తీరం దాటిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. దీని ప్రభావంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, రాయలసీమల్లో భారీ  నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లవద్దనీ సూచించింది.   తీరం వెంబడి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.     ఇక పోతే తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.  అలాగే శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.  

హెచ్ సీఏ వ్యవహారాల పర్యవేక్షకుడిగా జస్టిస్ నవీన్ రావు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) వ్యవహారాల పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును తెలంగాణ హైకోర్టు నియమించింది. ఆయన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ సీఏలో 2007 నుంచి జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని సఫిల్ గూడా క్రికెట్ క్లబ్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం (జులై 25) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం పూర్తి స్థాయి విచారణ జరపనుంది.   అలాగే అప్పటి వరకూ అంటే జులై 28 వరకూ  సెలక్షన్‌ కమిటీని ఎంపిక చేయవద్దని ఆ మధ్యంతర ఉత్తర్యులలో పేర్కొంది.  2024-26 సంవ త్సరాలకు లీగ్‌ మ్యాచ్‌ల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను చూసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావుకు అప్పగిస్తూ, గతంలో జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పర్యవేక్షణలో జరిగినట్లుగానే ఈసారి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 

తిరుపతిలో స్కూటరిస్టుపై చిరుత దాడియత్నం

తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బెంబేలెత్తిస్తోంది. తిరుమల నడకదారిలో చిరుతల కలకలం తరచుగా భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో తిరపతిలో కూడా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తాజాగా తిరుపతిలో ఓ స్కూటరిస్టుపై చిరుత దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. తిరుపతి జూపార్క్ రోడ్డులో వెడుతున్న స్కూటరిస్టుపై చిరుత దాడికి ప్రయత్నించింది. స్కూటరిస్టు వేగంగా వెడుతుండటంతో తృటిలో తప్పించుకోగలిగాడు. ఈ దృశ్యాన్ని వెనుక కారులో వస్తున్న వారు వీడియో తీశారు. అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనతో తిరుపతి వాసులు, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  ఇటీవల తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత సంచారాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలివేయడానికి అటవీశాఖ అధికారులు బోను కూడా ఏర్పాటు చేశారు. అంతలో అదే ప్రాంతంలో చిరుత స్కూటరిస్టుపై దాడికి పాల్పడటంతో జనం భయభ్రాంతులకు గురౌతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత కొన్ని రోజులుగా విపరీతమైన భక్తుల తాకిడితో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు తాకిడి స్వల్పంగా తగ్గింది.  శనివారం (జులై 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం (జులై 25) శ్రీవారిని 73 వేల 576 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 277 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది. ఇక వారాంతం కావడంతో శని, ఆదివారాలలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.   

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల దుర్మరణం

చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించారు.  ఈ దుర్ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద చోటు చేసుకుంది.  ఇదే కారులో ప్రయాణిస్తున్న అడిషనల్ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో  ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్న డీఎస్పీలు చక్రధరరావు,  శాంతారావులు సంఘటనా స్థలంలోనే మరణించారు. అడిషనల్ డీఎస్పీ ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   కాగా వీరు ఓ కేసు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపుకు దూసుకువెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఢీకొంది. అతి వేగం లేదా, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించిన సంఘటన పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించిన ఘటనపై తీవ్రదిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. 

పెద్దిరెడ్డి గన్ మ్యాన్ పై సస్పెన్షన్ వేటు

వైసీపీ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మ్యాన్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  పుంగనూరు ఎమ్మెల్యేగా   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. అయితే సెక్యూరిటీ వ్యవహారాలు చూడాల్సిన గన్ మ్యాన్ పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో పెద్దిరెడ్డి గన్ మ్యాన్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కాలేషాను సస్పెండ్ చేస్తూ చిత్తూరు ఎస్పీ శుక్రవారం (జులై 25) ఉత్తర్వులు జారీ చేశారు.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు,  రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.  కుమారుడిని పరామర్శించేందుకు బుధవారం (జులై23) పెద్దిరెడ్డి కుటుంబంతో సహా రాజమండ్రి వెళ్లారు. ఆ సమయంలో కోర్టు మిథున్ రెడ్డికి కల్పించిన ప్రత్యేక వసతులు దిండు, దుప్పటి, ఆహార పదార్థాలను తీసుకువెళ్లారు. వీటిని గన్ మ్యాన్ మోసుకుని జైలులోకి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భద్రత చూడాల్సిన ఉద్యోగి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గన్ మ్యాన్ కాలేషా సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చింది.  చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కాలేషా పెద్దిరెడ్డి గన్ మ్యాన్ గా చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సర్వీసు నిబంధనలు అతిక్రమించడంతో  ప్రభుత్వం  సస్పెండ్ చేసింది. అయితే పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెన్షన్ పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  పెద్దిరెడ్డిపై అక్కసుతోనే గన్ మ్యాన్ ను సస్పెండ్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.  

