కడప మహానాడు కమిటీల్లో తెలంగాణ టీడీపీ నేతలు.. సంకేతమదేనా?

తెలుగుదేశంపార్టీ  ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడులో  తెలంగాణ పార్టీ నేతలకు సముచిత స్థానం ఇచ్చింది. మహానాడు కోసం వేసిన 19 కమిటీలలోనూ తెలంగాణ తెలుగుదేశం నేతలకు స్థానం కల్పించింది. అంతే కాకుండా తెలంగాణ అంశాలపై కూడా ఈ మహానాడులో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విషయంలో  పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు.   తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, తీసుకొస్తానని చంద్రబాబు ఇప్పటికే పలు సార్లు బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉన్నప్పటికీ  పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహించే నాయకులకే కొరత ఉందన్నది తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే మహానాడులో తెలంగాణలో పార్టీ పటిష్టతపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో భాగంగానే మహానాడు కమిటీల్లో తెలంగాణ పార్టీ నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు.  మహానాడు ఆహ్వాన కమిటీలో తెలంగాణ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు,  తీర్మానాల కమిటీలో నన్నూరి నర్సిరెడ్డి, చిలువేరు కాశీనాధ్, సామ భూపాల్ రెడ్డికి స్థానం కల్పించారు. అలాగే  వసతుల కమిటీలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, సనగాల సాంబశివరావు, షేక్ అరిఫ్ లకు,  మహానాడు వేదిక కమిటీలో నందమూరి సుహాసిని, నన్నూరి నర్సిరెడ్డికి అవకాశమిచ్చారు. భోజనాల కమిటీలో కూరపాటి వెంకటేశ్వర్లు, బండి పుల్లయ్య, అజ్మీరా రాజునాయక్, జనగాం నర్సింగరావు సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియా కమిటీలో తెలంగాణ తెలుగుదేశం నేతలు తిరునగిరి జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, ప్రకాష్ రెడ్డి, ఆర్ధిక వనరుల కమిటీలో గడ్డి పద్మావతి, నెల్లూరి దుర్గాప్రసాద్ కు చోటుకల్పించారు. వీళ్ళే కాకుండా ఇంకా అనేక కమిటీల్లో తెలంగాణ నేతలకు చంద్రబాబు  అవకాశాలు కల్పించారు. అవకాశాలు కల్పించటమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మహానాడులో తీర్మానాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.   ఇప్పటికే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోను సభ్యత్వ నమోదు  కార్యక్రమం నిరాఘాటంగా జరుగుతునే ఉంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దాదాపు 4 లక్షల సభ్యత్వాలున్నాయి. కడపలో మహానాడు తర్వాత ఇక జాప్యం లేకుండా తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారంటున్నారు. తెలంగాణలో ఎంపికచేసిన    నియోజకవర్గాల్లో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి గట్టి పట్టు ఉన్న   రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో  ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఈ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిం చాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.   

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..ఎందుకో తెలుసా?

  సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు.  2023లో బేగంబజార్, నల్గొండ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో, సీఆర్పీసీ 313 ఎగ్జామినేషన్లో భాగంగా సీఎం హాజరయ్యారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది.  గత శాసన సభ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్‌ సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు.  ముఖ్యమంత్రి కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది.  

కొత్త రేషన్ కార్డుకు ఆ సర్టిఫికెట్ అవసరం లేదు : మంత్రి నాదెండ్ల

  రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. అలాగే పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో కూడా అవసరం లేదన్నారు. ఈ విషయంలో క్షేత్రస్ధాయి సిబ్బంది పొరపాట్లు చేయువద్దని ఆదేశించారు. రేషన్ కార్డుల కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా తప్పనిసరిగా స్వీకరించాలని, ఏవైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.  దరఖాస్తు అందిన 21 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి కార్డులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన 4.24 కోట్ల మందికి జూన్ నెలలో ఉచితంగా రేషన్ కార్డులు (స్మార్ట్ రైస్‌కార్డులు) జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద సిద్ధంగా ఉందని, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం సామాన్యులకు మరింత చేరువగా ఉంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రైస్‌కార్డులను అందిస్తామని, దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. ఫ్యామిలీ సభ్యుల్లో ఎవరినైనా వయసుతో నిమిత్తం లేకుండా రేషన్ కార్డులో చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి  తెలిపారు. అయితే, కార్డు నుంచి పేర్ల తొలగింపునకు మాత్రం ప్రస్తుతం మరణించిన వారి వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా, రేషన్ కార్డులో కుటుంబ పెద్ద (హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ) పేరు మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. కార్డులో నమోదైన తప్పుడు వివరాలను సరిచేసుకునేందుకు గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇకపై తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించుకునేలా సులభతరం చేశామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.

సజ్జలకూ చెరశాల?.. అటవీ భూముల కేసులో అడ్డంగా బుక్

 వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సర్వం తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కర్మఫలం అనుభవించడానికి రెడీ కాక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు పిల్ల సజ్జల జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా చేసిన నిర్వాకానికి అజ్ణాతంలో గడుపుతున్నారు. కేసుల్లో అరెస్టు బెయిలు రక్షణ ఉన్నప్పటికీ భయంతో బెంబేలెత్తుతున్నారు. నోరు విప్పి మాట్లాడడానికి జంకుతూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇక  ఇప్పుడు పెద్ద సజ్జల అదే సజ్జల రామకృష్ణారెడ్డి బూబాగోతాన్ని తేల్చేందుకు సర్కార్ సమాయత్తమైంది. తాజాగా ఆయన ఆక్రమించి అనుభవిస్తున్న 55 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  క‌డ‌ప జిల్లా సీకే దిన్నెమండ‌లం ప‌రిధిలోని అట‌వీ భూముల్లో 55 ఎక‌రాల‌ను సజ్జల ఆక్రమించి   సజ్జ‌ల ఎస్టేట్‌ నిర్మించిన‌ట్టు వచ్చిన ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.   దీంతో  క‌లెక్ట‌ర్ ఆదేశాలతో రెవెన్యూ, అట‌వీ శాఖల అధికారుల‌ బృందం స‌జ్జ‌ల ఎస్టేట్‌లో ప‌ర్య‌టించి.. నిజనిజాల నిగ్గు తేల్చింది. సజ్జల అటవీ భూముల ఆక్రమణ వాస్తవమేనని అధికారుల బృందం నివేదిక సమర్పించింది.  ఆ నివేదిక ఆధారంగా  సజ్జల ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సంబంధిత భూముల‌ను స్వాధీనం చేసుకుని.. కంచె ఏర్పాటు చేయ‌డంతోపాటు.. హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.   అయితే సజ్జల కబ్జాల పర్వం, ఆక్రమణల వ్యవహారం ఇంతటితో ఆగేది కాదు. ఆగే అవకాశమూ లేదు. ఎందుకంటే.. జగన్ హయాంలో సజ్జల కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి సజ్జలకు సహకరించిన అధకారులందరిపైనా అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా సజ్జల కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు.  ఆక్ర‌మిత భూమిలో ఉన్న చెట్ల‌ను న‌రికి వేయ‌డం.. అట‌వీ సంప‌ద‌కు న‌ష్టం క‌లిగించ‌డం పైనా ప‌రిహారం వ‌సూలు చేయడమే కాకుండా,  కేసు న‌మోదు చేసి.. జైలుకు త‌ర‌లించే అవ‌కాశం కూడా ఉంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో జగన్ హయాంలో నిబంధనలు, విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా చట్ట, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన ఘనులంతా ఇప్పుడు చట్టం ముందు దోషులుగా నిలవక తప్పదని అంటున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు, గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసు, ముంబై నటి కాదంబరి జత్మలాని కేసుల్లో పలువురు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ జాబితాలో సజ్జల కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. 

వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం

  ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. "మన ఊరు - మాటా మంతి" పేరుతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సక్రమంగా పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఇంకా వారికి ఉన్న సమస్యలపై ఆరా తీశారు.  ప్రజలు చెప్పిన సమస్యలను తెలుసుకున్న పవన్ వాటి పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమానికి హాజరైన రావివలస గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి తెలుపుకునే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. 

కిరికిరి కిష‌న్!

ఇంత‌వ‌ర‌కూ రాష్ట్రానికి ఏం చేశారో తెలీక ప‌రేషాన్  ఇప్ప‌టి వ‌ర‌కూ తెలంగాణ‌కు ఒక కేంద్ర‌మంత్రిగా కానీ, అంబ‌ర్ పేట్ ఎమ్మెల్యేగా గానీ, సికింద్ర‌బాద్ ఎంపీగా గానీ కిష‌న్ రెడ్డి ఏం చేసిన‌ట్టు? అని గూగుల్ సెర్చ్  చేస్తే.. క‌నిపించే ఒకే ఒక్క ఆన్స‌ర్.. ఆయ‌న సీతాఫ‌ల్ మండీలో ఓపెన్ చేసిన ఒకే ఒక్క లిఫ్ట్. అంత‌కు మించి మ‌రేం క‌నిపించ‌ద‌ని అంటారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్ర మంత్రిగా కిష‌న్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంట‌న్న‌ది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లు పెడితే టీపీసీసీ  చీఫ్ మ‌హేష్ గౌడ్ వ‌ర‌కూ అంద‌రూ అడిగి చూశారు. నో ఆన్స‌ర్. ఇక రాజాసింగ్ ని అడిగితే కిష‌న్ రెడ్డి కిరికిరిల‌న్నీ ఇట్టే బ‌య‌ట పెట్టేస్తారు. అధికారంలో ఎవ‌రుంటే వారితో చెలిమి చేయ‌డం కిష‌న్ రెడ్డికి కాషాయంతో పెట్టిన విద్య‌గా చెబుతాడాయ‌న‌. దీంతో ఇదో దుమారం. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాక‌పోవ‌డానికి కిష‌న్ రెడ్డి అతి పెద్ద కారణంగా చెబుతారు. మోడీ తో ఇంత సాన్నిహిత్య‌ముండి.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. ఎందుక‌లా చేస్తార‌ని అడిగితే  అదంతే. అలా ఎప్ప‌టికీ ఉండ‌దంతే అంటారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  అదేమంటే రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింద‌న్న ప్రెజంటేష‌న్లు ఇచ్చి మ‌మ అనిపించేస్తారు కిష‌న్ రెడ్డి. ఇవి కాదు మీరు మీరేం చేశారో చెప్పాల‌ని నిల‌దీస్తారు కాంగ్రెస్ లీడ‌ర్లు. మొన్న‌టికి మొన్న కాంగ్రెస్.. ఒక అఖిల ప‌క్షం వేస్తే అందుకూ డుమ్మా కొట్టారు కిష‌న్ రెడ్డి. అదేమంటే త‌న‌కు లేటుగా తెలిసింద‌ని తేల్చేశారు. ఇక‌పై ముందుగా చెప్పండి వ‌స్తాన‌ని క‌వ‌ర్ చేశారు. ఈ మేనేజ్మెంట్ మెంటాల్టీ ఆయ‌న‌కు తొలినాటి నుంచి  ఉంద‌ని అంటారు.  దీనంత‌టికీ కార‌ణ‌మేంటి? ఒక య‌డ్యూర‌ప్ప‌లా ఇక్క‌డ కూడా కిష‌న్ రెడ్డి ఎందుకు ఎద‌గ‌లేక పోతున్నారు? పార్టీని అధికారంలోకి ఎందుకు తేలేక పోతున్నారు? అని చూస్తే ఆయ‌న‌కు అధికారంలో ఉండ‌టం క‌న్నా ఇలా కేంద్రంలో ఏదో ఒక మంత్రి ప‌ద‌వితో.. రాష్ట్రంలో ఉన్నామంటే ఉన్నామ‌న్న పాత్ర పోషించ‌డ‌మే చాలా చాలా ఇష్ట‌మ‌ని అంటారు. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి గ‌త కొంత‌కాలంగా ఖాళీ ఉందిక్క‌డ‌. ఈట‌ల‌కు ఈ పోస్టు దాదాపు ఖ‌రారైతే.. మోకాల‌డ్డేసిన ఘ‌న‌త కూడా కిష‌న్ రెడ్డి పేరిటే లిఖించ‌బ‌డి ఉంద‌ని అంటున్నారు. ఒక వేళ ఈట‌ల అధ్య‌క్షుడిగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్తే అదెక్క‌డ ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించే వ‌ర‌కూ వెళ్తుందోన‌ని.. త‌న పాత బ్యాచ్ మొత్తాన్ని పోగేసి కొత్త వ్య‌క్తి అధ్య‌క్షుడు కాకుండా కిష‌న్ రెడ్డి కిరికిరి చేసిన‌ట్టు చెప్పుకుంటున్నారంతా.  గ‌తానికి వ‌ర్త‌మానానికి తేడా చూస్తే ఒక‌ప్పుడు తెలంగాణ‌ అసెంబ్లీలో ఒకే ఒక్క‌డిగా ఉన్న ఎమ్మెల్యే కాస్తా ఇప్పుడు 8 మంది వ‌ర‌కూ చేరింది. ఎంపీల సంఖ్య కూడా 8కి చేరింది. మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ రాణింపు. ఇక గ్రేట‌ర్ లో బండి హ‌యాంలో 4 నుంచి సుమారు 50 వ‌ర‌కూ చేరింది. కానీ వీరిలో ఏ ఒక్క‌రిలోనూ మ‌రొక‌రికి స‌ఖ్య‌త ఉండ‌దు. పాత కొత్త బ్యాచ్ లు వేరు వేరు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీల గ్రూపులు వేరు వేరు. ఇలా ర‌క‌ర‌కాల గ్రూపులుగా పార్టీ త‌యార‌య్యి.. అదో క‌ప్ప‌ల త‌క్కెడ‌గా మారింద‌ని స‌మాచారం. దీనంత‌టికీ కార‌ణం కిష‌న్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్ వంటి వారు. ఇక్క‌డ కూడా ఏపీలా ఒక కూట‌మి క‌ట్టి.. ఎలాగైనా అధికారంలోకి రావ‌చ్చ‌ని భావిస్తుంటే.. అందుకు మోకాల‌డ్డుతున్న‌ది కూడా కిష‌న్ రెడ్డేనంటారు. కార‌ణం ఇప్ప‌టికే అక్క‌డ త‌మ జ‌గ‌న్ రెడ్డిని ఓడించిన కూట‌మి అంటేనే కిష‌న్ రెడ్డి కి కోపం చిరాకు. అలాంటి కూట‌మితో ఇక్క‌డా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మా? న‌థింగ్ డూయింట్ అంటున్నార‌ట కిష‌న్ రెడ్డి. అదేమంటే రేవంత్ రెడ్డి.. టీడీపీ- బీజేపీ- జ‌న‌సేన కూట‌మిక‌ట్ట‌డాన్ని అడ్డుకుంటున్న‌ట్టు ఒక రూమ‌ర్ వ‌దిలి... నిందంతా ఆయ‌న‌పైకి తోసేస్తున్నార‌ట కిష‌న్ రెడ్డి.  అంటే రాష్ట్రంలో పార్టీ దానంత‌ట అది మోడీ హ‌వాలో ఓట్లు, సీట్లు సాధించ‌డం త‌ప్ప‌.. ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం.. అధ్య‌క్ష స్థాయిలో చేసిన కృషిని అనుస‌రించి తెచ్చిన విజ‌యం కిష‌న్ రెడ్డి పేరిట ఒక్క‌టీ ఉండ‌ద‌ని అంటారు.. కాల‌సాపేక్ష సిద్దాంతం.. అంటే పార్టీలో అధిక కాలం ఉండ‌టం వ‌ల్ల వ‌చ్చే ప‌ద‌వుల‌ను అనుభ‌వించి అక్క‌డితో ముగిద్దాం అన్న ధోర‌ణి త‌ప్ప‌.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావ‌డాన్ని కిష‌న్ రెడ్డి పెద్ద‌గా ఆస్వాదించ‌ర‌ని తెలుస్తోంది. కార‌ణం అదే ఇత‌ర పార్టీలు అధికారంలో ఉంటే వారితో లాలూచీ ప‌డి.. అడ్డంగా సంపాదించుకోవ‌చ్చు. ఎవ‌రూ అడిగే వారుండ‌రు. ఒక వేళ త‌మ పార్టీ స్వ‌యానా అధికారంలో ఉంటే ఫోక‌స్ అంతా మ‌న మీదే ఉంటుంది కాబ‌ట్టి.. ఆ ఊసే వ‌ద్ద‌ని అంటార‌ట కిష‌న్ రెడ్డి. అలాంటి అవ‌కాశం ఇత‌రుల‌కు వ‌చ్చినా.. దాన్ని త‌న‌కున్న పాత ప‌రిచ‌యాల‌తో ఎలాగోలా మేనేజ్ చేసి చెక్ పెట్ట‌డంలో ఆరితేరిన నిపుణుడట కిష‌న్ రెడ్డి. త‌న మొత్తం కెరీర్ లో కిష‌న్ రెడ్డి నేర్చుకున్న విద్యే ఇదేన‌ట‌. పార్టీని అధికారంలోకి తెస్తే ఎంత? తేకుంటే ఎంత‌? అదే ఎవ‌రు అధికారంలో ఉంటే వారితో కుమ్మ‌క్కై నాలుగు రాళ్లు వెన‌కేసుకోక ఏంటీ చాద‌స్త‌మ‌ని మొహం మీదే అడిగేస్తార‌ట‌ కిష‌న్ రెడ్డి.  కిష‌న్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఏదైనా ఉందంటే అది ఇదేనంటారు. గ‌తంలో ఇటు కేసీఆర్, అటు జ‌గ‌న్ తో బాగా ద‌గ్గ‌ర‌య్యి.. వారి ద్వారా కావ‌ల్సినంత వెన‌కేశార‌ట కిష‌న్ రెడ్డి. అందుకే ఈ సారికి పార్టీ నుంచి పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న ఉండ‌కూడ‌ద‌ని చెప్పి పైన త‌నకున్న‌ ప‌లుకుబ‌డితో అధ్య‌క్ష ప‌ద‌వి సాధించార‌ట‌. అప్పుడే అనుకున్నారంతా.. ఈ సారి ఎన్నిక‌లకు కిష‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌లో వెళ్ల‌డం అంటే అది ఓట‌మిని కొని తెచ్చుకోవ‌డ‌మ‌ని.  ఇలా కిష‌న్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయ‌క‌, పార్టీకి ఏం చేయ‌క‌.. అధికారంలోకి తెచ్చే దారిలేక‌.. ఎవ‌రైనా ఆ ప్ర‌య‌త్నం చేస్తుంటే చూస్తూ ఓర్చుకోలేక.. ఒకరంగా సైంధ‌వుడి పాత్ర పోషిస్తున్న‌ట్టుగా మాట్లాడుకుంటున్నారు పార్టీలో.. అందుకే ఆయ‌న‌కు కిరికిరి కిష‌న్ రెడ్డి అని పేరుపెట్టుకుని.. త‌మ అక్క‌సు మొత్తం తీర్చుకుంటున్నార‌ట రాజాసింగ్ లాంటి కొంద‌రు. మ‌రి చూడాలి త‌న‌పై వ‌స్తున్న ఈ ఆరోప‌ణ‌ల‌కు కిష‌న్ రెడ్డి ఎలాంటి స‌మాధానం ఇస్తారో. తెలాల్సి ఉంది.

ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్..ఎందుకంటే?

  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై  సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ  రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ సర్వోత్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని జస్టిస్ గవాయి మండిపడ్డారు. ప్రభుత్వ మార్కెటింగ్ కార్పొరేషన్ సంస్థపై ఈడీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి, ఒక ప్రభుత్వ సంస్థను దోషిగా ఎలా చిత్రీకరిస్తారంటూ ఈడీని నిలదీసింది. తమిళనాడులోని సర్కారు లిక్కర్ షాపులపై ఈడీ చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు గ్రహం వ్యక్తం చేసింది.  మద్యం రవాణా, బార్ లైసెన్సుల మంజూరు, బాటిల్ తయారీ సంస్థలు మరియు డిస్టిలరీలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం ద్వారా లెక్కల్లో చూపని నగదును ఆర్జించారన్న ఆరోపణలపై ఈడీ మార్చిలోనూ, గత వారంలోనూ తమిళనాడులోని ప్రభుత్వ లిక్కర్ షాపులపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల సమయంలో అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిలోని డేటాను క్లోన్ చేశారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, "మీరు వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు... కానీ కార్పొరేషన్లపైన ఎలా చేస్తారు? మీ ఈడీ అన్ని హద్దులూ మీరుతోంది!" అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.

తండ్రి పోలీసు, కొడుకు టెర్రరిస్టు .. ఫ్యామిలీ ప్యాకేజ్‌పై డౌట్లు

విజయనగరం టెర్రర్‌ మాడ్యూల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్‌ కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఒక్కసారిగా కేసులో క్లారిటీ వస్తోంది. సిరాజ్ , హైదరాబాద్‌కు చెందిన సమీర్, వరంగల్‌కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్‌తో కలిసి ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.  జకీర్ నాయక్, ఇస్రార్‌ అహ్మద్‌, షేక్ యాకుబ్ జమాలి, షేక్ జావిద్ రబ్బాని ప్రసంగాలతో ప్రభావితమైన ఈ గ్రూప్.. ఏకంగా అల్ హింద్ ఇతహదుల్ ముస్లిమీన్.. అంటే అహిం పేరుతో ఓ రాడికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌ ను దేశవ్యాప్తంగా విస్తరించి.. యువతను మతోన్మాదంవైపు ఆకర్షించాలనేది వీరి ప్లాన్ అన్నది కన్ఫెషన్ రిపోర్ట్ లో తేలిన విషయం. ఇదే కాన్సెప్ట్‌తో ముంబైలోని మత కార్యక్రమంలో పాల్గొన్నాడు సిరాజ్. అక్కడ మరి కొంత మందితో పరిచయం పెంచుకున్నాడు.  ఆ తర్వాత వీరికి సౌదీ నుంచి ఆదేశాలు రావడం ప్రారంభమైంది. బీహార్ నుంచి సౌదీకి వెళ్లి అక్కడే ఉంటున్న అబు ముసాబ్‌ సూచనలతో యాక్షన్ ప్లాన్ కు రెడీ అయ్యారు. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. అబు సూచనలతో తక్కువ ఖర్చుతో ఐఈడీ బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యామని సిరాజ్‌ చెబుతున్నాడు. బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు వీరికి ఒమన్ నుంచి అందాయని తేలింది. ఒమన్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్‌ ఖాన్ ఈ డబ్బును పంపాడని పోలీసులు గుర్తించారు. బాంబుల తయారీకి ఆన్‌లైన్‌లో అమోనియం నైట్రేట్‌, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను కొనుగోలు చేసింది సిరాజ్ టీమ్. ఇవన్నీ కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు.. స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేశారు. దీపావళి టపాసుల మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు.  విజయనగరంలో రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చడానికి సిరాజ్ కుట్ర పన్నాడు. అయితే పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్‌ అయ్యాడు. అతని బైక్ హ్యాండిల్‌కు ఉన్న సంచిలో నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ మ్యాటర్ మొత్తం బయటికొచ్చింది. వీరంతా నిత్యం టచ్‌లో ఉండేందుకు సిగ్నల్ యాప్‌ వాడారు. సిగ్నల్‌ యాప్‌లో సిరాజ్-సమీర్ మధ్య చాటింగ్‌ జరిగింది. బాంబుల తయారీ, పేలుళ్ల గురించి డిస్కషన్ చేసుకున్నారు. వీరికి డబ్బులు అందితే ఓ స్కూల్ పెట్టి అందులోని కెమికల్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేయొచ్చంటూ చాటింగ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను టార్గెట్ చేద్దామంటూ డిస్కషన్ చేసుకున్నారు. ఒక రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలో తెలిసిందంటూ మాట్లాడుకున్నారు.  వీటికి తోడు సిరాజ్‌కు విజయనగరం సహకార బ్యాంక్‌ అకౌంట్‌లో 42 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. సహకారబ్యాంక్ అకౌంట్‌లో అంత డబ్బు ఎలా వచ్చింది..? అనేది తేలాల్సి ఉంది. సిరాజ్ అరెస్టయ్యాక డీసీసీబీ బ్యాంక్‌లో సిరాజ్‌కున్న లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు అతడి తండ్రి రెహ్మాన్. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే రెహ్మాన్ ముందు సివిల్ డ్రెస్‌లో, తర్వాత యూనిఫామ్‌లో బ్యాంక్‌కు వెళ్లి లాకర్‌ ఓపెన్ చేయడానికి బ్యాంకు సిబ్బందిపై  ఒత్తడి తెచ్చాడు. ఎన్ఐఏ అధికారులు ముందుగానే అలర్ట్ చేయడంతో రెహ్మాన్‌ను అనుమతించలేదు బ్యాంక్ సిబ్బంది. సిరాజ్ లాకర్‌ను ఆయన తండ్రి ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడు..? అన్ని లక్షలు అకౌంట్ లో ఉంటే, అవి ఎలా వచ్చాయని తండ్రి ఎందుకు అడగలేదు? ఇదంతా ముందే తెలుసా..?  ఇలాంటి డౌట్లు తెరపైకి వస్తున్నాయి. అన్ని విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అటు సిరాజ్ బాంబ్ పేల్చాలనుకున్న ప్లేసుల్లో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్ చేసింది.

