నేతన్నలకు ఉచిత కరంట్..ఈనెల 7 నుంచి అమలు

రాష్ట్రంలో మగ్గాలున్న నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో జెట్ స్పీడ్ లో ముందుకు సాగుతున్న చంద్రబాబు ఒక్క ఆగస్టు నెలలోనే మూడు పథకాల అమలును ప్రారంభిస్తున్నారు. శనివారం (ఆగస్టు 2) నుంచి అన్నదాతా సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇదే నెల 15 నుంచి అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక ఈ నెల 7 నుంచి మగ్గాలున్న నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారు.  నేతన్నలకు ఈ ఉచిత విద్యుత్ పథకం ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.   కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు  పవర్ లూమ్స్ ఉన్నవారికి  500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని   ప్రకటించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.  ప్రజావేదిక వేదికగా చంద్రబాబు  ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడమే కాకుండా, రాష్టరానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేస్తున్న ప్రయత్నాలనూ వివరించారు.   అలాగే  జగన్ హయాంలో వైసీపీ సర్కార్ అనుసరించిన విధానాలను విమర్శించారు.  దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక..  నిలబెట్టడమే చాలా కష్టం అన్న చంద్రబాబు జగన్ హయాంలో రాష్ట్రంలో   ఐదేళ్లు  విధ్వంసమే జరిగిందనీ, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా జగన్ పాలన సాగిందని విమర్శించారు.  అంతకు ముందు జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో చంద్రబాబు పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులతో ముచ్చటించారు.  

రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా.. చంద్రబాబు

పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం (ఆగస్టు 1) గండికోట వద్ద  ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రసంగించన చంద్రబాబు గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందనీ, చారిత్రక సంపదకు ప్రతిరూపమనీ అన్నారు.  గండికోట ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో  ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.  పర్యాటకులు బస చేసేందుకు స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు.   టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్ తో పాటు కోట వద్ద లైటింగ్ వంటి  మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు.   అలాగే రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే,  లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది చివరి కల్లా టెంట్ సిటీని రెడీ అవుతుందన్నారు. అలాగే సెప్టెంబర్ నుంచి  హెలిరైడ్స్ ఆరంభమౌతాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కారావాన్ టూరిజం సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.  కాగా  ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ లో   రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సీఎం సమక్షంలో పలు ఒప్పందాలు జరిగాయి.  ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పోరేషన్ తో  500 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి.  గండికోటతో పాటు శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హై రోప్, కయాకింగ్,  జెట్ స్కీయింగ్ లాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందాలు కుదిరాయి. కేంద్రప్రభుత్వ పథకాలైన సాస్కి, స్వదేశ్ దర్శన్ పథకాల కింద గండికొట, బొర్రా గుహలు,  అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో వివిధ టూరిజం ప్రాజెక్టులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.   ఏపీలో అమలు చేస్తున్న టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.  

శ్రీశైలం మల్లన్న హుండీ దొంగ అరెస్ట్.. నగదు స్వాధీనం

 శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి  లక్షా 24 వేల 200 రూపాయలను రికవర్ చేశారు. దేవస్థానంలో కాంట్రాక్ట్  పరిచారక విధులలో ఉండే విద్యాథర్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  జూన్ 16 తెల్లవారుజామున   స్వామివారి గర్భాలయం ముందు ఉన్న క్లాత్ హుండీ నుంచి 24 వేలు దొంగతనం చేసి పరారీలో ఉన్న   విద్యాధర్ ను శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ అధికారులు శుక్రవారం (ఆగస్టు 1) అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసుల విచారణలో  మల్లికార్జున స్వామి వారి హుండీని అవసరానికి డబ్బించే అడ్డాగా మార్చుకున్న విద్యాథర్ ఇప్పటి వరకూ 12 స్వార్లు స్వామి వారి హుండీలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు.  ఆ చోరీ సొమ్ముతో   బైక్ కొని, లక్ష రూపాయలు పెట్టి తన ఇంటికి మరమ్మతులు చేయించినట్లు కూడా తెలిపారు.   రెండేళ్ల వ్యవధిలో మల్లన్న హుండీ నుంచి విడతల వారీగా 3 లక్షల 79 వేల 200 రూపాయల సొమ్మును చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు ఖర్చు చేయగా అతని వద్ద మిగిలిన సొత్తు లక్షా 24 వేల 200 రూపాయలను పోలీసులు రివకర్ చేశారు. అలాగే నిందితుడి నుంచి నిందితుడు ఖర్చు చేయగా మిగిలిన 1,24,200 రూపాయలను రికవరీ చేయడంతో పాటు, బైక్ను స్వాధీనం చేసుకుని  నిందితుడిని ఆత్మకూరు కోర్టులో హాజరు పరిచారు. 

ఆ 10 స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయా ?

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి టికెట్ పై గెలిచి.. అధికార  కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ ను  ఆదేశించింది. అంతే కాకుండా.. అనర్హత పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదని.. ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.  రాజకీయ ఫిరాయింపుల నిలువరించకపోతే అవి  ప్రజాస్వామ్యానికే  నష్టం తేగలవని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. అదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ అధికారం, న్యాయస్థానాలకు లేదని, అది స్పీకర్  విచక్షనాధికారాల పరిదిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే.. అదే సమయంలో  అనర్హత పిటిషన్లు సమర్పించి దాదాపు ఏడు నెలలు గడిచినా నోటీసులు జారీ చేయకపోవడం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాతే నోటీసులు జారీ చేయడంపై స్పీకర్‌ను  ధర్మాసనం తప్పుబట్టింది. సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ కండవాలు కప్పుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా  గౌరవ  ఎమ్మెల్యేలు కూడా సుప్రీం తీర్పును స్వాగతించారు. అంతే కాదు.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తామని అంటున్నారు.  మరోవంక ఎవరి భాష్యం వారిది అన్నట్లుగా..  సుప్రీం తీర్పును,రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన భాష్యం వారు వినిపిస్తున్నారు. ఎవరికి వారు తమకు అనుకూలమైన విధంగా అన్వయించుకుంటున్నారు. మరో వంక  రాజకీయ పండితులు ఎవరి  పద్దతిలో వారు   విశ్లేషిస్తున్నారు.  అలాగే న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు ఎవరికి వారు ఎవరి అభిప్రాయాలను   వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇటు రాజకీయ నాయకుల అభిప్రాయాలు, న్యాయ నిపుణులు అభిప్రాయాలను విశ్లేషించి చూస్తే.. అటు తిరిగి ఇటు తిరిగి బంతి మళ్ళీ స్పీకర్  కోర్టుకే చేరిందనే అభిప్రాయం అంతర్లీనంగా అందరి మాటల్లోనూ వినిపిస్తోంది.  అందుకే.. ఇప్పడు అందరి చూపు స్పీకర్ వైపుకు మరలుతోంది. అయితే..  స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది  ఎవరికీ తెలియదు. కాగా..  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌   సుప్రీం కోర్టు తీర్పును చదివిన తర్వాత.. తీర్పులో ఏముందో పరిశీలించి న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అయితే..  అదే సమయంలో  స్పీకర్ ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు, ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడిన మాటలు వింటే అప్పుడు అన్నీ మీకే తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అంటే..  రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయ లేవనే  ధన్‌ఖడ్‌ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్న సంకేతాలు అయితే ఇచ్చారు. అయితే.. న్యాయనిపుణులతో సప్రదించిన తర్వాత స్పీకర్  ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని అంటున్నారు. అదలా ఉంటే..  సుప్రీం కోర్టు  స్పీకర్ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆదేశించింది కానీ.. అనర్హులుగా ప్రకటించాలని సంకేత మాత్రంగా అయినా చెప్పలేదు. అనర్హులుగా ప్రకటించవచ్చు లేదంటే తెలంగాణ శాసనసభ పదేళ్లుగా పాటించిన సంప్రదాయన్ని ‘ప్రిసీడెంట్’ తీసుకుని..  ఆ రకంగా నిర్ణయం తీసుకున్నా  తీసుకోవచ్చును. అంతిమ నిర్ణయం ఏమిటో  ఇప్పుడే చెప్పడం కుదరదని నిపుణులు అంటున్నారు. అయితే అవన్నీ ఎలా ఉన్నా.. అందరి ముందున్న ప్రధాన ప్రశ్న, ఉప ఎన్నికలకు   సంబధించి.. దానికి సమాధానం చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు.  అయితే బీఆర్ఎస్ ఉప ఎన్నికలు తధ్యమని అంటుంటే, కాంగ్రెస్ నాయకులు ఆ ఆస్కారమే లేదనీ.. ఆ చర్చే అనవసరమని అంటున్నారు. నిజానికి.. రెండు మూడు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక నుంచే, ఏ చట్టాలు మారాయని, అప్పుడు బీఆర్ఎస్ హయంలో రాని  ఉప ఎన్నికలు ఇప్పడు వస్తాయని, ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రశ్నే లేదని, బే ఫికర్ గా ఉండచ్చని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. సో .. ముఖ్యమంత్రి భరోసా నిజం అయితే ఉప ఎన్నికలు రావు .. బీఆర్ఎస్ ఆశలు ఫలిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ప్రస్తుతానికి ఇలాగే అనుకుని సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.  

హెల్మెట్ క్లిప్పు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం.. ప్రమాదంలో నిండు ప్రాణం బలి

  ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని..  అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్ వల్ల ప్రాణాపాయం  తప్పుతుందని పోలీసులు పదే పదే చెబుతున్నా.. చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫైన్ ల భయంతో నామ్ కేవాస్తేగా హెల్మెట్ ను తల మీద ఉంచుకుని క్లిప్పు పెట్టుకోకుండా వదిలేస్తున్నారు. దీని వల్ల హెల్మెట్ పెట్టుకున్న ప్రయోజనం నెరవేరడం లేదు.  హెల్మెట్ క్లిప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనీ, తల పోటు వస్తుందని సాకులు చెబుతుంటారు. అయితే ఆ క్లిప్పే ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుతుందన్న విషయాన్ని విస్మరిస్తుంటారు.   హైదరాబాద్ లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. ఒక ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ లో పని చేసే కూకట్ పల్లికి చెందిన నాగ రాజ్ అనే   వ్యక్తి తన ద్విచక్రవాహనంపై మియాపూర్ కి వెళ్లి  కూకట్ పల్లికి వస్తుండగా  స్కూల్ బస్సు ఢీకొని సంఘటనా స్థలంలోనే మరణించాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక నాగరాజు సంఘటనా స్థలంలోనే మరణించడానికి అతడు హెల్మెట్ పెట్టుకున్నా దాని క్లిప్పు పెట్టుకోకపోవడమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్కూలు బస్సును ఢీకొన్న నాగరాజు రోడ్డుపై పడినప్పుడు హెల్మెట్ క్లిప్పు పెట్టుకోకపోవడంతో ఆ హెల్మెట్ ఎగిరిపోయింది. దీంతో నాగరాజు తల రోడ్డును బలంగా తట్టుకుని అక్కడికక్కడే మరణించాడు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు వేరే వాహనం డాష్ కెమేరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

గోదావరిలో వృథాగా కలిసిపోతున్న జలాలను వాడుకుంటామంటే నష్టమేంటి? : సోమిరెడ్డి

  బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్పందించారు. ఏటా 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు వరదల రూపంలో వృధాంగా సముద్రంలో కలిసిపోతుండగా, కేవలం 200 టీఎంసీలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవాలన్న ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ నాయకులు ద్వేషభావంతో వ్యవహరించడం బాధాకరమని  సోమిరెడ్డి అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు. గోదావరి నీటి వాటాలపై స్పష్టత ఉందని, 1540 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలను కూడా వినియోగించలేకపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో 7.42 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.58 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని అందించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని సోమిరెడ్డి వివరించారు.  "గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోవద్దు. ఒక్క చుక్క నీరు ఇవ్వమని హరీశ్ రావు చెప్పడం బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 450 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారని, అయినా ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అలాగే తెలంగాణలో ఇతర ప్రాజెక్టులపైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. "తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏపీ ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా చూడవద్దు. రాష్ట్రం విడిపోయినా మన మధ్య బేధాలెందుకు?" అని తెలంగాణ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

  ఏపీ మెగా డీఎస్సీ కీ విడుదలైంది. 16,347 టీచర్ల నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ విడుదల చేశాక అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాక ఫైనల్ కీ రిలీజ్ చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం. వి కృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు.  కీ కోసం అభ్యర్థులు ఈ  https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి చెక్ చేసుకోవచ్చును. ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

బాలయ్య ప్రభ నానాటికీ.. వెలుగుతుందేంటి?

  వరుసగా నాలుగు సెంచురీలు. ఆపై మొన్నటికి మొన్నపద్మ అవార్డు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయన చిత్రానికి జాతీయ అవార్డు. ఎటు నుంచి ఎటు చూసినా బాలకృష్ణ ప్రభ నానాటికీ వెలిగిపోతూ కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆయన పానిండియా స్టార్ కావడానికి పెద్దగా కష్టపడనవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అఖండ- 2 మేకింగ్ లో ఉన్నారు. ఇది చాలు బాలకృష్ణను మరో టాలీవుడ్ టర్న్ డ్ పానిండియా స్టార్ ని చేయడానికని తెలుస్తోంది. కారణమేంటంటే అది ఎలాగూ జాతీయ వ్యాప్తంగా గుర్తు పట్టే పాత్ర. కాబట్టి ఈ దిశగా బాలకృష్ణ ఇమేజీని  పెంచడంలో ఏమంత కష్టం కాదంటున్నారు విశ్లేషకులు. బాలకృష్ణతో సమానంగా అప్పట్లో ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. ఆ రోజుల్లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున ఒక టాలీవుడ్ హీరో సెట్ గా పిలిచేవారు. వీరందరిలోనూ ప్రెజంట్ హైపర్ యాక్టివ్ గా ఉన్నవారెవరని చూస్తే బాలకృష్ణ మెయిన్ గా తెలుస్తోంది.  బాలయ్య బాబు ఏ శుక్రయోగంలో ఉన్నారో తెలీదు గానీ.. ఇటు చూస్తే రాజకీయంగా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి వరుసగా రెండో ఏడాది కూడా దూసుకెళ్తోంది. ఇటు చూస్తే బాలయ్య బాబు కూడా అన్ని  రకాలుగా విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఆ మాటకొస్తే బాలయ్య బాబు సినిమా బాగా ఆడితే అది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందన్న సెంటిమెంట్లున్నాయ్.  అంతెందుకు ఆయన బాగుంటే అంతా బాగుంటుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. దీంతో బాలకృష్ణ పరి పరి విధాల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పరంగా చూసినా ఆయన మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఎందుకంటే తన ఇద్దరు అల్లుళ్లలో ఒకరు ఎమ్మెల్యే- మంత్రి, మరొకరు విశాఖ ఎంపీ. ఇక కుమారుడి తెరంగేట్రం కూడా ఇదే టైంలో జరిగిపోతే.. బాలకృష్ణ సంతసం సంపూర్ణమయ్యేలా తెలుస్తోంది.  

అనిల్‌ అంబానీకి బిగ్ షాక్..లుకౌట్‌ నోటీసులు జారీ

  ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరుకాకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోతారనే అనుమానాల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. రూ. 17 వేల కోట్ల రుణాల మోసాలకు సంబంధించిన కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా వెలుగొందిన అనిల్ అంబానీకి వరుస షాకులు తగులుతున్నాయి.  రుణ మోసానికి సంబంధించిన కేసులో గతవారం అనిల్‌ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రైడ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబయిలోని 35 ప్రాంగణాల్లో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు ఈడీ సమన్లు, లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ

  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించింది. అంతేకాదు రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి పేరెంట్స్ కమీటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఉత్తర్వులు ముఖ్యంగా విద్యార్థులను రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచి, వారి చదువుపై దృష్టి పెట్టడానికి, మరియు పాఠశాల ప్రాంగణంలో రాజకీయ వాతావరణాన్ని నివారించడానికి ఉద్దేశించబడ్డాయిని తెలుస్తోంది

కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌పై కమిటీ వేసిన ప్రభుత్వం

  కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సమర్పించారు. నివేదికలోని ముఖ్య అంశాలను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్‌కు కమిటీ అందజేయనున్నారు. ఆ తర్వాత ఈ నివేదికను శాసన సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమీటీలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు లీకేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరుఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది

దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీనే : చంద్రబాబు

  వైసీపీ అధినేత జగన్‌‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పర్యటనల పేరుతో మంచిగా తిరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మభ్యపెట్టి ప్రజలను అసౌకర్యం కల్పిస్తే ఊరుకోమని హెచ్చరించారు. వైఎస్ఆర్ కడప  జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు .ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తొక తిప్పితే, దానిని కట్ చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.  తొక తిప్పిన నేతలపై నేరుగా కేసులు పెడతామని స్పష్టం చేశారు. తమ పార్టీలో అయిన సరే నేతలు తప్పు చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్నిముఖ్యమంత్రి పరిశీలించారు. 1వ తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు.  అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే ఆంధప్రదేశ్ అని సీఎం తెలిపారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పారు. పింఛన్ల విషయంలో మన తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయన్నారు. పేదలకు సాయం చేస్తే కలిగే తృప్తి మరిదేంట్లోనూ రాదని ముఖ్యమంత్రి అన్నారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రసన్నని జగన్‌ పరామర్శించడం ఏంటనీ ధ్వజమెత్తారు.  పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి.. ఖండించాలని హితవు పలికారు. నల్లపురెడ్డిని మందలించాల్సింది పోయి.. జగన్ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే ధోరణిలోనే జగన్‌ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడరా? అని నిలదీశారు. ఎన్టీఆర్‌ ఆలోచనతోనే రాయలసీమకు  నీళ్ళు వచ్చాయని సీఎం తెలిపారు. ఆయన సాగునీటి ప్రాజెక్టుల చంద్రబాబు గుర్తుచేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని చెప్పుకొచ్చారు.  త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తిచేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరవు అనేదే ఉండదని సీఎం స్పష్టం చేశారు, వివరించారు. రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. త్వరలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. 2028 డిసెంబర్‌ నాటికి స్టీల్‌ప్లాంట్‌ తొలిదశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రేపు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కుటమి సర్కార్  రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇవ్వబోతున్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌పై సీఎం రేవంత్ చర్చ

  సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి ఉత్త‌మ్, సీఎస్ రామ‌కృష్ణ సమావేశం అయ్యారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను ముఖ్యమంత్రికి సీఎస్ అందించారు.  ప్ర‌స్తుతం నివేదిక‌లోని కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. పీసీ ఘోష్ క‌మిష‌న్ త‌మ నిదేదిక‌ను నిన్న‌నే అధికారుల‌కు అంద‌జేసింది.  కాళేశ్వ‌రం రిపోర్ట్  అందిన త‌ర‌వాత ఉన్న‌తాధికారుల‌తో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మీక్షించారు.  ఇక నేడు కొద్దిసేప‌టి క్రితం నివేదిక‌తో సీఎంను కలిసి ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరుఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ అంశాలు, నిర్మాణ సంస్థలుకాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం, ఇతర అవకతవకతలపై విచారణ జరపాలని కోరింది.   వచ్చే కేబినెట్ భేటీలో ఈ నివేదికపై చర్చించి.. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది.

విజయసాయి కుమార్తెకు రూ. 17.46 కోట్ల జరిమానా

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా బతుకుతున్నానని ఎంతగా చెప్పుకున్నా.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు ఆయనను ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఆయన నిందితుడిగా ఉన్నారు.   విజయసాయి పాపాలు ఆయననే కాకుండా ఆయన సన్నిహితులనూ వెన్నాడుతున్నాయి. తాజాగా  భిమిలీ బీచ్ లో భూ కబ్జాలకు సంబంధించి విజయసాయి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టు 17 కోట్ల 46 లక్షల రూపాయల జరిమానా విధించింది.  ఈ భీమిలి బీజ్ లో భూమి కబ్జా 2021లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. అప్పట్లో విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక వ్యక్తిగా ఉన్నారు.  అప్పట్లో భమిలీ బీచ్ లో కొంత భాగాన్ని ఆక్రమించి నేహారెడ్డి భారీ నిర్మాణాలకు ఉపక్రమించారు. ప్రహారీగోడ నిర్మించారు.  దీనిపై కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో నేహారెడ్డి బీచ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో ఆ నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేయడం కూడా జరిగింది.   నేహా రెడ్డి నిషేధిత ప్రాంతాలలో నిర్మాణం చేపట్టారని  ఖచ్చితమైన ఆధారాలు లభించడంతో.. ఆగస్టు 1 నుండి బీచ్ స్థలం ఆమె ఆక్రమణలో ఉన్నన్ని రోజులూ రోజుకు  1.2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా  భీమిలి పరిరక్షణ కోసం నియమించబడిన 16.9 చదరపు మీటర్ల నిషిద్ధ స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణాలను పునాదులతో సహా క్లియర్ చేయాలని ఆదేశించింది.  

గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల స్కామ్

  తెలంగాణలో సంచలన సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.  ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులు సీజ్‌ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్‌ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్‌ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని ఈడీ తెలిపింది.   

ఆటోలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలలో మమేకం అయ్యే విషయంలో అన్నిహద్దలూ చెరిపేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన క్షేత్ర స్థాయిలో జనంతో మమేకం అవుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటి పరిస్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన శుక్రవారం జమ్మలమడుగులో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగులో ఆటోలో ప్రయాణించారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన ఆటోలోనే వెళ్లారు.  ఆటోలో ఆయన ప్రయాణిస్తున్నంత సేపూ ఆ ఆటోవాలాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఆటో వాలా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఆ ఆటోవాలను అధికారిక వద్దకు తీసుకువెళ్లి అతడి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు.  చంద్రబాబు ఆటోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఆటో ఎక్కడంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జర్నలిజంలో విశ్వసనీయత, విలువలు లేవు : సీఎం రేవంత్ రెడ్డి

  ప్రస్తుతం జర్నలిజం విలువలు విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఓ దినపత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదను కాపాడుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకనేందుకు పనిచేస్తున్నాయిని పేర్కొన్నారు. జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. అ.ఆ.లు, ABCD లు రాని వారు కూడా సోషల్ మీడియా జర్నిలిస్టులంటూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఓనమాలు కూడా రానివాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని.. కనీసం పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం సోచనీమని పేర్కొన్నారు. 2004లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనదిన అన్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తాలన్నా.. అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యునిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే.. జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీరభద్రం చేసిన పాదయాత్రలు, పోరాటాలు కారణం కావొచ్చు. ప్రజా పాలనను కొనసాగించడానికి కూడా మీ సహకారం కావాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ  కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి, సీపీఎం సీనియర్‌ నేతలు రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి భూ కేటాయింపుల్లో తప్పేంటి?

ఏపీలో పెట్టుబడి దారుల‌ సందేహాలన్నీ దాదాపు నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపుతున్న పెట్టుబడి దారులకు ఇంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహం ఉండేది. ఇప్ప‌టి వ‌ర‌కు కొంద‌రు పెట్టుబ‌డి దారులు.. విప‌క్షాలు స‌హా.. ఇత‌ర ఉద్య‌మకారుల విష‌యంలో సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌కు క‌ల్పించే మౌలిక వ‌స‌ తుల‌పై.. యాగీ చేస్తార‌ని.. ముఖ్యంగా భూములు.. ఇత‌ర‌త్రా కీల‌క విష‌యాల పై త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని అనుమానించారు. ఆ సందేహాలు, అనుమానాలూ మరింత బలపడే తీరుగానే గత ఏడాది కాలంగా వైసీపీ వ్యవహరిస్తూ వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులకు మోకాలడ్డే విధంగా కోర్టు కేసులు, ఆయా కంపెనీలకు ఈ మెయిల్స్ పంపుతూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. అయితే తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో పెట్టుబడి దారుల సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ వ్యాపారాలకు ఎలాంటి అవరోధాలు ఉండవన్న నమ్మకం చిక్కింది. ఇంతకీ విషయమేంటంటే.. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కు భూమిని కేటాయించిన వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో విశాఖలో తక్కువ ధరకు భూములు ఇవ్వడాన్ని పిటిషనర్లు తప్పుపడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ విచారణ సందర్బంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.   పెట్టుబ‌డి దారుల‌కు ఇచ్చే భూముల కేటాయింపు విషయంలో సందేహాలు ఎందుకని పిటిషనర్లను ప్రశ్నించింది. ఏపీలో అభివృద్ధి ఆరంభ దశలో ఉ:ది.. ఏమీ ఇవ్వకుండా ఇన్వెస్టర్లు ఎలా వస్తారని హైకోర్టు నిలదీసింది.   హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాలు అభివృద్ధి చెందడానికి గ‌తంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టుబ‌డి దారుల‌కు భూములు కేటాయించి.. వ‌న‌రులు క‌ల్పించారనీ, అందుకే ఆ నగరాలు అభివృద్ధి చెందాయనీ హైకోర్టు పేర్కొంది. హైకోర్టు వ్యాఖ్యలతో  దీంతో స‌ర్కారుకు భారీ ఊరట దక్కడమే కాకుండా ఇన్వెస్టర్లలో ధైర్యం, విశ్వాసం పెరిగాయి.  విశాఖ‌లో టీసీఎస్ స‌హా లులు మ‌ల్టీ చైన్ కంపెనీల‌కు భూములు కేటాయించారు. అలాగే ఉమ్మ‌డి ప్రకాశం జిల్లాక‌ర్రేడు గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంటుకు భూములు ఇచ్చారు. విజ‌య‌వాడ‌లోని పాత బ‌స్టాండ్‌ను లులు మాల్‌కు కేటాయించ‌నున్నారు. ఇప్పుడు వీటి విష‌యంలో ప్ర‌భుత్వం ధైర్యంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. వీటిపై రేపు న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు త‌లెత్తినా.. హైకోర్టు ఉత్త‌ర్వులు ప్ర‌భుత్వానికి క‌లిసి రానున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇన్వెస్టర్లు కూడా ధైర్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి కోర్టు వ్యాఖ్యలు దోహదపడతాయనడంలో సందేహం లేదు.