బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయససీమలలో  వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుమల నుంచి కర్నాటకలోని బాగేపల్లి వెడుతున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండలం చెన్నామర్రిమిట్ట వద్ద జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో టెంపుల్ ట్రావెల్ లో డ్రైవర్ సహా 14 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. 

ఏపీలో 10 జాతీయ రహదారుల విస్తరణ..డీపీఆర్‌కు కేంద్రం ఆదేశాలు

  ఆంధ్రప్రదేశ్‌లో పది జాతీయ రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది. ఆయా జాతీయ రహదారులను 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. 988 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు - 2025-26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్‌ కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH-216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.  కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న NH-40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్‌ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్‌లు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల విస్తరిస్తున్నారు  

ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పి.వి. సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు అయింది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణను చేపట్టనున్నారు. మంగళవారం అంటే.. జులై 1వ తేదీన కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనేది ఒక ప్రకటన చేయనున్నారు. ఇక ఈ నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం వాటిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు.  ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మాత్రం జులై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి.. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక బీజేపీ నేత, ఎంపీ పీసీ మోహన్ వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి.. లోక్ సభ సభ్యురాలుగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారథిని మార్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేర్లు అధ్యక్ష పదవికి వినిపిస్తున్నాయి  

తిరుమల టోల్ గేట్ వద్ద కారులో మంటలు .. భక్తుడు క్షేమం

   తిరుమలలోని GNC టోల్ గేట్ సమీపంలో ఒక కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. బెంగళూరులోని ముళబాగిలుకు చెందిన సుదర్శన్ అనే భక్తుడు తన కారులో తిరుమల చేరుకున్నారు. అతను టోల్ గేట్ వద్దకు చేరుకునేసరికి, సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగాయి. టిటిడి  భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. అగ్ని ప్రమాదానికి  కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్‌తున్నారు . హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.   

ఎమ్మెల్యేల పనితీరు మారాలి : సీఎం చంద్రబాబు

  కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు మారాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. పనితీరు బాగా లేకుంటే గుడ్‌బై చెప్పేస్తానని తేల్చిచెప్పారు. తాను క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని  చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో నిన్నటి నుంచి రోజుకు  నలుగురిని పిలిచి మాట్లాడుతున్నానని ఇంక కొంతమంది తమ పనితీరు మారాల్సిందేనని తేల్చిచెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులంటూ హెచ్చరించారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని స్పష్టం చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. వారసులకు హ్యండ్ హోల్టింగ్ ఇస్తాం కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంటుందని వివరించారు.రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ చనిపోతే మనమే కారణమన్నారు. నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందని గ్రహించాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో నేతలంతా ముందుండాలి. సోషల్‌ మీడియా యుగంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు తెలిపారు.  అక్కడ దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. 2029 ఎన్నికలే నా టార్గెట్‌. పనితీరు బాగా లేకుంటే మొహమాటం లేకుండా గుడ్‌బై చెప్పేస్తా. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్‌డౌన్‌ పెట్టుకుని పనిచేస్తున్నాం. ఏళ్లు.. నెలలు.. రోజులు.. గంటలు కూడా లెక్కిస్తున్నా. తానా, ఆటా అంటూ ఫారెన్‌ ట్రిప్పులు వద్దు. అలా వెళ్తే టాటా చెప్పేస్తా. ప్రజాప్రతినిధుల గ్రాఫ్‌ పెరుగుతుందా? తగ్గుతుందా? పరిశీలిస్తున్నా. మొదటి ఏడాది పాలన పూర్తయింది.. రెండో ఏడాది ప్రారంభైంది. నెల రోజులపాటు ప్రతి గడపకూ నేతలు వెళ్లాలి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.  పాలనలో ఏమైనా లోటుపాట్లు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగుదామని చంద్రబాబు అన్నారు. "ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. అదే మన లక్ష్యం. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలనుకోవడం బాధాకరం. గత ఎన్నికల్లో ప్రత్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా 11 సీట్లకే పరిమితమయ్యారు. డబ్బు అన్నివేళలా పనిచేయదు. మనం ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.

