జగన్ నెల్లూరు పర్యటన రద్దు కు కారణమేంటో తెలుసా?

పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అంటూ తలపెట్టిన యాత్రకు పోలీసులు రోడ్ షోకు అవకాశం లేకుండా ఆయన హెలికాప్టర్ నేరుగా జిల్లా జైలుకు అతి సమీపంలో ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ కు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ ఉద్దేశం పరామర్శ కాదు..పెద్ద ఎత్తున జనసమీకరణ జరిపి బల ప్రదర్శన చేయడం. అందుకు అవకాశం లేకపోవడంతో జగన్ నెల్లూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ పర్యటన రద్దుకు కారణం ఇది అయితే..  జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.  జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి సరైన స్థలం ఇవ్వలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ అవాస్తవాలేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ను పరామర్శించాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే వైసీపీ కోరిన ప్రాంతంలో కాకుండా వేరే చోట జగన్ హెలికాప్టర్ కోసం హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు.  అయితే జగన్ తన పరామర్శ యాత్రలకు భారీ ర్యాలీ, జనసమీకరణలతో అట్టహాసంగా చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక జగన్ పర్యటన ఆద్యంతం వైసీపీ శ్రేణులు ఆగడాలు, అరాచకాలకు అంతే లేదన్నట్లుగా చెలరేగిపోతాయి. ఇటీవల జగన్ యాత్రలలో అదే జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు పర్యటన విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ భారీ ర్యాలీలకు అవకాశం లేకుండా నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు. ఎందుకంటే జగన్ పరామర్శయాత్ర అంటూ బలప్రదర్శనకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. దీంతో శాతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయంటున్నారు. ప్రజా భద్రత ధ్యేయంగా తాము అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుందనీ, అందుకే నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు కు సూచించామనీ పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారన్న వాదనలో వాస్తవం లేదని తేలిపోయిందనీ, నెల్లూరు జైలుకు సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వల్ల భారీ ర్యాలీకీ అవకాశం లేకుండా పోతుంది. హెలికాప్టర్ దిగా నేరుగా జిల్లా జైలుకు వెళ్లి కాకాణిని పరామర్శించి మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్ లో వెనక్కు వెళ్లిపోవాల్సి ఉంటుంది.  పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇటీవలే జగన్ పల్నాడు పర్యటన సంద ర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగమయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి జగన్ పై కేసు కూడా నమోదైంది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వచ్చే అవకాశం లేకుండా జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు వైసీపీకి సూచించారు. అయితే జగన్ కు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శ కంటే రాజకీయ బల ప్రదర్శనే ముఖ్యం కనుక నెల్లూరు పర్యటనను, కాకాణి పరామర్శనూ రద్దు చేసుకున్నారు. అయితే తన పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారనీ, అనుమతి ఇవ్వలేదనీ ప్రచారం చేసుకుంటున్నారు.  పల్నాడు వంటి సంఘటన పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తాము నెల్లూరు జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ కు స్థలం చూపామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్‌ రాజీనామా

  ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన రాజీనామాను పలు నిరాధార ఆరోపణలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ పూర్తిగా అబద్ధమని, తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తన సేవా కాలాన్ని అత్యంత సంతృప్తికరమైన ప్రయాణంగా పేర్కొంటూ… ఈ రాష్ట్రాన్ని సొంత ఊరిగా భావించానని, ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.  ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, మరియు తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మద్దతుతోనే తాను ఈ స్థితికి చేరినట్టు పేర్కొన్నారు.ముందుకు సాగుతున్న తాను, సమాజానికి కొత్త రీతుల్లో సేవ చేయాలని, కృతజ్ఞత, స్పష్టత, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని తన సంకల్పాన్ని తెలియజేశారు. సిద్ధార్థ కౌశల్‌ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్య­తలు నిర్వర్తించారు. వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించిన తరు­వాత ఢిల్లీలో కార్పొ­రేట్‌ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు టాక్.

