జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్

  కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు కోరారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ నెక్లస్ రోడ్డులోని స్మారక ఘాట్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ నేత కె కేశవరావు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ, పలువురు ఎమ్మెల్యేలు, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు.  హైదరాబాద్‌కు మెట్రో జైపాల్ రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పారు. దేశం మొత్తం మీద నిజాయితీగా పని చేసిన వ్యక్తి అని, ఆయనను తెలంగాణ మరువదని చెప్పుకొచ్చారు. అచ్చంపేట శాసన సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత అయిన జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని, అలాగే నాగర్ కర్నూల్ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, జైపాల్‌రెడ్డి వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, ఆయన కూతురు నైమిష రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  

శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒకసారి దర్శించుకోవాలి

  తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇవాళ  శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని వెంకయ్యనాయుడు తెలిపారు.  ప్రభుత్వ లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదని ఆయన తెలిపారు.  హిందువుల సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలి. ప్రముఖ దేవాలయాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పట్టాలి అని పిలుపునిచ్చారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదు. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం. గుడి కట్టించడం భక్తులు మరియు ప్రముఖ దేవస్థానాల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి అని మాజీ ఉప రాష్ట్రపతి తెలిపారు. అంతకముందు వెంకయ్యనాయుడు  సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్‌‌లు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. పహల్గాం ఉగ్రవాదులు హతం

  జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్ దాడిలో పాల్గొన్నా ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీనగర్‌లో ఉన్న లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని భద్రత బలగాలు కాల్పలు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పహల్గామ్ దాడి నిందితుడు అని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి.. వారు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తం అయిన బలగాలు.. తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తుంది. ఈ ఎన్ కౌంటర్ హిర్వాన్- లిద్వాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఇంకా కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతం మొత్తం తుపాకులు శబ్దాలతో దద్దరిల్లుతోంది. కాగా ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. అప్పటినుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి.  

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం (జులై 28) ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు నుండి బదిలీపై  రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచేత  రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌  ప్రమాణం చేయించారు.  హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సాంబశివ ప్రతాప్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి, సహా పలువురు  ఇతర రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యు లు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీ హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారం

బిడదారి ఎస్టేట్ లో కాలినడకన కలియదిరిగిన చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆయన విజన్ కు అద్దం పడుతోంది. తన సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజ సోమవారం (జులై 28) ఆయన తన టీమ్ తో సింగపూర్ లో పది వేల కుటుంబాలు నివశించే బిడదారి ఎస్టేట్ ను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలన్న ప్రభుత్వ ప్రణాళికలలో భాగంగా సింగపూర్ లో అర్బన్ హౌస్ ప్లానింగ్ ను పరిశీలించేందుకే చంద్రబాబు బృందం బిడదారి ఎస్టేస్ సందర్శించింది.  సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను సింగపూర్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.  మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు కాలి నడకన కలియదిరిగారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్ నగరాన్ని తీర్చి దిద్దుతు న్నామన్నారు.  అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందనీపేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ - ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత అంతరం వచ్చిందన్న ఆయన  గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు..  గ్యాప్ ను తగ్గించేందుకే  ప్రస్తుతం తాను సింగపూర్ వచ్చి నట్లు చెప్పారు. భవిష్యత్‌లోనూ సింగపూర్-ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. బిడదారి ఎస్టేటులో గృహ సముదాయాల నిర్మాణం   చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా... చేపట్టారు.  ప్రకృతితో మమేకమయ్యేలా చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు. అంతే కాకుండా నివాసితులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా నిర్మాణాలు ఉన్నాయి. కాగా ఈ సందర్భంగా చంద్రబాబు గృహ సముదాయాల నిర్మాణ వ్యయంపై కూడా చర్చించారు.  పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఉండేలా చూడడంతో పాటు.. నాణ్యమైన నివాస గృహాల నిర్మాణాల చేపట్టామని చంద్రబాబుకు సింగపూర్ అధికారులు చెప్పారు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దిన తీరును ముఖ్యమంత్రి  ప్రశంసించారు. సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ఈ హౌసింగ్ ప్రాజెక్టు అన్ని వసతులతో పర్యావరణ హితంగా అద్భుతంగా నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారు. స్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్‌గా సింగపూర్ అర్బన్ రీడెవల్పమెంట్ అథారిటీ మార్చడం ఆకట్టుకుందని చంద్రబాబు అన్నారు.  బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు సందర్శన అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై  చర్చించారు. ఏపీలో, అమరావతిలో చేపట్టబోయే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు.  

నోబుల్ ప్రైజు వేట‌లో ట్రంప్!