విమాన ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్

  గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన  ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది. టాటా బోర్డు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా,విమాన ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు, ద్వారా’ జీవిత పర్యంతం ఈ ట్రస్ట్ ద్వారా’ ఆర్థిక సహాయం, నష్ట పరిహాం, వైద్య సంరక్షణ అందించడంతో పాటుగా, కుటుంబాల పునర్నర్మాణానికి అన్ని విధాల  సహాయ సహకారాలు అందిస్తుందని,టాటా ట్రస్ట్ తెలిపింది.అలాగే, ట్రస్ట్ పారదర్శక నిర్వహణ కోసం,నిపుణుల సేవలను వినియోగించుకోవడం జరుగుతంది టాటా ట్రస్ట్ తెలిపింది.  

అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త..ఆదుకోవాలని లోకేష్‌కి వినతి

  నెల్లూరుకు చెందిన  తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జులై 6 న మంత్రి లోకేశ్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో ఆదుకోవాలని కార్యకర్త లోకేష్‌కి  విజ్ఞప్తి చేశారు. ప్రియమైన కార్యకర్తలారా!.. నేను చేసిన తప్పేమిటి, నన్ను ఎందుకు పార్టీ ఆదుకోవడం లేదు. నేను ఉన్న బాధల్లో ఎంతో కొంత కార్యకర్తకు ఆర్థిక సహాయం చేస్తారని తెలుగుదేశం పార్టీ  కోసం ఎదురు చూస్తూ ఉన్నా !...దానికోసం మన కార్యకర్తలందరూ సహాయం చేయొచ్చు కదా!... ఆర్థికంగా కాదు, పార్టీ దృష్టికి తీసుకుపోయే దానికి లోకేష్ బాబు ఆరో తేదీ నెల్లూరు వస్తున్నారు. ఆయన దృష్టి తీసుకొని పోతారని కార్యకర్తలందరినీ వేడుకుంటున్నాను. ఇదే లాస్ట్ పిలుపు, తర్వాత చావటమా బతకటమా ఆలోచించుకుంటాను… నవంబర్ నుంచి మంచం మీదే ఉన్నాను మీరే ఆలోచించండని కార్యకర్త ఆవేవదన వ్యక్తం చేశారు.  

బీజేపీ ఎంపీ రఘునందన్‌కు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్

  మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు తెలుస్తోంది. తమ టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స  చేయించుకున్నారు.  మరోవైపు జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఏపీ మావోయిస్టు కమీటీ హత్యకు ఆదేశించినట్లు రెండు సార్లు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారని పేర్కొన్నారు. తన హత్యకు 5 బృందాలు రంగంలోకి దిగినట్లు వారు తనకు చెప్పినట్లు ఎంపీ రఘునందన్ తెలిపారు  

జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్‌ షా

  కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పసుపు ఉత్పత్తులను హోంమంత్రి  పరిశీలించారు. అంతకుముందు హైదరాబాదులోని బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు బయలుదేరిన అమిత్ షా.. కలెక్టరేట్ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం వరకు చేరుకున్నారు.  అనంతరం ఆయన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా ఎక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పసుపు సంబంధిత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్త, జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.   

కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టం : జగదీష్‌ రెడ్డి

  మాజీ సీఎం కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టమని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మహా న్యూస్ చానల్ మీద జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే..ఇంకో రెండు, మూడు ఉన్నాయి.. వాటి పని కూడా చేస్తామని జగదీష్‌ రెడ్డి అన్నారు  మా దాడి వేరే విధంగా ఉంటది.. ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆంధ్ర నుంచి తెలంగాణను విడదీశాడు అనే కోపంతోనే ఈ దాడులు జరుగుతున్నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు.  సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నామని  ఆ స్లాటర్ హౌసులను వదిలిపెట్టమని జగదీష్‌ రెడ్డి వెల్లడించారు. తమ పిటిషన్లపై ప్రేక్షక పాత్రపోషించే పోలీసులు.. తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.రాజకీయ పార్టీలుగా మేమూ మేమూ తేల్చుకుంటాం. మీడియా అసత్య ప్రచారాలెందుకు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైనా మీ ప్రేలాపనలు. ఉద్యమం నుంచి వచ్చినోళ్లం కేసులకు భయపడతామా. మహా న్యూస్‌పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతో అదేపనిగా పెట్టుకొని దాడులు చేస్తున్నారు.  మీడియా ముసుగులో మీ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు. బిన్ లాడెన్ లాగా ఎక్కడ దాక్కున్నా పట్టుకొని మీపని చెప్తాం. సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని నడుపుతున్న స్లాటర్ హౌసులను వదిలిపెట్టం. మా దాడి వేరే విధంగా ఉంటది. కేసీఆర్‌ది మొదటినుంచి గొప్ప క్షమాగుణం. ఆయన క్షమించినా మేము క్షమించం. భేషరతుగా మహా న్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని జగదీష్‌ రెడ్డి డిమాండ్ చేశారు.  

చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

  ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24 గంటల పాటు చార్ ధామ్ యాత్రను నిలిపేశారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ప్రస్తుతం ఒడిశా లోని పూరీలో జగన్నాథ రథయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పూరీలోని జగన్నాథ రథయాత్రలో తాజాగా అపశృతి జరిగింది. అక్కడి గుడించా దేవాలయం వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది.  ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు భక్తులు మృతి చెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరుకైన ప్రాంతంలో చెక్కదొంగల లోడుతో ఉన్న ట్రక్కులు రావడంతో తోపులాట జరిగిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు నెట్టుకొని.. కింద పడిపోయారని చెబుతున్నారు. అంతలోనే ముగ్గురు మరణించారని కూడా సమాచారం అందుతుంది.

నారాయణకే తెలియని మర్మం...?

  ఏపీ లిక్కర్ స్కాం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు దొడ్డిదారిన స్వాహా చేసి బినామీ కంపెనీలు.. హవాలా మార్గంలో తెచ్చుకుని ఎన్నికలకు వినియోగించారనేది సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కుంభకోణం తిరుపతితో కూడా సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా అనుచరులు, స్నేహితులు పాత్ర ఉందని స్పష్టం అయ్యింది.  ఇక కీలక పాత్రధారి పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా తిరుపతి, శ్రీకాళహస్తి కి చెందిన పలువురు దొంగ కంపెనీలతో సిండికేట్ గా ఐదేళ్ల పాటు అక్రమ మార్గంలో సక్రమంగా మద్యం నిధులు కొల్లగొట్టారు. ఇంత జరుగుతున్న గత ఐదేళ్ల లో ఎక్సైజ్ శాఖ మంత్రి గా, డిప్యూటీ సీఎం గా, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గా పని చేసిన కె.నారాయణ స్వామి పాత్ర పై సిట్ ఆలోచించిందా... లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ మద్యం కుంభకోణంలో ఒక మంత్రిగా డమ్మి వ్యక్తిని సొంత జిల్లాలోనే పెట్టుకుని ఇలా మద్యం కుంభకోణం చేశారనే ఆరోపణలు లేకపోలేదు.  ఇటీవల నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన పర్యటనలో నారాయణ స్వామికి సంతకం పెట్టలేదు కూడా రాదని అన్నాడు అని వ్యాఖ్యానించారు... అయితే సంతకం కూడా రాని వ్యక్తి ఐదేళ్లలో మంత్రిగా పని చేసారా...? సంతకం రాని వ్యక్తికి... కాదు కాదు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కి కూడా తెలియకుండా ఇంత కుంభకోణం జరిగిందా.. లేదా తెలిసినా సహకరించారా.. భవిష్యత్తులో మాజీ మంత్రి హస్తం పై విచారణ జరిగే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది. నారాయణ స్వామిని వద్ద మద్యం కుంభకోణం పేరు ఎత్తగానే చిరెత్తుకొచ్చి నువ్వే చెప్పు చంద్రబాబు కు నన్ను అరెస్టు చేయమని అంటూ రుసరుసలాడారు. త్వరలో మద్యం కుంభకోణం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. 

