మాజీ గవర్నర్ క‌న్నుమూత

  జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) క‌న్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేసి ఆయన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. 1960వ దశకంలో మీరట్‌లో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సత్యపాల్ మాలిక్, ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలోనే గడిపారు.  యూపీ ఎమ్మెల్యేగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పలు ఉన్నత పదవులను ఆయన అలంకరించారు. కాంగ్రెస్, జనతాదళ్, బీజేపీ వంటి పలు పార్టీలలో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. జమ్మూకశ్మీర్‌తో పాటు బీహార్, గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా సేవలందించారు.  గవర్నర్ పదవిలో ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై, ముఖ్యంగా రైతుల హక్కుల కోసం ఆయన తరచూ గళం విప్పేవారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను బహిరంగంగా విమర్శించి సంచలనం సృష్టించారు. తన చివరి రోజుల్లో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక న్యాయం, బడుగు వర్గాల సంక్షేమంపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ మార్గనిర్దేశం చేశారు. 

ధర్మస్థలి మిస్టరీ మరణాలు.. సిట్ గోప్యత ఎందుకు?

ధర్మస్థలి మరణాల కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. ఈ విషయంలో పాటిస్తున్న గోప్యత.. తవ్వకాలలో బయటపడుతున్న విషయాలను వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు థర్మస్థలితో ప్రతి మరణం ఒక మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీ మరణాలలో   పద్మలత కేసు మరో మిస్టరీగా వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి చెందిన కాలేజీలో  పద్మలత పీయూసి రెండవ సంవ త్సరం చదువుతున్నది.1986 డిసెంబర్ 22వ తేదీ మాయం అయింది. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమె అదృశ్యం అయిన 56 రోజులు తర్వాత ఆమె శరీరం నేత్రావతీనదీ తీరంలో ఆస్థి పంజరంలా దొరికింది. ఆమె దుస్తులను బట్టి  ఆ అస్తిపంజరం పద్మలతదే అని గుర్తించారు. అప్పట్లో ధర్మస్థలిలో పోలీస్ స్టేషన్ లేదు.ఆమె ఆచూకీ లభించినా, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా  ఎవరూ పట్టించుకోలేదు.  పద్మలత తండ్రి దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన కమ్యూనిస్టు పార్టీతో  కలిసి చేసిన  ఆందోళనతో చివరకు కేసు నమోదు చేసుకున్నారు. దేవానంద్ సమీప స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు ఆమె మృతదేహం లభ్యమైన తరువాత కూడా  సరైన దర్యాప్తు చేయక,ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేసారు. హిందువుల కుటుంబానికి చెందిన పద్మలత శరీరాన్ని సాధారణంగా దహనం చేస్తారు. కాని ఆమె తండ్రి   తన కుమార్తె మరణానికి కారకులకు ఎప్పటికైనా శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఖననం చేశారు.  ఆమె శరీరం అవశేషాలు భవిష్యత్తు లో నిజాలవెలికితీతకు ఉపయోగపడతాయన్న ముందు చూపుతో పద్మలత తండ్రి ఆ పని చేశారు. ఇప్పుడు థర్మస్థలి దురాగతాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడు పద్మలత మరణానికి కారకులైన వారిని పట్టుకుని చట్టం ముందు నిలిపి శిక్షించాలంటూ అలుపెరుగని పోరాటం చేసిన దేవానంద్ ఇప్పుడు బతికి లేరు. అయితే పద్మలత తల్లి,అక్క,బావా ఉన్నారు. దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు కావడంతో ప్రత్యర్థి రాజకీయవర్గాలు ఆమెను కిడ్నాప్ చేసారని తల్లి ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా పద్మావతి కిడ్నాప్ పై సరైన సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. అత్యాచారంచేసి 56 రోజులు హింసించి ఆమె శరీరాన్ని సమీపంలోని అడవిలో పడేశారని ఆరోపిస్తున్నారు. ధర్మస్థలి అసహజ మరణాల కారకులే పద్మలతనూ హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.  ఇలా ఒక్క పద్మలత అనే కాదు.. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. పద్మలత లాగే అనన్య భట్, సౌజన్య దారుణ హత్యకు గురయ్యారు. వీరి మరణాల విషయంలో కూడా కనీస సమాచారం లభించలేదు. అనన్య తల్లి సుజాత సీబీఐలో పనిచేస్తున్నా ఏమీ చేయలేకపోయారు.  22 ఏళ్లుగా అనన్య  అవశేషాలు దొరికితే సాంప్రదాయ పద్ధతిలో ముక్తి కలిగించాలని ఇమె ఎదురు చూస్తున్నారు.  అలాగే థర్మస్థలి మిస్టరీ మరణాల జాబితాలో సౌజన్య విషయం కూడా.  అనన్య, సౌజన్యల అసహజ మరణాల విషయంలో  సీబీఐ దర్యాప్తు లో  సంతోష్ అనే అనామకుడిని నిందితుడని తేల్చారు. కాని రెండేళ్ల కిందట  అతను నిర్దోషి గా తేలింది. అనన్య మృతదేహం లభ్యం కాలేదు. సౌజన్య మృతదేహం లభ్యమై, ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఇలాంటి పద్మలతలు, అనన్యలు,సౌజన్య లు ఎంతో మంది ధర్మస్థలి కర్కొకటకుల కాటుకు బలయ్యారు.  ఈ మరణాల మిస్టరీ ఛేదించడానికి రంగంలోకి దిగిన  సిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న   తవ్వకాల్లో పుర్రెలు,ఎముకలు దొరికాయన్న వార్తలు వస్తున్నా పోలీసు అధికారులు వాటిని ధృవీకరించడం లేదు.   వందల శవాల పాతిపెట్టానని చెప్పిన పారిశుద్ధ కార్మికుడిని సిట్ బృందంలోని పోలీసు అధికారి బెదిరించాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కూడా ఎవరూ ధృవీకరించడం లేదు. అంతే కాకుండాసిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న తవ్వకాలలో బయటపడుతున్న మానవ శరీరాల అవశేషాలకు సంబంధించి ఎటువంటి వార్తా బయటకు పొక్కడం లేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలకు మీడియాను అనుమతించడం లేదు. దీంతో దర్యాప్తు తీరుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు పారదర్శకంగా సాగాలనీ, థర్మస్థలి తవ్వకాలలో బయటపడుతున్న వివరాలను వెల్లడించాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. 

