లేచిన గుర్రం శక్తిమాన్.. ఎమ్మెల్యే గణేష్ జోషీ అరెస్ట్

  బీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా గణేష్ జోషీ అశ్వక దళానికి చెందిన శక్తిమాన్ అనే గుర్రంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శక్తిమాన్ బాగా గాయపడగా దాని కాలు విరిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ కాలును తొలగించి నడవడానికి వీలుగా ఉండే మరో ప్లాస్టిక్ కాలును పెట్టారు. అయితే ఇకనుండి అది పరిగెత్తలేదని.. నడవడం వరకే కుదురుతుందని వైద్యులు చెప్పారు. కాగా చికిత్స అనంతరం రెండు రోజులు లేవని శక్తిమాన్ ఈ రోజు లేచి నిల్చున్నట్టు తెలుస్తోంది.   మరోవైపు ఎమ్మెల్యే గణేష్ జోషీ మాత్రం తాను గుర్రంపై ఎలాంటి దాడి చేయలేదని చెబుతున్నా.. గుర్రంపై దాడి చేసి గాయపరిచిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషీని పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.

ప్రేమను నిరాకరించిందని... ఐదుగురిపై యాసిడ్ దాడి

పంజాబ్ రాష్ట్రంలో ఓ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమకు నిరాకరించిందని.. ఓ బాలుడు తను ప్రేమించిన అమ్మాయితో పాటు తన స్నేహితురాళ్లపైన కూడా యాసిడ్ దాడి చేశాడు. వివరాల ప్రకారం..  పంజాబ్ దేశంలో గురుదాస్ పూర్ పట్టణంలోని డేరా బాబా నానక్ ప్రాంతంలో ఓ బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే తను అదే పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాడు. కానీ బాలిక మాత్రం తన ప్రేమను నిరాకరించిది. దీంతో ఆ బాలుడు పాఠశాల నుండి సాయంత్రం ఆ బాలికలు ఇళ్లకు బయలుదేరి వెళ్లే సమయంలో తన స్నేహితుడి బైక్ పై ఫాలో అయి ఆ బాలికతో పాటు పక్కన ఉన్న ఆమె స్నేహితురాళ్లపైన కూడా యాసిడ్ పోసి  పారిపోయాడు. యాసిడ్ దాడికి బాలికలు బాధతో పెద్దగా అరవగా.. ఇరుగుపొరుగున ఉన్న వారు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈదాడిలో బాలిక పరిస్థితి మాత్రం విషమంగా ఉందనే వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారికి స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. 

రోజా అసెంబ్లీ ఎంట్రీపై ఉత్కంఠ

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రోజా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే రోజాను సమావేశాలకు రాకుండా అడ్డుకోవాలని స్పీకర్ కార్యలయం నుండి మార్షల్స్ కు ఆర్డర్స్ రావడంతో రోజాను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్, రోజా, వైసీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ తో వాగ్వాదానికి దిగగా.. స్పీకర్ కార్యాలయం నుండి అనుమతి తీసుకుంటేనే అసెంబ్లీలోకి అనుమతిస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పును ఎలా ఉల్లంఘిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైసీపీ నేతలు అక్కడే బైఠాయించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

నాక్కొంచం టైమ్ కావాలి.. ఈడీకి మాల్యా లెటర్

బ్యాంకుల నుండి తొమ్మిది వేల కోట్లు రూపాయలు తీసుకున్న బ్యాంకులకు టోకరా వేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో విచారణకు మార్చి 18 వరకూ తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.. మరోవైపు ఇప్పటికే బ్యాంకులు విజయ్ మాల్యా ఆస్తులపై వేలం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా మొదటిసారి స్పందించారు.  దీనిలో భాగంగానే విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కావాలని..  ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున తనకు ఏప్రిల్ వరకు గడువు కావాలని కోరుతూ లేఖ రాసినట్టు సమాచారం. మరి ఇంత సడెన్ మాల్యా ఎందుకు గడువు కోరారు.. ఈ లోపు ఏం చేస్తాడో చూడాలి.

రేపటినుండి అసెంబ్లీకి వెళతా.. మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి..