మొన్నీ మ‌ధ్యే ట్రంప్ కు నోబుల్ శాంతి పురస్కారం కోసం అధికారిక నామినేష‌న్ దాఖ‌లు చేసింది అమెరికా. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు నోబుల్ పురస్కారం రావడానికి ఎక్కువ అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి. మొన్న భార‌త్- పాక్ యుద్ధం, నిన్న ఇరాన్- ఇజ్రాయెల్ వార్, మ‌ధ్య‌లో గాజా- ఇజ్రాయెల్ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం. ఈ విష‌యంలో ఆయ‌న ప్ర‌త్య‌ర్ధి మ‌స్క్ నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు చూస్తే థాయ్- కంబోడియా ఘ‌ర్ష‌ణ‌.  భార‌త్- పాక్ ఘ‌ర్ష‌ణ‌ను సుంకాల‌తో ఆపిన‌ట్టు కోర్టులోనే చెప్పుకున్నారు ట్రంప్. ఇక ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లోకి డైరెక్టుగా ఎంట్రీ ఇచ్చి బంక‌ర్ బ‌స్ట‌ర్లు వేసి మ‌రీ ఈ యుద్ధం ఆపాన‌ని అంటారు. ఇప్పుడు థాయ్- కాంబో వార్ ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారాయ‌న‌. మీరు గానీ ఈ ఘ‌ర్ష‌ణ ఆప‌కుంటే వాణిజ్య ఒప్పందాల‌న‌నీ ర‌ద్ద‌వుతాయ‌ని హెచ్చ‌రించారు. థాయ్ ప్ర‌ధాని సైతం అందుకు తాము సిద్ధంగానే ఉన్న‌ట్టు చెప్పారు. నిజానికి ట్రంప్ శాంతికాముకుడిగా పేరు సాధించాలంటే చేయాల్సిన ప‌ని.. ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ ఆపాల్సి ఉంటుంది. అదేమో అంత తేలిగ్గా సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అప్ప‌టికీ ట్రంప్ ర‌ష్యాకు 50 రోజుల గ‌డువు ఇచ్చారు. లేకుంటే మీకు, మీ భాగ‌స్వామ్య దేశాల‌కు సుంకాల మోత మోగిస్తాన‌ని అన్నారు. ఆ మొత్తం 100 శాతం పైగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు కూడా.  కార‌ణం.. ర‌ష్యా ఇప్ప‌టి నుంచే కాదు ఎప్ప‌టి నుంచో అమెరికా అధ్య‌క్షుల పాలిట‌ మొండి ఘ‌టంలానే వ్యవహరిస్తున్నది.  ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే ట్రంప్ సుంకాలు, వాణిజ్య ఒప్పందాల ద్వారా.. ఈ శాంతి స్థాప‌న చేస్తున్నారు. ఇక్క‌డ స్వామి కార్యంలో స్వ‌కార్యం అన్న‌ట్టు.. ఉక్రెయిన్ ర‌ష్యాతో యుద్ధంలో ఉండ‌గానే ప‌దేళ్ల ఖ‌నిజ త‌వ్వ‌కాల ఒప్పందం చేసుకున్నారు ట్రంప్. ఇక పాక్  భార‌త్ తో వార్ లో ఉండ‌గానే.. త‌న కుటుంబ సంస్థ డ‌బ‌ల్యూ ఎల్ ఎఫ్.. తో సంత‌కాలు పెట్టించుకున్నారు. ఒక ప‌క్క త‌న దేశ అవ‌స‌రాలు, మ‌రో ప‌క్క త‌న వ్యాపార అవ‌స‌రాలు తీర్చుకుంటున్న ట్రంప్ నోబుల్ ప్రైజ్ కి ఎలా అర్హుల‌వుతారు.. అన్న‌ది కూడా ఒక ప్ర‌శ్న‌గా క‌నిపిస్తోంది.

రాజీనామా చేసేశా.. ఇంక ఆ పార్టీతో సంబంధం లేదు.. రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఎంపీ అర్వింద్ కుమార్ కూడా దాదాపుగా రాజాసింగ్ బీజేపీలోకి చేరడానికి ఆయన నుంచి ఒక్క మిస్డ్ కాల్ చాలు అంటూ పాజిటివ్ గా మాట్లాడారు. అయితే తాను మళ్లీ కమలం గూటికి చేరనున్నట్లు వస్తున్న వార్తలను రాజాసింగ్ నిర్ద్వంద్వంగా ఖండించారు. అన్నీ ఆలోచించుకునే రాజీనామా చేశాననన ఆయన ఇక ఆ విషయం గురించి ఆలోచించనని పేర్కొన్నారు. కమలం పార్టీలోని పున: ప్రవేశానికి  పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కార్యకర్తల బృందాన్ని తాను పంపినట్లుగా వచ్చిన వార్తలను రాజాసింగ్ ఖండించారు. తన రాజీనామా వెనుక ఎటువంటి కుట్రా లేదనీ చెప్పిన ఆయన,  అమిత్ షా నుంచి తనకు ఎటువంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు.   

చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ బాదుడు

తెలంగాణలో చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ తన సేవల ధరలను అమాంతం పెంచేసింది. ప్రభుత్వం పలు సేవల ధరలను పెంచుతూ, కొత్త రేట్లను  ప్రకటించింది. ఎటువంటి ముందస్తు ప్రకటనా లేకుండానే   ఆదివారం ( జులై 28)ఉదయం నుంచీ ఈ కొత్త ధరలను అమలులోనికి తీసుకువచ్చింది.  అధికారులు చడీచప్పుడు కాకుండా రవాణాశాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరలను అప్‌డేట్‌ చేశారు. పలు సేవల ఫీజులు నామమాత్రంగా పెరగ్గా..  కొన్నిటి భారం మాత్రం తడిసిమోపెడు అయ్యేలా ఈ పెంపు ఉన్నది.   ద్విచక్రవాహనం, లెర్నర్స్‌ లైసెన్స్‌కు గతంలో  335గా ఉన్న ఫీజు ఈ కొత్త పెంపుతో .440 రూపాయలు అయ్యింది.  ఇది రెండు క్యాటగిరీలలో పెరిగింది.   కారు లెర్నర్స్‌ లైసెన్స్‌ ఫీజు అయితే 450 నుంచి  585 రూపాయలకు పెరిగింది.  ఇక పర్మినెంట్‌ లైసెన్సుకు సంబంధించిన డ్రైవింగ్‌ టెస్టుకు గతంలో  1,035 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 1,135 రూపాయలకు పెరిగింది. వాహనాల యాజమాన్య బదిలీకి గతంలో   ఫీజు 935 రూపాయలు ఉండగా.. ఇప్పుడది 1,805 రూపాయలు అయ్యింది. ఫైనాన్స్‌పై వాహనాలు తీసుకున్న వారికి ఆయా కంపెనీల హామీ పత్రం (హైపొథెకేషన్‌) ఫీజు గతంలో 2,135రూపాయలు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా వెయ్యిరూపాయలు పెరిగి  3,135 రూపా యలకు చేరుకుంది. రుణ బదిలీకి ఫీజు  2,445  రూపాయల నుంచి నుంచి రూ.2,985 రూపాయలకు పెరిగింది.  ఆటోరిక్షా డ్రైవింగ్‌ టెస్ట్‌ ఫీజు రూ.800 నుంచి రూ.900కు పెంచారు. గతంలో రవాణాశాఖ అధికారులు పంపిన పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పెంచేసిట్లు తెలిసింది.  

