నిధుల కేటాయింపులో పొరపాటు చేసిన ఏపీ సర్కార్..
posted on Jan 2, 2016 @ 2:24PM
ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. ఎప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేద్దామా అని ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా ఎదురుచూస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు అధికార పార్టీ చేసిన ఒక పొరపాటు వల్ల విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అదేంటంటే.. ఎమ్మెల్యేలకు కేటాయించ వలసిన నిధుల విషయంలో.. ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలకు కాకుండా టీడీపీ నేతలకు మంజూరు చేయడంతో.. వైకాపా ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయడం లేదని వైకాపా అధికారులు ఇప్పటికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు విడుదల చేసినా కానీ.. ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం పొరపాటు చేసింది. దీనికి వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. కానీ నిధులు విడుదల చేసింది మాత్రం.. టీడీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి పేరుతో.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కాగా టీడీపీ నేత శిల్పా చక్రపాణి ఎమ్మెల్యే పేరు మీద.. కర్నూలు జిల్లాలో ఏకంగా నాలుగు వైకాపా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిధులు టీడీపీ ఇన్‌చార్జ్‌ల పేరు మీద విడుదల చేశారు. తునిలోయనమల రామకృష్ణుడి సోదరుడి పేరు మీద నిధులు విడుదల చేశారు. దీంతో నిధుల విడుదలలో ఈ పక్షపాత వైఖరి ఏంటని వైకాపా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. మరి వైకాపా నేతలు చేసే విమర్శలకు అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.