ఫార్ములా- ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు

  ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు  విచారణకు రావాలని ఆదేశించింది. అరవింద్‌కు నోటీసులివ్వడం ఇది నాలుగోసారి.  కాగా ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇదే కేసులో విచారించింది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నించే ఛాన్స్ ఉంది. దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న హైదరాబాద్‌కు అరవింద్ కుమార్  వచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్‌ ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి విదితమే

మాజీ ప్రధానికి 6 నెలల జైలు శిక్ష

  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ 6 నెలలు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసు కింద ఆమెకు ఈ శిక్ష వేసింది. గతేడాది బంగ్లాలో అల్లర్లతో దేశం విడిచి పారిపోయిన ఆమెపై అక్కడి ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. వాటి విచారణకు హాజరుకాకపోవడంతో హాసీనాకు జైలు శిక్ష విధించింది. హసీనాతో పాటు.. గైబంధలోని గోవిందగంజ్ కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కుకూడా ట్రిబ్యునల్ అదే తీర్పులో 2 నెలల జైలు శిక్ష విధించింది. 11 నెలల క్రితం పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి పారిపోయిన అవామీ లీగ్ మాజీ నాయకురాలికి పడిన తొలి శిక్ష ఇదే,  గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్‌ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సిగాచీ పరిశ్రమ

పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 40 మంది మరణించినట్లు సిగాచీ అధికారికంగా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో 33 మంది గాయపడినట్లు ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందిస్తామనీ, అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది. ఈ మేరకు సిగాచీ తరఫున ఆ కంపెనీ కార్యదర్శి వివేక్ కుమార్ ఓ ప్రకటక విడుదల చేశారు.  ఈ ప్రమాదంపై స్టాక్‌మార్కెట్‌కు కూడా  సమాచారం ఇచ్చిన ఆయన మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.  

ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

  కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు విజయవాడ జిల్లా జైలు నుంచి బెయిల్‌పై  విడుదలయ్యారు. ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో  140 రోజులు జైలు జీవితం అనంతరం బయటకు వచ్చారు. ఫిబ్రవరి12న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన వంశీపై పలు సందర్బాల్లో 11 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలశిల రఘురామ్ కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు.  

ఏడాదిలో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండి..డాక్టర్లకు సీఎం విజ్ఞప్తి

  రాష్ట్రంలో ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో ఒక నెల అయిన ప్రభుత్వాస్పుపత్రిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తర్వాత 11 నెలలు మీకు నచ్చిన ప్లేస్‌లో జీతం చేసుకుని మంచి జీవితం లీడ్ చేయండి అన్నారు. సామాజిక బాధ్యత కింద ఏడాదిలో ఒక్క నెల పేదలకు వైద్యం చేస్తే ఆనందంగా ఉంటుందని ఏనెలలో పనిచేస్తారో మాకు చెప్తే ఏర్పాట్లు చేస్తాం అని ముఖ్యమంత్రి అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఏఐజీ నూతన ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం హెల్త్‌ టూరిజం హబ్‌గా మారింది.  దేశంలో తయారయ్యే బల్క్‌డ్రగ్‌లో 35శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోందని అన్నారు. జినోమ్‌ వ్యాలీ హైదరాబాద్‌కు చాలా కీలకం. దాదాపు 66 దేశాల నుంచి వచ్చే పేషంట్‌లకు వైద్య సేవలందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం. ఏఐజీ ఆసుపత్రి సేవలు ఇంకా విస్తరించాలని సీఎం ఆక్షాంక్షించారు. తెలంగాణ హెల్త్‌ టూరిజంలో ప్రభుత్వానికి సహకరించాలని నాగేశ్వర్‌రెడ్డిని కోరామన్నారు. . జనని మిత్ర యాప్‌ పేదరోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్స్‌లో అదనపు బ్లాక్‌, ఎల్‌బీ నగర్‌, సనత్‌నగర్‌లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.   ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు భారంగా మారాయని అందుకే మేము అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి రిలీఫ్ ఫండ్ కింద రూ.1400 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో ఉన్నదని ముఖ్యమంత్రి తెలిపారు. వీరికి వ్యక్తిగతంగా యూనిక్ ఐడీతో గుర్తింపు కార్డు ఇచ్చి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందిస్తామని ఈ కార్డులో వారి కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తం చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. గత నెలలో మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో నిబంధనలు ఉల్లంఘించారని అడ్వకేట్ వాంజినాతన్ పోలీసులకు 3. 196(1)(a), 299, 302, and 353(1)(b)(2) సెక్షన్ల కింద అన్నానగర్ పోలీసులు పవన్, అన్నామలైతో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఏఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  జూన్ 22వ తేదీన  మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల కాన్ఫరెన్స్ మీటింగులో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించారని పవన్ కళ్యాణ్, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యునల్ హార్మొనీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముదులో మురుగన్ భక్తుల సదస్సు జరగడానికి ముందే ఆంక్షలు విధించినా, వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది, రాజకీయ, మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపారు

మిస్టర్ కూల్ బ్రాండ్ ఓన్ చేసుకున్న ధోనీ

మహేంద్ర సింగ్‌ ధోని.. ఏ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని పేరు ఇది. ఎస్పెషల్లీ క్రికెట్ ఫ్యాన్స్‌కు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించడమే కాదు.. సిట్యూవేషన్‌ ఏదైనా తన కూల్‌ను కోల్పోకుండా టీమ్‌ను విజయాల బాట పట్టించాడు ధోని. అందుకే అంతా కెప్టెన్‌ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడా పేరును ఏకంగా ట్రేడ్‌మార్క్‌గా మార్చుకున్నారు ధోని. నిజానికి కెప్టెన్‌ కూల్‌ అనగానే ధోనినే గుర్తొస్తాడు. అందుకే ఈ మార్క్‌ను అఫిషియల్‌గా దక్కించుకున్నాడు ధోని. దీని కోసం 2023 జూన్‌ 5న అఫిషియల్‌గా అప్లై చేసుకున్నాడు. 2025 జూన్‌ 16న అతని అప్లికేషన్‌ను యాక్సెప్ట్‌  చేశారు. నిజానికి ఈ టైటిల్‌ ఎప్పుడో రావాల్సింది. కానీ కొన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇంత ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అతని ఆశ నెరవేరింది. ట్రెడ్‌మార్క్స్‌ రిజిస్ట్రీ పోర్టల్‌ ధోని అప్లికేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సో.. ఇక అఫిషియల్‌గా కెప్టెన్‌ కూల్‌ అనే పదానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ ధోని. మరి ఈ ట్యాగ్‌ లైన్‌ ధోనికి ఎందుకు? ధోనికి దీంతో ఏం అవసరం ఉంది? అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్.  ధోని స్పోర్ట్స్‌ ట్రైనింగ్, కోచింగ్ సర్వీస్, ట్రైనింగ్ సెంటర్ల కోసం ఈ టైటిల్‌ను వాడుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే అనేక బిజినెస్‌ల్లో డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంది ధోనికి. ఇకపై ఈ ట్యాగ్‌లైన్‌తో బిజినెస్‌ చేసుకోవచ్చు .  ధోనికి ఫ్యాషన్, ఫిట్‌నెస్‌, టెక్నాలజీ, హాస్పిటాలిటి రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. చాలా కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టాడు. మాములుగానే ధోని అంటే ఓ బ్రాండ్.. ఇప్పుడు ఆ బ్రాండ్‌కు తోడుగా కెప్టెన్‌ కూల్‌ అనే ట్యాగ్‌ కూడా యాడ్ అయ్యింది. దీంతో ఆయన నెట్‌వర్త్‌ త్వరలో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఆయన నెట్‌వర్త్‌ అటు ఇటుగా వెయ్యి కోట్లుగా ఉందని తెలుస్తోంది.  ముఖ్యంగా స్పోర్ట్స్‌, ఫిట్‌నెస్‌ ఏరియాలో ఈ ట్యాగ్‌లైన్‌ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంది. క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకోకముందే చాలా వ్యాపారాలు మొదలుపెట్టడంతో పాటు.. పెట్టుబడులు కూడా పెట్టాడు మాహీ. ఇక రిటైర్మెంట్ తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది.ధోనికి సెవెన్ అనే బ్రాండ్ ఉంది. ఇది ధోని సొంత స్పోర్ట్స్‌ వేర్‌ అండ్‌ ఫుట్‌ వేర్‌ కంపెనీ. దీనికి అతను బ్రాండ్‌ అంబాసిడర్ మాత్రమే కాదు.. కో ఓనర్‌ కూడా. చెన్నైయిన్ ఎఫ్‌సీ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు ధోని కో-ఓనర్. ఇక రాంచీ రేస్ అనే హాకీ ఇండియా లీగ్‌లోని ఓ హాకీ జట్టుకు కూడా ధోని కో ఓనర్.  సూపర్ బైక్ రేసింగ్ టీమ్ కూడా ఉంది ధోనికి. మహి రేసింగ్ టీమ్ ఇండియాలో ధోని వాటాదారుడుగా ఉన్నారు. ఇక స్పోర్ట్స్‌ఫిట్‌లో పెట్టుబడులు పెట్టాడు. స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా 200కి పైగా జిమ్‌లు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిలో ధోని కెప్టెన్‌ కూల్ అనే ట్యాగ్‌లైన్‌ను ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా వాడుకోవచ్చు.  ఇవి కాకుండా ఖాతాబుక్, గరుడ ఏరోస్పేస్, కార్స్ 24, ఈమెటో రైడ్‌లాంటి కంపెనీల్లో ధోని పెట్టుబడులు పెట్టాడు. ఇవి మాత్రమే కాదు సెవన్ ఇంక్‌బ్రూస్ అనే ముంబైకి చెందిన ఫుడ్ అండ్ బెవరేజ్ స్టార్టప్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఓ సినిమా సంస్థను కూడా స్థాపించారు. మాహి రెసిడెన్సీ పేరుతో రాంచీలో ఓ హోటల్‌ నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్‌ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌ అయిన రితి గ్రూప్‌లో పెట్టుబడులు.. ఇంటర్నల్ డిజైన్‌ బ్రాండ్‌ హోమ్‌లేన్‌.. ప్లాంట్ బేస్డ్‌ ఫుడ్‌ బ్రాండ్‌ శాఖహారి సంస్థల్లో కూడా ధోని పెట్టుబడులు పెట్టాడు.  బెంగళూరులో ఎంస్ ధోని గ్లోబల్‌ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. సో.. ధోని కెప్టెన్ కూల్ అనే ట్యాగ్‌ కోసం పోరాడింది తన వ్యాపార సామ్రాజ్యానికి చాలా హెల్ప్ అవుతుందనేది మనకు అర్థమవుతోంది.

మోడీ ఐదు దేశాల యాత్ర.. ప‌దేళ్ల త‌ర్వాత లాంగ్ టూర్

5 దేశాలు, 8 రోజులు.. ఒక మోడీ లాంగ్ ట్రిప్.  జూలై 2, 3 తేదీల్లో ఘ‌నాలో ప‌ర్య‌టించ‌నున్నారు మోడీ. త‌ర్వాత 3, 4 తేదీల్లో ట్రినిడాబ్ టుబాగో, 4, 5 తేదీల్లో అర్జెంటీనా ప‌ర్య‌ట‌న త‌ర్వాత‌.. 5 నుంచి 8వ తేదీ వ‌ర‌కూ బ్రెజిల్లో జ‌రిగే బ్రిక్స్ 17వ స‌మావేశాల‌కు హాజ‌రవుతారు. ఇక‌ 9న నమీబియా దేశ ప‌ర్య‌ట‌న‌. అక్క‌డ భార‌తీయుల‌కున్న వ‌జ్రాల వ్యాపారం కేంద్రంగా ఒప్పందాలు. ఆపై యురేనియం స‌ర‌ఫ‌రా మీద కూడా చ‌ర్చ‌లు.   ఒకే సారి 5 దేశాల‌కు వెళ్ల‌డం ఇది రెండో సారి. గ‌తంలో అంటే  2016లో ఇలాగే.. మోడీ అమెరిక, మెక్సికో.. వంటి ఐదు దేశాల‌ను ప‌ర్య‌టించారు. అలాగ‌ని ఇదే అతి పెద్ద టూర్ కాదు. 2015లో ఏకంగా ఆరు దేశాల‌ను ప‌ర్య‌టించారు మోడీ. ప్ర‌స్తుత దేశాల ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన‌మైన‌ది గ్లోబ్ సౌత్ గురించి బ్రిక్స్ లో మాట్లాడ్డ‌మే కాదు.. ఆయా దేశాల‌కు ర‌క్ష‌ణాత్మ‌క భ‌రోసానిచ్చి.. త‌గిన  నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి భార‌త్ సిద్ధంగా ఉందంటూ సంకేతాల‌నివ్వ‌నున్నారు మోడీ.  ఇక ఘ‌నా, ట్రినిడాబ్- టుబాగో, న‌మీబియా దేశాల ప‌ర్య‌ట‌న‌.. ఎంతో కీల‌కంగా మార‌నుంది. గ‌త మూడు ద‌శ‌కాలుగా ఈ దేశాల్లో ఒక భార‌త ప్ర‌ధాని వెళ్ల‌డం.. ఆయా పార్ల‌మెంట్ల‌లో ప్ర‌సంగించ‌డం ఇదే తొలిసారి. ఈ దేశాల‌కు ఇటు విద్యా- వైద్యం మ‌రియు సాంకేతిక ప‌రిజ్ఞానం ఇచ్చి పుచ్చుకోవ‌డం.. చౌక‌గా వీరికి మ‌న ఆయుధ సంప‌త్తిని అమ్మ‌డం. త‌ద్వారా వీరికంటూ ఒక ర‌క్ష‌ణాత్మ‌క సాయం చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ ద్వారా మోడీ ఈ దేశాల‌తో స‌త్సంబంధాలు నెర‌ప‌నున్నారు. త‌ద్వారా గ్లోబ‌ల్ లీడ‌ర్షిప్ లో ఈ ఫ్రెండ్షిప్ కీల‌కంగా మార‌నుంది. దానికి తోడు ట్రినిడాడ్ టుబాగో దేశాల విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ 2011 లెక్క‌ల ప్ర‌కారం రెండున్న‌ర ల‌క్ష‌ల మంది హిందువులున్నారు. అంతే కాదు ఇక్క‌డ మ‌న  హైంద‌వ సంప్ర‌దాయానికి సంబంధించిన ఆల‌యాలు  కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో ఇండియా డ‌యాస్పోరాకు ఈ ప‌ర్య‌ట‌న‌ మ‌రింత ఊత‌మిచ్చిన‌ట్టు అవుతుంది. ఇక న‌మీబియా ఎంత ప్ర‌త్యేక‌మంటే ఇక్క‌డ ఏకంగా మ‌న వ‌జ్రాల  ప్రాసెసింగ్ యూనిట్లు 800 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన‌వి ఉన్నాయి. భార‌త క‌రెన్సీలో చెబితే ఈ మొత్తం ఏకంగా 70 వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. ఇక న‌మీబియాలో యురేనియం నిల్వ‌లు పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఈ స‌ర‌ఫ‌రా విష‌యంలోనూ కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు మోడీ. ఇలా ఐదు దేశాల‌లో మోడీ చేయ‌నున్న ఈ లాంగ్ టూర్ ద్వారా ఏక కాలంలో రెండు ఖండాలు చుట్టిరావ‌డం మాత్ర‌మే కాదు.. ఎన్నో ఒప్పందాల‌ను సైతం చేసుకుని.. గ్లోబ‌ల్ లీడ‌ర్షిప్ లో భార‌త్ ను ముందు వ‌ర‌స‌లో నిల‌ప‌నున్నారు. వ‌చ్చే సారి జ‌రిగే బ్రిక్స్ స‌మావేశాల‌కు భార‌తే  అధ్య‌క్ష‌త  వ‌హించ‌నుండ‌టంతో ఈ ట్రిప్ ఎంతో కీల‌కం  కానుంది.