వైఎస్ వివేకా హత్య కేసు.. ముగిసిన సీబీఐ దర్యాప్తు.. సుప్రీంకు నివేదన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో  సీబీఐ దర్యాప్తు ముగిసింది. ఈ విషయాన్ని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలియజేసింది.    సీబీఐ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు ఈ మేరకు తెలియజేస్తూ.. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి నివేదికను  కూడా దేశ సర్వోన్నత న్యాస్థానానికి సమర్పించారు.  సుప్రీం కోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.   ఇటీవలే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడు అంశాలపై   అభిప్రాయం తెలపాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సీబీఐను ఆదేశించిన సంగతి విదితమే. ఆ అంశాలపై సీబీఐ అభిప్రాయం తెలిపిన తరువాతనే వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై విచారణ చేపడతామని ఆ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  ఇప్పుడు దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ సుప్రీం కు తెలియజేయడంతో  వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. 

కాళేశ్వరం పై చర్చకు కేసీఆర్ వస్తారా?.. రేవంత్ వ్యూహానికి చిక్కుతారా

 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు  హాజరవుతారా లేదా అనేదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.  కమిషన్ నివేదికలో ప్రధానంగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. దీనిపై ఇప్పటికే కేసీఆర్ తనను కలసిన నేతల వద్ద మనోగతాన్ని వెల్లడించారు. అది కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ నివేదికని కేసీఆర్  వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి అరెస్ట్ లు కూడా జరగవచ్చని ప్రిడిక్ట్ చేశారు.  ఈ నేపథ్యంలో  కేసీఆర్ అసెంబ్లీ లో చర్చకు హాజరవుతారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీకి హాజరుకాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఒక వేళ అసెంబ్లీకి హాజరై చర్చలో పాల్గొంటే..  వెళితే తాను వివరణ ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే కేసీఆర్ కూర్చోవాల్సి ఉంటుంది. దీనిని కేసీఆర్ భరించగలుగుతారా?   తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ ను పూర్తికాలం సభనుంచి సస్పెండ్ చేశారు. అదే రేవంత్ రెడ్డి సభానాయకుడి స్థానంలో ఉండగా కేసీఆర్ సభకు హాజరై కాళేశ్వరం కమిషన్ చర్చలో పాల్గొంటారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. రేవంత్ కూడా కేసీఆర్ ను సభకు ఏదో రకంగా రప్పించాలనే వ్యూహంతో ఉన్నారు. జానారెడ్డి, ఉత్తమ్, భట్టి లాంటి వాళ్లనే సభలో నోరు ఎత్తకుండా చేసిన కేసీఆర్..  నేడు సభకు వస్తే అదే సీను తనకు రిపీట్ అవుతుందన్న భయం కూడా కేసీఆర్ లో లేకపోలేదంటున్నారు.  సభలో చర్చ కన్నా రచ్చే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారా ? రారా? అన్నది ఆసక్తిగా మారింది. 

వినతి పత్రంతీసుకోవాలంటే అధికారులు సీటులో కూర్చోవద్దా?

చింత చచ్చినా పులుపు చావలేదంటారు… అలాగే ఉంది తిరుపతిలో వైసీపీ నాయకుల ధోరణి… అధికారులపై వైసీపీ నాయకుల పెత్తనం ఇంకా తగ్గడం లేదు. తమ ప్రభుత్వ హయాంలో ఉన్న విధంగానే ఇంకా అయ్యా సార్ అనేలాగే అధికారులు ఉండాలనే ఆశిస్తున్నారు.  కాదు… కాదు ఆదేశిస్తున్నారు.  ఓవైపు అధినేత జగన్ ఉన్నతాధికారులను హెచ్చరిస్తుంటే.. మరోవైపు జిల్లా స్థాయి నాయకులు కిందిస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ  రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రచారం చేయడానికి ఓ కొత్త అంశంతో తెర పైకి వచ్చింది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు  వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఇంఛార్జ్ రాజేష్, మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశి సహా వైసీపీ నాయకులు తరలి వచ్చారు.  కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవడంతో డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు నేరుగా డీఆర్వో దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే ఇతరుల నుంచి అర్జీలు తీసుకుంటున్న డీఆర్వో వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు హడావుడితో అర్జీదారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్జీ పత్రాన్ని భూమన కరుణాకర్ రెడ్డి డీఆర్వోకు ఇవ్వడానికి సిద్దం కాగా.. డీఆర్వో నరసింహులు తన సీటులో కూర్చోని చేయి చాచారు. దీంతో  వైసీపీ నాయకులు డీఆర్వోపై ఆగ్రహిస్తూ.. సీటులో నుంచి లేచి వినతి పత్రం తీసుకోవాలని  హూంకరించారు . తొలుత లేచి వినతి పత్రం తీసుకోవడానికి ఇష్టపడని డీఆర్వో, మరోసారి వైసీపీ నాయకులు గద్దించడంతో సీటులంచి లేచి నిలబడి తీసుకున్నారు. అయితే వైసీపీయుల దాష్టీకం, అహంభావం జనానికి ఇసుమంతైనా నచ్చలేదు.   అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చింత చచ్చినా పులుపు చావలేదనే సామెతను తలుచుకుంటూ అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని వ్యాఖ్యానించడమే ఇందుకు తార్కానం.  

హస్తిన బాట పట్టిన తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయనేతలంతా ఢీల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సమాయత్తమై ఏకంగా ప్రత్యేక రైలులో హస్తిన వెడితే... ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక  నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు హస్తిన బయలుదేరారు. మొత్తం మీద ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడిందని చెప్పాల్సి ఉంటుంది.  ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశం తెరమీదకు రావడానికి ముందు వరకూ కూడా తెలంగాణ రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ లో  జోష్ నింపగా, బీఆర్ఎస్ ను బెంబేలెత్తిస్తోంది. అయితే కేవలం కాళేశ్వరం కారణంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరుగున పడేందుకు కాంగ్రెస్ ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కాళేశ్వరం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డైవర్ట్ కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంతిని బీఆర్ఎస్ కోర్టులోకి నెట్టేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చలో పాల్గొనేదీ, లేనిదీ నిర్ణయించుకోవలసింది బీఆర్ఎస్, కేసీఆర్ లే.  దీంతో కాంగ్రెస్ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం మేరకు  హస్తినపై దృష్టి పెట్టింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు బుధవారం (ఆగస్టు 6) హస్తినలో జంతర్ మంతర్ వద్ద జరగనున్న భారీ ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలంతా పాల్గొంటున్నారు.  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రయోగించిన బీసీ రిజర్వేషన్ అస్త్రం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకూ ఒక ఆయుధంగా మారింది. రిజర్వేషన్ల కోసం పోరాడిని పార్టీగా పేరు తెచ్చుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ పోటీలు పడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ తో విభేదించి సొంత మార్గంలో నడుస్తున్న కల్వకుంట్ల కవిత సైతం బీసీ పోరులో నేనున్నానంటూ హడావుడి చేస్తున్నారు.   ఆఖరికి కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ సైతం హస్తిన వేదికగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీరుకు, వైఖరికి నిరసనగా హస్తినలో  గత శనివారం నిరసన కార్యక్రమం చేపట్టింది.     దిల్లీ జంతర్‌మంతర్‌ ‌వద్ద ఈనెల 6న బిసీ వర్గాలతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించింది. ఈ ధర్నాకు తెలంగాణలోని ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం పాతిక మందికి తక్కువకాకుండా సమీకరించి  సోమవారం (ఆగస్టు 4) ప్రత్యేక రైల్‌లో దిల్లీ బాట పట్టింది రాష్ట్ర కాంగ్రెస్. జంతర్ మంతర్ ధర్నా కంటే ముందు పార్లముంటులో బీసీ రిజర్వేషన్లపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్ట ముందు ఈ నెల 5న పార్లమెంటులో బిసీ బిల్లుపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తోంది. చివరగా ఆగస్ట్ 7న అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆయోదించిన బిసీ బిల్లును ఆమోదించాల్సిందిగా రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించనుంది.  మొత్తంమీద బిసీ రిజర్వేషన్‌ ‌బిల్లు ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీలను పరుగులు పెట్టిస్తున్నది. త్వరలో రానున్న స్థానిక ఎన్నికలు ఈ రిజర్వేషన్‌లతో ముడివడి ఉండడంతో పార్టీలకు ఆ బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కల్వకుంట్ల కుటుంబానికి కవిత దూరం?

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో  విభేదాలు ఇక ఇసుమంతైనా దాపరికం లేకుండా రచ్చకెక్కాయి. కేసీఆర్ కుమార్తె కవిత శషబిషలు లేకుండా పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా బీఆర్ఎస్ ను, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆధర్ ను టార్టెట్ చేసి విమర్శలతో చెలరేగిపోతున్నారు.  అంతే కాదు.. ఇక తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా మద్దతుగా గళమెత్తడానికి కూడా అమె పెద్ద సుముఖంగా లేరన్న సంకేతాలిస్తున్నారు.   తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునేందుకు వ్యూహరచన చేసేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ఆ సమావేశానికి కవిత దూరంగా ఉన్నారు. పార్టీ రానీయలేదా? ఆమె దూరం జరిగారా అన్నది పక్కన పెడితే.. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లోఅత్యంత కీలకంగా ఉన్న కవిత.. కీలకమైన కాళేశ్వరం విషయంలో పార్టీ వ్యూహరచనకు దూరం అయ్యారు.   కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేననీ, అక్రమాలకు కారకులు వీరే అంటే కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ నేత ఈటల పేర్లను కూడా కమిషన్ నివేదిక వెల్లడించినట్లు సమాచారం. ఈ నివేదక తెలంగాణలో కలకలం రేపుతుండగా,  బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది.  ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫాం హౌస్ లో సోమవారం ( ఆగస్టు 4)  పార్టీ కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి కవిత దూరంగా ఉన్నారు. లేదా కేసీఆర్ దూరంగా ఉంచారు. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక భేటీ జరుగుతుంటే.. కవిత మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో నిరశన దీక్షలో కూర్చున్నారు. వాస్తవానికి కవిత మూడు రోజుల నిరశన దీక్ష ప్రకటించినప్పటికీ..  కోర్టు సూచనతో కవిత ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఈ సందర్భంగా ఆమె కాళేశ్వరం నివేదికపై ఏమీ మాట్లాడలేదు.  అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ నివేదిక తో  కేసీఆర్ అరెస్టు ఎదుర్కొంటున్నారన్న విషయాలను ఆమె ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.   బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపై తిరుగుబావుటా ఎగురవేసిన కవిత.. తండ్రి కేటీఆర్ కు కూడా దూరంగా ఉంటూనే తన సొంత బాటలో నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తంగా కవిత.. కల్వకుంట్ల కుటుంబానికి దూరమయ్యారనడానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ఆమె మాట్లాడకపోవడమే తార్కానమని చెబుతున్నారు. 

మహ్మద్ సిరాజ్.. ఫిట్ నెస్ లో మహరాజ్

నరాలు తెగే ఉత్కంఠ, గోళ్లే కాదు.. వేళ్లే కొరికేసుకునేంత టెన్షన్.. ఇదీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు చివరి రోజు పరిస్థితి. చేతిలో నాలుగు వికెట్లు ఉండగా, కేవలం 35 పరుగులు చేస్తే విజయం వరించే స్థితిలో ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేపట్టింది. నాలుగో రోజు ఆట తిలకించిన ఎవరైనా సరే ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అన్న నిర్ణయానికి వచ్చేశారు. కానీ భారత్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన హైదరాబాదీ స్టార్ బౌలర్ ఔను స్టార్ బౌలరే మహమ్మద్ సిరాజ్  టీమ్ ఇండియా విజయమే ఈ టెస్టు ఫలితం అన్న నమ్మకంతో ఉన్నాడు. అదే నమ్మకంతో బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ మాత్రం భారత్ కు అంత సునాయాసంగా చిక్కలేదు. చెమటోడ్పించింది. ఉత్కంఠ రేకెత్తించింది. నిరాశలో ముంచింది. ఆశలు చిగురింప చేసింది. చివరకు విజయం అందింది. అందుకు ముఖ్య కారకుడు నిస్సందేహంగా సిరాజ్ అనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి ఆదరణ తగ్గిపోతున్నదని అంతా భావిస్తున్న టెస్ట్ క్రికెట్ లోని మజా ఏమిటో ఈ టెస్టు మ్యాచ్ ప్రతి బంతిలోనూ కనిపించేలా చేసింది. టీ20లు టెస్టు క్రికెట్ ముందు బలాదూర్ అని నిరూపించింది. ఆరు పరుగుల ఆధిక్యతతో టీమ్ ఇండియా ఐదో టెస్టును గెలుచుకుని సిరీస్ ను సమంజసం చేసింది ఈ విజయం సిరాజ్ బౌలింగ్ హైలైట్. ఒక సంచలనం. ఈ టెస్ట్ సిరీస్ లోనే సిరాజ్ నిలకడగా వికెట్లు పడగొడుతూ వచ్చాడు. అంతే కాదు మొత్తం 23 వికెట్లు పడగొట్టి  అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. అంతే కాదు ఇరు జట్లలోనూ కూడా సిరీస్ లోని ఐదు మ్యాచ్ లూ ఆడిన ఏకైక పేసర్ గా కూడా నిలిచాడు. ఫిట్ నెస్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.  ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో మబూమ్రా కేవలం మూడు మ్యాచ్ లే ఆడాడు. అలా బూమ్రా లేని రెండు మ్యాచ్ లలో కూడా సిరాజ్ ఇండియన్ బౌలింగ్ బాధ్యతను సమర్థంగా భుజాన మోశాడు.    ఇక మళ్లీ చివరిదైన ఐదో టెస్ట్ వద్దకు వస్తే నాలుగో రోజు ఆటలో  ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్  ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద పట్టి కూడా నియంత్రించుకోలేక బౌండరీ లైన్ టచ్ చేసి గొప్ప అవకాశాన్ని జారవిడిచిన సిరాజ్.. తన ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆ తప్పిదాన్ని అంతా మరిచిపోయేలా చేశాడు ఓటమి అంచు నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.   మొత్తంగా  ఉత్కంఠ, ఉత్సాహం,  కోపం, నిట్టూర్పు ఇలా అన్ని రకాల మానసిక స్థితులను కలిగేలా చేసిన మ్యాచ్ ఇది. టి20, వన్డేలు తీసికట్టేననిపించిన టెస్ట్ మ్యాచ్ ఇది.  

తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనల్లో భక్తులు

తిరుమల నడకమార్గం, తిరుమలలో చిరుతల సంచారం భక్తులను బెంబేలెత్తిస్తోంది. భక్తుల భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామంటూ అధికారలు భరోసా ఇస్తున్నప్పటికీ చిరుతల సంచారం కారణంగా భక్తుల ఆందోళన తగ్గడం లేదు. ఇటీవల తిరుపతి జూపార్క్ రోడ్డులో, శ్రీవారి మెట్టుమార్గంలో చిరుతల సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా  తిరుమలలో చిరుత సంచారం భక్తులనే కాకుండా స్థానికులను సైతం తీశ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. అప్రమత్తమైన అటవీ శాఖ, టీటీడీ అధికారులు భయాందోళనలు వద్దని భక్తులు, స్థానికులకు భరోసా ఇచ్చారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి మళ్లిస్తామని చెప్పారు. రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. 

తిరుమలలో ప్రయివేటు అతిథి గృహాల పేర్ల మార్పు

తిరుమలలో గోవిందనామస్మరణ మాత్రమే వినిపించాలి, ఆధ్మాత్మిక వాతావరణమే కనిపించాలి అన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రయివేటు అతిథి గృహాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు తిరుమలలో నిర్మించిన అతిథి గృహాలకు తమకు నచ్చిన పేర్లను నమోదు చేశారు. అయితే ఇటీవల పాలకమండలి సమావేశంలో ప్రయివేటు అతిథి గృహాల పేర్లు ఆధ్యాత్మికంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా తొలివిడతలో 42 అతిథి గృహాల పేర్లను మార్చారు . ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీచేసింది. తిరుమలలో  ఆధ్యాత్మిక శోభ మరింతగా పరిఢవిల్లడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.  తిరుమలలో శ్రీవారి పేర్లు, గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాతల సొంత పేర్లు ఉన్న 42 విశ్రాంతి భవనాలకు మార్చిన పేర్లను టీటీడీ ప్రకటించింది. అలా మారిన కొన్ని అతిథి గృహాలు పేర్లు ఇలా ఉన్నాయి.  జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన   గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం  విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు  

మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసల వర్షం

  ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్‌ సిరాజ్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ట్వీట్టర్ వేదికగా సిరాజ్‌ను హైదరాబాద్‌ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్‌ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు. మరోవైపు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన  పేసర్  సిరాజ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.  టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు ఏదీ సాటిరాదని అభిప్రాయపడ్డారు. కీలక మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ గడ్డపై భారత జట్టు మరుపురాని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. సిరాజ్ ఆటతీరుపై తెలంగాణ డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘డీఎస్పీ సిరాజ్ అద్భుతంగా పోరాడారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్‌లో జట్టు మరిన్ని విజయాలు అందించాలి. ప్రతీ  విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాలి.  ఇవాళ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించిన సిరాజ్‌కు అభినందనలు’ అని డీజీపీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఓవల్‌ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్‌ను భారత్‌ మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌ విజయంతో సిరీస్‌2-2 సమమైంది. మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు. చివరి మ్యాచ్‌లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

స్టీల్ స్లాగ్ విధానంలో రోడ్ల అభివృద్ధిపై అనుబంధ సమాచారం

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యర్థాల నుండి సంపద అనే దృష్టితో వ్యవస్థాపక మార్పుల వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమల నుండి ఏర్పడే స్టీల్ స్లాగ్ అనే వ్యర్థ పదార్ధాన్ని రహదారుల నిర్మాణం మరియు మరమ్మతుల పనుల్లో వినియోగించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సూచనల ప్రకారం, పర్యావరణ హితంగా మరియు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉండే విధంగా “ఎకోఫిక్స్ ” అనే కొత్త మిశ్రమ పదార్ధాన్ని అభివృద్ధి చేశారు.    1. ఎకోఫిక్స్ ప్రత్యేకతలు : స్టీల్ స్లాగ్ అనే ఉక్కు పరిశ్రమలోని వ్యర్థ పదార్ధాన్ని తారు‌తో మేళవించి తయారుచేసిన మిశ్రమమే ఎకోఫిక్స్. ఇది పారిశ్రామిక వ్యర్థాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే సరైన ఉదాహరణ. 2.    ఎప్పుడైనా – ఎక్కడైనా పాత్ హోల్ రిపేర్ : ఇది మెటీరియల్ కావడంతో, అవసరం వచ్చిన వెంటనే రోడ్డుపై గుంతల్ని పూడ్చేందుకు ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. 3.    వేడి చేయాల్సిన అవసరం లేదు: సాధారణ తారు రిపేర్ వర్క్ మాదిరిగా దీనిని వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇది సెట్టింగ్ తక్కువ సమయంలో జరుగుతుంది. దీని వలన ఫ్యూయల్ ఖర్చు తగ్గి, కాలుష్యం కూడా ఉండదు. 4.    నీటి ఉనికిలో కూడా పని చేస్తుంది : వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచినప్పటికీ, ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.. ఇది వర్షాకాలంలో పనులు ఆగకుండా చేయగలిగే అత్యుత్తమ పరిష్కారం. 5.    ఎక్కువ మన్నిక, తక్కువ ఖర్చు : సిఆర్‌ఆర్‌ఐ శాస్త్రజ్ఞులు ఈ మిశ్రమాన్ని పరీక్షించి, ప్రస్తుతం వినియోగిస్తున్న అన్ని పదార్ధాలకంటే మన్నికగా, మరియు తక్కువ వ్యయంతో పని చేసే ఉత్తమమైన పదార్ధంగా గుర్తించారు. 6. పర్యావరణ పరిరక్షణ: పారిశ్రామిక వ్యర్థాల వినియోగం ద్వారా భూమి, నీరు, వాయు కాలుష్యాలను తగ్గించడం. 7. ఆర్థిక ప్రయోజనం: తక్కువ ఖర్చుతో అధిక పనితీరు కలిగిన ఈ మిశ్రమాన్ని వినియోగించి ప్రజాధనాన్ని ఆదా చేయడం.

నిరాహార దీక్షను విరమించిన కవిత..పోరాటం ఆగదని స్పష్టీకరణ

  చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  కవిత తెలిపారు. నిరాహార దీక్షకు హైకోర్టు కోర్టు అనుమతి నిరాకరించిందని కవిత వెల్లడించారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. న్యాయస్థానాల పట్ల తనకు గౌరవం ఉందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ జరగకుండా వెళ్తే.. ఎన్నికలను ఎలా ఆపాలో తమకు తెలుసన్నారు.  బీసీ బిల్లు సాధన కోసం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. నిరాహార దీక్ష చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకే పర్మిషన్ ఉండగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో భారీ వర్షం కురవడం, కోర్టు ఆదేశాలతో కవిత దీక్షను విరమించారు. . ఈ పోరాటం ఆగదని.. అనేక రూపాల్లో చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేది ఏం లేదన్నారు.   

కాళేశ్వరం నివేదికను శాసన సభలో ప్రవేశపెడతాం : రేవంత్‌రెడ్డి

  కాళేశ్వరం కమిషన్‌ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్‌ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గం సమావేశం అనంతరం మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  దీనిపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక భవిష్యత్తు కార్యాచరణతో పాటు కమిషన్‌ సూచనలను అమలు చేసేందుకు ముందుకెళ్తామని సీఎం తెలిపారు. ఎవరిపైనా కక్ష సాధింపులు, వ్యక్తిగత ద్వేషం తమ ఉద్దేశం కాదనే అన్ని వివరాలనూ మీడియా ముందు ఉంచామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చిందని  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు.   మేడిగడ్డ బ్యారేజ్‌ వద్దని హై పవర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మాజీ సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌ విమర్శించారు. ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్‌, డిజైనింగ్‌ అంతా కేసీఆర్‌ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్‌ అంచనాలు పెంచి నిర్మించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్‌లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్‌బీఎఫ్‌  దగ్గర  లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు.  రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. నీళ్లు  కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయే ప్రమాదంలో పడింది. డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ అవకతవకలు అన్నింటికీ బాధ్యుడు, జవాబుదారీ అప్పటి సీఎం కేసీఆరే అని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనలకు కాకుండా సొంత నిర్ణయంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారని  డిప్యూటీ సీఎం ఆరొపించారు

ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ : సీఎం చంద్రబాబు

  ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్‌ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. లిక్కర్ పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.  దీంతో అల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం విక్రయాలతో నష్టం తగ్గించ వచ్చునని భావిస్తుంది. అంటే.. మద్యం కారణంగా పేదల ఇళ్లు, ఒళ్లు గుల్లా కాకుండా చూడాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆ క్రమంలో బార్లలో కూడా గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు  కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..రోడ్లపై భారీ వరద

  హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.. అన్ని ప్రధాన రోడ్లమీదకి వరద నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు.. రాత్రి వరకు వర్షం ఇదే మాదిరిగా పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమ యిపోయినాయి.. అమీర్పేటలోని మైత్రివనం అమీర్పేట మెట్రో స్టేషన్ కిందిభాగం పూర్తిగా నాలుగు అడుగుల వరకు వరద నీరు చేరిపోయింది.. దీంతో పాటు సారధి స్టూడియో పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరింది.. నాంపల్లి జూబ్లీహిల్స్ లోని పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది.. మరోవైపు పలు మల్లెపల్లి చౌరస్తాలోని పలు కాలనీలు నీట మునిగి పోయాయి.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో భారీ చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్థంగా మారిపోయింది..అలాగే  నాంపల్లి స్టేషన్ రోడ్ లోని కమత్ హోటల్ లోకి  వర్షపు నీరు చేరు కుంది.హోటల్ లో లంచ్ చేయడానికి వచ్చిన  కస్టమర్లు వరద నీరు చూసి షాక్ అయ్యారు.ఈ భారీ వర్షానికి నాంపల్లి గాంధీభవన్ పక్కన ఉన్న సాయి కృప అపార్ట్మెంట్ లోకి భారీగా వరదనీరు చేరుకుంది.కొన్ని ప్రాంతాల్లో అయితే 10 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతం మొత్తం కూడా బీభత్సం అయిపోయింది.

జగన్ సెక్యూరిటీలో సొంత సైన్యం... క్యాడర్ కోసమే అంటున్న నేతలు

  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది. ఇప్పటికే పదిమంది రిటైర్డ్ ఆర్మీని జగన్ పెట్టుకున్నారు. అలాగే జెడ్ ప్లస్ కేటగిరి లో 58 మంది సిబ్బంది తో రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత ఏర్పాటు చేస్తోంది. జగన్ సెక్యూరిటీలో మార్పులు ఎల్లుండి డోన్ పర్యటన నుంచి అందుబాటులోకి రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.  అయితే జగన్‌పై ఎవరైనా దాడి చేస్తారన్న నేపథ్యంలో కాకుండా.. వైసీపీ కార్యకర్తల దృష్ట్యా సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తొంది. అయితే జనగ్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యాలో రావడంతో.. కార్యకర్తల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సెక్యూరిటీ జగన్ పర్యటనల్లో ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటుందని వైసీపీ అభిప్రాయ పడుతుంది. మరోవైపు జగన్ పర్యటనల్లో టీడీపీ ప్రభుత్వం సరైనా శాంతిభద్రత కలిగించక పోవడం వల్లే సొంత సెక్యూరిటీని నియమించున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫేల్ అవుతోందని విమర్శిస్తున్నారు. అయితే.. జగన్ ఇది వరకు చేసిన పర్యటనల్లో హెలిప్యాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం, రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల దృష్ట్యా జగన్ కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్ పర్సన్‌గా ఉపాసన నియామకం

  తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ, అభివృద్ధి తదితర అంశాలఫై దృష్టి సారిస్తారు.   సభ్యులుగా విటా డానీ (డానీ ఫౌండేషన్), మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సన్ నెట్ వర్క్స్ సిఇఓ కావ్య మారన్,  సి. శశిధర్ (విశ్వ సముద్ర), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), రవికాంత్ రెడ్డి (వాలీబాల్), బైచుంగ్ భూటియా (ఫుట్ బాల్), అభినవ్ బింద్రా (షూటింగ్), క్రీడల శాఖ అధికారులు బి. వెంకట పాపారావు,  ఇంజేటి శ్రీనివాస్ లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.  తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ కో చైర్మన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ప్రపంచంలో తెలంగాణ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి చైర్ పర్సన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.