వీరజవాన్ తల్లికి అమ్మగా మారిన మంత్రి సవిత

వీర జవాన్ మురళి నాయక్ తల్లికి మంత్రి సవిత అమ్మగా మారారు. కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆమెకు దగ్గరుండి అన్నం తినిపించారు. పాక్ దాడులలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్  వీరమరణం చెందిన సంగతి తెలిసిందే. ఎదిగి వచ్చిన కుమారుడిని కోల్పోయిన ఆయన తల్లిదండ్రులు గత మూడు రోజులుగా శోక సంద్రంలో మునిగిపోయారు.   అన్నం నీళ్లు మానేసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి సవిత.. వారి పరిస్థితి చూసి చలించి పోయారు. భరత మాత కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామన్న ధైర్యం చెప్పారు. మురళీనాయక్ తల్లి పక్కనే కూర్చుని ఆమెను ఓదారుస్తూ స్వయంగా అన్నం తినిపించారు.  మురళీనాయక్ తల్లికి మంత్రి సవిత స్వయంగా అన్నం తినిపిస్తూ ఓదారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

షష్ఠ షణ్ముఖ ఆలయాల్లో జనసేన పూజలు.. ఎందుకో తెలుసా?

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పిన మన దేశ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని  ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ షష్ఠ  షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని నిర్ణయించారు. దీంతో ఆయన ఆదేశం మేరకు  జనసేన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు షష్ఠ షణ్ముఖ క్షేత్రాలలలో మంగళవారం (మే 13) పూజలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని షష్ఠ షన్ముఖ ఆలయాలలో ఈ పూజలు జరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఈ పూజలలో పాల్గొన్నారు. తమిళనాడులోని ఆరు మురుగన్ ఆలయాలు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లలోని రెండేసి సుబ్రహ్మణ్య క్షేత్రాలు, అలాగే విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పురూహుతిక ఆలయాలలో జనసేన ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి.  ఇటీవల ఆలయాల యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ఈ షష్ఠ షణ్ముఖ ఆలయాలను సందర్శించిన సంగతి తెలిసిందే. 

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు మృతి

ఆపరేషన్ కగార్ లో భాగంగా గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా ఇప్పటి వరకూ 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న కూబింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇంత వరకూ 35 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ వివరాలను బీజాపూర్ ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మరణించిన నక్సలైట్లలో 20 మందిని గుర్తించినట్లు తెలిపిన ఆయన ఆ గుర్తించిన వారి భౌతిక కాయాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్ల చెప్పారు. మరో 15 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. కాగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ లో 28 వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు వివరించారు.  ఇలా ఉండగా పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత ఉత్పన్నమైన పరిణామాలతో కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేసి భద్రతా దళాలను దేశ సరిహద్దులకు తరలించేసిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్ గఢ్ లో మాత్రం ఆపరేషన్ కగార్ యథాతథంగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా శివారులోని అటవీ ప్రాంతంలోనూ, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని బామ్రాగఢ్ అడవుల్లోనూ ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం 30 మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం.  అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మోదీ ప్రసంగం తర్వాత పాక్ డ్రోన్ దాడులు.. డీజీఎంవోల చర్చల్లో తప్పు జరిగిందంటూ క్షమాపణలు

