోరారు. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దని హెచ్చరించింది. మొత్తానికి అలీకి తమ పార్టీ నేతల నుండి వ్యతిరేకత రావడం గమనార్హం.

జయలలిత డిమాండ్.. నోట మాట రాని మోడీ..

తమిళనాడు సీఎం జయలలిత రాజకీయంగా ప్లాన్ వేయడంలో దిట్ట. ప్లాన్ చేయాలంటే ఆమె తరువాతే ఎవరైనా. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పట్టేలా నిర్ణయం తీసుకున్నారు జయలలిత. మొన్నీ మధ్యనే తమిళనాడులో జరిగే జల్లికట్టు క్రీడపై అనుమతి ఇవ్వాలని కేంద్రాన్నికోరారు. దీనికి కేంద్రం కూడా ఏం చేయాలో తెలియక అనుమతినిచ్చింది. ఇప్పుడు అది అయిపోయిందంటే.. భారీ వర్షాల వల్ల తమిళనాడు చాలా నష్టపోయిందని.. దీనికి గాను రూ.25912 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య నాలుగు దశల్లో కురిసిన భారీ వర్షాల వల్ల తమ రాష్ట్రంలో 470 మంది మృతి చెందారని తెలిపారు. లక్ష పశువులు మృతి చెందగా.. 382768 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వివరించారు. అంతేకాదు భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన 245మంది కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సాయమందించినట్టు జయలలిత తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా కుటుంబాలకు సాయమందిస్తామన్నారు. మరోవైపు జయలలిత చేసిన డిమాండ్ కు బీజేపీ నేతలు ఆమెపై గుర్రుమంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి ప్రజలను ఆదుకుంటున్న పేరుతో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని జయలలిత చూస్తుందని అంటున్నారు. మరోవైపు జయలలిత డిమాండ్ కు మోడీ కి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారంట. ఈ నేపథ్యంలో జయలలిత ప్లాన్ వర్కవుట్ అవుద్దో లేదో చూడాలి. కానీ మోడీకి జయలలిత మద్దతు ఖచ్చితంగా కావాల్సిందే.. మరి జయలలిత డిమాండ్ కు మోడీ ఏమంటారో..?

మహిళా జర్నలిస్టును చంపిన ఐసిస్... గూఢాచార్యం చేస్తుందని

ఉగ్రవాదుల ఆకృత్యాలకు అంతులేకుండా పోతుంది. రాక్షసత్వంతో ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. కొద్ది రోజుల క్రిందట పారిస్ లో దాడులు జరిపి ప్రజలను భయాందోళనకు గురిచేసిన సిరియా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు. ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. రక్కా ప్రాంతంలోని పౌర జర్నలిస్టుగా పని చేస్తున్న రుఖియా హసన్ అనే మహిళ గూఢచార్యం చేస్తున్నదని ఆరోపిస్తూ  అతి దారుణంగా ఉరి తీసి చంపేశారు. ఈ విషయాన్ని సిరియాలోని సీనియర్ జర్నలిస్టు సంస్థ ‘సిరియా డైరెక్ట్' తెలిపింది. ఇప్పటివరకూ ఉగ్రవాదులు ఐదుగురు విలేకరులను చంపారని ఈ పత్రికలో పేర్కొంది. అంతేకాదు ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం అనే పేరుతో ఉగ్రవాదులు చేసే అరాచకాలను ఫేస్ బుక్ ద్వారా అందరికి తెలిపేదంట. తాను చివరి సారిగా.. నన్ను ఉగ్రవాదులు చంపేస్తానని బెదిరిస్తున్నారు..  వాళ్లు నన్ను చంపేస్తారని.. ఇలా జీవించడం కంటే చనిపోవడం మేలు అని సిరియా మానవహక్కుల సంస్థ (ఆర్బీఎస్ఎస్) వ్యవస్థాపకుడు అబు అహమ్మద్ కు చివరికి సారిగా ట్వీట్టర్ లో వెల్లడించిందట.

