స్టేజీపై డాన్స్ అదరగొట్టిన రామ్మోహన్ నాయుడు

  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్‌తో  అదరగొట్టారు. శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి ఆయన గ్యాంగ్ లీడర్ పాటకు  స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతలో మంత్రి చలాకితనానికి మంచి స్పందన లభిస్తోంది. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన... ఉత్సాహంగా కాలు కదిపారు. మాంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఎప్పుడు బిజీగా ఉంటే కేంద్ర మంత్రి ఒకేసారిగా డ్యాన్స్  చేయటంతో టీడీపీ పార్టీ శ్రేణులు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు  

ఏపీ సీఎం చంద్రబాబుపై సింగ‌పూర్ మంత్రి ప్ర‌శంస‌ల వర్షం

సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు.. అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌ల నుంచే కాకుండా ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది.  సింగపూర్  నైపుణ్యాలు ఏపీకి అవసరం అంటూ చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు, ప్రభుత్వాన్ని కోరుతుంటే.. అందుకు ప్రతికా వారి నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రబాబుతో ఐదు నిమిషాల భేటీ చాలు ఏపీలో పెట్టుబడులపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి అని ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్లు అంటుంటూ.. చంద్రబాబు పని తీరు అద్భుతం, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి అంటూ సింగపూర్ మంత్రులు పొగడ్తలు కురిపిస్తున్నారు.  తాజాగా సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్  చంద్రబాబు పని చేసే తీరు.. ప్రగతి పట్ల ఉన్న దార్శనికత అద్భుతమంటూ ప్రశంసించారు.     సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో  భాగంగా చంద్ర‌బాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని, గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్‌గా ఏపీ రూపాంతరం చెందుతోంద‌ని.. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నిసూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించి టాన్ సీలాంగ్,   నిరంత‌రం.. ప్ర‌జ‌ల కోసం ప‌ని పని చేస్తుండటం మీకెలా సాధ్యమౌతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   ప్ర‌జ‌ల‌తో మమేకం కావడం నుంచి వారి సమస్యల పరిష్కారం వరకూ చంద్రబాబు తీసుకుంటున్నశ్రద్ధ అనితర సాధ్యమని ప్రశంసించారు.  టాన్ సీలాంగ్ తో భేటీ సందర్భంగా గృహనిర్మాణం, సముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబుతో కలిసి పని చేయడానికీ తాము ఉత్సుకతతో ఉన్నామని టాన్ లాసింగ్ ఈ సందర్భంగా చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన ప్రాజెక్టులు ఇప్ప‌టికీ అంతే నాణ్య‌త‌తో కొన‌సాగుతుండటానికి కారణం చంద్రబాబు విజనే అని అన్నారు.  

ఏపీలో క్రియేటర్ అకాడమీ.. టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ

ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి  ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక అవగాహన ఒప్పందం జరిగింది. సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో  టెజరాక్ట్ ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ప్రభుత్వం  ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది. పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతికత, నైపుణ్యాలను అందించనుండగా.. టెజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్, నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.  డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో విజయం సాధించేందుకు ఔత్సాహికులను సన్నద్దం చేయడం, వారికి అవసరమైన నైపుణ్యం, వనరులు సమకూర్చడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఒప్పందం ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా  మంత్రి లోకేశ్‌ చెప్పారు.