కుక్కతోక వంకర, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు.. పాకిస్థాన్ తీరును, వైఖరిని చెప్పడానికి ఇలాంటి ఎన్నో సామెతలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. ఉగ్రవాదులను భారత్ లో హింసాత్మక దాడులకు ప్రోత్సహిస్తూ అదే తన బలం అనుకుంటున్న పాకిస్థాన్ కు భారత్ ఆపరేషన్ సిందూర్ తో గట్టిగా బుద్ధి చెప్పింది. కాదు కాదు బుద్ధి చెప్పానని భావించింది. భారత్ దాడులకు బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా సోమవారం (మే 12) జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. అంతే కాదు.. పాకిస్థాన్ విషయంలో ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలు వినా మరే విషయంలోనూ చర్చలకు తావు లేదని కుండబద్దలు కొట్టేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే,  భారత్ పై దాడులకు ఉగ్రవాదులను ప్రోత్సహించడం, ప్రేరేపించడం మానుకోకుంటే.. ఆ దేశాన్ని అంతం చేస్తామన్న విస్పష్ట హెచ్చరిక సైతం చేశారు. అయినా పాక్ బుద్ధి మారలేదు. తీరు మారలేదు. అటు జాతి నుద్దేశించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ఇలా ముగిసిందో లేదో.. అటు పాక్ భారత భూభాగంపైకి డ్రోన్ దాడులకు తెగబడింది. సోమవారం (మే 12) రాత్రి జమ్మూ సెక్టార్ లోని సాంబాలో పాక్ పలు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే పంజాబ్ లోని జలంధర్ పైనా డ్రోన్ దాడులకు తెగించింది. వీటన్నిటినీ భారత్ నేలమట్టం చేసింది. ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లలో సోమవారం రాత్రి మళ్లీ బ్లాక్ అవుట్ ప్రకటించారు. పాక్ నుంచి డ్రోన్ దాడులు నిలిచిపోవడంతో  అర్ధరాత్రి దాటిన తరువాత బ్లాక్ అవుట్ ఎత్తివేశారు.  ఇలా ఉండగా పాకిస్థాన్, భారత్ మధ్య కాల్పులు ఉండరాదనీ ఇరు దేశాల డీజీఎంవోల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చలు సోమవారం (మే12) సాయంత్రం ఆరంభమై రాత్రికి ముగిశాయి.  కాల్పుల విరమణ కొనసాగేలా చర్యలు చేపట్టాలని, దూకుడు, శత్రుత్వం పెరిగేలా దుందుడుకు చర్యలు ఉండరాదని ఈ చర్చల్లో ఒక నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని ఇండియన్ ఆర్మీ తన అఫీషియల్ ట్విట్టర్ లో పోస్టు చేసింది.  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇకపై ఉల్లంఘించబోమని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయబోమని పేర్కొంది. ఇక నుంచీ పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ ఉండవని పాకిస్థాన్ డీజీఎంవో పేర్కొన్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఆపరేషన్ సిందూర్ అనంతరం కుదిరిన కాల్పుల విరమణను తాము ఉల్లంఘించినట్లు పాక్ ఆర్మీ అంగీకరించడమే కాకుండా, ఆ తప్పు మరోసారి జరగదని పేర్కొంది.  ఇక చర్చల సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ పూర్తిగా డిఫెన్స్ మోడ్ లో ఉందనీ, భారత్ షరతులకు పూర్తిగా అంగీకరించిందనీ, గతంలో తప్పులు పునరావృతం కావనీ కాల్పుల విరమణ కొనసాగిద్దామనీ ప్రాధేయపడిందనీ భారత ఆర్మీవర్గాలు  తెలిపాయి. 