మావోయిస్టుపార్టీ వారోత్సవాలు.. ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు ఏటా జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ జరుగుతాయి. అందులో భాగంగానే సోమవారం (జులై 28) నుంచి ఆగస్టు మూడు వరకూ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాలలో భాగంగా నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో మరణించిన అమరులను స్మరించుకుంటూ జోహార్లు తెలుపుతారు. అలాగే తమకు పట్టు ఉన్న ప్రాంతాలలో  సభలూ, సమావఏశాలు నిర్వహిస్తారు. ఇలా ఉండగా  మావోయిస్టు పార్టీ వారోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి పై వాహన తనిఖీలు చేపట్టిట్టారు.  సాధారణంగా మావోయిస్టు పార్టీ వారోత్సవాల సందర్భహంగా నక్సలైట్లు ఉనికి చాటుకునేందుకు విధ్వంసాలకు పాల్పడుతుంటారు. అటువంటి సంఘటనలను నివారిం చడానికి పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున మోహరించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.  తెలంగాణ, చత్తీస్ఘాడ్ సరిహద్దు ప్రాంతాలలోని జాతీయ రహదారుల గుండా వెళ్ళే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసి బస్సులలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అంతే కాకుండా దండకారణ్యంలో కూంబింగ్ చేస్తున్నారు.  

జగన్ సర్కారు పాపం.. కోవిడ్ నిధులు వెనక్కి ఇమ్మంటున్న కేంద్రం

అధికారంలో ఉన్న కాలంలో వైసీసీ సర్కారు అవగాహనలేమి, నిర్లక్ష్యంతో వ్యవహరించి ఏపీలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించంది. ఆ క్రమంలో జగన్‌ ప్రభుత్వం చేసిన పాపాలు రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కేంద్రం ఇచ్చిన నిధులను నిర్దేశిత పనులకు వెచ్చించకుండా ఇతర పథకాలకు మళ్లించడంతో..  ఆయా నిధులను తిరిగి వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది. జగన్‌ జమానాలో జరిగిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొవిడ్‌-19 నియంత్రణ కోసం నిధులు విడుదల చేసింది. కేంద్రం ఏ కార్యక్రమానికి నిధులిచ్చినా 60శాతమే ఇస్తుంది. మిగిలిన 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కేటాయించి.. నిర్దేశిత కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలి. కొవిడ్‌ రెండో దశలో కేంద్రం టెస్టింగ్‌ కిట్స్‌, రోగులకు అవసరమైన మందులు, ఇతర అవసరాల నిమిత్తం రూ.300కోట్లకుపైగా కేటాయిచింది. దీనిలో కేంద్ర వాటా రూ.208 కోట్లు. ఈ మొత్తాన్ని 2022-23 సంవత్సరంలోనే విడుదల చేసింది. దీనికి మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద రాష్ట్రప్రభుత్వం మరో రూ.139 కోట్ల ను కేటాయించాల్సి ఉంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వడంలో అప్పటి జగన్‌ ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించింది. 2022-23లో కేంద్రం ఇచ్చిన రూ.208 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో కేంద్రం సీరియస్‌ అయింది. తాము కొవిడ్‌ కోసం నిధులిచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించింది. తమ నిధులకు వెంటనే మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయాలని అల్టిమెటం జారీ చేసింది. లేదంటే రూ.208 కోట్లకు రెండేళ్ల పాటు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఘాటు లేఖ రాసింది. ఈ మేరకు గత శుక్రవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు కేంద్రం నుంచి లేఖ అందింది. కేంద్రం నుంచి వచ్చిన లేఖను చూసి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు షాకయ్యారు. తమ నిధులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాయడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వ తప్పులకు ఇప్పుడు కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కొవిడ్‌ సమయంలో ప్రభుత్వానికి మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌, టెస్టింగ్‌ కిట్స్‌ సరఫరా చేసిన సప్లయిర్స్‌ సైతం నిండా మునిగిపోయారు. కరోనా సమయంలో అప్పటి జగన్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మందులు, కిట్స్‌, మాస్క్‌లు, పీపీఈ కిట్లు కొనుగోలుచేసింది. సప్లయిర్స్‌ కూడా కొవిడ్‌ సమయంలో కష్టమైనా ప్రభుత్వం అడిగిన మందులు, కిట్స్‌ సరఫరా చేశారు. గత ప్రభుత్వం కేం ద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించుకోవడమే కాకుండా రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇప్పటికే రెండేళ్లు గడుస్తున్నా చాలా మందికి బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు.

