ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కి బిగుస్తున్న ఉచ్చు?!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణఏం కేసులు మాజీ సీఎం జగన్ బ్యాచ్ కి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ నలుగురూ జగన్ కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం.  మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహరంలో ఈ నలుగురికీ తెలిసి కొన్ని విషయాలు జరిగాయనీ,  అందువల్లే నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. ఈ నలుగురినీ కలిపి విచారించిన తరువాతనే ఈ కేసులో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయని సీట్ చెబుతోంది.  ఈ నలుగురినీ కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ( మే 20) విచారణ జరగనుంది.  మరోవైపు రాజ్‌కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ విజయవాడ కోర్టులో మూడు రోజుల కిందట పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై  ఏసీబీ కోర్టు సోమవారం (మే 19) విచారణకు వచ్చింది. ఈ విచారణను కూడా ఏసీబీ కోర్టు మంగళవారం (మే 20)కి వాయిదా వేసింది. దీంతో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఏ33గా ఉన్న గోవిందప్పను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అలాగే లిక్కర్ కేసులో ఏ30 పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దిలీప్‌కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దిలీప్ ద్వారా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు మంగళవారం (మే 19) విచారించనుంది. అలాగే ఈ కేసులో ఏ 6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఏసీబీ కోర్టు మంగళవారమే.   విచారించనుంది.మొత్తం మీద  మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్  అడ్డంగా బుక్కైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణం అక్రమ కనెక్షన్ లేనా?

హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన విషాద ఘటన కలకలం రేపింది.  అగ్నిప్రమాద కారణాలపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. చూస్తున్నాయి.  షార్ట్ సర్క్యూట్, ఏసీ కంప్రెషర్ పేలుడు కారణాలుగా  అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినా, అక్రమ  విద్యుత్ కనెక్షన్ లు కూడా అగ్నిప్రామాదానికి ప్రధాన కారణంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఈ ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మామూలుగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగే అవకాశం ఉండదని విద్యుత్ శాఖ చెబుతోంది.  ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్‌ కారణంగానే ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అంటోంది. అదే సమయంలో  అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలోనూ విచారిస్తున్నట్లు విద్యుత్ శాఖ పేర్కొంది.  దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ చెబుతోంది. ఇంతకీ అక్రమ కనెక్షన్ల వ్యవహారం ఏమిటంటే..  నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్‌ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్‌ కనెక్షన్‌ తీసు కుంటున్నారు. ఈ కారణంగానే బాధిత కుటుంబం కరెంట్‌ మీటర్‌పై లోడ్‌ పడిందనీ, ఆ అధికలోడ్ కారణంగా తొలుత విద్యుత్ మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చెక్క షోకేస్ కు మంటలు వ్యాపించాయని అంటున్నారు.  అక్కడ నుంచి మంటలు ఏసీ కంప్రెషన్ కు తాకాయనీ, దీంతోనే ప్రమాద తీవ్రత అధికమైందన్న అనుమానాలను విద్యుత్ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.   అగ్నిమాపక సిబ్బంది కూడా ఓవర్‌ లోడ్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అంటున్నారు.  

పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి అధీనంలోని ప్రభుత్వ భూమి స్వాధీనం

జగన్ హయంలో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకత్వం ఆకాశమే హద్దన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  పెద్దిరడ్డి పెత్తనం ఇష్టారాజ్యంగా సాగింది. అడ్డూ అదుపూ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  భూ కబ్జాలకు పాల్పడ్డారు. అధికారం అండతో అదికారులను గుప్పిట పెట్టుకుని వింటారని ప్రభుత్వ భూమి... అటవీ భూమి.. ప్రైవేట్ భూములు అన్న తేడా లేకుండా పెద్దిరెడ్డి కబ్జాల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి.   గత ఎన్నికలలో  వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే పుంగనూరులో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తన కబ్జాల వ్యవహారం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకున్న వెంటనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం కేసులో కూడా పెద్ది రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.   అన్నమయ్య జిల్లా మదనపల్లి శివారులోని  బీకే పల్లి సర్వే నెంబర్ 552లో ప్రభుత్వ భూమి మొత్తం 10.05 ఎకరాల భూమిలో కొంత భాగం మాజీ సైనికుడికి కేటాయించారు.  ఈ భూమిలో పెద్దిరెడ్డి  1.35 ఎకరాలు   భూమి నుంచి కబ్జా చేశారు. 552-7 సర్వే నెంబర్ లో 3.40 ఎకరాలు, 552-8లో 0.50 ఎకరాల భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత మాజీ సైనికుడు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో బైపాస్ రోడ్డు, ఫ్లై ఓవర్ కు 18 సెంట్లు పోయింది. 552-7 ఆనుకుని ఉన్న 552-1 లోని 1.35 ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు. మదనపల్లి సర్వేయర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ఐ భరత్ రెడ్డి హద్దులు గీసి ఆక్రమణలు తొలగించి 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి గా తేల్చారు. ఆ భూమిని పెద్దిరెడ్డి అధీనం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