బద్వేలులో నకిలీ ముఠా గుట్టురట్టు

  కడప జిల్లాలో నకిలీ పట్టాల దందాకు పేరుగాంచిన బద్వేల్ లో మరోసారి నకిలీ భాగోతం బయట పడింది . మూడేళ్ల క్రితం ఇలాంటి ముఠాల గుట్టు రట్టు చేసి భారీ ఎత్తున నకిలీ పత్రాలు,సీల్లు స్వాధీనం చేసుకుని . సుమారు 20 మందిపై ప్పట్లో కేసులు  నమోదు చేశారు. తాజాగా ఇదే తంతు మరోసారి బద్వేల్లో కలకలం రేపింది. డికెటి పెట్టాలు, పాస్ బుక్ లు, అనుబంధ పత్రాలు సృష్టించే వారి బాగోతం బయట పడింది. పదిమంది కలిగిన ముఠాపై  పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మహిళతో పాటు తొమ్మిది మంది ని అరెస్ట్ చేసి ఆ వివరాలను  పోలీసులు  వెల్లడించారు.  బద్వేలు పట్టణంలో నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలపై కొద్దిరోజులుగా పోలీసులు లోతుగా విచారిస్తూ వచ్చారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక ఇంటి పట్టాకు సంబంధించి  విచారణ చేపట్టడంతో  బారీగా నకిలీ వ్యవహారం బయట పడింది. పట్టణంలో నకిలీ పట్టాల సృష్టి, దొంగ సీల్ల తయారీ వ్యవహారం చాలా కాలంగా సాగుతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. ఆ మేరకు సమగ్రంగా విచారించి వీటిని స్వాధీనం చేసుకొని పదిమందిపై  కేసు నమోదు చేశారు.  మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్ల పేర్కొన్నారు . బద్వేలులో నకిలీ గుట్టు రట్టు చేసిన  పోలీసులు, నిందితుల నుంచి నకిలీ పట్టాలు, అనుబంధ ఫారాలు, పాసుబుక్కులు, రెవిన్యూ అధికారుల నకిలీ సీళ్లతో పాటు పలు కీలకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా ఎంతకాలంగా  నకిలీ పత్రాల ద్వారా ప్రజలను మోసం చేస్తుంది.ఇంకా ఎన్ని ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించారు అనే అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.  

హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్టు

  హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌‌లో జరిగిన అవినీతి వ్యవహారాల కేసులో సంస్థ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ను   పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ అధికారులు అతడిని పుణేలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దేవరాజ్‌ ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఫేక్ డ్యాక్‌మేంట్స్ సృష్టించి ఆయన అధ్యక్ష పదవిని పొందినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు పదిహేను రోజుల క్రితం వెల్లడించారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. మరోవైపు అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ ఇచ్చింది. మరోవైపు, జగన్మోహన్‌రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని వేసిన CID పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్మోహన్‌రావు, సునీల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని కోర్టు పేర్కొంది.