సొంత ఇంట్లో అడుగుపెట్టలేకపోతున్న తాడిపత్రి పెద్దారెడ్డి

అధికారం శాశ్వతమన్నట్లు వ్యహరించిన అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరు ఇప్పుడాయపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది . అప్పట్లో అలా చెలరేగడమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఒక పొలిటికల్ లీడర్‌కు లేని ఆంక్షలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆఖరికి తాడిపత్రిలో సొంత ఇంటికి వెళ్లేందుకు కూడా ఆ మాజీ ఎమ్మెల్యేకు అనుమతి లభించడం లేదు. హైకోర్టు ఆయనకు తాడిపత్రి వెళ్లడానికి అనుమతించినా..  శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఎప్పటికప్పుడు ఆయన తాడిపత్రి ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నారు. అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి..ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరికీ ఆరుపదులు వయసు దాటింది.ఇంకా చెప్పాలంటే ఇద్దరికీ మనవళ్ళు, మనవరాళ్లు ఉన్నారు. వయస్సు పైబడుతున్నా ఆ ఇద్దరూ మాత్రం సినీ స్టైల్లో తొడలు కొడుతునే ఉన్నారు. తాడిపత్రిలో రాజకీయ ఆధిపత్యం కోసం ఇరువురూ నువ్వానేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు.  ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి ఆయన ఇంట్లో కూర్చుని సవాల్ విసిరారు. ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రి రాకుండా  అనేక సార్లు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. కేతిరెడ్డి అపోజిషన్‌లోకి వచ్చారు. తన కుమారుడ్ని తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న జేసీ పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ రాకమునుపే అక్కడ ఆధిపత్య రాజకీయం మొదలైపోయింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికార పక్షంలో ఉన్నారు.  దీంతో రిజల్స్ట్‌ వచ్చిన మరుక్షణం నుంచే తాడిపత్రి పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి. అప్పట్లో జరిగిన ఘర్షణ పెద్ద దుమారం లేపింది. ఆ గొడవలతో జేసీ, కేతిరెడ్డిలను తాడిపత్రికి రావడానికి వీళ్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి  కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకుని తాడిపత్రి లో ఉంటున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం కోర్టు నుంచి ఆంక్షలతో కూడిన అనుమతులు తెచ్చుకున్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా సరే .. కేతిరెడ్డి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. కోర్టు ఆర్డర్స్‌ ఉన్నాయి అనుమతించాలంటూ ఇప్పటికే రెండు మూడుసార్లు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి ప్రయత్నించినా..  జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ అనుమతివ్వలేదు. ఒకసారి ఎంపీపీ ఎన్నికలు, మరోసారి మహానాడు, ఇంకోసారి ప్రైమ్ మినిస్టర్ విశాఖపట్నం బందోబస్తు కార్యక్రమాలు అంటూ జిల్లా ఎస్పీ ఆయనకు అనుమతి నిరాకరించారు. పెద్దారెడ్డి జిల్లా ఎస్పీపై కంటెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసంతో పాటు మరో 14 ఇళ్ళకు సంబంధించి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు కొలతలు వేయడం ప్రారంభించారు. కొలతలు వేసిన మరుసటి రోజు తెల్లవారుజామునే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్ళు గప్పి ఎలాగోలా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న  జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున గుమిగూడి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు . దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ  శాంతి భద్రతల సమస్య తలత్తెక మునుపే కేతిరెడ్డిని అనంతపురం తరలించారు. ఆ క్రమంలో అక్కడ హైడ్రామా నడిచింది. కేతిరెడ్డి ఇంట్లో ఉండగా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. ఆ సందర్భంగా పోలీసులు కేతిరెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘింస్తున్నారని హెచ్చరించారు. ఆయన హైకోర్ట్ ఆదేశాలను ఉల్లంఘించారని , బెయిల్ రద్దు చేయాలని కోర్టుకి వెళ్ళే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆ తరువాతి రోజు జిల్లా వైసీపీ నేతలు ఎస్పీని కలసి తాడిపత్రి కి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పట్లో కేతిరెడ్డి అనవసర దూకుడే ఇప్పుడు ఇన్ని చిక్కులు తెచ్చిపెడుతుందని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి కేతిరెడ్డి తాడిపత్రిలో ఎప్పటికి అడుగు పెట్టగలుగుతారో.. స్వేచ్ఛగా తిరగగలుగుతారో?