ప్రచారంలో చాలా స్లోగా కాంగ్రెస్ పార్టీ..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి పార్టీలు చాలా రకాలుగా కష్టపడుతున్నాయి. ఏం చేస్తే ప్రజలు తమ వైపు మొగ్గుతారా అని ఎవరికి తగిన వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. అయితే అందరి సంగతేమే కాని ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కాస్త వెనకబడే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుటికే అధికారపార్టీ.. టీడీపీ-బీజేపీ పార్టీలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టి దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి గాంధీభవన్ లో సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి హైటెక్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ నేతలు సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికార టీఆర్ ఎస్ నిజస్వరూపాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు. మరి అందరూ ఎప్పుడో మేల్కొని సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు మేల్కొని సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంది. మరి ఇంత స్లోగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఏం దూకుడు చూపిస్తుందో చూడాలి.

మోడీకి నవాజ్ షరీఫ్ ఫోన్.. ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటాం..!

  పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరం పై జరిగిన దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడికీ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా షరీఫ్ పఠాన్ కోట్ పై దాడి చేసిన ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మోడీకి హామీకి ఇచ్చారంట. ఈ విషయాన్ని ప్రధాని కార్యలయం తెలిపింది. మోడీ కూడా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని షరీఫ్ కు చెప్పారంట. అంతేకాదు దానికి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా అందించారట. అయితే పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి చేసిన ఘటనలో ఐఎస్ఐ, జైషే మహ్మద్ సంస్థల ప్రమేయం ఉందన్న కారణంతో.. ఆసంస్థల నేత అయిన మౌలానా మసూద్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు విద్యార్ధుల సమస్యలను పట్టించుకోండి.. కేటీఆర్

అమెరికా వెళ్లే తెలుగు విద్యార్ధులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ద్వారా కష్టాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. విచారణ పేరిట చాలా మంది విద్యార్దులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇప్పటికే వెనక్కి పంపించేశారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్సను కలిశారు.  ఈ సందర్భంగా కేటీఆర్ అమెరికా వెళ్లి చదవాలనకునే తెలుగు విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోవాలని మైఖేల్ ముల్లిన్సను కోరారు. చదువుకోసం హైదరాబాద్ నుండే ఎక్కువ మంది విద్యార్ధులు అమెరికా వెళుతున్నారని.. ఎంతో సమయం.. డబ్బు వెచ్చించి వెళుతున్న వారిని తిప్పి పంపడం సమంజసం కాదని తెలిపారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు కూడా లేఖ రాస్తామని.. ఇక్కడ వరకైతే ప్రభుత్వ పరంగా మేం చర్యలు తీసుకుంటా.. కాన్సులేట్ పరంగా మీరు చర్యలు తీసుకోండి అని సూచించారట. అంతేకాదు విద్యార్ధులకు నకిలా డాక్యుమెంట్లు ఇవ్వడం వల్లే నష్టపోతున్నారని ముల్లిన్సన్ కు చెప్పడం జరిగిందట. దీనికి ముల్లిన్సన్ సమస్య పరిష్కారానికి మేం కూడా ప్రయత్నిస్తున్నాం.. విద్యార్ధుల నకిలీ డాక్యుమెంట్లు వల్లే సమస్యలు వస్తున్నాయని.. తొందరలోనే సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారంట.

కంటతడి పెట్టిన బరాక్ ఒబామా..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని.. అనవసరంగా అమాయక పిల్లలు బలవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడేళ్ల క్రితం కనెక్టికట్ లో 20మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను ముష్కరులు తుపాకీ గుళ్లకు బలి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విషయం గుర్తు చేస్తూనే ఒబామా కన్నీరు పెట్టుకున్నారు. తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని.. చట్టాల్లో మార్పులు అవసరమని వ్యాఖ్యానించారు. గన్ లైసెన్స్ నియంత్రణ చట్టాలను లాబీ అడ్డుకుంటుంది.. తుపాకుల అమ్మకాల కట్టడికీ కాంగ్రెసు వ్యతిరేకతను పట్టించుకోకుండా కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

పంజాబ్ ఉగ్రదాడి.. మన వాళ్ల ప్రమేయం..?

