కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించగలదు.. రాహుల్
posted on Feb 11, 2016 @ 1:55PM
కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించగలదు.. ఈ వ్యాఖ్యలు చేసింది ఏవరనుకుంటున్నారా..? ఇంకెవరూ మన రాజకీయ మేధావి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇప్పటికే పొలిటికల్ సెటైర్లు పడుతుంటాయి. ఆయన చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే రాహుల్ గాంధీపై సెటైర్లకు కొదువుండదు. ఇప్పుడు మళ్లీ తాజాగా అలాగే విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు రాహుల్. కేరళ పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సీపీఎం ఓడించలేదని.. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్‌ను ఓడించగలదని అన్నారు. అంతేకాదు బిహార్‌లో బీజేపీ ఏం చేయడానికి ప్రయత్నిస్తోందన్న విషయాన్ని పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్నామని, అందుకే నితీష్, లాలు, కాంగ్రెస్ పార్టీలను ఒకటిగా చేశామని చెప్పారు. బిహార్‌లో బీజేపీని చిత్తుగా ఓడించడంతో వాళ్లు ఎన్నికల ఫలితాలు చూసి దిగ్భ్రాంతి చెందారన్నారు. అయితే అంతా బానే ఉంది కానీ కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించడం ఏంటబ్బా అని.. రాహుల్ ఉద్దేశం ఏంటో అని అనుకుంటున్నారు.