  ఎమ్మెల్యే రోజా హైకోర్టు ఇచ్చిన కాపీతో అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతా.. సస్పెన్షన్ నా హక్కులకు భంగమని హైకోర్టును ఆశ్రయించా హైకోర్టు నాకు న్యాయం చేసింది.. దీంతో న్యాయవ్యవస్థపై నాకు ఇంకా గౌరవం పెరిగింది అని అన్నారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పునే వక్రీకరించి మాట్లాడటం సరికాదు..వాళ్లు మళ్లీ కోర్టుకు వెళతానంటే వారి ఇష్టం.. కోర్టుకు విషయం అంతా తెలుసు కాబట్టి నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.. ప్రభుత్వం అప్పీల్ చేసినా న్యాయం కోసం పోరడతా అని వ్యాఖ్యానించార. రేపటినుండి అసెంబ్లీకి వెళతాను ఇప్పటి దాకా నా ప్రశ్నలను కూడా వినలేదు.. జీరో అవర్లో నైనా అవకాశం ఇస్తే మాట్లాడుతా.. నా నియోజక వర్గ ప్రజల సమస్యలను తెలిపే బాధ్యత నాపై ఉంది అని ఆమె వెల్లడించారు.

ఇండియాలో సంతోషం తగ్గిపోతోంది!

  ఈ మాట వాళ్లూ వీళ్లూ అంటున్నది కాదు. సాక్షాత్తూ అంతర్జాతీయ నివేదిక చెబుతున్న మాట. ‘హ్యాపీనెస్ రిపోర్ట్’ పేరట ఐక్యరాజ్య సమితి కోసం రూపొందించే ఈ నివేదికలో మన దేశం 118వ స్థానంలో ఉంది. మొత్తం 156 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క మొదటి స్థానంలో నిలవగా, దాని వెనుకే స్విట్జర్‌లాండ్ నిలిచింది. ఇక ఐస్‌లాండ్‌, నార్వే, ఫిన్‌లాండ్‌ తదుపరి స్థానాలు చేజిక్కించుకున్నాయి. మన దేశం మాత్రం పోయిన ఏడాది కంటే ఒక మెట్టు కిందకి దిగి 118వ స్థానంతో సరిపెట్టుకుంది. తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, సామాజిక బంధాలు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నివేదికను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ విషయాలను కనుక పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో సంతోషం నానాటికీ తగ్గిపోతోందని, నివేదికలో ఆందోళనను వెలిబుచ్చారు. ఈ సంతోష సూచీ ప్రకారం చైనా (83), పాకిస్తాన్ (92), బంగ్లాదేశ్‌ (110) వంటి పొరుగుదేశాలు కూడా మనకంటే ముందుండటం గమనార్హం! కాకపోతే ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌ (154), సిరియా (156) వంటి దేశాలు మనకంటే దిగువనుండటం... సగటు భారతీయుడి మనసుకి తృప్తి కలిగించే అంశం!

ధోనికి మరో సమస్య.. ఐదేళ్లుగా పన్ను చెల్లించలేదు..రాంచీ డీటీఓ

కెప్టెన్ ధోనికి మరో సమస్య ఎదురైంది. తన కారుకు ధోని ఐదేళ్లుగా పన్ను కట్టడంలేదని రాంచీ డీటీఓ తెలిపారు. అసలు సంగతేంటంటే.. ధోని హమ్మర్ వాహనం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది అంతర్జాతీయ బ్రాండ్. అయితే ఆ విషయం టైపిస్ట్‌కు తెలియకపోవడంతో ధోని హమ్మర్ కారు పేరును పొరపాటున స్కార్పియో వాహనంగా రవాణా శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేశాడని.. దీనివల్ల ధోని హమ్మర్ వాహనం వివరాలు తమ వద్దని లేవని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ధోని కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే పన్ను చెల్లించారని.. గత ఐదేళ్లుగా పన్ను చెల్లిచండం లేదని.. కాబట్టి ఇప్పుడు జరిమానాతో సహా ఒకేసారి దోని పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