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఉగ్రవాదులు దాడి జరపడానికి మన ఇంటి దొంగల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురుదాస్ పూర్ ఎస్పీ స్వీందర్ పై అనుమానాలు వ్యక్త చేస్తున్నారు పోలీసులు. ఎస్పీ స్వీందర్ కి జైషెహమ్మద్.. ఐఎస్ఐలతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ అతని మిత్రుడు, వంట మనిషిలను ఎన్ఐఏ విచారణ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఐఎస్ఐ అమ్మాయిలను ఎరగా వేసి ఎస్పీని లోబరుచుకున్నారా అన్న దిశగా కూడా విచారణ చేపట్టారు.

పపన్ కోసం టీడీపీ-బీజేపీ ప్రయత్నం..

హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల్లో వేడి మొదలైంది. గ్రేటర్ ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే పార్టీల జోరు పెంచాయి.. ఇప్పుడు షెడ్యూల్ కూడా విడుదలైన పిమ్మట.. కొత్త కొత్త పార్టీ వ్యూహాలతో ప్రజలలోకి వెళుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బాధ్యతను పూర్తిగా కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు. మరోవైపు మిత్రపక్షమైన బీజేపీ-టీడీపీ కూడా గతంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న మాదిరి.. ఈసారి కూడా ఆ ఫలితాలను రాబట్టుకునేందుకు టీడీపీ-బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి ఎన్నికల ప్రచారంలో ఇందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించాలని భావిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పార్టీల గెలుపులో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ అన్న విషయం కూడా అందరికి తెలిసిందే. దీంతో ఇప్పుడు  గ్రేటర్‌లోను పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేపిస్తే తమకు లాభిస్తుందని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఇక ఆయనను రంగంలోకి దించేందుకు గాను ఆయనతో మాట్లాడాలని.. ఆయనను కలవడానికి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఓకే చెబుతారో లేదో చూడాలి.

టీడీపీలోకి కాంగ్రెస్ నేత ఎం.మహిధర్ రెడ్డి

తెలంగాణలో టీడీపీ లో ఉన్న కొంతమంది నాయకులు అధికారపార్టీ టీఆర్ఎస్ లోకి చేరుతున్నారు. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం వేరు. ఇతర పార్టీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరడానికి సముఖత చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న భరోసా రాజకీయ-పరిపాలన అనుభవం నేపథ్యంలో పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ఎం.మహిధర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని సమాచారం.మహిధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే మహిదర్ రెడ్డి తమ పార్టీల్లోకి తీసుకురావాలని వైసీపీ.. టీడీపీలు రెండూ ప్రయత్నించగా మహిందర్ రెడ్డి మాత్రం టీడీపీలోకి రావడానికే సముఖత చూపినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగ తరువాత మహిధర్ టీడీపీలో చేరవచ్చని భావిస్తున్నారు. గతంలో ఎం.మహిధర్ రెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో పురపాలక శాఖా మంత్రిగా పనిచేశారు. 

మోడీ పై శివసేన కామెంట్స్.. కప్పు టీ తో ఏడుగురు భారత జవాన్లు మృతి

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో శివసేన ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్రమోడీ పై అలాంటి వ్యాఖ్యలే చేసింది. పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన గాను శివసేన తమ అధికార పత్రిక అయిన సామ్నాలో మోడీపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ నమ్మరాదని గతంలోనే మోడీని హెచ్చరించామని.. అయినా తమ మాటలను మోడీ లెక్కచేయలేదని.. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రపంచాన్ని ఏకం చేసే పనిని మానుకుని భారత్ పై దృష్టి పెట్టాలని ఘాటుగానే సూచించింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కప్పు టీ పంచుకున్నందుకు ప్రతిఫలంగా ఏడుగురు భారత జవాన్లు అమరులయ్యారని విచారం వ్యక్తం చేశారు. మరి శివసేన చేసిన వ్యాఖ్యలకు మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

తెలంగాణ అమరులపై ప్రజా తెలంగాణ..