ఆ నవ్వుకి అర్ధం ఏమిటి?

అరెస్టు చేయడానికి వచ్చినపుడు బయట పోలీసుల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అది చూసి నిందితుడు రెచ్చిపోయి, ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాడు.  అరెస్టు చేసి సెల్ లో వేశాకా, పోలీస్ మర్యాద మరో రకంగా ఉంటుంది. చిల్లర దొంగతనాలు చేసి తరచూ జైలుకెళ్ళే వారికి ఆ తేడా తెలుసు కానీ, ఇటీవల బడా రాజకీయా నాయకులు అరెస్టుల క్యూ పెరిగాక, లాకప్ లు, జైలు గదులు నిండపోయాక వారి ప్రవర్తనలోనూ వింత మార్పులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో వైసీపీ అధినేత జగన్ ను అరెస్టు చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనలో ఆందోళన మొదలైనట్లుంది. గత నాలుగు రోజులుగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరినీ వదిలిపెట్టం. రాసి పెట్టుకోండంటున్నారు. మొన్నటి వరకూ బట్టలూడదీస్తాం అని చెబుతున్న నేపథ్యంలోనే ఆయన సహచర, అనుచరగణం ఒక్కొక్కరూ అరెస్టై జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అయినా ఆయన రంకెలు తగ్గలేదు.  ఇదే విషయాన్ని తాజాగా  ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని ఒక మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తే.. ఆయన ఆసాంతం విని పకపకా నవ్వారు. అంతే తప్ప కామెంట్ చేయలేదు. దాంతో ఆయన నవ్వుకి అర్ధం ఏమిటి అని వెతుక్కోవలసిన పనిలో పడ్డారు పాత్రికేయులు. రేపో మాపో ఆయన కూడా అరెస్టయ్యేవాడేననీ, దానికే రంకెలు వేస్తున్నాడనీ అర్ధం కాబోలు అనుకుంటూ పాత్రికేయులు చర్చించుకుంటున్నారు. జగన్ జైలు కెళితే లెక్కలు రాసుకుని ఉపయోగం ఏమిటి?  ఈ కేడర్ తర్వాత కూడా ఆయన వెంటే ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

అరకు ఫ్యాన్ పార్టీలో వర్గ పోరు?

క్యాడర్ కకావికలు! సిట్టింగ్ స్థానంలోనూ ఉనికి గాయబ్? చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా గత ఎన్నికలలో   ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా..  అరకు పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఆ విజయం సాధించిన స్థానాలలో సైతం ఫ్యాన్ పార్టీ వర్గపోరుతో ప్రతిష్ఠను దిగజార్చుకుని పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మన్యం ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నది  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.   ఈ పరిస్థితుల్లో గిరిజన ప్రాంతమైన పాడేరు, అరకు నియోజకవర్గాలలో ఫ్యాన్ పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి అంతర్గత కుమ్ములాటలతో తమ పరువు తీసుకోవడమే కాకుండా కార్యకర్తలనూ పార్టీకి దూరం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు... అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం లకు వారి పార్టీ అధికారంలో లేకపోవడంతో  సహజంగానే  పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది.  ఈ దశలో ఫ్యాన్ పార్టీ నాయకులు ఉమ్మడిగా పని చేయాలి. అయితే  వర్గపోరుతో వారి ప్రాధాన్యతను వారే మరింతగా తగ్గించుకుని పరువుపోగొట్టుకుంటున్నారు.   వైసీపీకి మొదటి నుంచి అరకు ఏజెన్సీలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వర్గం, మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ వర్గం మధ్య ఆధిపత్య పోరు ఉంది. దానికి తోడు  ఇప్పుడు ఎమ్మెల్యే మత్స్యలింగం వర్గం తయా రయింది ఈ దశలో ఏ నాయకుని వెంట వెళ్తే మరొకరి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అని కార్యకర్తలు భయపడుతున్నారు. ఇప్పటికే జడ్పిటిసిలు ఆటో కాలు ఇటో కాలు అన్నట్టు వ్యవహ రిస్తున్నారు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ పై గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న నిరసనలను అవకాశంగా మలచుకోవలసిన వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారేగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కుంభారవిబాబు మరోవైపు చెట్టి ఫల్గుణ ఇంకోవైపు మత్స్య లింగం వర్గాలు  మన్యంలో వైసీపీ పార్టీని మూడుముక్కులుగా చేసి ఆడుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ మూడు వర్గాల మధ్యా ఆధిపత్య పోరులో పార్టీ క్యాడర్ నలిగిపోతున్నదనీ, దీంతో క్యాడర్ పార్టీ కార్యక్రమాలంటేనే ముఖం చాటేస్తోందనీ చెబుతున్నారు.  అధికారంలోలేని పార్టీ నాయకులు వర్గపోరుతో పార్టీని మరింత నిర్వీర్యం చేస్తుంటే.. అధికార తెలుగుదేశం కూటమి నేతలు మాత్రం ప్రజలకు చేరువై, వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారి ఆదరణ చూరగొంటున్నారు.దీంతో అరకు లోయలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారైందంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అరకు లోయలో  వైసీపీ జెండా మోయడానికి  కార్యకర్తలే కరవయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెబు తున్నారు. 