పహల్గామ్‌ భద్రత వైఫల్యానికి బాధ్యత ఎవరిది? : ప్రియాంక గాంధీ

  ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్బంగా లోక్ సభలో  ప్రధాన మోదీపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సైటైర్ల వేశారు. ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్‌ ఎవరైనా రాజీనామా చేశారా? పహల్గాం ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా? టీఆర్‌ఎఫ్‌ కొత్త సంస్థ ఏం కాదు. అది వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు?’’అని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. దానిపై ప్రధాని క్రెడిట్ తీసుకున్నారు. ఒలిపింక్స్‌లో ఎవరైనా పతకం సాధిసై దానికి కూడా ఆయనే క్రెడిట్ తీసుకుంటారు. తీసుకోండి.. బాధలేదు. కానీ బాధ్యత కూడా తీసుకోవాలి కదా? పహల్గామ్‌లో భద్రత వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు అని ప్రియాంక  ప్రశ్నించారు.   బైసార‌న్ వ్యాలీలో ఎందుకు భ‌ద్ర‌తను ఏర్పాటు చేయలేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. స‌రైన భ‌ద్ర‌త లేక‌పోవ‌డం వ‌ల్లే అక్క‌డ ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ట్లు ఆమె ఆరోపించారు. దాని వ‌ల్లే 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. 2019లో టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఏర్ప‌డింద‌ని, ఆర్మీ అధికారుల్ని చంపుతూ 25 సార్లు ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డింద‌ని, కానీ 2023లో ఆ సంస్థ‌ను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించార‌న్నారు. బైసార‌న్‌లో జ‌రిగిన భ‌ద్ర‌తా లోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ‌రైనా త‌మ ప‌దువుల‌కు రాజీనామా చేశారా అని ప్రియాంకా  అడిగారు.నెహ్రూ గురించి భారతీయ జనతా పార్టీ నేత‌లు ప్ర‌స్తావించ‌డంతో.. ఆమె మాట్లాడుతూ మీరు గ‌తం గురించి చెబుతున్నార‌ని, కానీ తాను మాత్రం ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి మాట్లాడుతున్న‌ట్లు పేర్కొన్నారు.  11 ఏళ్లు అధికారంలో ఉన్నార‌ని, దానికి బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. ముంబైలో 2008లో జ‌రిగిన సెప్టెంబ‌ర్ 26 దాడుల త‌ర్వాత ఆ రాష్ట్ర సీఎం, హోంశాఖ మంత్రి రాజీనామా చేసిన‌ట్లు ఆమె గుర్తు చేశారు. పెహల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయ‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.పాకిస్థాన్ సరెండ‌ర్ అయ్యేందుకు అంగీక‌రిస్తే, మ‌రి యుద్ధాన్ని ఎందుకు ఆపేశార‌ని ప్రియాంకా అడిగారు. అమెరికా అధ్య‌క్షుడు ఎందుకు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఉగ్ర‌వాద బాధితల బాధ‌ను అర్థం చేసుకుంటాన‌ని, త‌న‌కు వారి బాధ ఏంటో తెలుసు అని, త‌న తండ్రిని ఉగ్ర‌వాదులు చంపిన‌ప్పుడు త‌న త‌ల్లి ఎలా బాధ‌ప‌డిందో తెలుసు అని ప్రియాంకా అన్నారు

ఉగ్రవాదుల హతంపై.. పహల్గాం బాధిత కుటుంబలు హర్షం

  కశ్మీర్ పహల్గామ్‌  మారణహోమానికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టడంపై బాధిత కుటుంబలు హర్షం వ్యక్తం చేశాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతం చేయటంతో తమకు కొంత న్యాయం జరిగిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను అంతం చేసిన భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన మూడు నెలలుగా తాను ఎంత క్షోభను అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేనని ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గద్గద స్వరంతో చెప్పారు.  నువ్వు పహల్గాంకు ఎందుకు వెళ్లావు..? నువ్వు తప్పకుంట ఇంటికి తిరిగి రావాలి’ అని తాను తరచూ ఆయన ఫొటోతో మాట్లాడుతున్నానని మీడియా ప్రతినిధులతో చెబుతూ ప్రగతి జగ్దాలే ఏడ్చారు. ఆ ఉగ్రవాదుల అంతం న్యూస్ కోసం తాము ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ వార్త విన్నామని అన్నారు. ‘నా దగ్గర తుపాకీ ఎందుకు లేదు..? ఉంటే నేనే ఆ ఉగ్రవాదులను నా చేతులారా కాల్చి చంపేదాన్ని’ అని తాను తరచూ అనుకునేదాన్నని ప్రగతి జగ్దాలే తెలిపారు.ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఆపరేషన్ మహాదేవ్ కార్యకలాపాలను కొనసాగించాలి." అని వారు తెలిపారు. వారిని కనుగొనడం చాలా కష్టంగా ఉన్నందున ఇది గర్వకారణమైన క్షణం.  భారత సైన్యానికి ధన్యవాదాలు. ఈ రోజు నాకు ఉపశమనం కలిగింది. దీనిపై ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు. నా సైన్యం మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు నేను గర్వపడుతున్నాను." అని చెప్పుకొచ్చారు. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది మృతి చెందిన విషయం విదితమే. ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు  తీవ్రవాదులను నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ మహదేవ్ లో హతం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు పార్లమెంట్‌లో  క్లారిటీ ఇచ్చారు.