వేలంలో విజయ్ మాల్యా ఇల్లు.. పాపం ముందుకు రాని బిల్డర్లు

  కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా ఇంటిని ఏస్ బీఐ బ్యాంకు వేలానికి వేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని అంధేరీలో ఉన్న మాల్యాకు చెందిన 2401.70 చదరపు మీటర్లలో ఉన్న ఇల్లును రూ 150 కోట్లకు ధరను నిర్ణయించి వేలం నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొనేవాళ్లు రూ.5 లక్షలు చెల్లించి, రూ.15 లక్షలు డిపాజిట్ చేయాలనే నిబంధన విధించింది అయితే పాపం విజయ్ మాల్యా ఇంటిని కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ఈ ఇల్లు ఒక్కటే కాదు ఇంకా గోవాలో మాల్యాకు చెందిన రూ.90 కోట్ల విల్లాలను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకోనున్నారు. మరి ఈ ఆస్తులను కొనడానికి మాత్రం ఎవరొస్తారో చూద్దాం.

అసెంబ్లీలో రోజా.. మరోవైపు ఏపీ సర్కార్ ప్లాన్

  వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా రోజా కోర్టు ఆర్డర్ కాపీతో అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్సి సత్యనారాయణను కలిసి కోర్టు కాపీని ఆయనకు అందజేశారు. అనంతరం వైసీపీ సభ్యులతో భేటీ ఆయ్యారు.   మరోవైపు రోజా సస్పెన్షన్ పిటషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఏపీ ప్రభుత్వం దీనిపై కోర్టుకు అప్పీల్ చేయనుంది. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కోర్టునే ఆశ్రయిస్తున్న నేపథ్యంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోజా తనను దూషించారని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 21వ తేదీన సమావేశం కానుంది. మొత్తానికి ప్రభుత్వం రోజా అసెంబ్లీకి రాకుండా ఉండటానికి బానే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

సిగ్గుపడు... పోలీసుల మీద ఓ మహిళా ఎమ్మెల్యే తిట్ట దండకం!

  అధికారులని నోటికి వచ్చినట్లు తిట్టడం ఇప్పుటి ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లక్ష్మీ గౌతం అనే మహిళా ఎమ్మెల్యే కూడా ఈ జాబితాలోకి చేరిపోయారు. ఆ రాష్ట్రానికి చెందిన సంబల్ అనే ప్రాంతంలో ఓ యువతి, తాను పది రోజులుగా పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పని జరగడం లేదని లక్ష్మీ గౌతంకు ఫిర్యాదు చేశారు. అంతే సదరు ఎమ్మెల్యే అనుచరగణాన్ని వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. డ్యూటీలో ఉన్న పోలీస్‌ అధికారిని పట్టుకుని చెడామడా వాయించేశారు.  ‘జనాలను పట్టించుకోకపోతే వాళ్లు మీ దగ్గరకు ఎలా వస్తారు’ అంటూ మొదలుపెట్టిన ఎమ్మెల్యే, పోలీసు మెత్తగా కనిపించడంతో చెలరేగిపోయారు, ‘యూనిఫాం వేసుకున్నందుకు కొంచెమన్నా సిగ్గుపడమనీ, వచ్చే బాధితులలో మీ అమ్మ ఉంటే ఇలాగే ప్రవర్తిస్తావా’ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం చేయడంతో, లక్ష్మీ గౌతం తన ప్రవర్తనను సమర్థించుకున్నారు. వచ్చినవారితో సరిగ్గా ప్రవర్తించమంటూ సదరు పోలీస్‌ అధికారికి తాను బుద్ధి చెప్పానని పేర్కొన్నారు.

బీజేపీలోకి తమిళ నటుడు విజయ్‌ కుమార్‌.. విశాల్ ను కూడా..!

  త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పుడే పార్టీలన్నీ తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో పార్టీలు సినిమా తారలను తమ పార్టీల్లోకి చేర్చుకోవడానికి ఆసక్తిచూపిస్తున్నాయి. తాజాగా సీనియర్‌ తమిళ నటుడు విజయ్‌ కుమార్‌ బీజేపీ చేరారు. కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి రాలేదని.. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని.. తమిళనాడులో బిజెపి ప్రభుత్వం రావాలనే ఆకాంక్షతోనే పార్టీలో చేరినట్లు చెప్పారు. మరోవైపు  నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌ను కూడా తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ నేతలు యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

దారుణం.. కిడ్నాప్ అయిన కొడుకు.. అట్టపెట్టెలో శవంగా..