ల‌ష్క‌రే నేత‌ సైఫుల్లా ఖ‌లీద్ హ‌తం..మ‌రో ఎల్ఈటీ లీడ‌ర్ అమీర్ హంజాకి గాయం

వీటి వెన‌క తాలిబ‌న్ల హ‌స్త‌ముందా? సీఐఏ మాజీ ఏజెంట్ సారా ఆడ‌మ్స్ మాట‌ల‌ను బ‌ట్టీ మ‌న‌కేం తెలుస్తోంది? ఏడాది కిందట   సీఐఏ మాజీ ఏజంట్ సారా ఆడ‌మ్స్ ఒక  ఒక టాక్ షోలో . పాకిస్థాన్ లోని టెర్ర‌రిస్టులే టార్గెట్ గా భార‌త్ ఒక ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌బోతోంది. ఈ ఆప‌రేష‌న్ కి తాలిబ‌న్ల‌ను వినియోగించ‌నుంద‌ని అన్నారు. ఆర్ యూ సీరియ‌స్? అంటూ ఆ ఇంట‌ర్వ్యూయ‌ర్ ఆమెను అడ‌గ‌టం. ఆమె అవును నిజ‌మ‌ని చెప్ప‌డం జ‌రిగింది. అక్క‌డ క‌ట్ చేస్తే.. మొన్న సింధ్ ప్రావిన్స్ లోని మ‌ట్లీ ప‌ట్ట‌ణంలో త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కొచ్చిన సైఫుల్లా ఖ‌లీద్ అనే ల‌ష్క‌రే తోయిబాకు చెందిన అగ్ర‌నాయ‌కుడ్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌ల, గుండెల‌పై కాల్చి ప‌రార‌య్యారు. దీంతో ఖ‌లీద్ స్పాట్ డెడ్ అయ్యాడు. ఎవ‌రీ ఖ‌లీద్ అని చూస్తే 2000లో నేపాల్ మాడ్యుల్ హెడ్, 2005 బెంగ‌ళూరు అటాక్, 2006 నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్ట‌ర్స్ పై దాడి,  2008 యూపీ  రాంపూర్ ఇలా వ‌రుసగా జరిగిన ల‌ష్క‌రే ఆప‌రేష‌న్స్ క‌మాండ‌ర్. తాజాగా అత‌డు సింధ్ ప్రాంతంలోని ల‌ష్క‌రే ఆప‌రేష‌న్స్ కి హెడ్ గా హ‌ఫీజ్ స‌యీద్ ద్వారా నియ‌మితుడయ్యాడు. అత‌డీ ఆప‌రేష‌న్స్ లో ఉండ‌గా.. కాల్పులు జ‌ర‌గ‌టం, అత‌డు ఖ‌తం కావ‌డం చ‌క‌చ‌క  జ‌రిగిపోయాయి. తాజాగా అమీర్ హంజా అనే మ‌రో ల‌ష్క‌రే వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడి ఇంట్లో కాల్పులు జ‌ర‌గ్గా.. అత‌డికి గాయాల‌య్యాయి. దీంతో లాహోర్ ఆస్ప‌త్రిలో చేరాడు అమీర్ హంజా. ఇత‌డిది ఎలాంటి పాత్ర అంటే ల‌ష్క‌రే వ్య‌వ‌స్థాప‌క స‌భ్యులు 17 మంది ఉండ‌గా.. వారిలో చీఫ్ హ‌ఫీజ్ కి అత్యంత స‌న్నిహితుల్లోని ఒక‌రిద్ద‌రిలో ఇత‌డు కూడా ఒక‌డు. ఇత‌డు ఉద్వేగ‌భ‌రిత ప్ర‌సంగాల‌కు..  ఉత్తేజ‌పూరిత‌మైన ర‌చ‌న‌ల‌కు పెట్టింది పేరు. మ‌త‌మార్పిడిపై ఇత‌డు రాసిన  పుస్తకం ఒక‌ సంచ‌ల‌నం. ఐక్య‌రాజ్య స‌మితి గుర్తించిన అంత‌ర్జాతీయ ఉద్ర‌వాదుల్లో ఇత‌డు కూడా ఒక‌డు. అలాంటి వ్య‌క్తి రేపు మ‌ర‌ణిస్తే హ‌ఫీజ్ స‌యీద్ కి మ‌రింత పెద్ద ఎత్తున దెబ్బ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే మొన్న‌టి ఆప‌రేష‌న‌న్ సిందూర్ ద్వారా ముజ‌ఫ‌రాబాద్ లో ల‌ష్క‌రే శిబిరం ధ్వంస‌మైంది. ఇందులో హ‌ఫీజ్ స‌యీద్ కొడుకు త‌ల్హా స‌యీద్ అత‌డి ఐదుగురు క‌మాండ‌ర్లు హ‌త‌మయిన‌ట్టు వార్త‌లొచ్చాయ్. వీరితో పాటు మ‌రో ఐదుగురు ఉగ్ర‌వాదులు హతమయ్యారన్న రిపోర్టులొచ్చాయి. వీరిలో ముగ్గురు ల‌ష్క‌రే నాయ‌కులున్నారు. ఒక ద‌శ‌లో హ‌ఫీజ్ స‌యీద్ సైతం చ‌నిపోయాడ‌న్న క‌థ‌నాలు వెలువ‌డ్డాయ్. అయితే ఈ దిశ‌గా అధికారిక ప్ర‌క‌ట‌న‌లేవీ లేవు. మొత్తంగా ల‌ష్క‌రేకి ఆప‌రేష‌న్ సిందూర్ తోనే పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగింది.  తాజాగా కాల్పుల ఘ‌ట‌న‌లో ఖ‌లీద్ చ‌నిపోవ‌డం, అమీర్ హంజా ఆస్ప‌త్రిపాలుకావ‌డంతో.. ఆప‌రేష‌న్ ఎల్ఈటీ ఏదైనా న‌డుస్తోందా? అంటే అందుకు సారా ఆడమ్స్ ఏడాది కిందట చేసిన వ్యాఖ్యల  పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఔనని చెప్పక తప్పదు.  భార‌త్, ఆఫ్గ‌న్ మ‌ధ్య ఇటీవ‌లి కాలంలో సంబంధాలు బాగా మెరుగ‌య్యాయి. గ‌త ఏడాదికాలంగా ఖైబ‌ర్ పంక్తుక్వా స‌రిహ‌ద్దు ప్రాంత విష‌యంలో పాకిస్తాన్- ఆఫ్గ‌నిస్తాన్ దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క‌ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. దానికి తోడు భారీ ఎత్తున ఆఫ్గ‌న్ శ‌ర‌ణార్దుల‌ను పాకిస్థాన్ ఇర‌కాటంలో పెట్టింది. దీంతో ఆఫ్గ‌నిస్థాన్ లోని తాలిబాన్ ప్ర‌భుత్వం పాకిస్థాన్ అంటేనే మండిప‌డుతోంది. గ‌తంలో తాలిబాన్లు ఆఫ్గ‌నిస్తాన్ ని ఆక్ర‌మించుకున్న‌పుడు పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ తో స‌హా.. చాలా మంది కాబూల్ చేరి.. అక్క‌డ సంబ‌రాలు చేసుకున్నారు. ఆనాటి వాతావ‌ర‌ణం ప్ర‌స్తుతం ఈ రెండు దేశాల మ‌ధ్య ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.  ఇక్క‌డ మోడీ ఒక ప‌క్క ప‌హెల్గాం దాడి ప్రతీకారం తీర్చుకునే దిశ‌గా సైన్యానికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ‌నిస్తూనే మ‌రొక ప‌క్క ఆఫ్గాన్ త‌లుపు త‌ట్టారు. మోడీ నుంచి పెద్ద ఎత్తున దాడి జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌ని భావించిన పాక్ త‌న ఉగ్ర‌వాదుల‌ను బంక‌ర్ల‌లోకి  పంప‌డం, త‌న ద‌ళాల‌ను స‌రిహ‌ద్దుల‌కు త‌ర‌లించ‌డంలో బిజీగా ఉంటే మ‌న భార‌త ప్ర‌తినిథి తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాకిని క‌లిశారు. ఈ దిశ‌గా మాకు మీ స‌హాయ స‌హ‌కారాలు కావాల‌ని కోరారు.  అప్ప‌టికే ఆఫ్గ‌నిస్థాన్ ప్రభుత్వ ప్ర‌తినిథి ప‌హల్గాం దాడిని ఖండించారు.  బాధిత కుటుంబాలకు మా సానుభూతి ప్రకటించారు.  ఈ క్ర‌మంలో భార‌త్- ఆఫ్గాన్ సంబంధాలు మెరుగుప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో పాక్- ఆఫ్గ‌న్ సంబంధ బాంధ‌వ్యాలు క్షీణిస్తున్నాయి. ఇటు భార‌త్ తో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న తాలిబాన్లు.. అటు బ‌లూచిస్తాన్ లిబ‌రేష్ ఆర్మీకి కూడా త‌మ స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తూ పాకిస్థాన్ని తీవ్ర ఇర‌కాటంలో పెడుతున్నారు. పాకిస్థాన్- చైనాతో చెలిమి చేస్తుంటే భార‌త్- ఆఫ్గ‌న్ తో స్నేహానికి సై అంటోంది. దీని ద్వారా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోన ఉగ్ర‌వాదుల పీచ‌మ‌ణ‌చ‌డానికి స‌రికొత్త ఆప‌రేష‌న్ కి తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. ఆప‌రేషన్ సిందూర్ ఆగ‌దు అంటే ఇదే మ‌రి అంటున్నారు పరిశీలకులు.   తాలిబాన్ల సాయంతో  ఆపరేషన్ సిందూర్ నిరంత‌రాయంగా కొనసాగుతుందనీ, ఉగ్ర‌వాదుల ఊచ‌కోత చేస్తూనే వెళ్తుంద‌ని.. సీఐఏ స్థాయి వ్య‌క్తులు అన్న మాట‌ల‌కు అస‌లైన అర్ధం నిర్వ‌చ‌నం ఇదేనంటున్నారు దౌత్య వ్య‌వ‌హారాల  నిపుణులు.

