ఇక టీటీడీ పుస్తక ప్రసాదం!

దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని  అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి మహాత్మ్యం, వైభవం అతి సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా చిన్న సైజులో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది.  మతమార్పిడులను అరికట్టడం, హిందూ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా ఇందుకు సంకల్పించింది.   శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివ స్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర, తదితర హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల్లో ఉచితంగా  పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక  పుస్తకాలను చిన్న సైజులో   భక్తులు చేతిలో ఇమిడే విధంగా  ముద్రించి  దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు తిరుమల తిరుపతిలలో కూడా భక్తులకు వీటిని  శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయాలని నిర్ణయించినట్లు బీఆర్నాయుడు తెలిపారు. అలాగే తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు వీటిని అందజేస్తామన్నారు.   

తెలంగాణ క్రీడాభివృద్ధిలో భాగస్వామిగా ఉంటా.. రేవంత్ తో కపిల్ దేవ్

 క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు. తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధికి రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను కపిల్ దేవ్ అభినందించారు. రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కపిల్‌దేవ్‌కు సీఎం రేవంత్‌ వివరించారు. దీంతో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీతోపాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలోనూ తాను భాగస్వామిగా ఉంటానని కపిల్ దేవ్ ముందుకు వచ్చారు.

తెలంగాణలో మీడియా, సినిమా రంగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా.. సీఎం రేవంత్ తో అజయ్ దేవగన్

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోమవారం (జులై7) క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌,  వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్జాతీయ స్థాయి  స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కూడా అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి అజయ్ దేవ‌గ‌ణ్‌కు వివ‌రించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాల‌కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాన‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. 

స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు. పలువురు విద్యార్థలు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కడలూరు చెమ్మన్ గుప్పం రైల్వే గేటు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రైలు వచ్చే సమయం అయినా కూడా రైల్వే గేటు వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.  పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో.. ఆ ధాటికి స్కూలు బస్సు దాదాపు 50 మీటర్ల దూరానికి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘట స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు.  

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసంపై దాడి

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ సమీపంలో సుజాతమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగుదశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఇలా ఉండగా వేమిరెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  

సినీ, క్రీడా ప్ర‌ముఖుల‌తో సీఎం రేవంత్

రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్ద‌రు సినీ క్రీడా సెల‌బ్రిటీల‌ను క‌లిశారు. వారిలో ఒక‌రు 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత లెజండరీ క్రికెటర్ క‌పిల్ దేవ్ కాగా. మ‌రొక‌రు న‌టుడు, నిర్మాత  అజ‌య్ దేవ్ గ‌న్.  ఈ మ‌ధ్య ప‌దే ప‌దే రేవంత్   140 కోట్ల భార‌త దేశం నుంచి వ‌చ్చే ప‌త‌కాల సంఖ్య కేవ‌లం వేళ్ల మీద లెక్క‌బెట్ట‌గ‌లిగేంత మాత్ర‌మేనా? అంటున్నారు.   ఈ క్ర‌మంలో చూస్తే.. క‌పిల్ దేవ్ లాంటి క్రీడా ప్ర‌ముఖుల  స‌ల‌హా  సూచ‌న‌లు చాలా చాలా అవ‌స‌రం. దానికి తోడు ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించ‌మ‌ని, ఆపై క్రీడ‌ల‌ కోసం  వంద కోట్లు ఇవ్వ‌మ‌ని ఆయ‌న కేంద్ర మంత్రిని క‌లిసి మ‌రీ విన్న‌వించుకున్నారు. ఇక ఒలింపిక్స్- 2036 రెండు ఈవెంట్లు.. తెలంగాణ రాష్ట్రంలో జ‌ర‌ప‌మ‌ని కూడా అడిగారు సీఎం రేవంత్.  ఇక అజ‌య్ దేవ్ గ‌న్ సీఎం భేటీలోని ముఖ్యాంశ‌మేంట‌ని చూస్తే.. హైద‌రాబాద్ లో ఫిల్మ్ స్టూడియో క‌ట్ట‌డానికి త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల్సిందిగా దేవ్ గ‌న్ సీఎం రేవంత్ ని అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అజ‌య్ దేవ్ గ‌న్ కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ఒకటి మాదాపూర్ లో   ఉంది. ఇక్క‌డే ఒక ఫుల్ స్టూడియో సెట‌ప్ ఉంటే బావుండ‌ని అజ‌య్ దేవ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందుకోసమే  సీఎం రేవంత్ ని అజ‌య్ దేవగన్ కోరినట్లుగా తెలుస్తోంది.  

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. సై, ఛత్రపతి, బాహుబలి, రాజన్న, ఆర్ఆర్ఆర్ సినిమాలకు శివశక్తి దత్తా పాటలు రాశారు. కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. అలాగే జానకిరాముడు చిత్రానికి శివశక్తి దత్తా రచయతగా పని చేశారు. ఇక చంద్రహాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా స్వయానా సోదరులు.  శివశక్తి దత్తా మృతితో కీరవాణి, రాజమౌలి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. శివశక్తిదత్తా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం డ్యామ్

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇలా ఉండగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున నీటి వరద కొనసాగుతోంది. సుంకేసుల, జారాల నుంచి లక్షా 72 వేల 705 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. కాగా శ్రీశైలం జలశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 881.60 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం పర్యటను రానున్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదలకు ముందు  చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. అంతకు ముందంు ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.  ఇలా ఉండగా జులై నెలలోనే శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం పాతికేళ్లలో ఇదే తొలి5 సారి. ఇక పోతే చంద్రబాబు శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అనంతరం  నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు.  

రొట్టెల పండుగలో మంత్రి నారాలోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య రొట్టెను పట్టుకున్నట్లు నారా లోకేష్ చెప్పారు.  ముఖ్యమంత్రి  ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.  ప్రజల శ్రేయస్సే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మతసామరస్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందిన బారాషాహీద్ మసీదులో జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఈ రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది తరలివస్తారు. స్వర్ణాల చెరువులో తమ కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకుంటారు. 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవదహనం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు.   హైదరాబాద్‌కు చెందిన శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తమ పిల్లలతో పాటు ఇటీవల వెకేషన్‌ కోసం అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి సరదాగా అంట్లాంటా వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి తిరిగి డల్లాస్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు గ్రీన్ కౌంటీ ప్రాంతానికి చేరుకున్నది. అక్కడ రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ట్రక్ వారు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొనడంతో   కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వెంకట్, తేజస్విని, వారి ఇద్దరు పిల్లలూ సజీవదహనమయ్యారు. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వాళ్ల కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తహా తమ ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు.  

రాజాసింగ్ సై అంటారా.. సరండెర్ అవుతారా?

  గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా?  పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను  అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ  సీరియస్ గా తీసుకుందా? అందుకే..  ఆయన గేటు దాటక ముందే ఆయన సమర్పించిన రాజీనామా లేఖను..  అప్పటి  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారా? అందుకే..  సంప్రదింపులు బుజ్జగింపులకు స్కోప్ లేకుండా  పార్టీ అధికార ప్రతినిధి  రాణి రుద్రమ ద్వారా, క్రమశిక్షణ  గీత దాటిన  రాజాసింగ్  విషయంలో పార్టీ  కఠినంగా ఉంటుందనే సంకేతాలు ఇప్పించారా ? అంటే..  పార్టీ వర్గాల  అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి.. రాజా సింగ్’ ‘కట్టర్’ హిందుత్వ వాది. అందులో సందేహం లేదు. అలాగే..  జనంలో మంచి ఫాలోయింగ్  ఉన్న నాయకుడు. ఈ విషయంలోనూ ఎలాంటి సందేహం లేదు. బీజేపీ కార్యకర్తల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఒక్క పిలుపుతో వందలు కాదు వేల మంది కార్యకర్తలను కదిలించగల చేయగల ఏకైక సిటీ నాయకుడు రాజా సింగ్.  కార్యకర్తల్లోనే కాదు..  కార్పొరేటర్లు, ఇతర స్థానిక నాయకులు కూడా  రాజా సింగ్ ను పార్టీతో సమానంగా చూస్తారు. అందుకే..  గోషామహల్ స్థానిక నాయకులు, కార్యకర్తలు బీజేపీ, రాజాసింగ్ తమకు రెండు కళ్ళు.. ఎవరినీ  వదులుకునేది లేదని అంటున్నారు. రాజా సింగ్ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే.. ఎన్ని సుగుణాలు ఉన్నా,  క్రమశిక్షణ గీత దాటి బీజేపీలో కొనసాగడం అయ్యేపని కాదని  పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి.. ఇప్పటికే రాజా సింగ్ కు పార్టీ లాంగ్ రోప్ ఇచ్చింది. అనేక మార్లు ఆయన గీత దాటినా, ఆయనకున్న ప్రత్యేక అర్హతల దృష్ట్యా పార్టీ నాయకత్వం చూసీచూడనట్లు వదిలేసింది. అయితే.. ఇక ఇప్పుడు ఉపేక్షించే పరిస్థితి ఉండదని రాజా సింగ్ అనుకూల వర్గం నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.  అయితే..  రాజా సింగ్ కోరుకున్న విధంగా ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపి ఆయన్ని సస్పెండ్ చేయమనో, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమనో కోరే పరిస్థితి అయితే రాకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో రాజా సింగ్  తనంతట తానుగా రాజీనామా చేస్తే..  ఉప ఎన్నిక వస్తే  బీజేపీ తమ అభ్యర్ధిని బరిలో  దింపుతుందని అంటున్నారు.  అందుకు రంగం సిద్దం చేసుకుంటోందనీ చెబుతున్నారు.  నిజానికి.. ఉప ఎన్నిక వస్తుందా? రాదా?  అనే విషయంతో సంబంధం లేకుండా  రాజాసింగ్  స్థానంలో మాధవీ లతను ఓల్డ్ సిటీ  లీడర్ గా నిలిపేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవును..  గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్  స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీని ఎదుర్కున్న ఫైర్ బ్రాండ్ లేడీ మాధవీ లతను రంగంలోకి దించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి..  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్  మాధవీ లతతో మాట్లాడి, గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక వచ్చినా రాక పోయినా.. అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా,.. పాత బస్తీలో  రాజాసింగ్ పాత్రను ఇక పై మీరే పోషించవలసి ఉంటుందని మాధవీలతకు బీజేపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో వంక రాజా సింగ్  తాను పార్టీని వదిలినా, హిందుత్వ సిద్దాంతాన్ని వదిలేది లేదని అంటున్నారు. అలాగే..  ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా  నాయకత్వాన్ని సమర్దిస్తానని అంటున్నారు. అంతే కాదు.. తన కోసం పార్టీ క్యాడర్  ఎవరూ పార్టీ వదలవద్దని  వీడ్కోలు సందేశం(?)ఇస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన కూడా రాజాసింగ్ కు లేదని, అంటున్నారు. ఈ నేపద్యంలో రాజాసింగ్  నెక్స్ట్ మూవ్ ఏమిటి? సరెండర్ అవుతారా ? సై .. అంటారా ? అనేది తేలవలసి వుందని అంటున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు అటు  బీజేపీ నుంచి కానీ, ఇటు రాజాసింగ్ వైపు నుంచి కానీ, తీవ్ర నిర్ణయం ( డ్రాస్టిక్’ స్టెప్) ఏదీ  ఉండక పోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం గా చెపుతున్నారు.  సో..గోషా మహల్ ఉప ఎన్నికకు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం.  

విద్యార్థిగా మారి చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన లోకేష్

మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్‌ హై స్కూల్‌ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించారు.  ఈ సందర్బంగా చిన్నారులతో లోకేష్ ఫొటోలు దిగారు.  అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన వీఆర్ హై స్కూల్‌ను  స్కూల్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీ4 కింద స్కూలు అభివృద్ధికి ముందుకు వచ్చిన పొంగూరు షరణి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజులను లోకేష్ సత్కరించారు. అనంతరం పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించిన ఆయన కొద్ది సేపు విద్యార్థిగా మారిపోయి చిన్నారులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.  

తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరి మృతి

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో  దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.  సైకో దాడిలో కనీసం ముగ్గురు గాయపడ్డారు. ఒకరు మరణించారు. మృతుడిని శేఖర్ గా గుర్తించారు. ఇక కపిలతీర్థం పార్కింగ్ స్థలంలో పని చేసే సుబ్రహ్మణ్యం, అదే ప్రాంతంలో నివసించే కల్పనలకు కల్పన గాయపడ్డారు. గాయపడని వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.   సైకో వీరంగంతో దాదాపు గంట సేపు ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనలతో వణికిపోయారు. చివరకు అతి కష్టం మీద స్థానికులు, పోలీసులు, మునిసిపల్ సిబ్బంది సైకోను వల వేసి పట్టుకున్నారు. అనంతరం ఆ సైకోనుదాదాపు గంటసేపు స్థానికులు, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది ప్రయాసలు పడి నిందితున్ని వలవేసి పట్టుకున్నారు. అనంతరం  ఆస్పత్రికి తరలించారు

బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక.. దీటుగా స్పందించిన చైనా

డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే  దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు. బ్రెజిల్‌లో బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  స్పెసిఫిక్ గా బ్రిక్స్ పేరు ఎత్తకుండానే ఆయన ఆ కూటమిని ఉద్దేశించే సుంకాల పెంపు వ్యాఖ్యలు చేశారు.  ఈ సదస్సులో భారత ప్రధాని మోడీ సహా సభ్య దేశాధినేతలందరూ అమెరికా సుంకాల విధానాన్ని ప్రస్తావించి విమర్శలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఎదురుదాడి అన్నట్లుగా అదనంగాపదిశాతం సుంకాల హెచ్చరిక జారీ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా ట్రంప్ తాజా హెచ్చరికపై చైనా దీటుగా స్పందించింది.   తాము ఘర్షణను కోరుకోవడం లేదని పునరుద్ఘాటిస్తూను టాక్స్ వార్ లో ఎవరూ గెలవరని పరోక్షంగా ట్రంప్ ను హెచ్చరించింది.  గతంలో అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధం నడిచినప్పటికీ, ఆ తర్వాత కుదిరిన ఒప్పందంతో అది తాత్కాలికంగా సద్దుమణిగిన సంగతి విదితమే.   బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో  ఇప్పుడు  ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.

తోతాపురి మామిడి రైతుకు చంద్రబాబు అండ! రైతుల ఆనందం!

మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని మూడు జిల్లాలలో మామిడిరైతులు తోతాపురి రకం మామిడి పండించారు. ఈ రకం మామిడికి డిమాండ్ లేకపోవడంతో పంట అమ్ముడుపోయే పరిస్థితి లేక తీవ్రగా నష్టాలు మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది.  ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బంగారుపాల్యం పర్యటనకు రానున్నారు. ఆయన యాత్ర ముఖ్య ఉద్దేశం మామిడియార్డ్ ను సందర్శించి, రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం కోసం జగన్ బంగారుపాల్యం యాత్ర తలపోశారు. ఇందుకు  ఇప్పటికే పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు మామిడి రైతులను అందుకోవడానికి పలు చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి కూడా. ఇప్పటికే చంద్రబాబు చొరవతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి రైతులకు మద్దతుగా ట్రేడర్లు నిలిచారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ముందుకు వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో 3 లక్షల 8 వేల 261 మెట్రిక్ టన్నల తోతాపురి మామిడి కొనుగోలు జరిగింది.  సీఎం చంద్రబాబు  ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి.  అలాగే ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. ఇప్పటి వరకూ  మొత్తం 50,922 మంది రైతుల నుంచి  మామిడి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు ధృవీకరించారు. మూడు జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి   రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులుతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేశారు. ఇక రైతులకు కేజీకి నాలుగు రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తోంది. ఇక ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి రూ.8 చెల్లించి మామిడి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే మొత్తంగా రైతులకు కేజీ మామిడికి రూ.12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో బంగారుపాల్యం పర్యటన ద్వారా జగన్ ఏ సాధిద్దా మనుకుం టున్నారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 

ఏజీపై తెలుగుదేశం లీగల్ సెల్ ఫిర్యాదు.. చంద్రబాబు, లోకేష్ కు ఇంటర్నల్ నోట్!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టన ఈ ఏడాది కాలంలో  ఏపీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టోంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్నిల్ నియామకాలు, పని తీరుపై పార్టీ లీగల్ సెల్ పలు అంశాలపై ఇంటర్నల్ నోట్ పంపింది. ప్రస్తుతం అధిఅధికార టీడీపీ లీగల్ సెల్ న్యాయ అధికారుల పనితీరు మరియు పనితీరుపై పంపిన 76 పేజీల అంతర్గతనోట్ లో పలు ఫిర్యాదులు చేసింది.  వాటిలో మాజీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై  మైనింగ్ కేసులో ప్రభుత్వం తరపున వాదించడానికి  జూనియర్ న్యాయవాదిని నియమించి  ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేయడమే కాకుండా బెయిలు మంజూరు చేయడానికి దోహదం చేసిందని ఆరోపించింది.  అదే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నిందితుల తరఫున పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారనీ, ఆయన ప్రభుత్వ వాదనను పూర్వపక్షం చేస్తూ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని వాదించారీ టీడీపీ లీగల్ సెల్ ఆ ఇంటర్నల్ నోట్ లో పేర్కొంది.   ఇక పోతే గత జగన్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ఏడుగురు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదులు, అలాగే 23 మంది స్టాండింగ్ కౌన్సిల్లే ఇంకా అలాగే కొనాసగుతున్నారని పేర్కొంది.  అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి ఏడాది కాలం పూర్తియిన తరువాత కూడా పది మంది ప్రభుత్వ న్యాయవాదు, 60 స్టాండింగ్ కౌన్సెల్ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నాయని పేర్కొంది.   అలాగే జగన్ హయాంలో తెలుగుదేశం తరఫున వాదించిన పలువురు న్యాయవాదులు సముచిత పదవుల కోసం ఎదురు చూస్తున్నా, ఖాళీల భర్తీ విషయంలో ఏజీ చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.   మొత్తం మీద ప్రభుత్వానికి ఏజీ లక్ష్యంగా తెలుగుదేశం లీగల్ సెల్ ఇంటర్నల్ నోట్ పంపడం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

టెస్టుల్లో శుభ్.. ఆరంభం!

ఎట్ట‌కేల‌కు భార‌త్ యువ‌సేన ఇంగ్లండ్ గ‌డ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. కార‌ణం.. ఒక‌టి శుభ్ మ‌న్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్. మూడు ఫీల్డింగ్. ఈ మూడింటి ద్వారా గిల్ త‌న టెస్టు కెప్టెన్సీలో రికార్డు విజ‌యాన్ని న‌మోదు చేశాడు.  ఎడ్జ్ బాస్ట‌న్ అనే ఈ గ్రౌండ్ లో ఏ ఆసియా జ‌ట్టు కూడా ఇంత వ‌ర‌కూ గెల‌వ‌లేదు. 2022లోనూ ఇక్క‌డ టీమిండియా ఓట‌మి పాలైంది. ఒక ప‌క్క రివేంజ్ తీర్చుకుంటూ మ‌రొక ప‌క్క రిక‌ర్డు విజ‌యాన్ని క్రియేట్ చేసింది గిల్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు. ఇక్క‌గ గ‌మ‌నించాల్సిన రెండు ముఖ్య‌మైన అంశాలేంటంటే.. ఒక‌టి రోహిత్, విరాట్ లాంటి హేమా హేమీ బ్యాట‌ర్లు లేక పోవ‌డం. రెండు బూమ్రా కూడా రెండో టెస్టుకు రెస్టు తీసుకోవ‌డం. మ‌రో ప‌క్క చూస్తే ఆదిలోనే హంస‌పాదులాగా.. తొలి టెస్టు ఓట‌మి మూట‌గ‌ట్టుకోవ‌డం. దీంతో గిల్ ఒక రోహిత్ మ‌రో  కోహ్లీని త‌న‌లో ఇముడ్చుకుని.. అమాంతం జ‌ట్టు బ్యాటింగ్ భార‌మంతా మోశాడు.. ఏకంగా ఒక ఇన్నింగ్స్ లో డ‌బుల్, మ‌రో ఇన్నింగ్స్ లో 150 ప్ల‌స్ ప‌రుగులు చేసి.. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జ‌ట్టుకు 600 ప్ల‌స్ ప‌రుగుల ల‌క్ష్యం నిర్దేశించాడు. అంతేనా పలు రికార్డుల‌ను త‌న పేర లిఖించుకున్నాడు. గ్రాహం గూచ్ త‌ర్వాత ఒకే టెస్టులో అత్య‌ధిక ప‌రుగుల రికార్డును తిర‌గ‌రాశాడు. గ‌తంలో గ‌వాస్క‌ర్ చేసిన డ‌బుల్, సింగిల్ సెంచ‌రీ ఫీట్ కూడా రిపీట్  చేశాడు. ఇక మ‌రో ముఖ్య‌మైన విష‌యం సిరాజ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ సాధించ‌గా.. ఆకాష్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల‌తో టెన్ వికెట్ హాల్ లో చేరాడు. ఈ ఇద్ద‌రు సీమ‌ర్లు ఏకంగా 17 వికెట్లు కొల్ల‌గొట్టారు.  ఈ కార‌ణాల చేత భార‌త్ త‌న రెండో టెస్టులో అపూర్వ విజ‌యం సాధించింది.  ఇప్పటి వరకూ విదేశాల్లో విజయం సాధించిన టీమ్ ఇండియా జట్లలో ఎడ్జ్ బాస్టన్ లో సాధించిన విజయమే పరుగుల పరంగా అతి భారీది. 

అధ్య‌క్షుడు కాలేని మస్క్ పార్టీ పెట్టి ప్ర‌యోజ‌న‌మేంటి?

మ‌స్క్ పెట్టిన  పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒక‌రు అధ్య‌క్షులు కావాలంటే..  అందుకు ఫ‌స్ట్ వారు  జ‌న్మ‌తహ అమెరికా పౌరులై ఉండాలి.  35 ఏళ్ల‌ పైబ‌డి వ‌య‌సుగ‌ల వారై ఉండాలి.  ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మ‌స్క్ కి   లేవు. ఆయ‌న ద‌క్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు. ఇది సౌతాఫ్రికా కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని. గ‌తంలో జ‌గ‌న్ త‌న  పాల‌న‌లో మూడు రాజ‌ధానుల పాల‌సీ తెచ్చిందే ఇక్క‌డి నుంచి కాపీ కొట్టే అన్నసంగతి తెలిసిందే. అది పక్కన పెడితే.. మస్క్ కి ఎక్కడా  అమెరిక‌న్ మూలాలు కూడా లేవు.   మూలాలు ఉంటే, అయినా వంశ‌పారంప‌ర్య వార‌స‌త్వ‌మైనా వ‌చ్చేది. అయితే అమెరికాలో పుట్ట‌కుండా అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను అలంక‌రించిన వారు లేరా? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే..  జాన్ మెక్ కెయిన్. ఇక్కడ ఆయన్ను సేఫ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే.. ఆయన స్వతహాగా అమెరికాలో పుట్టిన వారు కారు.  జాన్ మెక్‌కెయిన్ పనామా కెనాల్ జోన్‌ లో జన్మించారు.  1936 ఆగస్టు 29 న పనామా కెనాల్ జోన్‌లోని కోకో సోలో నావల్ ఎయిర్ స్టేషన్‌లో జన్మించారు, ఆయన తండ్రి నావికా అధికారి కావడంతో ఆయన ఆ ప్రాంతంలో జన్మించారు. ఆ సమయంలో అంటే 1903 నుంచి 1979 వరకూ పనామా కెనాల్ జోన్ యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ప్రాంతం అమెరికా నుంచి వేరు పడింది. అయితే ఆయన పుట్టిన సమయంలో అక్కడ అమెరికా పాలన ఉండటంతో.. ఆయన్ను అమెరికన్ గానే పరిగణించింది అమెరికా రాజ్యాంగం. దీంతో ఆయన 2008లో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు.  అయితే కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టర్ ఆర్థర్ గురించి చెబుతారు. అయితే ఈ విషయంలోనూ అవును, కాదూ అంటూ కొన్ని వివాదాలున్నాయి. దీంతో పాటు బ్రిటిష్ అమెరికా బార్న్ అధ్యక్షులు కొందరున్నారు. వారే వాషింగ్టన్, ఆడమ్స్, జెఫెర్సన్, మాడిసన్, మన్రో, క్విన్సీ ఆడమ్స్, జాక్సన్, విలియం హారిసన్‌. వీరు అమెరికాలో కాకుండా బ్రిటిష్ అమెరికాలో జన్మించారు. కానీ ఇదేమంత తప్పు కాదని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని ఎన్నో ప్రాంతాలు బ్రిటన్ అధీనంలో ఉండేవి. అమెరికాలో జన్మించిన తొలి అధ్యక్షుడెవరని చూస్తే..  మార్టిన్ వాన్ బ్యూరెన్. ఈయన 1782లో న్యూయార్క్‌లోని కిండర్‌హూక్‌లో జన్మించారు. యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్యం పొందిన తర్వాత జన్మించిన తొట్ట తొలి అధ్యక్షుడు. ఈయన్ను ద ఫస్ట్ రియల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా పరిగణిస్తారు.    వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఎలాన్ మ‌స్క్ కి అంత తేలిగ్గా అమెరికా అధ్య‌క్షుడ‌య్యే అవ‌కాశం లేదు. మ‌రి ఇంత చేస్తే ఆ ఫ‌లితాన్ని ఎవ‌రు కొల్ల‌గొడ‌తారు? ఆ మాట‌కొస్తే ద అమెరికా పార్టీలో చేరేవారెవ‌రు? అన్న‌దొక చ‌ర్చ కాగా.. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్య‌తిరేకించే వారు ఈయ‌న పార్టీలో చేరే ఛాన్సులైతే క‌నిపిస్తున్నాయి. అయితే ఆయ‌న ద‌గ్గ‌రున్న సంప‌ద ఎంత? దాన్ని పార్టీ నిర్మాణానికి ఎలా వాడుకోగ‌ల‌ర‌ని చూస్తే..  ఫోర్బ్స్ గ‌ణాంకాల ప్రకారం మ‌స్క్ ద‌గ్గ‌ర 40 వేల 520 కోట్ల డాల‌ర్ల సంప‌ద ఉంది. కొన్ని లెక్క‌ల ప్ర‌కారం ఆయ‌న 400 బిలియ‌న్ డాల‌ర్ల నిక‌ర నిల్వ‌ల‌కు య‌జ‌మాని. ఆయ‌న‌కు టెస్లా, స్పేసెక్స్ ద్వారా ఇంత సంపాద‌న స‌మ‌కూరింది. ఇందులోనూ టెస్లా ద్వారా 75 శాతం సంప‌ద జ‌మ‌కూడింది. ప్ర‌స్తుతం ట్రంప్ ప్ర‌వేశ పెట్టిన బిగ్ బ్యూటీఫుల్ బిల్   ఆయ‌న టెస్లా అమ్మ‌కాల‌ను దారుణంగా దెబ్బ తీస్తుంది. బేసిగ్గా టెస్లాల‌ను ట్రంప్ స‌ర్కార్ ఎందుకు వ‌ద్దంటుందంటే.. అదంతా ఎలక్ట్రిక్ వాహ‌నాల వ్య‌వ‌హారం. ఈవీలు ఎప్పుడైతే విరివిగా రోడ్డెక్కుతాయో.. అప్పుడు పెట్రోల్ డిమాండ్ త‌గ్గుతుంది. పెట్రోలుకు సంబంధించి భారీ ఎత్తున డాల‌ర్ల నిల్వ అమెరిక‌న్ ట్రెజ‌రీల్లో దాగి ఉంటుంది. పెట్రోల్ డిమాండ్ ఎప్పుడు ప‌డిపోతుందో ఈ డాల‌ర్ల నిల్వ‌లు కూడా అమాంతం క‌రిగిపోతాయి. కాబ‌ట్టి మ‌స్క్ టెస్లా ఈవీల‌ను వ‌ద్దంటారు ట్రంప్. ఇక్క‌డే ఈ ఇద్ద‌రికీ చెడింద‌ని చెబుతారు. దీంతో ట్రంప్ బిగ్ బిల్ పై సంత‌కం పెట్టిన వెంట‌నే పార్టీ అనౌన్స్ చేశారు మ‌స్క్. అయితే త‌న‌కున్న సంప‌ద‌లోని మొత్తం  పార్టీ కోసం ఖ‌ర్చు చేయ‌డానికి వీల్లేదు. కేవ‌లం నాలుగున్న‌ర  ల‌క్ష‌ల డాల‌ర్లను మాత్ర‌మే వాడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. మిగిలిన విరాళాల‌ను సూప‌ర్ పీఏసీల ద్వారా సేక‌రించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆయ‌న ఇక్క‌డి చ‌ట్టాల‌ను అనుస‌రించి   సేక‌రించాలి.  2026లో జ‌రిగే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో హౌస్, సెనెట్ సీట్ల‌కు మ‌స్క్ త‌న‌ పార్టీ అభ్య‌ర్ధుల‌ను నిల‌బెట్టే అవ‌కాశాలు లేక పోలేదని అంటున్నారు.  అయితే మ‌స్క్ పార్టీ ద్వారా ఏం సాధించ‌నున్నారు? అని చూస్తే కొంద‌రు చెప్పే మాట ఏంటంటే ఒక‌ప్పుడు ట్రంప్ గెలుపున‌కు ఏకంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ని కొనుగోలు చేశారు. త‌ద్వారా ట్రంప్ గెలుపు మార్గాన్ని సుగ‌మం చేశారు. అలాంటి మ‌స్క్.. ఇప్పుడు త‌న గ‌ళం తాను వినించుకోడానికి ఒక వేదిక కోసం చూస్తున్నారు. దాన్నే త‌యారు చేస్తున్నారు. దాని పేరే ది అమెరికా పార్టీ. ఇది ఒకే పాముకు రెండు త‌ల‌లాంటి డెమొక్రాట్, రిప‌బ్లిక‌న్ల‌కు ప్ర‌త్యామ్న‌యంగా తన పార్టీ ఉంటుందని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి  చూడాలి.. అధ్య‌క్షుడ‌య్యే అవ‌కాశ‌మే లేని మ‌స్క్ ఈ పార్టీ ద్వారా అమెరికా రాజ‌కీయాల‌ను ఎలా ప్రభావితం చేస్తారో?   అయితే కార్లు, రాకెట్ల‌లో ఏ విధ‌మైన విప్ల‌వాత్మ‌క మార్పు తెచ్చారో.. మ‌స్క్ గానీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఇప్ప‌టికే రెండుగా చీలిన అమెరికా స‌మాజాన్ని ఎలా మ‌లుపు తిప్పుతారో చూడాలంటారు కొంద‌రు ఆశావాదులు.  బేసిగ్గా తాను అమెరికాకు కార్లు, రాకెట్లు త‌యారు చేయ‌డానికి వ‌చ్చాన‌నీ.. తాను ఆఫ్రిక‌న్ కాబ‌ట్టి ఇక్క‌డ అధ్య‌క్షుడు కాలేన‌ని ఆయ‌న గ‌తంలోనే అన్నారు. ట్రంప్ పాల‌న‌లో తాను కూడా ప‌ని చేసి ఆయ‌న‌కు స‌హ‌క‌రిస్తాన‌ని అన్నారు. కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార‌ణంగా ఇద్ద‌రికీ చెప్ప‌న‌ల‌వి కానంత గొడ‌వ‌లు చెల‌రేగ‌డంతో.. ఇదిగో ఇలా  కొత్త పార్టీ పెట్టేశారు. త‌ర్వాత  ఏంట‌న్న‌దాని కోసం వెయిట్ అండ్ సీ.

అధిష్టానం ఆశలన్నీ తెలంగాణ పైనే!

తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు  సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ..  స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు. సామాజిక న్యాయ సదస్సు పేరిట జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.   ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్  చేస్తూ ఘాటైన  విమర్శలు చేశారు.  అలాగే..  పార్టీలో అసమ్మతి మొదలు పదవుల భర్తీ వరకు అనేక విషయాలను సమీక్షించి రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు.ఈ మొత్తం కసరత్తును చూస్తే..  స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోందో కూడా వేరే చెప్పనవసరం లేదంటున్నారు. ఆ విషయం కూడా కేసీ వేణుగోపాల్  స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను రోల్  మోడల్ గా భావిస్తోందని స్పష్టంగానే చెప్పారు. నిజానికి ఇప్పుడు వేణుగోపాల్ చెప్పడం కాదు..  ఎప్పుడోనే  పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ కులగణన విషయంగా  తెలంగాణ మోడల్   ది బెస్ట్  అని ప్రకటించారు.  అంతే కాకుండా..  జాతీయ స్థాయిలో జనగణనతో పాటుగా చేపట్టే కులగణనకు తెలంగాణ మోడల్ ఫాలో కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే..  తాజాగా సామాజిక న్యాయ సదస్సు వేదిక నుంచి చేసిన ప్రసంగంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా కులగణన చేయించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబు నిచ్చారు. అంతే కాదు.. జనాభా దామాషా  ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందనీ,  ఈ పోరాటంలో రాష్ట్ర ప్రజలు కూడా తమకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు.  సో...కాంగ్రెస్ అధిష్టానం కులగణనకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో..  తెలంగాణ స్థానిక ఎన్నికలకూ  అంతే ప్రాధన్యత ఇస్తోందని, అంత సీరియస్ గా తీసుకుంటోందని అంటున్నారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్  అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తోందని అంటున్నారు. అయితే, నిర్ణయం కేంద్రం కోర్టులో ఉన్నదున.. ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.అయినా.. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం  కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు  న్యాయనిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  అయితే.. ఒక్క బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ వాగ్దానంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? లేక అమలు కాని  హామీలు, గ్యారెంటీలు, రైతులు, నిరుద్యోగ యువకులు, మహిళలు ఇలా విభిన్న వర్గాల ప్రజల్లో క్షణ క్షణం పెరుగుతున్న అసంతృప్తి, పార్టీలో పెరుగుతున్న అసమ్మతి వంటి ప్రతికూల అంశాలు కూడా స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం హోప్స్ అన్నీ తెలంగాణ పైనే పెట్టుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.