అది జ‌గ‌న్ మార్క్...క్యూఆర్ స్కాన్ కాదు స్కామ్ గురూ

  ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో అంటే ఏంటంటే.. రీకాలింగ్ ఆఫ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో. దీన్ని కొత్త‌గా నిర్వ‌హించాల‌ని థింక్ చేసిన జ‌గ‌న్ అండ్ కో.. స్వామి కార్యం స్వ‌కార్యం చ‌క్క‌బెట్టే య‌త్నం చేస్తోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఇలాంటి అతి కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్టు గ‌త కొంత కాలంగా పార్టీలో ఉన్న సొంత నాయ‌కులే కామెంట్లు చేస్తున్న ప‌రిస్థితి. ఇపుడీ క్యూఆర్ కోడ్ అందులో భాగ‌మ‌ని.. ఇది కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కింద‌కే వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. గ‌తంలో గ‌డప గ‌డ‌ప‌కూ వైసీపీ చెప్పుకోడానికి క్రేజీగానే ఉన్నా.. అందులోంచి వ‌చ్చిన ఫ‌లితాలు రివ‌ర్స్ కొట్టిన విష‌యం తెలిసిందే. జ‌నం ఈ విధానం దారుణంగా తిప్పి కొట్టిన విష‌యం మ‌న‌మంతా చూసే ఉంటాం. ఎవ‌రైనా తెలివైన వారు ఇలాంటి వారికి పూర్తి దూరంగా ఉంటారు. కానీ ఇక్క‌డ దీనికి కొన‌సాగింపుగా వ‌స్తోన్న కొత్త విధాన‌మేంటంటే.. రియ‌ల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది త‌ర‌హాలో ఒక క్యూ ఆర్ కోడ్ పాంప్లెంట్ ప‌ట్టుకుకెళ్లేలా ఒక ఎత్తుగ‌డ‌. త‌ద్వారా వాళ్ల ఫోన్లో స్కాన్ తీయించి.. కూట‌మి ప్ర‌భుత్వంలో ఆయా ల‌బ్ధిదారుల‌కు ఏయే ప‌థ‌కాలు వ‌చ్చాయో చూస్తారు. త‌ద్వారా ఒక డాటా బ‌య‌ట‌కు తీయాల‌న్న‌ది ఒక ఆలోచ‌న‌. అప్పట్లో స్కీములు తీసుకున్న వారెవ‌రు? ఇప్పుడు కొత్త‌గా ఆ ప‌థ‌కాలు కోల్పోయిన వారెవ‌రు? అన్న‌ది బ‌య‌ట‌కు లాగాల‌న్న‌ది జ‌గ‌న్ మార్క్ స్కెచ్ అయితే ఇక్క‌డ మ‌రో ప్ర‌మాద‌మేంటంటే.. వైసీపీలో ఉండేవారంతా దాదాపు రౌడీ బ్యాచ్. మొన్న తెనాలి, త‌ర్వాత ప‌ల్నాడు సంగ‌తి చూసే ఉంటాంగా. గంజాయి తాగేవాళ్లు, బెట్టింగులు ఆడే వాళ్లే ఎక్కువ‌గా ఉంటారు. ఒక‌సారిగానీ ఈ స్కాన్ లోకి గానీ మ‌న ఫోన్ నెంబ‌ర్, దానికి అటాచ్ అయిన ఉన్న బ్యాంకు ఖాతాలు ఇత‌ర వివ‌రాలుగాని వెళ్తే.. ఇంకేం లేదు.. ఖాతాల‌కు ఖాతాలు ఖాళీ అయిపోయే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు. ఇదంతా ఇలా ఉంటే మ‌న ఇంట్లోని పూర్తి వివ‌రాలు వారి చేతికి వెళ్తే.. ఎప్పుడు ఎలాంటి కండీష‌న్లో మ‌న‌పై సైబ‌ర్ దాడులు జ‌రుగుతాయో చెప్పలేం. దానికి తోడు కుటుంబంలోని ఆడ‌పిల్ల‌లు వారి వివ‌రాలు కూడా వీటి ద్వారా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఒక కుటుంబ‌ గోప్య‌త  మొత్తం వారి గుప్పెట్లోకి వెళ్లిపోతుంది కాబ‌ట్టి.. బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటున్నారు సైబ‌ర్ ఎక్స్ ప‌ర్ట్స్.

