ఆఫ్ఘానిస్తాన్ లో భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదుల దాడి
posted on Jan 4, 2016 7:11AM
ఈ కొత్త సంవత్సరంలో భారత్ లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మళ్ళీ నిన్న రెండవసారి దాడికి పాల్పడ్డారు. మొన్న జనవరి 1వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘానిస్తాన్ లో మజారీ షరీఫ్ నగరంలో ఉన్న భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. భద్రతాదళాలు వారి దాడిని తిప్పికొట్టాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.
సాధారణంగా ఉగ్రవాదులు మిలటరీ దుస్తులు ధరించి, కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటారు. లేదా బాంబులతో నింపిన వాహనంలో దూసుకువచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడుతుంటారు. కానీ ఈసారి మాత్రం పక్కనే ఉన్న మరో భవనంలోకి చొరబడి, దానిలో నుంచి కాల్పులు జరుపుతూ భారత కౌన్సిలేట్ భవనంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరినీ భద్రతాదళాలు వెంటనే కాల్చి చంపాయి. మిగిలిన ఇద్దరూ ఇంకా కాల్పులు జరుపుతున్నారు.
ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలియగానే కౌన్సిలేట్ భవనం లోపల ఉన్న దౌత్యాధికారులు, ఉద్యోగులు అందరినీ అదే భవనంలో ఒక సురక్షితమయిన ప్రాంతానికి తరలించారు. “భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదులు దాడులు చేసారు. అందరూ క్షేమంగా ఉన్నాము,” అని ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ జనరల్ బ్రజబాషి సర్కార్ ప్రకటించారు. ఉగ్రవాదుల దాడి సంగతి తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు అక్కడికి చేరుకొని ఉగ్రవాదులు దాకొన్న భవనాన్ని చుట్టు ముట్టాయి. ఆ భవనంలో దాకొన్న ఇద్దరు ఉగ్రవాదులకి భద్రతాదళాలకు మధ్య ఇంకా కాల్పులు జరుతున్నాయి. ఈ దాడికి పాల్పడినవారెవరో ఇంకా ప్రకటించుకోలేదు.
ప్రధాని నరేంద్ర మోడి కాబూల్, లాహోర్ పర్యటనల తరువాత మొదట పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై, మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడులు చేయడం గమనిస్తే, మోడీ ప్రారంభించిన శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించడానికే ఈ దాడులు జరుగుతున్నాయేమొన్నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.