జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా.. ఎందుకంటే?

  హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం ముగిసింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దని థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణించినట్లు తెలుస్తోంది. జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా వేసుకోవాలని ఎగ్జిబిటర్లు నిర్మాతలు కోరగా వారు అంగీకరించారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానించారు. ఉదయం 11 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు.  ఈ భేటీకి సుమారు 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరైనట్లు సమాచారం. అనంతరం, సాయంత్రం 4 గంటలకు తెలుగు నిర్మాతలతో ఛాంబర్ పెద్దలు చర్చలు జరిపారు. ఈ రెండు సమావేశాల్లోనూ థియేటర్ల మూసివేత ప్రతిపాదనపై వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలలో అత్యధిక శాతం మంది సభ్యులు థియేటర్ల సమ్మెకు సుముఖత చూపలేదని, ప్రదర్శనలు కొనసాగిస్తూనే సమస్యలను పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో  నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.  

కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం..షర్మిల సంచలన ప్రకటన

  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహా దీక్ష చేపట్టారు.  స్టీల్ ప్లాంట్ లో ఆకారణంగా విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి దీక్షకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.  అదానీకి మేలు చేసేందుకు స్టీల్ ప్లాంట్‌ను చంపేస్తున్నారని ఆమె తెలిపారు. విశాఖ కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసేందుకైనా నేను సిద్దం అని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో ఉండేది. బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు అంటూ అందరినీ మోసం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చేసిన ప్రకటనలు అన్నీ పచ్చి అబద్ధం. ఇచ్చినట్లే ఇచ్చి రూ.8వేల కోట్లు బ్యాంక్ రుణాల కింద వెనక్కి తీసుకున్నారు. మరో రూ.3వేల కోట్లు ఇవ్వాలంటే 5వేల మంది ఉద్యోగులను తొలగించాలని కండీషన్ పెట్టారని  షర్మిల తెలిపారు  

మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి.. ఖండించిన పౌరహక్కుల సంఘం

  వచ్చే ఏడాది మార్చి 31లోపు నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్‌ షా ఎక్స్ వేదికగా తెలిపారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నంబాల మృతిని అమిత్‌ షా అధికారికంగా ప్రకటించారు.  ఛత్తీస్‌గఢ్‌‌లో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారు.  ఇందులో సీపీఐ మావోయిస్ట్‌ జనరల్‌ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్‌ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు.  నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి అని ట్వీట్టర్‌లో షా పేర్కొన్నారు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ తర్వాత 54 మందిని అరెస్ట్‌ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’అని షా ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.   బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నాడని ఉదయం నుంచి ఇప్పటివరకు అనే కథనాలు వచ్చినప్పటికీ, అమిత్ షా చేసిన తాజా ప్రకటనతో ఆయన మృతి విషయం నిర్ధారణ అయింది.   2019 గడ్చిరౌలిలో 15 మంది పోలీసుల మృతి నంబాల సూత్రధారి. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్ట్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత తన పేరును బసవరాజ్‌గా మార్చుకున్నారు. ఆయన 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు  నంబాల కేశవరావు మృతి వార్తలను పౌరహక్కుల సంఘం ఖండించింది. ఆయన క్షేమంగా ఉన్నారని, ఆ ప్రచారం అవాస్తమని సంఘం కార్యదర్మి చంద్రశేఖర్ తెలిపారు   

గంగమాంబకు పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు

  ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. తిరుపతి గంగమ్మ జాతరలో  ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు.  

చంద్రబాబు హస్తిన పర్యటన.. అమిత్ షాతో కీలక భేటీ.. ఏం జరగబోతోంది?