నంబాల కేశ‌వ‌రావు తర్వాత మావోయిస్టు పార్టీకి ఆ స్థాయి నాకయత్వం ఏదీ?

ఉద్య‌మంలోకి కొత్త ర‌క్తం రావ‌డం లేదు ఎందుకు?  2026 మార్చ్ 31 నాటికిన‌క్స‌ల్  విముక్త దేశంగా ఇండియా?   నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజ్ అలియాస్ గంగ‌న్న, విన‌య్, విజ‌య్, కృష్ణ, న‌ర‌సింహా.. ఇలా ప‌లు పేర్ల‌తో పిలిచే ఈ  న‌క్స‌లైట్ నాయ‌కుడి మ‌ర‌ణం అతి పెద్ద విజ‌యంగా భావిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. హోం మంత్రి అమిత్ షా అయితే అమితానందం వ్య‌క్తం చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్థాయి వ్య‌క్తి భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో హ‌త‌మార్చ‌డం ఇదే తొలిసారి అంటూ అమిత్ షా చేసి ట్వీట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ప్ర‌ధాని మోడీ అయితే.. భార‌త ద‌ళాలు సాధించిన గొప్ప విజ‌యంగా దీనిని అభివ‌ర్ణించారు. ఇక నెక్స్ట్ ఎవ‌రు? అంత భారీ స్థాయిలో ఉద్య‌మాన్ని  న‌డిపేవారెవ‌రు? అలాంటి అవ‌కాశ‌మే లేదా? గ‌ణ‌ప‌తి రాజీనామా చేశాక‌.. కేశ‌వ‌రావు చేతుల్లోకి వ‌చ్చింది మావోయిస్టు పార్టీ. ప‌దేళ్ల పాటు త‌న‌దైన మిల‌ట‌రీ ఆప‌రేష‌న్ బ‌లంతో ఎన్నో విధ్వంసాలు సృష్టించాడు కేశ‌వ‌రావు. చంద్ర‌బాబు అలిపిరి బ్లాస్టింగ్ లోనూ కీల‌క పాత్ర‌. స‌ల్వాజుడం సృష్టిక‌ర్త మ‌హేంద్ర‌క‌ర్మ మ‌ర‌ణంలోనూ సూత్ర‌ధారి కేశ‌వ‌రావే. ఇంకా ఎన్నో ఆప‌రేష‌న్స్ లో భ‌ద్ర‌తాద‌ళాల‌ను హ‌త‌మ‌ర్చిన వాడు. ఒక్క‌సారి కేశ‌వ‌రావు స్కెచ్ వేస్తే ఎంత‌టి సాయుధ ద‌ళాలైనా ఆ ఉచ్చులో చిక్కాల్సిందే. అంత ప‌క‌డ్బందీగా  ఆప‌రేష‌న్ ఫిక్స్ చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు కేశ‌వ‌రావు. సిక్కోలు జిల్లాలో 1955లో పుట్టిన కేశ‌వ‌రావు,  ప్రాధ‌మిక విద్యాభ్యాస‌మంతా స్వ‌స్థ‌లంలోనే జ‌రిగింది. ఇక ఇంట‌ర్, డిగ్రీ ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే జ‌రిగినా.. ఆయ‌న న‌క్స‌ల్ బ‌రీ ఉద్య‌మాల ప‌ట్ల ఆక‌ర్షితులైంది మాత్రం ఆర్ఈసీ వ‌రంగ‌ల్ లో బీటెక్ చ‌దువుతుండ‌గా. ఎంటెక్ మ‌ధ్య‌లోనే ఆపేసి.. అడ‌వి బాట ప‌ట్టారు కేశ‌వ్ రావు.  త‌ర్వాతి కాలంలో ఆయ‌న చేసిన విధ్వంసాల‌కు ఒక అంతు లేదు. ఇటు నిధుల సేక‌ర‌ణ‌, అటు నియామ‌కాలు, ఆపై ఆయుధ వ్యాపారుల‌తో స‌త్సంబంధాలు.. ఇలా ప‌లు కోణాల్లో పార్టీకి త‌న సేవ‌లందించారు. దీంతో న‌క్స‌లైట్ అగ్ర‌నాయ‌కుడి స్థాయికి ఎదిగారు. ఒక స‌మ‌యంలో పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన‌ కేశ‌వ‌రావు మృతితో దాదాపు ఒక శ‌కం, ఒక త‌రం అంత‌రించి పోయినట్లే.  ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ క‌గార్, బ్లాక్ ఫారెస్ట్, క‌ర్రెగుట్ట‌లు అంటూ జ‌రుగుతోన్న వీటి ద్వారా.. పెద్ద సంఖ్యలో న‌క్స‌లైట్లు హ‌త‌మ‌వుతున్నారు. లొంగుబాటు కూడా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.  2014 నాటికీ ఇప్ప‌టికీ చూస్తే న‌క్స‌లైట్ ప్ర‌భావిత ప్రాంతాలు, జిల్లాల సంఖ్య బాగా త‌గ్గింది. ఒక‌ప్ప‌ట్లో న‌క్స‌లైట్ ఘ‌ట‌న‌ల ద్వారా భ‌ద్ర‌తా  ద‌ళాల‌కు భారీ  ఎత్తున న‌ష్టం సంభ‌వించేది. అదే ఇప్పుడు భ‌ద్ర‌తా ద‌ళాల కార‌ణంగా న‌క్స‌లైట్ల‌కు పెద్ద ఎత్తున న‌ష్టం సంభ‌విస్తోంది.  మొన్న 20 రోజుల పాటు జ‌రిగిన ఆప‌రేష‌న్ క‌ర్రెగుట్ట‌ల్లో 31 మంది, ఇప్పుడు అబూజ్ మ‌డ్ అడ‌వుల్లో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్లో 27 మంది చ‌నిపోగా.. వారిలో నంబాల కేశ‌వ‌రావు వంటి అగ్ర నేత‌ల మ‌ర‌ణం ఉద్య‌మానికి తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింది. ప్ర‌స్తుతం మావోయిస్టు పార్టీకి అంటూ ఒక అగ్ర‌నేత అంటూ లేకుండా పోయాడు. ఒక‌ప్పుడు అంటే 2004లో వైయ‌స్ హ‌యాంలో హైద‌రాబాద్ లో జ‌రిగిన న‌క్స‌ల్స్ చ‌ర్చ‌ల స‌మ‌యంలో అన్ని న‌క్స‌ల్  పార్టీ లు విలీన‌మై సీపీఐ- మావోయిస్టు పార్టీ ఆవిర్భ‌వించింది. అప్ప‌ట్లో పొలిట్ బ్యూరో, కేంద్ర క‌మిటీలో ఏపీ,  తెలంగాణ నుంచి సుమారు 12 మందితో అత్యంత బ‌లంగా క‌నిపించింది మావోయిస్టు పార్టీ. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో తెలుగువారి ప్ర‌భ క్ర‌మేణా త‌గ్గుతూ వ‌స్తోంది. దీనంత‌టికీ కార‌ణం.. వ‌యోభారం, కొత్త ర‌క్తం  రాక‌పోవ‌డం.. కొంద‌రు ఎన్ కౌంట‌ర్ల‌లో హతమవ్వడం అంటున్నారు. నంబాల కేశ‌వ‌రావు వ‌య‌సు 70, గ‌ణ‌ప‌తి వ‌య‌సు 76, మ‌రి కొంద‌రి నేత‌లు సైతం అర‌వై- డెబ్భై ఏళ్ల మ‌ధ్య   వారే. వీరంద‌రూ హ‌త‌మ‌వుతున్న వేళ‌, క‌నుమ‌రుగ‌వుతున్న కార‌ణాన‌.. కొత్త ర‌క్తం పుట్టుకు రావ‌డ‌మే లేదు.   భ‌ద్ర‌తా ద‌ళాలు విస్తృతంగా చేస్తున్న కూంబింగ్ ఆప‌రేష‌న్ల కార‌ణంగా ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి త‌ర‌లి పోవ‌డానికే స‌రిపోవడమే పార్టీ కొత్త రిక్రూట్ మెంట్లపై దృష్టి సారించలేకపోవడానికి కారణంగా చెబుతున్నారు. సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల దాచుకోడానికే ఎక్కువ స‌మ‌యం వెచ్చించాల్సి వ‌స్తోంది.   ఇక సానుభూతి ప‌రుల‌ను ఆక‌ర్షించేలాంటి శిక్ష‌ణా త‌ర‌గ‌తుల నిర్వహణకు అవకాశం ఎక్కడ? అన్నట్లుగా పరిస్థితి మారింది.  కాలేజీ స్థాయిలో ఆనాటి రాడిక‌ల్ మూమెంట్స్ ఇప్పుడు లేవు. కేశ‌వ‌రావు హ‌యాం కాలం నాటి  చ‌దువుకున్న యువ‌త ఇప్పుడు మ‌చ్చుకైనా  ఉద్య‌మంలో క‌నిపించ‌డం లేదు.  మారిన కాల‌మాన ప‌రిస్థితుల రీత్యా.. ఉద్య‌మంలోకి వ‌స్తున్న వారే లేకుండా  పోయారు. కార‌ణం గ్లోబ‌లైజేష‌న్- స్టార్ట‌ప్ క‌ల్చ‌ర్- ల్యాప్ టాపే ఆపీసుగా డాల‌ర్ల సంపాద‌న వంటి వాటితో యువ‌త ఆలోచ‌నా ధోర‌ణి  పూర్తిగా మారిపోయింది.  అప్ప‌ట్లో వంద‌కు ప‌ది మంది యువ‌కులలో విప్ల‌వ భావ‌జాలాలుండేవి. వాటి ప‌ట్ల ప్రాణాలిచ్చేంత‌గా ప్యాష‌నుండేది. అదే ఇప్పుడు.. సాఫ్ట్ వేర్ వ‌చ్చాక‌,  ఈ దేశంలో  కూర్చుని మ‌రో దేశానికి చాకిరీ  చేసి నాలుగు డాల‌ర్లు పోగు చేయ‌డం అల‌వాటు ప‌డ్డాక‌.. అడ‌వుల బాట ప‌ట్ట‌డం మానేసింది మ‌న యువ‌త‌. బీటెక్ చేశాక‌.. అమీర్ పేట్ లో ఒక ఐటీ కోర్సు చేసి.. త‌ల్లిదండ్రుల చేత ఎడ్యుకేష‌న్ లోన్లు చేయించి.. త‌ద్వారా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా అంటూ ఉన్న‌త చ‌దువుల‌కు వెళ్లి అక్క‌డ పార్ట్ టైమ్ జాబులు చేసి ఆపై అక్క‌డే చ‌దువు ముగించి.. ఒక జాబ్ చూసుకుని గ్రీన్ కార్డు సంపాదించ‌డం వ‌ర‌కూ ఒక ర‌కం.  ఆ త‌ర్వాత‌.. అక్క‌డే నానా గ‌డ్డీ క‌ర‌చి.. నాలుగు డాల‌ర్లు తాము ఖ‌ర్చు పెట్టుకుని ఓ ప‌ది డాల‌ర్లు ఇంటికి పంపే ఒకానొక లైఫ్ లైన్ ఏర్ప‌డ్డంతో.. న‌క్స‌ల్ బ‌రీ  ఉద్య‌మాల ప‌ట్ల ఆక‌ర్షితుల‌వ‌డ‌మే త‌గ్గిపోయింది. అప్ప‌ట్లో ఇలాంటి ఉద్య‌మాల‌కు ప్ర‌ధాన  కార‌ణం చ‌దువుకు త‌గ్గ ఉద్యోగం లేక పోవ‌డం. అదే ఇప్పుడ‌లా కాదు క‌దా? న‌క్స‌లైటు నాయ‌కుల‌క‌న్నా ముందే కార్పొరేట్ కంపెనీలు క్యాంప‌స్ ల‌కు క్యూ క‌డుతున్నాయ్. దీంతో అడ‌వి బాట ప‌ట్టాల్సిన కాలేజీ కుర్రవాడు కులాసాల బాట ప‌ట్టడానికంటూ  కంపెనీల్లో చేరేస్తున్నాడు. థ‌ర్డ్ ఇయ‌ర్ లోనే ఏదో ఒక జాబ్ కొట్టేస్తున్నాడు. దీంతో వెంట‌నే  ఎర్నింగ్ మొద‌లై పోయింది. కంపెనీలో వారానికి ఐదు రోజుల హార్డ్ వ‌ర్క్, త‌ర్వాత వీకెండ్ లో..  బార్లు, బీర్లు, ప‌బ్బులు, క్ల‌బ్బులంటూ యువ‌త త‌న రూటు స‌ప‌రేటు అంటోంది. ఎటు నుంచి ఎటు చూసినా మేలిమి నాయ‌క‌త్వం, త‌ద్వారా వ‌చ్చే మేథో సంప‌త్తి అడ‌వుల్లోని ఉద్య‌మాల‌కు వెళ్ల‌డ‌మే మానేశాయి. ఉన్న వాళ్లు వ‌య‌సు మ‌ళ్లి.. కొంద‌రు రిటైర్మెంట్ తీసుకోవ‌డం.. మ‌రి కొంద‌రు లొంగిపోవ‌డం. ఇంకొంద‌రు విదేశాల‌కు చెక్కేయ‌డం ఇలా ర‌క‌ర‌కాలుగా మారింది ప‌రిస్థితి.  మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండిన‌ మావోయిస్టు నాయ‌కుడు ముప్పాళ్ల ల‌క్ష్మ‌ణ‌రావు అలియాస్  గ‌ణ‌ప‌తిని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి త‌ప్పించి ఆయ‌న స్థానంలో నియమించిన వ్యక్తి ఎక్క‌డున్నాడ‌ని వెతికితే నేపాల్ నుంచి ఫిలిప్పీన్స్ కి పారిపోయాడ‌ని అంటున్నారు.  ఇక హిడ్మా ఎక్క‌డున్నాడ‌ని చూస్తే అనారోగ్యా కార‌ణాల తో ఆయన కూడా అండ‌ర్ గ్రౌండ్ కి వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం. ఇక ఎటు నుంచి ఎటు చూసినా కొత్త నాయ‌క‌త్వానికి దారి క‌నిపించ‌డం లేదు. ఆ దిశ‌గా యువ‌త త‌యారు కావ‌డం లేదు. ఒక‌ప్ప‌డు అడ‌వుల‌ను ఏలిన తెలుగు అన్న‌ల స్థానే ఇప్పుడు ఛ‌త్తీస్ గ‌ఢ్, ఒడిశాకు చెందిన స్థానికులే జంప‌న్న చెప్పిన‌ట్టు.. నాయ‌కులుగా త‌యార‌య్యే ప‌రిస్థితి.. దీంతో మావోయిస్టు పార్టీ భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. పెద్ద దిక్కు లేక‌- కొత్త ర‌క్తం ఎక్కించే దారి లేక‌.. చిక్కి శ‌ల్య‌మ‌య్యి.. కేంద్రం ఆశించిన‌ట్టు అది  2026 మార్చి నాటికి  దేశంలో మావోయిస్టు పార్టీ క‌నుమ‌రుగైనా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు విశ్లేష‌కులు.

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం (మే 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (మే 21) శ్రీవారిని మొత్తం  80 వేల 964 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 125 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 24 లక్షల రూపాయలు వచ్చింది. 