మద్యం కుంభకోణం గుట్టురట్టు? సిట్ కు ఆధారాలు అందించిన మద్యం కంపెనీల యాజమాన్యాలు

నిజం నిప్పులాంటిది. అధికారం ఉందికదాని దానిని గుప్పిట మూసి ఉంచుదామంటే కుదరదు. చేయి కాలిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ.. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కోట్లు దండుగున్న అవినీతి తిమింగళాల గుట్టు బయటపడుతోంది. అవును మద్యం కుంభకోణం గుట్టు రట్టౌతోంది. ఈ కుంభ కోణంలో నిప్పులాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా వాస్తవాలను నిర్భయంగా బయటపెడుతున్నారు బాధితులు. వాస్తవానికి ఈ కుంభకోణంలో బాధితులైన వారు లిక్కర్ కంపెనీల యజమానులు. ముడుపులు ఇచ్చి ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందు తాము ఇచ్చిన ముడుపులు, వాటిని తీసుకున్న వారి వివరాలను బయటపెడుతున్నారు.   తాజాగా ఆర్థోస్ అనే కంపెనీ యజమాన్యం దర్యాప్తు అధికారులకు విస్తుపోయే వాస్తవాలను వివరించారు. తుపాకీని తమ కణతకు గురిపెట్టి మరీ దోపిడీ చేశారని వివరించింది. అలా తమ ప్రాణాలు తీస్తామని బెదిరించింది మరెవరో కాదు.. వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి అని దర్యాప్తు అధికారులకు తెలిపింది.  ఖజురహో అనే బ్రాండ్ మద్యాన్నిసరఫరా చేయడానికి తమకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. అందుకోసం ముడుపులు తీసుకున్నారని వివరించింది.  వాస్తవానికి జగన్ హయాంలో లిక్కర్ కంపెనీలను చాలా వరకూ వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తిని గుప్పిట్లో పెట్టుకున్నారు. కొన్ని కంపెనీల్లో కేసు బాటిల్స్ కు ఇంత అని చెప్పి కమిషన్ వసూలు చేశారు. ఆ కమిషన్ ను నగదు రూపంలోనే కాకుండా.. బంగారం సహా ఇతర మార్గాల్లో వసూలు చేసుకున్నారు. ఇందు కోసం తప్పుడు కంపెనీలు సృష్టించారు. ఖర్చు లేని చోట ఖర్చు చూపించారు. లాజిస్టిక్స్అదనీ, ఇదనీ ఇష్టారీతిగా ఖర్చులు చూపించారు.  ఇతర ఖర్చులు చూపించారు.   ఇప్పుడు దర్యాప్తులో భాగంగా లిక్కర్ కంపెనీల యజమానులు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇంకా   ధైర్యం చేయకపోయినా..  తాము   ముడుపులు ఎలా చెల్లించామన్న వివరాలను వెల్లడించారు.  తాము కేసుల్లో ఇరుక్కోకుండా, తమ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా జాగ్రత్తపడుతూనే..  ఐదేళ్ల పాటు జలగల్లా తమ రక్తాన్ని పీల్చేసిన వారికి సంబంధించిన వివరాలను, వారెలో దోపిడీ చేశారో అందుకు అవసరమైన ఆధారాలను దర్యాప్తు అధికారులకు అందజేస్తున్నారు.  ఆ వివరాలు, ఆధారాలను సేకరించిన  సిట్ ఇక మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు.   

భారత్ కు అమెరికా మరో షాక్?