కాల్పుల విరమణ కాదు.. విరామం మాత్రమే.. ప్రధాని మోడీ

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలపై ప్రధాని మోడీ జాతి నుద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రస్ధావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసిన అనంతరం పాక్ ప్రతీకార దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా తాను మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపేశానంటూ తన భుజాలు తానే చరుచుకుని తనను తానే అభినందించేసుకుంది. మరో వైపు హఠాత్తుగా, బేషరతుగా భారత్ పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అప్పటి వరకూ నమో జపంతో ఊగిపోయిన దేశంలో ఒక్కసారిగా మోడీపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే ముందు అఖిలపక్ష నేతలను విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందంటూ విమర్శలు గుప్పించాయి. అన్ని విధాలుగా పై చేయి సాధించి పాక్ పై ఒత్తడి తీసుకువచ్చి ఆ దేశ భూభాగంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అప్పగింత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం వంటి అంశాలను ప్రస్తావించకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి అమెరికా ఒత్తిడికి మోడీ తలొగ్గారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి తదననంతర పరిణామాలప ప్రధాని మోడీ తొలి సారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉద్వేగ భరితంగా, ఘన విజయం సాధించామంటూ ప్రధాని మోడీ ప్రసంగం సాగింది. దాయాది దేశంలోతలదాచుకుని అక్కడ నుంచి దేశం లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముష్కరుణను అణచివేశామని ఉద్ఘాటించారు.   ఆపరేషన్ సిందూర్ ఆగదనీ, కాల్పుల విరమణ తాత్కాలిక విరామం మాత్రమేనని విస్పష్టంగా చెప్పారు.   ఆప‌రేష‌న్ సిందూర్ అంటే.. కే దేశంలోని కోట్లాది మంది మ‌హిళ‌ల సిందూరానికి ప్ర‌తీక‌గా అభివర్ణించారు.   శౌర్య ప‌రాక్ర‌మాల‌ను ప్ర‌ద‌ర్శించిన భార‌త సైన్యానికి, స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌కు సెల్యూట్ చేశారు.   ఉగ్ర‌వాదాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌ని పునరుద్ఘాటించారు. ఇక పాకిస్థాన్ తో చర్చలు అంటూ వస్తున్న సూచనలు, వార్తలు, అమెరికా మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను ఆయన నిర్ద్వంద్వంగా కొట్టి పారేశారు. పాకిస్థాన్ తో చర్చు అంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనేనని కుండబద్దలు కొట్టేశారు. ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్న ప్రధాని మోడీ.. ఉగ్రవాదుల మూలాలను గుర్తించి ఏరివేస్తామని హెచ్చరించారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమన్న ఆయన.. కాల్పుల విరమణపై కూడా వివరణ ఇచ్చారు. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. అదే సమయంలో ఉగ్రవాదానికి ఈ భూమి మీద స్థానం లేదన్నారు. ఇక జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ పాకిస్థాన్ కు ఘాటు హెచ్చరిక పంపారు. తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే..పాకిస్థాన్ నే ఉనికిలో లేకుండా చేస్తామని మోడీ విస్పష్ట సందేశాన్ని దాయాది దేశానికి పంపారు.  ప‌హ‌ల్గాంలో  మ‌తం పేరు అడిగి మ‌రీ అమాయకుల ప్రాణాలు తీశార‌ని,  దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌న్నారు. కుటుంబ స‌భ్యుల ముందే.. అయి న వారిని పొట్ట‌న పెట్టుకున్నార‌ని.. ఇలాంటి వాటిని భార‌త దేశం ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌బోద‌న్నారు. గ‌త నాలుగు రోజులు గా భార‌త సైన్యం సంయ‌మ‌నంతో   వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు. ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేయాల్సిన పాకిస్థాన్‌.. ఎదురు మ‌న‌పై దాడులు చేసింద‌న్న మోడీ. భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌.. పాకిస్థాన్‌కు త‌గిన బుద్ధి చెప్పింద‌న్నారు.ఇండియన్ ఆర్మీ ధాటికి పాక్ తోకముడిచిందనీ, అచేత‌న స్థితికి చేరుకుంద‌నీ,  భార‌త్ చేస్తున్న దాడుల‌తో పాక్ కు దిమ్మ‌తిరిగి బోమ్మకనిపించిందనీ వ్యాఖ్యానించారు.  తాను ముందే చెప్పినట్లు ఉగ్రవాదులకు వారి ఊహకు అందని రీతిలో బుద్ధి చెప్పామన్నారు. అయితే మోడీ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగం తరువాత కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ ఎందుకు అంగీకరించిందన్న విషయంపై జనబాహుల్యంలో నెలకొన్న అనుమానాలు. సందేహాలు అలాగే ఉండిపోయాయి.  ఈ సందర్భంగా పాక్ కు గతంలో జరిగిన మూడు యుద్ధాలలో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, వాజ్ పేయిలు అగ్రరాజ్యం ఒత్తిడికి, ఆంక్షఁలకు లొంగకుండా నిర్భయంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే.. పీవోకే మీద అయితేనే జరుపుతాం : ప్రధాని మోదీ

  పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే.. అది ఉగ్రవాదం మీద, పీవోకే మీద అయితేనే జరుపుతామని  ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు దాడి చేస్తే మా పద్ధతిలో వారి మూలలను గుర్తించి సంహరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరు వేరుగా చూడం.. మా దృష్టిలో ఇద్దరు ఒక్కటే ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ప్ర‌యోగించిన డ్రోన్లు, మిస్సైళ్ల‌ను భార‌త్ క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ స‌రిహ‌ద్దులు దాట‌కుండానే కూల్చేసింది. భార‌త మిస్సైళ్లు పాక్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఛిన్నాభిన్నం చేసేశాయి. పాక్ గ‌ర్వంగా చెప్పుకునే మిస్సైళ్లు, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను భార‌త్ నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్ వైమానిక స్థావ‌రాలు, రాడార్ స్టేష‌న్ల‌లో భార‌త్ మిస్సైళ్లు విధ్వంసం సృష్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగ‌ర‌లేని స్థితిని భార‌త్ క‌ల్పించింది అని మోదీ పేర్కొన్నారు.  పాకిస్తాన్ మ‌ళ్లీ ఎలాంటి దుస్సాహ‌సానికి పాల్ప‌డ‌కుండా భార‌త్ బుద్ధి చెప్పింది. భార‌త్ ప్ర‌తిచ‌ర్య‌ల‌కు బెంబేలెత్తిన పాక్.. కాల్పుల విర‌మ‌ణ‌కు ప్ర‌పంచం మొత్తాన్ని వేడుకుంది. భార‌త త్రివిధ ద‌ళాలు స‌ర్వ‌స‌న్నద్ధంగా ఉన్నాయి. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆప‌రేష‌న్ సిందూర్.. ఉగ్ర‌వాదంపై భార‌త్ వైఖ‌రిని విస్ప‌ష్టంగా చెప్పాయి. ఉగ్ర‌వాదంపై భార‌త్ ష‌ర‌తులు మేర‌కే చ‌ర్చ‌లు ఉంటాయి. భార‌త్ నిర్ణ‌యాల‌కు అనుగుణంగానే చ‌ర్చ‌లు ఉంటాయని మోదీ స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చారించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు.

ఉగ్రవాదం అంతం చేయకుంటే పాకిస్ధాన్‌‌ను అంతం చేస్తాం..ప్రధాని మోదీ హెచ్చరిక

    భారత దళాల దాడితో పాకిస్ధాన్‌కు మూడు రోజుల్లోనే ముచ్చెమటలు పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. పాక్ భయాందోళనకు గురై మన డీజీఎంఓతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులు మా చెల్లెళ్ళ సిందూరాన్ని తుడిచారు.. అందుకే ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశామని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఒక్క దెబ్బతో ఖతం చేశామని వెల్లడించారు"ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచివేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో... అదే ఆపరేషన్ సిందూర్. గత నాలుగు రోజులుగా భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని చూస్తున్నాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో దాడులు చేశాయి.  బహావల్ పూర్, మురిడ్కే వంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా మనదేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సత్తా ఏంటనేది దేశం మొత్తానికి తెలిసింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం మొత్తం చూసింది. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికంగా నిలుస్తాయి" అని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు మాత్రమే కాదు.. దేశ ప్రజల భావనల ప్రతిబింబం అని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి ప్రతీక ఆయన అన్నారు.  ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు మ‌తం పేరు అడిగి మ‌రీ కుటుంబ స‌భ్యుల ముందు కాల్చిచంపారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో దేశ‌మంతా నివ్వెర‌పోయింది. ఉగ్ర‌వాద దాడుల‌పై ప్ర‌తి హృద‌యం జ్వ‌లించిపోయింది. పౌరులు, పార్టీలు అన్ని ఒక్క‌తాటిపైకి వ‌చ్చి ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డాయి అని మోదీ తెలిపారు.సైన్యం, సాహ‌సం, ప‌రాక్ర‌మాన్ని దేశం చూసింది. భార‌తీయ మ‌హిళ‌ల నుదుటిపై సిందూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆప‌రేష‌న్ సిందూర్.. ఆప‌రేష‌న్ సిందూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేద‌న. ఆప‌రేష‌న్ సిందూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్ర‌తిజ్ఞ‌. ఈ నెల ఏడో తేదీ తెల్ల‌వాజుమ‌న ఈ ప్ర‌తిజ్ఞ నెర‌వేర‌డం ప్ర‌పంచ‌మంతా చూసింది అని మోదీ పేర్కొన్నారు.పాకిస్ధాన్ తెగబడినా భారత్‌ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయిని ప్రధాని మోదీ హెచ్చరించారు.

భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపాను..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

  భారత్-పాక్ మధ్య అణుయుద్దాన్ని ఆపాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ యుద్దం జరిగి ఉంటే లక్షలాది ప్రజలు ప్రాణాలు పోయేవని తెలిపారు. కాల్పుల విరమణ కోసం రెండు దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఘర్షణలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పామని.. వారు గొడవలు ఆపేశారని  ట్రంప్ పేర్కొన్నారు. తన మాట విని భారత్, పాక్ సీజ్‌ఫైర్ అమలు చేశాయని పేర్కొన్నారు. ఇకపై ఆ దేశలతో వాణిజ్యాన్ని పెంచుతానన్నారు. నా పరిపాలన హయాంలో, అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాం అని ఆయన తెలిపారు.  ఆ సమయంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, ఇరు దేశాలు భీకరంగా పోరాడుకునే స్థితిలో ఉన్నాయని ట్రంప్ వివరించారు.ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాల నాయకత్వాల గురించి ప్రస్తావిస్తూ, "భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నాయకత్వాలు శక్తిమంతమైనవి, దృఢంగా నిలబడ్డాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని చల్లార్చడానికి వాణిజ్యాన్ని ఒక దౌత్య వ్యూహంగా ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఈ జోక్యం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న అణు సంఘర్షణను తాము ఆపగలిగామని ట్రంప్ ముగించారు.  

సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటెల ఘాటు వ్యాఖ్యలు ...కొట్లాడితే ధీరుడితో కొట్లాడుతా

  సీఎం రేవంత్‌రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్  ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ఒక సైకో.. ఎవరు చెప్పినా వినడు అంటూ ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు. కొట్లాడితే దీరుడితో కొట్లడతాం కానీ రండలతో ఏం కొట్లాడతామన్నారు. ముఖ్యమంత్రి కానప్పుడు తడిబట్టలపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశాడు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసు కోవాలని ఆయన అన్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి… ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గతంలో ధనిక రాష్ట్రమని చెప్పిన రైతులకు రూ.లక్ష కూడా రుణమాఫీ చేయలేకపోయారని ఆరోపించారు.  మాజీ సీఎం కేసీఆర్  విచ్చలవిడిగా అప్పులు చేసిన రైతుబంధు ఇచ్చారని ఈటల అన్నారు. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కష్టమని ఆనాడే చెప్పానని అన్నారు. ప్రజలకు అబద్ధాలే నచ్చుతాయని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. సరిగ్గా 16 నెలలు గడిచే సరికి సీఎం రేవంత్ చెప్పిన అబద్ధాలు అక్షరాల నిజం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో నిరుపేదల ఇళ్లను కూల్చేస్తున్నారని.. అదేంటని ప్రశ్నిస్తే ఇదే ముఖ్యమంత్రి ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్లతో తొక్కిస్తామని కామెంట్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రిపై ఈటల చేసిన కామెంట్స్‌పై యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పాకిస్తాన్‎ను దడ పుట్టిస్తున్న బలూచిస్తాన్

  పాకిస్తాన్‎ను గత కొన్ని రోజులుగా నిద్రపట్టినివ్వకుండా చేస్తున్న చిన్న దేశం అది. పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పటికీ.. తన పోరాటం మాత్రం వీడటం లేదు. బలూచిస్తాన్.. ప్రస్తుతం దీని పేరు వింటే పాక్ కు దడ పుడుతోంది. నిద్రలో ఉన్నా ఉలిక్కిపడే రోజులు పోయి అసలు నిద్రే పట్టకుండా పోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో 71 మందికి పైగా పాక్ సైన్యాన్ని పొట్టన పెట్టుకుంది.  భారత్‌‌, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ బీఎల్‌‌ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్‌‌లో పాక్‌‌ సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంది. పాక్ మిలటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా భీకరమైన దాడులు చేస్తోంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మిసైళ్ల వర్షంతో పాక్ కు ముచ్చెమటలు పిట్టించింది. పాక్ పై సమరానికి ఇదే సరైన సమయం అని భావించిన బీఎల్‌‌ఏ.. తనదైన శైలిలో దాడులకు పాల్పడుతూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బలూచిస్తాన్ సైనికులు. గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు.  బీఎల్‌‌ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం, మిలటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. ఈ నెల 3న గ్వాదర్‌‌‌‌లో పాక్ ఆర్మీ వెహికల్‌‌ను ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాక్ సైనికులు మరణించినట్టు బీఎల్‌‌ఏ అధికారికంగా తెలిపింది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోనూ పాక్ మిలటరీ కాన్వాయ్‌‌పై ఐఈడీ దాడి చేసింది. ఇందులో 12 మంది పాక్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఈ నెల 7న కెచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌‌పైనా ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో ఒక పాక్ సైనికుడు మరణించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ దాడులను తిప్పి కొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. బలూచిస్తాన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాక్ సైన్యాన్ని మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై బీఎల్‌‌ఏ దాడులు చేస్తూ, ఒక్కో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటోంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి.. ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్‌‌క్వార్టర్స్‌‌తో పాటు కీలకమైన చెక్‌‌ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్‌‌ఏ ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. అయితే, బలూచిస్తాన్‌‌లోని 39 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసినట్టు బీఎల్‌‌ఏ శనివారం ప్రకటించింది.  ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోస్టులు, హైవేలను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని బీఎల్‌‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ తెలిపారు.బలూచిస్తాన్ తన పోరాటాన్ని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో రైలును హైజాగ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో నిలిచింది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. క్వెట్టా నుంచి పెషావర్‌‌‌‌కు వెళ్తున్న జఫర్ ఎక్స్‌‌ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో బీఎల్‌‌ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే రైలులో ప్రయాణిస్తున్న 400 మంది ప్రయాణికులను చంపుతామని పాకిస్తాన్ ​ను హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను రక్షించింది. ఈ ఆపరేషన్‌‌లో 33 మంది బీఎల్‌‌ఏ తిరుగుబాటుదారులతోపాటు 21 మంది ప్రయాణికులు, నలుగురు పాక్ సైనికులు మరణించారు.   పాకిస్తాన్‌‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44శాతం ఒక్క బలూచిస్తాన్‌‌లోనే ఉండటంతో తమ హక్కుల కోసం తిరుగుబాటు ప్రారంభించారు బీఎల్ఏ సైన్యం. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజాలు, వనరులు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి బలూచిస్తాన్ గురవుతోంది. తమ వనరులను దోచుకుంటూ, తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి  ప్రారంభమైంది. అదికాస్తా తిరుగుబాటుగా మారి నేడు యుద్దంగా రూపాంతరం చెందింది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలాత్ ఖాన్ పాక్‌‌లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీనికి అంగీకరించని బలూచిస్తాన్ ప్రజలు.. అప్పటి నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు కొనసాగుతూనే వచ్చింది. అయితే పాక్ ను దెబ్బ తీయాలంటే సరైన టీం అవసరమని భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అయింది. అలా దశాబ్దాల కాలం నుంచి పోరాడుతూ తమ హక్కుల కోసం మన దాయాది దేశమైన పాకిస్తాన్ పై అంతర్యుద్దం చేస్తూనే ఉన్నారు.  

జగన్‌ హెలికాప్టర్‌ ఘటన కేసు...ముగిసిన తోపుదుర్తి విచారణ

  వైసీపీ అధినేత జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విచారణ ముగిసింది. పోలీసులు తోపుదుర్తికి 102 ప్రశ్నలు అడిగారని అన్నింటికీ సమాధానం ఇచ్చానని ఆయన తెలిపారు. విచారణ అనంతరం వెలుపలికి వచ్చి మీడియాపై తోపుదుర్తి అక్కసు వెళ్లబోసుకున్నారు. హెలిప్యాడ్ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమని, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాశ్​ రెడ్డి చెప్పారు. పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తమపై కేసులు పెట్టారని అన్నారు. హత్య కేసు విచారణ నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. ప్రకాశ్ రెడ్డిని విచారించామని అవసరమైతే మరోసారి పిలుస్తామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 70 మందిని నిందితులుగా చేర్చామని మిగతా వారిని కూడా విచారించాల్సి ఉందని, మరో నెల రోజుల్లో ఛార్జ్​షీట్ వేస్తామని సీఐ చెప్పారు. కాగా జగన్‌ పర్యటనలో హెలికాప్టర్‌ కేసులో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.జగన్‌ పర్యటనలో హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు.  జగన్‌ పర్యటన సందర్భంగా హెలికాప్టర్‌ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఆయన హెలికాప్టర్‌ దిగకముందే వైసీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ ఘటనలో కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. జగన్‌ భద్రతపై పోలీసులు చేసిన సూచనలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పాటించలేదు. హెలిప్యాడ్‌ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు.. భద్రతా వైఫల్యంగా చూపేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 

మౌనమేలనోయి.. మోడీది మౌనమా? వ్యూహమా?

గత మూడు వారాలుగా భారత్ పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రకటిత యుద్ధం జరుగుతోందా అన్నంతగా పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెల 22న కాశ్మీర్ లోని పహల్గాం లో ఉగ్రవాదులు 26 మంది పౌరలను అత్యంత దారుణంగా, కృరంగా ఖతం చేశారు. ఈ సంఘటనను 2008 ముంబై దాడుల అనంతరం సాధారణ పౌరుల మీద జరిగిన అత్యంత దారుణమైన దాడి అనడంలో సందేహం లేదు. ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ బీహార్ లోని ఒక సభలో మాట్లాడుతూ.. ఉగ్రదాడికి వారి ఊహలకు అందనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఆ తరువాత ఈ నెల 7 భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా వంద మందికి పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. అప్పటి నుంచీ రెండు దేశాల మధ్యా యుద్ధం కొనసాగుతోందా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ప్రతి నిత్యం రాత్రి వేళల్లో భారత భూభాగంపైకి పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడితే.. పాక్ దాడులను భారత ఆర్మీ సమర్ధంగా తిప్పి కొట్టింది. పాక్ లోని నిర్దేశిల లక్ష్యాలపై భారత్ దాడులు చేసింది. ఈ తరుణంలో హఠాత్తుగా ఉరుములేని పిడుగులా శనివారం ( మే10) సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఘనతగా చెప్పుకుంటూ తన జబ్బలు తానే చరిచేసుకున్నారు. భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కరెక్టే కానీ, ఇందులో మూడో దేశం ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కోరిక మేరకు మానవతా దృక్ఫథంతో తాము పాక్ వినతిని మన్నించామని చెప్పింది. అసలు కాల్పుల విరమణ ఒప్పందం గురించి వెల్లడి కాగానే అప్పటి వరకూ మోడీ జపం చేస్తున్న యావత్ దేశం ఒక్కసారిగా ఆయనై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది.  సరే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించింది. దీనిపై మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా అటువైపు నుంచి బుల్లెట్ వస్తే ఇటు నుంచి మిస్సైల్ తో బదులు చెప్పండని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే షెడ్యూల్ ప్రకారం సోమవారం (మే 12) ఇరు దేశాల సైన్యాధ్యక్షుల స్థాయి వర్చువల్ సమావేశంలో సంధికి స్పష్టమైన షరతులు విధించనున్నట్లు కూడా మోడీ మీడియా ముఖంగా ప్రకటించారు.   అయితే ఇంత జరిగినా, జరుగుతున్నా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించకపోవడం పట్ల పరిశీలకులు, రాజకీయనాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణం అలుముకున్న వేళ మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి వారిలో భరోసా నింపాల్సి ఉండగా అందుకు భిన్నంగా మోడీ మౌనముద్ర వహించడం ఏమిటన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.  

