విజయసాయి కుమార్తెకు రూ. 17.46 కోట్ల జరిమానా
posted on Aug 1, 2025 @ 4:25PM
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా బతుకుతున్నానని ఎంతగా చెప్పుకున్నా.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు ఆయనను ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఆయన నిందితుడిగా ఉన్నారు. విజయసాయి పాపాలు ఆయననే కాకుండా ఆయన సన్నిహితులనూ వెన్నాడుతున్నాయి. తాజాగా భిమిలీ బీచ్ లో భూ కబ్జాలకు సంబంధించి విజయసాయి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టు 17 కోట్ల 46 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ భీమిలి బీజ్ లో భూమి కబ్జా 2021లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. అప్పట్లో విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక వ్యక్తిగా ఉన్నారు. అప్పట్లో భమిలీ బీచ్ లో కొంత భాగాన్ని ఆక్రమించి నేహారెడ్డి భారీ నిర్మాణాలకు ఉపక్రమించారు. ప్రహారీగోడ నిర్మించారు. దీనిపై కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దర్యాప్తు చేపట్టింది.
దర్యాప్తులో నేహారెడ్డి బీచ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో ఆ నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేయడం కూడా జరిగింది. నేహా రెడ్డి నిషేధిత ప్రాంతాలలో నిర్మాణం చేపట్టారని ఖచ్చితమైన ఆధారాలు లభించడంతో.. ఆగస్టు 1 నుండి బీచ్ స్థలం ఆమె ఆక్రమణలో ఉన్నన్ని రోజులూ రోజుకు 1.2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా భీమిలి పరిరక్షణ కోసం నియమించబడిన 16.9 చదరపు మీటర్ల నిషిద్ధ స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణాలను పునాదులతో సహా క్లియర్ చేయాలని ఆదేశించింది.