ఎస్ బీఐలో భారీ చోరీ.. రూ.38 లక్షల నగదు.. పది కేజీల బంగారం దోపిడీ

ఎస్ బీఐ లో భారీ చోరీ జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆదివారం(జులై 27) అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు చోరీకి పాల్పడ్డారు.   బ్యాంకు కిటికీ కోసి దాని గుండా లోనికి ప్రవేశించిన దుండగులుకిటికీ కోసి లోనికి వెళ్లి సీసీ కెమెరా వైర్లుకత్తిరించి, లాకర్ తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు.   38 లక్షల రూపాయల నగదు, 10 కేజీల బంగారం దోచుకెళ్లినట్లు నిర్ధారించారు. సోమవారం ఉదయం చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.   దొంగలు బ్యాంకులోని ఇనుప లాకర్ ప్రధాత తలుపు కూడా పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో.. చోరీ వ్యవహారం సోమవారం (జులై 28) బ్యాంకు తెరిచిన తరువాతే బయటపడింది.   నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

కేరళ నర్సు నిమిషప్రియ ఉరి రద్దు చేసిన యెమెన్

కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వం  సోమవారం (జులై 28)  అర్ధరాత్రి దాటిన తరువాత భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. యెమెన్‌లోని సూఫీ మత పెద్ద షేక్‌ హబీబ్‌ ఓమర్‌ బిన్‌ హఫీజ్‌ నేతృత్వంలో బృందాన్ని నిమిషప్రియ ఉరి రద్దు చర్చల కోసం నియమించిన సంగతి విదితమే.  అబుబాకర్‌ ముస్లియార్‌ ఉత్తర యెమెన్‌ ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్‌  ప్రభుత్వం అంగీకరించింది.  అబుబాకర్‌ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్‌ కౌన్సిల్‌ ఫర్‌ తలాల్‌ మహదీస్‌ జస్టిస్‌ ప్రతినిధి సర్హాన్‌ షంశాన్‌ అల్‌ విశ్వాబి ధ్రువీకరించారు. మత పెద్దల చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దైందన్నారు. నిమిష ప్రియ జైలు నుంచి విడుదలవుతారా, లేక జీవిత ఖైదుగా శిక్షను మార్పు చేస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరణించిన తలాల్‌ అబ్దో మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హత్య కేసులో నిమిష ప్రియకు యెమెన్‌ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా కేరళ నర్సు నిమిష ప్రియ ఉరి రద్దు అయినట్లుగా వస్తున్న వార్తలను భారత  విదేశాంగ శాఖ వర్గాలు ఖండించాయి.   ఇప్పటి వరకు ఉరిశిక్ష రద్దుకు సంబంధించి యెమెన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదనీ స్పష్టం చేశాయి.  

బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో నిరసనకు కేబినెట్ నిర్ణయం

  బీసీలకు 42% రిజర్వేషన్లుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నుంచి  స్పందన కరవైన నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని  కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్న ప్రభాకర్‌ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి.. ఢిల్లీలో అడ్డుకుంటున్నారని మంత్రి పొన్న  విమర్శించారు.  బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను జూలై 14న గవర్నర్‌కు పంపాం. గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తుమన్నారు. ఆగస్టు 5,6,7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్‌ కోరామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోరేవారంతా తమతో కలిసి ఢిల్లీకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. 

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

  వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన వేసిన బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరోవైపు మద్యం ముడుపుల కేసులో పరారీలో ఉన్న నిందితులపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.  పరారీలో ఉన్న 12 మంది అరెస్టుకు వారెంట్‌ జారీ చేయాలని సిట్‌ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారి అరెస్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డి, పురుషోత్తం, అనిరుధ్‌రెడ్డి, షేక్‌ సైఫ్‌, ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, బొల్లారం శివ, రాజీవ్‌ప్రతాప్‌ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. గత వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని.. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జూన్ నెలలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని అతని అనుచరుడు వెంకటేష్ నాయుడును బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే    

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ టీడీపీ ఎంట్రీ

  తెలంగాణ స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి రామనాథం ప్రకటించారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీచేసిన టీడీపీ ఆ తరువాత అన్ని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ఘనవిజయం సాధించింది. ఇదే తరహాలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాసిరెడ్డి ప్రకటన ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తోంది. గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం పార్టీ ని చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. బనకచర్ల ఇష్యూ ను ప్రధానంగా చేసుకొని విమర్శలకు పదునుపెడుతున్నారు. మళ్లీ తెలంగాణ వ్యతిరేకులు అంతా తెలంగాణ పై దాడికి సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ నేతలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  నేడు రామనాథం ప్రకటన బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల వరకే పరిమితం అవుతుందా … లేక 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి దిగుతుందా అనే విషయం తేలాల్సి ఉంది. స్థానిక ఎన్నికల్లో ఫలితాలపైనే భవిష్యత్తు లో తెలంగాణ లో ఎన్డీఏ కూటమి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర మంతా పోటీచేస్తారా లేక ఖమ్మంతో పాటు మరికొన్ని ఎంపిక చేసిన జిల్లాలకే పరిమితం అవుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

తెలంగాణకు నలుగురు కొత్త జడ్జిల నియామకం

  తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  ఉత్తర్వులు జారీ చేశారు. నూతన న్యాయమూర్తులుగా గౌస్‌ మీరా మొహియుద్దీన్‌, చలపతిరావు సుద్దాల అలియాస్‌ ఎస్‌.చలపతిరావు, వాకిటి రామకృష్ణా రెడ్డి, గడి ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణం చేయనున్నారు.  దేశంలోని పలు హైకోర్టులకు 19మంది జడ్జిలు/అదనపు జడ్జిలు నియమితులయ్యారు. పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్‌ ఆఫీసర్లను జడ్జిలు/అదనపు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు.  మొత్తం 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన జులై 19వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

మినిస్టర్ నంబర్ వన్..పెమ్మసాని

  దేశ రాజకీయాలకు తెలుగు తరం, పనితనాన్ని పరిచయం చేస్తున్నారు ఓ యువ  ఎంపీ ....ఎంపీ గా మాత్రమే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తన పనితనాన్ని , యావత్ భారతదేశానికి పరిచయం చేస్తున్నారు... దీంతో గల్లీ నుండి కాదు,  ఢిల్లీ నుంచి కూడా ఆ ఎంపీ కి ,ఆ కేంద్ర సహాయ మంత్రికి ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి ...సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం ఆ యువ కేంద్ర మంత్రి పనితనానికి అబ్బురపడుతున్నట్లు సమాచారం.... ఇంతకు ఎవరు, ఈ కార్యసాధకుడు,  ఎవరు తెలుగుతనాన్ని, తెలుగు జాతిఖ్యాతిని దేశ వ్యాప్తంగా  ఇనుమడింపజేస్తున్న ఉత్తమ కేంద్రమంత్రి..... మీరే చూడండి ... కార్యసాధకుడు ....ఈ మాట , గుర్తుకు వస్తే గతంలో చాలామంది కనపడేవారు, ... కానీ ఇప్పటి తరంలో కార్యసాధకులు తగ్గిపోయారు ...కేవలం కబుర్లతో కాలక్షేపం చేసేవారు ఎక్కువయ్యారు... రాజకీయాల్లో అయితే ఇలా మాటలు చెప్పి పబ్బం గడుపుకునే  వ్యవహారం మరింత ఎక్కువైంది...  అలాంటి తరుణంలో కొత్తగా ఎన్నికైన ఓ ఎంపీ ,దేశం మొత్తం తన వైపు చూసేలా తన పని మొదలుపెట్టారు... రాజకీయాలలో కొత్తగా ఎంటర్ అయిన ఓ వ్యక్తి ,ఇప్పుడు దేశంలో కార్యసాధకుడిగా గుర్తింపు పొందుతున్నారు... ఆయనే గుంటూరు ఎంపీగా గెలిచి, కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. ఒక ఎంపీ గానే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తనపై ఉన్న బాధ్యతలను ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే దేశంలో అత్యంత ప్రతిభావంతమైన కేంద్ర సహాయ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ ..... తన ఉనికికి కావాల్సింది పదవి కాదు ,తన పనితీరే కొలమానంగా చెలరేగిపోతున్న  కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని,  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇటీవల కేంద్ర మంత్రుల పనితీరు పై చేపట్టిన సమగ్ర సర్వేలో  నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు... జిల్లాకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ గతంలో ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, అమెరికాలో స్థిరపడిపోయారు ...కానీ సొంత ప్రాంతం పై ఉన్న మమకారంతో గుంటూరు ఎంపీగా పోటీ చేసి టిడిపి ఎంపీగా గెలిచారు... అలా మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచిన చంద్రశేఖర్, అభివృద్ధిలో చెలరేగిపోతున్నారు.... అంతేకాదు కేంద్ర సహాయ మంత్రులు కాదు,  మొత్తం కేంద్ర మంత్రుల జాబితా లో సైతం ఆయన ఉత్తమ ఫలితాలు సాధించి , జాతీయస్థాయిలో 5వ స్థానంలో నిలిచారు ....తద్వారా తెలుగుజాతి ఖ్యాతిని ,ఢిల్లీలో మరొకసారి రెపరెపలాడించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ...  చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా గెలిచిన మొదటి రోజు నుండే,  ప్రజల మద్దతుతో, తనకు ఉన్న  చొరవతో ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు చేస్తూనే ఉన్నారు ....ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో సహాయ మంత్రుల్లో, అధికారులతో ఇన్ని సమీక్షలు చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే  లేరని చెప్పవచ్చు.... ఢిల్లీ నుంచి గల్లీ వరకు, ఉన్న అధికారులతో, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ,గుంటూరు అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం పెమ్మసాని పొలిటికల్ స్టైల్..... గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి,  నుండి గుంటూరులో నూతన  రైల్వే ప్రాజెక్టులు,  అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జి లు , రైల్వే ఓవర్ బ్రిడ్జిలు  అంటూ కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, తాగునీటి సమస్యలపై కేంద్ర సహకారం తీసుకురావడం వంటివి , పెమ్మసాని చంద్రశేఖర్  పనితీరుకు కొలమానంగా చెప్పుకోవచ్చు.... ఇలా ప్రతి దశలో  తన ప్రత్యేకతతో, గుంటూరులోనే కాదు,  ఢిల్లీలో సైతం కార్యసాధకుడిగా ముద్ర వేసుకున్నారు పెమ్మసాని .... కేంద్ర సహాయ మంత్రుల ర్యాంకులు జాబితాలో నెంబర్వన్ స్థానం సంపాదించడం,  పెమ్మసాని వ్యక్తిగత విజయం మాత్రమే కాదు , తెలుగు ప్రజల వారధిగా ,సారధిగా ఢిల్లీలో తెలుగుజాతి ఖ్యాతిని నిలబెట్టిన మరో ప్రజా ప్రతినిధిగా  పెమ్మసాని పేరు చెబుతున్నారు గుంటూరు ప్రజలు......  

కోనేరు హంపిని ఓడించి చెస్ ప్రపంచ విజేతగా నిలిచిన దివ్వదేశ్‌ముఖ్

  తనకంటే ఎంతో సీనియర్ అయిన కోనేరు హంపిని ఓడించి ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌ నిలిచింది. తాజాగా (28-7-25) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్‌ విజయం సాధించింది. ఈ విజయంతో 19 ఏళ్ల దివ్య భారతదేశానికి చెందిన ఎనభై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్‌గా అవతరించింది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన తొలి ర్యాపిడ్ ట్రై బ్రేకర్ డ్రాగా ముగిసింది.  అయితే ఆ తర్వాత రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో కోనేరు హంపిపై దివ్య గెలుపొందింది. 2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. చివరకు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్యకు 1.5 పాయింట్లు లభించగా, కోనేరు హంపికి 0.5 పాయింట్లు వచ్చాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దివ్యకు హంపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఫలితం ట్రైబ్రేకర్‌కు చేరింది. సోమవారం దూకుడుగా ఆడిన దివ్య టోర్నీ విజేతగా నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ సీనియర్ విభాగంలో చాలా తక్కువ టోర్నీలు మాత్రమే ఆడింది. కోనేరు హంపితో పోల్చుకుంటే దివ్య అనుభవం చాలా తక్కువ. ఈ టోర్నీకి ముందు ఆమెకు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా లేదు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన దివ్య.. 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. అలాగే ఒలింపియాడ్‌లో మూడు స్వర్ణ పతకాలను కూడా అందుకుంది. తాజా ప్రపంచకప్‌లో తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారిక, జు జినర్ వంటి ప్రతిభావంతులను ఓడించి అందర్నీ ఆకట్టుకుంది.

హైదరాబాద్‌‌లో చిరుత సంచారం కలకలం

  హైదరాబాద్‌ నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ప్రాంతంలో  ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు  సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనుకభాగం మీదుగా మూసీనది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.   ఇటీవల మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో  చిరుత సంచరిస్తోంది. గ్రేహౌండ్స్‌ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.  బోన్లకు చిక్కకుండా  తప్పించుకుని తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ప్రాంతంలో చిరుత రోడ్డుదాటినట్లు సమాచారం. ప్రస్తుతం చిరుత కోసం ఫారెస్ట్ అధికారులతో కలిసి పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. కాగా, ఇటీవలే నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్‌ క్యాంపస్‌లో చిరుత సంచారం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే.చిరుత సంచరించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.   

త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు : మంత్రి కొల్లు రవీంద్ర

  అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.  శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ  కార్యాలయంలో శాసన సభ్యురాలు గౌతు శిరీషతో కలిసి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.  ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన చాలా సంస్థలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. 

థాయిలాండ్-కాంబోడియా మధ్య సీజ్ ఫైర్

  థాయిలాండ్ - కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సీజ్‌ఫైర్ అమలు చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్-కాంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.   నాలుగురోజుల థాయ్‌-కంబోడియా సరిహద్దు ఘర్షణలతో 34 మంది మరణించగా, లక్షా 68వేల మంది నిర్వాసితులు అయ్యారు. యుద్ధం ఆపేందుకు థాయ్‌-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్‌ ప్రకటించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఆహ్వానం మేరకు థాయ్‌ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్‌ వేచాయచాయ్‌ ఇవాళ చర్చలు సఫలం అయ్యాయి.

ఫిడే ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌

  ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేత‌గా భారత ప్లేయర్  దివ్య దేశ్‌ముఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫైనల్‌ టై బ్రేక్‌ గేమ్‌లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించి టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్స్‌లో తొలి రెండు గేమ్స్‌ డ్రాగా ముగిశాయి. దీంతో సోమవారం నిర్వహించిన టై బ్రేకర్‌లో దివ్య గెలుపొందింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో గెలిచిన తొలి భారత మహిళగా నిలిచారు.  విజయం సాధించక దివ్య ఎమోషనల్ అయ్యారు. ఈ విజయం ద్వారా దివ్య కేవలం 19 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాను కూడా సాధించింది. భారత్ నుండి ఈ ఘనత సాధించిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా ఆమె నిలిచింది. ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్‌లో తలపడటం విశేషం

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం... జిల్లాల నిబంధన లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత   ప్రయాణం పథకం అమలు కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఒకటి.దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన తరువాత ఈ పథకం అమలుకు ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకాన్ని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకం అమలుపై ఆయా రాష్ట్రాలలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. దీంతో అన్ని రకాలుగా ఆలోచించి చివరకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి జిల్లాల పరిమితులేమీ లేవనీ, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చనీ అచ్చెన్నాయుడు చెప్పారు. ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఆయనీ విషయం తెలిపారు.  ఏపీలో మహిళలకు ఎగిరి గంతేసే వార్త. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పథకానికి జిల్లాల పరిమితులు లేవనీ . రాష్ట్రమంతటా అమలు చేస్తామని తెలిపారు. ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ప్రత్తిపాడులో  సుపరిపాలనలో తొలి అడుగు   కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు.  ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. తొలుత జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ.. ఆ తరువాత మంత్రి నారా లోకేష్ జోక్యంతో దీనిపై విస్తృతంగా చర్చింది, జిల్లాల పరిమితి వద్దని నిర్ణయించినట్లు తెలిపారు.  

జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్

  కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు కోరారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ నెక్లస్ రోడ్డులోని స్మారక ఘాట్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ నేత కె కేశవరావు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ, పలువురు ఎమ్మెల్యేలు, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు.  హైదరాబాద్‌కు మెట్రో జైపాల్ రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పారు. దేశం మొత్తం మీద నిజాయితీగా పని చేసిన వ్యక్తి అని, ఆయనను తెలంగాణ మరువదని చెప్పుకొచ్చారు. అచ్చంపేట శాసన సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత అయిన జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని, అలాగే నాగర్ కర్నూల్ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, జైపాల్‌రెడ్డి వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, ఆయన కూతురు నైమిష రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  

శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒకసారి దర్శించుకోవాలి

  తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇవాళ  శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని వెంకయ్యనాయుడు తెలిపారు.  ప్రభుత్వ లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదని ఆయన తెలిపారు.  హిందువుల సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలి. ప్రముఖ దేవాలయాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పట్టాలి అని పిలుపునిచ్చారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదు. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం. గుడి కట్టించడం భక్తులు మరియు ప్రముఖ దేవస్థానాల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి అని మాజీ ఉప రాష్ట్రపతి తెలిపారు. అంతకముందు వెంకయ్యనాయుడు  సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్‌‌లు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. పహల్గాం ఉగ్రవాదులు హతం

  జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్ దాడిలో పాల్గొన్నా ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీనగర్‌లో ఉన్న లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని భద్రత బలగాలు కాల్పలు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పహల్గామ్ దాడి నిందితుడు అని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి.. వారు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తం అయిన బలగాలు.. తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తుంది. ఈ ఎన్ కౌంటర్ హిర్వాన్- లిద్వాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఇంకా కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతం మొత్తం తుపాకులు శబ్దాలతో దద్దరిల్లుతోంది. కాగా ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. అప్పటినుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి.  

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం (జులై 28) ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు నుండి బదిలీపై  రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచేత  రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌  ప్రమాణం చేయించారు.  హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సాంబశివ ప్రతాప్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి, సహా పలువురు  ఇతర రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యు లు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీ హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారం

బిడదారి ఎస్టేట్ లో కాలినడకన కలియదిరిగిన చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆయన విజన్ కు అద్దం పడుతోంది. తన సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజ సోమవారం (జులై 28) ఆయన తన టీమ్ తో సింగపూర్ లో పది వేల కుటుంబాలు నివశించే బిడదారి ఎస్టేట్ ను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలన్న ప్రభుత్వ ప్రణాళికలలో భాగంగా సింగపూర్ లో అర్బన్ హౌస్ ప్లానింగ్ ను పరిశీలించేందుకే చంద్రబాబు బృందం బిడదారి ఎస్టేస్ సందర్శించింది.  సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను సింగపూర్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.  మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు కాలి నడకన కలియదిరిగారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్ నగరాన్ని తీర్చి దిద్దుతు న్నామన్నారు.  అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందనీపేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ - ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత అంతరం వచ్చిందన్న ఆయన  గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు..  గ్యాప్ ను తగ్గించేందుకే  ప్రస్తుతం తాను సింగపూర్ వచ్చి నట్లు చెప్పారు. భవిష్యత్‌లోనూ సింగపూర్-ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. బిడదారి ఎస్టేటులో గృహ సముదాయాల నిర్మాణం   చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా... చేపట్టారు.  ప్రకృతితో మమేకమయ్యేలా చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు. అంతే కాకుండా నివాసితులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా నిర్మాణాలు ఉన్నాయి. కాగా ఈ సందర్భంగా చంద్రబాబు గృహ సముదాయాల నిర్మాణ వ్యయంపై కూడా చర్చించారు.  పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఉండేలా చూడడంతో పాటు.. నాణ్యమైన నివాస గృహాల నిర్మాణాల చేపట్టామని చంద్రబాబుకు సింగపూర్ అధికారులు చెప్పారు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దిన తీరును ముఖ్యమంత్రి  ప్రశంసించారు. సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ఈ హౌసింగ్ ప్రాజెక్టు అన్ని వసతులతో పర్యావరణ హితంగా అద్భుతంగా నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారు. స్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్‌గా సింగపూర్ అర్బన్ రీడెవల్పమెంట్ అథారిటీ మార్చడం ఆకట్టుకుందని చంద్రబాబు అన్నారు.  బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు సందర్శన అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై  చర్చించారు. ఏపీలో, అమరావతిలో చేపట్టబోయే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు.