గ్రేటర్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా టీఆర్ఎస్.. ఇన్‌చార్జ్ లకు ప్రచార కిట్
తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల సంగతేమో కాని టీఆర్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నగరంలో పెద్ద పెద్ద హోర్డింగులు పెడుతున్నారు. ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యుహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒక్కో డివిజన్ ఇన్‌చార్జీకి ప్రచార సామగ్రితో కూడిన కిట్‌ను అందజేస్తోందట అధికార పార్టీ. ఇంతకీ ఈ కిట్ లో ఏముందనుకుంటున్నారా.. ఈ కిట్‌లో డివిజన్ స్వరూపం, ఓట్లు, ఆ డివిజన్‌లో నెలకొన్న సమస్యలు, ఇప్పటి వరకు ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తామేం చేయబోతున్నారు.. ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. ఇక ఈ వివరాల ఆధారంగా నేతలు ప్రచారం రంగంలోకి దిగుతారన్నమాట. అంతేకాదు దీనివల్ల క్యాడర్‌లో నెలకొనే గందరగోళాన్ని కూడా సులభంగా ఎదుర్కొనే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి. మరి టీఆర్ఎస్ ఈ కిట్ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుద్దో చూడాలి.