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మే 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. ఈ సారి ఆయన హస్తినలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు.  ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీరిరువురి మధ్యా భేటీ శుక్రవారం (మే 23) జరగనుంది. ఈ భేటీలో ప్రాధానంగా మద్యం కుంభకోణం, ఈ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి పాత్ర, అరెస్టు తదితర అంశాలపైనే చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.    వైసీపీ హయాంలో  ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించిన సంగతి తెలిసిందే, చిత్ర విచిత్ర బ్రాండ్లతో అధిక ధరలకు మద్యం విక్రయించడమే కాకుండా.. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ చెల్లింపులకు అవకాశం లేకుండా మద్యం కొనుగోలు దారులు నగదు చెల్లించే మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా జగన్ హయాంలో మద్యం విధానంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో భాగంగా మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న వారందరినీ దాదాపుగా అరెస్టు చేసింది.  కేసిరెడ్డి చంద్రశేఖరరెడ్డి,  సజ్జల శ్రీధర్ రెడ్డిలను సిట్ అదికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అలాగే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులను కూడా విచారించింది. ఈ విచారణలో నిందితుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అన్న నిర్ధారణకు సిట్ వచ్చిందని అంటున్నారు. నిందితులను విచారించిన సందర్భంగా వారు కూడా జగనే అంతిమ లబ్ధిదారు అని వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో జగన్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.  ఎవరిదాకానో ఎందుకు వైసీపీ శ్రేణులే జగన్ అరెస్టు అనివార్యమని అంటున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని అయితే.. జగన్ అరెస్టు ఖాయమని చెప్పేశారు. అయితే ప్రభుత్వ కక్ష సాధింపు కోసమే జగన్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నదని ఆరోపించారనుకోండి అది వేరే విషయం. అదలా ఉంటే.. మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అంటూ తొట్ట తొలుత మాట్లాడినది పేర్నినానే కావడం విశేషం. వైసీపీ శ్రేణులు కూడా జగన్ అరెస్టు తప్పదని దాదాపుగా ఓ అంచనాకు వచ్చాయి. అదే సమయంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నాయనీ, మంత్రులూ, ఎమ్మెల్యేలూ ఎవరూ కూడా మద్యం కుంభకోణం విషయంలో అరెస్టులపైనా, దర్యాప్తుపైనా నోరెత్తి మాట్లాడొద్దనీ, అనవసరంగా వైసీపీకి అవకాశం ఇవ్వొద్దనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలా మాట్లాడటం వల్ల వైసీపీ నేతలు కక్ష సాధింపులతోనే అరెస్టులు అంటూ ప్రచారం చేసే అవకాశం ఇచ్చినట్లౌతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో జగన్ అరెస్టు కు అవసరమైన ఆధారాలను సిట్ సేకరించిందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే  చంద్రబాబు హస్తిన పర్యటన  అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ పరామర్శ

  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని  మంత్రి నారా లోకేష్ అన్నారు.  వైసీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి లోకేష్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కోసం పనిచేశారు. దీనిని ఓర్వలేని వైసీపీ గూండాలు గత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న వెన్నా బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారని లోకేశ్ తెలిపారు.  హత్యకు ఆరు నెలల ముందు కత్తులతో దాడికి యత్నించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని.. రక్షణ కోసం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి అన్నారు. కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. దివంగత వెన్నా బాలకోటిరెడ్డి సతీమణి వెన్నా నాగేంద్రమ్మ, బాలకోటిరెడ్డి సోదరుని కుమారులు వెన్నా నరసింహారెడ్డి, వెన్నా రామకృష్ణారెడ్డిలను కలుసుకున్న మంత్రి లోకేష్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హత్య పూర్వాపరాలు, వెన్నా నాగేంద్రమ్మ ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. హత్య కేసు నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహనిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పార్టీ పరంగా ఇంటిని తాకట్టు నుంచి విడిపిస్తానని హామీ ఇచ్చారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి అని.. ఇంటికి పెద్దకొడుకులా బాధ్యత తీసుకుంటానని వారికి ధైర్యం చెప్పారు. తమకు మంత్రి లోకేష్ అండగా నిలబడటం పట్ల బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.    

హైదరాబాద్‌లో భారీ వర్షం..ఐఎండీ అలర్ట్ ప్రకటన

  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురుస్తున్న తరుణంలో బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తన్నారు.  మండు వేసవిలో ఉక్కపోతలో ఇబ్బంది పడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం నుంచి జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది.  కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు  జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.  రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  మరోవైపు వరంగల్‌, సూర్యాపేట జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నర్సంపేట, ఖానాపురం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బుధవారం తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది

విచారణకు కేసీఆర్ రెఢీ?!

కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ..  అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. అయితే.. ఇప్పడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి, అత్యంత వేగంగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్న కాదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతితో పాటుగా, నిర్మాణ లోపాలపై ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌   (కాళేశ్వరం కమిషన్‌) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదే విధంగా నీటి పారుదల శాఖ మాజీ  మంత్రి హరీశ్‌రావు,  ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు జారీచేసింది. జూన్‌ 6న హరీశ్‌రావు, అదే నెల 9న ఈటల రాజేందర్‌ ను విచారణకు హాజరుకావాలని కోరింది.  ఇప్పడు.. ఈ పిలుపు సహజంగానే రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌  విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే.. ,అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరవుతారా? లేక న్యాయపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తారా అనేది కీలకంగా మారుతోంది. ఒక విధంగా  ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.  అయితే..  అధికారికంగా బీఆర్ఎస్  నుంచి ఎలాంటి ప్రకటన లేక పోయినా..  కేసీఆర్ విచారణకు హాజరు అవుతారనే బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై రాజకీయ పోరాటానికి దీన్నొక అవకాశంగా తీసుకునే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో అన్ని కోణాల్లో చర్చించి, ముఖ్యంగా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలని  ‘ఫార్మ్’ హౌస్ నిర్ణయనికి వచ్చినట్లు చెపుతున్నారు.  ఈ నేపథ్యంలో కమిషన్  విచారణకు హాజరు కావడం వలన చట్టపరంగా ఎదురయ్యే చిక్కులతో పాటుగా రాజకీయంగా ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయంతీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. కేసీఆర్  విచారణకు హరరైనా కాకున్నా, కమిషన్ ఇచ్చే నివేదికలో మార్పు ఏమీ ఉండదు. నిజానికి, రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా నివేదిక ఇప్పటికే  సిద్దమైందని అంటున్నారు.  కేవలం ఫార్మాలిటీ కోసం మాత్రమే కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలిచింది. మరో వంక విచారణకు హాజరు కాకపోతే..  తప్పును ఒప్పుకున్నట్లు అవుతుందనీ,  అలాగే  రాజకీయ బురద చల్లేందుకు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి కేసీఆర్ విచారణకు హాజరు కావడమే ఉత్తమమని బీఆర్ఎస్  ముఖ్య నాయకులు, ముఖ్య సలహాదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి  ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు..  తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు భయమెందుకు? అంటూ  సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. మరో వంక కాంగ్రెస్ నాయకులు గతంలో ఫార్ముల ఈ కేసులో కేటీఆర్  ఏసీబీ విచారణ తప్పించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పడు కేసీఆర్ కూడా అదే బాటలో నడిస్తే మరింత అభాసుపాలు కావాల్సి వస్తుందనీ..   సో  విచారణను ఒక  అవకాశంగా మల్చు కుని రేవంత్ రెడ్డి చరిత్రను,  కాంగ్రెస్ చరిత్రను ఎండకట్టవచ్చని అంటున్నారు. అలాగే కాళేశ్వరం ఎపిసోడ్ మొత్తం రాజకీయ డ్రామాగానే చూడాలనీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు ఇదొక మచ్చుతునక, తప్ప మరొకటి కాదని  పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.  మరోవంక కొంత వరకు స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్ లో సెంటిమెంట్ రగిల్చేందుకు ఇదొక అస్త్రంగా పనిచేస్తుందనిరాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  ఓడిపోయినా..  కేసీఆర్ పట్ల ఇటు ప్రజల్లో అటు పార్టీ క్యాడర్ లో అంతగా వ్యతిరేకత లేదని అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్  లో అవినీతి జరిగినా.. తెలంగాణ ఉద్యమానికి మూలాధారమైన నీళ్ళు, నియామకాలు, నిధుల్లో.. మొదటిదైన నీళ్ళ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటుగా ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో పాస్ మార్కులు కాదు, ఫస్ట్ క్లాసు మార్కులే తెచ్చుకుందని పరిశీలకులు అంటున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో కానీ,  కాళేశ్వరం కమిషన్  కేసీఆర్ ను విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

కుంకీ ఏనుగుల ప్ర‌త్యే‘క‌థ‌’ ఏమిటో తెలుసా?

ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు రైతుల క‌ష్టాల‌కు కుంకీల‌తో చెక్ ఇంత‌కీ ఏమిటీ కుంకీ ఏనుగుల ప్ర‌త్యేక‌త‌!  మే 21న ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు రానున్నాయి. బెంగ‌ళూరులోని విధాన సౌధ లో క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌. డీసీఎం డీకే శివ‌కుమార్, ఏపీ డిప్యూటీసీఎం ప‌వ‌న్ కళ్యాణ్ స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. గ‌తేడాది ఆగ‌స్టులో త‌మ‌కు కుంకీ ఏనుగులు కావాల‌ని కోరారు అట‌వీ శాఖా మంత్రి కూడా అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్. దీంతో సిద్ధ‌రామ‌య్య స‌ర్కార్ వీటిని ఏపీకి అందించ‌డానికి సిద్ధ‌మైంది. రైతుల పంట పొలాల‌ను నాశ‌నం చేస్తున్న అడవి ఏనుగుల‌ను అదుపు చేసేందుకు ఈ కుంకీ ఏనుగుల‌ను వాడుతారు. కుమ్కీ, కూమ్కీ, కూంకీ, కుంకి అని పిలుస్తారీ ఏనుగుల‌ను. మ‌ల‌యాళీలైతే.. త‌ప్పాన అని కూడా పిలుస్తారు.  భార‌త్ లో అడ‌వీ ఏనుగుల‌ను బంధించ‌డానికి ఆప‌రేష‌న్ల‌లో ఉప‌యోగించే ట్రైనప్ అయిన ఏనుగుల‌ను ఈ ఈ పేర్ల‌తో పిలుస్తారు.  కొన్ని సార్లు గాయ‌ప‌డ్డ అడ‌వి ఏనుగుల‌ను ర‌క్షించ‌డానికి, ఏదైనా ఉచ్చులో చిక్కిన అడ‌వి ఏనుగుల‌ను ర‌క్షించి.. వైద్య ప‌రీక్ష‌లు అందించ‌డానికి కూడా ఈ ఏనుగులను ఉపయోగిస్తారు.  అడ‌వి ఏనుగుల‌ను బంధించ‌డానికి, శాంతింప చేయ‌డానికి, మంద‌ను మేప‌డానికి, సంఘ‌ర్ష‌ణాత్మ‌క ప‌రిస్థితుల్లో అడ‌విలోంచి వ‌చ్చిన ఏనుగుల‌ను తిరిగి అడ‌విలోకే పంప‌డానికీ..కుంకీ ఏనుగుల‌ను ఒక అంకుశంలా వాడుతారు.  బేసిగ్గా ఏనుగును మావటి అంకుశం ద్వారా కంట్రోల్ చేస్తాడు. అవి మావ‌టి ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొంది ఉంటాయి కాబ‌ట్టి అత‌డి అంకుశానికి అవి లోబ‌డి ప్ర‌వ‌ర్తిస్తాయి. అదే అడ‌వి ఏనుగులు అలాక్కాదు. అవి ఎవ‌రి మాట విన‌వు. ముల్లును ముల్లుతోనే తీయాలి. వ‌జ్రాన్ని వ‌జ్రంతోనే కోయాల‌న్న‌ట్టు.. అలాంటి ఏనుగుల‌ను.. సాటి ఏనుగుతోనే కంట్రోల్ చేయ‌డాన్నే కుంకీ ఏనుగు అంటారు. వీటికంటూ ప్ర‌త్యేక శిక్ష‌ణ ఉంటుంది. బేసిగ్గా భార‌త‌దేశంలో ఏనుగుల‌ను ఆల‌యాల్లో దైవ సేవ‌ల కార్య‌క్ర‌మాల‌కే ఎక్కువ‌గా వినియోగిస్తారు. త‌ర్వాత స‌ర్క‌స్ లో ఎక్కువ‌గా వాడుతారు. కానీ కుంకీ ఏనుగుల రూటే స‌ప‌రేటు. వీటిని సైనికుల్లా తీర్చి దిద్దాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎదుర్కోబోయేది మ‌నుషుల‌ను కాదు సాటి ఏనుగుల‌ను. అస‌లే అడ‌వి ఏనుగులు మ‌ద‌మెక్కి ఉంటాయి. ఆ గ‌జ‌బ‌లాన్ని ఢీకొట్టాలంటే అందుకు త‌గిన విధంగా.. ఈ ఏనుగు సైతం అంతే ధీటుగా ఉండాలి. ఆ దిశ‌గా వీటిని తీర్చిదిద్దుతారు. అడ‌వి ఏనుగులు జ‌నావాసాల్లోకి, వారి పంట పొలాల్లోకి ప్రవేశించిన‌పుడు.. వాటిని త‌ర‌మికొట్ట‌డానికి కుంకీల‌ను వాడుతారు. అడ‌వి ఏనుగుల‌కు కుంకీ ఏనుగుకు మ‌ధ్య ప్ర‌త్య‌క్ష సంబంధాలు లేక పోయినా.. ఆ ఏగుల అరుపుల‌తో కూడిన‌ భాష‌ను ఈ ఏనుగు ఇట్టే ప‌సిగ‌ట్టి వాటికి త‌న మావ‌టి ఇచ్చే హెచ్చ‌రిక‌లను జారీ చేసి.. పొలాల్లోకి రాకుండా  చేస్తుంది. కొన్ని ఏనుగులు త‌మ మావ‌టి నుంచి వ‌చ్చే పాదాల ఆదేశాల‌ను అనుస‌రించి.. మొత్తం ఆప‌రేష‌న్లో నిశ్శ‌బ్ధంగానే ఉంటూ అడవి ఏనుగుల‌ను త‌రిమికొట్టేలా ట్రైనింగ్ ఇస్తారు.. కుంకీ అనే ప‌దం ప‌ర్షియ‌న్ భాష‌లోని కుమాక్ నుంచి వ‌చ్చిన‌ట్టు చెబుతారు. దీన‌ర్ధం స‌హాయం అని. బెంగాల్ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కూ ఈ ప‌దాన్నే ఎక్కువ‌గా వాడుతున్నారు. 2012లో త‌మిళంలో కుంకీ అనే సినిమా కూడా  వ‌చ్చింది. సాలోమ‌న్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో.. విక్రం ప్ర‌భు, ల‌క్ష్మి మీన‌న్ హీరో హీరోయిన్లుగా.. తిరుప‌తి బ్ర‌ద‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నిర్మాణంలో వ‌చ్చిన ఈ చిత్రం 5 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. మొత్తం 70 కోట్ల మేర వ‌సూలు చేసిన సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇపుడీ సినిమా  ప్ర‌స్తావ‌న ఎందుకంటే.. ఈ మూవీగానీ మీరుచూడ‌గ‌లిగితే.. కుంకీ ఏనుగుల మీద పూర్తి అవ‌గాహ‌న క‌లుగుతుంది.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?

  తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ షోకాజ్ నోటీసులు పంపించారు. ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై సునీతా రావు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కాలాంబ నోటీసులు జారీ చేశారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల సునీతారావు ఆధ్వర్యంలో మహిళా నేతలు గాంధీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఛాంబర్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం మహిళా కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమించిందని.. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల విషయంలో మహిళా కాంగ్రెస్‌కు అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎన్నిసార్లు కలిసినా సీఎం రేవంత్‌రెడ్డిని కలవండి అని చెబుతున్నారని సునీతా రావు వాపోయింది. మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడని ఆమె అన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు సునీతా రావు ప్రశ్నించింది. బీఆర్ఎస్,  బీజేపీ నుండి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారని ఆమె తెలిపింది  

కేశినేని నాని హడావుడి.. తన కోసమా? కుమార్తె ఫ్యూచర్ కోసమా?

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని మళ్లీ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారట. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిన కేశినేని నాని తమ్ముడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గతేడాది జూన్ 10న ఇక రాజకీయాల్లోకి వచ్చేదే లేదని చెప్పారు. కానీ ఇప్పుడదే కేశినేని నాని బీజేపీ నాయకులతో రాజకీయ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలోఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలైంది. కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె కూడా విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని తన కోసం అడుగులు వేస్తున్నారా?  కూతురు రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేశినేని నాని, 2019లో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత తెలుగుదేశంలో రెబల్ అవతారం ఎత్తారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా నాని వ్యవహారశైలి కొనసాగింది. 2023  విజయవాడ ఎంపీ టికెట్‌ని.. ఆయన తమ్ముడు చిన్నికి ఖరారు చేయడంతో, నాని వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. ఎన్నికల్లో మాత్రం తమ్ముడిపై గెలవలేకపోయారు. అప్పట్నుంచి పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. రాజకీయాలకు దూరమై, పొలిటికల్‌గా పూర్తిగా సైలెంట్ అయ్యాక, మళ్లీ ఈ మధ్య కాలంలో కేశినేని నాని తరచు వార్తల్లో నానుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు, ఎంపీ కేశినేని చిన్నిపై నిప్పులు చెరుగుతున్నారు. అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే, రాజకీయ విమర్శలు చేస్తూ, తాను రాజకీయంగా యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. బ్యాక్ ఎండ్‌లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. చిన్ని టార్గెట్‌గా విమర్శలు చేస్తూ, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుబడుతూ, సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇదంతా మళ్లీ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకే అంటున్నారు. నిజంగానే కేశినేని నాని.. పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా? లేక.. తమ్ముడి మీద ఆరోపణలతోనే ఆగిపోతారా? .. అన్నది చూడాలి.

మావో సుప్రీం కమాండర్.. అలిపిరి దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో హతం

ఛత్తీస్ గఢ్ లో బుధవారం (మే 21) ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి సూత్రధారి నంబాల కేశవరావు  అలియాస్ గగన్నా కూడా ఉన్నారు. 2012లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన మెరుపుదాడిలోనూ నంబాల కేశవరావుదే ప్రధాన పాత్ర.  మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు  గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట అని చెబుతారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చేశాడు నంబాల కేశవరావు ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజం పట్ల  ఆకర్షితుయ్యాడు. ఆయన తండ్రి ఉపాధ్యా యుడు. శ్రీకాకుళం జిల్లా జియన్న పేట నంబాల కేశవరావు స్వస్థలం. ఈయన 1955లో జన్మించిన ఆయన వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మునుపటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్) నుంచి బీటెక్ పూర్తి చేశారు. 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. 1980లో ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.  2004లో పీపుల్స్ వార్  మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లో కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నిపుణుడు. 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం మాజీ యోధుల దగ్గర శిక్షణ పొందారు. నంబాల కేశవరావు  మావోయిస్టులు జరిపిన పలు దాడులలో కీలక పాత్ర పోషించారు.  2010లో దంతేవాడలో 76 సీఆర్‌పీఎప్ జవాన్లు హతమైన దాడిలో నంబాల కేశవరావుదే కీలక పాత్ర.   ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా ఉన్న నంబాల కేశవరావు బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. నంబాల కేశవరావుపై రూ. కోటీ  30 లక్షల రివార్డు ఉంది. నంబాల కేశవరావు మృతి మావోయిస్టులకు తేరుకోలేని ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.  

వైసీపీ నేతల కాషాయ జపం.. జగన్ స్టాండ్ మారుతోందా?