సిందూర్ పై చర్చకు ఆ ఇద్దరూ దూరం!

పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై పార్లమెంటులో సోమవారం (జులై 28) ప్రారంభమైన చర్చ సభ లోపల వెలుపల కూడా రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది.. ఆపరేషన్ సిందూర్  విరమణ వెంక ఉన్న రహస్యం ఏమిటి?  ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీ పదే పదే ఆరోపిస్తునట్లుగా..  ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగిపోయారా?  సరండర్ అయ్యారా? ప్రభుత్వం చెపుతున్న విధంగా పాక్  మన దేశానికి లొంగి పోయిందా? అందుకే మన సైన్యం ఆపరేషన్ సిందూర్ కు తాత్కాలిక విరామామ ప్రకటించిందా? ఏది నిజం..  అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  మరోవంక..  ప్రతిపక్ష ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు  ఒకదాని వెంట ఒకటిగా అస్త్రాలను సంధిస్తోంది. ఇప్పటికే  లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు, గొగోయ్ వరస ప్రశ్నలతో తొలి అస్త్రాన్ని సంధించారు.   మంగళవారం(జులై 29) ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా వాద్రా చర్చలో పాల్గొంటారు. ప్రభుత్వ పక్షాన ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్  విపక్షాలు సభ లోపల వెలుపల చేసిన, చేస్తున్న విమర్శలకు చాలా వరకు సమాధానాలు ఇచ్చారు. కాగా   మంగళవారం( జులై 29) హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు రాహుల్,ఇటు ప్రధాని మోదీ చర్చలో పాల్గొననున్న నేపధ్యంలో ఎవరు ఏమి మాట్లాడతారు అనే విషయంలో ఆసక్తి వ్యక్తమవుతోంది. అదలా ఉంటే..  ఆపరేషన్ సిందూర్’ విషయంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో తలెత్తిన అంశాలు పార్లమెంట్ చర్చ సందర్భంగా మరో మారు  తెరపై కొచ్చాయి. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీలను పార్టీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తివారీ, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేకంగా మాట్లాడుతోందనే అర్థం వచ్చేలా..  తాను  భారత్‌ వైపే మాట్లాడతానని నర్మగర్భంగా  వ్యాఖ్యలు చేశారు. నిజానికి..  ఇప్పటికే  రక్షణమంత్రి రాజనాథ్ సింగ్,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా  పలువురు బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు.    ఇక ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌ గురించి ప్రపంచదేశాలకు వివరించడానికి వెళ్లిన అఖిలపక్ష బృందంతో వెళ్ళిన థరూర్, తివారీలను  కాంగ్రెస్ పార్టీ  ఆపరేషన్‌ సిందూర్  పై జరిగే చర్చలో ఎందుకు దూరం పెట్టిందనే  విషయంగా  ఓ వార్తా సంస్థ రాసిన కథనాన్ని తివారీ ఎక్స్ లో పంచుకున్నారు. దానికి పూరబ్ ఔర్ పశ్చిమ్‌ అనే బాలీవుడ్‌ సినిమాలోని దేశభక్తి గీతంలో కొన్ని వ్యాఖ్యలను జోడించారు. ఒక భారతీయుడిగా తాను దేశ వైభవాన్నే కోరుకుంటాననేది దాని అర్థం. దీనికి ముందు చర్చల్లో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తివారీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థన కూడా పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక  ఆపరేషన్‌ సిందూర్ పై జరిగే చర్చల్లో థరూర్‌ ఉండాలని కాంగ్రెస్‌ కోరిందని.. అయితే, పార్టీ చెప్పిన విధంగా మాట్లాడాలని కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ..  దీనికి ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీనిపై విలేకరులు ప్రశ్నించగా..  మౌనవ్రతం, మౌనవ్రతం అంటూ థరూర్‌ బదులిచ్చారు. దీంతో.. ఆపరేషన్ సిందూర్  పై చర్చ కాంగ్రెస్  కు కూడా పరీక్షగానే మారిందని  అంటున్నారు.