నర్సులు అందిస్తున్న సేవలను వెలకట్టలేము : డిప్యూటీ సీఎం ప‌వ‌న్

  వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలను వెలకట్టలేమని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం  ప్ర‌భుత్వ హాస్పిటల్ స్టాఫ్ న‌ర్సుల‌తో ఆయన సమావేశం అయ్యారు. ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని నర్సింగ్ అసిస్టెంట్‌లను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగుల‌కు స్వ‌స్థ‌త క‌లిగేలా వృత్తికి గౌర‌వాన్ని తీసుకువ‌స్తున్నార‌ని పవన్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవ‌లు అనన్య సామాన్యమని అన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న న‌ర్సుల సేవ‌ల‌ను ఎవ‌రూ మ‌రిచిపోర‌ని తెలిపారు.  మ‌హ‌మ్మారి క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా న‌ర్సులు చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయమ‌ని పేర్కొన్నారు. ఇక‌, ఇటీవ‌ల సింగ‌పూర్‌లో త‌న కుమారుడు మార్క్ శంక‌ర్ స్కూల్లో సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ త‌ర్వాత ఆసుప‌త్రిలో చేరాడ‌ని, అక్క‌డ న‌ర్సులు చేసిన సేవ‌లు చూసిన‌ప్పుడు మ‌రోసారి వారి క‌ష్టం గుర్తుకొచ్చింద‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా వారిని క‌లవ‌డం ఎంతో సంతోషన్ని ఇచ్చింద‌ని పవన్ అన్నారు. ఈ సంద‌ర్భంగా నర్సింగ్ అసిస్టెంట్‌‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని, వాటిని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

సొంత పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు...బీఆర్‌ఎస్ పార్టీలో బయటపడ్డ విభేదాలు

  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని ఆమె అన్నారు.  కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నేను ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా... ఇంకా నా సహనాన్ని పరీక్షించవద్దని కవిత అన్నారు. ఇటీవల మేడే రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  కామెంట్స్  రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు కారణం అయ్యాయి. ఈ రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సేనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు.  దీంతో కవిత తీరు సొంత బీఆర్‌ఎస్ పార్టీ పరిపాలన, అందులోను తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చెప్పేలా ఉందని కవిత వైఖరి చూస్తే త్వరలో కవిత నూతన పార్టీ పెట్టే ఆలోచన ఉందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె ప్రత్యేకంగా బీసీ వాదం ఎత్తుకుంది. దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. కేసీఆర్ తర్వాత నెక్ట్స్ కవిత అని ప్రజల్లో బలంగా వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా కవిత వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్త  కుంపటి పెడుతున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఏ సభకు వెళ్లిన సీఎం సీఎం అని అనుచరులు పదే పదే అంటున్నారు. దీంతో బీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది

జగన్ హయాంలో మద్యం పేరిట విషం!