బాబు కేబినెట్ లోకి అయ్యన్న, ఆర్ఆర్ఆర్?.. విస్తరణలో అవకాశం ఖాయమన్న ప్రచారం

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ విస్తరణకు సమాయత్తమౌతున్నారన్న చర్చ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే కేవలం విస్తరణే కాదనీ, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనీ అని తెలుగుదేశం కూటమి వర్గాలు అంటున్నాయి.  కొందరికి ఉద్వాసన, కొత్తవారికి అవకాశం ఉంటాయని అంటున్నారు. ఇందుకు తగినట్లుగానే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొందరు మంత్రుల పెర్ఫార్మెన్స్ అంటే పనితీరుపై చంద్రబాబు కొన్ని సందర్భాలలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీరు మెరుగుపరచుకోకుంటే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ కేబినెట్ విస్తరణ| పునర్వ్యవస్థీకరణ అంశం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రస్తుతం కేబినెట్ మంత్రులుగా ఉన్న వారిలో ఔట్ అయ్యేదెవరు?  ఎందుకు వీళ్ళ పర్ఫామెన్స్ పూర్ గా ఉంది అన్న చర్చ ఆరంభమైంది. ప్రస్తుత కేబినెట్ లో కొందరు మంత్రులు ఇప్పటికీ వారి వారి శాఖలపై గ్రిప్ లేదని అంటున్నారు.   అంతే కాకుండా,   ప్రత్యర్థి పార్టీల నాయకులు  ఈ మంత్రులను ఓ ఆట ఆడుకుంటుంటే..  వారిని కట్టడి చేయడంలో  కూడా ఈ మంత్రులు పూర్తిగా ఫెయిల్ అయ్యారంట. ఎంత సేపూ మంత్రిగా ఆడంబరాలు, ఆర్భాటాలతో నన్ను చూడు,  నా కారు సోకు చూడు అన్నట్లుగా సైరన్ కారులు వేసుకొని తిరగటం తప్ప, చేస్తుంది ఏమీ లేదన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ఉన్న స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్లను మంత్రులుగా ప్రమోట్ చేసే అవకాశా లున్నాయని అంటున్నారు.  దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు తెలుగుదేశం, తెలుగుదేశం కూటమిలో గళాన్ని బలంగా వినిపించిన ఈ ఇద్దరినీ రాజ్యాంగ పదవుల పేరుతో గొంతు నొక్కేసి నట్లైందన్న అభిప్రాయం పార్టీ సీనియర్లలోనే వ్యక్తం అవుతోందంటున్నారు.  2019 - 24 మధ్య కాలంలో అప్పటి జగన్ ప్రభుత్వాన్ని నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించి కడిగిపారేయడంతో   ప్రస్తుతం   స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు ముందు వరుసలో నిలుస్తారనడంలో సందేహం లేదు.  ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు..  అప్పట్లో తన వాగ్ధాటితో  జగన్ నే టార్గెట్ చేస్తూ తన చేసిన ప్రసంగాలు వైసీపీ సర్కార్ పై ప్రతికూల పవనాలు వీచడానికి దోహదపడ్డాయి. అలాగే  ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న  రఘురామకృష్ణం రాజు.. గతంలో తన రచ్చబండద్వారా జగన్ అరాచకాలను, జగన్ ప్రభుత్వ దురాగతాలనూ ఉతికి ఆరేసేవారు.  అప్పట్లో వైసీపీలో ఎంపీగా ఉండి ఆ పార్టీ, ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ  ప్రజల ముందు పెట్టడంలో రఘురామకృష్ణంరాజు అత్యంత కీలక భూమిక పోషించారు. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు, విమర్శలకు బెంబేలెత్తిపోయిన అప్పటి జగన్ సర్కార్ ఆయనను రాష్ట్రంలో అడుగుపెట్టకుండా నిరోధించింది. అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు కూడా పాల్పడింది. అయినా వెరవకుండా  ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ఢిల్లీలో ఉండే జగన్ సర్కార్ అరాచకాలను రోజూ తూర్పారపట్టేవారు.   అలాంటి రఘురాం కృష్ణంరాజుకు సహజంగానే టిడిపిలోకి రాగానే ,ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి వస్తుందని రఘురామకృష్ణంరాజు, ఆయన అభిమానులే కాదు.. తెలుగుదేశం కూటమి పార్టీల శ్రేణులు కూడా భావించాయి. ఆయనమంత్రిగా ఉంటే..  జగన్ హయాంలోని ఆర్థిక అరాచకత్వం, ఆ సమయంలో జరిగిన అవినీతి లెక్కలన్నీ బయటకు తీసి జగన్ కు చుక్కులు చూపిస్తారని భావించారు. అయితే  సమీకరణాలు కుదరకో, మరోటో.. కారణాలేవైతేనేం..  చంద్రబాబు కేబినెట్ లో అయ్యన్నపాత్రుడికి కానీ, రఘురామకృష్ణం రాజుకు కానీ స్థానం లభించలేదు సరికదా, గట్టిగా గొంతెత్తే అవకాశం లేని  స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు దక్కాయి.   ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడం, కొందరు మంత్రులపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేయడంతో కేవలం ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ చేపట్టడం కాకుండా.. కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని చంద్రబాబు భావిస్తున్నారన్న వార్తలు వినవస్తుండటంతో మళ్లీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజులకు కేబినెట్ బెర్త్ అంశం తెరమీదకు వచ్చింది.   ఈ విషయంపై ఏదైనా ఉప్పం దిందో ఏమో తెలియదు కానీ రఘురామకృష్ణంరాజు ఇటీవల తన అమెరికా పర్యటనలో తన మనసులోని భావాలను అక్కడి వారితో పంచుకుంటూ.. తనకు  హోం మంత్రి, లేదా ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేయాలన్న ఆశ ఉందని బయట పెట్టుకున్నారు.   ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఖాయమని జరుగుతున్న ప్రచారం ఒకవైపు,  మరోవైపు ఈ ఇద్దరు సీనియర్లు క్యాబినెట్ లోకి వస్తే టిడిపి వాయిస్ మరింత బలపడుతుందన్న ప్రచారం మరోవైపు కూటమి పార్టీల్లో  జోరుగా సాగుతుంది.....  అయ్యన్నపాత్రుడు, రఘురాం కృష్ణంరాజులు క్యాబినెట్ లోకి వస్తే.. రాజకీయంగా అది టిడిపికి మరింత బలాన్ని చేకూరుస్తుందని, వైసీపీయుల అనుచిత వ్యాఖ్యలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పగలుగుతారని తెలుగుదేశం వర్గాలు కూడా భావిస్తున్నాయి.   సరే ఈ ప్రచారం సంగతి పక్కన పెడితే అసలు ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో మంత్రులు ఎందుకు గొంతు ఎత్తలేకపోతున్నారనేది మరొక ప్రశ్న.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తమతమ శాఖలకు సంబంధించిన అంశాలలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చారు. అయినా మంత్రి హోదా అనుభవిస్తూ కూడా..  వైసీపీ నేతల విమర్శలు, వ్యాఖ్యలకు దీటుగా బదులు ఇవ్వకుండా మౌనం వహిస్తుండటం. అలాగే ప్రజలతో మమేకం కాకపోవడంతో కొందరు మంత్రులు  వ్యవహరిస్తున్న తీరు పట్ల సీఎం అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా సొంత వ్యాపారాల కోసం  వైసీపీ నేతలతో కుమ్మక్కయాన్న అనుమానాలు కూడా అడపాదడపా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. త్వరలో జరగనున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనలూ, చేరికలూ ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతోందో.. కేబినెట్ నుంచి ఉద్వాసన ఎవరికో, అవకాశం ఎవరికో?  