  సికింద్రాబాద్లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ అయిన ఓ ప్రముఖ వ్యాపారి కొడుకు అట్టపెట్టలో శవమై కనిపించాడు. వివరాల ప్రకారం.. షాహీనాయత్ గంజ్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి రాజ్ కుమార్ కుమారుడు అభయ్ పదోతరగతి చదువుతున్నాడు. అయితే అభయ్ నిన్న మధ్యాహ్నం నుండి కనిపించకపోవండతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆభయ తండ్రికి ఫోన్ చేసి రూ.10కోట్లు ఇవ్వాలని లేకపోతే అభయ్‌ను చంపేస్తామని ఫోన్‌లో బెదిరించారు. అయితే అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపులోనే  ఘోరం జరిగిపోయింది. అభయ్ ను చంపేసి.. అట్టపెట్టెలో శవాన్ని పెట్టి దాన్ని  సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌లో వదిలివెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురై కన్నీరు పర్యంతమవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అసదుద్దీన్‌ నాలుక కోస్తే కోటిరూపాయలిస్తా.... బీజేపీ నేత ప్రకటన

  తాను భారత్‌ మాతాకీ జై అనను అంటూ మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటికి నిన్న దిల్లీలోని ఆయన అధికార నివాసం బయట ‘దేశద్రోహి’ అంటూ హిందూసేన అనే సంస్థ పోస్టర్లను అంటించింది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్యాం ప్రసాద్‌ ద్వివేదీ అనే భాజపా నేత అసదుద్దీన్‌ పై మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసదుద్దీన్‌ నాలుకని తెగ్గోస్తే, కోటి రూపాయల బహుమతి అంటూ ప్రకటించారు ద్వివేదీ. మరోవైపు అసదుద్దీన్ వ్యాఖ్యలకు మద్దతు పలికినందుకు, మహారాష్ట్ర అసెంబ్లీలో వారిస్ పఠాన్‌ అనే ఎమ్మెల్యేను బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరించారు. అసదుద్దీన్‌ మాత్రం ఈ పరిణామాల పట్ల మండిపడుతున్నారు. నినాదం చేయనందుకు సభ నుంచి బహిష్కరించమని రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా అని ప్రశ్నస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే అసదుద్దీన్‌ వ్యాఖ్యలు మరో జాతీయస్థాయి చర్చకు దారితీసేట్లే కనిపిస్తున్నాయి.

మాజీ ఎంపీ కన్నుమూత.. కేసీఆర్ సంతాపం..

  మాజీ ఎంపీ రుమాండ్ల రాంచంద్రయ్య కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనకు హైదరాబాద్లోని మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. ఆయన మృతిచెందారు. అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాంచంద్రయ్య.. 1997 నుంచి 2003 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 2003 తర్వాత రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షునిగాను, అనంతరం ఆప్కో సెల్ చైర్మన్‌గాను పనిచేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2013 మే 25న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

ఎంఐఎం ఎమ్మెల్యే సస్పెన్షపై అసదుద్దీన్ ఫైర్.. రాజ్యాంగంలో ఉందా..?

నా పీక మీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అని వ్యాఖ్యానించి ప్రస్తుతం దేశంలో కొత్త వివాదానికి తెరలేపిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఒక అంశంపై నినాదాలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ అని అంటున్నారు. తాను చేసిన వ్యాఖ్యలవల్ల ఇప్పటికే పెద్ద దుమారం రేగుతోంది. ఈనేపథ్యంలోనే మహారాష్ట ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసినందకు అతనిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన అసదుద్దీన్.. ఒక నినాదం చేయనందుకు సభ్యుడిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దేశ చరిత్రలో మొదటిసారని.. ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ వారికి ఉంటుంది.. ఒక నినాదం చేసినంత మాత్రాన అది చట్టాన్ని ఉల్లఘించినట్టా. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రధాని చెప్పినప్పుడు.. ఎన్నికైన సభ్యుడు ఇలాంటి నినాదాలు చేయాలని రాజ్యాంగంలో ఉందా.. లేకపోతే నినాదాలు చేయకపోతే సస్పెండ్ చేయాలని ఉందా అని ప్రశ్నించారు. మరి ఈ దుమారం ఎంత వరకూ పోతుందో చూడాలి.