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం పేరిట విషాన్ని విక్రయించారు. ఆ పనిని స్వయంగా అప్పటి జగన్ ప్రభుత్వమే చేసింది. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానం ప్రజారోగ్యాన్ని పీల్చి పిప్పి చేసింది. ఆ కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించి విక్రయించిన రకరకాల బ్రాండ్ల మద్యంలో ప్రాణాలకు హానికరమైన రసాయనాలు ఉన్నాయని అప్పట్లోనే నివేదికలు తేల్చి చెప్పాయి. ఆయా మద్యం బ్రాండ్లను కెమికల్ ల్యాబ్ లలో పరీక్షించి ఆయా బ్రాండల్లో హానికర కెమికల్స్ ఉన్నట్లు తేలినట్లు అప్పట్లోనే వార్తలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఆయా మద్యం బ్రాండ్ల తయారీదారులంతా వైసీపీ పెద్దలు, వారి సన్నిహితులేనని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అప్పటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఆ దర్యాప్తు ఇప్పుడు వేగవంతమైంది. పలు అరెస్టులు కూడా జరిగాయి. అది పక్కన పెడితే.. జగన్ హయాంలో అవలంబించి మద్యం విధానం ప్రజారోగ్యాన్ని గుల్ల చేసిందన్న ఆరోపణలు అక్షర సత్యాలన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ రుజువైంది.  జగన్ హయాంలో సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా మద్యం సేవించిన వా రి ఆరోగ్యం క్షీణించిందన్న ఆరోపణలపై అధ్యయనానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక బృందాన్ని నియమించింది. ఆ బృందం తన అధ్యయన నివేదికను తాజాగా వెల్లడించింది. జగన్ హయాంలో సరఫరా చేసిన మద్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమని ఆ నివేదిక పేర్కొంది. 2019, 2024 మధ్య కాలంలో మద్యం సేవించే వారిలో మూత్ర పిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులలో పెరుగుదల కనిపించిందని పేర్కొంది.  ఆ నివేదిక మేరకు మద్యం సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగాయి. 2014-2019 మధ్య కాలంలో మద్యం సంబధిత వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య 14, 026 కాగా  సంఖ్య 2019-24 మధ్య కాలంలో దాదాపు రెట్టింపైంది.  ఈ గణాంకాలు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందిన వారిది మాత్రమే. అలాగే కల్తీ మద్యం కారణంగా వ్యాధుల బారిన పడిన వారిలో 34 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల సంఖ్య అధికంగా ఉంది.  కాగా ఈ జేబ్రాండ్ లిక్కర్ కారణంగా పలువురు నరాలకు సంబంధించిన వ్యాధుల బారిన కూడా పడ్డారని నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. 

హస్తినలో పీవీ కాంస్య విగ్రహం

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు.. అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీ నరసింహరావు కాంస్య విగ్రహం త్వరలో హస్తినలో ఏర్పాటు కానుంది. జీవిత కాలం కాంగ్రస్ తోనే పయనించి, ఈ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఎదిగి.. దేశానికి ఎనలేని సేవలందించిన పీవీ నరసింహరావుకు ఎట్టకేలకు దేశ రాజధాని హస్తినలో ఒకింత చోటు, గుర్తింపు లభించనుంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఈ మహా మేధావి.. కాంగ్రెస్ పార్టీకే ప్రత్యేకమైన రాజకీయాలు, అంతర్గత విభేదాల కారణంగా ఆ పార్టీలో కనీస గౌరవానికి కూడా నోచుకోలేదు. చివరాఖరికి ఆయన మరణించినప్పుడు, ఆయన పార్ధివ దేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదు. చివరికి హస్తినలో అంత్యక్రియలు కూడా జగరలేదు. అక్కడ నుంచి హైదరాబాద్ కు ఆయన పార్ధివదేహాన్ని తరలించి.. అక్కడ అంత్యక్రియలు జరిపించారు. ఇందుకు ఆయన విధానాలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా విభేదించడమే కారణం. అంతెందుకు ప్రధానిగా దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన ఆయనకు ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇన్నేళ్లకు హస్తినలోని బీజేపీ ప్రభుత్వం ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.   పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని ఢిల్లీ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. పీవీ విగ్రహ ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్   ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్   ఆమోదం తెలిపింది. దీంతో అతి త్వరలోనే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇంకొంచం వెనక్కు వెడితే.. గత ఏడాది ఏప్రిల్ లో పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్   పీవీ విగ్రహాన్ని హస్తినలోని ఆంధ్రా భవన్ లేదా తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌ కు లేఖ రాసింది.    ఈ లేఖపై ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్  ఈ ఏడాది మార్చి 27న జరిగిన సమావేశంలో చర్చించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కు పంపింది. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో త్వరలో పీవీ కాంస్య విగ్రహం హస్తినలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్నది. .