పార్లమెంట్ సమావేశాలు... తొలి వారం వృధా

  గత సోమవారం (జూలై 21) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. అయితే,తొలి వారం సమావేసాలు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగింది లేదు. పహల్గాం ఉగ్రదాడి,ఆపరేషన్ సిందూర్’తో, ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణకు సంబందించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వివాదాస్పద మధ్యవర్తిత్వం వ్యాఖ్యలతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్’లో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్‌)పై  చర్చ చేపట్టాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింప చేయడంతో, అర్థవంతమైన చర్చ ’ఏదీ జరగ కుండానే తొలివారం పార్లమెంట్ సమావేశాలు ముగిసి పోయింది.   ఈ నేపధ్యంలో శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో, వచ్చేవారం ప్రారంభంలో, (సోమ మంగళ వారాల్లో) ఆపరేషన్ సిందూర్' పై పార్లమెంటు ఉభయసభల్లో 32 గంటలపాటు ప్రత్యేక చర్చ చర్చ చేపట్ట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సోమవారం లోక్‌సభలో చర్చ అనంతరం మంగళవారం రాజ్యసభలో చర్చ ఉంటుందని చెప్పారు. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు వివరించారు. 'పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. విపక్షాలు పలు అంశాలు లేవెనెత్తాలని కోరుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చను చేపట్టేందుకు మేము అంగీకరించాం' అని రిజిజు తెలిపారు.చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు విపక్షాలకు చెప్పామని, అయితే మొదటి రోజు నుంచీ విపక్షాలు పార్లమెంటు లోపల, వెలుపల ఆందోళన చేపట్టాయని రిజిజు అన్నారు. మొదటి వారంలో కేవలం ఒకే బిల్లు ఆమోదించామని,సభను సజావుగా సాగేలా చూడాలని విపక్షాలను కోరినట్టు చెప్పారు.నిబంధనల ప్రకారం వారు ఏ అంశాన్నైనా లేవనెత్తొచ్చని, పార్లమెంటు పనిచేయకపోతే దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు. అయితే, చర్చకు ప్రధానమంత్రి నరేంద మోదీ సమాధానం ఇవ్వాలన్న విపక్షాల, ముఖ్యమంగా ప్రతిపక్ష నేత రాహుల గాంధీ చేస్తున్న డిమాండ్’ను రిజిజు తిప్పికొట్టారు. ప్రభుత్వ పక్షాన ఎవరు మాట్లాడాలి, ఎవరు సమాధానం చెప్పాలి అనేది విపక్షాలు ఎలా నిర్ణయిస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈసందర్భంగా రిజిజు, వితండ వాదంతో విపక్షాలు సభా సమయాన్ని , ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాయని విమర్శించారు.  అదలా ఉంటే, సబాహ కార్యక్రమాలను సజావుగా జరుపుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్‌) వివాదం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు , ఎస్ఐఆర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంటే, ఎన్నికల సంగహం ససేమిరా అంటోంది.  మరోవంక రాజ్యాంగ సంస్థ కేంద్ర  ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమంపై పార్లమెంట్’లో చర్చించే ప్రశ్నే లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవంక, ఎస్ఐఆర్‌ను ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ గట్టిగా సమర్థించుకున్నారు. నకిలీ ఓటర్లు ఓటేయడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో అసలైన ఓటర్లను తీసివేస్తున్నామన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు. ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఈ నేపద్యంలో, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఎంతవరకు అమలవుతుందో చూడవలసిందే   

ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియామకం

  తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలకు పదిమంది స్పెషల్ ఆఫీసర్‌లుగా సీనియర్  ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సి.హరికిరణ్, నల్గొండకు అనిత రామచంద్రన్, హైదరాబాద్ కు ఇలంబర్తి, ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్, నిజామాబాద్‌కు  హనుమంతు, రంగారెడ్డికి దివ్య, కరీంనగర్‌కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్ నగర్ కు రవి, వరంగల్ కు కె. శశాంక, మెదక్ జిల్లాకు ఎ.శరత్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. 

మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం : జైళ్ల శాఖ

    ఏపీ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కల్పించే సౌకర్యాలపై దాఖలైన పిటిషన్‌పై  జైళ్ల శాఖ తాజాగా స్పందించింది. ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జైలులో ఆయనకు ఇంటి భోజనం అనుమతించలేమని.. అటెండర్‌ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పేర్కొంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని మిథున్‌రెడ్డిని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.  జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెస్ట్రన్ కమోడ్‌తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టెలివిజన్‌ను అనుమతించాలని కోర్టు పేర్కొంది.

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. 250 కుటుంబాలు దత్తత

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్షలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆయన ఆవిష్కరించారు. పేదరిక నిర్మూలనకు పేద కుటుంబాలను దత్తత తీసుకున్నాని సీఎం తెలిపారు.  అంతే కాకుండా పేదరిక నిర్మూలనలో తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి సర్కార్ లక్ష్యం అని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో భాగం కావాలని, కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు.  

వైసీపీ ఎమ్మెల్సీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో  చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు తీర్పు ఇచ్చింది. దళిత యువకుడు, మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కేసులో తదుపరి విచారణను కొనసాగించవచ్చుని ఇటీవల ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.  తమకు న్యాయం చేయాలని.. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించిన వారిపై సిట్  ఫోకస్ పెట్టింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసే యోచనలో ఉంది. డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడుగా ఉన్నారు. 2022 మే 19న కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.  డ్రైవర్‌ను హతమార్చిన ఎమ్మెల్సీ అనంతబాబు.. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  తానే మర్డర్ చేశానని అనంతబాబు అంగీకరించారని మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు పంపారు. తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. తమకు న్యాయం చేయాలని.. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. 

ఆ ప్రశంసలు.. దేనికి సంకేతం ?

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి దూరం పెరిగిందని, ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా, అధినాయకుడి అప్పాయింట్మెంట్  దొరకడం లేదని, అదొక అందని ద్రాక్షగా మిగిలిందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అందులో ఎంత నిజం వుంది. ఎంత లేదు అనే విషయాన్ని పక్కన పెడితే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ యాత్ర, ఏడాది కరవును కడిగేసింది.  తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరిట నిర్వహించిన కులగణన గురించి రేవంత్‌ రెడ్డి  గురువారం (జూలై 24) ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు.ఒక్క రాహుల్ గాంధీ కాదు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. అన్నిటినీ మించి, సోనియా గాంధీ, లేఖ ద్వారా అందించిన ప్రశంసలు, రేవంత్ రెడ్డిని ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. అందుకే, ఆయన సోనియా రాసిన లేఖను, తనకు దక్కిన జీవిత సాఫల్య పురస్కారంగా,ఆస్కార్ అవార్డుగా, నోబెల్ పురస్కారంగా పేర్కొన్నారు. అంతే కాదు, కుర్చీ ఉన్నా లేకున్నా, ఈ జీవితానికి ఇది చాలు’ అంటూ సంతోషాన్ని వ్యక్త పరిచారు. అదలా ఉంటే, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజకీయంగా ఏకమై కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తే దేశవ్యాప్తంగా 60-70 శాతం ప్రజల మద్దతు లభించినట్లేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అప్పుడే సామాజిక న్యాయం సాధించగలమన్నారు. కులగణనను ప్రధానాంశంగా లేవనెత్తిన ఘనత రాహుల్‌గాంధీకే దక్కుతుందని ప్రశంసించారు.

డీలిమిటేషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలన్నా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ ఉంటుందన్న సర్వోన్నత న్యాయస్థానం చట్టంలో ఇది స్పష్టంగా ఉందని వెల్లడించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని సుప్రీంకోర్టును  ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది.  రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించ‌డం వ‌ల్ల‌ మిగతా రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాల‌తో పోల్చిన‌ప్పుడు రాష్ట్రాల‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధ‌న‌లు భిన్నంగా ఉంటాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్నాది.   

యూట్యూబ్ చూసి డైట్...యువకుడు మృతి

  యూట్యూబ్ చూసి డైట్ ఫాలో అయిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన శక్తిశ్వరన్ అనే వ్యక్తి  యూట్యూబ్‌లో వీడియో చూసి మూడు నెలలుగా  ఆహారం తీసుకోకుండా కేవలం నీరు, ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకున్నారు. నిన్న అతడికి ఊపిరాడక మృతి చెందారు. డైట్ ఫాలో కావడం కారణంగానే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు.  బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నాడని తెలిపారు. గురువారం నాడు శక్తిశ్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత

శాంతి గోదావరి వరద ఉధృతితో మహోగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి 175 గేట్లు ఎత్తి దాదాపు 2 లక్షల 16 వేల 300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదవరి వరద మరింత పెరిగే అవకాశం ఉందనీ, తోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు ప్రిస్టీజియస్ అవార్డ్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ ప్రగతిని ఇస్తున్న అత్యధిక ప్రాముఖ్యతకు  గుర్తింపు దక్కింది. ఏపీ పర్యాటక శాఖకు అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.   10వ అంతర్జాతీయ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(ఐటీసీటీఏ) సంస్థ ఏపీలో చేప‌డుతున్న ప‌ర్యాట‌క ప్రాజెక్టులు.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలించి.. ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డు ను రాష్ట్రానికి  ఇచ్చింది.  శ‌నివారం(జులై 26) ఢిల్లీలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును ప‌ర్యాట‌క అభివృద్ది కార్పొరేష‌న్‌(ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, ఐఏఎస్ అధికారి ఆమ్ర‌పాలికి  అందించ‌నుంది. ఏపీ టీడీసీ ఎండీ అమ్రపాలి ఆ విషయాన్ని స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.   ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత విస్తారమైన తీర ప్రాంతం ఉన్న రోండో రాష్ట్రం. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని వినియోగించుకుని.. ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం న‌డుంబిగించింది. ఈ క్ర‌మంలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసింది.  అఖండ గోదావ‌రి  ప్రాజెక్టు ద్వారా.. రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క రంగంలో ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించింది. అదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్యాట‌క శాఖ‌కు ‘ప‌రిశ్ర‌మ‌’ హోదాక‌ల్పించారు. త‌ద్వారా రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగం ద్వారా.. ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌తో పాటు.. ఆదాయం కూడా పెరుగుతుందని అంచ‌నా వేశారు. ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వినూత్న విధానాలు, కొత్త పాలసీలు, విప్లవాత్మక సంస్కరణలకు ఆయ‌న పెద్ద‌పీట వేస్తున్నారు. వీట‌న్నింటిని గ‌మ‌నించిన ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(  సంస్థ‌.. ఈ సారి మర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది.  ఈ అవార్డుతో రాష్ట్ర ప‌ర్యాట‌కం మ‌రింత పుంజుకునేందుకు.. విదేశీ ప‌ర్యాట‌క‌లు కూడా రాష్ట్రానికి మ‌రింత పెరిగేందుకు అవ‌కాశం ఉంద‌ని ఆమ్ర‌పాలి తన పోస్టులో పేర్కొన్నారు.