నాకు పవన్, దేవుడు అంటే ఇష్టం.. కానీ.. వర్మ

  రాంగోపాల్ వర్మ తనకు ఎప్పుడు ఏం మాట్లాడాలనిపిస్తుందో.. అప్పుడు అది మాట్లాడేస్తుంటాడు. ట్విట్టర్ అనే ఆయుధంతో తన అభిప్రాయాలన్నీ కుండబద్దలు కొట్టినట్టు చెబుతూ అందరికి షాకిస్తుంటాడు. తాజాగా మరో ఝలక్ ఇచ్చాడు వర్మ.. ఎప్పుడూ తనకు దేవుడు అంటే ఇష్టం లేదని.. దేవుడిని తిడుతూ ఉంటే వర్మ.. ఒక్కసారిగా ఏమైందో ఏమో.. తనకు దేవుడంటే ఇష్టమంటూ ట్వీటాడు.. అంతేకాదు.. దేవుడితో పాటు పవన్ కూడా లాగాడు.. ఐ లవ్ పవన్‌కళ్యాణ్ అండ్ గాడ్ అంటూ ట్విట్టర్ లో కామెంట్‌ను పోస్ట్ చేశాడు. వన్, దేవుడు ఇద్దరూ తనకు ఇష్టమని..వీరిద్దని చాలా కారణాల వల్ల ఇష్టపడతానని అన్నారు. అక్కడితో ఆగకుండా అవే కారణాల వల్ల భక్తులన్నా, పవన్ అభిమానులన్నా తనకు ద్వేషమని చివర్లో షాకిచ్చాడు. మొత్తానికి వర్మ ఎంతైనా కొంచెం ఢిపరెంట్ అని మరోసారి రుజువు చేశాడు.  

అయ్యో సోనియా మాటజారారా..?

అప్పుడప్పుడు మాట జారడం అనేది మానవ సహజం. అయితే కాస్త పెద్ద స్థాయిలో ఉన్నవారు.. నలుగురిలో కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు.. మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. అందునా మీడియా ముందు అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. అలా జాగ్రత్త పడకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇలానే మాటజారి అందరూ విస్తుపోయేలా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ..తమ పాపానికి కాస్తయిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చూస్తుంది. తమ లాభం కోసమో.. రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమో తెలియదు కానీ ప్రత్యేక హోదా కోసం బానే పోరాడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కాంగ్రెస్ పార్టీనేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే సోనియా రెండేండ్లుగా అధికారంలోనున్న యూపీఏ ప్రభుత్వం ఏమి చేస్తున్నదంటూ నోరు జారారు. అంతే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. మరి ఎంతటివారైనా మాట్లాడేముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బెటర్..

రోజాకు ఊరట.. సస్పెన్షన్ తీర్మానం ఎత్తివేత

రోజాకు హైకోర్టులో ఊరట లభించింది.. రోజాపై సస్పెన్షన్ తీర్మానాన్ని హైకోర్టు ఎత్తివేసింది. తదుపరి విరాచరణను నాలుగు వారాల తరువాత వాయిదా వేసింది. కాగా కాగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ రోజాను ఏడాది పాటు రోజాను సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయం నాది కాదు నా నియోజకవర్గ ప్రజలది.. అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. దీంతో న్యాయస్థానంపై గౌరవం మరింత రెట్టింపయింది.. తప్పు చేయనంత వరకు తప్పించుకు తిరిగే అవసరం లేదు.. పార్టీ ఏదైనా ప్రజల సమస్యలపై పోరాడతా.. ఆర్డర్ కాపీ అందగానే అసెంబ్లీకి వెళతా అని అన్నారు.