యాంకర్ స్వేచ్ఛ సుసైడ్‌ కేసులో కీలక మలుపు

  యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్చ సుసైడ్‌కి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  పూర్ణచందర్ రాత్రి 11 గంటలకు న్యాయవాది సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో  లొంగిపోయిరు. తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్‌ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  దీంతో పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. స్వేచ్ఛ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచంద్రను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూర్ణచందర్ విడుదల చేసిన లేఖ వైరల్‌గా మారింది. ఇక పూర్ణ చందర్ విడుద‌ల చేసిన లేఖలో స్వేచ్ఛ జీవితం, వారి సంబంధం, ఆమె మానసిక స్థితి, కుటుంబ నేపథ్యంకి సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. తనకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసని, ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్‌లో ప‌ని చేశామ‌ని చెప్పారు. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకుంటూ ఉండేదని గుర్తుచేశారు. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైందని ఆయన పేర్కొన్నారు.  2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా తన వద్దకు తీసుకువచ్చిందని పూర్ణచందర్ పేర్కొన్నారు. తాజాగా పూర్ణ చందర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.స్వేచ్ఛ కూతురు స్టేట్‌మెంట్ ఆధారంగా పోక్సో కేసు ఫైల్ చేశారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు అరణ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు. నమ్మించి మోసం చేయడం.. ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులో.. 69 BNS, 108 BNS సెక్షన్ల కింద కేసు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  

తాడిపత్రిలో హైటెన్షన్..పెద్దారెడ్డి అరెస్ట్

  అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది కాలం తర్వాత పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు తాడిపత్రి ఇంట్లో ఉండరాదంటూ విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి.. నా ఇంట్లో నేను ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చేసేదేంలేక పెద్దారెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.  ప్రస్తుతం పెద్దిరెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు  సమాచారం. మరోవైపు.. హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ స్థానిక ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాకను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలోవైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని, తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని జేసీ  ఆరోపించారు.  తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు.గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను గెలిచినా, ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజం చేస్తానని చెప్పారు. దీంతో తెలుగు దేశం పార్టీలు నేతలు గత కొంత కాలంగా ఆయన్ను తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదివారం కూడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  