కేంద్రంతో కయ్యం.. కేసీఆర్ రూట్ లోనే రేవంత్?!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారా?  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  రూట్ లో ఢిల్లీతో యుద్ధానికి సిద్దమవుతున్నారా? ఇంతవరకూ  భడేభాయి  ప్రధాని మోదీతో  అంతో ఇంతో సయోధ్యగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక పై అందుకు విరుద్ధంగా యుద్దానికి సిద్దమవుతున్నారా? అంటే..  జరుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే  సమాధానమే వస్తోంది.  ముఖ్యంగా  సోమవారం (జూలై 28)మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. మరీ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ నుంచే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తీసుకున్న నిర్ణయం యుద్ధ సంకేతంగానే చెబుతున్నారు.  అది కూడా.. మందీ మార్బలంతో ఢిల్లీ వెళ్ళాలనే నిర్ణయం యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలనే ఇస్తోందని అంటున్నారు. ఒక విధంగా..  ఇది ఢిల్లీ పై దండయాత్రగా భావించ వలసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంపై ప్రజాస్వామ్య పద్దతిలో వత్తిడి తేవడం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ..  ముఖ్యమంత్రి నాయకత్వంలో మొత్తానికి మొత్తంగా రాష్ట్ర మంత్రి వర్గం,ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర ప్రజాప్రతినిధులు,  వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరికి తోడు బీసీ సంఘాల నాయకులు.. ఇంత మందితో దండయాత్రగా ఢిల్లీకి వెళ్ళడం  అంటే కేంద్రం పై యుద్దాన్ని ప్రకటించడం కంటే  ఏమాత్రం తక్కువ కాదని అంటున్నారు.  కాగా సోమవారం (జులై 28)  ఇంచుమించుగా నాలుగు గంటలకు పైగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ఎన్నికలో ముడిపడిన బీసీ  రిజర్వేషన్ అంశంపైనే  చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణను ఖరారు చేసింది.  ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చేపట్టాల్సిన కార్యాచరణకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆగస్టు ఐదో తేదీన పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో ఆగస్టు 6న చలో ఢిల్లీ  కార్యక్రమాన్ని నిర్వహించి, జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆగస్టు ఏడో తేదీన ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని నిర్ణయించింది.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.  కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, పార్టీకి చెందిన 100 మంది ఎంపీలం రాష్ట్రపతిని కలవాల నుకుంటున్నామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరం ఢిల్లీకి వెళుతున్నామని, బీసీ మేధావులు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 42శాతం రిజర్వేషన్లు ఆశించే ప్రతి బీసీ బిడ్డా ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు.  అయితే.. రాజకీయ పరిశీలకులు మాత్రం, ఇది కేవలం స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్  కు పరిమితమైన అంశం కాదని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్  పార్టీ, కులగణనతో మొదలు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకు పోతున్న భవిష్యత్  రాజకీయ వ్యూహంలో భాగంగానే  ఢిల్లీని వేదిక చేసుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

మంత్రుల మధ్య భగ్గుమన్న విభేదాలు.. ఉత్తమ్ పై అలిగిన కోమటిరెడ్డి.. ఏంజరిగిందంటే?

కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నల్గొండ జిల్లాకే చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య విభేదాలు రచ్చకెక్కియి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. మంగళవారం (జులై 29) సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ను సాగర్ కువెళ్లాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఈ ముగ్గురు మంత్రులూ ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ మేరకు ఉదయం 9గంటలయ్యే సరికల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడంలో తీవ్ర జాప్యం జరిగింది. పది గంటల వరకూ ఎదురు చూసిన మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. తనను ఉదయం 9గంటలకల్లా రమ్మని చెప్పి ఆయన మాత్రం రాకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి వెనక్కు వెళ్లిపోయారు. దీంతో మంత్రి కోటమిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు హెలికాప్టర్ లో  సాగర్ కు బయలుదేరి వెళ్లారు.    కోమటిరెడ్డి అలకను, ఆగ్రహాన్నీ పట్టించుకోకుండా మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ లు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే కార్యక్రమాన్ని  షెడ్యూల్ ప్రకారం పూర్తి చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి నాగార్జునసాగర్  గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. దాదాపు18 ఏళ్ల తర్వాత జూలై నెలలో నాగార్జునసాగర్ గేట్లు తెరవడం ఇదే తొలిసారి. సాధారణంగా సాగర్ గేట్లు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్‌ తొలి వారంలో తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తారు.  

జగన్ హయాంలో అప్పుల కుప్ప.. బాబు పాలనలో అభివృద్ధిలో అగ్రగామి

వైసీపీ హయాంలో   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  అప్పులకుప్పలా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.  సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం (జులై 29) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కంభంపాడులో  పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం తమ చేతిలో అప్పుల పత్రాలు  పెట్టి వెళ్లిందనీ, అటువంటి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.  అంతకు ముందు   కోటి తీర్థం గ్రామంలో ప్రముఖ శైవ క్షేత్రాన్ని దర్శించున్న ఆనం మూడు కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.. జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటి పథకాలకు శంకుస్థాపన,  ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదులు, పశువైద్యశాల ప్రారంభోత్సవం చేశారు.  అలాగే  సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.  సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఏడాది పాలనలో చంద్రబాబు  ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందన్నారు. అటువంటి సుపరిపాలన అందిస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు.  ఆ తరువాత తూర్పు ఖమ్మంపాడు గ్రామంలో జరిగిన   సభలో మంత్రి ఆనం ప్రసంగించారు. నియోజకవర్గంలో ప్రతి పనిని చేపడుతున్నామని ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీరుస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. 

అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది.  న్యూయార్క్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు.  న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. మన్ హటల్ లో అత్యంత రద్దీగా వ్యాపార సముదాయం వద్ద  ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు సంఘటనా స్థలం వద్ద పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. కాల్పులకు తెగబడిన దుండగుడు అక్కడ నుంచి పరారైపోయారు. ఈ ఘటనలో మరణించిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి సమీప ప్రాంతాలలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ కాల్పులకు మోటివ్ ఏమిటి అన్నది తెలియరాలేదు.  

తల్లి, చెల్లిపై కేసులో జగన్‌కు ఊరట

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎన్‌సీఎల్‌టీలో భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్‌ వేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్‌ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టు లో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో తన అన్న వదిన కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని షర్మిల, విజయలక్ష్మి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జగన్ స్వయంగా తన చెల్లి, తల్లిపై పిటీషన్ వేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

ఓవల్‌లో టీమ్ ఇండియా 2021 ఫీట్ రిపీట్ చేస్తుందా?

భారత్-ఇంగ్లండ్ మధ్య కీలకమైన చివరి, ఐదో టెస్ట్‌ లండన్ కెన్నింగ్టన్ ఓవల్‌ వేదికగా  ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పుడు ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉన్నప్పటికీ, కెన్నింగ్టన్ వేదికలో ఇప్పటికే టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డ్ సాధించింది. ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి డ్రా చేయడంతో నాలుగో టెస్టుతోనూ  సిరీస్‌ ఇంగ్లాండ్ వశం కాకుండా అడ్డుకుంది. ఇది క్రికెట్‌లో చరిత్రలో అరుదైన సాహసమని క్రీడా వర్గాలు అంటున్నాయి. కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత్ గత రికార్డు ఒకింత మెరుగుగా ఉంది.  ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే ఇక్కడ కాస్తో కూస్తో ఇండియాకు మెరుగైన ట్రాక్‌ రికార్డ్ ఉంది . 1936 నుంచి ఇప్పటివరకు ఈ వేదికపై భారత్ 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, రెండు సార్లు విజయం సాధించింది, ఆరు సార్లు ఓడిపోయింది, ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్ తొలి విజయం 1971లో సాధించగా, రెండో విజయం 2021లో వచ్చింది. ఈ మైదానంలో భారత్ మూడు సార్లు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ చివరిసారిగా ఓవల్‌లో ఇంగ్లండ్‌తో 2021 సెప్టెంబర్‌లో తలపడింది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 191 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ అర్ధ సెంచరీ (50) సాధించినప్పటికీ, జట్టు 127/7 వద్ద కష్టాల్లో పడింది. అయితే, శార్దూల్ ఠాకూర్ 36 బంతుల్లో 57 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 62/5 వద్ద కష్టాల్లో పడినప్పటికీ, ఓలీ పోప్ (81), క్రిస్ వోక్స్ (50), జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీల సహకారంతో 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. రోహిత్ శర్మ  విదేశాలలో తొలి  టెస్ట్ సెంచరీ (127)తో అదరగొట్టాడు. పుజారా, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌లు అర్ధ సెంచరీలతో రాణించారు.  కేఎల్ రాహుల్ (46), కోహ్లీ (44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో భారత్ 466 పరుగుల భారీ స్కోరు సాధించి, ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ 100 పరుగుల భాగస్వామ్యంతో బాగా ఆరంభించినప్పటికీ, భారత బౌలర్ల దాడిలో 210 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని మూట గట్టుకుంది.  2021లో ఓవల్‌లో సాధించిన విజయం భారత్‌కు స్ఫూర్తినిస్తుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు సిరీస్‌ను 2-2తో సమం చేయాలని ఆశిస్తోంది. ఓవల్‌లో భారత్‌కు రెండో టెస్ట్ విజయం 2021లో వచ్చినప్పటికీ, ఈ మైదానం ఎల్లప్పుడూ గట్టి పోటీని ఇస్తోంది. రోహిత్, గిల్, పుజారా వంటి ఆటగాళ్లతో అప్పుడు చూపించిన అద్భుత ప్రదర్శన ఈసారి కూడా భారత్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు జట్లూ కూడా విజయం కోసం తీవ్రంగా పోరాడనున్నాయి.

భూమి మొత్తం స్కాన్.. నిసార్ శాటిలైట్ స్పెషాలిటీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక భారీ రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది.సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి  బుధవారం  (జులై 30) జిఎస్ఎల్వి ఎఫ్-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు.ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్మించి, రూపకల్పన చేసిన ప్రపంచంలోనే అత్యంత సామర్ధ్యం కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం నిస్సార్  ను రోదసిలోనికి పంపనున్నారు. భూ పరిభ్రమణం లో వస్తున్న మార్పులను  ప్రతి రోజూ ఒకసారి స్కాన్ చేసి సమగ్ర సమా చారాన్ని ఎప్పటికప్పుడు  అందించే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.  బుధవారం (జులై 30) సాయంత్రం 5.40 గంటలకు  తిరుపతి   శ్రీహరికోటలోని  రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది.  ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ మంగళవారం (జులై 29)మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభం కానుంది.  27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్  తరువాత బుధవారం (జులై 30) సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ 16 ను ప్రయోగించనున్నారు. వాస్తవానికి ఈ ప్రయోగం  జూన్ లోనే జరగాల్సి ఉండగా  అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.  నిస్సార్ ఉపగ్రహాన్ని భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య-సమకాలిక కక్ష్య (ఎస్ఎస్ఓ)లోకి ప్రవేశపెడుతుంది. నిసార్ ఉప్రాగ్రహం డ్యూయెల్ రాడార్ సిస్టమ్ తో రూపొందింది. ఎస్ బ్యాండ్ సిథటిక్ ఎపర్చర్ రాడారు ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ను నాసా రూపొం దించాయి. ఇది మేఘాలను దాటిన తర్వాత కూడా సెం టీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్ట గలదు. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు మొత్తం భూమిని స్కాన్ చేస్తుంది.  బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్లో ఈ శాటిలైటు రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించే  అవకాశం లభిస్తుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్పోటనాలు, కొండచరియలు విరిగి పడడం వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ముందస్తు సమాచారాన్నినిసార్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 2800 కిలోలు.     

ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి మరి కొద్ది గంటల్లో కౌంట్ డౌన్

మరో  ప్రతిష్ఠాత్మక  ప్రయోగానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  నాసాతో కలిసి చేయనున్న ఈ కీలక ప్రయోగానికి మంగళవారం (జులై 29) మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.   జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ను బుధవారం (జులై 30) సాయంత్రం ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నిసార్ ఉపగ్రహాన్ని పంపించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.   ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన 2,393 కిలోల బరువైన  నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్ట బోతున్నారు. ఈ ఉపగ్రహం భూమిని అణువణువూ స్కాన్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది.   ఇక, జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ ప్రయోగం నేపథ్‌యంలో నాసా శాస్త్రవేత్తలు శ్రీహరి కోట చేరుకున్నారు. మంగళవారం (జులై 29) మధ్యాహ్నం 2 గంటల పది నిముషాలకు నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమౌతుంది. బుధవారం సాయంత్రం 5 గంటల 40 నిముషాలకు రాకెట్ ప్రయోగం జరుగుతుంది. 

సింగపూర్ పర్యటనలో చంద్రబాబు స్పీడ్ మామూలుగా లేదుగా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు  మంగళవారం (జులై 29) మూడో రోజు  షెడ్యూల్ దాదాపు పది సమావేశాలతో బిజీబిజీగా ఉంది. ఏపీని ఏఐ హబ్ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న సీబీఎన్ మంగళవారం (జులై 29) ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామగా  పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని  కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని  ప్రతిపాదించారు. ప్రధానంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై చంద్రబాబు మోహన్ కంకణవల్లితో చర్చించారు.   ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌జీ జాన్ లిన్ విలిన్‌తోనూ చంద్రబాబు సభేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఎంఆర్‌ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక అనుకూల విధానాల గురించి కూలంకుషంగా వివరించారు.  విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలని సీఎం కోరారు. చంద్రబాబు ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్..  తర్వలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామన్నారు.  ఇంకా ఐటీ, ఎలక్ట్రా నిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో  కూడా సీఎం వరుస భేటీలలో పాల్గొంటారు. అలాగే   క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమై చర్చించ నున్నారు. ఇంకా  సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్‌ల‌తో కూడా సీఎం చంద్ర‌బాబు  మంగళవారం (జులై 29) భేటీ  కానున్నారు.   ఇక ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీగూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో  కూడా సీఎం భేటీ అవుతారు.  

అర్ధరాత్రి సాయం కోసం ఫోన్.. కోటంరెడ్డి ఏం చేశారో తెలుసా?

ప్రజాప్రతినిథి ప్రజా సేవలో 24 X7 పని చేయాలని జనం భావిస్తారు. ఆ నమ్మకంతోనే ఓట్లేసి గెలిపిస్తారు. అయితే చాలా మంది ఎన్నికలకు ముందు ప్రజా సేవ పట్ల  చూపిన ఆసక్తిని ఆ తరువాత చూపించరు. ఐదేళ్ల పాటు తమను కదిలించే వారు ఎవరూ ఉండరన్న ధీమాతో వ్యవహరిస్తారు. గత ఐదేళ్ల జగన్ హయాంలో జనం ఇదే తీరును చూశారు. ప్రజలకు అండగా ఉండటం అటుంచి.. వారినే వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్ల వేళలా అండగా ఉంటామని మాటల్లో చెప్పడమే కాదు.. చేతల్లో కూడా చూపిస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రజలకు కష్టం వస్తే అర్ధరాత్రి, అపరాత్రి కూడా చూడకుండా ముందుకు వస్తానని నిరూపించారు. విషయమేంటంటే.. నెల్లూరులో ట్రాఫిక్ పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో వేదాయపాలెం సర్కిల్ లో ట్రాఫిక్ పోలీసులు బైకుపై వెడుతున్న భార్యాభర్తలను ఆపి తనిఖీ చేశారు. ఆ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ రూ. పది వేలు జరిమానా కట్టమన్నారు.  బైకు స్వాధీనం చేసుకుని భార్యాభర్తలను అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో ఏం చేయాలో తొచని ఆ జంట  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసింది. ఫోన్ కాల్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా  ఘటనాస్థలికి చేరుకొని.. ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నానని.. తక్షణమే బైక్‌ను బాధితులకు హ్యాండోవర్ చేయాలనీ ఆదేశించారు. దీంతో పోలీసులు  క్షణాల్లో బైక్‌ను ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకొచ్చి దంపతులకు అప్పజెప్పారు.   అర్ధరాత్రి అని కూడా చూడకుండా తమకు అండగా నిలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ దంపతులు కృతజ్ణతలు తెలిపారు.   

కల ధృవీకరణ కోసం ఇంటింటి సర్వే

కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం ఇంటింటి సర్వే చేపసట్టాలని నిర్ణయించింది. అక్టోబర్ 2వ తేదీనాటికి ఈ ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.   రియల్ టైం గవర్నెన్స్ సొసైటీతో పాటు పలు శాఖలను కూడా ఈ ఇంటింటి సర్వేలో భాగస్వాములను చేయనుంది.  ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి  వివరాలు సేకరిస్తుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వివరాలు మాత్రమే తీసుకునేవారు. అయితే ఈసారి ఓసీల వివరాలు కూడా నమోదు చేస్తారు. ఈ సర్వేను ప్రభుత్వం సుమోటో విధానంలో చేయనుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ట్యాంపరింగ్  కు ఇసుమంతైనా అవకాశం లేకుండా కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.