ఆంధ్రాలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీలో నేతల అంతర్గత విశ్లేషణల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది.  వై నాట్‌ 175 అంటూ హడావుడి చేసిన జగన్ పార్టీని ప్రజలు ఛీత్కరించారు. దాంతో పార్టీ ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ నాయకుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైఎస్ జగన్ చేసిన పెద్ద తప్పని నల్లపురెడ్డి కుండబద్దలు కొట్టేశారు. మనసులో మాటని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే నేతగా పేరున్న నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చిన నల్లపురెడ్డి, ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. దాంతోఈ వ్యవహారంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోందట. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ లోక్‌సభ, రాజ్యసభల్లో సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లుకు కూడా వైసీపీ మద్దతిచ్చినట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. గడిచిన ఐదేళ్లు పార్లమెంట్‌లో కేంద్రానికి అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీకి దూరమైంది. 2024 ఎన్నికల సమయంలోనూ బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అండగా నిలిచిన వైసీపీ, ఎన్నికల్లోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తప్పు ఏముందనే చర్చ కూడా నడిచింది. అయితే పొత్తు విషయంలో వైసీపీ వైపు నుంచి అడుగులు పడకపోవడంతో బీజేపీ చివరకు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందంటున్నారు.  గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ పెద్దలు కూడా బీజేపీతో  ఢిల్లీ స్థాయిలో సత్సంబంధాలు కొనసాగించారు. ఎప్పుడూ బీజేపీ విధానాలను కానీ.. ఆ పార్టీ పెద్దలపై కానీ ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీపై విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల గడువుంది. ఉన్నట్టుండి.. బీజేపీతో పొత్తు అంశాన్ని ఇప్పుడెందుకు తెరపైకి తీసుకొచ్చారు? అనే చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్య నేతలు తరచుగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా, ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బీజేపీ బయటకు వచ్చే పరిస్ధితులు లేవు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన బంధం మరింత బలపడింది. ఈ తరుణంలో వైసీపీ నేతలు బీజేపీతో పొత్తు అంశాన్ని మాట్లాడటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఒంటరిగా ఎన్నికలకు వెళితే వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని గ్రహించే ఆ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్‌పై పార్టీ స్టాండ్ ఎంటనేది ఇంకా ప్రకటించినప్పటికీ, ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసే, బీజేపీతో కలిసి వెళితే లాభం ఉంటుందని ఆయన మాట్లాడి ఉంటారని, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అంటున్నారు. అయితే.. వైసీపీతో కలవాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సింది మాత్రం కేంద్ర నాయకత్వమే అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ మాత్రం ఓ అడుగు ముందుకేసి బీజేపీ, వైసీపీ ఉత్తర, దక్షిణ ధృవాలని, భవిష్యత్‌లో అవి కలిసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

పల్లా శ్రీనివాసరావుకు లోకేష్ క్లాస్.. ఎందుకో తెలుసా?

ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫుల్ గా క్లాస్ పీకారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని దాదాపుగా హెచ్చరించినంత పని చేశారు. ఎందుకంటే.. సోమవారం (మే 19)న  గ్రేటర్ విశాఖ మునిసిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేని కారణంగా వాయిదా పడింది. అలా వాయిదా పడటానికి కారణం కొందరు తెలుగుదేశం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడమే. అసలు విషయమేంటంటే... వైసీపీ జమానాలో జరిగిన  జీవీఎంసీ ఎన్నికల్లో  మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీయే దక్కించుకుంది.  అయితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై, అధికారం కోల్పోయింది. తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టింది.  ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలలో వైసీపీ కార్పొరేటర్లు పలువురు ఆ పార్టీని వీడి కూటమి పార్టీల పంచన చేరారు. వారిలో అత్యధికులు తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో జీవీఎంసీపై తెలుగుదేశం పట్టు సాధించింది.  జీవీఎంసీ మేయర్ గా టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి సోమవారం (మే 19) ఎన్నిక జరగాల్సి ఉంది. కూటమి ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నికలకు పలువురు తెలుగుదేశం కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.   జీవీఎంసీలో కూటమికి దాదాపుగా 74 మందికి కార్పొరేటర్ల బలం ఉంది.   56 మంది  హాజరైతే డిప్యూటీ మేయర్ సజావుగా సాగి ఉండేది. కానీ  కేవలం 54 మంది   మాత్రమే హాజరుకావడంతో కోరం లేక  ఎన్నిక  వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అదికారి ప్రకటించారు. ఈ సమాచారం అందుకున్న  ఇలా డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందో, లేదో… ఆ సమాచారం   నారా లోకేశ్  పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై అసంతృప్తితోనే పలువురు గైర్హాజరయ్యారని తెలుసుకున్న ఆయన గైర్హాజరైన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పొత్తులో  మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేననీ, భవిష్యత్ లో మళ్లీ ఇటువంటి సంఘటన పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని లోకేష్ పల్లాకు క్లాస్ పీకారట.  

ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు

ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పిలోరాగఢ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 180 మంది కైలాస్ మానసనరోవర్ యాత్రికులు మార్గ మధ్యంలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో వారు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. రోడ్డు క్లియర్ చేయడానికి బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది రంగంలోకి దిగా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు క్లియర్ చేస్తున్నారు.  కరోనా  మహమ్మారి కారణంగా 2020లో కైలాస మానస సరోవర్ యాత్రను అధికారులు నిలిపివేశారు. ఆ తరువాత కరోనా తగ్గినప్పటికీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో అప్పటి నుంచి ఈ యాత్ర జరగడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్యా జరిగిన చర్చలు ఫలించడంతో ఐదేళ్ల తరువాత ఈ ఏడాది కేలాస మనస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించారు.  

ఛత్తీస్గఢ్ మరో భారీ ఎన్కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి!

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలలో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆపరేషన్ కగార్ కు కామా పెట్టిన కేంద్రం.. ఇప్పుడు అక్కడ ఉద్రిక్తతలు ఒకింత సడలగానే మళ్లీ వేగం పెంచింది. తాజాగా బుధవారం (మే 21) ఉదయం ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో20 మంది నక్సలైట్లు మరణించారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని సమాచారం. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు మరణించినట్లు చెబుతున్నారు.  సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. 

ఏపీ మద్యం కుంభకోణం కేసు ఈడీ దర్యాప్తు.. ఇట్స్ కన్ ఫర్మ్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఇక ఈడీ అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మాంచి దూకుడుమీద ఉంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. వాస్తవానికి గతంలోనే ఈడీ ఈ కేసును టేకప్ చేయడానికి కోర్టును అభ్యర్థించినా ఇంత వరకూ అనుమతి రాలేదు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందన్నఆరోపణలు ఉండటంతో ఈ కేసు ఈడీ టేకప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతించాల్సిందిగా ఈడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను గతంలోనే విచారించిన కోర్టు అప్పట్లో తీర్పు వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా ఈడీకి రాజ్ కేశిరెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతి ఇస్తూ మంగళవారం (మే 20) తీర్పు వెలువరించింది.   దీంతో రాజ్  కేసిరెడ్డిని ఈడీ విచారించేందుకు సన్నద్ధమౌతున్నది. ఏసీబీ, సీఐడీడ కేసులు, దర్యాప్తులతో పోలిస్తే ఈడీ తీరు భిన్నంగా ఉంటుంది. ఈడీ కేసు నమోదు చేసిందంటే ఆ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిందితులే నిరూపించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి బ్రేక్ డౌన్ అయిపోయారనీ, అప్రూవర్ గా మారేందుకు రెడీ అయిపోయారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగడమంటే.. ఈ కేసులో నిందితులందరికీ ఉచ్చు గట్టిగానే బిగిసిందని పరిశీలకులు అంటున్నారు.   

వైసీపీ వీఐపీలతో కిక్కిరిసిపోయిన విజయవాడ జిల్లా జైలు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి గత ఎన్నికలలో అంటే 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత... కొంత కాలం రాష్ట్ర ప్రగతి, సంక్షేమం వినా మరే రాజకీయ కార్యక్రమం చేపట్టిన సర్కార్ ఇప్పుడు.. జగన్ హయాంలో జరిగిన నేరాలు, కుంభకోణాల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఎక్కడా కక్ష సాధింపు ధోరణి కనిపించడం లేదు. చేసిన తప్పులకు, నేరాలకు చట్ట ప్రకారం దర్యాప్తు, విచారణలు జరిపి కోర్టుల ద్వారానే శిక్ష పడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ ఉంది. రాష్ట్రంలో కూటమ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ కూడా తెలుగుదేశం, జనసేన శ్రేణులు జగన్ హయాంలో చెలరేగిపోయి, ఇష్టారీతిగా, తాము చట్టాలకు అతీతులమన్నట్లుగా వ్యవహరించిన వారిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తూ వచ్చాయి. వస్తున్నాయి. ఒక దశలో ప్రభుత్వం గత పాలనలో అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమార్జనకు పాల్పడిన వారి పట్ల చంద్రబాబు సర్కార్ మెతకగా వ్యవహరిస్తోందన్న అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్త మయ్యాయి. అయితే సర్కార్ మాత్రం ఎక్కడా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా చట్ట ప్రకారమే శిక్షలు, చర్యలు అంటూ వస్తున్నది. ఇప్పుడు అంటే ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి కావస్తుండగా.. వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. అది కూడా వారి నేరాలకు సంబంధించి పకడ్బందీ ఆధారాలు, సాక్ష్యాలూ సేకరించిన అనంతరం కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం జరుగుతోంది. అందులో బాగంగానే  జగన్ హయాంలో వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, జగన్ అండతో నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా చెలరేగిపోయిన అధికారుల అరెస్టులు జరుగుతున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ స్కాంల గుట్టు కూడా బయటపడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో పలు అరెస్టులు జరుగుతున్నాయి. అలా అరెస్టైన వారంతా ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక అరెస్టైన వారిలో పలువురు వైసీపీ వీఐపీలు కూడా ఉండటంతో... నెటిజనులు వైసీపీ వీఐపీలకు విజయవాడ జైలు అడ్డాగా మారిందంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. అరెస్టైన వారు సరే వారిని ములాఖత్ ద్వారా కలవడానికి కూడా వైసీపీ నేతలు క్యూకడుతుండటం వైసీపీలో వెల్లువెత్తతున్న ఆందోళనకు అద్దం పడుతోంది.   గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు   వల్లభనేని వంశీ మూడు నెలలుగా విజ యవాడ జిల్లా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులు రాజ్ కేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్, మాజీ సీఎం జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి,  భారతీ సిమెంట్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించే గోవిందప్ప బాలాజీ కూడా విజయవాడ సబ్ జైలులోనే ఉన్నారు. ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య కూడా ఇదే జైలులో  ఊచలు లెక్కిస్తున్నారు. ఇంత మంది వైసీసీలో కీలకంగా వ్యవహరించిన,వ్యవహరిస్తున్న వారు రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తుండటం, వీరిని కలిసేందుకు ములాఖత్ ల కోసం మరింత మంది క్యూ కడుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ జిల్లా జైలు పేరు మార్మోగిపోతున్నది.  