సింగపూర్ లో వరుస భేటీలతో బాబుబిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సింగపూర్ పర్యటన రెండో రోజు సోమవారం (జులై 28) పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిథులతో వరుస భేటీలతో బీజీబిజీగా సాగనుంది.  ట్రెజరీ భవనంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్సీలెంగ్ తోచంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చిస్తారు.  గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పరిష్కారంపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.    అలాగే ఈ రోజు భేటీలలో పలు కంపెనీల ప్రతినిథులకు చంద్రబాబు   గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు  పోర్టులు తదితర రంగాల్లో  పెట్టుబడులకు గల అవకాశాలను వివరిం చనున్నారు.   లాజిస్టిక్ రంగంలో బలంగా ఉన్న సింగపూర్ నుంచి ఏపీలో పోర్టుల నిర్మాణం విషయంలో సహకారం ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే  గ్రీన్ ఎనర్జీ, సబ్  సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆశక్తి కనబరిచిన సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్, గృహ నిర్మాణంలోనూ ఏపీతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు.  

తెలంగాణ కమల దళపతికి స్థానిక ఎన్నికలే తొలి పరీక్ష?!

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచంద్ర రావు బాధ్యతలు చేపట్టి అట్టే కాలం కాలేదు. ఈ  నెల మొదటి తేదీన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, 5న అధికారికంగా   బాధ్యతలు స్వీకరించారు. అంటే.. ఆయన బాధ్యతలు చేపట్టి నిండా నెల రోజులు కూడా కాలేదు.  ఇంతలోనే, ఆయన పనితనాన్ని తూకం వేసి ఒక అభిప్రాయానికి రావడం సరికాదు.అయితే.. కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది అన్నట్లు.. ఈ కొద్ది రోజుల్లోనే ఆయన ఏమిటో అంతో ఇంతో అందరికీ తెలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి రామచంద్ర రావు ఎన్నిక పట్ల, పార్టీ లోపలా, బయటా కూడా చాల పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. బీజేపీ జాతీయ నాయకత్వం మరో మారు తప్పులో కాలేసిందని.. ఇక రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకట్టలేదన్నవిశ్లేషణలు వినిపించాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నోరున్న నేతలకు ఇవ్వవలసిన అధ్యక్ష పదవిని బీజేపీ అధిష్టానం నోరులేని రామచంద్రరావుకు ఇచ్చి తప్పు చేసిందనే విమర్శలు,విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఆయనకు సౌమ్యుడు  అనే ముద్ర వేసి..  అదొక పెద్ద అనర్హతగా  పెద్ద ఎత్తున  ప్రచారం జరిగింది. చివరకు.. ఆయన తాను అందరూ అనుకున్నట్లు సౌమ్యుడిని కాదంటూ ఏబీవీపీ నాటి గతాన్ని గుర్తుచేయవలసి వచ్చింది.   అదలా ఉంటే.. మరోవంక రామచంద్ర రావు ఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, అలకలు, లుకలుకలు ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా ఉదంతం, ఆ వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్  మధ్య భగ్గుమన్న విభేదాలు ఆయనకు సవాలుగా నిలిచాయి. అయితే.. రామచంద్ర రావు, అధిష్టానం సూచనల మేరకు, ఆవిషయాలను పార్టీ అధిష్టానానికి వదిలేసి  రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టిని కేద్రీకరించారు. నిజానికి, మరో మూడేళ్ళ వరకు  (అవరోధాలు అన్నీ తొలిగి, జరిగితే) స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప ప్రధాన ఎన్నికలు ఏవీ లేని నేపథ్యంలో, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసమే.. బీజేపీ అధిష్టానం  రామచంద్ర రావుకు పార్టీ పగ్గాలు అప్పగించింది.  అందుకు తగట్టుగానే రామచంద్ర రావు  రాష్ట్ర కార్యాలయానికి, పరిమితం కాకుండా జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఇతర విషయాలు పక్కన పెట్టి  కార్యకర్తలతో సమావేశ మవుతున్నారు. స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సిద్దం చేస్తూ..  అదే సమయంలో పార్టీని పటిష్టం చేయడం పై దృష్టిని కేంద్రీకరించారు. అలాగే..  జిల్లా మండల స్థాయిలో, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. అందుకే.. రామచంద్ర రావు ఎన్నిక పట్ల పెదవి విరిచిన విశ్లేషకులే ఇప్పుడు అయనకు  ఫస్ట్ టెస్ట్ లో పాస్  మార్కులు ఇస్తున్నారు.  అయితే..  