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు గాను 36 మంది అమరులకు తెరాస ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించింది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా.. ఈ ఉద్యమంలో ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారని..  ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్లు ఉన్నారని వాళ్లకు కూడా మంచి ఫలితాలు వస్తే బావుటుందని "ప్రజా తెలంగాణ" అనే ప్రతిక ఆరోపిస్తుంది. దీని గురించి ప్రజా తెలంగాణ స్పందిస్తూ.. డిసెంబర్ 14 నుండి ఇప్పటి వరకు ప్రతి రోజూ జిల్లా కేంద్రాల్లో ‘ప్రజా తెలంగాణ’ ఆధ్వర్యంలో జరిగిన శిబిరాల్లో దాదాపు ఐదువేల మంది ఉద్యమంలో తమ పాత్రకు సంబంధించి ఆధారాలతో వచ్చారని..సామాన్య ప్రజలు, పలురకాల జేఏసీ సభ్యులు, టీ.ఆర్.ఎస్ సహా పలు పార్టీల క్రియాశీల సభ్యులూ, ఉద్యమ కారులూ, కుల సంఘాలు అందరూ ఇందులో ఉన్నారని తెలిపారు. ప్రజా తెలంగాణ దగ్గర 1254 మంది అమరుల బేసిక్ డేటా ఉందని.. ప్రభుత్వం ప్రతి ఒక్క అమరునికీ న్యాయ చేయాల్సిన బాధ్యత తమదేనని తెలిపింది. వాస్తవానికి.. ప్రభుత్వ లెక్కలకీ చాలా తేడాలున్నాయంటూ.. ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి న్యాయం జరగాలని.. ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదైన నేపథ్యంలో వారు కేసులు కొట్టివేయాలని కోరుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన డిమాండ్స్ కూడా తెలియజేశారు. డిమాండ్స్ * పన్నెండు వందల పైచిలుక అమరుల కుటుంబాలన ఆదుకోవాలి. అందరి చరిత్ర అధికారికంగా లిఖించాలి. అసెంబ్లీ సాక్షిగా అమరు ల కుటుంబాలకు యిచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. * ఉద్యోగాలు కోల్పోయి, చదువులు కోల్పోయి, నేడు ఏ ఆసరా లేని త్యాగధనులపై అన్ని కేసులూ ఎత్తివేయాలి. వీరు జీవితాల్లో స్థిర పడేందుకు గాను అన్ని చర్యలూ చేపట్టాలి. * ఇప్పటికే చాలా విలువైన సమయం కోల్పోయి ఉన్న యువతకు స్వాంతన నిచ్చేందుకు వీలుగా, పై డిమాండ్లను నెల రోజుల లోగా నెరవేర్చాలి.    

మహిళలపై నేరాలకు పాల్పడితే కాల్చేస్తా..

దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి గాను ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కాల్చిచంపేస్తానని.. లేదంటే ఉరితీసి చంపేస్తానని అన్నారు. కానీ రాజ్యాంగం అందుకు అనుమతించదు.. రాజ్యాంగం నింబంధనల ప్రకారమే నడుకుంటానని అన్నారు. అంతేకాదు పురుషులు మహిళలను చెడు దృష్టితోనే చూస్తున్నారని.. తల్లిగానో చెల్లిగానో చూడటం లేదని అందుకే చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్ద వయలు గల మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఉన్న మహిళల భద్రతకు తాము కృషిచేస్తామని అన్నారు.

టీడీపీ కార్యకర్త దారుణ హత్య..

కర్నూలు జిల్లాలో పాతకక్షలు మరోసారి బయటపడ్డాయి. దీంతో కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలం రామకృష్ణాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా తెలుగుదేశం కార్యకర్త వల్లూరి నగేష్‌(35)ను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. వివరాల ప్రకారం.. ప్రత్యర్థులు వల్లూరి నగేష్‌ కోసం కాపు కాసి అతను బయటకు రాగనే ముందుగా అతనిపై రాళ్లతో దాడి చేసి ఆతరువాత వేట కొడవళ్లతో నరికి చంపేశారు. అనంతరం దండగులు పారిపోయారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు నమోదు చేయగా.. పోలీసులు హత్యచేసి పారిపోయిన నిందితులకోసం గాలిస్తున్నారు. మృతుడు నగేష్ గతంలో జరిగిన ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడని.. ప్రతికారంతోనే ప్రత్యర్థులు అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.