15 షిప్ మెంట్ల మామిడి పండ్ల ధ్వంసం! భారత్, అమెరికా మధ్య దాదాపు కోల్డ్ వార్ లాంటి పరిస్థితి నెలకొందా అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు భారత్ కు ఒకింత ఇబ్బందికరంగా పరిణమించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకుర ఇరు దేశాలనూ ఒప్పించింది తానేనని ట్రంప్ ప్రకటించడం, భారత్ దానిని ఖండించడం తెలిసిందే. భారత్ పాకిస్ధాన్ వ్యవహారాలలో మూడో దేశం ప్రమేయం లేదనీ, ఇరు దేశాల సైన్యాధ్యక్షుల మధ్య చర్చల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ విస్పష్టంగా తేల్చేసింది. అలాగే, ఆ తరువాత భారత్ అమెరికాకు వంద శాతం సుంకాల మినహాయింపు హామీ ఇచ్చిందని అమెరికా ఏకపక్షంగా చేసిన ప్రకటననూ ఇండియా నిర్ద్వంద్వంగా ఖండించింది.  దీంతో అమెరికా పెద్దరికం చిన్నబోయింది. అమెరికా ఒత్తిడిని భారత్ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదని ప్రపంచ దేశాలకు విస్పష్టంగా తెలిసియింది. ఈ నేపథ్యంలోనే అమెరికా భారత్ పట్ల ఒకింత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. అమెరికా వ్యవహార శైలి కారణంగా ఇరు దేశాల మధ్యా బంధాలు దెబ్బతింటున్న పరిస్థితులు కానవస్తున్నాయి.   తాజాగా  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు.  సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు.  భారతీయ కరెన్సీలోదాదాపు  రూ.42,694,000లు. దీంతో వీటిని తిరిగి భారత్ కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయడం తప్ప మరో అవకావం లేని  పరిస్దితి ఎగుమతి చేసిన మామిడి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్ కు రవాణా ఛార్జీలు భరించి తీసుకెళ్లే పరిస్దితి లేక అక్కడే ధ్వంసం చేసేస్తున్నారు.  భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్ పోర్టుల్లో అమెరికా అధికారులు ఏకకాలంలో అడ్డుకోవడం వెనుక అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలే కారణమని అంటున్నారు. దీంతో అమెరికాకు మామిడి పండ్లను ఎగుమతి చేసిన  భారతీయ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్దితి ఏర్పడింది. వాస్తవానికి భారత్ కు అతిపెద్ద మామిడిపండ్ల ఎగుమతిదారు   అమెరికాయే. ఇప్పుడు అమెరికా చర్య కారణంగా రైతులకే కాకుండా, భారత ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ తగిలిందనే భావించాల్సి ఉంటుంది.   కాల్పుల విరమణపైనా, ఆ తర్వాత సుంకాలపైనా ట్రంప్ ప్రకటనల్ని భారత్ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఈ మామిడి పండ్ల తిరస్కరణ వ్యవహారం ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే దీనిపై అటు అమెరికా కానీ, ఇటు ఇండియా కానీ ఇంత వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. 

ఈసారి ఆసియా కప్ లేనట్లేనా?

పాకిస్తాన్ కు భారత్ మరో షాక్  త్వరలో జరగాల్సిన ఆసియా కప్‌ నుంచి తప్పుకునేందుకు బీసీసీఐ నిర్ణయం? భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న  పాక్‌కు మరో షాక్ తప్పేటట్టు లేదు. త్వరలో జరగాల్సిన ఆసియా కప్‌ నుంచి వైదొలగేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, భారత్‌లో పాక్‌పై ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్‌తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్‌ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈసారి ఆసియా కప్ భారత్‌లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ భారత్, పాక్ మ్యాచ్‌లే. ఈ మ్యాచ్‌ లు జరిగే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దీంతో, ఆసియా కప్ లాభదాయకతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసియా బోర్డుకు పీసీబీ చైర్మన్ మోహ్‌సీన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. బీసీసీఐ మాజీ సెక్రెటరీ జైషా ఐసీసీ బాధ్యతలు తీసుకున్నాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలను మోహ్‌సీన్ చేపట్టారు. ఇక భారత్ నిర్ణయంతో పాక్‌‌కు ఆర్థికంగా గట్టి షాక్ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇకపై ఇద్దరిదే ఒకటే మాట ..ఒకటే బాట!

బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దు మణిగిందా? అంటే గులాబీ పార్టీ నేతలు అవుననే అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్డుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందుతరం నేతలు. అవును  రెండు రోజుల క్రితం కేటీఆర్  స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి రెండు గంటలకు పైగా చర్చలు జరపడం, ఆ వెంటనే శనివారం హరీష్ రావు నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల గురించి, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులతో కేటీఆర్, హరీష్ రావు చర్చించి.. డిమాండ్ల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రకటించడం వారిరువురి మధ్యా వివాదం సర్డుమణిగింది అనేందుకు ఒక సంకేతంగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో  ముఖ్యంగా గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందు తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగతున్న నేపధ్యంలో ఇద్దరు కలిసి కూర్చుని..  ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేయడం పార్టీ క్యాడర్  కు మంచి సంకేతం పంపుతుందని అంటున్నారు.   నిజానికి ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో, ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో అంతర్గత కుమ్ములాటల గురించి పార్టీలో, ప్రజల్లో,  మీడియాలో   పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా  కేటీఆర్ , హరీష్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వంక కేసీఆర్  కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఈ చర్చల్లో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈ నేపద్యంలోనే బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట సాగుతోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత హరీష్, కేటీఆర్ మధ్య దూరం పెరిగడమే కాకుండా.. హరీశ్ రావు కారు దిగి సొంత పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, హరీష్ రావు ఈ వార్తలను ఒకటికి పదిసార్లు ఖండించారు. అంతే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా, తనకు అభ్యంతరం లేదని  మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. అలాగే..  గత పాతికేళ్ల ప్రస్థానంలో ఏనాడు కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇక ముందు కూడా  కేసీఆర్ మాటే తనకు వేదవాక్కని హరీష్ స్పష్టం చేశారు. నిజానికి, హరీష్ రావు మొదటి నుంచి కూడా కేసీఆర్  తో ఏ విషయంలోనూ విభేదించలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా  కేసీఆర్  మాట జవదాటలేదు. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదని అంటారు.  ముఖ్యంగా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా,  పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్  ప్రాధాన్యత రోజుర్జుకు పెరుగుతూ వచ్చిన  సమయంలోనూ హరీష్ రావు పెదవి విప్పలేదు. ప్రశ్నించలేదు.  కేసీఆర్   మాట జవ దాటలేదు.  కాబట్టి.. ఇప్పుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా హరీష్ రావు  ఎదురు తిరిగక పోవచ్చని అంటారు.   అయినా అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా ప్రత్యర్ధుల ప్రచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్  క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరుగుతున్న నేపద్యంలో.. భవిష్యత్  బంధాలు ఎలా ఉంటాయి  అనే విషయంలో సహజంగానే  హరీష్ రావు వర్గంలో అనుమానాలు ఉన్నట్లు చెపుతున్నారు. నిజానికి  పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నంత వరకు కుటుంబంలో చిన్నా పెద్ద  పొరపొచ్చాలు ఎన్ని వచ్చినా, కేసీఆర్ పెద్దరికంతో ఏదో విధంగా సర్డుబాటు చేస్తూ వచ్చారు.  కానీ, పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతికి వెళ్ళిన తర్వాత తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన హరీష్ అనుచరుల్లో వ్యక్త మావుతోందని అంటున్నారు. అందుకే, కేసీఆర్ చొరవ తీసుకుని, నష్ట నివారణకు నడుం బిగించినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళితే, భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని కేసీఆర్  ఇటు హరీష్ రావు ను, అటు కేటీఆర్ ను  కన్విన్స్ చేసినట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు మామ మాట జవదాటను,  కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా అభ్యంతరం చెప్పను అని మీడియా ముఖంగా, ప్రకటించారని చెపుతున్నారు.  అలాగే, కేటీఆర్ ను హరీష్ వద్దకు కేసీఆరే పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఇద్దరి మధ్య సుదీర్ఘంగా రెండు గంటల పాటు జరిగిన భేటీలో  చాలా విషయాలు ఖుల్లం ఖుల్లా చర్చకు వచ్చినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా.. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ ముఖ్యనాయకుల మధ్య విబేధాలు లేక పోవడమే కాదు, విబేధాలు లేవన్న సందేశం ప్రజల్లోకి, పార్టీ క్యాడర్ లోకి బలంగా తీసుకు పోవడం కూడా ముఖ్యమని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, ఇక పై ప్రతి విషయంలో ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట అన్నట్లు ముందుకు సాగాలని నిర్ణయించారని, అందులో భాగంగానే  ముందు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్స్  పై దృష్టిని కేంద్రీకరించారని చెపుతున్నారు. అయితే  ముందు ముందు ఏమి జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కవిత  సంగతేంటి? ఓవరాల్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది చూడవలసిందే  అంటున్నారు.