ఇల్లు అలకాగానే పండగ రాదు  అన్నట్లుగా ఇక్కడతో అంతా అయిపోయినట్లు కాదని అంటున్నారు. అసలు కథ ముందుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పాతల మధ్య  అంతర్గత విభేదాలు ప్రస్తుతానికి సర్దుమణిగినా పూర్తిగా సమసి పోలేదని   విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి.. బండి సంజయ్, ఈటల రాజేందర్  వంటి సీనియర్ నాయకుల మధ్య విభేదాలను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. కానీ.. కింది స్థాయిలో విభేదాలు పార్టీకి   ముఖ్యంగా రామచంద్ర రావుకు తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని  విశ్లేషకులు అంటున్నారు.  తాజాగా మహబూబ్‌నగర్‌  జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలే ఇందుకు నిదర్శనంగా పేర్కొం టున్నారు.అయితే..  క్రమశిక్షణ గీత దాటితే ఎంత పెద్ద నేతలపైనైనా చర్యలు తప్పవని, రామచంద్ర రావు హెచ్చరించిన నేపధ్యంలో.. ముందు ముందు ఆయన చర్యలు ఎలా ఉంటాయి అనేది చూడవలసి ఉందని, అంటున్నారు. అలాగే..  ఇతర విషయాలు ఎలా ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికలే ఆయనకు తొలి పరీక్ష కానున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి.. తమిళనాట 11 జిల్లాలకు అలర్ట్ జారీ

కర్ణాటక రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి నదికి వరద పోటెత్తింది. రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులూ అన్ని పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.  దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పోతే కావేరీ నదీ ప్రవాహ ఉధృతి పెరిగింది.   కర్నాటకు నుంచి  కావేరి నదికి   లక్ష 5 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు హోగెనక్కల్ జలపాతాల కు సందర్శకులు వెళ్లకుండా నిషేధించారు.  ఇక సేలం లోని మేటూరు డ్యామ్ కు సైతం భారీగా వరద వస్తుండటంతో లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తమిళనాడులోని 11 జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు.  కావేరి నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  నది పరిసరాల్లోకి  ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. 

జగన్ హస్తిన పర్యటన అందుకేనా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు సమాయత్తమౌతున్నారు.  కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అవ్వాలని భావిస్తున్నారు. నేడో, రేపో ఆయన హస్తినయానం ఉంటుందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో ఆయన బీజేపీ పెద్దలతో కూడా భేటీ అవుతారని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీల నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. మధ్యం కుంభకోణం కేసు దర్యాప్తు జోరందుకుని తాడేపల్లి లింకులను బయటపెట్టే దిశగా సాగుతుండటంతో ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే హస్తిన పెద్దల మద్దతు అవసరమని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హఠాత్తుగా హస్తిన పర్యటన పెట్టుకుని అక్కడ వారి మద్దతు కూడగట్టాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.   ఔను ప్రస్తుతం మద్యం కుంభకోణం విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను సిట్ అరెస్టు చేసింది.  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీలో గాభరా కనిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటుందన్న ఆందోళనా ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. ఈ కేసులో జగన్ అరెస్టు ఖాయమన్న ప్రజారం కూడా జోరుగా సాగుతోంది. జగన్ కూడా తన అరెస్టు అనివార్యమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సందర్భం, సమయంతో సంబంధం లేకుండా తానేమీ పారిపోవడం లేదనీ, దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చనీ సవాళ్లు విసురుతున్నారు. ఇక మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ జగన్ అరెస్టు అవుతారన్న సంకేతాలు ఇచ్చారు.  అరెస్టు ఎటూ ఖాయమైనప్పుడు పొలిటికల్ మైలేజ్ వచ్చేలా దానిని మలచుకోవాలన్న వ్యూహంతోనే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన పెట్టుకున్నారని చెబుతున్నారు.  ఇక అరెస్టు అయినా రాజకీయంగా తనకు, పార్టీకీ లబ్ధి చేకూరేలా ఏం చేయాలన్న విషయంలో జగన్, వైసీపీ నేతలూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలోనే హస్తినలో కేంద్ర పెద్దలు, బీజేపీ, కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలను కలిసి తనకు వ్యతిరేకంగా ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని చెప్పుకుని మద్దతు కూడగట్టే వ్యూహాన్ని జగన్ ఖారారు చేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  

తొడగొట్టి.. మీసం మెలేసీ.. పరారీ

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాలేదు. నోటీసుల మేరకు ఆయన నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో శనివారం (జులై 26) ఉదయం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే విచారించారు. అంతే కాదు ఇదే కేసులో   వైసీపీ నాయకులు అనురూప రెడ్డి, హరిప్రసాద్, పచ్చిపాల రాధాకృష్ణ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు.    నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా కేసు నమోదైన సంగతి తెలిసిందే.  అయితే ఈ కేసులో ఏ1గా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు కానీ అరెస్టు చేయలేదు. విచారణ తరువాత కూడా ప్రసన్నకుమార్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ మీడియా ముందు చెప్పారు. ఏ1నే విచారించి వదిలేశారు కనుక.. అనిల్ కుమార్ యాదవ్ ను విచారణకు  పిలిచి అరెస్టు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. మరి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా ఎందుకు కొట్టినట్లు. అంతే కాదు పోలీసులకే కాదు, ఎవరికీ అందు బాటులో లేకుండా అజ్ణాతంలోకి ఎందుకు వెళ్లిపోయారు?   అసలెందుకు అంతగా భయపడుతున్నారు?  అక్రమమైనింగ్ కేసులో తనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న భయంతోనే అనీల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారా? ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో మరో మాజీ మంత్రి కాకాణి అరెస్టయ్యారు. అంతే కాదు.. అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో అనిల్ కుమార్ యాదవ్ పేరు బయటపెట్టారు. శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు.  దీంతో ఆయన ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు భయం లేకున్నా విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లిపోయారని పరిశీలకులు అంటున్నారు.   జగన్ హయాంలోముందు వెనుకలు ఆలోచించకుండా ఇష్టారీతిన మాట్లాడి, తొడకొట్టి, మీసం మెలేసి మరీ సవాళ్లు చేసిన అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్థులను దూషించడమే రాజకీయం అన్నట్లుగా వ్యవహరించారు. అయితే వైసీపీ పరాజయం తరువాత నోరెత్తి మాట్లాడటానికే భయపడుతున్నట్లుగా వ్యవహరించారు.  జగన్ హయాంలో ఇదే అనిల్ కుమార్ యాదవ్ స్థాయి, సభ్యత కూడా మరిచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.  అంతేనా నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీకి కూడా యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసిందంటే ఆయన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉండేవో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు అవే అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ కేసులలో అరెస్టు భయంతో మరోసారి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు పరిశీలకులు. 

అడివిలో తప్పిపోయిన విద్యార్థులు.. కాపాడిన పోలీసులు

  ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మహితాపురం గ్రామ పరిధిలోగల మహితాపురం వాటర్ ఫాల్స్ సందర్శనకు విచ్చేసిన హైదరాబాద్ వాస్తవ్యులైన ఏడుగురు NIT విద్యార్థులు (4గురు అబ్బాయిలు,  3గురు అమ్మాయిలు) దారితప్పి అడివిలో దారితప్పి గల్లంతవగా సమాచారం అందుకున్న వెంకటాపురం సిఐ కుమార్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, మరియు వారి సిబ్బంది వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులను సమన్వయం చేసుకొని  తప్పిపోయిన ఏడుగురు విద్యార్థులను ఫారెస్టు సిబ్బందితో కలిసి రెస్క్యూ చేసి వారిని కాపాడారు.. ములుగు జిల్లా అధికార యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని వాటర్ ఫాల్స్ సందర్శనను నిషేధించిన నేపథ్యంలో ఎవరికి చెప్పకుండా, ఎవరి అనుమతి లేకుండా నిబంధనలు మీరే వచ్చినటువంటి విద్యార్థుల ను పోలీసులు మందలించి, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల బంధువులకు అప్పగించారు. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా వాటర్ ఫాల్స్ సందర్శనకు రాకూడదని అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధన ఉల్లంఘించిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేశారు.

బాలయ్యకు సాధ్యమైంది..పవనయ్యకు ఎందుకు కాదు?

  బాలకృష్ణ కూడా సినీ పొలిటీషియనే. ఆయనా హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఇటు రాజకీయాల్లో ఉంటూనే అటు వరుస సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ లాస్ట్ హిట్ మూవీస్ ఏంటో చూస్తే.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్. అఖండ 2 ఫీవర్ లో ఉన్నారాయన అభిమానులు. తర్వాత కూడా మరో చిత్రానికి సంబంధించి కథా చర్చలు నడుస్తున్నాయి. హెక్ టిక్ బిజీ షెడ్యూల్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలేంటని చూస్తే నాలుగు సినిమాలు- నాలుగు వరుస సెంచురీలు. అఖండ నుంచి డాకూ వరకూ వంద కోట్లు క్రాస్ చేసిన సినిమాలే. ఇంత పక్కా ప్లానింగ్ ఎలా సాధ్యం? అని చూస్తే బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను ఇంత వయసులోనూ సమన్వయం చేసుకోవడంలో ఆరితేరిపోయారనే చెప్పాలి. అదే పవన్ అలాక్కాదు.. పుష్కరకాలంగా రెండు పడవలపై కాళ్లు. వాటిలో రాజకీయాల్లో పడుతూ లేస్తూ ఎలాగోలా నేడు ఆయన తొలిసారి గెలవడం మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం, ఆపై నాలుగు మంత్రిత్వాలు నెరుపుతున్నారు. కాదనడం లేదు. టైం లేదు. బిజీ బీజీ. ఉదయాన్నే ఎక్కిన హెలికాప్టర్ రాత్రి దిగే హెలికాప్టర్ మధ్య విమానయానం.. నానా రకాల హంగామా. ఈ బిజీ పొలిటికల్ షెడ్యూల్లో ఆయన సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. అదే బాలయ్య అలాక్కాదు. మొన్న మహానాడును కూడా వదులుకుని అఖండ 2 షూట్ కోసం ఫారిన్ టూర్ వెళ్లారు. అంటే కొంత రాజకీయ త్యాగం చేస్తున్నారన్నమాట. మాములుగా అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కడపలో పెట్టిన మహానాడు. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ బాలయ్య బాబు అలాక్కాదు. ఆయన దేనికి ఎప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలో ఇవ్వడం బాగా తెలుసని అంటారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే పవన్, బాలయ్య లా ఒక పార్టీ ఎమ్మెల్యే మాత్రమే కాదు. జనసేనకు అన్నీ తానే. ఈ విషయంలో పవన్ కి ఉన్న వర్క్ లోడ్, బాలకృష్ణకు ఉండకపోవచ్చు. అయితే అందుకంటూ కూడా కొంత ప్లానింగ్ అవసరమే. రాజకీయాల్లో ఉంటూ కూడా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ వంటి హిట్స్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ సింహ నుంచి ఊపందుకున్న సెకండ్ ఇన్నింగ్స్ తర్వాతి కాలంలో తన స్థాయికి తగ్గట్టు హిట్లు నమోదు చేస్తూనే వస్తున్నారు. అదే పవన్ విషయంలో ఆయనకొక హిట్టు పడి.. పుష్కర కాలం దాటింది. అంటే 12 ఏళ్లు పూర్తి. అత్తారింటికి దారేది తర్వాత హిట్టే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఆరు ఫ్లాప్ లు. వీటిలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి కొన్ని మెరుపులున్నా.. అవేం అంత పెద్ద మేజర్ హిట్స్ కావు.  పవన్ కన్నా చిన్న చిన్న వాళ్లు.. మరీ ముఖ్యంగా ఆ కాంపౌండ్ లోని అల్లు అర్జున్ పానిండియా స్టార్ గా తన కంటి ముందు ఎదుగుతూ వెళ్తున్నాడు. ఇటీవలి పుష్ప2 కూడా కాస్త డివైడ్ టాక్ వచ్చినా.. అది 2 వేల కోట్ల మేర వసూళ్లు సాగించిన చిత్రంగా టాలీవుడ్ రికార్డులకెక్కింది.  ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఫ్లాప్ షోగా భావిస్తున్నారు. ఆచార్య, భోళాశంకర్, మట్కా, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు.. అంటూ క్రోనాలజీ చెబుతున్నారు. ఇక నిర్మాత ఏఎం రత్నం అయితే ఏం సార్ మీరు హ్యాపీయేనా? అనడిగిన ప్రశ్నకు.. పాపం ఆయన మింగలేక కక్కలేక నానా అవస్తలు పడుతున్న దృశ్యం మెగా ఫ్యాన్స్ ని డైలమాలో పడేస్తోంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో ఒక ఫ్లాగ్ షిప్ కెప్టెన్సీ నిర్వహిస్తున్న పవన్ నుంచి తాము ఇలాంటి ఫలితాలను ఆశించడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు కొందరు.  అంతేనా బాలయ్యను చూసి నేర్చుకోమని కూడా సూచిస్తున్నారు కొందరు. బాలయ్య బాబు మీ అంత బిజీగా లేకున్నా.. ఆయన కూడా సేమ్ టూ సేమ్ ఇటు సినీ కథానాయకుడు, అటు రాజకీయ నాయకుడే. మధ్యలో ఫ్యామిలీ ఎఫైర్స్, ఆపై బసవతారకం ట్రస్ట్, ఇంకా హిందూపూర్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. సినిమా తీయడం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఆపై కథలను కూడా పర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి ఫ్లో మెయిన్ టైన్ చేయాల్సింది పోయి.. మనమేం మాట్లాడినా వర్కవుట్ అవుతోంది కదాని చెప్పి.. ఎలా పడితే అలా సినిమా చూస్తారనడానికి లేదన్న హెచ్చరికలు అందుతున్నాయ్. ఇది పోతే పోయింది ఓజీ, ఉస్తాద్ ఉన్నాయని లైట్ తీస్కోడానికి లేదనీ.. చేస్తే పక్కాగా సినిమాలు చేయడం.. లేదంటే వాటిని పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద దృష్టి సారించడం చేయాలన్న సలహా సూచనలు, స్వయానా ఆయన సైనికులు, వీర మహిళల నుంచే అందుతున్నాయ్.. లేకుంటే ఏంటీ రభస? పవన్ సినిమా కోసం ర్యాలీలు తీయడమేంటి? సినిమా చూడమని కూడా బలవంత పెట్టడమేంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే సినిమా టికెట్ ఫ్రీ పథకం ప్రవేశ పెట్టడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ అవుతోంది. ఇదేంటి పవనన్నా.. సినిమా చూడ్డం ఏమీ స్కూలుకెళ్లడం లాంటి నిర్బంధ వ్యవహారం కాదే అని నిలదీస్తున్నారు.. కొందరు అభిమానులు. పవన్ సినిమా హిట్ చేయడం వల్ల లాభాలను ఏకరవు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీరు ఈ సమాజానికి ఏదైనా లబ్ధి చేకూర్చి పెట్టాలంటే నేరుగానే చేయవచ్చు. సినిమా రూపంలో దాన్ని చేయాల్సిన అవసరం లేదన సలహాలు అందుతున్నాయ్. మరి చూడాలి పవన్ ఇటు బాలకృష్ణలాంటి వారి నుంచి ఏదైనా నేర్చుకుంటారా? లేక సినిమాలు పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతారా? తేలాల్సి ఉందంటున్నారు సైనికులు.