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై నాగం పిటిషన్‌ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.   హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టంగా పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.   దాదాపు ఐదేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ పిటిషన్‌ ను జస్టిస్ బీవీనాగరత్న,  జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం డిస్మిస్ చేసింది. మేఘా ఇంజినీరింగ్ తరఫున  వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ   ఇప్పటికే తెలంగాణ హైకోర్టు  దీనికి సంబంధించి ఐదు పిటిషన్లు కొట్టివేసిందనీ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదనీ, ఈ మేరకు సీవీసీ కూడా నివేదిక ఇచ్చిందనీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  అంతేకాకుండా బీహెచ్ఈఎల్ వంటి కీలక భాగస్వామి సంస్థ కూడా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.  నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.  ముకుల్ రోహత్గి వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం నాగం పిటిషన్ ను కొట్టివేసింది.  

బాబు హస్తిన టూర్.. వైసీపీలో భయం..జగన్ అరెస్టేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని విడివిడిగా, కలిసి విచారించిన సిట్.. కీలక ఆధారాలు సేకరించిందని అంటున్నారు. వాటి ఆధారంగా ఈ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్ అన్న నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా  ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆయన న్యాయవాది కోర్టులోనే ఈ కేసులో పెద్దలు తప్పించుకుని తన క్లయింట్ రాజ్ కేశిరడ్డిని బలిపశువులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజ్ కేసిరెడ్డి బ్రేక్ డౌన్ అయ్యి మద్యం కుంభకోణం కేసు సూత్రధారులు, వాస్తవ లబ్ధిదారుల వివరాలు వెల్లడించేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. అలాగే ఇదే కేసులో అరెస్టైన జగన్ కు అత్యంత సన్నిహితులైన గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల ద్వారా కూడా కీలక సమాచారం రాబట్టిన సిట్.. ఇక జగన్ అరెస్టు దిశగా అడుగులు వేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి వైసీపీ నాయకులు, శ్రేణులే జగన్ అరెస్టు తధ్యమన్న భావనలో ఉన్నారంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని వంటివారు బాహాటంగానే జగన్ అరెస్టవుతారంటూ మీడియా ముఖంగానే చెప్పేశారు. అదలా ఉంచితే.. జగన్ అరెస్టు విషయంలో ఇప్పటికే గవర్నర్ కు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో గవర్నర్ కంటే కేంద్రం ఆమోదం ఉంటే బెటరన్న ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ఉన్నట్లు చెబుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా ఇంత వరకూ తెలుగుదేశం కూటమి దర్యాప్తు కు సంబంధించినంత వరకూ ఎలాంటి జోక్యం  చేసుకోలేదు. అలాగే ఇప్పటి వరకూ అరెస్టులపై పెద్దగా స్పందించినదీ లేదు. అయితే సిట్ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాలు జగన్ అరెస్టు వరకూ దారి తీసిన నేపథ్యంలో..ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవలఃసి ఉంటుంది. మామూలుగా జగన్ సీఎం కాకముందే ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో అరెస్టుకు సెక్షన్ 17ఏ వర్తించదు కానీ, మద్యం కుంభకోణం కేసులో అరెస్టునకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గవర్నర్ కు విషయం తెలియజేయడం జరిగిందనీ, అయితే గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో ముందు వెనుకలాడుతున్నారనీ, దీంతో విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు.  ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన కేవలం సాధారణ రాజకీయ పర్యటనగా భావించజాలమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గురువారం (మే 22) చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆ మరునాడు అంటే శుక్రవారం (మే 23) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇది సాధారణ భేటీ కాదనీ, ఒక ఉన్నత స్థాయి మీటంగ్ అనీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏపీలో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చర్చించడానికేనని కూడా అంటున్నారు. ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకూ అరెస్టైన కీలక వ్యక్తుల విచారణలో ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు జగనే అని సిట్ నిర్దారణకు వచ్చిన నేపథ్యంలో జగన్ ను అరెస్టునకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు.  మామూలుగా శనివారం (మే24) హస్తినలో జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ సమావేశంలో పాల్గొనేందుకే అయితే చంద్రబాబు గురువారమే (మే22) హస్తినకు బయలు దేరాల్సిన అవసరం లేదు. అందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు చంద్రబాబు హస్తిన పర్యటనతో వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే జగన్  గురువారం (మే 22) మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.  మొత్తం మీద చంద్రబాబు హస్తిన పర్యటనకు జగన్ అరెస్టునకు ముడిపెడుతూ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. 

భారత్ దెబ్బకు..పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు

  పాకిస్తాన్‌లో నీటి కోసం  ఆ దేశ హోంమంత్రి జియా ఉల్‌ హసన్‌ ఇంటిని తగలబెట్టారు. ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహావేశాలను అదుపు చేయడంలో పాక్ ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సింధు నది నుండి నీటిని మళ్లించి, పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది.  కానీ సింధ్‌లోని స్థానికులు పాక్ సర్కార్ డిసిషన్‌పై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు, డ్రింకింగ్ వాటర్‌కి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్‌ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్‌ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. 

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌‌పై భద్రతా బలగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ రీపోస్ట్ చేస్తూ భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్వపడుతున్నాను. మావోయిజం ముప్పును పూర్తిగా తొలగించి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధాని ఎక్స్ ద్వారా ప్రధాని తెలిపారు.  మాధ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న విశ్వనీయ సమాచారంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌‌లో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారు.  ఇందులో సీపీఐ మావోయిస్ట్‌ జనరల్‌ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్‌ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు.   

వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్..63 ఎకరాల ఆక్రమిత భూమి స్వాధీనం

    వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు సర్వే చేశారు. సికే దిన్నె రెవెన్యూ సర్వే నెం.1629లో 11 వేల ఎకరాలు ఉండగా మొత్తం 63 ఎకరాలను సజ్జల ఫ్యామిలీ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో 52 ఎకరాలు అటవీ భూములుగా నిర్ధారణ అయింది. ఇందులో హద్దులు పాతి, బోర్డులు సైతం పెట్టారు. ఈ మేరకు గురువారం అటవీ శాఖకు 52 ఎకరాల భూములను రెవెన్యూ అధికారులు అప్పగించనున్నారు. కాగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నేషనల్ హైవే పక్కన సజ్జల ఫ్యామిలీకి ఎస్టేట్ ఉంది. సర్వే నెంబర్1599, 1600/1,2,1601/1,1A, 2తో పాటు మరికొన్ని సర్వేల నెంబర్లలో మొత్తం 200 ఎకరాలకు పైగా భూములున్నాయి.  ఇందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి కుమారు సందీప్ రెడ్డి పేరుతో 130 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరుతో మిగిలి భూములు సజ్జల ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ భూములు సైతం ఉన్నాయి. 200 ఎకరాల్లో 146 ఎకరాలు పట్టా భూమి కాగా 5.14 ఎకరాలు డీకేటీ, రెండు ఎకరాలకు పై చిలుకు చుక్కల భూములుగా ఉన్నాయి. అయితే పక్కనున్న సర్వే నెం. 1629లోని ఫారెస్ట్  భూములు, రిజర్వు భూములను కూడా ఎస్టేట్‌లో కలుపుకున్నట్లు ఆరోపణలు ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు చేశారు. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ అయ్యారు. దీంతో ఆక్రమణకు గురైన భూములను అటవీ శాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేశారు.  దీనిపై ఇప్పటికే కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సీకే దిన్నె తహశీల్దార్‌ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు పాతి, బోర్డులు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు.  

జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా.. ఎందుకంటే?

  హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం ముగిసింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దని థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణించినట్లు తెలుస్తోంది. జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా వేసుకోవాలని ఎగ్జిబిటర్లు నిర్మాతలు కోరగా వారు అంగీకరించారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానించారు. ఉదయం 11 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు.  ఈ భేటీకి సుమారు 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరైనట్లు సమాచారం. అనంతరం, సాయంత్రం 4 గంటలకు తెలుగు నిర్మాతలతో ఛాంబర్ పెద్దలు చర్చలు జరిపారు. ఈ రెండు సమావేశాల్లోనూ థియేటర్ల మూసివేత ప్రతిపాదనపై వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలలో అత్యధిక శాతం మంది సభ్యులు థియేటర్ల సమ్మెకు సుముఖత చూపలేదని, ప్రదర్శనలు కొనసాగిస్తూనే సమస్యలను పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో  నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.