వైసీపీకి మోడీయే దిక్కు.. కుండబద్దలు కొట్టేసిన నల్లపురెడ్డి

వైసీపీ బతికి బట్టకట్టాలంటే మోడీని శరణు జొచ్చడం వినా మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా? ఇదే విషయాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా పార్టీ అధినేత జగన్ కు చెబుతున్నారా?  అసలు 2024 ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయానికి బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడమే కారణమని భావిస్తున్నారా? అన్న ప్రశ్నలకు ఈ పార్టీ సీనియర్ నేతల మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు,  కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి   పార్టీకి భవిష్యత్ ఉండాలంటే జగన్ మోడీని శరుణు వేడి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎలాంటి శషబిషలకూ తావివ్వకుండా.. 2024 ఎన్నికల సమయంలో జగన్ బీజేపీతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోకపోవడమే పార్టీ పరాజయానికి కారణమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  కనీసం వచ్చే ఎన్నికలలో అయినా, అంటే 2029 ఎన్నికల నాటికైనా వైసీపీ బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే పార్టీ మనుగడ ఉంటుందని అన్నారు.  ఇదే విషయాన్ని  తాను నేరుగా జగన్ కు కూడా చెబుతానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  2024 ఎన్నికల సమయంలో బీజేపీ కోరినప్పటికీ జగన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశారనీ, అప్పుడు పొత్తు వద్దనుకోవడం వల్లనే వైసీపీ ఆ ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిందని అన్నారు. అలా అనడం ద్వారా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అప్పటి జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టారు.  వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మోడీ సర్కర్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందనీ, అలాంటప్పుడు.. ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడం తప్పేనన్నారు.   కనీసం వచ్చే ఏన్నికలలోనైనా జగన్ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్నారు. బీజేపీతో పొత్తు ఉంటేనే వైసీపీకి భవిష్యత్ ఉంటుందన్నారు. 

అంగరంగ వైభవంగా తెలుగు వన్ రజతోత్సవ వేడుకలు

పాతిక వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగువన్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రజతోత్సవ  సభకు నిండుదనం తెచ్చారు. పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి మహా విశిష్ట అతిథిగా హాజరై తెలుగువన్ టీమ్‌ని ఆశీర్వదించారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి  నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె,  స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.  కార్యక్రమంలో పది మంది ప్రముఖులను తెలుగువన్ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సన్నానించారు సహస్రావధాని మేడసాని మోహన్, ప్రజావైద్యులు  డాక్టర్ పాములపర్తి రామారావు, తెలుగు మీడియా అకాడమీ చైర్మన్ కల్మెకొలను శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ గ్రహీత్ చంద్రబోస్, రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నతాధికారి డాక్టర్ పి.వి.రమేష్, వ్యవసాయ నిపుణుడు ముళ్లగూరు అనంతరాముడు, నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావు, సీఎస్ బీ, ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు మల్లవరపు బాలలత,  స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్‌లను  తెలుగువన్ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సన్మానించారు.

ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగుజాతి.. చంద్రబాబు

ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్‌ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కంఠంనేని రవిశంకర్‌  తెలుగువన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం (మే 18) పాల్గొన్నారు.  జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు     తెలుగువన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉందంటే అందదుకు రవిశంకర్ కృషి, పట్టుదలే కారణమన్న చంద్రబాబు.. తాను   విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్‌ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారన్నారు. ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కాదు. తర్వాత వార్తా పత్రికలు వచ్చాయి. తర్వాత సమాజంలోకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది.  రవిశంకర్ లాంటి వ్యక్తులు అనేక ఛానల్స్ తీసుకొచ్చారు.   తెలుగు వన్ ఛానల్ కు ప్రస్తుతం వరకు 55 బిలియన్ వ్యూవ్స్, 120 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 16 లక్షల వీడియాలు, 15 వందలకు పైగా సినిమాలతో  తెలుగువన్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని చంద్రబాబు అన్నారు. కంఠంనేని రవిశంకర్ నిర్మించిన అమరావతి సినిమాపైనా చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆ నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా.. అమరావతికి అన్యాయం జరిగిందన్న కోపంతో, ఆవేదనతో ధర్మం, న్యాయం కోసం నిలబడి అత్యంత సాహసంతో రాజధాని ఫైల్స్ సినిమాతీసిన ధీరోదాత్తుడు రవిశంకర్ అని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.   సామాజిక బాధ్యత విషయంలోనూ రవిశంకర్ ముందుంటారన్న చంద్రబాబు ఇప్పటి వరకూ కంఠంనేని 2000 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారని  అందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలకు కూడా చంద్రబాబు అభినందనలు తెలిపారు. తాను అరెస్టైన సమయంలో హైదరాబాద్‌లో మీరు పోరాడిన విధానం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. గచ్చిబౌలిలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు మనం మంచిపని చేస్తే ప్రజలు మర్చిపోతారు అని అంటుంటారు..కానీ ఏ విధంగా ప్రజలు స్పందింస్తారనేది ఆ సభ కళ్లకుకట్టిందన్నారు.  సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలన్న రవిశంకర్ సూచనను చంద్రబాబు స్వాగతించారు. సామాజిక మాధ్యమంతో  ఎంత లాభం ఉందో..అంతనష్టం ఉంది. సోషల్ మీడియాను వేదికగా తీసుకని వ్యక్తిత్వ హననం, తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు. దీనిపై నియంత్రణ అవసరం. ఇళ్లలో ఉండే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి. దుర్మార్గపు ఆలోచన చేసే వారిని నియంత్రించాల్సి ఉంది అన్నారు. 

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

  హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలో ఒక మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. మరోవైపు హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడలో  పెను అగ్నిప్రమాదం తప్పిన తప్పింది. పెట్రోల్ ట్యాంకర్ బ్యాటరీ పేలడంతో  మంటలు చెలరేగాయి.  పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ లారీ ఉండటంతో సమయానికి ఘటనాస్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు చనిపోతున్నారని అన్నారు. అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై ఇప్పటికైనా సమీక్ష నిర్వహించాలని వారు కోరుతున్నారు

టీడీపీ నేత‌పై వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి

   తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ​దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్​, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన రాజు మంగళగిరి ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. దాడి ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ ​దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. నిన్నటి దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు టీడీపీ నేత‌పై దాడితో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.  

గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాదం బాధాకరం.. వరుస అగ్ని ప్రమాదాలపై చర్యలు లేవి? : కేటీఆర్

    హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాద వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని ఆయన తెలిపారు. ఈ ఘటన చాలా హృదయవిదారకం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. మంటలు త్వరగా అదుపులోకి రావాలి. ఘటనను ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటారు.  ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారు. స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అని కేటీఆర్ సూచించారు. అలాగే ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలి. పాతబస్తీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలి. అగ్నిమాపక శాఖ సామర్థ్యాన్ని పెంచాలి. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలి. ’’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.  మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నదని విమర్శించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని చెప్పారు. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  

అగ్ని ప్రమాద ఘటనలో అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరం : సీఎం చంద్రబాబు

  హైదరాబాద్  గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. పాత బస్తీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామన్నారు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు  దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో  మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.  అంతకుముందు టీటీడీ నిబంధనల ప్రకారం ప్రముఖులకు ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి భక్తి శ్రద్ధలతో పూజా కైంకర్యాలు జరిపి లడ్డూ ప్రసాదం అందజేశారు. శ్రీవారి దర్శనంతరం ప్రముఖులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖులు తెలిపారు.కాగా తిరుమల శ్రీవారిని దర్శించునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి వెంకన్న సేవలో పాల్గొంటున్నారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వారి సౌకర్యార్థ్యం అధికారులు అన్ని ఏర్పాట్లు శారు.

పాతబస్తీ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి..బాధితులను ఆదుకుంటామని హామీ

  హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసా కల్పించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు వద్దని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం తెలిపారు

తెర పైకి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఇంచుమించుగా 18 నెలలు అంటే సంవత్సరంన్నర కావస్తోంది. ద్వితీయ వార్షికోత్సవం దగ్గర పడుతోంది.కానీ, ఇంత వరకు పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కారాణాలు ఏమైనా, గతంలో అనేక మార్లు పెట్టిన మంత్రివర్గ విస్తరణ ముహూర్తాలు వచ్చి పోయాయే కానీ, ఏ ఒక్కటీ ముడి పడలేదు. ఎప్పటికప్పుడు, ఏదో కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది.   రాజగోపాల రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి వంటి కొందరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని, అసమ్మతిని బహిరంగంగా వ్యక్తపరిచిన సందర్భాలు కూడా లేక పోలేదు.అయినా, మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం మాత్రం రాలేదు. అయితే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మరోమారు మంత్రివర్గ విస్తరణ అంశం తెర మీదకు తెచ్చారు. ఈసారి ఖచ్చితమైన ముహూర్తాన్ని అయితే ప్రకటించలేదుకానీ, శనివారం (మే 17) నిజామాబాద్’లో జరిపిన మీడియా ముచ్చట్ల సందర్భంగా ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని, అన్నారు.అదే సమయంలో, మంత్రివర్గ విస్తరణతో పోటీపడుతూ వస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీపీ) కార్యవర్గం సైతం ఖరారు అవుతుందని  పీసీసీ చీఫ్, పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తీపి కబురు చెప్పారు.  అయితే, నిజంగా ఇది తీపి కబురేనా, ఈసారైనా ముహూర్తం ముడిపడుతుందా అంటే, కాంగ్రెస్ వర్గాలు అనుమానమే అంటున్నాయి. నిజానికి, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు బహిర్గతం అవుతున్నాయి. అనేక జిల్లాల్లో విబేధాలు కొట్లాటలు, కుమ్ములాటల వరకువరకు వెళుతున్నాయి. ఫలితంగా అసమ్మతి, అసంతృప్తి బజారు ఎక్కడం, చివరకు గాంధీ భవన్ ను తాకడంతో పీసీసీ చీఫ్ వ్యూహాత్మకంగా మంత్రివర్గ విస్తరణ,మ, పీసీసీ ఖరారు అంశాలను తెర పైకి తెచ్చారని పార్టీ నాయకులు  అనుమానిస్తున్నారు.  ముఖ్యంగా..  మహిళలకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇటీవల ఏకంగా గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. నిజానికి డైరెక్ట్ గా పీసీసీ చీఫ్ పైనే ఆమె ఆరోపణలు ఎక్కు పెట్టారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారని పీసీసీ అధ్యక్షుడిపైనే ఆరోపణలు చేశారు. పదవుల కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలని, తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగడంతో పాటుగా, మహేష్ కుమార్ గౌడ్ సొంతానికి పదవులు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. నిజానికి.. బయట పడక పోయినా  కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశిస్తున్న చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. అందుకే.. నాయకుల అసంతృప్తిని పసిగట్టినమహేష్ కుమార్ గౌడ్  దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. త్వరలోనే పీసీసీ పదవులతో పాటుగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రకటించి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి..  మంత్రివర్గ విస్తరణ జరిగేదే ఉంటే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నడుమ, అధిష్టానం ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగిన, సంక్రాంతి (ఏప్రిల్ 3) ముహుర్తానికే విస్తరణ జరిగేదని, అంటున్నారు. నిజానికి అప్పట్లో ముహూర్తం ఖరారు కావడమే కాకుండా.. మంత్రి పదవులు పొందే ఎమ్మెల్యేల పేర్లు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది. అయితే, సంక్రాంతి ముహూర్తం వచ్చింది. వెళ్ళింది.  కానీ..  మంత్రివర్గ విస్తరణ జరిగ లేదని కాంగ్రెస్  నాయకులే గుర్తు చేస్తున్నారు.  అలాగే.. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడ చెప్పలేదని,మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం  కాబట్టి ఏఐసీసీ నిర్ణయించే వరకు ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టినా, అవి మురిగి పోతాయని  అప్పట్లో మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఢిల్లీ పెద్దలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో  అప్పుడే జరుగుతుంది. అంతవరకు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సహా ఎవరు ఏమి చెప్పినా..  ఎన్ని ముహూర్తాలు పెట్టినా, సంపూర్ణంగా విశ్వసించ లేమని అంటున్నారు.

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..16 మంది మృతి

  హైదరాబాద్‌ చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు తరలించారు. విద్యుదాఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్  వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.