అనుచరుల వరుస అరెస్టులు.. ఫ్రస్ట్రేషన్‌లో చెవిరెడ్డి

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఇప్పుడు ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ కొనసాగుతున్నకొద్ది.. ఆయన మరింత కూరుకు పోతున్నా రనిపిస్తోంది. ఈ స్కామ్‌లోని సొమ్ము తరలింపులో  చెవిరెడ్డి భాస్కరరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిం చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరు చెవిరెడ్డి అనుచరులే. బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌కృష్ణను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.  చెవిరెడ్డి అరెస్ట్‌కంటే ముందే వీరిద్దరూ అజ్ఞాతంలోకి జారుకున్నారు. వీరికి కొందరు బడా నేతలు డబ్బులు సమకూర్చి ఇతర రాష్ట్రాలకు పంపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరూ పరారీలోనే ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు పట్టుబడ్డారు. ఇప్పుడు వీరిద్దరితో కలుపుకుంటే ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 11కు చేరుకుంది. ఇప్పుడీ కేసులో వీరిద్దరు నోరు తెరిస్తే చెవిరెడ్డి మరింత ఇరుక్కుంటారనే చర్చ నడుస్తోంది.  రాజ్‌ కెసిరెడ్డి బృందం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు చేర్చడంలో వీరిద్దరిదీ కీలక పాత్ర అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలు దొరకడం వల్లే సిట్‌ అధికారులు వారిని అరెస్టు చేశారు.  ఇలా రోజురోజుకు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోవడంతో చెవిరెడ్డిలో ఫ్రస్టేషన్ పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్ చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో..  తనపై తప్పుడు కేసులు పెట్టారని అరుస్తూ బయటకు వచ్చారు చెవిరెడ్డి. ఎవ్వరినీ వదిలేది లేదంటూ హెచ్చరించారు. చెయ్యని తప్పునకు శిక్ష అనుభ విస్తున్నా అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇవేవీ అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో  ఉన్నట్లు కనిపించడం లేదు. చెవిరెడ్డి అంతలా ఊగిపోతున్నా పోలీసులు ఆయన్ని బలవంతంగా వ్యానులోకి ఎక్కించి తరలించారు. తన కీలక అనుచరులు వరుసగా దొరికి పోతుండటంతో చెవిరెడ్డి ఫ్రస్ట్రేష‌న్‌తో ఉన్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆ క్రమంలో త్వరలో ఈ కేసులో ఎవరెవరున్నారో.. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు? చెవిరెడ్డికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.

సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని సందర్శించిన మీనాక్షి నటరాజన్

పాశమైలారం సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం (జులై 2)  సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను వారు మంత్రి దామోదర్ రాజనర్సింహను అడిగి తెలుసుకున్నారు.  పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం (జూన్ 30) ఉదయం భారీ పేలుడు సంభవించి  36 మంది కార్మికులు మరణించగా, మరో 34 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.  క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలా ఉండగా  గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందిస్తున్నట్లు వివరించారు. ఇక పోతే ఈ ప్రమాద ఘటన అనంతరం   పదమూడు మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదని సమాచారం.   ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు, సిబ్బంది సంఖ్యపై గందరగోళం నెలకొంది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. పేలుడు సంభవించిన సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.  అయితే, కంపెనీ మాత్రం ఆ సమయంలో 156 మంది విధుల్లో ఉన్నారని చెబుతోంది. మరో పదమూడు మంది సిబ్బంది కనిపించడంలేదని తెలిపింది. ఫ్యాక్టరీలో శిథిలాల తొలగింపు పూర్తయ్యాకే ఈ పదమూడు మంది కార్మికులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

వైసీపీకి వల్లభనేని వంశీ గుడ్ బై?.. రాజకీయ సన్యాసమేనా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ వివిధ కేసులలో గత కొంత కాలంగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరాఖరుకు ఆయనపై నమోదైన అన్ని కేసులలోనూ బెయిలు లభించడంతో బుధవారం (జులై 2)  ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన బయటకు రావడంతోనే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఏమిటంటే వైసీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారంటే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా రాజకీయాలలో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా రెండు సార్లు తెలుగుదేశం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత.. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ.  అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోయార్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వంశీపై ఆ తరువాత పలు కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసులలో బెయిలు లభించడంతో  బయటకు వచ్చే అవకాశం ఉంది.  వంశీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. జైలు జీవితం, పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే కాకుండా ప్రజాజీవితం నుంచి కూడి రిటైర్ కావాలని, రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దశగా ఆయనపై ఒత్తిడి ఉందంటున్నారు. వంశీ జైలులో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పయనించేందుకు అవకాశం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఒత్తిడి కారణంగా వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి రావడానికి కారణంగా చెబుతున్నారు. ఈ వార్తలలో వాస్తవం ఎంతన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 

గోదావరికి వరద.. పాపికొండల యాత్రకు బ్రేక్!