బీహార్ ఎన్నికలు.. పీకే కు పరీక్ష.. రాగాకు అగ్ని పరీక్ష!

బీహార్ శాసనసభ ఎన్నికలు వేగంగా కదులుతున్న ఋతుపవనాలను మించిన  వేగంగా తరుము కొస్తున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ సహజంగానే రాజకీయ వేడి పెరుగుతోంది. నిజానికి  ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు  కేవలం బీహార్ కు మాత్రమే పరిమితమైన ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయ గతిని మార్చివేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.  ముఖ్యంగా ఇంచుమించుగా ఒకదశాబ్ద కాలానికి పైగా దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్   స్థాపించిన జన సురాజ్ పార్టీ  కి పరీక్షగా నిలిచే ఈ ఎన్నికలు, కులగణనను రాజకీయ తారక మంత్రాన్ని నమ్ముకున్న  రాహుల్ గాంధీకి అగ్ని పరీక్షగా నిలుస్తాయని అంటున్నారు.  వివరాల్లోకి వెళితే ..  బీహార్ శాసన సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఈ సంవత్సరం చివర్లో, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికల జరగనున్న రాష్ట్రంలో అధికారాన్ని నిలుపునేందుకు బీజేపీ సారథ్యంలో ఎన్డీఎ కూటమి, అధికారాన్ని  హస్తగతం చేసుకునేందుకు  కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి. మరో వంక  ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్’ స్థాపించిన  జన సురాజ్ పార్టీ తొలి సారిగా ఎన్నికల బరిలో దిగుతోంది. సో , ఇంతవరకు రాజకీయ పార్టీలకు ఎన్నికల పాఠాలు చెప్పిన ప్రశాంత్ కిశోర్ కు ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అదలా ఉంటే..  కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  పదే పదే వల్లె వేస్తున్న,కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి తారక మంత్రంగా భావిస్తున్న కులగణన ప్రభావం జాతీయ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుంది అనేది కూడా  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుందని అంటున్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే కావడంతో  దేశ భవిష్యత్  రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా  భారత్, పాకిస్థాన్  మధ్య కుదిరిన కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ ఖాతాలో వేసుకున్నట్లుగా,కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న రాహుల్ గాంధీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్ష కాగలవని పరిశీలకులు అంటున్నారు. కాగా.. జన్‌సురాజ్ పార్టీ గత ఏడాది నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది.  నాలుగు  స్థానాలలోనూ ఓడి పోయింది. అంతే కాదు ఒక్క సీటు మినహా మిగిలిన మూడు నియోజక వర్గాల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. అయితే తొలి ప్రయత్నంలోనే పది శాతం ఓట్లు తెచ్చుకుంది. జన సురాజ్  పది శాతం ఓట్లు పట్టుకు పోవడం కమలానికి కలిసోచ్చింది. బీజేపీ తమ సిట్టింగ్ సీటు (ఇమామ్‌గంజ్)తో పాటుగా   ఇండియా కూటమి మూడు సిట్టింగ్ స్థానాలు (తరారి, రామ్‌గఢ్, బెలగంజ్) మొత్తం నాలుగు స్థానాలను గెలుచుకుంది. సో.. ఇదే లెక్క రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పనిచేస్తే..  ఎన్డీఎ గెలుపు మరింత సులువు అవుతుంది. అంతకంటే ముఖ్యంగా  రాహుల్  గాంధీ రాజకీయ భవిష్యత్   ప్రశ్నార్ధకగా  మారుతుందని అంటున్నారు.   అదలా ఉంటే, గత ఏడాది (2024) అక్టోబర్ 2న  జన్  సురాజ్  పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ఇంతవరకు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే పార్టీని ఒంటి చేతితో నడిపించారు. అయితే..  ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ,  భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. అంతే కాదు  పార్టీలో తాను ఎలాంటి పదవుల్లోనూ ఉండటం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు. దీంతో పీకే వ్యూహం ఏమిటి?  అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే..  ఎన్నికల ప్రకటన వెలువడితే గానీ, అసలు చిత్రం తెర పైకి రాదని అంటున్నారు.