జూబ్లీ తెరపైకి ..మరో మాగంటి

  జూబ్లీహిల్స్ అసెంబ్లీ  నియోజకవర్గం ఉప ఎన్నికకు  ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. సిట్టింగ్ బీర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉపఎన్నిక అనివార్యమైన జూబ్లీ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంటే, ఇప్పటికే, ఉప ఎన్నిక రూట్లో కంటోన్మెంట్ సీటును తమ ఖాతాలో వేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ,   జూబ్లీలోనూ బీఆర్‌ఎస్‌’ను ఓడించి, సిటీలో మరో సీటును తమ ఖాతాలో వేసుకోవాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. మరో వంక, బీజేపీ ఫ్యూచర్ వ్యూహాలకు పునాదులు వేసుకునే ప్రయత్నంలో భాగంగా, ఏపీలో సక్సెస్ అయిన, కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో రీప్లే చేసేందుకు జూబ్లీహిల్స్ నియోజక వర్గాన్ని ప్రయోగశాల చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  నిజానికి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గలో గెలుపు ఓటములను నిర్ణయించడంలో, ఒక లక్షా 23 వేల వరకు ఉన్న ముస్లిం ఓటు, 70 వేలకు పైగా ఉన్న సెటిలర్స్’ ఓటు కీలకం కాగా, పార్టీలు, పొత్తులు, అంతకు మించి అభ్యర్ధుల ఎంపిక గెలుపు ఓటములను నిర్ణయించడంలో మరింత కీలకం కాగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.అందుకే, ప్రధాన పార్టీలు, ఓ వంక పొత్తులు, లోపాయికారీ ఒప్పందాలపై కసరత్తు చేస్తూనే, మరో వంక అభ్యర్ధుల, ‘లెక్కలు’ తేల్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.  పొత్తుల విషయానికివస్తే,కాంగ్రెస్ పార్టీ లక్షకు పైగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని,ముస్లిం అభ్యర్ధిని బరిలో దింపి ఎంఐఎంతో లోపాయికారీ, ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో, బీఆర్ఎస్’ ఇదే ప్రయోగం (ఎంఐఎం లోపాయి కారీ ఒప్పందం) చేసి, విజయం సాదించిన నేపధ్యంలో కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ బాటలో నడవాలనే ఆలోచన చేస్తున్నట్లు చెపుతున్నారు. గత (2023)అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్’ను బరిలో దింపింది, అయినా, బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి గోపీనాథ్’ 16 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.ఎంఐఎం అభ్యర్ధికి 7,848 ఓట్లు మాత్రమే వచ్చాయి.అంటే, ముస్లిం ఓటును ఎంఐఎం సక్సెస్ఫుల్’ గా బీఆర్ఎస్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ వార్ రూమ్’లో పాత ఫలితాలను ముందేసుకుని, కొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెసుస్తోంది. అలాగే, పార్టీ టికెట్లను ఆశిస్తున్న నేతల బలాబలాలు, పాపులారిటీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అంతర్గత సర్వే నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ టికెట్‌ తనకే దక్కుతుందని ధీమాను వ్యక్తం చేశారు. అయితే, పార్టీ నాయకత్వం గతంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్లను ఆశించిన నేతలతో పాటు ప్రస్తుతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, సర్వేల ఆధారంగా అధిష్ఠానం టికెట్‌ ఖరారు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే  స్పష్టం  చేశారు.  మరోవంక,బీఆర్ఎస్’ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యల్యాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో చేతులు ఎత్తేసిన హస్తం పార్టీ మోసాలతో పాటుగా, వరసగా మూడు సార్లు గెలిచిన ‘మాగంటి’ గోపీనాథ్’ ఇంటి పేరునే ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలో దించాలని, అనుకున్నా,ఆమె అంత సుముఖమ లేరని అంటున్నారు.  ఈ నేపధ్యంలో, గులాబీ పార్టీ,మాగంటి గోపీనాథ్ సోదరుడు, మాగంటి వజ్రనాథ్’ను తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.నిజానికి, ‘మాగంటి’ రాజకీయ,వ్యాపార విజయాలలో గోపీనాథ్ తెరమీద హీరో అయితే, తెర వెనక హీరో,’వజ్రనాథ్’, అంటూ బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే, మాగంటి సోదరులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ 90 ఏళ్ళు పైబడిన, తల్లి మహానంద దేవి’ మాట జవదాటరని, అంటున్నారు.  మరోవంక  బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్’ కు గోపీనాథ్’కు ఎంత గుర్తింపు గౌరవం వుందో, వజ్రనాథ్’కు అంతే గుర్తింపు గౌరవం,ఉన్నాయని, అలాగే,వరసగ మూడు ఎన్నికల్లో సోదరుడి ఎన్నిల బాధ్యతను బుజానికి ఎత్తుకుని విజయవంతంగా పూర్తి చేసిన వజ్రనాథ్’కు నియోజక వర్గం, ఎత్తుపల్లాలు అన్నీ కొట్టిన పిండని, బీఆర్ఎస్ వర్గాలు వజ్రనాథ్’ ను తెరపైకి  తెచ్చేప్రయత్నం చేస్తున్నాయి. సో .. గులాబీ బాస్’మరో, ‘మాగంటిని’ బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు చెపుతునన్నారు. అయితే, పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సహా మరికొందరు, టికెట్ ఆశిస్తున్న నేపధ్యంలో, గులాబీ బాస్’  ఇంతవరకు ఎవరి విషయంలోనూ ఒక నిర్ణయానికి  రాలేదని అంటున్నారు. ఓ వంక అధిఅక్ర కాంగ్రెస్, మరో వంక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోందని, అంటున్నారు.