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్నది. ముఖ్యంగా ధవళేశ్వరం, భద్రచలం వద్ద గోదావరి వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ కారణంగా  పాపికొండల యాత్ర నిలిచిపోయింది. గోదావరిలో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాపికొండలు విహార యాత్రను నిలిపివేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకూ పాపికొండల మీదుగా విహారయాత్రకు పర్యటకులు మక్కువ చూపుతారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదీస్తూ శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకోవడం ఒక మధురానుభూతిగా భావిస్తారు. అయితే గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఈ యాత్రను నలిపివేసింది. ఈ యాత్ర మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్న విషయాన్ని తెలియజేయలేదు. యాత్ర పున: ప్రారంభం ఎప్పటి నుంచి అన్నది తరువాత ప్రకటిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ పేర్కొంది.  

జగన్ నెల్లూరు పర్యటన రద్దు.. కాకాణికి అధినేత పరామర్శ లేనట్టేనా?!

మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన రద్దైంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించేందుకు జగన్ నెల్లూరు పర్యటన ఖరారు చేసుకున్నారు. అయితే ఇప్పుడా పరామర్శ  యాత్ర రద్దు చేసుకున్నారు.  నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు  గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు పర్యటన తలపెట్టిన విషయం విదితమే. ప్రభుత్వం హెలిప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైసీపీ చెబుతోంది.    కానీ హెలిప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోయినా కూడా  జగన్ పర్యటన కొనసాగి తీరుతుందంటూ వైసీపీ నేతలు మీడియాముందుకు వచ్చి ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తొడగొట్టి మీసం మెలేసే అలవాటు ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే.. మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ పర్యటన ఆగదు, మా ప్లాన్లు మాకున్నాయి.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ నెల్లూరు వచ్చి తీరుతారు, కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శిస్తారంటూ తొడగొట్టి చెప్పారు.  అయితే జగన్ మాత్రం తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక కాకాణి పరామర్శకు ఎప్పుడు వస్తారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. సరే అనువైన పరిస్థితులు లేవు కనుక హెలీప్యాడ్ కు స్థలం దొరకలేదు.. కానీ రోడ్డు మార్గాన వచ్చే ఆప్షన్ ను  వైసీపీ కనీసం పరిశీలించను కూడా పరిశీలించకపోవడానికి కారణ మేంటన్నది ఆ పార్టీ నేతలే చెప్పాలని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ నెల్లూరు పర్యటనకు వస్తారంటూ తొడకొట్టి మరీ చెప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.  అసలింతకీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టైన ఇన్నాళ్లకు జగన్ ఆయనను పరామర్శించాలని ఎందుకు తలపోశారు. ఇన్ని రోజులూ ఎందుకు పరామర్శకు రాలేదు అన్న ప్రశ్నకు కూడా వైసీపీ బదులు చెప్పాల్సి ఉంటుంది.  

అందుబాటులోకి రైల్ వన్ యాప్.. సింగిల్ లాగిన్ తోనే సమస్త సేవలు

రైలు ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూసే.. రైల్వే ప్రయాణీకులు సమాచారం కోసం ఇప్పటి వరకూ వేర్వేరు యాప్ లను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే   తాజాగా రైల్వే శాఖ తాను అందించే సేవలన్నిటికీ  సింగిల్ విండో సిస్టమ్ లాంటి యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  రైల్ వన్ పేరుతో   ఆల్-ఇన్-వన్ సూపర్‌ యాప్‌ను కేంద్ర రైల్వే  మంత్రి ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా  కౌంటర్ల వద్ద క్యూ లైన్ల సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందని రైల్వే శాఖ చెబుతోంది. అంతే కాకుండా.. రైల్ వన్  యాప్ ప్రయాణికులకు సమగ్రమైన సేవలను అందిస్తుంది.  అన్‌రిజర్వ్‌డ్  టికెట్లను ఇప్పుడు   యాప్ ద్వారా  బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్లాట్ ఫారమ్ టికెట్లను సైతం కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా జరిగే రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్ యథాతథంగా కొనసా గుతుంది. అలాగే ప్రయాణికులు సింగిల్ లాగిన్‌తో తమ రైలు  రన్నింగ్ స్టాటస్, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోనే వీలు ఈ యాప్ ద్వారా కలుగుతుంది.  ప్రయాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే,  రైల్ మదద్  ఫీచర్ ద్వారా యాప్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో కి వచ్చింది. భవిష్యత్ లో ప్రాంతీయ భాషలను కూడా చేర్తుస్తారు. ఈ యాప్ ను  ప్లే స్టోర్, యాప్ స్టోర్ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది.